భృంగి కృత శివ స్తుతి.
******************
1. ఆశాపాశముల కట్టబడి రోయక దుర్వ్యసనుండనైతిని
హింసాప్రకృతితో కౄరుడను కనుగానక గురుతెరుగని
విశ్వాసములేని దుష్కీర్తిభాజనుని జడుని,కృతఘ్నుని
శరణము వేడుకొను భృంగిని కరుణించుము పార్వతీపతి.
2. బలహీనత్వము తోడుగ బధ్ధకత్వము గల భగ్నవ్రతుని
పలాయన మంత్రము జపించు పాపిని పరమ డాంభికుని
శూలితో మూర్ఖపు వాదనకు దిగిన ఆదివ్యాధి పీడితుని
శరణము వేడుకొను భృంగిని కరుణించుము పార్వతీపతి.
3.. యోచన చేయగలేక దుష్కర్మల వీడగలేని కామాంధుని
విచక్షణ చేయగ చేతగాని మూర్ఖుని,స్వధర్మ రహితుని
నీచపు లక్షణముల చేతులు కలిపిన యశోవర్జితుని
శరణము వేడుకొను భృంగిని, కరుణించుము పార్వతీపతి
4.సకలము నీవేనని తెలియనికుసంస్కారిని గురుద్వేషిని
వికలము చేసినవి మనమును వీడక వెంటాడుతున్నవి
తికమక వీడినది శివకటాక్షమును కోరి చేరినది
శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి
5. కలనైననుమంచి గంధ పుష్పములతో కైంకర్యము చేయని
కొలువైతివి నిండుగ గుండెనని నిను విచారణ చేయని
విలువైనది విశ్వేశ్వరుని దయయని వివరమునెరిగి
శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి
6.భార్యా పుత్ర గృహాది లగ్న మనసుగల సత్సంగద్వేషిని
కార్యాసక్తత మరచిన కృత్యాకృత్య విచారణ వర్జితుని
ఆర్యావర్తనుల గమనము తెలిపినది మిథ్యాజ్ఞానినని
శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి
7.పిలిచిన పలుకవను మూగను చెవిటిని అస్పృశ్యుడిని
చిలిపిగ విషయభోగముల చింతలో చిక్కిన పాపిష్ఠిని
తెలిపిన సత్యమును రంధ్రాన్వేషణము చేయు నాస్తికుని
శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి
8.మలమూత్రంబులు గుజ్జు ఎముక రక్తమాంసము దేహము
నాలుగు దశలుగ మారుతు వేరొక దేహము చేరు జీవము
సులువుగ నిను చేరుటకు నా ఈ శరీరము సాధనమని
శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి.
భృంగి కృత శివస్తొత్రం పఠనం సర్వ సంపత్కరం, సాక్షాత్ శివదర్శనం లభేత్.
భృంగిని కరుణించిన సదాశివుడు మనలను రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.
మీకు తెలియదనికాదు.నా తృప్తికై మీతో భృంగి ఋషి చరితమును ప్రస్తావించుచున్నాను.పరమశివభక్తుడైన భృంగి శివుని మాత్రమే పూజించెడివాడు.అమ్మను,అర్థనారీశ్వరమును గౌరవించెడికాడు.ఇది గమనించిన తల్లి సుతుని సంస్కరించుటకై,ఒకరోజు ప్రదక్షిన సమయమున అర్థనారీశ్వరమై భృంగి ప్రదక్షిణ సేవకై చూచుచున్నది.అమ్మకు కూడ ప్రదక్షిణ చేయుట ,ఏ మాత్రము నచ్చని భృంగి,తుమ్మెదగామారి,వారిరువురి మధ్య చిన్న రంధ్రమునేర్పరచి,శివునికి మాత్రమే ప్రదక్షిణముచేసి,ఆనందపడుచుండెను.పూర్వజన్మలో అంధకాసురుడు కదా.చీకటి పూర్తిగా వీడలేదని,ఆదిదంపతులు అవ్యాజ కరుణతో వానిని సంస్కరింపదలిచారు.అమ్మ ఆగ్రహం నటించి, శక్తి తత్త్వమును,అర్థనారీశ్వర ఆశీర్వచనమును అందించుటకై భృంగిని అశక్తునిగా శపించి,నిర్వీర్యుని చేసెనట.కనువిప్పు కలిగిన భృంగి పశ్చాత్తాపముతో చేసిన స్తోత్రమిది.దయాంతరంగులైన వారు,భృంగికి అతిశక్తివంతమైన కాలు అనుగ్రహించినారు.నాటి నుండి భృంగి మూడు కాళ్ళతో ముక్కంటిని కొలిచి చరితార్థుడైనాడు.
సర్వం శివమయం జగత్.