Wednesday, October 4, 2017

CHIDAANAMDAROOPAA-MURUGA NAAYANAARU

   కలనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
   కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా


  యోగుల స్వేదబిందువుల వేదపు పూలగా మారు
  శివలీల చాటగ వేదికయైనది తిరువుకలూరు

  చేతిలో పూలసజ్జ రమణీయము,చేయు జపము అనుసరణీయము
  ఆనంద భాష్పాభిషేకము  తోడుగ శివునకు పుష్ప యాగము

 తిరుజ్ఞానిని మురుగను  స్నేహము  బంధించినది
 జ్ఞాని పాణిగ్రహణము ప్రాణ నిష్క్రమణ పరీక్షయైనది

 నిశ్చింతగ అందరు జోతల జ్యోతిని  చేరినారుగా
 శివసాయుజ్యమును పొందగ స్నేహము కారణమాయెగ


 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. 

CHIDAANAMDAROOPAA-TIRUNAALAIPOEVAAR NAAYANAARU


   చిదానందరూపా-19

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 తిరునాలై పోవార్ నాయనారు  తిరిపమెత్తువాని  భక్తుడు
 "గీతం సమర్పయామి" అంటు సంగీత సామాగ్రినిచ్చెడివాడు

  తిరువంకూరల్ శివదర్శనమునకు అడ్డమైనది  నందివాహనము
  శిరముని వంచి ఆదర్శమైనది  విడ్డూరముగ  నందనారుకు

  తిరునాలైపోవార్  అనగా రేపువెళ్ళువాడు  అని అర్థము
  శివయానై  వెళ్ళెను చిదంబరమునకు కనకమహాసభ దర్శనార్థము

  చిన్నకులమువాడన్న వాదును చెరిపెను,శివ కులములోనికి చేర్చెను
  అగ్నినేత్రుని  జ్యోతిగ కొలువగ  అగ్నిస్నానమె  కారణమాయెగ

  చిత్రముగాక ఏమిటిది చిదానందుని  లీలలు గాక
  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు  తీర్చును గాక.

 కులము అనే పదమునకు నాలుగుగా పనిని బట్టి విభజించిన విభాగము గాను,సమూహముగాను మనము అన్వయించుకుంటే మహాశివుడు అన్ని విభాగములలోను,అన్ని విభాగ సమూహములలోను స్థూల-సూక్ష్మ రూపములలో నిండియున్నాడనుటకు నిదర్శనమే కదా పరమ భక్తాగ్రేసర నందనారు పుణ్య చరితము.విచక్షణ మరచిన పెద్దలు అంటరానితనమను ముద్రను అంటించినను ముద్రను తగిలించినను తగవులాడక, అనేక శివ క్షేత్రములను తన్మయత్వముతో దర్శించుచు,"శిశుర్వేత్తి-పశుర్వేత్తి-వేత్తి గానరసం ఫణిః" అను శ్రుతిని అనుసరించి,తన స్వామిని ఆరాధిస్తున్న నాగులకువానిని ఆదరిస్తున్న స్వామికి సంగీతము ఎంతోఇష్టమైనది కావున దేవళములలో భేరి-మృదంగము-వీణ తీగెలు మొదలగు సంగీతోపకరణములను సమర్పించి పులకించిపోయే వాడు. 

        చిక్కబడ్డ భక్తి చక్కదనమును తెలియచేయాలనుకున్నాడు ముక్కంటి.తిరువంకూరులోని స్వామిదర్శనాభిలాషను కలిగించాడు నాయనారుకు."విఘ్నేశ్వరును పెళ్ళికి అన్నీ విఘ్నాలే" అన్నట్లు స్వామిని చూడాలంటే నంది అడ్డముగా నిలిచినది.పరితపుడైన తన భక్తుని ధ్యానమునకు మెచ్చి,క్షిప్త ప్రసాదుడైన (త్వరగా అనుగ్రహించేవాడు) స్వామి పరీక్ష చాలనుకొని,నందిని కొంత పక్కకు తొలగమన్నాడు.తన సర్వస్యమైన స్వామి ఆనను,అనుగ్రహముగా భావించి,కొంచము పక్కకు వంగినది నంది వాహనము. నంది వంగుటకు కారణమైన తిరునాలై నందనారుగా ప్రసిద్ధికెక్కాడు.ఓం నమః శివాయ.


 కాలాతీతుడైన శివుడు కాల చక్రమునుతో తోడుగా కోరికలను కూడా చట్రములను బిగించి తిప్పుతుంటాడు.అదే జరిగింది మన నందనారు విషయములో."సన్జా రంభ విజృంభితుడు " ఆ సదా శివుడు.కనకమహా సభలో నాట్యమును చూడాలనే కోరిక బలీయము కాసాగింది నాయనారుకు.కులవ్యవస్థ అంతరార్థమును తెలియని అపార్థము పడగ విప్పింది .నందనారు అడుగులను కదలనీయలేదు.తిల్లై బ్రాహ్మణ వర్గముగా మారి వీల్లేదంది.ఘటనాఘటన సమర్థుడు అగ్ని నేత్రుడు నందనారును అగ్ని పునీతునిగా అనుగ్రహించ దలిచాడు.

    అగ్ని ప్రవేశమును చేసిన నందనారు విభూతి రేఖలతో,యజ్ఞోపవీతముతో,జుట్టు ముడితో ,వినూత్న తేజవంతుని గా ఆశీర్వదించిన ఆ సుందరేశ్వరుడు మనలనందరిని పునీతులుగా చేయుగాక.

  ( ఏక బిల్వం శివార్పణం.

CHIDAANAMDAROOPAA-ERIPAATA NAAYANAARU

"ప్రౌఢో‌உహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టో‌உవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"

  చిదానందరూపా- ఎరిపాత నాయనారు
 *********************************

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 కనుగానక కమ్మిన మైకము హానిని చేయనీయక
 పరశును చేతదాల్చి పరమేశుని భక్తుల సేవచేయు

 తా చేసిన పాప-పుణ్యముల తడబడనీయక
 చూసిన శివాపరాధమును చివాలున గొడ్డలి విసిరివేయు

 ఏనుగు చేసిన ఘోరము ఎదకోయగ ఆ ఎరిపాతకు
 ఏమరుపాటును సేయక ఆ కరినే తను హతమార్చెను

 కామ సంహారుని కొలువగ తానును సంహారమునెంచు కొనియెగ
 గజవదనుని తండ్రిని చేరగ  గజమే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు  గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక


  అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు. శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.

   ( ఏక బిల్వం శివార్పణం.) .

CHIDAANAMDAROOPAA-IYARVAGAI NAAYANAAR


 చిదానందరూపా-17

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 శివుడు  బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు
 ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు

 లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు
 నివేదనమనుకున్నాడు, నిజపత్నిని  పంపించాడు

 బ్రాహ్మణునకు-భార్యకు బాటలో  బాసట తానైనాడు
 అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు

 శర్వునకు  నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా
 నిర్వాణమునందీయగ  భార్యయే  కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు  చింతలు తీర్చును గాక.

కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.
పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు శివుడు.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక
( ఏక బిల్వం శివార్పణం.)

LikeShow more reactions

Comments

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...