Saturday, May 30, 2020

OM NAMA SIVAAYA-31


  ఓం నమః శివాయ-31
  ********************

 కళల మార్పు-చేర్పులతో కదులుచున్న చంద్రుడు
 నీ సిగముడుల చీకట్లలో చింతిస్తు ఉంటాడట

 కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
 నీలలోహిత చీకట్లలో చింతిస్తు ఉంటాయట

 కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
 తెరతీయని చీకట్లలో చింతిస్తు ఉంటుందట

 ఆకాశము నుండి సాగి,జార అవకాశములేని గంగ
 బందిఖాన చీకట్లలో చింతిస్తు ఉంటుందట

 చీకటిని తొలగించలేని చిత్ జ్యోతి శివుడేనట
 చింతలు తొలగించలేని వింతశక్తి శివుడేనట

 దోషము తొలగించలేని వానికి ప్రదోషపూజలా అంటు

 వెక్కిరిస్తున్నారురా  ఓ తిక్కశంకరా.


 శివుడు చంద్రుని కళల మార్పును అరికట్టలేడు.పాముల కుబుసములను కూడ సవరించలేడు.మూడో కన్నుకు కుదురునివ్వలేడు.గంగను సైతము తన జటలలోని చీకట్లలో బంధించి,వెలుగును చూపలేక పోతున్నాడు.కాని తాను మాత్రము జ్యోతిర్లింగమునని ,దోషరహితుడనని చెబుతూ,ప్రదోష పూజలను అందుకుంటాడు.దోషమూను పదమును చీకటి-పాపము అను అర్థములలో కూడ అలంకారికులు ప్రయోగిస్తారు.(చీకటి ఆవరించుటకు ముందుకల సమయము ప్రదోషము) చీకట్లను తొలగించలేని శివుడు తాను దోషరహితుడనని చెప్పుకుంటూ ,ప్రదోషపూజలను అందుకుంటాడు.-నింద.

 తిమిరం-నమః శివాయ-తిరిపం- నమః శివాయ
 త్రిదళం నమః శివాయ-త్రిగుణం- నమః శివాయ.

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


  "ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్న శివః
  సోమః సద్గుణ సేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః"

   శివానందలహరి.

 పూర్వపుణ్యమనే తూర్పుకొండపై వెలుగొందు అమృతస్వరూపుడు-ప్రసన్నుడు-శుభకరుడు-సద్గుణవంతులచే పూజింపబడు మృగధరుడు చీకట్లను పూర్తిగా తొలగించి, ప్రకాశించుచు మనలనందరిని పరిపాలించును గాక.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.














































































































OM NAMA SIVAYA-30



ఓం నమ: శివాయ-30
*****************
ఆపివేయ పలికినదియేగా "శివతాండవ స్తోత్రము"
శాపమీయ పలికినదియేగా "శివ మహిమ స్తోత్రము"

కనకాభిషేకమునకై కదిలినదేగా" కాశీఖండము"
వీర శైవ ఉన్మాదమేగ" బసవ పురాణము"

శాశ్వత స్థావరమునకేగా "శంకరాచార్య విరచితములు"
మేక మేథ బోధలేగ "నమక చమక స్తోత్రములు"

దిగ్గజ అక్కజమేగా" శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యము"

అడిగి ఆలకిస్తావు ఆనంద భాష్పాలతో
అతిశయముగ చూస్తావు హర్షాతిరేకముతో

"నిష్కళంక మనసు" నిన్ను కొలిచినది" శూన్యము"
యుక్తితో ముక్తి కోరువారిని "నీ భక్తులు" అను మాయలో
చిక్కు కున్నావురా! ఓ తిక్క శంకరా.

భావము

రావణుని కైలాస ప్రవేశము చేయనీయనపుడు ప్రవేశమునకైరావణుడు శివ తాండవ స్తోత్రమును పలికెను(రుద్రవీణ)(అహంకారముతో)
పుష్ప దంతుడు అను గంధర్వుడు తిరిగి తన శక్తులను పొందుటకు శివ మహిమ స్తోత్రమును రచించెను.(స్వార్థముతో)
శ్రీనాథుడు రాజాస్థానముచే కనకాభిషేకమును ఆశించి కాశిఖండమును రచించెను.(కీర్తి కొరకు)
బసవడు అన్యదైవ దూషణ అను మనో వికారముతో బసవ పురాణమును రచించెను.(వీర శైవ ఉన్మాదము)
ఆది శంకరులు తమ వాగ్వైభవమునకు శాశ్వతత్వమును ఆపాదించుటకు అనేక స్తోత్రములు చేసిరి.(లుప్తాయచ-వ్యోమ కేశాయచ)
మేకతల మేధస్సు నుండి జనించినవి నమక చమక స్తుతులు.(గుడ్డిగా మందను అనుసరించుట మేక స్వభావము)
వీరందరు భక్తితో తనను స్తుతిస్తున్నారని పొంగిపోవుట శివుని తెలివితక్కువ తనము-నింద.


నృత్యం నమః శివాయ-కృత్యం నమః శివాయ స్తోత్రం నమశివాయ-సోభ్యం నమః శివాయ ( సోభ్యం-పుణ్య-పాపములయందు సమభావము) నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

" నమః అనిర్హతేభ్యః" రుద్ర నమకం. అంతటను నిశ్శేషముగా పాపము ఎవరిచేత హతమగునే వారే అనిర్హతులు.పాపములను ఆసాంతము తొలగించువారు.బుధ్ధి వివేకమును ప్రసాదించువారు.వారి అనుగ్రహ వీక్షముతో శివతత్త్వము కన్నులకు సాకారముగా గోచరించును.సవినయులై వారు, "మీడుష్టమ "శివతమ" సివో న స్సుమనాభవ" రుద్ర నమకం శివా! నీవు శివతముడవు.శివము-శివ తరము-శివ తమము.(అత్యధికము.ఇదియే శేవధి-హద్దు.శుభములను లెక్కలేనంతగా ఇచ్చువాడవు.అంతేకాదు.సుమనా భవ ఓ భవుడా నీవు సుమనస్కుడవు.నీ మంచి మనసు,కొలతకు రాని నీ శుభకర ప్రసాదగుణము "న" మామీద,మీడుష్టమ వర్షించనీయి తండ్రీ.నీకు నమస్కారములు.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.





OM NAMA SIVAAYA-29

ఓం నమ: శివాయ

"కుమ్మరివి నీవంటే" ఓటికుండ నవ్వుకుంది
"కమ్మరివి నీవంటే "లోహము నమ్మకమే లేనంది

"వడ్రంగివి నీవంటే" కొయ్యముక్క అయ్యో అంది
"విల్లమ్ములు నీవంటే" రెల్లుపూజ చెల్లు అంది

"పైరు పచ్చ నీవంటే" పంట-పంటలేసుకుంది
"వైద్యుడివి నీవంటే" ఔషధము నైవేద్యాలే అంది

"గురువువి నీవంటే" స్వరము విస్తుపోయింది
"చల్లని ఇల్లు నీవంటే "ఇల్లరికము ఇదే అంది

"నమో విరూపేభ్యో విశ్వ రూపేభ్యో" అని అనగానే
"అన్ని రూపములు నీవేనని" ఆరోపించుకుంటుంటే ,నీతో
చిక్కేనురా ఎప్పుడు ! ఓ తిక్క శంకరా.

భావము

మట్టికి,లోహమునకు,మందులకు,విల్లమ్ములకు,శ్మశానమునకు,శిష్యులకు,కైలాసమునకుశివుని పనితనముపై నమ్మకము లేక అవి బాధపడుచున్నాయి-నింద.

OM NAMA SIVAAYA-28

  ఓం నమః శివాయ-28
 *******************

   పాశము విడువనివాడు యమపాశము విడిపించగలదా
   గంగను విడువనివాడు నా బెంగను తొలగించగలడా

  మాయలేడిని విడువనివాడు మాయదాడిని ఎదిరించగలడా
  పాములు విడువని వాడు పాపములను హరించగలడా

  విషమును విడువనివాడు మిషలను కనిపెట్టగలడా
  ఉబ్బును విడువని వాడు నా జబ్బును పోగొట్టగలడా

  నృత్యము విడువని వాడు దుష్కృత్యములను ఆపగలడా
  భిక్షాటన విడువని వాడు దుష్టుల శిక్షించగలదా

  చిన్ముద్రలు విడువనివాడు  ఆదుర్దా గమనించగలడా
  వింతరాగమున్నవాడు వీతరాగుడవుతాడా

 భోళాశంకరుడనుట వేళాకోలమునకేనా?అంటు
 బుగ్గలు నొక్కుకుంటున్నారురా ఓ తిక్కశంకరా.

 శివుడు చిన్ముద్రస్థితిలో ధ్యానముచేసుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికిని,తన పాశము-పాములు-వాటి విషము-గంగ-మాయ అనే లేడి-గంతులేయటం-బిచ్చమెత్తటం మొదలగు వాటిమీది అంతులేని ప్రేమతో వాటిని విడిచిపెట్టి ఉండలేక పోతున్నాడు.పైగా నేను విరాగిని-భోళాశంకరుడిని అని చెప్పుకుంటుంటాడు.-నింద.

 వేదం  నమః శివాయ--వేషం  నమఃశివాయ
 నృత్యం  నమః శివాయ-కృత్యం నమః శివాయ.
 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.















OM NAMA SIVAAYA-27

  ఓం నమః శివాయ-27
 ***********************

  ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని
  అమావాస్య జననానికి ఆనందపడతావు

  విడ్డూరము ఏమోగాని వివరమసలే తెలియని
  గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు

  పూర్వపుణ్యమేమోగాని పువ్వులసలే తెలియని
  మారేడు దళాలకు మహా ఆనందపడతావు

  ఇంద్రజాలమేమోగాని అందమే తెలియని
  బూదిపూతలకు మోదమెంతో పొందుతావు

  నీదయ ఏమోగాని నియమపాలనయే తెలియని
  నికృష్టపు భక్తులను నీదరి చేర్చుకుంటావు

  కనికట్టో ఏమోగాని అసలు నీ జట్టే తెలియక
  ఒక్కడిగా నున్నానురా ఓ తిక్కశంకరా.



 శివుడు లోపభూఇష్టములను బహుప్రీతితో స్వీకరిస్తాడు.పైగా దానిని తన గొప్పదనముగా చెప్పుకుంటాడు.నలుగురు నవ్వుతారనుకోడు.కనుకనే అమ్మావాస్య చీకటిలో పుట్టానని అతిసంబరంగా చెప్పుకుంటాడు.అహంకారియైన గంగను నెత్తిమీద పెట్టుకున్నాడు.పుష్పించుట తెలియని మారేడు చెట్టు దళములను మహదానందముతో స్వీకరిస్తాడు.బూడిదను పూసుకుంటు తనకు ఇష్టమని బూటకపు మాటలాడుతాడు.పోనీలే తన శరీరము తన ఇష్టము ఏమైన చేసుకోనీ మనకు వచ్చిన నష్టమేమిటని ఊరుకుందామా అంటే,పరమ నికృష్టులకు పరమపదమునందిస్తుంటాడు పతిత పావనులను నిర్లక్ష్యము చేస్తూ,-నింద.

  లోపం నమః శివాయ-లోకం నమః శివాయ
  రీతి నమః శివాయ-ప్రీతి నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
మురుగ్గ నాయనారుతొండైనాడులోని తిరువెర్కాడులో జన్మించెను.చిన్నప్పటి నుండి శివ భక్తుడు.శివ భక్తులకు మధుర పదార్థములను వడ్డించి,వారు తృప్తిగా తినుటనుశివారాధనగా భావించెడివాడు. కపర్ది పరీక్ష అనగా కలిమిహరించుకుపోయినది.కాని కలిమి దూరమైనను శివ సంతర్పణల చెలిమిని వీడలేదు. శివభక్తులకు అన్నసంతర్పణలు ఆగిపోలేదు..మంచుకొండవానిమీద భక్తి ధనార్జనకు మంచిచెడుల విచక్షణను చేయనీయలేదు.అన్ని దానములలో అన్నదానము గొప్పదని ఆర్యోక్తి.
శివ సంతర్పణములకు కావలిసినధనమునకై చతుషష్టి కళలలో ఒకటైన జూదమును ఎంచుకొని,నిష్ణాతుడైనాడు.మంచు కొంద దేవుని మీది భక్తి మంచి-చెడుల విచక్షనను మరచినది.అందరిని జూదమాడుతకు పిలువసాగాడు.రానన్న వారినినిర్బంధముచేయసాగాడు.ఎక్కువ సొమ్మును పందెముగా ఒడ్డమనే వాడు.ఓడిన,ధనమును నిర్దాక్షిణ్యముగా తీసుకోసాగాడు.
ధనమును ఈశ్వరార్చనకు ఉపయోగించెడివాడు.తనకొరకు అసలు వినియోగించెడివాడు కాదు.జూదగాడిని మెచ్చిన శివుడుగా సుందరారుచే కీర్తింపబడినాడు.వేదపురీశ్వర ఆలయములోమూర్ఖ నాయనారు విగ్రహము కలదు.కార్తీక మూలా నక్షత్రమునందు భక్తులచే పూజలందుకొనుచున్న నాయనారును అనుగ్రహించిన నాగాభరణుడు మనందరినిరక్షించునుగాక.

( ఏక బిల్వం శివార్పణం.)










OM NAMA SIVAAYA-26

  ఓం నమః శివాయ-27
 ***********************

 మన్మథబాణము అంటే మాయదారి భయము నీకు
 కోపము నటించి వానిని మాయము చేసేసావు.

 కోరికలతో కొలుచువారంటే కొండంత భయము నీకు
 చేరువుగా రాకుండా పారిపోతు ఉంటావు

 అహముతో కొలుచువారంటే అంతులేని భయము నీకు
 దారి ఏదిలేక వారికి దాసోహము అవుతావు

 సురలందరు కొలువగ కలవరమగు భయము నీకు
 అనివార్యము అనియేగ గరళకంఠుడిగా మారావు

 ధరించినవాటిని దాచలేని భయము నీకు
 జగములు గుర్తించకుండ లింగముగా మారావు

 " నమో హిరణ్యబాహవే-సేనాన్యే" అని విన్న,నా
   బిక్క మొగమును చూడరా ఓ తిక్కశంకరా.


 మన్మథబాణప్రభావమును ఎదిరించలేక పిరికితనముతో మన్మథుని కాల్చివేసాడు.వరములకొరకు తన దరి చేరు వాని నుండి తప్పించుకొనుటకై మద్యపానము చేస్తూ,మగువతో క్రీడిస్తున్నట్లు వారిని భ్రమింపచేసి ,వారిని దూరముగా పంపించివేస్తాడు.(బ్రహ్మను తదితరులను.తప్పనిసరి పరిస్థితులలో పిరికివాడైన శివుడు చప్పుడు చేయక కష్టమైనప్పటికిని వారు చెప్పినదే చేస్తాడు.అంతెందుకు తన దగ్గర నున్న గంగ-జాబిలి-శూలము-లేడి మొదలగు వాటిని ఎవరైన దొంగిలిస్తే,వారినెదిరించుట కష్టమని,ముందరే తాను లింగముగా మారి ఎవరికి ఏమీ కనిపించకుండా చేస్తున్నప్పటికిని,రుద్రము బంగారు చేతులు గల రుద్రా నీ సేనాధిపతివి అని కీర్తిస్తుంటే ,ఆనందంతో అంగీకరిస్తాడు-నింద.


  " బీరం నమః శివాయ-వీరం నమః శివాయ
    లింగం నమః శివాయ -లీల నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

  " నమః శూరాయచ-అవభిందతేచ"
   
        రుద్రనమకము.

  సకలలోకములు సదాశివుని బాహువులను హిరణ్యబాహవే" అని ప్రత్యేకించి కీర్తిస్తున్నవి.అవి హితమును-రమ్యత్వమును అందించు బాహువులు.

అట్టి   హిరణ్య బాహువులు కలిగిన శివుడు జగద్రక్షణ అను యుధ్ధమునకు సేనాని అయినాడు.దుష్టశిక్షణ-శిష్ట రక్షణ అను దీక్షను స్వీకరించినాడు.తత్ఫలితముగా భక్తులయొక్క శత్రువులను అప్రయత్నముగా ఛేదించుచు -అవభిందుడిగా తన శూరత్వము చేత ధర్మమునకుగ్లాని
  కలిగించబోవు బాహ్యశత్రువులను-అంతః శత్రువులను అవలీలగ అంతమొందించుచు (త్రిపురాసుర  సంహారము)
,లోకకళ్యాణమును గావించుచున్నాడు.-స్తుతి.

  ఏక బిల్వం  శివార్పణం.








OM NAMA SIVAYA-25

ఓం నమ: శివాయ-25
 *********************
శ్రీకరుడౌ శివునికి కరివదనుని ప్రస్తుతి
షదక్షరీ మంత్రధారికి షణ్ముఖుని ప్రస్తుతి
ఆనంద తాండవునికి ఆ నందిముఖుని ప్రస్తుతి
హరోం హర దేవునికి హయ వదనుని ప్రస్తుతి
శుభకర శంకరునికి శుకవదనుని ప్రస్తుతి
శితికంఠ వదనునికి సిమ్హవదనుని ప్రస్తుతి
కపర్ది నామధారికి కపివదనుని ప్రస్తుతి
మేనక అల్లునికి మేషవదనుని ప్రస్తుతి
ఆపదోద్ధారకునికి ఆ పతంజలి ప్రస్తుతి
బ్రహ్మాండ నాయకునికి బహు ముఖముల ప్రస్తుతి
నాపై కరుణచూప నీవు సుముఖముగా లేకుండుట,నీ
టక్కరితనమేరా ఓ తిక్క శంకరా


..వినాయకుని ఏనుగుతల,తుంబురుని గుర్రముతల,శుక మహర్షి చిలుకతలనరసిమ్హస్వామి సిమ్హపుతల,నారదుని కోతి తల,దక్షుని మేకతల,పతంజలి మనిషితల..పాము శరీరము,కుమారస్వామికి ఆరుతలలు.వీరిలో ఎవరు పరిపూర్ణ మానవరూపముతో లేరు.తలవేరు-శరీరము వేరు.అయినా శివుడు వారి పూజలను స్వీకరిస్తు పూర్తి మానవరూపములో నున్న నాపూజను స్వీకరించుటకు ఇష్టపడకపోవటము నింద


 

 స్మరణం నమః శివాయ-శరణం నమః శివాయ
 అభయం నమః శివాయ-అఖిలం నమః శివాయ



  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

"నమో రుద్రాయ ..త తావినే క్షేత్రాణాం పతయే నమ:" రుద్రనమకం.

 క్షేత్రములనగా శరీరములు.శరీరములతో జీవుని రూపమున నివసించు దేవుని రూపమును రక్షించువాడు పరమశివుడు.

ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోఽధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ .

మంత్రపుష్పము.

 బ్రహ్మం అనగా ఉన్నది అను అర్థమును పెద్దలు చెబుతారు.అనేక నామ రూపములతో-స్వభావములతో నున్న సకల జీవులు శివస్వరూపములే అని,వారిని శక్తి వంతము చేయుచున్నది ఈశ్వరచైతన్యమేనని మంత్రపుష్పము వివరించుచున్నది.పశుపతికి పశుముఖముల స్తుతి అభ్యంతకరము కానేకాదు.



.భక్తి ప్రధానముగాని భక్తుల రూపము శివునికి ప్రధానము కాదు.స్తుతి 

  ఏక బిల్వం శివార్పణం
తక్కువ చూపు

OM NAMA SIVAYA--24

ఓం నమ: శివాయ-24
******************
నేను అభిషేకము చేస్తుంటే అభినివేశము ఏది? అంటావు
నేను దీపారాధనము చేస్తుంటే భక్తి ఉద్దీపనము ఏది? అంటావు
నేను చందనము అలదుతుంటే అలదే చందమా? అంటావు
నేను పూలహారములు వేస్తుంటే పాపపరిహారములా! అంటావు
నేను మహన్యాసము చదువుతుంటే చాల్లే! అపహాస్యము అంటావు
నేను ఆరగింపు చేస్తుంటే పండ్లను ఏరలేదా? అంటావు
నేను హారతులను ఇస్తుంటే సేవానిరతి ఏది? అంటావు
నేను మంత్రపుష్పము అందిస్తే, సంపెంగ పుష్పము అంటావు
నేను సకల ఉపచారములు చేస్తుంటే త్రికరణ ఏది? అంటావు
నేను శక్తి కొలది పూజచేస్తే అనురక్తి లేదు అంటావు
నువ్వు సంతుష్టి చెంది,పరిపుష్టిని అనుగ్రహించేందుకు భక్తి అనే
రొక్కమెంత కావాలిరా ఓ తిక్క శంకరా.
..................................................................................................................................................................................................... కార్తీక సోమవార పూజా విధానములో ఒక భక్తుని శివుడు తనకు దీపమును ఆసక్తితో వెలిగించలేదని గంధమును ఆరాధనతో అలంకరించలేదని,పాపములను శివుడు పోగొడతాడనే వ్యాపార ధోరణిలో పూల హారములను సమర్పించాడని,మంచి ఫలములను ఏరి సమర్పించలేదని
త్రికరణ శుద్ధిగా మహన్యాసమును చదవలేదని,మకరందము లేని సంపెంగ పుష్పమును మంత్ర పుష్పముగా సమర్పించినాడని ఆక్షేపించి ఉపచారములను శివుడు స్వీకరించలేదు.నింద


  నియమం నమః శివాయ-నిఖిలం నమః శివాయ
  భక్తుడు నమః శివాయ-భర్గుడు నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 నీలకంఠుని శిరముపై నీళ్ళుచల్లి
 పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు
 కామధేనువు వానింటి గాడి పసర
 మొల్ల సురశాఖి వాడింటి మల్లెచెట్టు.

   రాజశేఖరచరిత్ర.


  నెలరాజును శిఖయందుంచుకొనిన శివుని తలపై ఎవ్వడైన కాసిని నీళ్ళు చల్లి.కొంచము పత్రిని విసిరి వేసిననను పరమ దయాళువైన శివుడు కామధేనువును వాడి ఇంటికి గాడికి కడ్తాడు.కల్పవృక్షమును వారి తోటకు కదిలిస్తాడు.-
  సంవిధ అను అంధురాలు ఆకలితాళలేక అన్నమునకై,అటువైపువెళుతున్న ఒక శివభక్తుని కాళ్ళు పట్టుకొనగా,అతని చేతిలోని జలపాత్ర జారి క్జలము సివలింగముపై పడినది.రాలిపడిన మారేడు ఆకును వాసన చూసి ఆహారముకాదని విసిరివేయగానే అది ఆ శివలింగముపై పడినదట.అంతే సర్వపాప క్షయకరం.తల్లి శివానుగ్రహమును పొందినది.-శివ మహా పురాణం.
 అల్ప సంతోషి యైన అశుతోషుడు అందరిని అవ్యాజ కరుణతో అనుగ్రహిస్తాడు.స్తుతి. .



  .





.
( ఏక బిల్వం శివార్పణం). 

OM NAMA SIVAYA-23

ఓం నమ: శివాయ-23
*******************
అరిషడ్వర్గాలను ఆహా నువ్వు బెదిరిస్తుంటే
అహముతో అసురగణము నిన్ను బెదిరిస్తోందా
బ్రహ్మ పుర్రె పట్టుకొని నువ్వు బిచ్చమెత్తుతుంటే
బ్రహ్మర్షులు చిత్రముగా నిన్ను బిచ్చమడుగుతున్నారా
పొంగుచున్న గంగను నువ్వు జటలలో బంధిస్తే
పంచాక్షరి వింతగ నిన్ను పట్టి బంధిస్తోందా
ఆ నందిని కైలాస కాపరిగ నువ్వు నియమిస్తే
బాణుడు శోణపురి కాపరిగా నిన్నే నియమించాడా
పరమ గురుడు శివుడు అని నేను స్తుతులు చేస్తుంటే
అఖిలజగము పరిహసిస్తు విస్తుబోయి చూస్తుందా
బందీలు ఎవరో తెలియని నా సందేహము తీర్చకుంటే
నిక్కము అనుకుంటానురా ఓ తిక్క శంకరా.


    ,..శివుడు ఆరు శత్రువులను బెదిరిస్తున్నాను అని చెబుతూనే, తన ప్రాణము మీది మోహముతో రాక్షసులనుండి రక్షించుకోవటానికి పరుగులెత్తటమో,చెట్టు తొర్రలలో దాగుటయో చేస్తాడు
తాను యాచకుడిగా ఉంటున్నా బ్రహ్మర్షులకు తాను దాతను అంటాడు."ఓం నమ: శివాయ" అను పంచాక్షరి మంత్రములో తాను బందీగా ఉంటూ,గంగను జటలలో బంధించిన వాడినని పొంగిపోతుంటాడు.తాను బాణాసురుని శోణపురమునకు కాపరిగా ఉంటూ,నందిని తన కైలాసానికి కాపరిగా నియమించానని,నందికి యజమానిని అని చెప్పుకుంటాడు.శివుడు తనుచేసే పనులను ఇతరుల చేత చేయిస్తున్నానని చెప్పుకుంటున్నాడు అని, నింద.


 కావలి నమః శివాయ-కాపాలి నమః శివాయ
 దైత్యం నమః శివాయ-దైవం నమః శివాయ

  నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ.



  " నమః అశుషేణాయచ-అశురథాయచ
    నమః శూరాయచ-అవబింధతేచ."

    రుద్రనమకము.

  భక్తరక్షణకై శీఘ్రముగా నడచునట్టి సేనలు,రథములు గల రుద్రా నమస్కారములు.భక్తులయొక్క శత్రువులను అప్రయత్నముగా ఛేదించు శూరా! నమస్కారములు.
త్వమేవాహం -నేనే నువ్వు,నువ్వే నేను అన్న తత్త్వముతో అహము-ఇహము,దాత-అర్థి,బంధించిన వాడు-బంధితుడు,కాపరి-యజమాని,స్తుతి-నింద,కీర్తి-అపకీర్తి,భగవంతుడు-భక్తుడు అంతా శివుడేనని స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం) . 


OM NAMA SIVAAYA-22

ఓం నమ: శివాయ  --22
******************

"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది
"అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది
"భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది
"దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది
"చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది
"మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది
"ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది
"నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది
"యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది
" వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే
"అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను
వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.
భావము
మద్ది చెట్టు,నేరేడు చెట్టు,మామిడి చెట్టు,రేగి చెట్టు,గరిక,చెరకు,మారేడు చెట్టు,కొబ్బరి చెట్టు,దోస పాదు, హరితమునందిస్తుంటే భక్తులు శివుని పచ్చనైన కేశములతో విరాజిల్లు హరికేశునిగా పొగడగానే శివుడు వాటి గొప్పదనమును తనపై ఆపాదించుకొను చున్నాడు-నింద 


" నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయేనమః."

  వృక్షములకు అధిపతియైన రుద్రా! నీకు నమస్కారములు.-రుద్రనమకము.


     
శ్రీశైల స్థల వృక్షమైన మద్దిచెట్టు,జంబూ ద్వీపముగా ప్రసిద్ధి చెందిన నేరేడు చెట్టు,పావన బదరికా వనముగా రేగి చెట్టు,త్రిగుణాత్మకతతో పువ్వులు లేకుండానే కాయలు అందించే మారేడు చెట్టు,కంచిలో ఆమ్రేశ్వర రూపమైన మామిడిచెట్టు,
అచంచలతకు ప్రతీకయైన కొబ్బరి చెట్టు,తుఫాను సైతము కదల్చలేని గడ్డి,హింసించినను మధురతను ఇచ్చు చెరుకు,మృత్యుంజయ మంత్ర వివరణ యైన దోస పాదు,పరమేశ్వరుని దయచే జగత్పూజ్యములైనవి.


 " జైత్రంచమ ఔద్భిద్యంచమే" రుద్రచమకము
.వృక్షగుల్మాదుల ఉత్పత్తియే ఔద్భిద్యం
.సాధకుడు రుద్రుని తనకు ఆధ్యాత్మిక భానలను విస్తరించిన బోదెలు కలిగిన వృక్షములను ప్రసాదించమని,వానిని ఆసరా చేసుకొని సాధన అను తీగెలె పైపకి ఎదుగుతు పోనిమ్మని ప్రార్థిస్తాడు.ఆ చెట్ల సహాయముతో సాధకుడు విషయవాసనలను జయించగల సామర్థ్యమును కోరుకొనుటయే "జైత్రంచమ" శివుడు అనుగ్రహించు ఆధ్యాత్మిక వృక్షము ఆనందబ్రహ్మమును అందించునుగాక.-స్తుతి.

 పుష్పం నమఃశివాయ-పత్రం నమశివాయ
 వృక్షం నమః శివాయ-లక్ష్యం నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.







(ఏక బిల్వం శివార్పణం )

OM NAMA SIVAAYA-21

ఓం నమ: శివాయ-21
ఉదారతను చాటగ " అసురుని ఉదరములో నుంటివి"
" గంగిరెద్దు మేళము" నిన్ను కాపాడినది ఆనాడు.
వరముగ కోరాడని " అసురుని హస్తమున అగ్గినిస్తివి"
" మోహిని అవతారము" నిన్ను కాపాడినది ఆనాడు.
భోళాతనమును చాటగ " అసురునికి ఆలినిస్తివి"
" నారద వాక్యము" నిన్ను కాపాడినది ఆనాడు.
ఆత్మీయత అను పేర " ఆ అసురునికే ఆత్మలింగమునిస్తివి"
" గణపతి చతురత" నిన్ను కాపాడినది ఆనాడు
భ్రష్టులైనవారిని "నీ భక్తులు" అని అంటావు
రుసరుసలాడగలేవు "కసురుకొనవు అసురతను"

 మ్రొక్కారని అసురులకు " గ్రక్కున వరములు ఇస్తే"
" పిక్క బలము చూపాలిరా" ఓ తిక్క శంకరా.
భావము
శివుడు వరముగా గజాసురుని ఉదరములో నుండెను.తలపై చేయి పెట్టిన వారు భస్మము అగుదురని రాక్షసునుకి వరమిచ్చెను.రావణునికి అర్థాగిని మరియు ఆత్మ లింగమును వరముగా ఇచ్చెను.ఆలోచించకుండా శివుడు అసురులకు వరములిచ్చి ఆపదలలో చిక్కుకునిపరుగులు తీస్తుంటాడు-నింద.
బ్రహ్మాది దేవతలకు తమ భక్తిని చాటుకునే అవకాశం ఇచ్చాడు శివుడు.నారదుని,గణపతిని లోక కళ్యాణ కారులుగా,భక్తులకు" గోకర్ణేశ్వర క్షేత్రమును" అనుగ్రహించాడు.విష్ణువు యొక్క కరుణ అనే జగన్మోహనత్వమును ప్రకటింప చేసిన "పరమ శివుడు" దయా సముద్రుడు.-స్తుతి.


 బీరం  నమః శివాయ-వీరం నమః శివాయ
 రౌద్రం నమః శివాయ-ఆర్ద్రం నమః శివాయ

  నమః శివాయ -నమః శివాయ
     ఓం నమః శివాయ.
( ఏక బిల్వం శివార్పణం )

OM NAMA SIVAAYA--20


  ఓం నమః శివాయ-20
  *******************

  కూడు తినగనీవు-కునుకు తీయగ నీవు
  నీరు పారనీవు-నా తీరు మారనీవు

  పుర్రె జారనీవు-గొర్రె పెంటికలో ఉంటావు
  హాస్యము చూపిస్తావు-వేశ్య చన్నులో ఉంటావు

  జన్నములు కానీయవు-అన్నము దొరకగనీవు
  జలకమాడనంటావు-జలములో ఉంటావు

  కాశి నేను అంటావు-కార్తికము అంటావు
  ప్రదోషములో ఆడతావు-అవశేషములను ఏరుతావు

  మరుభూమిలో తిరుగుతావు-పరిపాలన జరుపుతావు
  పరాక్రమము చూపుతావు-పారిపోతు ఉంటావు

 రూపములో ఉంటావు-అరూపిని అని అనే నీ తీరు,
 చక్కదిద్దుకోవేమిరా ఓ తిక్క శంకరా.




 

  ఏకభుక్తములు(నక్తము),ఉపవాసములంటు తన భక్తులను అన్నము సరిగా తిననీయడు.అంతటితో ఊరుకోకుండా జాగరణలు చేయమంటు నిద్రపోనీయడు.శుచి-శుభ్రము లేకుండ మేక మలములో,వేశ్యకుచములో కనిపిస్తుంటాడు.శ్మశానములో తిరుగుతూ,పరిపాలన చేస్తున్నానంటాడు.పుర్రెలను వదిలిపెట్టడు.దక్షుని యజ్ఞమును మధ్యలోనే ఆపించివేసాడు.దుర్వాస మహామునికి కాశిలో అన్నము దొరకకుండ చేసాడు.నీటిలో తానున్నప్పటికి బూడిద స్నానము చేస్తు మనలను మాత్రము స్నానములు చేయిస్తుంటాడు.(కార్తిక స్నానములు) క్షేత్రము-కాలమురెండును తానేనంటాదు.ఎటుకాని వేళలలో ఎగురుతుంటాడు.అసలు పధ్ధతి లేనివాడు-నింద.

 

 " ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
 నక్తం హౌష్యామి దేవేశ ఏక బిల్వం శివార్పణం."
   బిల్వాష్టకం.
 ఆహారసిధ్ధి-ఆసన సిధ్ధి-అభీష్టసిధ్ధి సమావిష్కరణమే మానసికావిష్కారమునకు శరీరమును అనుసంధించుకొనుటకు చేయు అభ్యాసములే శివపూజా నియమములు.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.




OM NAMA SIVAAYA--19

ఓం నమ: శివాయ-19
********************

"గంగాధర" అని పిలువగ గంగ తొంగి చూస్తుంది
"ముక్కంటి" అని పిలువగ తిక్క కన్ను పలుకుతుంది

"శశిశేఖర" అని పిలువగ జాబిలి ఊకొడుతుంది

"కపర్ది"' అని పిలువగ కచభారము కదులుతుంది

"నంది వాహన" అనగ ఎద్దు సద్దు చేయకంది

"జంగమ దేవర " అంటే లింగము పలుకలేనంది

"నాగేశ్వర" అనగానే పాము ఆగమంటుంది

"అర్థ నారీశ్వర" అనగానే అమ్మ మిన్నకున్నది
"పశుపతి" అని పిలువగానే పాశమేమిటంటుంది

"ఏక నామధారివి" కావని ఎకసక్కెము చేస్తున్నవి
"శివోహం" అను జపమాపి నేను నిన్ను పిలువగా
"ఒక్క పేరు" చెప్పవేరా ఓ తిక్క శంకరా.

పరమ శివా! గంగాధర,ముక్కంటి,శశి శేఖర,కపర్ది,నంది వాహన,జంగమ దేవర, నాగేశ్వర,అర్థ నారీశ్వర, పశుపతి అని శివుని పిలుస్తుంటే -గంగ,చంద్రుడు,పాములు,జటలు,పాశము,అమ్మ పార్వతి బదులిచ్చుటలో నిర్లక్ష్యము చేశారని నింద.


" గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజవిశ్వనాథం. విశ్వనాథాష్టకం.

కరుణాంతరంగుడైన శివుడు,తనను అంటిపెట్టుకుని ఉన్నవారిని తనపేరులో చేర్చుకొని అనుగ్రహించాడని స్తుతి.

OM NAMA SIVAYA-18



ఓం నమ: శివాయ-18
*****************

శశిశీతలకిరణములు నిను సతమతము చేస్తుంటే

గంగమ్మ నెత్తిమీద గజగజలాడిస్తుంటే

అభిషేకపు జలాలు అంతగా ముంచేస్తుంటే

పన్నీటి ధారలు మేము అల్లుకోమ అంటుంటే

చందనాల పూతలు చలి ముల్లులు గుచ్చుతుంటే

చుట్టుకున్న పాములు గుట్టుగ వణికిస్తుంటే

వింజామర గాలుల చలితెమ్మెర సాగుతుంటే

అయ్యో పాపం అంటూ అమ్మ నిన్ను పట్టుకుంటే

సగ భాగము మంచాయె చల్లదనపు అల్లరిలో

చల్లనైన కొండపై చెలువపు అర్థాంగితో నున్న

కొర కొర చూపులతో నిన్ను చలి కొరికేస్తుంటే

కిక్కురుమనవేమిరా ఓ తిక్క శంకరా.

.చంద్రుని వెన్నెల కిరణాలు, గంగా జలాలు,అభిషేక జలాలు, పన్నీటి ధారలు,పాములు,చందనాలు,వింజామర గాలులు,మంచు కొండ చలిని మరింత ఎక్కువచేస్తుంటే,అర్థాంగియైన పార్వతి మీ చలిని తగ్గించాలని ఆలింగనము చేసుకోగా చలి మరింత ఎక్కువైనది.శివునికి చలినుండి తనను ఎలా కాపాడుకోవాలో తెలియదని నింద.

 సాక్షాత్ హిమాలయకృత శివస్తుతి స్వామిని,

 సృష్టకర్త బ్రహ్మ నీవు-స్థితికర్త హరివి నీవు
 వేదప్రకాశము నీవు-వేదవేద్యుడవు నీవు
 పండితుడవు నీవు-పండిత గురుడవు నీవు
 మంత్రజపములు నీవు-తత్ఫలితములును నీవు
 ప్రకటిత అనేకరూప ఆలంబనము నీవు
 భక్తులకు ప్రీతికర ప్రత్యక్షము నీవు,
 అని కీర్తిస్తుంది

 పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు మంచును వేడుకగా భక్తుల ప్రీతికై ధరించి,ప్రకాశిస్తున్నాడు.--స్తుతి.

   ఏక బిల్వం  శివార్పణం.







TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...