Friday, November 29, 2019

MARGALi-07


   మార్ఘలి మాలై07
   ***************

   ఏడవ పాశురం
   ************

 కీశు కీశెన్రు ఎంగుం ఆనైచ్చాత్తం కలందు
 పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే!
 కాశుం పిరప్పుం కలగల ప్పక్కై పేర్తు
 వాశ నరుం కుళల్ ఆయ్ చ్చియర్ మత్తినాల్
 ఓశై పడుత్త త్తయిర్ అరవం కేట్టిలైయో?
 నాయగపెణ్ణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి
 కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో?
 లేశముడయాయ్! తిర్ ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
************************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 భరద్వాజ పక్షుల సత్సంగములు వినబడుటలేద
 భావతాదాత్మతతో బాహ్యము విడనాడినావు

 చల్లచిలుకు గొల్లల కవ్వడి సవ్వడులు వినలేద
 నల్లనయ్యా తలపులో తలమునకలవుతున్నావు

 నీ తలుపు సందునుండి ప్రసరించు నీ మోము కాంతి
 మా కేశవ స్మరణమును ప్రతిబింబిస్తున్నది

 నాయికవై మా అందరికి,నారాయణ మహిమ పంచు
 తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుచు,పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో?ఓ నాయికా! .


 " ఏకమేవం బ్రహ్మం న అద్వితీయము" అను పరమార్థమును గోదమ్మ భరద్వాజ పక్షులు-చల్ల చిలుకు భామలు -గోపిక ముఖ తేజస్సు అను మూడు విషయములను ఉపకరణములుగా మలచి మనలను చైతన్యవంతులను చేయుచున్నది.

  ఏ విషయమునకైన స్పందించకున్న లేక సందేహమును వెలిబుచ్చకున్న ఆ విషమును వారు పూర్తిగా అర్థము చేసికొనిన వారైనా కావచ్చును లేదా ఏమాత్రమును అర్థము కాని వారైనను కావచ్చును.

ఆరవ పాశురములో పుళ్ళుం అని పక్షులను సామాన్యవాచ్యముగా వాని ధ్వనులను అర్థగ్రహణ దుర్లభముగా ప్రస్తావించినది.అది శ్రవణ భక్తి మొదటి దశ అని అనుకొన్నాము.ఈ పాశురములో గోదమ్మ వాటిని "ఆనైచ్చాతం" భరద్వాజ పక్షులు అను విశేష నామధారులు గాను,అవి అన్ని ఒకచోట అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్త్వముగాను,అంతటను వ్యాపించి యున్నప్పటికిని కలిసి ఏక కాలమున ధ్వనించు శృతి-స్మృతి విచారణముగా ప్రత్యేకించి చెప్పినది.
  పూర్వము భరద్వాజ ముని బ్రహ్మాండ విశేషములను అధ్యయనము చేయగోరి భగవానునిచే రెండు పూర్ణ జన్మల 200 సంవత్సరముల ఆయుర్దాయమును పొందినాడట.అయినను తాను నేర్చుకొన్నది పరమాత్మ రచనలోని పరమాణువు మాత్రమే నని,దాని కన్న పరమాత్మ మూలతత్త్వమైన బ్రహ్మమును తెలిసికొనుట పరమానంద భరితమని గ్రహించినాడట.భగవంతుని సేవకన్న భగవద్భక్తుల సేవభాగ్యమును గొప్పదిగా భావించేవాడట.అందులకు నిదర్శనముగా తన దగ్గరకు వచ్చిన శ్రీరాముని కన్న భరతుని సేవించి మిక్కిలి ఆనందపడినాడట.

" బ్రహ్మము అంటే ఏమిటి? అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రళయకాలమునందు దేనిలో మనము నామరూపరహితులమై దాగి ఉంటామో,ప్రస్తుత కాలములలో నామరూపరహితముగా ఏది మనలో దాగి ఉంటుందో అదేబ్రహ్మము అన్న విషయము కొంచకొంచముగా అర్థమవుతుంటుంది.అవియే బ్రహ్మము యొక్క స్థూల-సూక్ష్మ రూపములను విషయము తెలుస్తుంటుంది."






  భారద్వాజ పక్షులు "బ్రహ్మమును అనుసరించు" అని తెలియచేయువిధానమే "కీశుకీశు" అను అనుకరణ శబ్దములు. నిరాకర నిర్గుణ పరబ్రహ్మమును అను తెలియ చేయు
నాదములు.


 జ్ఞానశృతి-రైకుల కథ.జ్ఞానశృతి చేసిన అన్నదాన ఫలిత తేజము ఆకసమున వ్యాపించి యున్న సమయమున ఒక భరద్వాజ పక్షి తన జంట పక్షితో అటువైపు వెళ్లవద్దు ప్రమాదము అని చెప్పగానే మరొక భరద్వాజము రైకుని బ్రహ్మత్వమును తెలియచేసి శృతజ్ఞానిని సంస్కరించినది.




   పరిధిని దాటిన భావము కాని పనికాని పిచ్చిగా గుర్తించుట లోక సహజము.(శ్రీమాన్ కులశేఖర ఆళ్వారులుగా కీర్తించబడే )ఈ గోపిక భ్రాంతి మోహితురాలై,గోపికల పిలుపునకు సమాధానమును ఇచ్చుటలేదు.భారద్వాజ పక్షుల వృత్తాంతమునమును వినినదో లేదో అని గోదమ్మ పిచ్చి పిల్లా భగవద్గుణామృతపానమను భ్రాంతిలో (పిచ్చిలో) ఉన్న దానా మేల్కొను.తెల్లవారినదనుటకు నీకు ఇంకొక ఉదాహరణమును చెబుతాము అంటున్నారు గోపికలు.

 ఏవిధముగా భరద్వాజ పక్షులు అన్ని కలిసి అంతట వ్యాపించి ఏక కాలమున కీశు కీశు అను నిర్దిష్ట ధ్వనినిచేస్తున్నాయో,అదేవిధముగా గోకులములోని గొల్లెతలు శుచులై-సుముఖులై నిత్యకృత్యమైన చల్ల చిలుకుట అను పనిని క్షీరసాగర మథనమంత పవిత్రముగా భావించి చేయుచున్నారట.అప్పుడు మూడు ప్రదేశముల నుండి ధ్వనులు త్రికరణశుధ్ధములై హరి నామమును కీర్తిస్తున్నవా అన్నట్లుండెనట.

కృష్ణ  పరిష్వంగమును పొందిన గోవుల క్షీరము  లభించిన పెరుగు చిలుకుటకు  వారు పట్టుకున్న "మత్తి" కవ్వము సాక్షాత్తు స్వామి వలె కనిపిస్తు వారిని చేతులు చాచి ముందుకు రమ్మని కవ్విస్తున్నదట.కట్టిన తాడు చటుక్కున జారిపోతుందేమనని గట్టిగా పట్టుకొని చల్లచిలుకుతున్న సమయమున వారి మనస్సు తమ యెదపై నున్న "కాశొ-పిరప్పులు" మంగళసూత్రములు మంగళధ్వనులను చేస్తు మైమరచుచున్నవట.చాచిన చేతుల కంకణములుకాయకర్మకు ప్రతీకలై కణ్ణా-కణ్ణ-కణ్ణాఅంటున్నవట.కవ్వపుచప్పుడు వాక్కుతో జతకలిపి వాని వైభవమునవర్ణించుచున్నదట.
."మనో వాక్కాయ కర్మలు అతిపవిత్రరూపమును దాలిచి చేయుచున్న"

కైంకర్య  సవ్వడి(మత్తినాల్ ఓశై)వారి కేశము ముడిని విడదీసి వాని నుండి వచ్చు సుగంధ పరిమళములను(వాశనరుం కుళల్) రేపల్లెనంతా వ్యాపింపచేస్తున్నదట.

ఇది వాచ్యార్థమైనప్పటికి అంతరార్థము యోగులు-జ్ఞానులు గొల్లెతలు చేతులు చాచినట్లు తమ అపారకరుణను అందించుటకు చేతులనువిశాలముగా చాచినట్లున్నది.ఆ మూడు సవ్వడులు వేద-వేదాంత రహస్యములను ప్రీతితో వెల్లడించునట్లున్నది.తద్వారా వారినుండి జాలువారిన జ్ఞానధారలు వడివడిగా రేపల్లెను అంతటను సుసంపన్నము చేసిన పరిమళము వలె శోభిల్లుచున్నది.


.

గోదమ్మ ఈ పాశురములో నిదురిస్తున్న గోపికను " పేయ్ పెణ్ణా" భ్రాంతిలో ఉన్నదానా అని మొదట సంబోధించినది. ఆమె పిచ్చిదని గోపికలు భ్రమపడినారు.భ్రాంతి పడినారు.కాని నిజమునకు ఆమె,

 దివ్య తేజోరాశి " నడిపించగల సామర్థ్యము కలది.నాయకుని కూతురు.కనుక "నయతి ఇతి నాయికా"గోదమ్మ ఆమెను నిద్ర లేపుతు రెండవసారి "

"నాయగన్ పెణ్ణ్ పిళ్ళాయ్"" అంటూ నువ్వేమా నాయికవు అని తెలిపినది. మరియొక విశేషమేటంటే సంకీర్తనలో స్వామిని నారాయణుడు-కేశవుడు)  సర్వజీవులకు ఆధారమైన నారాయణుడు,"కేశి" అను అసురుని సమ్హరించి క్లేశములను తొలగించిన కేశవుడు  అని నామములతో కీర్తించు టచే నామసంకీర్తనము నూతనత్వమును సంతరించుకున్నది.నామ సంకీర్తనమును చేస్తూ గోదమ్మ ఈ గోపికను నాయకురాలిని చేసి గోష్టికి వేరొక గోపికను మేల్కొలుపుటకు బయలు దేరుచున్నది.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..)




.

MARGALI MALAI-06


     మార్గళి మాలై-06
    *******************

   ఆరవ పాశురం
   *************

 పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళ్రైయన్ కోయిలల్
 వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?
 పిళ్ళాయ్ ఎళుందిరాయ్! పేయ్ మాలై నంజుండు
 కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
 వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
 ఉళ్ళత్తు కొండు మునివర్గళుం యోగిగళుం
 మెళ్ళ ఎరందుకళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
 వెళ్ళత్తరవిల్ తు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుని అనుగ్రహము అనవరతము

 పక్షులు కిలకిలరవముల  ప్రస్తుతించు చున్నవి
 పక్షిరాజు శంఖము మార్మ్రోగుచున్నది.విను

 చక్కదనపు పూతనను పాలుతావి సంహరించె
 చీకటిభావపు శకటుని కాలదన్ని నేలగూల్చె

 యోగులు-మునులు మెల్లగ బహిర్ముఖులైనారు
 యోగీశ్వరుని సుస్వరముల కీర్తించుచున్నారు

 స్వామి-సేవక తత్త్వము,తెలిసికొన  మేలుకో
 తల్లి తానె తరలివచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుకుంటూ,పాశములన్నింటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో ? ఓ బాలిక!.!

  ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు మనము విభిన్నదశలలో నున్న గోపకాంతలను చూస్తాము.తన్మయ నిద్రలో పరవశించుచు తలుపులోపల నున్నవారు కొందరయితే,తమో నిద్రను వీడి భగవత్ సందర్శన-సాంగత్య-సాయుజ్యమును పొందుటకు తహతహలాడుచు,లోపలిగోపికలో నిద్రాణమైయున్న విశిష్ట శక్తులను జాగరూకము చేసి,జగత్కళ్యాణము గావింపవలెనన్న కోరిక కలవారు.అంతే కాదు ఆమెను మార్గదర్శకురాలిని చేసి,తాము అనుసరిస్తూ,వ్రతమును సఫలము చేసికొన దలచినవారు.


  వీరిలో ఎవరు ఎక్కువ భక్తికలవారో నిశ్చయించుట కష్టము.నిద్రిస్తున్నవారిది పారవశ్యము.మేల్కొలుపు వారిది ప్రాప్తి త్వరిత్వము.అందరును భగవదనుగ్రహమును పొందినవారే-బాంధవ్య విముక్తులే.

  గోదమ్మ ఈ పాశురమును " పుళ్ళుం శిలంబినకాణ్" అని పక్షుల కూతలతో ప్రారంభించినది.శ్రవణభక్తి మొదటిదశను మనకు పరిచయము చేస్తున్నది.ఏదో వినిపిస్తున్నది గాని శబ్ద స్పష్టత లేనిదానివలె నుండును.ఇది వాచ్యము.కాని ఇక్కడ పరిచయముచేయబడ్డ పక్షులు జ్ఞానులు.పరమహంసలు.అనుష్ఠానము-అనుగ్రహము అను రెండు రెక్కలు కలవారు.ౠషుల వాక్కులే పక్షుల కూతలు.వారు ఆకాశములోనికి ఆ-అంతట-కాశము-వెలుగు కల చోటికి వెళ్ళుచున్నారు.మూలతత్త్వ దర్శనమునకు సిధ్ధమగువారు.

 ఈ విషయమును తల్లి "పిళ్ళాయ్" అని సంబోధిస్తూ చెప్పినది.ఓ చిన్నపిల్లా! ఓ బాలా అని.అంత పెద్ద విషయమును ఇంతచిన్న పిల్లకు అమ్మ చెబుతోంది.అంటే ఓ బాలా! గ్రహణము-ధారణము-పోషకము అను మూడు సద్గుణములు పుష్కలముగా నున్న దానా! ( శ్రీమాన్ పెరియాళ్వారునిగా భావిస్తారు.)

 పక్షికూతల గుర్తు చెప్పినా పిల్ల లేవలేదు కనుక ఈ సారి గోదమ్మ 'పుళ్ళరయిన్" పక్షిరాజ వాహనుడైన శ్రీకృష్ణుని తెల్లని శంఖరవమును చెప్పినది.స్వామి శంఖము "విళి శంగిన్" తెల్లనైన సత్వగుణము కలది.కారణము లేని కదనమునకు కాలుదువ్వదు.అంతే కాదు.ఆ శంఖము ఇప్పుడు "పేరరవం" పెద్ద ధ్వనిని చేయుచున్నది.ఏమిటా పెద్దధ్వని.బాహ్యమునకు భక్తుల స్వామి నామస్మరణ.ఆంతర్యము ఎవ్వరుని ఇంతగొప్పదని లెక్కించలేని ప్రణవము.దానిని" కేట్టిలైయో? వినలేదా అని అడుగుతున్నది.

  తాదాత్మ్యములో నున్న గోపిక స్పందించని కారణమున ఈ సారి యోగుల మునుల హరినామమును సూచించినది.మననముచేయుచు ఆనందమును అనుభవించువారు మునులైతే.కైంకర్య రూపమున ఆత్మానందమును అనుభవించువారు యోగులు.వారు తమ మనసులలో వేదవృక్షబీజమైన స్వామిని భద్రపరచుకొన్నవారు.(ఉళ్ళత్తు కొండు).వారు తాము చటుక్కున కళ్ళు తెరిస్తే తమ కనులలో నున్న స్వామికి కష్టము కలుగునని మెల్లగా కన్నులు తెరిచి,మెళ్ళ ఎరందు,ఎదురుగ నీలమేఘశ్యాముని లీలా మానుషరూపుని చూస్తూ,ఆనందమును పట్టలేక బిగ్గరగ హరి-హరి అని సంకీర్తిస్తున్నారు.(అరిఎన్ర పేరరవం)

 పూతన జీవితహర-శకటాసుర భంజన అని కీర్తిస్తున్నారు స్వామిని.

"పేయ్ మాలై నంజుండు"
 తమోగుణుడైన కంసుని పంపున కృష్ణుని తన పాలిచ్చి చంపుటకు వచ్చినది పూతన.అయినప్పటికిని అజామిళుని వలె హరి సాయుజ్యమును పొందినది.మన అజ్ఞానమే పూతన.కామరూపియై (బాహ్యాడంబరలు మెచ్చు) గోపాలుని సమీపించినది.స్తన్యమునిచ్చి స్వామిచే సంస్కరించబడినది.

"కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి"



" శ" అనగా సుఖము."కట" అనగా ఆటంకము.పరమానందమునకు ఆటంకమును కలిగించునది శకటము.అదే మన శరీరము.ఇంద్రియనిగ్రహము లేక ఇబ్బందులను కలిగించును.మనోరథములతో రథమును సరిగా నడువనీయని అసురీ గుణమును నిర్మూలించిన స్వామిని కీర్తించుచున్నారనగానే,గోపిక బహిర్ముఖత్వమును పొంది ఆండాళ్ తల్లిని అనుసరించ సాగినది.,ఆ గోపికను తమతో కలుపుకొనిగోష్ఠికై,వేరొక గోపికను నిద్రలేపుటకు గోదమ్మ వెళుతున్నది.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.




MARGALI MAALAI-05


 మార్గళి మాలై-05
 ****************

  ఐదవ పాశురం
 ***************

మాయనై మన్ను వడమదురై మైందనై
తుయపెరునీర్ యమునై యరైవరై
 ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి  త్తుళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం
తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
************************

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 యమున దాటి వచ్చినాడు ఉత్తర మధురకు వాడు
 యశోదా నందనుడు లీలా మానుష రూపుడు

 పదునాలుగు భువనంబుల కట్లను విప్పువాడు
 పసిబాలునిగ రోటికి కట్టుబడిపోయినాడు

 దామోదరుడైనాడు  తామర కన్నులవాడు
 పాహి-పాహి అనగానే పాపాలు పారతోలేస్తాడు

 మనసారా స్మరియిస్తూ పరిమళ పువ్వులు చల్లగ
 తరలివచ్చినది తల్లి తానొక గోపికయై

 పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో !గోపికలారా.!



గోదమ్మ ఈ పాశురమును "మాయనై"మన్ను వడమదురై-మైందనై" అని ప్రారంభించినది.మైందనై-రాజుగా-బాలునిగా-రక్షకుడిగా-బలవంతుడిగా -నాయకుడిగా-సౌదర్యభూషితుడిగా అనేక రూపములతో చేష్ఠలతో మాయావి ఉన్నాడు.ఎక్కడ?అని గోపికలు ప్రశ్నించగా మన్ను వడమదురై లో అంటే,స్వామితోశాశ్వతసంబంధముగల
 ఉత్తర మధురలో,పవిత్ర జలపూరితమైన యమునకు రేవుగా ఉన్నాడట. .స్వామి అనుగ్రహ బధ్ధుడు అన్న విషయమును వివరించుతు దామోదరనామ వైభవమును కీర్తించినది గోదమ్మ.

"తూయోమాయ్ వందునాం" త్రికరణ శుధ్ధులై రండి.దేనికి అంటే తుమలర్ పరిశుధ్ధ పుష్పములను తీసుకొని,వాయినాల్ పాడి-నోరార కీర్తిస్తూ,మనత్తినాల్ శిందిక్క మనసారా స్మరిస్తూ,తుమలర్ తూవివళదు-స్వామిపై పూవులు చల్లుదాము అంటున్నది తల్లి.

 ఈ పాశురములో తల్లి మధురను-యమునను-మాతృగర్భ ప్రకాశమును స్తుతించినది. .ఇది వాచ్యార్థము.

 " మాయావై" అన్న పదము స్వామి మూలతత్త్వమును-దాని బహుముఖ ప్రజ్ఞను సంకేతిస్తుంది.తల్లిగర్భమును ప్రకాశింపచేశాడు కన్నడు.మంత్ర గర్భులైన ఆచార్యులు మంత్రమును ప్రకాశవంతముచేస్తారు.అందరికి దాని వైభవమును అందచేస్తారు.

  .ఆచార్యులు మంత్రగర్భులై మంత్రమును ప్రకాశింపచేస్తారు.అంతే కాదు తమ అనుగ్రహమును ప్రసరించుటకు ఆగామి-సంచిత-ప్రారబ్దములనుండి మనలను సంస్కరించవలెనను బంధమునకు తమకు తాము కట్టబడి యుంటారట.వారు అనుగ్రహ బంధితులు.

   వారిసేవనము మన పాపరాశులను మాయము చేస్తుంది అన్నది తల్లి.

   ఇప్పుడు మనము రంగనాథ కరుణామృత సాగరములో గోదా అనుగ్రహమనే నావలో పర-వ్యూహ-విభవ-అంతర్యామి తత్త్వములను అధిగమించి,నారాయణనే నమక్కే అను అష్టాక్షరిని జపిస్తూ,హరి అను ద్వయ మంత్రమును మననము చేస్తూ,త్రిక్రమ వైభవమును చూస్తూ,మేఘములో దాగిన అంతర్యామి తత్త్వ దర్శనులమై,ఈ నాలుగు లక్షణములతో మధురలో నున చిన్ని కృష్ణుని మూల తత్త్వమును,దాని బహుముఖతవములను కొంచము కొంచముగా తెలుసుకుంటూ.శ్రీవ్రతాచరణమునకు అభిముఖులైనాము.ఇది మొదటి దశ.ఈ దశ నుండి రెండవ దశ యైన ఆశ్రయణత్వమును పూర్తిగా చేరుటకు మనలను దగ్గరుండి నడిపించగల వ్రతమును తమ అనుష్ఠాముతో-అనుగ్రహముతో చక్కగా నిర్వహించగల ఆళ్వారులు కావలెను.కాని వారు ఇప్పుడు గోపికా రూపధారులై భగవదనుభవమును వివిధరకములుగా అనుభవిస్తూ,ఆనందలోలులై ఉన్నారు.వారిని బహిర్ముఖులుగా మార్చి ఆధ్యాత్మికకు చేరువ కాగలుటయే ఈ పది గోపికల మేలుకొలుపుల ప్రహసనము.సంభాషణా మరంద పానీయము.భగవత్ తత్త్వమును పదివందికి పంచుటకు మనము రేపటి నుండి అత్యంత మనోహరమైన ఆ ఆళ్వారుల లీలా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.

  ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



.



.












MARGALI MALAI-04


  మార్గళి మాలై-04
  **************

 నాల్గవ పాశురము
 *************

 ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్
 ఆళియల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
 ఊరి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
 పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
 ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రు అదిరిందు
 తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళ్ పోల్
 వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
 మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
*************************

  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
  శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

  సముద్రగర్భపు నీటిని కడుపు నిండ త్రావి త్రేన్ చు
  కారుమబ్బు రూపములో గగనమునకు పయనించు

  పద్మనాభ చేతిచక్రకాంతి  వలె మెరుపులతో
  పెద్ద యుధ్ధపువేళ మ్రోగు శంఖము వలె ఉరుములతో

  రామబాణ వరుస వంటి రమ్యమైన జల్లులతో
  మార్గళి స్నానము చేయగ వరుణదేవ కనికరించు

 జగత్కళ్యాణమునకు జలసమృధ్ధినందించగా
 తల్లి తానె తరలివచ్చె  తానొక గోపికగా

  పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
  నప్పిన్నయ్ తిరుప్పావై కు రారాదో? ఓ గోపికలారా!


ఆళిమళై కణ్ణా!అను సంబోధనతో వరుణదేవుని ,వానిచే కర్తవ్య పాలనము చేయించుచున్న స్వామిని కీర్తిస్తున్నది.పర-వ్యూహ-విభవ-అంతర్యామి తత్త్వముగల అర్చామూర్తిని సంకీర్తించుచు వ్రతముచేయుటకు గోపికలను ఉన్ముఖులను చేయుచున్నది.తల్లి ఆచార్యుల జ్ఞానవృష్టిని ,వరుణదేవుని వానలతో బాహ్య-అంతరార్థములతో వివరించుచున్నది.మార్గళి స్నానమును చేయుటకు వర్షములను సమృధ్ధిగా కురిపించమని,మమ్ములను చిన్నబుచ్చనీయని నీ వితరణను ప్రదర్శించమని చెబుతున్నది.వరుణదేవుడు ఏ విధముగా సముద్రగర్భములోనికి ప్రవేశించి,కడుపునిండా నీటిని త్రావి,తేంచి,నల్లని మేఘముగా మారి,ఆకాశమువైపునకు పయనించి అమృతధారలను వర్షించుట,అదియును సుదర్శనచక్రపు కాంతి వంటి కాంతిగల మెరుపులతో,స్వామి పాంచజన్య శంఖనాదము వంటి ఉరుములతో,అంతే కాదు రామబాణ పరంపర వంటి జల్లులతో కురిసి అనుగ్రహహించమని వేడినది.ఇది వాచ్యార్థము.




( శ్రీమాన్ నమ్మాళ్వార్ ఇతర ఆచార్యులతో మనకు అందించిన జ్ఞానోపదేశమని శ్రీవైష్ణవులు విశ్వసిస్తారు. )



  ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు

స్వామి శంఖనాద ప్రణవ నాదము శేష-శేషి భావమునకు,శరమళై స్వరూప యాదాత్మ్య జ్ఞానమునకు సూచికలు.ఉపదేశములు-.వారి జ్ఞాన వాగ్వర్షము కాంతిని-విజ్ఞతను మెరుపు ఉరుముల వలె కలిగియుండును.తిరుగులేని రామబాణముల వరుస వలె అనవరతము అనుగ్రహించుచుండును అని అమ్మ పర-వ్యూహ-విభవ మైన ఆచార్య తత్త్వమును " ఆళిమళైకణ్ణా! అని ప్రస్తుతించినది."ముగందు కొడు" అని జ్ఞానమును పూర్తిగా సంగ్రహించిన వారిగా ప్రస్తుతించినది.వారి జ్ఞాన ధారలను"మగిళిందు పెయిదిడాయ్" ఆనందముగా వర్షించమని అభ్యర్థిస్తున్నది.లోక కళ్యాణమునకై గోదమ్మ తనను ఒక సామాన్య గోపికగా భావించుకొని మనందరకు వ్రతవిధానము అతి ముఖ్యమైన అనన్య శరణత్వమును అందించుచున్నది.



  (ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



.



MARGALI MALAI-03

MAARGALI MAALAI-03

  మార్గళి మాలై-03
********************

 మూడవ పాశురం
 ***************

  ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి
  నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్
  తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మురి పెఉదు
  ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్
  పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప
  తేంగాదే పుక్కిరుందు శీర్తమాలై పత్తి
  వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
  నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 **************************


  శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము
  శ్రీగోదారంగనాథుల అనుగ్రహము అనవరతము.

  పెరిగి లోకములను కొలిచిన పెరుమాళ్ సంకీర్తనలు
  కురిపించును నెలకు మూడువానలను కరువుతీర్చు

  పంటచేలు మింటితాకు పరమానందమును కూర్చు
  పడిలేచే చేపలతో సెలయేళ్ళు పరవశించు

  అందమైన పూలలో తుమ్మెదలు ఆదమరచి నిద్రించు
  సురభుల శిరముల క్షీరము సుభిక్షరూపమును దాల్చు

  శాశ్వతైశ్వర్యములు-శాంతిసౌభాగ్యముల నీయగ
  తరలివచ్చినది తల్లి తాను ఒక గోపికగా

  పాశురములు పాడుకొనుచు,పాశములన్నిటిని విడిచి
  నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో? గోపికలారా!


  " బ్రహ్మ కడిగిన పాదము-బ్రహ్మమురా నీ పాదము
    చెలగి వసుధ కొలిచిన నీపాదము" అని కీర్తించాడు అన్నమయ్య.

  స్వామి " ఓంగిఉలగలందన్ ఉత్తమన్" -పెరిగి తన పాదముతో భూమిని కొలిచిన స్వామి నీవుఉత్తముడవు అని కీర్తించినది.స్వామి ఎటువంటి దోషములు తాకలేనంత ఎత్తున ఉన్నాడన్నమాట.కనుకనే త్రివిక్రముడై తన పాదస్పర్శచే మూడులోకములను పవిత్రముచేయగలిగినాడు.పేర్పాడి -అటువంటి ఉత్తముని గుణగానము చేద్దామంటున్నది గోదమ్మ.

 తల్లి మొదటి పాశురములో అష్టాక్షరిని నారాయణన్ నమక్కే అంటూ,రెండవ పాశురములో ద్వయమంత్రమును (పరమన్)స్మరించి,మూడవ పాశురములో గీతాచార్యము లోని మమేక శరణం వ్రజ తత్త్వమును ప్రస్తావించి,తారకము-భోగ్యము-పోషకము అను మూడు విషయములు వివరించునది.ఆచార్య కుల సంబంధమును (త్రివిక్రమ తత్త్వమును) గోపికలుగా భావింపబడు మనకు పరిచయము చేసినది.





స్వామి నీవుమాదగ్గర లేకున్నను నీ నామము ఎప్పుడు మాతోనే ఉంటుంది.స్వామి నీ గుణవైభవమును కీర్తించగల శక్తిలేని వారము.కాని నీ గుణవైభవములు మమ్ములను కీర్తించకుండ ఉండనీయవు.అంతటి గొప్పవి.కనుక చదువు లేని మేము అతిశయమైన భక్తితో ఆలపిస్తాము.



  సిరి ఉరమున గల హరి సురులశ్రేయమును కోరి యాచకుడైనాడు.త్రివిక్రముడై బలి చక్రవర్తి అహమును పాతాళమునకు దించినాడు.అహంకారముతో కూడిన విహిత కర్మకు కూడ స్వామి పాదస్పర్శ అనుగ్రహించుట స్వామి స్వభావము.


  మంచి-చెడు,చిన్న-పెద్ద,పాప-పుణ్య అను భేదములు అధిగమించి,స్వామి పాదస్పర్శ చే సకలము పునీతమైనది.


 "తింగళ్ ముమ్మురి పెయిదు" అన్నది అమ్మ.నెలకు మూడువానలను పిలిచినది.ఏమిటా మూడు వానలు .బాహ్యమునకు జలసమృధ్ధి కరములైనప్పటికిని,వానిలో దాగిన విషయమేమిటి?

1.అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షకత్వము అను మూడు వానలు మనలను సత్వగుణ సంపన్నులను చేస్తుంది.

2.అకర ఉకార మకార మిళితమైన ప్రణవమును "ఓం" ను అమ్మ మూడు వానలుగా కీర్తిస్తున్నది.సస్వరూపమును దర్శింప చేస్తు,నిశ్చలభక్తి అనె ఏపుగా పండే పంటలకు ఎదురయే ఆటంకములను అధిగమింపచేసేవి ఆ వానలు.

3.పాలకులు-స్త్రీలు-బ్రహ్మజ్ఞానుల సత్ప్రవర్తనానుభవమును అమ్మ మూడు వానలుగా కీర్తించినది.



  స్వామి నీవు నడిచిన నేలను నెలకు మూడు వర్షములు కురియాలి నెలకు మూడు వానలు అను విషయము అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షణత్వము అను మూడు విషయములను గుర్తుచేస్తున్నది.బీడులు పడిన మన మనసు ఈ మూడు వానలతో తడిసి తాపమును తగ్గిస్తుంది..మేము మార్గళి స్నానమును చేయాలి.పంటచేలు మింటిని తాకాలి.వాటి మధ్యనున్న సెలయేళ్ళలో చేపలు సంతోషముతో గంతులేయాలి.కోనేటిలో పద్మములు విరగబూయాలి.వాటి మకరందమును ఆస్వాదిస్తూ తుమ్మెదలు మత్తుగా నిద్రించాలి.

 స్వామి గుణమనే తామరపువ్వులలోని అనుగ్రహమను మకరందము త్రాగి భక్తులను తుమ్మెదలు వీడి రాలేక యున్నవి.

 గోపాలా ! నీ విభవమనే సెలయేటిలో సామీప్య సంతోషమునందుచున్న చేపలవలె నిన్ను చూస్తు మమ్ము తుళ్ళనీ.

 అని ఆండాళ్ తల్లితో కూడిన గోపికలు స్వామిని కీర్తిస్తున్నారు.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...