Sunday, October 7, 2018

SREEMANNAGARA NAAYIKA-07

అమ్మకు నమస్కారములు.

  ఉదయించుచున్న సహస్ర సూర్యకాంతిగల తల్లి సంకల్పిత గోమేధిక ప్రాకారము దశయోజన విస్తీర్ణము దండనా సామర్థ్యము కలది.ఇంద్రాణి-రుద్రాణి-నారాయణి ఇత్యాది ముప్పదిరెండు శక్తుల విలసితము.ఒక్కొక్క మహాశక్తికి పది అక్షౌహిణి సైన్యము కలదు. ( (అక్షౌహిణీ-21,870 రథములు,21,870 ఏనుగులు,65,610 అశ్వములు,1,09,360 కాలిబంట్లు.) విద్య-పుష్టి-సినీవాలి ప్రభ నందాది సకల సద్గుణ శోభితము.

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా సంకల్పిత గోమేథిక ప్రాకారము మందారకుసుమ ఎర్రని రంగుతో తాపస మందారి కరుణ ప్రకాశిస్తుంటుంది.ఈ ప్రాకారములో తరువులు.ఆకులు,పండ్లు,భూమి.దేవతశక్తుల ఆభరణములు అన్ని గోమేథిక మణిమయమే.ఎర్రని వీరతిలకమా అన్నట్లు శక్తులు-వీరులు తేజోవంతులై ఉంటారు.ఇక్కడ బుద్ధి,జ్ఞానము,పుష్టి,విద్య సర్వజీవులను ఆదరిస్తూ-అనుగ్రహిస్తుంటారు..తల్లి తేజము నాలో ప్రచోదనమైనదేమో !పరాశక్తి ప్రణామములు. నా మనసు -బుద్ధి ఒకటికొకటై తల్లి తత్త్వముతో తన్మయమగు సమయమున,చెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(సినీ వాలి-ఒక్కొ అమావాస్య యందు సన్నని రేఖలా కనిపించు చంద్ర రేఖ.)గోమేధిక ప్రాకారమును దాటగానే అత్యంత మనోహరమైన వజ్రప్రాకారము మనసును దోచుకొనుచున్నది.

అత్యంతవైభవోపేతమైన మణిభవనములు,వాని ముందు ఎన్నో కోట్ల మైళ్ళ దూరమువరకు గల అసంఖ్యాక అశ్వములు-గజములు-రథములు-వాహనములు కొలువుతీరిన అమ్మవారి సైరంధ్రీ జనము
(అమ్మను అలంకరించు చెలికత్తెలు-పరిచారికలు అనలేము)వారి పూర్వ జన్మపుణ్యఫలముగా అపూర్వ సేవాసౌభాగ్యమును పొందియున్నారు.కొందరు సత్వ-రజో-తమోరూపముకన్ను అని చర్చించుకొనుచు చల్లనికాటుకను తయారుచేసి,అమ్మవారికి అందించుచున్నారు.సాక్షాత్తుచంద్రుని కన్నుయందు నిలుపుకొనిన తల్లికి చల్లదనమునకై కాటుకను తయారుచేసి అందించుట వారిభక్తితత్త్వమును చాటుచున్నది.మరికొందరు విశాలఫాలభాగమున శోభాయమాన కస్తురిని అలదుచున్నారు.కస్తురి మృగపుణ్యమేమో తల్లి నుదుటను తాను సుగంధముగా ప్రకాశించుతోంది.కొందరు పట్టుచీరలను-కంచుకములనునేసి పట్టరాని సంతోషముతో తల్లికి చుట్టబెట్టుచున్నారు.ఆభరణములతో,అందమైన సుగంధద్రవ్య భరిణెలతో ,మువ్వలతో,అలంకరణలను అర్చనకు ఆత్రుతగా నున్నారు.మరికొందరు తల్లికి రకరకములైన (తాటాకు-తామరాకు-వింజామర) విసనకర్రలతో వీచుచున్నారు.చమరీమృగమా ధన్యతనొందితవి వింజామరగా పరిణితినొంది. అమ్మ పరిచర్యలకై వజ్రప్రాకారములోని వ్రజముతో పాటు నేను తల్లిని సేవించుచున్నసమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.


   ( శ్రీ మాత్రే నమః)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...