Thursday, October 19, 2017

SIVA SANKALPAMU

ప్రియ మిత్రులారా,
సచిద్రూపము (సత్తు-చిత్తు-రూపము) పరమాత్మను మనము సత్యం-శివం-సుందరం అని కీర్తించుచున్నాను.సత్యము అనగా శాశ్వతత్వము.సుందరము అనగా సంతోష ప్రదము.శాశ్వత సంతోషమే శివము.అదియే పరమాత్మ ప్రకాశము.
పాలు-మీగడ,పెరుగు,మజ్జిగ,వెన్న ఇలా రూపాంతరములు చెంది నెయ్యిగా మారుతుంది.పేరుకున్నా,కరిగించినా అది నెయ్యిగానే ఉంటుంది.రూపాంతరము చెందదు.అదే విధముగా
శాశ్వత సుందర తత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుదిరగలేరు.అది మనదారిని మళ్ళించి వేస్తుంది.మహేశ్వరునితో మమేకము చేస్తుంది."దాసుని తప్పులు దండముతో సరి" అంటూ మనచే ఆడిస్తుంది.పాడిస్తుంది.మనసును జోకొట్టి శివుని నిందించేలా చేస్తుంది.మేల్కొలిపి స్తుతించేలాను చేస్తుంది మనసుతో దాగుడుమూతలు ఆడుకుంటూ,బుద్ధిని అందులో భాగస్వామిని చేస్తూ,నిందాస్తుతులను అందచేస్తుంది.సమయము,స్థలము తానేయైన కాశీనాథుడు కార్తీక మాస శుభ సందర్భముగా తన డమరుకము నుండి లక్షణ అక్షరవానలు కురిపించ దలిచాడు.అక్షయ ముక్తిఫలములను పంచుతు మనలను మురిపించదలిచాడు.దోసిలొగ్గి స్వీకరించి తరించుదాం.నా దోసములను శివకృపతో సవరించుదాం.మీ సోదరి

SIVA SANKALPAMU01


     ఓం నమ: శివాయ-01

    అర్హత ఉందో-లేదో  అసలేనేనెరుగను
    అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను

    నమక-చమక అంతర్గత  గమకము నేనెరుగను
    కోట్ల అపచారములో షోడశోపచారములో

    అహంకార గద్యమో  అపురూప నైవేద్యమో
    అశక్తతా కళంకమో   భక్తి నిష్కళంకమో

    దు:ఖ నివృత్తియో ఇదిసత్కృతియో  నేనెరుగను
    దుష్ట పరిహారమో  ఇది ఇష్ట పరిచారమో

    కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే
    గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ

    సకల దేవతలతో పాటు  సముచితాసనుడివై
    సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా.

SIVA SANKALPAMU-02


 ఓం నమ: శివాయ-02

 కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములను
 అరిషడ్వర్గముల చేతిలో ఆట బొమ్మవైనావట


 నీవు ఆదిదేవుడవనుటకు ఏదిరా ఋజువు శివా
 ఆహా నీ కామము నోహిని తల్లిగా చేసినది

 అయ్యో నీ కోపము ఆ కామిని కాల్చేసినది
 అమ్మో నీ లోభము చల్లదనపు ముల్లైనది

 ఔరా నీ మోహము భ్రింగిని అవమానపరచినది
 అదిగో నీ మదము సతీ వియోగమును చేసినది

 అబ్బో నీ మత్సరము సుతును సంహరించినది
 భద్రతను కలిగించే ఆ రుద్రుడివి నీవేనా

 శుభముల ప్రతిరూపమగు ఆ శంభుడివి నీవైతే
 నీకే మ్రొక్కేనురా ఓ తిక్క  శంకరా
.

SIVA SANKALPAMU-03

 ఓం నమ: శివాయ-03

 నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది
 నీ అంగన్యాసములు అర్థముగాకున్నవి

 నీ రుద్ర నమక చమకము నన్ను మొద్దు అంటున్నవి
 నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి

 నీ శత ఎనిమిది నామములు నన్ను సతమతము చేస్తున్నవి
 నీ దందకములు నాకు అందగాకున్నవి

 నీ అష్టకములు నా వాక్కు స్పష్టము గాదంటున్నవి
 నీ షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది

 శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకములు అగుచున్నవి
 నీ పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది

 గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని
 ఒక్క మాట చాలనవేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-04


  ఓం నమ: శివాయ-04

 పాలు తాగి విషము కక్కు పాము మీది మోజుతో
 పాలకడలి విషము మింగ పావుగా మారావు

 అసత్యమాడిన ఆ బ్రహ్మ ఎంత చతురుడో
 తన కపాలమును చూసి దొంగవని అంటాడు

 ఫాలములో దాగిఉన్న కన్ను ఎంత చుప్పనాతిదో
 అసలు తెరువనీయవని అలుకతో ఉంటుంది

 తలపైని తైతక్కల గంగకెన్ని నిక్కులో
 అటుఇటు కదలనీయవని ఆడిపోసుకుంటుంది

 కుదురుగ ఉండలేని శశికెన్ని కినుకలో
 రాహు-కేతు బాధను కబళించవు అంటాడు

 బుజ్జగిస్తున్న తల్లి బెజ్జమాట వినకుండా
 చిక్కుల్లో పడతావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-05


   ఓం నమ: శివాయ-05
 నేను అభిషేకము చేస్తుంటే అభినివేశము ఏది అంటావు
 నేను దీపారాధనము చేస్తుంతే భక్తి ఉద్దీపనము ఏది అని అంటావు

 నేను చందనము అలదుతుంతే అలదే చందమా అంటావు
 నేను పూలహారములను వేస్తుంటే పాప పరిహారములా అంటావు

 నేను మహన్యాసము చదువుతుంతే చాల్లే అపహాస్యము అంటావు
 నేను ఆరగింపు చేస్తుంటే పండ్లను ఏరలేదా అంటావు

 నేను హారతులను ఇస్తుంతే శేవా నిరతి ఏది అంతావు
 నేను మంత్రపుష్పము అందిస్తే సంపెంగ పుష్పము అంటావు

 నేను సకల ఉపచారములను చేస్తుంతే త్రికరణ ఏది అంటావు
 నేను శక్తికొలది పూజచేస్తుంతే అనురక్తిలేదు అంటావు

 నువ్వు సంతుష్టిని చెంది,పరిపుష్టిని ఇచ్చేందుకు,భక్తి అనే
 రొక్కమెంత కావాలిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-06

 ఓం నమ: శివాయ-06

 పెద్ద దేవుడనని నీవంటే మద్ది తెల్లపోయింది
 అంబే శివుడనని నీవంతే జంబు బెంబేలెత్తింది

 భూత నాథుడనని నీవంతే చూతము చూతము అంది
 యోగిని నేనేనంటే రేగి ఆగిపోయింది

 చెలకని వాడనని నీవంటే చెరుకు ఊరుకున్నది
 మీ రేడునని నీవంటే మారేడు మిన్నకుంది

 ఉబ్బులింగడనని నీవంతే కొబ్బరి తబ్బిబ్బయింది
 నిర్వాహకుడిని నేనేనంటే ఉర్వారుకము నవ్వింది

 దొడ్డవాడనని నీవంతే గడ్డి అడ్డుచెప్పకుంది
 "వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని అనగానే

 అన్ని చెట్లు నీవంటే అక్కజముతో పచ్చి అని నిన్ను
 వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-07


 ఓం నమ: శివాయ-07

 చంద్రుని అమృత ధారలు ఔషధములు అందిస్తే
 చమత్కారివై నేను గొప్ప వైద్యుడనని అంటావు

 సూర్యుడు తన కిరణములతో పత్రహరితమును అందిస్తే
 సూటిగా నేనే హరికేశుడనని అంటావు

 డమరుకము ప్రణవనాదమును అనవరతము చేస్తుంటే
 డాంబికముతో నేనే గొప్ప గురువునని అంటావు

 గంగమ్మ కరుణించి జలధారలు కురిపిస్తే
 దగాకోరువై నేనే ధాన్యరాశినంటావు

 పదములకడ ప్రమథ గణము పరిచర్యలు చేస్తుంటే
 పనిచేయకనే నేనే పరిపాలకుడనని అంటావు

 సొమ్మొకరిది సోకొకరిది అన్నారిదేనేమో
 పక్కా మోసగాడివిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-08

     ఓం నమ: శివాయ-08
 తుమ్మెద రెక్కలు నలుపు అమ్మ థమ్మిలమును అలుముకుందా
 భ్రమరాంబ అని నీవు సంభ్రమముగ చూస్తావు

 అమ్మ నల్లరంగు నీకు అంతగా నచ్చిందా
 కాళి అంటు ప్రేమను మేళవిస్తుంటావు

 అమ్మ కళ్ళుమూసినపుడు చీకటంత నచ్చిందా
 అంధకాసురుడిని కని అయ్యవై మురిసావు

 నల్లనైన కరిచర్మము కట్టిపడేసిందా
 నల్లతాడినిస్తూ భక్తులను కట్టుకోమంటావు

 కాలకూట విషము నలుపు గాలమేసి లాగిందా
 చాలనకుండా మొత్తము చాలించేసావు

 నలుపు ఇష్టమంటూనే ఖలులను నలుపుతుంటావు
 దిక్కుచూపమంటె వినవు ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-09


  ఓం నమ: శివాయ-09

 చిత్త చాపల్యముతో చిత్తుగ ఓడిపోయి
 అరిషడ్వర్గాలలో అదుపులేక ఒదిగిపోయి

 వృత్తి వ్యాపారమంటు ప్రవృత్తినే మరచిపోయి
 సంసారబంధాలను సాగరములో మునిగిపోయి

 కపటమైన పటిమ కొసలు కానరాక కృంగిపోయి
 నాది-నా వాళ్ళంటు మాయలో  ఏమారి పోయి

 నికృష్టుడనని నిందిస్తు అదృష్టము పారిపోయి
 అవసానదశలో అసలైన ఆదరణను కోల్పోయి

 నీలలోహితుడవు కనుక నిర్దయుడవని వాపోయి
 ఉదాసీనతతో నిండిన ఉన్మత్తతతో కూడిన

 మత్తులోన నేనుంటే మేలుకొలుపవేమిర నన్ను
 ముక్కంటిగ పూజలందు ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-10

 ఓం నమ: శివాయ-10
కాశీఖండము వ్రాసి వాసికెక్కినవాడు
 తిరిపమెత్తువాడవని తిట్టిపోసినాడు

 కుమార సంభవమును వ్రాసి అమరుడైనవాడు
 మార  సంహారకుడవని పరుషమాడినాడు

 కాళహస్తీశ్వర కథ వ్రాసి ప్రశస్తి పొందినవాడు
  కాలాంతకుడవని నిన్ను మేలమాడినాడు

 శివపురాణమును వ్రాసి రాణించిన వాడు
 కాశి నగరమునకు పెద్ద శాపమీయ బూనినాడు

 బసవ పురాణమును వ్రాసి యశమునొందిన వాడు
 లింగమే నీవంటూ అంగలార్చాడు

 భూషణమో దూషణమో నీ లీలావిశేషమో
 ఎక్కడైన ఇదికలదా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-11


 ఓం నమ: శివాయ-11

 కాసేపు శివుడని అనుకో కాసేపు గిర్జను అనుకో
 కాసేపు స్నేహితుడను అనుకో కాసేపు సేవకుడను అనుకో

 కాసేపు కైంకర్యము అనుకో కాసేపు కైవల్యము అనుకో
 కాసేపు అశక్తుడను అనుకో కాసేపు నీ భక్తుడను అనుకో

 కాసేపు వడిదుడుకనుకో కాసేపు నీ కొడుకనుకో
 కాసేపు బలవంతుడిని అనుకో కాసేపు భగవంతుడిని అనుకో

 కాసేపు చిన్న పిల్లని అనుకో కాసేపు కన్నతల్లిని అనుకో
 కాసేపు వాదన కాదనుకో కాసేపు కాదన లేవనుకో

 కాసేపు వెండి కొండ అనుకో కాసేపు పైడి కొండ అనుకో
 కాసేపు నన్ను నీవనుకో కాసేపు అన్నీ నీవనుకో

 కాసేపు నా సమస్తమై కాస్తంత కృపాకటాక్షమును
 నాకు రెక్కలుగానీయరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-12

 ఓం నమ: శివాయ-12

అమ్మ గర్భశిశువు వలె,అలలలోని జలము వలె
పాప నోటి పంటి వలె,పాలలోని వెన్న వలె

చేనులోని పంట వలె,మేనులోని మేధ వలె
భూమిలోని నీటి వలె,భూరుహుముల పండు వలె

ఆయువగు గాలివలె సాయమగు జాలివలె
వ్యక్తమవని శక్తివలె,వ్యక్తి లోని యుక్తి వలె

కొయ్యలోని బొగ్గు వలె,కొమ్మలోని పువ్వు వలె
సూక్ష్మమైన స్థూలము వలె,స్థూలములోని సూక్ష్మము వలె

స్థాణువున చలనము వలె,సాధించిన సంకల్పము వలె
గుడ్డులోని పిట్ట వలె,విడ్దూరపు భూభ్రమణము వలె

విత్తులోని చెట్టు వలె,చిత్తులోని పట్టు వలె
నిక్కి నిక్కి చూస్తావురా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-13

ఓం నమ: శివాయ-13

కంటిచూపు ఉన్నది కాల్చుటకు అని నిన్ను చూసి కాబోలు
లంక చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఆ హనుమ

ఆలి ఉన్నది అగ్గిలో దూకించుటకే అని నిన్ను చూసి కాబోలు
అయోనిజను కోరె అగ్గి పరీక్ష ఆ రాముడు

అసత్యాల పుర్రెను ఆదరించిన నిన్ను చూసి కాబోలు
అవలీలగ పలికాడు అసత్యమును ఆ ధర్మరాజు

అడగకుండ వరమిచ్చే అలవాటుని నిన్ను చూసి కాబోలు
అంతటి వ్యధను పొందాడు ఆ దశరథ మహా రాజు

పొగడ్తలకు పొంగిపోవు నిన్ను చూసి కాబోలు
కౌరవులకు అపాత్ర ఆదరణను ఇచ్చె ఆ బలరాముడు

ఒక్కొక్కరు చేస్తున్న ఈ నికృష్టపు పనులన్నీ
నిక్కచ్చిగ నీవిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-14

ఓం నమ: శివాయ-14


కృతయుగము వాడివి అనిచెప్పి కృతకృత్యులైన వారు కొందరు
త్రేతాయుగము వాడివని తేల్చేసిన మరికొందరు

ప్రాచీన గోచరుడివి అనిచెప్పే ఆచార్యులు కొందరు
ద్వాపరము వాడివి అని చెప్పిన దార్శనికులు కొందరు

శతాబ్దముల వాడివి అని చెప్పే లబ్ధ ప్రతిష్టులు మరి కొందరు
తరతరాల పురాతనమే అన్న పండితులుకొందరు

పరమ ముసలివాడివి అన్న ప్రళయ సాక్షులు కొందరు
అబ్బో కాలాతీతుడు అని నీ తెలివిని పొగిడే కొందరు

"నమ: శివాభ్యాం నవ యవ్వనాభ్యాం" అని అన్నారే అనుకో
నవ్వుకుంటు విని దానిని నువ్వు చిందులేస్తుంటే

పరుగులు తీసే వయసును నువు మరుగున దాచేస్తుంటే
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా.
.......................................................

SIVA SANKALPAMU-15

ఓం నమ: శివాయ-15

శశిశీతలకిరణములు నిను సతమతము చేస్తుంటే
గంగమ్మ నెత్తిమీద గజగజలాడిస్తుంటే

అభిషేకపు జలాలు అంతగా ముంచేస్తుంటే
పన్నీటి ధారలు మేము అల్లుకోమ అంటుంటే

చందనాల పూతలు చలి ముల్లులు గుచ్చుతుంటే
చుట్టుకున్న పాములు గుట్టుగ వణికిస్తుంటే


వింజామర గాలుల చలితెమ్మెర సాగుతుంటే
అయ్యో పాపం అంటూ అమ్మ నిన్ను పట్టుకుంటే


సగ భాగము మంచాయె చల్లదనపు అల్లరిలో
చల్లనైన కొండపై చెలువపు అర్థాంగితో నున్న


కొర కొర చూపులతో నిన్ను చలి కొరికేస్తుంటే
కిక్కురుమనవేమిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-16

ఓం నమ: శివాయ-15
"గంగాధర" అని పిలువగ గంగ తొంగి చూస్తుంది
"ముక్కంటి" అని పిలువగ తిక్క కన్ను పలుకుతుంది
"శశిశేఖర" అని పిలువగ జాబిలి ఊకొడుతుంది
"కపర్ది"' అని పిలువగ కచభారము కదులుతుంది
"నంది వాహన" అనగ ఎద్దు సద్దు చేయకంది
"జంగమ దేవర " అంటే లింగము పలుకలేనంది
"నాగేశ్వర" అనగానే పాము ఆగమంటుంది
"అర్థ నారీశ్వర" అనగానే అమ్మ మిన్నకున్నది
"పశుపతి" అని పిలువగానే పాశమేమిటంటుంది
"ఏక నామధారివి" కావని ఎకసక్కెము చేస్తున్నవి
"శివోహం" అను జపమాపి నేను నిన్ను పిలువగా
"ఒక్క పేరు" చెప్పవేరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-17

ఓం నమ: శివాయ-17
సూక్ష్మము నేనంటావు స్థూలముగా ఉంటావు
వీరుడినని అంటావు పారిపోతు ఉంటావు
ఆది నేను అంటావు అనాదిగా ఉంటావు
సన్యాసిని అంటావు సంసారిగ ఉంటావు
పంట భూమినంటావు బీడునేలవవుతావు
జలాశయమునంటావు ఒయాసిస్సువవుతావు
రాజుని నేనంటావు బంటుగా మారుతావు
ప్రణవము నేనంటావు ప్రళయముగా మారుతావు
స్థాణువు నేనంటావు తాండవమాడుతుంటావు
అనుక్షణము సాగుతావు ఆరునెలలు దాగుతావు
దాగుడుమూతలు చాలుర కుదురు లేకుంటేను
వెక్కిరింతలేనురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-18

ఓం నమ: శివాయ-18
భక్తుల కంఠస్థమైన" శితికంఠుని స్తోత్రములకు"-దండాలు శివా
"పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి" -దండాలు శివా
"అగ్నిలింగమైన అరుణాచలేశునికి"-దండాలు శివా
"జల లింగమైన జంబుకేశ్వరునికి"-దండాలు శివా
"వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి" - దండాలు శివా
"ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి"- దండాలు శివా
"సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి"-దండాలు శివా
"చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి"-దండాలు శివా
భక్తి ఆలింగనమైన" మహాలింగమునకు" -దండాలు శివా
(ఓం) న-మ:-శి-వా-య అను "పంచాక్షరికి"-దండాలు శివా
దం-డా-లు-శి-వా అను "ఐదు అక్షరములకు" -దండాలు శివా
సుస్పష్టపు ఇష్టమైన" అష్టమూర్తికి"-దండాలు శివా.

SIVA SANKALPAMU-19

ఓం నమ: శివాయ-19
" అభిషేకములను చేస్తే" శుభములను ఇస్తాడట
" బూది పూతలను పూస్తే" మోదములే ఇస్తాడట
"దీపము దానము చేస్తే" పాపము పోగొడతాడంట
"రాయిని దానము చేస్తే" సాయము అవుతాడట
'శివ నామము" జపియిస్తే పరవశుడే అవుతాడట
తమ వాడని తలిస్తే "మమేకమే అవుతాడట"
"పురాణ పఠనము చేస్తే" పునర్జన్మ తొలగునట
బ్రహ్మ రాక్షసుడు వినగానే" బ్రహ్మజ్ఞాని అగునట"
"కృత్తికా నక్షత్రము" కృతకృత్యులను చేస్తుందట
"కార్తిక దామోదరుడంటు" హరి శివుని చేరునట
"పదకొండు నెలలు వదిలినా" కైవల్యమును పొందగా
"ఒక్క కార్తికము చాలునట"! ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-20


  ఓం నమ: శివాయ-20

 చిన్ముద్రలు ఇష్టము రుద్రాక్షలు ఇష్టము
  అభిషేకము ఇష్టము అవశేషములు ఇష్టము

 మహన్యాసము ఇష్టము మహాశివరాత్రి ఇష్టము
 బిల్వములు ఇష్టము  బిలములు ఇష్టము

 తుమ్మిపూలు ఇష్టము  తుమ్మెదలు ఇష్టము
 తాండవము ఇష్టము తాడనము ఇష్టము

 నిష్ఠూరములు ఇష్టము అష్టోత్తరము ఇష్టము
 లయగ ఆడుట ఇష్టము లయము చేయుటయు ఇష్టము

 కాలుచుటయు ఇష్టము  కాచుటయు ఇష్టము
 చందనాలు ఇష్టము  వందనాలు ఇష్టము

 ఇన్ని ఇష్టమైన నీకు నాపై ఇష్టములేకుండుట,నీ
 టక్కరి తనమేరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-21

ఓం నమ: శివాయ -21

తిండి ధ్యాస నేర్పావు తినమంటు చీమకు
దాచుకుంటుంది తప్ప దానమేది దానికి

భిక్షాటన నేర్పావు శిక్ష అంటు పుర్రెకి
అడుక్కుంటున్నది తప్ప ఆతిథ్యమేది దానికి

పట్టుబడుట నేర్పావు పరుగుతీయు లేడికి
కవి చమత్కారము తప్ప కలిసొచ్చిందేమి దానికి


పొర విడుచుట నేర్పావు కుబుసముల పాముకి
పై పై అందము తప్ప పరమానందమేది దానికి


పంచుకొనుట నేర్పావు మాతల్లి పార్వతికి
గురుదక్షిణ సగమైతే సగ భాగమే మిగిలింది


పరిహాసపు గురువునీవు పరమ గురువులందరి
లెక్కలోకి రావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-22



    ఓం నమ: శివాయ-22
ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును గంధముగా పూయనా
ఆది, అనాది నీవంటూ బూదిని నే పూయనా
శాంతి,సహన పుష్పాలతో పూజలు నేచేయనా
పాప రహితము అనే దీపమును వెలిగించనా
పొగడ్తల పూల వాసనలు అను పొగలను నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తోత్రములను చేయనా
ఉచ్చ్వాస-నిశ్వాస వింజామరలనే వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హరహర మహదేవ అంటు హారతులనే ఈయనా
దాసోహం దాసోహం అంటు ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా.

SIVA SANKALPAMU-23


   ఓం నమ: శివాయ-23

 ఎత్తైన కొండలలో భోగ నందీశ్వరుడవని అంటారు
 చేరలేనంత  ఎత్తులో చార్ ధాం లో ఉంటావు

 లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
 దూరలేనమత గుహలలో అమరనాథుడవై ఉంటావు

 కీకారణ్యములో అమృతేశ్వరుడనని అంటావు
 కనుమల దగ్గర కామరూప కామాఖ్యుడిని అంటావు

 జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు
 భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు

 ఈదలేనంత గంగ ఒడ్దున ఈశ్వరుడిని అంటావు
 గడ్డిపరక కొన పరిమాణమున గారడి చేస్తూ చేస్తూ

 నా మదిని వదిలేసావు దయలేక, తెలియదుగా
  నీకు ఎక్కడ ఉండాలో  ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-24


  ఓం నమ: శివాయ-24
గల గల పారే గంగను జటలో చుట్టేసినావు
భగభగ మండే అగ్గిని నుదుట కట్టేసినావు

శశకమనే చంద్రుని చతురత చుట్తేసినావు
విర్రవీగు విషమును కంఠమున కట్టేసావు

చరచర పాకే పాములను చతురత పట్టేసావు
పులు మిగులచని పులిని వలిచిపెట్టేసినావు

రిపులగు త్రిపురాసురులను మట్టుపెట్టేసావు
పరమ నీచులైన వారి పాపములు చుట్టేసావు

తిర్యక్కులను గాచి తిమిరము నెట్టేసావు
నీ చుట్టే తిరుగుచున్న నా పాపములను మట్టుపెట్ట

 శ్రీరస్తు అని అంటు శ్రీకారము చుట్టమంటే
 పక్క చూపులెందుకురా ఓ తిక్క శంకరా.


SIVA SANKALPAMU-25

 ఓం నమ: శివాయ-25

 అసత్యమాడు బ్రహ్మ పుర్రె అంతగా నచ్చిందా
 ఆభరణముగా చేసి అలంకరించుకున్నావు

 హింసకు గురిచూసే ఆ బోయకన్ను నచ్చిందా
 రక్తాశ్రువులను రాల్చ అనురక్తిని చూపావు

 అమ్మ దగ్గర ఉందనన్న అర్భకుని వాక్కు నచ్చిందా
 అమృతధారగ మారి అర్ద్రతనందించావు

 స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
 ఉదారతను చూపిస్తూ ఒదిగి ఒదిగి పోయావు

 పృష్ట భాగమున పూజలందు ఆవు చెవి నచ్చిందా
 లంకకు నే రానంటు గోకర్ణమున నిలిచావు

 పెంపును అందించుతావో పంపు అని చంపుతావో
 పెక్కు మాటలేలరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-26


  ఓం నమ: శివాయ-26

 రూపివా,అరూపివా అపురూపివా శివా నీవు
 కన్నతండ్రిని చూడ నే కాశికి పోవ కానరాడు

 దేవతల మోహమడచ మొదలు చివర కానరాడు
 చిదంబరము పోయిచూడ చిన్నగాను కానరాడు

 అటు చూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు
 నింగిలో సాగుతాడు-నేలలో దాగుతాడు

 అగ్గినంటి ఉంటాడు,గాలి నేనె అంటాడు
 జ్యోతిని నేనంటాడు,ప్రీతిని నీకు అంటాడు

 ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు
 ఓంకార రూపుడ ఇవి నీ ఆకారపు లీలలుగ

 జంగమ దేవర నా ఆలింగనముగా మారి,నీ 
 చక్కదనము చూప వేర ఓ తిక్క శంకరా.   

SIVA SANKALPAMU-27


  ఓం నమ: శివాయ-27

 అడ్డ నామాలతో-నిలువు నామాలతో
 సివుడు-రాముడు ఆరాధిస్తారు పరస్పరము

 శివరామ సంగమమేగ ఆ పవిత్ర రామేశ్వరము
 సీతను పెండ్లాడ రాముడు చేశాడు శివధనుర్భంగము

 సీతా వియోగ సమయమున నీ అంశయే సహాయము
 సేవా నిరతి పొందినది శ్రీరామ ఆలింగనము

 శివస్మరణము రామునికి ఆనందాయకము
 శివుడు పార్వతికి చేసాడు శ్రీ రామ మంత్రోపదేశము

 శివరామ సంగమమే శుభకరమగు అభంగము
 శివశక్తి ప్రతిరూపము సీతారామ దాంపత్యము

 ఈ శివుడే ఆ రాముడని ఆ రాముదే ఈ శువిడని
 ఒక్క మాత చెప్పవేరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-28

 ఓం నమ: శివాయ-27

 నీ కన్న నీ బసవడు అనయము కొనియాడబడుచు నుండ
 నీ కన్న నీ నామము మంగళకరమనబడుచుండగ

 నీ కన్న నీ శిగ శశి చాంద్రమానమగుచుండగ
 నీ కన్న నీ కాలము దోష శేష పూజలముదుచుండ

 నీ కన్న నీ శిరసుగంగ నీరాజనములముచుండ
 నీ కన్న నీ కృత్తిక నిఖిల కీర్తి పొందుచుండ

 నీ కన్న నీ పరివారము ప్రస్తుతింపబడుచుండగ
 నీ కన్న నీ భక్తులకథలు మారుమ్రోగుచుండ

 నీ కన్న నీ భోళాతనము వేళాకోళమగుచుండ
 చూసి చూడనట్లుగా,తెలిసి తెలియనట్లుగా

 పోనీలే అనుకుంతే కానీలే అని మిన్నకుంతే,న్యాయము
 ఎక్కడుందిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-28


  ఓం నమ: శివాయ-28

  నిన్ను చూపించే నా కన్ను కన్నుమిన్ను కానకుంది
  మళ్ళీ చూపించమంటే మళ్ళలేను అంటోంది

  నీ పేరును వినిపించే చెవి నన్ను చెవిటివాడినని అంటోంది
  మళ్ళీ వినిపించమంతే శంఖము ఉదారంటుంది

  నీ పేరును పలికే వాక్కు నన్ను సన్నగా నొక్కుతోంది
  మళ్ళీ పలికించమంటే కిక్కురుమనకంటుంది

  నీ దరిచేర్చిన కాలు నాపై కారాలు నూరుతోంది
  మళ్ళీనడిపించమంటే ఒంటికాలిపై లేస్తోంది

  నీముందు వంగు తల నన్ను అతలాకుతము చేస్తున్నవి
  మళ్ళీ వంచమన్నానని నన్ను అవతలకు పొమ్మంది

  శివుడే గద అని అంటూ చీకాకు పెడుతున్నవి,ఆపవేర వాటి
  కొక్కిరాయి పనులను ఓ తిక్క శంకరా.



  

SIVA SANKALPAMU-29


   ఒం నమ: శివాయ-29

  దక్షుని శిక్షించగ తలతీసి మేకతలను పెట్టావు
  గణపతి శిక్షించగ తలతీసి కరి తలను పెట్టావు

  అంధకుని శిక్షించగ మూడవ కాలితో భ్రింగిగా మార్చావు
  నర
సింహుని రక్షించగ శరభముగా పరుగులిదతావు

  నంది తలను పరికిస్తూ ఆనందిస్తుంటావు
  బ్రహ్మ  తలను పడగొట్టి భిక్షపాత్ర అంటావు

  తలరాతను మార్చమంటే తలలే మారుస్తావు
  కలతలు తీసేయమంతే వేరొక తల అతికిస్తావు

  వెతలను తీర్చమంతే కతలనే రాస్తావు
  నా కత వినిపించానంతే నా తలతీసేస్తావేమో

 తలమానికమైన దేవ దయతలచక భక్తులపై
 ఉక్కుపాదమెందుకురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-30


   ఓం నమ: శివాయ-30

 ఎత్తైన కొండలలో భోగ నందీశ్వరుడవని అంటారు
 చేరలేనంత  ఎత్తులో చార్ ధాం లో ఉంటావు

 లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
 దూరలేనమత గుహలలో అమరనాథుడవై ఉంటావు

 కీకారణ్యములో అమృతేశ్వరుడనని అంటావు
 కనుమల దగ్గర కామరూప కామాఖ్యుడిని అంటావు

 జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు
 భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు

 ఈదలేనంత గంగ ఒడ్దున ఈశ్వరుడిని అంటావు
 గడ్డిపరక కొన పరిమాణమున గారడి చేస్తూ చేస్తూ

 నా మదిని వదిలేసావు దయలేక, తెలియదుగా
 నెకు ఎక్కడ ఉండాలో  ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-31



   ఓం నమ: శివాయ-31

  గుర్తించిన పురుగు కరిపాములకు  గుడినే కట్టించావు
  గుడి గోపురమును చూసిన  పాప నాశనము అన్నావు

  గుడ్డితనమును  పోగొట్టి చూపు నిస్తుంటావు
  గుర్తించనివారికిని భక్తి గుళికలు అందిస్తుంటావు

  గురువుగా మారి ఎందరినో తరియింపచేస్తావు
  గుడిలోన కూర్చుని  గురుతర పూజందుకుంటావు

  గుహుని తండ్రిగా మారి అహమును తొలగిస్తావు
  గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింపచేసావు

  గుణనిధిని కరుణించి గుండెలో దాచుకుంటావు
  గుచ్చిన బాణము చూపి  పాశుపతమునిచ్చావు

  గుక్క తిప్పుకోకుండా ఎక్కి ఎక్కి ఏడ్చుచున్న నన్ను,నీ
  అక్కున చేర్చుకోవేమిరా  ఓ తిక్క శంకరా.

SIVA SANKALPMAU-32


   ఓం నమ: శివాయ-32

   నీ నియమపాలనలో భక్తి నిగ్గుతేల్చాలని
   అత్యంత ప్రేమతో వారిని అక్కున చేర్చుకోవాలని

   అగ్గిలో కాల్చావు  ఆ భక్త నందనారుని
   అంబకము అడిగావు  ఆ బోయ తిన్నడిని

   అఘోర వ్రతమన్నావు ఆ చిరుతొండనంబిని
   అర్థాంగిని ఇమ్మన్నావు ఆ అయ్యలప్పను

   అంత పరీక్షించావు అమ్మాయి గొడగూబను
   దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు

   మహదేవుని కాళ్లను నరికించావు కఠినముగా
   మల్లిఖార్జునికి కళ్ళను పీకించావు కటకట

   భక్తులకు పరీక్షలను ఈ కఠిన శిక్షలు,ఇక
   అక్కరలేదనవేరా  ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-33


    ఓం నమ: శివాయ-33

  సగము  మహాదేవుదట-సగము మహాదేవి అట
  సగము తేట తెలుపట- మరొక సగము పసిడి పసుపట

  సగము చంద్ర బింబమట-సగము మల్లెదందలట
  సగము జటాజూటమట-సగము థమ్మిల్లమట

  సగము బూది పూతలట-సగము కస్తురి తిలకమట
  సగము నాగ హారములట-సగము నానా హారములట

  డమరుక దక్షిణ హస్తమట-వరద వామ హస్తమట
  సగము పులి తోలేనట-సగము చీనాంబరములట

  సగము తాండవ పాదమట-సగము మంజీరములేనట
  చెరిసగము స్త్రీ పురుషులట-కొనసాగును సృష్టి యట

  నగజ-అనఘ సగములో మిగిలిన సగమేది అంటే
  దిక్కులు చూస్తావేమిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-34



   ఓం నమ: శివాయ-34

    నీకు పూజచేస్తే పున్నెమని విని వినయముగా
    కాళ్ళు-చేయి కడుగ నీళ్ళకెళితే గంగ కస్సుమన్నదిరా
    స్నానమెట్లు చేయిస్తు? సముదాయించర గంగను

    నిన్ను కూర్చోమనగానే  వేటకు తుర్రుమన్నదిర పులి
    జందెమైన ఇద్దమన్న చరచర  పాకింది పాము

    కట్టుకోను  బట్టలన్న  కనుమరుగైనదిర కరి
    నైవేద్యముచేయబోవ  విషజంతువులన్నీ  మాయము

    వెతుకులాడి వెతుకులాడి వేసారితినిరా శివా
    అక్కజమేమున్నదిలే నీ అక్కర తీరినదేమో
    ఒక్కటైన కలిసిరాదు నీకు చక్కనైన పూజసేయ

   మాయతొలగిపోయె  నేడు  మానసపూజలు చేతు
   దిక్కులనే ధరించిన  ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-35


     ఓం నమ: శివాయ్-35


 పొట్టచీల్చి  గజాసురుని  మట్టి కరిపించావు
 చుట్టుకుంది  అతని తల  నీ సుతుని  శరీరమునే

 కన్నుతెరిచి  మన్మథుని  కన్ను మూయించావు
 కన్నుల పండుగ అయినది  నీ కళ్యాణములో

 బాణమేసి   వరాహము  ప్రాణమే  తీసావు
 పాశుపతము చేరింది  అర్జునుని  చేతికి

 హరిని  అస్త్రముచేసి  త్రిపుర సం హారము చేసావు
 విరచితమైనది జగతి వీరముగా  హరిమహిమ

 దారుణ మారణ కాండలను కారుణ్యము అంటుంటే
 ఎటుచూసిన నీ గతము పాతకముగ మారుతుంటే

 "మహాదేవం-మహాత్మానాం-మహా పాతక నాశనం" ఏమిటంటే
  చక్క బరచుట అంటావురా  ఓ తిక్క శంకరా. 

SIVA SANKALPAMU-36



      ఓం నమ: శివాయ-36

  అనిశము వశమగుతావు  పశునామములకు  నీవు
  పశుపతి అని పిలువగానే  పరవశమేగా  నీకు

  కాల భైరవుని  కాశికాపుర పతిని  చేశావు
  శరభమువై  నరసిం హుని  శాంతింప చేశావు

  మిక్కుటమగు  ప్రేకల  కుక్కుటేశ్వరుడవు నీవు
  వ్యాళమును అనుగ్రహించిన  కాళేశ్వరుడవు నీవు

  స్కంధోత్పత్తికి వనమున లేడిగ కనిపించావు
  వ్యాఘ్రమునకు మోక్షమిచ్చిన  వ్యాఘ్రేశ్వరుడవు నీవు

  జంబుకమును  కరుణించిన  జంబుకేశ్వరుడవు
  శ్రీ కరి కాళములను దయతలచిన  శ్రీ కాళ హస్తీశ్వరుడవు

  పాశమేసి నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
  కప్పల తక్కెడ  అంటావురా ఓ తిక్క శంకరా. 

SIVA SANKALPAMU-37


    ఓం నమ: శివాయ-37

  నీ పాదము పట్టుకుందమన్న  చిందులేస్తు  అందకుంది
  నీ నడుమును  వేడుకుందామన్న పులితోలు  అలిగింది

  నీ హృదయము దరిచేరదమన్న  కుదరదు అని అంటోంది
  నీ చెవికి చెబుదామన్న  చెడ్డ  పుర్రె అడ్డుకుంది

  నీ చుబుకము  పట్టుకుందామన్న  విషము సెగలు కక్కుతుంది
  నీ కన్నుకు  కనిపిద్దామన్న  కొంచమైన  తెరువకుంది

  నీ  ముక్కుకు  చెబుదామంటే  మూసి జపము చేస్తున్నది
  నీ జటకు  ఉటంకిద్దామంటే  గంగవెర్రులెత్తుతోంది

  నన్ను రానీయక నీవు తమ సొంతమంటు  గంతులేస్తున్నవి
  సుంతయైన  కనికరమే చూపించలేమంటున్నవి

  నీ దరి  సేదతీరుతూ ఆదరమునే మరచిన వాటి
  టక్కరితనమును చూడరా  ఓ తిక్క శంకరా.   

SIVA SANKALPAMU-38

ఓం నమ: శివాయ-38

కాదనలేవుగ పాముని,కాదనలేవుగ చీమని
కాదనలేవుగ లేడిని,కాదనలేవుగ వేడిని

కాదనలేవుగ దండని,కాదనలేవుగ కొండని
కాదనలేవుగ తేటిని,కాదన లేవుగ నీటిని

కాదన లేవుగ బూజుని,కాదనలేవుగ బూదిని
కాదన లేవుగ మేథని,కాదన లేవుగ వ్యాధిని

కాదనలేవుగ గౌరిని,కాదనలేవుగ శౌరిని
కాదనలేవుగ సుతులని,కాదనలేవుగ నుతునులని

కాదన లేవుగ విందుని,కాదనలేవుగ విందుని
కాదనలేవుగ మునులని,కాదనలేవుగ జనులని

ఒకే ఒక్కసారి నిన్ను ఒక్కడినే రమ్మంటే,ఈ
తొక్కిసలాటేమిరా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-39

ఓం నమ: శివాయ-39

ఉదారతను చూపగ ఆ అసురుని ఉదరములో ఉంటివి
గంగిరెద్దు మేళము నిన్ను కాపాడినది ఆనాడు

కరుణను చాటగ ఆ అసురుని చేతికి అగ్గినిస్తివి
మోహిని సహాయము నిన్ను కాపాడినది ఆనాడు

భోళాతనమును చాటగ ఆ అసురునికి ఆలిని అందిస్తివి
నారద వాక్యము నిన్ను కాపాడినది ఆనాడు

ఆత్మీయత అనుపేర ఆ అసురునికి ఆత్మలింగమును ఇస్తివి
గణపతి చతురత నిన్ను కాపాడినది ఆనాడు

భ్రష్టులైన వారిని నీ భక్తులు అంటావు
రుసరుసలాడగ లేవు కసురుకొనవు అసురతను

మొక్కారని అసురులకు గ్రక్కున వరములనిస్తే
పిక్క బలము చూపాలిరా ఓ తిక్క శంకరా
..........................................

SIVA SANKALPAMU-40

  ఓం నమ: శివాయ-40

  శ్రీకరుడౌ శివునికి కరివదనుని ప్రస్తుతి
  షడక్షరీ మంత్రధారికి షణ్ముఖుని ప్రస్తుతి

  ఆనంద తాండవునికి ఆ నందిముఖుని ప్రస్తుతి
  హరోం హర దేవునికి హయ వదనుని ప్రస్తుతి

   శుభకర శంకరునికి శుకవదనుని ప్రస్తుతి
   శితికంఠ   వదనునికి సిమ్హవదనుని ప్రస్తుతి

   కపర్ది నామధారికి కపివదనుని ప్రస్తుతి
   మేనక అల్లునికి మేషవదనుని ప్రస్తుతి

    ఆపదోద్ధారకునికి ఆ పతంజలి ప్రస్తుతి
    బ్రహ్మాండ నాయకునికి బహు ముఖముల ప్రస్తుతి

    నాపై కరుణచూప నీవు సుముఖముగా లేకుండుట,నీ
     టక్కరితనమేరా ఓ తిక్క శంకరా


...........................................................

SIVA SANKALPAMU-41

ఓం నమ: శివాయ  -41

పాట పాడుచు నిన్నుచేర పాటుపడుచు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒక భక్తుడు

నాట్యమాడుచు నిన్ను చేర ఆరాటపడే ఒక భక్తుడు
కవిత వ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు

తపమాచరించుచు నిన్ను చేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్ను చేర పరుగుతీయు ఒక భక్తుడు


చిత్రలేఖనముతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు


నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒక భక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటించు ఒక భక్తుడు


ఏ దారిలో నిన్ను చేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు,నువ్వు
నక్కతోక తొక్కావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-42

ఓం నమ: శివాయ-42

పాలకడలి జనించిన గరళము నిను చేరితే
మురిపాల పడతి హరిని శ్రీహరిని చేసింది

శరభరూపమున నీవు శ్రీహరిని శాంతింప చేస్తే
విభవమంత హరిదేగా ప్రహ్లాదచరిత్రలో

చిలుకు ఏకాదశి నాడు చకచక లేచేసి
దామోదరుడు నిన్ను చేరినది మోదము కొరకేగా


అభిషేక జలాలతో నీవు ఆనందపడుతుంటే
అలంకారాలన్నీ హరి తన ఆకారాలంటాడు


అనుక్షణము నీవు అసురులను చెండాడుతుంటే
లక్షణముగా హరి తులసిని పెండ్లాడాడు


అలసటయే నాదని ఆనందము హరిది అని
ఒక్క మాట చెప్పవేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-43

ఓం నమ: శివాయ -43

నెత్తిమీది గంగతప్ప నెత్తుటి బంధము ఏది
పొత్తు నీకు హరికితప్ప పొత్తిళ్ళలో సుఖము ఏది

లలాటమున కన్ను తప్ప బాలానందములు ఏవి
హెచ్చైన ఎద్దు తప్ప అచ్చట ముచ్చటలు ఏది

పిలవని పేరంటము తప్ప పెళ్ళికి సందడి ఏది
దక్షుని నిర్లక్ష్యము తప్ప లక్షణ మర్యాద ఏది


మింగుడుపడని విషము తప్ప మెరుగు అగు సంగతులేవి
పుక్కిటి పురాణములు తప్ప పురుషార్థములు ఏవి


అపాత్ర వరములు తప్ప ఈషణ్మాత్రపు ఈవి ఏది
పరుగుతీయు భయము తప్ప పరమపదము నీకు ఏది


లయముచేయు లయ తప్ప వలయునది లేదని,నే
నొక్కి చెప్పాలిరా ఓ తిక్క శంకరా.
.......................................................................................................................................................................................

SIVA SANKALPAMU-44

ఓం నమ: శివాయ-44

గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు

కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు

తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు


అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు


దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు


పరిహాసాస్పదుడవగుచు పరమ శివుడు నేనంటే
ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
............

SIVA SANKALPAMU-45

ఓం నమ: శివాయ -45

నీ క్షమా గుణము చూసి పులి శాంతముగా మారింది
పాపం,పులిని బెదిరిస్తు లేడి తరుముకు వస్తోంది

నీ పిరికితనమును చూసి పులి పిల్లిగ మారింది.
పాపం పిల్లి అనుకుని ఎలుక ఎగిరిపడుతోంది

నీ మంచితనము చూసి అగ్గి కన్ను తగ్గి ఉంది
పాపం తగ్గిందంటు మంచు దానిని ముంచి వేస్తోంది

నీ వ్యాపకత్వమును చూసి పాము తాను పాకుతోంది
పాపం పాకుతోందంటు దానితోక చలిచీమ కొరుకుతోంది

నీ పెద్దతనము చూసి కదలకుండ ఎద్దు ఉంది
పాపం,మొద్దు ఎద్దంటూ జనము దానిని ఎద్దేవా చేస్తోంది

సహనముతో నీ సహవాసము కోరిన వాటి
ఇక్కట్లను చూడవేరా ఓ తిక్క శంకరా.
...................................................................................................................................................................................

SIVA SANKALPAMU-46

ఓం నమ: శివాయ -46

అరిషడ్వర్గాలను ఆహా నువ్వు బెదిరిస్తుంటే
అహముతో అసురగణము నిన్ను బెదిరిస్తోందా

బ్రహ్మ పుర్రె పట్టుకొని నువ్వు బిచ్చమెత్తుతుంటే
బ్రహ్మర్షులు చిత్రముగా నిన్ను బిచ్చమడుగుతున్నారా

పొంగుచున్న గంగను నువ్వు జటలలో బంధిస్తే
పంచాక్షరి వింతగ నిన్ను పట్టి బంధిస్తోందా


ఆ నందిని కైలాస కాపరిగ నువ్వు నియమిస్తే
బాణుడు శోణపురి కాపరిగా నిన్నే నియమించాడా


పరమ గురుడు శివుడు అని నేను స్తుతులు చేస్తుంటే
అఖిలజగము పరిహసిస్తు విస్తుబోయి చూస్తుందా


బందీలు ఎవరో తెలియని నా సందేహము తీర్చకుంటే
నిక్కము అనుకుంటానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-47

ఓం నమ: శివాయ -47

చిన్ముద్రలు ఇష్టము,రుద్రాక్షలు ఇష్టము
అభిషేకము ఇష్టము,అవశేషము ఇష్టము

మహన్యాసము ఇష్టము,మహా శివరాత్రి ఇష్టము
బిల్వములు ఇష్టము,బిలములు ఇష్టము

తుమ్మిపూలు ఇష్టము,తుమ్మెదలు ఇష్టము
తాండవము ఇష్టము,తాడనము ఇష్టము


నిష్ఠూరములు ఇష్టము,అష్టోత్తరములు ఇష్టము
లయగ ఆడుట ఇష్టము,లయము చేయుట ఇష్టము


కాల్చుటయు ఇష్టము,కాచుటయు ఇష్టము
చందనాలు ఇష్టము,వందనాలు ఇష్టము


కష్టాలలో నున్న నాపై నీ ఇష్టము అందించుటకు నే
మొక్కులెన్ని మొక్కాలిరా ఓ తిక్క శంకరా

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...