Saturday, August 19, 2017

భూతల స్వర్గము -4

   కేరళ కేరింతలు-4

 వెనుకకు తిరుగు సరస్సుజలాల బలమేమో,మనసు వెనుకకు వెనుకకు పరుగిడుతుంటే దానిని  బంధించుటకు బుద్ధి బయలుదేరింది.వెంటనే..నేను ఇక్కడకు ఎలా రాగలిగాను?అవధులులేని నా ఆనందానికి కారకులెవరు?కళకళల కేరళ తలుపు తాళాన్ని నాకోసం తీసిందెవరు? అద్భుత ఆనందాల పల్లకీలో నేను కూర్చుంటే మోసిన బోయీలెవరు?మాకు కనువిప్పును కలిగించి మా అందరిమెప్పును శాలువగా కప్పుకున్న మేధావులెవరు?నాలో ప్రశ్నల పరంపరలు
జవాబులను వెతికి...తల్లితండ్రులకు అద్భుత అనుభూతులనిచ్చిన వారిని(మనసులోనైన)మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.వారికి వేయింతల ఆనందం కలగాలని...అది
పుత్రొత్సాహమో,పౌత్రోత్సాహమో,నిత్యోత్సాహము కావాలని భగవంతుని ప్రార్థించాను.మనవరాళ్ళు,మనవడు అడుగడుగునా కనిపెట్టుకుని కంటిపాపలా చూసుకుంటేనే కదా ఇదిసాధ్యం.వియ్యమునొందిన నెయ్యము ఆత్మబంధువై కొత్త ఇంధనమును ఇస్తేనే గదా
నేను కేరళ సౌధమున(సుధలుగలది)విహారముగావించినది.మందులే విందైన నాముందు అందాలసందడి చేయించిన ప్రతివారికి(వయసులో చిన్న-మనసులో మిన్న)మనసా,వచసా,శిరసా అంజలిస్తూ,మధురానుభూతులను మధించి,వ్యయ ప్రయాసలకు ఓర్చి మమ్మానందింప చేసిన ప్రతి ఒక్కరికి ,ఇంతై,ఇంతింతై,ఎంతెంతోగా ఆనందాలు చేరాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ......కొండంత చూసి గోరంత తెలిపిన
     భవదీయురాలు.

భూతల స్వర్గము-3

   కేరళ కేరింతలు-3
_
 సదాచారపాలన-సత్ప్రవర్తన ఉచ్చ్వాస-నిశ్వాసములుగా గల ఊయల కేరళ.పాండితీ ప్రకర్షకు,విజ్ఞాన విజయాలకు పట్టముగట్టే లక్షణము ఇక్కడి జగములోనే కాదు గజములలోను గోచరిస్తుంది.భర్తృహరి "సుభాషిత  త్రిశతి" తెలుగుచేసిన పాండితీ ప్రకర్ష రాజాదణను "గజారాహోణ"గా మార్చి పైడిపల్లి  లక్ష్మణకవికి "ఏనుగు లక్ష్మణకవి"గా నామకరణము కావించి,లబ్ధప్రతిష్ఠను ప్రసాదించినవి.చిన్నారులు కౌతాలు.శ్రీమను తమ ప్రతిభా పాటవములతో "పదముల రాణి"ని మెప్పించుటెరింగి వారిచే
"గజారోహణమే" కాదండోయ్ వనప్రదక్షిణము చేయించాయి మలయాళ మత్తగజములు.(పెద్దలు మొహమాట  పడతారని  కాని వారూ ధన్యులే సుమండీ) మరిన్నీ!!! మంచిని సాధించాలని మరీ మరీ దీవించాయి.
       "కళల పరిమళమే కేరళ" అనకుండా  ఉండగలమా! "కథాకళి"కలరి" ప్రదర్శనలనుచూశాక.నిర్జీవమైపోతున్న మనకళాప్రదర్శనలను పునరుద్ధరించాలని అనుకోకుండా ఉండగలమా.అవి ప్రదర్శనలు కావండీ" ప్రతిభా పురస్కారలకు ఆదర్శములు."
  మదర్పిత చందన తాంబులాదులు స్వీకరించి,మమ్మానంద పరచమని(డబ్బు కడితేనే) మంగళ హారతులతో,మల్లెల మాలలతో మనసారా ఆహ్వానించింది వైల్డ్ హోటలు సిబ్బంది.స్వాగత పానీయాలుగా సాటిలేని నారికేళ జలాలందిందించి.గలగలల సరిగమలతో వెనుతిరుగు జలాల
అందాలు మన మనసులను గతములోని మధురానుభూతుల దగ్గరికి తీసుకెళుతుంతే -అదిగో.తుళ్ళిపడే అలలతో పోటీపడుతు పరవశిస్తున్న ప్రయాణీకుల గళములు,
  "పచ్చ పచ్చని తోటల్లోన చందమామ
   పండువెన్నెల జాడల్లోన చందమామ
   వచ్చె వచ్చె అలలతోన చందమామ
   పసిడిపడవ పయనములోన చందమామ
   మిసిమినవ్వుల పువ్వులమ్మ చందమామ
   నచ్చి వచ్చేసాడమ్మచందమామ
  ఆనందాల నిచ్చెన వేస్తు చందమామ"

భూతల స్వర్గము-2


  కేరళ కరింతలు-2
 సంస్కారపు ఆకారము ఓంకారముగా,"భోజ్యేషు మాతగా'గా అందాల తనఒడిలో,అక్షయపాత్రనుంచుకుని ,పసందైన పాకశాకాలను,పళ్ళ పాయసాలను,మధురసాలను సిద్ధము చేసి,చక్కని సెలయేరులు మనపక్కగ మక్కువను కురిపిస్తుంటే,చల్లని చిరుగాలులు వీవనలు వీస్తుంటే,"మన గడపనున్నవారి కడుపు నింపమంటు"భారత భాగ్య విధాతను తలచుకుంటు,విందును-కనువిందును అందిస్తుంటే,ఆకలి చిరునామా అదృశ్యమైపోదా?వందలాది వందనాలు చిందులేస్తూ ముందుకురావా పోటీపడి[మూల్యము గురించి ఆలోచించి చిన్నబుచ్చకండి ఆ కన్నతల్లి ప్రేమను).
   "శశకముతో సిం హమే జంటకడితే"అంతే ఇదేమేమో అంటూ {ఆకారము కాదు ముఖ్యం-అందులోని ఆ కారం}ఆకుపచ్చ ముత్యాల హారాల్లా,ఆలంబనగా నిలువెత్తు సంస్కారానికి ప్రతీకలుగా నింగినితాకేలానున మహావృక్షాలను చేసుకుని అందాలొలకపోసే మిరియాలతీగలను చూడగానే చిన్న పెద్ద తేడాలు చిన్నాభిన్నమైపోతాయి.
   చూశారుగదండీ "అశ్విన్ టీ స్టాల్"బాషా ఇరానీ టీకి బాదుషాలము మేమంటూ తేయాకు మడులగడుల హడావిడులు.నీవెక్కడుంతే మేమక్కడంటూ పరిమళపు పలుకులతో మనలను పరవశింపచేయు సుగంధాల తోటలు .ఏ జన్మబంధమో మీతో మాది అని మోదముతో సేదతీర్చే తేనీరు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...