చిదానందరూపా- జ్ఞాన సంబంధారు
*******************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివపాదహృదయాల్ భగవతి దంపతుల పుత్రుడు
సుబ్రహ్మణ్యాంశతో పుట్టెను శిర్కోలిలో ఒక శివ భక్తుడు
తండ్రి నదీస్నానపు నెపము,త్రావించెను బాలుని జ్ఞానక్షీరము
ప్రకటితమైనది వాగ్వైభవము,ప్రసిద్ధ "తొడుదయ సెరియల్" గ్రంథము
ఏడవ ఏట జరిపించిన ఉపనయ సంస్కారము,నేరుగా
చూపించినది ఎద నిండిన వేదాధ్యయనము
స్వస్థత చేకూర్చెగ రాజుకు సంబంధారు సంకీర్తనము
పరమపదమునందగ సరిగ పదహారేళ్ళే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
తిరుమారై జ్ఞానసంబంధార తల్లితండ్రులు శివపాద హృదయార్-భగవతియార్.సుబ్రహ్మణ్ యస్వామియే శిర్కళిలో
జ్ఞాన సంబంధారుగా తల్లి స్తన్యపానమునకై అవతరించారని ఆర్యోక్తి.హృదయార్ పూజాదికములను నిఎవర్తించుటకై నదీస్నానమునకు వెళుతూ కుమారుడైన జ్ఞానసంబంధారుని తనతో తీసుకొనివెళ్ళెను.తాను నీటిలో మునకలు వేసినపుడు కనిపించలేదని పిల్లవాడు భయపడతాడేమోనని స్పురించేలాచేసాడు శివుడు.తండ్రిగా ధైర్యము చెప్పుట తన కర్తవ్యమని,బాలుని దగ్గరకు పిలిచి,నాన్నా ఈ గుడిలోని పార్వతీపరమేశ్వరులు నీ నిజమైన తల్లితండ్రులు.నేను కనిపించక పోయినా,నీకు ఏమైనా కావలిసినా వాళ్ళను పిలువు అని చెప్పాడు.ఈశ్వరాజ్ఞ ఏమియున్నదో? ఎవరెరుగరు అన్నట్లు బాలుడు ఆకలి అంటూ అప్రయత్నముగా వారిని పిలిచాడు.
ఈప్సితమును తీర్చునది ఈశ్వర సంకల్పముకదా! షణ్ముఖునితో తీరని తల్లిప్రేమ సంబంధారును వరించినది.తరింపచేసినది తల్లి క్షీరపానము.లోక పూజ్యమగు "తొడుదయ సెవియాన్" ఆవిర్భావమునకు కావలిసిన వాగ్వైభవమును ప్రసాదించినది తల్లి.హృదయార్ స్నానము ముగించుకొని వచ్చి,బాలుని నోటికి యున్న పాలను చూసి,ప్రశ్నించగా వరప్రసాదుడు ఆకసమువైపు చూపుతూ అమృతగానము చేయ
సాగెను.ఏడు సంవత్సరముల వయసులోనే వేదమాత గాయత్రి అనుగ్రహముతో వేద-వేదాంత సారమును అవగతమొనరించుకొనెను.పాండ్యరాజు గారి అనారోగ్యమును నివారించుటకై శివనామ అమృత గుళికలనందించిన అపర ధన్వంతరి సంబంధారు.ఆ సర్వేశ్వారానుగ్రహముతో శివానురక్తుని చేసిన మహనీయుడు.వచ్చినపని పూర్తియైనదేమో పరమేశుడు పదహారు సంవత్సరముల వయసులో పరిణయమును చేసి దంపతులను ధన్యులను చేసెను.సర్వ సాక్ష్యైన సదా శివుడు మనతో ఉండి మనలను ఎల్లవేళల రక్షించును గాక.