Avakaaya jaaDi
ఆహా! ఆవ రుచి, అనమా మైమరచి
మాటవరసకునైనా..మనగలమా నిను విడిచి
ఆరు రుచులతో చవులూరు ఆవకాయ
అయినావమ్మ ఆబాలగోపాల శ్లాఘనీయ
మామిడిపై దండెత్తి మరుమాటలేక చేసి
ఉప్పుకారముల తగుపాళ్ళు చొప్పింప చేసి
తగిన దినుసులు తైలము చెలిమి చేసి
ఆవ ఘాటుతో వాటిని చాటుచేసి
ఆవకాయ అను పేరుకు పెద్ద పీట వేసి
ఉర్రూతలూగించు ఊరగాయ మన ఆవకాయ.
పింగాణి జాడిలో సింగారముగా పోతపోసి
వాసెన అను మేలిముసుగు సిగపైన వేసి
విస్తరిలోని ఆథరువులను తోసివేసి
వాసికెక్కినావమ్మా వైద్యునిగ ఆవకాయ
బోసినవ్వుల పాపాయి పోటి ముసలివారితోటి
దోసమెంచకు దొడ్డరుచికి నీకునీవే సాటి
అగ్రతాంబూలముతో అభినందనలు కోటి
ఆవకాయ !!!! నిన్ను పొగడ నేను ఏపాటి.
|
Comments
Post a Comment