Thursday, July 8, 2021

0003

  


 ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-03

 ***************************


 నన్ను వెంటాడుతు,నాతో ఆడుకుంటున్న ఆలోచనలను అర్థము చేసుకోవడము ఎలా?

 పూలలోనికి రంగులు ఎందుకు/ఎలా వస్తున్నాయి? వచ్చినవి నిలవకుండ ఎందుకు వాడిపోతున్నాయి?


  పూలకే కాదు పండ్లకు-సకలమునకు రంగురూపులను అందిస్తూ,వాటిని కొనసాగనీయకుండా హరించివేస్తున్నది ఎవరు?



  మన శరీరాకృతిలో మార్పులను తెప్పిస్తున్నది ఎవరు? మనలను పక్కకు దొర్లునటుల పారాడునటుల,లేచి నిలబడునటుల, తప్పటడుగులు వేస్తూ,కింద పడుతు లేస్తూ నడుచునట్లు చేస్తున్నది ఎవరు? ఏడుపు ఒక్కటే చేతనైన మన గొంతు అనేక శబ్దములతో పాటు,ఎన్నెన్నో భాషలను  ధారాళముగా ఎలా మాట్లాడగలుగుతున్నది.ప్రతి అవయవము అవసరమైనప్పుడు మాత్రమే దానిలోనికి శక్తినెలా తెచ్చుకుంటున్నది.ఏమిటి ఈ మాయాజాలము?




  


  పసికందుగా కదలలేని కాళ్ళు-అవయములు (కొందరిలో మాత్రమే) అద్భుత నాట్య భంగిమలను ప్రదర్శింపకలుగుతున్నవి.కాని కొంతకాలము మాత్రమే.

గట్టిగా వస్తువును పట్టుకోలేని చేతులు పెద్ద పెద్ద బరువులను ఎత్తుతు బహుళజనాదరణను పొందుతు ప్రస్తుతింపబడుతున్నవి.అద్భుత చిత్రలేఖనమును,శిల్పకళా వైభవమును ఇలా ఎన్నెన్నో అద్భుతముకను అందించగలుగుతున్నాయి.

ఒకరిలో కంఠము గొప్ప ప్రాభవమును (గానము-మిమిక్రి -గాత్ర దానము)ప్రదర్శించగలిగితే,మరొకరిలో వేరొక ఇంద్రియ పత్యేకత.అరవైనాలుగు కళల అద్భుతములు ప్రదర్శించు శక్తి వారికి కాలపరిమితిని నిర్దేశించి,ఆ తరువాత తాను వారిని వీడిపోతుందా?లేక వారే దానిని కూడి యుండలేక పోతున్నారా?


  క్రమముగా అభివృధ్ధిని చెందుతు క్షణక్షణముగా అవి ఎందుకు క్షీణిస్తున్నవి?


  అవి ఎందుకు అలా నిస్సహయముగా నిర్మూలనమును పొందుతున్నవి.


 ఎంతో ప్రగతిని సాధించాననుకొంటున్న మానవులు సైతము క్రమక్రమముగా ఎందుకు తమ నిస్సహాయతను నిరోధించలేక ప్రేక్షకులై, పరాధీనులవుతున్నారు?


  -అంటే,

 మనము అనుభవిస్తున్న ఈ  గుణ-దోషములు-  రూప-లావణ్యములు,అహంకార-మమకారములు-శక్తి-సామర్థ్యములు జనన-మరణములు అను నామరూపములను

                మనము ఎవరి నుంచో/ఎక్కడినుంచో కొంతకాలము వరకు మాత్రమే అప్పుతెచ్చుకుంటున్నామా?ఎవరో వాటిని కరుణతో కొంతకాలమునకు మాత్రమే మనలోదాగి ప్రకటింపచేస్తున్నారా?సమయము మించినదని తిరిగి హరించివేస్తున్నారా?


   అయితే మనము ఆశ్రయించిన ఈ ఉపాధి,

 "శక్తిని ప్రకటింప చేసే పరికరము మాత్రమేకాని/ శక్తి కాదా?"

  **************************************************




 ఏమిటి ఈ విచిత్రము? ఎవరు దీనినిప్రసాదిస్తున్నారు. తిరిగి పరిగ్రహిస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు.?


 చిత్ శక్తి-




 సామాన్యశక్తికి అతీతముగా/అద్భుతముగా ఏ ఉపాదానకారణము లేకుండానే,

 స్వయం సమర్థమై, తన కనుసన్నలతో ఈ కాలచక్రమును పరిభ్రమింపచేస్తు.దానితోపాటుగా మనలను ప్రయాణింపచేస్తున్నదా?


 అదేకనుక నిజమైతే దానిని   గుర్తించగలమా?

 గుర్తించి-గౌరవించుటకు జీవునకు అవసరమైన-అవ్యాజమైన అనుగ్రహము అత్యవసరము కదా.ఒక వేళ లభించినను అది నాకు,

 మార్గదర్శకమవుతుందా?

 నన్ను సందేహ సందోహములనుండి సంస్కరిస్తుందన్న ఆశతో  నన్ను,        నా పరిశీలనకు ఆ పరమాత్మ పరిష్కారములను చూపి,నన్ను-మనలను ఆశీర్వదించును గాక.



  పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.

    కరుణ కొనసాగుతుంది.





0002

  




 ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-02


 ****************************




  అలా ఆలోచనలతో తోటలోకి అడుగులు కదిపానో లేదో నా దృష్టి నిన్న నన్ను స్వాగతించిన గులాబీల మీద పడింది.




 అంతే వేగముగా నన్ను అంతర్మథనములోనికి తోసివేసింది.




  మొన్నటి రోజున అవి మొగ్గలు.అంతకు ముందు అవి చెట్టు లోపల ఎక్కడ దాగి ఉన్నాయో,వాటికి,వానిని దాచుకున్న ఆ గులాబీ మొక్కకే తెలియాలి.




   నిన్న అరవిచ్చిన రేకులతో,విరబూసిన సోకులతో,రంగుల హంగును సింగారించుకొని,మురిసిపోతు విరిసినాయి.




 ఎంతటి ఆకర్షణీయము వాటి సౌందర్యము.


 ఎంతటి ఆఘ్రాణనీయము వాటి పరిమళము.




  ఒకేసారి తమ పరిపూర్ణతతో కన్నులను,పరిమళముతో మనసును ఆస్వాదించమంటు

ఆహ్లాదపరిచాయి.






 ఇంతలోనే ఎంతమార్పు? 


  రేకులతో పాటు సోకులు నేలరాలినవి.


 ఎక్కడికి పోయినది వాటి  నామరూప గుణ వైభవము?


 ప్రత్యేకతలైన రంగు-రూపు-పరిమళములతో కూడిన ఆకర్షణ?




 మార్పుకు కారణమైన కూర్పును చేసినదెవరు?




   వాటి అవస్థలను బట్టి లేత మొగ్గ,మొగ్గ,విసనమునకు సిధ్ధముగా నున్న మొగ్గ,అరవిరిసిన పువ్వు,వాడిన పువ్వు,నేలరాలిన పువ్వు గా నిర్మించి,నిర్ధారించినది ఎవరు?


 

  మనలో కాలక్రమేణ జరుగుచున్న మార్పులకు కారణమెవరు? శైశవము-బాల్యము-కౌమారము-యవ్వనము-వృధ్ధాప్యము-పండు ముసలితనము-పరిసమాప్తము అంటు కాలముతో పాటుగా మనలను వివిధ దశలలోకి నెట్టివేస్తున్నది ఎవరు?


  హెచ్చుట తగ్గుట కొరకే అను సిధ్ధాంతమును గుర్తుకు తెప్పిస్తున్నది ఎవరు?


  ఇచ్చినవారికి తప్ప తిరిగి తీసుకునే అవకాశము/అధికారము ఎవరికి ఉంటుంది?


  మనలాగానే అవి కూడ తమతో పాటుగా వైభవమును తెచ్చుకోలేవా? వైభవము తమను విడివడుతున్నప్పుడు ......



 అయితే అవి ఏవి వాటి స్వయం శక్తులు కావా? అందుకే అవి తమను వీడిపోతున్నపుడు నిస్సహాయమైనవా.నిర్వాణమో/నిర్యాణమో!






  ఆ గులాబి మొక్క నాకు ముళ్ళు వద్దు కేవలము పూలు మాత్రమే పూయిస్తాను అని ఎందుకు అనుకోలేక పోయింది?




  ఈ పూలు-ఈ పళ్ళు-ఈ మొక్కలు స్వయముగా ఆ అందమును-ఆకర్షణను పొందిలేవా? వాటి స్వంతమైతే అవి తమ నుండి దూరమవుతుంటే

 అవి ఎందుకు నిస్సహాయముగా కనుమరుగవుతున్నాయి?




   పువ్వులే కాదు పండ్లు కూడ,


 పిందె-కాయ-పండు-మిగుల పండిన పండు-కుళ్ళిన పండు-వ్యర్థము ఇలా వివిధ దశలను పొందుతుఆదరించిన వారిచే త్యజించ బడుతున్నాయి?




 వాటిలో ఆ పరిమాణమును-పరిణామమును కల్పించుచున్నదెవరు?


 కనువిందునకు-కను మరుగునకు కారణమైనదెవరు?




   పరిపరి విధములైన ఆలోచనలతో పరుగులు తీస్తున్న నా మనసుకు,


 ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్" పరిష్కారమును చూపుతుందని ఆశిస్తున్న. నన్ను,మనలను ఆ పరమేశ్వర కృప ఆశీర్వదించును గాక.






  పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.

కరుణ కొనసాగుతుంది.








   


0001

 


   ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-01

   *******************************


 హోరెత్తిన సముద్రపు అలల వలె అరసెకను ఆగకుండా,నాలో  ఆలోచనలు జోరు మీద ఉన్నాయి.


  నన్ను నేను చూసుకుంటుంటే దూసుకుని వస్తున్నాయి.


 ఎంత విచిత్రము ఈ మానవ ఉపాధి?ఉపాధి.


  ఒక బొట్టుగా తల్లిగర్భము లోనికి పవేశించి,బుడగగా మారి,ఎన్నో సంఘర్షణలను ఎదురుకుంటూ,క్రమక్రమముగా ఒక ఉపాధిని(రూపును) సంతరించుకుని,ఒకేఒక శబ్దమును (ఏడుపును) మాత్రము తనతో వెంటబెట్టుకుని వస్తుంది ఏదో సాధించేయాలని,ఎందరో తనను మెచ్చుకోవాలని ఎలా సాధించాలో ఏ కోశానలేని ఆశలరాశియై.


  వెన్నెముక అడ్దముగానే ఉండి,తాను నిలబడలేదు.పొరలతో కప్పియున్న కనులు వేనిని సరిగా చూడలేవు.మలమూత్ర విసర్జనలలోనే కదలలేక-మెదలలేక  మలినపడుతు-మథనపడుతూ.అసహ్యమైనా-అసహనమైనా.




  ఏమి చూసుకొని దానికంత ఉత్సాహము? 


  అమ్మను పిలవాలన్నా-అనుకున్నవి చేయాలన్నా దానికున్న ఒకేఒక ఆయుధము-ఆసరా ఏడుపు ఒక్కటే.


     గమ్మత్తు.దీనిపై ఎవరు ఎపుడు ఏ మంత్రము వేస్తారో కాని,ఇంద్రియములతో సందడి మొదలు పెడుతుంది మెల్లమెల్లగా.


   పొరలు వీడిన కన్నులు అన్నింటిని చూస్తూ ఆనందించడం మొదలుపెడతాయి చెవులు అమ్మ జోలకై ఎదురుచూస్తుంటాయి.జిహ్వ కొత్తరుచులను పరిచయం చేసుకుంటుంది.ముక్కు నిక్కచ్చిగ మలమూత్రములకు దూరము జరుగమంటుంది.స్పర్శ అమ్మ ఎవరో/అన్యులెవరో ఇట్టే గుర్తుపడుతుంది.


  పాకుతు-పడుతు-లేస్తు,తప్పటడుగులు వేస్తూ కప్పబడియున్న దారులను వెతుకుతుంది.


  ఇదే అదనుగా గుణములు అనుగుణముగా అనిపిస్తూనే,అసలు ఆటను ప్రారంభిస్తాయి.


   ఇంతవరకు బాగానే ఉంది.అలాగే నా సందేహముకూడా కప్పబడియున్న పరిష్కారమును వెతకాలనుకుంటుంది.అదేకదా చిక్కు.


   ఈ ఇంద్రియ వైభవము-గుణ స్నేహితము 


 నా స్వంతమేనా?


  లేక సమయ-సందర్భానుసారముగా ఎవరిచేతనైన తగినంత మోతాదులలో తరలింపబడుతున్నాడా?


     నా స్వంతమే అనుకోండి కాసేపు-అయితే నేను వాటిని నాతో పాటే,నావెంట ఎందుకు తెచ్చుకోవటములేదు? వాటంతట అవి వచ్చి నన్ను చేరేదాకా ఎందుకు అవస్థలు పడుతు నిరీక్షిస్తున్నాను?


  తలెత్తిచూసే సరికి పండిన జుట్టు-ఎండిన పతుతో కర్రను తన నడకకు ఆసరగా,కళ్ళజోడును తన చూపుకు తోడుగా తీసుకుని వస్తూ,


  మరిన్ని సందేహములను నాకు అందిస్తూ కనిపించాడు.


  సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.


  కరుణ కొనసాగుతుంది.


  

 


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...