Sunday, October 22, 2017

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)

" జానక్యా: కమలాంజలి పుటేయా: పద్మరాగయితా:
న్యస్తా రాఘవ మస్తకేన విలసత్లుంద ప్రసునాయతా:
స్రస్తా శ్యామల మస్తకాంతి కలితా యాఇంద్ర నీలాయుతా:
ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"

అప్పా,  రామభక్తి ఎంతో గొప్పరా !!!
**********************************
స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి, బుధవారము
పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న
సీతారామ కళ్యాణములో
తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా
జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత
వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి
అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు
కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు
ఇంతలో
మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై
పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి
మగపెళ్ళివారము మేము అంటూ అహల్య
పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది
రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది
రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది
ఆడ పెళ్ళివారము మేము అంటూ మొల్ల
వేదవతి పాదము అని పారాణిని అద్దింది
పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింది
చక్కని చుక్క సీత అని బుగ్గ చుక్క పెట్టింది.
ఆహా.... ఏమి మా భాగ్యము
ఎదురుబొదురు వధూవరులు ముగ్ధ మనోహరము
తెరసెల్ల మధ్యనుంది చెరొక అర్థ భాగము.
ప్రవర చదువుతున్నారు వశిన్యాది దేవతలు
ప్రమదమందుచున్నారు పరమాత్ముని భక్తులు.
వివాహ వేడుకలను వివరించుచున్నారు విశ్వనాథ
ఎన్నిసార్లు వినియున్నా తనివితీరని కథ.
" మాంగల్యం తంతు నానేనా-లోక కళ్యాణ హేతునా"
పట్టరాని సంతోషము మ్రోగించె గట్టిమేళము
రాముడు కట్టిన సూత్రముతో మెరిసినది సీత గళము
తలపై పట్టు వస్త్రములతో, ముత్యాల తలంబ్రాలతో
తరలి వస్తున్నారు తానీషా వారసులు.

సుమశరుని జనకునకు సుదతి సీతమ్మకు
శుభాకాంక్షలై కురిసెను సౌగంధిక సుమములు.
వానతోడు తెచ్చుకున్న హరివిల్లు తళుకులుగా
హర్షాతిరేకముగా విరబూసెను తలంబ్రాలు.
"ఒకే మాట, ఒకే బాణం ఒకే పత్ని" రామునకు అని
మురిసిపోతున్నారు ముందు వరుసలోని వారు.
ఒడ్డుకు చేర్చు దేవుడని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
నారాయణుడితడంటు నారదునితో విభీషణుడు
ఆశీర్వచనము చేస్తూ ఆ విశ్వామిత్రుడు
దండము పెట్టేనురా కోదండపాణి చూడరా
అని అండజుడు

సీతమ్మకు చింతాకు పతకమునిస్తూ రామదాసు
మా జానకిని చెట్టపట్టగానే మహరాజు వైతివని
మేలమాడు త్యాగరాజు.

సీతా రాముల పెళ్ళంట- అంగరంగ వైభోగంగా
చూసిన వారికి పుణ్యాలు అంటూ అందరూ
తమని తాము మరచిపోతుంటే,
శ్రీరామ అను చిలుక సేసలు అందిస్తోంది
పందిరిలో పరుగిడుతూ సందడిగ బుడత ఉడుత
అక్షింతలు అందరి తలలపై వేసుకోమంటున్నది.
పానకమును అందిస్తున్నారు సనక సనందనాది మునులు
ప్రసాదము అని వడపప్పును పంచిపెడుతున్నారు
చూడ చక్కని జంట అని చూపు తిప్పుకోలేక పోతున్నామన్న
మాటలు వినబడి వారికి దిష్టి తగులుతుందేమోనని
సూక్ష బుద్ధితో వెంటనే అదిగో అటు చూడండిరా
సీతా రాములు
అలిసిపోయి ఉన్నారని వారికి ఆకలి అవుతున్నదని
పండ్లను తినిపిస్తున్నది పండు ముసలి ఆ శబరి.
చైత్ర శుద్ధ నవమికి ఈ నేత్రోత్సవమబ్బెనా
శుభలక్షణములను అభిజిత్ లగ్నము అందుకోగలిగెనా
ఆబాల గోపాలపు ఆనందము హెచ్చెనా
సీతారామ కళ్యాణము సురుచిరమై కొనసాగునా
చెప్ప నలవికాదురా " సీతారామ కళ్యాణ వైభోగము"
కంటి రెప్పవైన మా అప్పా!
రామ భక్తి ఎంతో " గొప్పరా."

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...