Friday, May 17, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-29

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-29
 ***********************
 భగవంతుడు-భగవదంశ ఇద్దరును మార్గబంధువులే

 " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః."

  లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు వర్ణముల కలబోతతో ప్రకాశించు,మార్గములకు అధిపతి యైన రుద్రునకు నమస్కారములు.

 జీవుల కర్మాచరణ ఫలితముగా వారిని,పునరావృత్తి సహిత,పునరావృత్తి రహిత,విదేహ ముక్తి మార్గములలోనడిపించ కరుణించు రుద్రస్వామికి నమస్కారములు.కొందరితో కఠినముగా ,మరి కొందరితో కరుణాసంద్రముగా కనికరిస్తూ వారి పాపకర్మలను భరింపచేస్తు,హరింపచేస్తు భవబంధవిముక్తులను చేయు శుభంకర! నమస్కారములు.


  శంకరాచార్యులు 8వ శతాబ్దములో కాలడిలోఆర్యాంబ-శివగురువులకు శివాంశగా వైశాఖశుధ్ధ పంచమి,ఆరుద్రా నక్షత్ర సమయమున జన్మించారు.ప్రపంచలో రెండు అను తత్త్వము లేదని అంతా ఒకతే అను అద్వైత సిధ్ధాంతమును ప్రతిపాదించినారు.

  " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ."

" న ద్వైతం సమస్తం ఏకం" అని భావించు భగవదంశ పుణ్య-పాప మిళితమైన మర్త్యలోకమున సామాన్య మానవునిగా ,మార్గబంధువుగా జన్మించుటకు కారణము వైదిక ధర్మ పునరుధ్ధరణమే.

 " నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." జటాధారి-ముండనకేశుడు రెండును తానైన రుద్రునకు నమస్కారములు.

  తల్లి అనుమతితో సన్యాశమును స్వీకరించి,గోవిందపాదుల వారిని గురువుగా భావించి,సేవించి,వారి అనుగ్రహమును పొందగలిగి ప్రసిద్ధ స్తోత్రములను జనబాహుళ్యమునకు చేరువచేయుచు,దివ్యతేజోమయుడై ప్రకాశించుచు,అనుచరులను అనుగ్రహించుచున్నారు ఆదిశంకరులు.

 పూర్ణా నదిని మాతృపాదముల వద్దకు రప్పించగలిన మహానుభావుడు తత్త్వవిచారణలో అసంపూర్ణుడుగా అజ్ఞానియై ఆదిదేవుని అవమానించుటయా? అద్వైత సాంగత్యమును విడనాడుటయా? పరమేశ్వర తత్త్వమును ప్రత్యక్షముచేయు పవిత్ర సంకల్పము తప్ప వేరే పరమార్థము లేదు. పరమేశా! పాహి_పాహి.

 ఒకరోజు ఆదిశంకరులు గంగానదికి స్నానమునకై తమ శిష్యులతో నడచుచున్నారు.అదనుచూసుకొన్నాడు ఆ ఆదిదేవుడు.

 " నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః." మహిమాన్వితుడైనప్పటికిని మాదిగవానివలె ప్రకటింపబడ తలిచాడు.అదియును నాలుగు కుక్కలతో,మరియును సన్నటి దారిలో,తగులకుండ జరుగలేనంత విధముగా.శివలీలలు-చిద్విలాసములు చింతింపవే ఓ మనసా!.

 " నమః స్రుత్యాయచ-పథ్యాయచ."
 సన్నని కాలిబాటలయందును-విశాలమైన మార్గములందును తిరుగాడు స్వామి నమస్సులు.

   " శ్రుతాయచ-శ్రుతసేనాయచ" వేదాంతమైన వాడు వేదములనువిడిచి ఉండగలడా?

   వేదమును తెలియచేయుటకు వచ్చిన వేదాంతుడు అదియే మాదిగవాడు మార్గమునకు ఆటంకముగా మారెను.మార్గబంధువా మహాదేవ నమోనమః.

   


 అంతా మిథ్య అన్నవిషయమును ఆకళింపుచేసుకోలేని భజగోవిందకర్త వాని బాహ్య రూపమును చూచి దారికి అడ్డుతొలగమనెను.తానా సానాతన సంప్రదాయములను గౌరవించు సద్బ్రాహ్మణుడు.తారసపడినవాడా తమస్సుతో నిండిన చండాలుడు పంచముడు.వానిని తాకక ముందునకు పోవు మార్గములేదు వాడు దారి ఇచ్చుటకు పక్కకు జరిగిన తన దారిన తాను వెళ్ళవచ్చుననుకొన్నాడు తొలగవలసినది తనలో అజన్నమని తలువని తాపసి.

  " నమః స్వపథ్యో జాగ్రద్భ్యశ్చవో నమో నమః."

   నిదురించునపుడు మెలకువతో నుండువాడు.మెలకువతో శరీరమున్నప్పుడు వివేకము నిదిరింపచేయు వానిని మేల్కొలుపు మహాదేవుడు,

 అయ్యా,

     అద్వైత సిధ్ధాంతకర్తా! ఆదిశంకరా! నాకొక చిన్న సందేహము.అదిపోయిందంటే దారికి అడ్డము తొలగుతాను.సెలవీయండి స్వామి అని ,

   మన ఇద్దరి శరీరములు పంచభూతాత్మకములు.జీవాత్మ-పరమాత్మ సంయోగములు.

     మనైద్దరి శరీరములలో ఈశ్వరచైతన్యమే నిండియుండగా మీరు నన్ను తాకిన ఏవిధముగా మైలపడెదరు? శారీరకముగానా? మానసికముగానా? ఆధ్యాత్మికముగానా? సెలవియయండి స్వామి అని వేడుకున్నాడు ఆచార్యునికి ఆచార్యుడై."గురుః బ్రహ్మ-గురుః విష్ణుః -గురుః దేవ మహేశ్వర" 
 " నమః కూప్యాయచ-అవట్యాయచ." 
 నూతులయందు,పల్లము స్థలములందు ప్రకాశించుచున్న రుద్రా! నా అజ్ఞానము అను లోతుబావి నుండి నన్ను పైకిలాగి,సరైనమార్గమును చూపించిన వాడు పండితుడైనను పంచముడైనను శివతత్త్వమును తెలియపరచినవాడే మనీషి. మహోన్నతమైన మనీషాపంచకము మానవాళికి అందచేసిన సమయమిది.

   " బ్రహ్మైవాహమిదం సకలం చిన్మాత్ర విస్తారితం
     సర్వం చైతదవిద్యయు త్రిగుణాయాసేషం మయా
     ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యేపరే నిర్మలే
     చాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ.

అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొనిన,శ్రీ అప్పయ్య  దీక్షితులు విరించిపట్టణం వేలుపైన పరమేశుని,సదాశివుని  మార్గ బంధువుగా గుర్తించి,ప్రయాణ సమయమున   కీర్తించినది. ఈ స్తోత్రము.వివిధ శరీరములలో ఈ జీవి ప్రయాణములు అనంతములు.వాటిని సన్మార్గమున నడిపించమని వేడుకొనుటయే ఈ స్తోత్ర ప్రాశస్త్యము.

 దక్షునిచే శాపగ్రస్థుడై,కడలిని దాగినచంద్రుని శాపవిముక్తునిచేయుటయే కాక,తన సిగపూవుగా అలరారుటకు కారణుడైన పరమేశుని భజించు.

  క్షీరసాగర మథనమున హాలాహలమును త్రాగువేళ,సహాయకారులై ,తామును విషమును గ్రహించి,స్వామికి ఆభరణములై ప్రకాశించుటకు మార్గమును చూపిన నాగాభరణునికి నమస్కరించుచున్నాను.

   మార్గ ముడులను విడిపించి,సన్మార్గమును చేర్చు త్రినేత్రుని భజించు అదృష్టమును స్వామి అనుగ్రహించును గాక.

 భవానీ సమేతం- భజే మార్గ బంధుం
*********************************************

  శంభో శివా ప్రాపు నీవు
  దయా సింధో నా దారి చూపు

  శంభో మహాదేవ దేవా
  శివా శంభో మహదేవేశ శంభో
 ...........

  తరిమింది జాబిలిని శాపం
  తలదాచుకొమ్మంది కరుణా సముద్రం
  సిగపూవునే  చేసింది   మార్గం
  భవానీ సమేతం -భజే మార్గబంధుం..భజే మార్గబంధుం

  ............

  తాగినది విషజ్వాల సర్పం
  వెన్నంటి నడిచింది  హరుడే  సమస్తం
  ఆభరణమునే  చేసింది మార్గం
  భవానీ సమేతం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.

  ........

   తొలగినది భవబంధ పాశం
   కరుణించె నను కోటి సూర్యప్రకాశం
   మమేకమే  చేసినది మార్గం
   భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

      ( ఏక బిల్వం శివార్పణం.)

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...