ఆదిత్యహృదయం-శ్లోకం-29
********************
ప్రార్థన
*******
'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం
తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాశం
అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."
పూర్వరంగం
**********
ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుట కు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు.
శ్లోకము
******
" రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్."
ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము.
దీనిలో దాగిన మర్మము మహాద్భుతము.
భగవద్గీతలోని గుణత్రయవిభాగమును మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే.
ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము.
రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు.
వీరిద్దరిలోను సమయానుకూలముగా త్రిగుణములు వాటి ప్రభావమును చూపిస్తున్నాయి.
తమో గుణము-మోహ కారకము.
రజోగుణము-కార్య కారకము,అంటే,
మానసికముగా నున్న మోహమును కార్యరూపముగా మలచుటకు సహాయ పడుతుంటుంది.ఈ రెండు గుణములు ఉదృతముగానున్నసమయములో సత్వగుణము సద్దుమణిగి యుంటుంది.
సత్వ గునము కర్మలను ఆచరిస్తుందికాని ఫలితములను ఆశించదు.ప్రకాశవంతము.స్థిరము.ధర్మావలంబము.
మనము గమనిస్తే ఈ మూడు గుణములు రాముని-రావణుని అనేక భావావేశములకు గురిచేసాయి.
కాకపోతే,
యుద్ధ ప్రారంభదశలో తమో గుణమోహితుడై,రావణుని ఏ విధముగా ఎదుర్కొనాలో తెలియక తికమకపడేట్లు రాముని చేసినది.తమోగుణము.రామునికి ధర్మస్వరూపమైన సీత మీద వీడలేనిమోహమును కలిగించింది.
అట్టి స్థితిలో తమోగుణము రజోగుణమునకు చేయూతనిస్తూ రాముని చింతాక్రాంతునిచేసినది.కాని,అగస్త్యభగవానుడు "ఆదిత్యహృదయ స్తోత్రమును ఉపదేశించి,
రాముని తేజోమయునిగా-ఉత్సాహ భరితునిగా-కార్యదక్షునిగా సత్వగుణముచే ప్రకాశించేసాడు.కనుకనే రాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో నున్నాడు.సత్వము తమో రజో గుణములను అణిచివేయగా సంకల్పించుకున్నది.సన్నద్ధమైనది.
కాని ,రావణుని పరిస్థితి దానికిపూర్తిగాభిన్నము.
ఒకానొకప్పుడు రావణుడు శివ తాందవ స్తోత్రములో సత్వగుణశోభితుడైనాడు.సదాశివుని భజిస్తూ,
1.దృషద్ విచిత్ర తల్పయో
2.భుజంగ మౌక్తికస్రజో
3.గరిష్ఠ రత్న లోష్టయో
4.తృణారవింద చక్షుషో అంటూ.
కటికనేలను-మెత్తటి పరుపుని,
పామును-ముత్యాల హారమును
రత్నమును-రాయిని ఎప్పుడు సమదృష్టితో చూడగలిగి,
విముక్త దుర్మతి నీకు,
శిరస్థం అంజలిం కురు అని వాపోయాడు.
కాని అది నిలువలేదు.
లంకకు తిరిగి వచ్చాడు.శూర్పణఖ మాటలు విన్నాడు.అంతే,
సీత పై మోహముగా తమోగుణము తైతక్కలాడించింది.అంతేకాదు సీతను అపహరించమంటూ రజోగుణాన్ని సైతము ప్రేరేపించింది.ఈ జంట రావణుని కడవరకు వీడలేదు.సత్వమును పైకి రానీయలేదు.ఒకవేళ అలాకనుకజరిగితే సీతమ్మను రామునికి అప్పగించేవాడే రావణుడు.
రాముడు తమోగుణమును దాటి-రజో గుణమును దాటి-సత్వగుణశోభితుడైనాడు.
రావణుడు సత్వమును విడిచి తమో-రజో గుణములకు వశుడై కీడు తెచ్చుకున్నాడని అర్థమగుచున్న వేళ,
తం సూర్యం ప్రణమామ్యహం.