Friday, January 6, 2023

AALO REMBAAVAAY-23

 


 




   పాశురము-23


   ***********


" స్వామి సౌకుమార్యమునకు ఆతసీపుష్పములు


 సింహగతిని వీక్షించుచు  ఆనందభాష్పములు"


  సర్వవాహనుడైన స్వామిని శీరియ సింహాసనారూఢినిగా మనకు దర్శింపచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.


  అజ్ఞానము పురూరవ శాపముగా యాదవులకు సింహాసనాధిష్థత నిషేధముకదా మరి స్వామిని వచ్చి, శీరియసింహానముపై కూర్చుని వారిని అనుగ్రహించమనుచున్నారేమిటి? అని ప్రశ్నించవచ్చును.


 ఇక్కడ స్వామి అధిష్ఠించవలసినిది రాజ్యసింహాసనము కాదు.రాజిల్లు హృత్పద్మసింహాసనము.అదియును శీరియసింగము వలె.లక్ష్మీనారాయణులుగా.


ఇరవదిమూడవ పాశురం


*********************


మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం


శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు


వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి


మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు


పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్


కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పుడయ 


శీరియశింగాసనత్తు ఇరుందు యాం వంద


కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్




 "మృగానాంచ-మృగేంద్రోహం." అన్నాడు స్వయముగా పరమాత్మ-




   నరసింహ  పాశురముగా కీర్తింపబడు ప్రస్తుత  పాశురములో గోదమ్మ కారణస్థితి  నుండి స్వామిని కార్యస్థితికి ఉన్ముఖునిగా చేసి దర్శింపచేస్తున్నది. సివంగిని కూడికొండ  గుహలో సింహము తాదాత్మ్యతతో సర్వముమరచి నిదురిస్తున్నది 


 (బాహ్యము).చుట్టు జలము.

"ప్రణయముగా భాసించుచున్న ప్రళయసమయము."


   విశిష్టాద్వైతము.


స్వామి తనతట తాను నిదురలేవాలి.సింహగతిని (సింహపు నడక దర్శనమును) మనకు  అనుగ్రహించాలి.వచ్చి సింహాసనమును అధిష్ఠించాలి.గోపికలందరు చేయుచున్న విన్నపములను ఆరాతీసి,అనుగ్రహించాలి.ఇది వాచ్యము.


 అందుకే అమ్మ


1.ఓ శీరియసింగమా! అని సంబోధించినది.


 శౌర్యపరాక్రమ సింహమా-అనునది ఒక భావము.


 శ్రీదేవిని కూడి యున్నవాడా.అని మరియొక భావన.


2 మారి-వానాకాలములో


 మళైముళింజిల్-కొండగుహలలో


 మన్నికొడందు-ఏ ఇతర ఆలోచనలు లేక


 ఉరంగుం-నిదురించుచున్నావు.


 మున్నీట శయనించు---స్వామి


3.అరివిత్తు-తెలివి తెచ్చుకో


  తీవిళిత్తు-తీక్షణముగా చూడు 


 స్వామి నీవు జలప్రళయములోపల   సకలచరాచరములను ప్రకృతిని కూడి నిదురించుచున్నావు.మీరు పురుషునిగా-ప్రకృతిగా రెండు రూపములుగా ఏర్పడండి.నీ నుండి ప్రకృతి కాంతను విడదీసి-విస్తరింపచేయుమా.అని ప్రార్థిస్తున్నారు.


4.విస్తరణ సంకేతముగా సింహము


  వేరిమయిర్-సుగంధభరితమైన (పంచభూతములను) తన జూలును 


 ఎప్పాడుం-అన్ని దిక్కులందు


 పొంగి-నిటారుగా/నిక్కపొడుచుకుని నిలుచునట్లుగా


 పేరిందుదరి-విదిలించుకుని విస్తరింపచేసినది. 


5.మూరి నిమిరిం దు-కాళ్ళను ముందుకు సాచింది. 


 చైతన్యవంతము చేస్తున్నది తన సృష్టిని.


6.ముళంగి-గర్జిస్తున్నది


 శబ్దములను-అపౌరుషేయములను/వేదములను నాదమును అందించింది.


7.సివంగి స్థూల ప్రపంచముగా కార్యస్థితిని పొందినది.కారణము నుండి విడివడినది. 


8.ఉన్ కోయిల్ పురంపట్టు-తన నివాసమునుండి బయలుదేరినది.


 సింహము ఏ విధముగా బయలుదేరినదో దర్శించాము.


 సింహపు నడక ప్రత్యేకత ఏమిటి? 


 భగవంతుడు గజగతి,వృషభగతి,శార్దూలగతి,వివిధగతులుండగా వీరు సింహగతిని ఎందుకు కోరుకున్నారు. 


 సింహము మృగరాజు.ఠీవితో నడుస్తుంది.అన్యాయముగా ఏ జీవిని హింసించదు.ఏ జీవికి భయపడదు.అంతే కాదు నాలుగు అడుగులు వేసి వెనుకకు తిరిగి చూస్తుంది.రెండు అడుగులు వేసి అటు-ఇటు చూస్తుంది.తనవారిని రక్షించుటకై. 


   స్వామి అదే విధముగా మాకు ఇచ్చిన వరములను ఒక్కసారి గుర్తు తెచ్చుకో.నీ నేత్ర సౌందర్యము దర్శించి-నీ నడక సౌందర్య దర్శనమునకై వేచియున్నాము.కనుక గోపబాలురమైన మా ప్రార్థనలను మన్నించి  వచ్చి,శీరియ చక్కగా అమరిన/అమలిన సింహాసనముపై కూర్చుని ,మా తో ముచ్చటించి,మమ్ములను అనుగ్రహించు అంటున్నారు.


 ఒక్కొక్క పాశురము మనకు నేర్పిస్తున్న పాఠములను "సింహావలోకనము" పునః పరిశీలనము చేసుకుంటే,


4.వ పాశురములోనే వారు ఆళిమళై కన్నా అని వాన కొరకు ప్రార్థించారు పద్మనాభుని.


5.వ పాశురములో స్వామి తనంతట తాను భక్తికి కట్టుబడతాడని గ్రహించారు.


6.గోపికలను మేల్కొలుపుతు పక్షులు,పశువులు,యోగులు-మునులు ఏ విధముగా పంచభూతములలో అర్థపంచకమును గ్రహించి స్వామిని అర్చిస్తున్నారో అర్థముచేసుకున్నారు.


7 ఆచార్య సంప్రదాయానుసారముగా నిత్యసూరులను మేల్కొలుపుతూ స్వామి లీలలను సంకీర్తించారు.


8.నీలా-నీలమేఘుల మైథున భావనమును ,  


 నీలాదేవి పురుషకారత్వమును పొందగలిగారు.


 ఇప్పుడు వారు  స్వామి శౌర్యపరాక్రమములతో పాటుగా సౌకుమార్యమును సైతము గుర్తించి, "నీ పూవై పూవణ్ణా" 


 "అతసీపుష్పసంకాశం- 


  పీతవాస సమచ్యుతం 


  యే నమస్యంతి గోవిందం


  న తేషాం విద్యతే భయం" 


అని అంటున్న


 ఆండాళ్  దివ్య తిరువడిగళే శరణం.




  


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...