Friday, November 29, 2019

MARGALI MALAI-06


     మార్గళి మాలై-06
    *******************

   ఆరవ పాశురం
   *************

 పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళ్రైయన్ కోయిలల్
 వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?
 పిళ్ళాయ్ ఎళుందిరాయ్! పేయ్ మాలై నంజుండు
 కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
 వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
 ఉళ్ళత్తు కొండు మునివర్గళుం యోగిగళుం
 మెళ్ళ ఎరందుకళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
 వెళ్ళత్తరవిల్ తు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుని అనుగ్రహము అనవరతము

 పక్షులు కిలకిలరవముల  ప్రస్తుతించు చున్నవి
 పక్షిరాజు శంఖము మార్మ్రోగుచున్నది.విను

 చక్కదనపు పూతనను పాలుతావి సంహరించె
 చీకటిభావపు శకటుని కాలదన్ని నేలగూల్చె

 యోగులు-మునులు మెల్లగ బహిర్ముఖులైనారు
 యోగీశ్వరుని సుస్వరముల కీర్తించుచున్నారు

 స్వామి-సేవక తత్త్వము,తెలిసికొన  మేలుకో
 తల్లి తానె తరలివచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుకుంటూ,పాశములన్నింటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో ? ఓ బాలిక!.!

  ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు మనము విభిన్నదశలలో నున్న గోపకాంతలను చూస్తాము.తన్మయ నిద్రలో పరవశించుచు తలుపులోపల నున్నవారు కొందరయితే,తమో నిద్రను వీడి భగవత్ సందర్శన-సాంగత్య-సాయుజ్యమును పొందుటకు తహతహలాడుచు,లోపలిగోపికలో నిద్రాణమైయున్న విశిష్ట శక్తులను జాగరూకము చేసి,జగత్కళ్యాణము గావింపవలెనన్న కోరిక కలవారు.అంతే కాదు ఆమెను మార్గదర్శకురాలిని చేసి,తాము అనుసరిస్తూ,వ్రతమును సఫలము చేసికొన దలచినవారు.


  వీరిలో ఎవరు ఎక్కువ భక్తికలవారో నిశ్చయించుట కష్టము.నిద్రిస్తున్నవారిది పారవశ్యము.మేల్కొలుపు వారిది ప్రాప్తి త్వరిత్వము.అందరును భగవదనుగ్రహమును పొందినవారే-బాంధవ్య విముక్తులే.

  గోదమ్మ ఈ పాశురమును " పుళ్ళుం శిలంబినకాణ్" అని పక్షుల కూతలతో ప్రారంభించినది.శ్రవణభక్తి మొదటిదశను మనకు పరిచయము చేస్తున్నది.ఏదో వినిపిస్తున్నది గాని శబ్ద స్పష్టత లేనిదానివలె నుండును.ఇది వాచ్యము.కాని ఇక్కడ పరిచయముచేయబడ్డ పక్షులు జ్ఞానులు.పరమహంసలు.అనుష్ఠానము-అనుగ్రహము అను రెండు రెక్కలు కలవారు.ౠషుల వాక్కులే పక్షుల కూతలు.వారు ఆకాశములోనికి ఆ-అంతట-కాశము-వెలుగు కల చోటికి వెళ్ళుచున్నారు.మూలతత్త్వ దర్శనమునకు సిధ్ధమగువారు.

 ఈ విషయమును తల్లి "పిళ్ళాయ్" అని సంబోధిస్తూ చెప్పినది.ఓ చిన్నపిల్లా! ఓ బాలా అని.అంత పెద్ద విషయమును ఇంతచిన్న పిల్లకు అమ్మ చెబుతోంది.అంటే ఓ బాలా! గ్రహణము-ధారణము-పోషకము అను మూడు సద్గుణములు పుష్కలముగా నున్న దానా! ( శ్రీమాన్ పెరియాళ్వారునిగా భావిస్తారు.)

 పక్షికూతల గుర్తు చెప్పినా పిల్ల లేవలేదు కనుక ఈ సారి గోదమ్మ 'పుళ్ళరయిన్" పక్షిరాజ వాహనుడైన శ్రీకృష్ణుని తెల్లని శంఖరవమును చెప్పినది.స్వామి శంఖము "విళి శంగిన్" తెల్లనైన సత్వగుణము కలది.కారణము లేని కదనమునకు కాలుదువ్వదు.అంతే కాదు.ఆ శంఖము ఇప్పుడు "పేరరవం" పెద్ద ధ్వనిని చేయుచున్నది.ఏమిటా పెద్దధ్వని.బాహ్యమునకు భక్తుల స్వామి నామస్మరణ.ఆంతర్యము ఎవ్వరుని ఇంతగొప్పదని లెక్కించలేని ప్రణవము.దానిని" కేట్టిలైయో? వినలేదా అని అడుగుతున్నది.

  తాదాత్మ్యములో నున్న గోపిక స్పందించని కారణమున ఈ సారి యోగుల మునుల హరినామమును సూచించినది.మననముచేయుచు ఆనందమును అనుభవించువారు మునులైతే.కైంకర్య రూపమున ఆత్మానందమును అనుభవించువారు యోగులు.వారు తమ మనసులలో వేదవృక్షబీజమైన స్వామిని భద్రపరచుకొన్నవారు.(ఉళ్ళత్తు కొండు).వారు తాము చటుక్కున కళ్ళు తెరిస్తే తమ కనులలో నున్న స్వామికి కష్టము కలుగునని మెల్లగా కన్నులు తెరిచి,మెళ్ళ ఎరందు,ఎదురుగ నీలమేఘశ్యాముని లీలా మానుషరూపుని చూస్తూ,ఆనందమును పట్టలేక బిగ్గరగ హరి-హరి అని సంకీర్తిస్తున్నారు.(అరిఎన్ర పేరరవం)

 పూతన జీవితహర-శకటాసుర భంజన అని కీర్తిస్తున్నారు స్వామిని.

"పేయ్ మాలై నంజుండు"
 తమోగుణుడైన కంసుని పంపున కృష్ణుని తన పాలిచ్చి చంపుటకు వచ్చినది పూతన.అయినప్పటికిని అజామిళుని వలె హరి సాయుజ్యమును పొందినది.మన అజ్ఞానమే పూతన.కామరూపియై (బాహ్యాడంబరలు మెచ్చు) గోపాలుని సమీపించినది.స్తన్యమునిచ్చి స్వామిచే సంస్కరించబడినది.

"కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి"



" శ" అనగా సుఖము."కట" అనగా ఆటంకము.పరమానందమునకు ఆటంకమును కలిగించునది శకటము.అదే మన శరీరము.ఇంద్రియనిగ్రహము లేక ఇబ్బందులను కలిగించును.మనోరథములతో రథమును సరిగా నడువనీయని అసురీ గుణమును నిర్మూలించిన స్వామిని కీర్తించుచున్నారనగానే,గోపిక బహిర్ముఖత్వమును పొంది ఆండాళ్ తల్లిని అనుసరించ సాగినది.,ఆ గోపికను తమతో కలుపుకొనిగోష్ఠికై,వేరొక గోపికను నిద్రలేపుటకు గోదమ్మ వెళుతున్నది.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...