ఓ ఏకాంతమా!!!!
*****************
కమ్మనైన రాగమేదో తీస్తున్నది విరిబోడి
కొమ్మచాటు కోయిలేదో దాస్తున్నది తడబడి
పిడికిలిలో కొడవలి కోస్తున్నది వరిమడి
గడసరిగ కనుగవ చూస్తున్నది జతపడి
*****************
కమ్మనైన రాగమేదో తీస్తున్నది విరిబోడి
కొమ్మచాటు కోయిలేదో దాస్తున్నది తడబడి
పిడికిలిలో కొడవలి కోస్తున్నది వరిమడి
గడసరిగ కనుగవ చూస్తున్నది జతపడి
ఓ.......ఏకాంతమా!
ఏమరుపాటుగా ఈ కాంతను వీడకు
ఎలనాగ ఆనందము చేజారనీయకు
ఎలనాగ ఆనందము చేజారనీయకు
కమ్ముకున్న శోకమేదో దాగినది మథనము
నమ్మలేని మైకమేదో సాగినది మధురము
తమకములో గమకములే చేరినవి హరితము
మమేకముగ గమనమే మారినది మురిపెము
నమ్మలేని మైకమేదో సాగినది మధురము
తమకములో గమకములే చేరినవి హరితము
మమేకముగ గమనమే మారినది మురిపెము
ఓ.....సంగీతమా!
పంతువరాళినే కొత్తపుంతలుగా సాగనీ
సరికాదను వారిని సడిసేయక సాగనీ
సరికాదను వారిని సడిసేయక సాగనీ
చెమ్మగిల్లి యుగళమై కొండకోన పాడినది
చెమ్మచెక్క తాళమై నింగినేల ఆడినది
బొమ్మరిల్లు రూపమై లోయహాయి కూడినది
అమ్మదొంగ అమ్మాయై కడలి అల ఓడినది
చెమ్మచెక్క తాళమై నింగినేల ఆడినది
బొమ్మరిల్లు రూపమై లోయహాయి కూడినది
అమ్మదొంగ అమ్మాయై కడలి అల ఓడినది
ఓ......సౌందర్యమా!
నీదైన ప్రవాహమే కలువల కాసారము
శ్రమైక జీవనమే సకలవేద సారము.
శ్రమైక జీవనమే సకలవేద సారము.
తెమ్మెరలై ప్రతినోట ఆమెపాట తాకినది
ఉమ్మడివై ప్రతిచోట పని-పాట సాకినవి
ఏమ్మహిమో ప్రసరిస్తూ ప్రతిపూట వేకువైంది
అమ్మాయిని సంస్తుతిస్తూ సకలము మోకరిల్లుతోంది
ఉమ్మడివై ప్రతిచోట పని-పాట సాకినవి
ఏమ్మహిమో ప్రసరిస్తూ ప్రతిపూట వేకువైంది
అమ్మాయిని సంస్తుతిస్తూ సకలము మోకరిల్లుతోంది
ఓ సాహితీ సౌరభమా!
అనుభవమే అనుభూతిగ భావితరము చేరనీ
తరిస్తూ,తరలిస్తూ తరాలు తరియించనీ.
తరిస్తూ,తరలిస్తూ తరాలు తరియించనీ.
( శ్రీ వర్ద్స్ వర్త్ గారి "ది సాలిటరి రీపర్" స్పూర్తితో)