పాహిమాం చాముండేశ్వరి-చల్లని తల్లి శైలసుతే
************************************
జయస్వదేవి చాముండె-జయభూతాపహారిణి
జయసర్వగతేదేవి-కాలరాత్రి నమోస్తుతే
విశ్వమూర్తి యుతేశుద్ధే-విరూపాక్షి త్రిలోచని
భీమరూపే శివే విద్యే-మహామాయె మహోదరె
మనోజయె-మనోదుర్గే-భీమాక్షి క్షుభితక్షయే
మహామారి విచిత్రాంగి-గీతనృత్యప్రియే శుభే
వికరాళిమహాకాళి-కాళికే పాపహారిణి
పాశహస్తే-దందహస్తే-భీమహస్తే భయానకే
చాముండే జ్వాలామాలస్యే-తీక్ష్ణ దంష్ట్రే మహాబలే
అన్న స్తుతిని వింటున్నప్పుడు అప్రయత్నముగా మనోవీధిలో చాముండా దేవి దర్శనమిస్తుంది కరుణతో.
ఇప్పటివరకు మధుకైటభ సంహారము విష్ణువు ద్వారా అమ్మ పరోక్షసక్తిగా చేయించింది.
మహిషాసురుని సమిష్టి శక్తిగా మారి సంహరించింది.
దైవకార్య నిమిత్తము పార్వతి కౌశికి అను శక్తిని తన శరీరమునుండి ప్రకటింపచేసి,కాళిగా తాను హిమాచలమునకు మరలినది.
శుంభ-నిశుంభులను సంహరించుతకు వచ్చిన కౌశికి/అంబిక ,చండముండులకు ముక్తిని ప్రసాదించుతకై "కాళి" అను మరొక శక్తిని తన భృకుటినుండి ప్రభవింపచేసినది.
వారి మాటలు వినిన శుంభుడు సుగ్రీవుని అంబిక దగ్గరకు దూతగా పంపాడు.
సుగ్రీవుడు దేవికి శుంభుని తలపును/పనుపును తెలియచేయగా అమ్మ ప్రసన్నవదనముతో,
నీవు పలికిన మాటలు నిజమేకాని.కాని నేను నా వివాహవిషయమున ఒక ప్రతిననిబూనియున్నాను.అదేమనగా,
" యోమాం జయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి
ఏతద్ బుద్ధ్యా సమాలోచ్య మత్పరిగ్రహతాం వ్రజ."
యుద్ధమున నన్నెవరు గెలుచునో ,నా దర్పమునెవడు అణచునో,లోకమున బలమున నాకెవడు సాటియగునో అతడే నాకు మగడు కాగలడు అనగానే,
దూతమర్యాదలనతిక్రమించి,పరుషముగా దేవితో వాడు,
నీవు పొగరుబోతుదానివి.శుంభ-నిశుంభులనెదిరించువారు మూడులోకములలోను లేరు.ఆడుదానివి/అబలవు అని
ఒంటరిదానవి.శుంభునెదిరించి అగౌరవముపాలుగాకు అని హెచ్చరించాననుకుంటూ,శంభునికి దేవిప్రతినను తెలిపెను.
విఫలమైన రాయబారము శుంభుని క్రోధమును మరింతపెంచినది.తన సైన్యాధికారియైన ధూమ్రాక్షుని అరువదివేల రాక్షసైన్యముపై దండెత్తుమనుటయే కాక సభ్యతను మరచి,నీవెటులైనను దానిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను.
అసలే వాడికన్నులు పొగచూరియున్నవి.ప్రకాశమును చూడలేనివి.వాని మూర్ఖత్వముతో నీవు నావెంట శుంభుని దగ్గరకు రాకున్న నీ జుట్టుపట్తుకుని ఈడ్చుకుని పోయెదనని పలుకుచుండగా,
శాంతముగా నున్న కౌశికి/అంబిక వానిని భస్మముచేసెను.దేవి సింహము సౌన్యమును నాశనము చేసెను.
విషయము తెలిసికొనిన శుంభుడు మండిపడుతూ మదముతో
చండముండులతో మీరు సైన్యసమేతులై వెళ్ళి,ఆమెను,ఆమె సింహమునువధించి కట్టి నా దగ్గరకు తెమ్మనెను.
దూతను పంపినప్పటి మాటలు చండముండులను పంపునప్పటి మాటలను గమనిస్తే తామసము తప్పులెన్నింటైనను తడబడక చేయిస్తుంది.తారతమ్యములను ఆలోచించనీయదు.
దేవిని సమీపించి వారు ధనుస్సుల త్రాటిని లాగి ,కత్తులను చేతబూని దేవిపైకెగిసిరి.
దేవిముఖములో ప్రసన్నత కనుమరుగైనది,నల్లగా మారినది.భృకుటి ముడి నుండి ఒక అద్భుతశక్తి ప్రకటింపబడినది.
" భృకుటీ కుటిలాత్తస్యా లలాటఫలకాద్ద్రుతం
కాలీ కరాల వదనా వినిష్క్రాంతాసి పాశినీ."
ఆ కాళి రూపము
" విచిత్ర ఖట్వాంగధరా నరమాలా విభూషణా
ద్వీపిచర్మ పరీధానా శుష్కమాంసాతి భైరవా"
కత్తి-పాశము-ఖట్వాంగము-పుర్రెలమాల-పులిచర్మవస్త్రముతో మాంసములేని అస్థిపంజరమువలె
మిక్కిలి భయంకరముగా నుండెను.
యుద్ధభూమిలో తిరుగుచు శత్రుసైన్యములనేకాక,వారి గజములను,మావటీలను,వాటికి కట్తబడియున్న ఘంటలను సైతము మింగివైచుచుండెను.
కలయతీతి కాలం-సర్వమును భక్షించుచు తనలో నిక్షిప్తము చేసుకొను కాలస్వరూపమైన కాళి,శుంభుని సైన్యమునంతటిని పడవైచి మింగివేయుట చూసి,చండ-ముండులు ,
"శరవర్షైః మహాభీమైః భీమాక్షీం తాం మహాసురః
ఛాదయామాస చక్రైశ్చ ముండః క్షిప్తైః సహస్రః"
చండుడు కౄర బాణములతోను,ముండుడు వేలవేల చక్రములతోను కాళిని కప్పివైచిరి.
వెంటనే కాళిమిరుమిట్లుకొలుపు తన కాంతులతో భయంకరముగా నవ్వుతు,
"ఉత్థాయ చ మహాసిం హం దేవి చండమథావత
గృహీత్వా చాస్య కేశేషు శిరస్తే నానాఛ్చివత్."
దేవి భవారణ్య కుఠారికను పైకెత్తి హుంకరించి,చండుని జుట్టు ఒకచేత పట్టుకుని,మరొకచేత ఖడ్గముతో వాని తలను ఖండించెను.
ముండుడు దేవిపైకి రాగా తల్లి వాని భవారణ్యములను పాపములను తెంచుకోలేని అడవులను తన కత్తితో ఖండించివేసెను.
చండిక దగ్గరకు ఆ ఖండించిన రెండు తలలను తల్లి చేయుచున్న అసురసంహారమనే యజ్ఞమునకు పశువులుగా సమర్పిస్తూ,
" మయా తవాత్రోపహృతౌ చండ-ముండ మహాపశూ
యుద్ధయజ్ఞే స్వయం శుంభమ్నిశుంభం చ హనిష్యతి"
నీ యుద్ధ యజ్ఞమునకు చండముండ పశువులను ఆహుతులగానిమ్ము.స్వయముగా నీవే శుభ-నిశుంభులను వధింపుము అని నమస్కరించగనే
అంబిక అత్యంత వాత్సల్యముతో
" యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వాతం ఉపాగతా
చాముండేతి తతోలోకే ఖ్యాతా దేవి భవిష్యసి".
ఓ కాళి వీరిని సంహరించి నీవొనరించిన లోకకళ్యానమునకు ప్రతీకగా నీవు చాముండ నామముతో ప్రస్తుతింపబడెదవు గాక అని ఆశీర్వదించెను.
సంకేత పరముగా మూలాధారచక్రమును చండునిగాను-సహస్రారమును ముండునుగాను భావించి,మూలాధారమునుండి సహస్రారమువరకు యోగశక్తి ఊర్థ్వపయనమునకు కలిగించుచున్న అవరోధములను నిర్మూలించుకొనుటయే చంద/ముండ వధ.
అఖిలాండేశ్వరి-చాముండేశ్వరి
పాలయమాం గౌరి-పరిపాలయమాం గౌరి.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.