Friday, September 30, 2022

PAAHIMAAM SIVADUTI-


పాహిమాం శివదూతి-శివంకరీ-శ్రీమత్ సింహాసనేశ్వరీ
**************************************

 " బాలసూర్య ప్రతీకాశాం బంధుక ప్రసవారుణాం
   విధి విష్ణు శివస్తుత్యాం దేవగంధర్వ సేవితాం
   రక్తారవింద సంకాశం సర్వాభరణ భూషితాం
   "శివదూతీం" నమస్యామి రత్నసింహాసన స్థితాం"

   ఉదయభానుని ప్రకాశముతో ఎర్రని అరవింద పుష్పముల ప్రభలుకలిగిన ఆభరణములతో అనవరము బ్రహ్మ-విష్ణు-రుద్రాదులచే ,దేవ-గంధర్వులాదులచే స్తుతింపబడుతు రత్నసింహాసనమున ఆసీనురాలైన శివదూతి మాత మనలను అనుగ్రహించుగాక.


 ఇక్కడ రక్తబీజుడు అనురక్తితో తన శరీరమునుండి కారుచు నేలపై బడుచున్న రక్తబిందువులచే అనేకానేక రక్తబీజులను వరప్రభావముతో సృష్టిస్తూ,తమ సైన్యములను పెంపొందించుకుంటు అమ్మను చూస్తూ,హేలనగా మాట్లాడుతున్నాడు.
 అదే సమయములో వాని సంస్కరించదలచినదేమో అమ్మ అన్నట్లుగా అమ్మ ముందు శివుడు ప్రత్యక్షమై,
"తతః ప్రతివృతాస్తాభిరీశానో దేవశక్తిభిః
 హన్యంతాం అసురాః శీఘ్రం మమప్రీత్య... హ చండికాం"

ఓ చండికా! నేను సంతసించురీతిగా ఈ రాక్షసులందరిని త్వరగా సంహరింపుము.అని పలుకగానే
 అనగానే తల్లి అసలే
 "శివా స్వాధీన వల్లభా" కనుక తాను తన స్వామి మాటను అనుసరిస్తూనే,తన మాటను స్వామి అనుసరించేలా చేసినది.
   వెంటనే దేవి శరీరమునుండి,
 "తతోదేవి శరీరాత్తు వినిష్క్రాంతాతిభీషణా
 చండికాశక్తిరత్యుగ్రా శివా శతనినాదినీ"
 మిక్కిలిభీషణమైన శక్తి భయంకరమైన శబ్దముతో ఉద్భవించెను.
   ఆ విధముగా ప్రకటితమైన శక్తి,
 " శివదూతి శివారాధ్యా శివమూర్తిః శివంకరీ"
     తన ఎదుటనున్న శివునితో,
 నమో దూతాయచ-ప్రహితాయచ-సర్వజనుల మేలుకోరుతూ,దూతత్వమును నెరపు ప్రజ్ఞకలవాడవు(.పెరియపురాణము)
 "దూతత్వం గఛ్చ భగవన్ పార్శ్వం శుంభమ్నిశుంభయోః"
   భగవానుడా! నీవు శుంభ-నిశుంభులవద్దకు దూతగా పొమ్ము.
   వారితో నా మాటగా ఇట్లుచెప్పుము అని తన సందేశమును మూడుషరతులను తెలియచేస్తూ విధించినది.
 1.బ్రూహి శుంభ-నిశుంభంచ" మొదటిది,
 "త్రైలోక్యమింద్రో లభతాం దేవాః సంతు హవిర్భుజః
  యాయుం ప్రయాత పాతాలం యది జీవితమిచ్చిథః"

   యాది జీవితమిచ్చథః-వారు కనుక జీవించాలనుకుంటే,జీవితముమీద ఆశ ఉంటే,వారు
1. యాయుం ప్రయాత పాతాలం-పాతాలమునకు తరలిపోవలెను.
2.త్రైలోక్యం ఇంద్రాం లభతాం
  త్రిలోకములకు పరిపాలకులుహా ఇంద్రుని ఒప్పుకోవలెను.
3.దేవాః సంతు హవిర్భుజ-వారి హవిస్సులు వారికే చెందవలెను.మీరు దానిని అడ్దుకోకూడదు అని చెప్పు.
   ఒకవేళ వారు అందులకు అంగీకరించనిచో,
  సర్వోపాధి వినిర్ముక్తా-సదాశివ పతివ్రతా
 తన హెచ్చరికను తెలియచేయమనినది.
 బలగర్వముతో మీరు యుద్ధమునే కోరుకొనిన ఎడల,
 "బలావలేపాదథ చేద్భవంతో యుద్ధకాంక్షిణః
  తదాగచ్ఛత తృష్యంతు మచ్ఛివా పిశితేన వః"
   అని తన కరుణను మరొకసారి వివరిస్తూ కపర్దిని దూతగా వారిదగ్గరకు పంపినది.

 అసురసైన్యము పంపిన దూత సుగ్రీవుడు.అమ్మ తత్త్వమును తెలుసోకోలేని అజ్ఞాని.దానికి తోడు వాచాలత్వముతో అమ్మను దూషించినవాడు.అపరాథములు చేయు స్వభావము కలవాడు.
  అమ్మ పంపిన దూత సదాశివుడు.సర్వజ్ఞాని.దానికితోడు వాంఛితార్థములీయగలడు.అపరాథములను క్షమించగలడు..
 శుంభ-నిశుంభులు శంభుని రాక తమ రక్షణకేనని తెలుసుకుంటారో లేక దంభముతో రణమునకు కాలుదువ్వుతారో తరువాతి భాగములో అమ్మదయతో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
  సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు.


   
    

 

 

PAAHIMAAM RAKTABEEJA NIHAMTRI-RAJARAJESVARI SAILASUTE


 

SAPTAMATRKAA SAMSTHITA-SAILAPUTRI NAMOSTUTE

 



 పాహిమాం సప్తమాతృకా సంస్థిత-రమ్యకపర్దిని శైలసుతే

 ***************************************

 "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై

  అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి."


   అని శ్రీదేవి స్తుతిమాలలో చెప్పబడినది.

  శ్రీదేవిఖడ్గమాలగా ప్రసిద్ధికెక్కిన స్తోత్రములో వీరి ప్రస్తావన వస్తుంది.

  "బ్రాహ్మీ-మాహేశ్వరీ-కౌమారీ-వైష్ణవీ-వారాహీ-మాహేంద్రీ-చాముండే-అనునవి పరోక్షముగా బ్రహ్మ-మహేశ్వరుడు-కుమారస్వామి-విష్ణుమూర్తి-వరాహస్వామి-మహేంద్రుడు మొదలగువారి శక్తుల యొక్క స్త్రీరూపములు.

 సమరమున

 చండ-ముండులు సమసిపోవుట తెలుసుకొని,రెట్టించిన క్రోధముతో శుంభుడు తనదగ్గరనున్న అనేకానేక దైతేయులను-ధౌమ్రులను-కాలకులను-కాలకేయులను దేవిపై దండెత్తుటకు రక్తబీజుని ఆజ్ఞాపించెను.

నిజమునకు ఇక్కడ జరుగుచున్న సమరము చంచల మానవస్వభావమునకు-అచంచల దైవత్వమునకు సంకేతముగా చెప్పబడుచున్నది.

 అనేకానేక తామసగుణ అవిరామ స్వైరవిహారము ఒకవైపు-ఏకత్వం జగత్యత్ర ద్వితీయం కం? మరొకవైపు.

 దానిని గుర్తించలేని తామసమే తల్లిని బంధించుటకు చేయుచున్న నిష్ఫల ప్రయత్నములు.

  తన నైజమును మార్చుకొనలేని నిశాచరత్వము.

"సుఖస్యానంతరం దుఃఖం-దుఃఖస్యానంతరం సుఖం" అను 

ద్వంద్వములను దాటలేక భవతారిణి యైన దేవిని-దేవి సింహమును చుట్టుముట్టిరి.


    కుపితయై దేవి హుంకరించగనే,

 "బ్రహ్మేశ గుహ విష్ణూనాం తదేంద్రస్యచ శక్తయః

  శరీరేభ్యోః వినిష్క్రమ్య తద్రూపైః చండికాం యయుః"

   బ్రహ్మ-శివ-స్కంద-విష్ణు-ఇంద్ర-యమ-మొదలగువారి శక్తులు అతివీర్య బలములతో స్త్రీమూర్తులుగా ప్రకటించబడినవి.

  వీటి సంఖ్యలు విభిన్నములుగా చెప్పబడినప్పటికిని వీరవిహారము చేయుచు అసురసైన్యములను మట్టుపెట్టుచున్నవి

.

 తమతమ ఆయుధములతో తామసమును తుడిచివేయుచుండినవి.


 సమరాంగణమున మదసంహారముగా -బ్రాహ్మీ మాత


 క్రోధ సంహారిణిగా -మాహేశ్వరి మాత

 లోభసంహారిణిగా-వైష్ణవీ మాత

 ఈర్ష్యా సంహారిణిగవారాహి మాత

 మోహ సంహారిణిగా-కౌమారీ మాత


 మత్సర సంహారిణిగా-ఐంద్రీ మాత

 అజ్ఞాన సంహారిణిగా-చాముండా

 వీరితో బాటుగా యామీ-కౌబేరి-వారుణి మొదలగు అనేకానేక శక్తులతో దేవి ప్రకాశించుచున్న సమయమున,

 


తమ సైన్యము క్షీణించుట గమనించిన రక్తబీజుడు తాను స్వయముగా రణమునకు సిద్ధమయినాడు.మాతృకలు వానిని తమ తమ ఆయుధములతో

 ఖండించుటకు ప్రయత్నము చేయుచుండగా,వాని శరీరమునకు తగిలిన గాయములనుండి భూమిపై కారుచున్న ప్రతి రక్తపుబొట్టు నుండి ఒక్కొక్క రాక్షసుడు పుట్టుకొస్తున్నాడు.

 అది గమనిస్తున్న వానికి బ్రహ్మవర ప్రభావము తనను పరాభవమును పొందనీయదను నమ్మికను కలిగించింది.

 అసలే తన సోదరుని రంబుని చంపినది దేవతలే.తన స్నేహితుడైన మహిషుని చంపినది దేవత పక్షమున పోరాడిన ఈ స్త్రీయే.కనుక నేను నా రక్తధారలతో జనించుచున్న అనేకానేక రక్తబీజుల సహాయముతో దీనిని(దేవిని) తుదముట్టించెదను అని అనుకుంటు,సప్తమాతృకలకు సమీపముగా చేరుతూ,వారి ఆయుధములచే గాయపడుతూ,కారుతున్న తన రక్తపు బొట్లనుండి పుట్టుచున్న అనేకానేక బీజులను గమనిస్తూ,మనసులో ఉప్పొంగిపోవుచున్నాడు.

 అమ్మ శక్తులకు అనివార్యముగా అనిపించుచున్న వాడి పతనము ఆశ్చర్యమును కలిగించుచున్నది.అర్థముగాక వారు అమ్మ వైపు ప్రశ్నార్థకముగా చూస్తున్నారు.



 అది గమనిస్తున్న వాడి అహంకారము తారాస్థాయికి చేరింది.సప్తమాతృకల సమర ప్రావీణ్యము వాడిని సంహరించుటకు  ....ఎందుకో వెనకాడుతున్నది.అదే విషయమును గమనించిన వాడు,వికటాట్టహాసము చేస్తూ,



   దేవితో అవిశ్రాంతముగా పోరాడుచున్న అమ్మశక్తులను చూపిస్తూ,

   వీరందిరి సమర సామర్థ్యము  పై ఆధారపడియున్న నీవు,అసురసంహారము చేస్తున్నాను అపోహపడుతూ అహంకరిస్తున్నావు అంటూ అవహేళన చేశాడు.

 " మహా చతుషష్టి కోటియోగినీ గణసేవితా",

   అమ్మ వాని వాచాలత్వమునకు ఏ విధముగా బదులిస్తుందో తెలుసుకొనే ప్రయత్నమును తరువాతి భాగములో చేద్దాము.


 సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.




 


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...