Tuesday, January 30, 2018

TIRUPPAAVAI-INTRODUCTION

జై శ్రీమన్నారాయణ.
*****************
భగవత్ బంధువులారా!
మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.
ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో
.
" అందరికి వందనములు."
మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి,
" నీ పాదము పట్టి నిల్చెదను
పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అని పలికించినది.
అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,శ్రీ వ్రత శుభ సమయములో,"ఒక గోపిక అంతరంగం" అను దివ్య పరిమళ పారిజాత మాలను,"స్వామి కైంకర్యమునకై" అల్లుతోంది.ఇంతలోనే,ఇదేమి చోద్యమో! మాయా మోహితమైన (నా) అహంకారము దొంగలా ప్రవేశించి దోషములను ముళ్లను చేర్చుతోంది.
కావున సత్ చిద్రూపులారా! అన్యధా భావించక,మాలను సంస్కరించుటను," శ్రీ గోదా-రంగనాథుల సేవ" గా భావించి,సహకరించగలరని ఆశిస్తూ,
సవినయ నమస్కారములతో -మీ సోదరి.
సద్గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు.
( ఆండాళ్ తిరువడిగలే శరణం.)

TIRUPPAAVAI-01


 మార్గళి తింగళ్ మదినిఱైండ నన్నాళాల్
 నీరాడప్పోదు వీర్ పోదు మినో నేరి జైఈర్
 శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱు మీర్గాళ్
 కూర్వేల్ కొడుందొళినన్  నందగోపన్ కుమరన్
 ఏరారంద కణ్ణి యశోదై ఇళంశింగం
 కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ముగత్తాన్
 నారాయణనే నమక్కే పఱై తరువాన్
 పారోర్ పుగళ్ప్పండింద్ ఏలో రెంబావాయ్.

 ఓం నమో నారాయణాయ-1
***********************
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" గా మారినది
"విష్ణు చిత్తీయమై" శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
బ్రాహ్మీ ముహూర్తమనే సత్వగుణ ప్రధానమైన
సమ శీతోష్ణత గల " శ్రీ మహా విష్ణు మాసములో"
ధన్యతనందించ గలుగు "ధనుర్మాస వ్రతమైన"
అంగనలారా! మంగళ "శ్రీ రంగనాథుని సేవలలో"
భక్తి తత్పరతయే భవతారణ భాగ్యమైన
బాహ్యాభ్యంతర శుచియగు " భాగీరథీ స్నానములో"
"పర-రూప-విభవ-అర్చ-ఆంతర్యాది" రూపమైన
" ధర్మార్థకామమోక్ష" భాసురమను పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ "భక్తి"పూల మాలలతో నేడె
భావము
"మార్గళి" సుప్రభాత సమయము శుభ ప్రదమైన " శ్రీ వ్రతమును" మనందరము కలిసి ఆచరించుటకు సానుకూలముగా నున్నది.పరమ పావనమైన "శ్రీ గోదా-రంగనాథ" మూర్తులయందు విహరించుచున్న నా మనసు,పవిత్రమై,పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లుచున్న హారములను స్వామికి సమర్పించుటకు, చెలులారా!కదిలి రండి.తెల్లవారు చున్నది.

tiruppaavai-02

వైయత్తువాళ్ వీర్గాళ్ నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తు యిన్ర పరమ నడిపాడి
నెయ్యిణ్ణోం  పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మై ఇట్టెళుదోం మలరిట్టు నా ముడియోం
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్రోదోం
ఐ యమాం పిచ్చెయుం ఆందనైయుం కైకొట్టి
ఉయ్యు మాఱెణ్ణి ఉగంద్  ఏలో రెంబావాయ్

ఓం నమో నారాయణాయ-2
్్్్్్్్్్్్్్్్్్్్్్్
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది
"విష్ణు చిత్తీయమై" శ్రీ హరి సంకీర్తనమే కోరుతోంది
'పాలు-నీరు--దేహాలంకరణ" నిరాకరణమైన
పాలకడలి నాథుని '"వ్రత నియమ సం యమనములో"
నిస్తుల వైభవ స్తుతులే " కస్తూరి తిలకమైన"
నాసాగ్ర మౌక్తికమూర్తి భక్తుల " సత్య వాక్య పాలనలో"
హరిచందనమూర్తిని సంకీర్తించు "వేదాంత దేశికులైన"
సాధు సజ్జనుల సమర్పణము " సవినయ భిక్ష రూపములో"
కృతకృత్యులనొనరించు " నిత్య నిరంజనమైన"
"కాత్యాయినీ వ్రతమును" చేయుచున్న గోప కాంతలలో
"తెల్లవార వచ్చెనమ్మ" చెలులారా రారెతెల్లబరచగ "భక్తి" పూలమాలలతో నేడె.
భావము
వ్రత నియమానుసారము దేహాభిమానములేని వారియందు,సత్యవాక్య పరిపాలకుల లోను,సాధు పుంగవులకు అర్పించు సవినయ భిక్షలలోను,సర్వ సంపత్ప్రదమగు "కాత్యాయినీ వ్రతమును" చేయుచున్న గోప కాంతలలోను నిమగ్నమైన నా మనసు, మీతో కలిసి పాశుర పఠనము చేయుచు,భక్తి అను పూలను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు త్వరత్వరగా కదిలిరండి.తెల్ల వారుచున్నది.

( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TIRUPPAAVAI-03


 ఓంగి ఉంగళంద ఉత్తమన్ పేర్ పాడి
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీరాడినాల్
 తీంగిన్రి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్ దు
 ఓంగు పెఱుం శెన్నెలూడ కయలుగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱివందు కణ్పడుప్ప
 తేంగాదే పిక్కిరిందు శీర్ త్తములై పత్తి
 వాంగక్కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద  శెల్వం నిఱైంద్ ఏలో  రెంబావాయ్.



ఓం నమో నారాయణాయ-3
**********************
విచిత్రముగ నామది " శ్రీ విల్లి పుత్తూరు" గా మారినది"విష్ణుచిత్తీయమై" శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది.
పునీతులు-గోపికలు పురుషార్థ ప్రదమైన
పుణ్య స్నానములు చేయుచున్న తీర్థములలో
నింగి-నేల స్నేహముతో హితము రంగరించినదైన
పల్లెతల్లి పులకింతల పచ్చని పంట పొలములలో
నింగి-నేల-జలము దాగుడుమూతలాడుచున్నవైన
పారుచున్న సరసులోని చేపల కేరింతలలో
మరుగుజ్జు రూపమున ముజ్జగములు కొలిచిన వాడైన
ఆ వామనమూర్తి త్రివిక్రమ పరాక్రమములో

తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము

పుష్కర తీర్థములలోను,పంట పొలములలోను,వాటి మధ్యనున్న సరసులలో ఆడుచున్న చేపలలోను,మరుగుజ్జు రూపములో యాచకునిగా మారి ముజ్జగములను కొలిచిన వామన మూర్తి పరాక్రమములోను నిమగ్నమైన నా మనసు,మీ అందరితో కలిసి, పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను, స్వామికి సమర్పించుటకు, చెలులారా!త్వర త్వరగా కదిలిరండి.తెల్లవారు చున్నది.

( ఆండాళ్ తిరువడిగళే శరణం)

TIRUPPAAVAI-04

ఆళిమళైకన్నా! ఒన్రు నీకై  కరవేల్
ఆళిఉళ్ ఉక్కు ముగందు కొడు ఆర్తి ఏఱి
ఊళి ముదల్వ నురువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై పఱ్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని వలంబురిపోల్ నిన్ర అదిరింద్
తాళాదే శార్ఙ్ ముదైత్త సరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుం
మార్గళి నీరాడ మళిజింద్ ఏలో రెంబావాయ్.

ఓం నమో నారాయణాయ-4
*************************
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది
" విష్ణు చిత్తీయమై" శ్రీహరిని కీర్తించుటనే కోరుతోంది.
పాండవ రథ సారథి " శౌర్యపు గర్జనయైన"
కడలినీరు కడుపునిండ " గర్జనవలె త్రేంచు మేఘములో"
దుష్టశిక్షణార్థము " రాముని శరవేగ పోలికయైన"
వేగముతో వర్షించే " అలుపెరుగని మేఘములో"
శిశుపాలుని వధియించి శ్రీకరముగ" మెరయుచున్నదైన"
"సుదర్శన చక్రము" వలె " మెరయుచున్న మేఘములో"
" నామ,రూప,సారూప్యములు" అవిభాజ్యములైన
"సాక్షాత్ నీలమేఘ శ్యాముడైన" ఆ నీలి మేఘములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
శ్రీ కృష్ణుని పరాక్రమము వలె గర్జించు మేఘములో,రామబాణ వేగముతో సమానమైన వేగముతో వర్షించు మేఘములో,శిశుపాలుని వధించి,తెల్లనైన కాంతితో మెరయుచున్న సుదర్శన చక్రము వంటి మెరుపులున్న మేఘములో,ఇన్ని మాటలేల! సాక్షాత్ ఆ నీల మేఘ శ్యామునితో అభేదమైన ఆ నీలిమేఘములో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పూలను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించ, చెలులారా కదిలి రండి.తెల్ల వారుతోంది.
( ఆండాళ్ తిరువడిగళై శరణం )

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...