Thursday, October 5, 2017

CHIDAANAMDAROOPAA-SUMDARA NAAYANAAR.


  చిదానందరూపా-సుందర నాయనారు-24





" పిత పిరాయి సూడి."

  చిదానందరూపా- సుందరమూర్తి నాయనారు
 *******************************************

     కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 హాలాహలధరుని  సఖుడు   అలల సుందరారు
 సదయ-ఇసయల  సుతుడు ఇలను పేరు అరూరారు

 నరసింగ మానై ఇంట పెరుగుచు,నగజపతిని  నమ్మి కొలుచు
 అల్లుడితడని పెండ్లిచేయ నందకవి  సుందరారుని పిలిచె

 తానొకటి తలచినవేళ దైవము వేరొకటి తలచు అని అన
 తాళికట్టనీయకనే తగవుగ  వానిని తన బానిసనియెగ

 పితకు బానిసననియున్న పత్రము  పెద్ద విచిత్రమునే చేసెగ
 పినాకపాణి కృపనుపొందగ పిత అను పిలుపు  కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

     నవ విధ భక్తులలోనిదైన సఖ్య భక్తితో శ్రీకృష్ణుని కొలిచినది కుచేలుడైతే,పరమేశ్వరుని కొలిచినది సమయాచారపరుడైన సుందరారు నాయనారు.జగద్రక్షణార్థము కేవలము 18 సంవత్సరములు మానవ శరీరమును ధరించిన మహా జ్ఞాని.క్షీరసాగర మథనమునందు జనించినహాలాహలమును తన అరచేత ధరించి పరమేశునకందించుటచే హాలాహల సుందరారు అని,కాల క్రమేణ అలల  సుందరారు అని కీర్తింపబడుచున్నాడు.

       సుందరారు మానవ శరీరమును ధరించుటకు రెండు కారణములను పెద్దలు ప్రస్తావిస్తారు.
 1.కైలాసములో నున్నప్పుడు శివపూజకు పూవులను సేకరించు సమయమున,అక్కడకు పూలనిమిత్తమువచ్చిన పార్వతీదేవి చెలికత్తెలైన,కమలిని-అనిందితిని అను వారిని క్షణకాలము మోహదృష్టితో చూచినందులకు ఆగ్రహించినఆదిదేవుడుమానవుడై పుట్టి వారిని మనువాడమనుట.తప్పు తెలిసుకొని శరణువేడిన సుందరుని చూసి,శంకరుడు సాప పరిధిని తగ్గించుట.
 2 రెండవది బాహ్యమునకు శాపము కారణమైనప్పటికిని,తద్వారా సుందరారు కీర్తనలను-కీర్తిని లోక పూజ్యము చేయుటకు అనుగ్రహము ఆగ్రహ మేలిముసుగును ధరించి మేలుచేసినది.
 ఓం నమః శివాయ.

  తిరునావలూరులో సదయ నాయనారు-ఇసయజ్ఞాని నాయనారులకు దైవానుగ్రహము వలనపుత్రుడుగా జన్మించిన సుందరారు నామధేయము నంబి అరూరారు
" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
  త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం సమార్పణం'
 అటువంటి ఏకబిల్వమే సదయ-ఇసయ-సుందర నాయనార్ల కుటుంబము. .

    సుందరారు తాళికట్టు సమయమునకక్కడికొక పిచ్చివాడు చేతిలో ఒక పత్రముతో వచ్చి, పెండ్లిని అడ్డుకొనెను.వాని చేతనున్నపత్రమును పెద్దలకు చూపిస్తు,వీడు నా బానిస కనుక నేను వీడిని నాతో తీసుకొని పోతాను అని చెప్పెను.సాక్ష్యమైనపత్రమును చదువగా అందులో " నేను పితకు (పిచ్చివానికి) వాని వంశమువారికి బానిసనని త్రికరణగా అంగీకరిస్తున్నానని వ్రాసి,సుందరారుచే సంతకము చేయబడి ఉన్నది.సంతకము సరిపోవుటతో చేయునదిలేక వారు పెండ్లికొడుకును తనతో తీసుకొనిపోవుచున్న పిచ్చివానిని వాని ఇల్లుచూపమని వెంబడించిరి.కొంతదూరము సాగిన తరువాత వారిరువు గుడి దగ్గర అదృశ్యమైనారు."ఓం నమః శివాయ."

" నా మనసంతా నిండె శివ పదమె
  గురువై నడిపించె శివ పథమే' అని కీర్తించుచున్న సుందర నాయనారును ఆనందపరచుచున్న ఆ మహాదేవుడు మనందరిని శివ పథము వైపు నడిపించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం)



CHIDAANAMDAROOPAA-POOSALAR NAAYANAARU.


 చిదానందరూపా-పూసల నాయనారు-23

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 మానస మందిరమునకు మంచిముహూర్తమును ఎంచుకొని
 శంఖుస్థాపన చేసెను మహనీయుడు పూసల నాయనారు.

 కావలిసిన హంగులనన్నీ మనమున సమకూర్చుకొని
 మహేశ్వరుని మందిరమున నిలుపగ నిశ్చయించెను

 కంచిలో రాజును కట్టించెను  బృహదీశ్వరాలయమును
 ఇరువురి సమయము ఒకటిగ  చేసెను  చిక్కుగ శివుడు

 కథమారగా రాజుకు  సర్వము  అవగతమాయెగ
 మదనాంతకు చేరగ మానసపూజయే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.


 భక్తి ప్రకటితముగము-అప్రకటితముగను విరాజిల్లుతుంది.వింతలను చూపుతుంది.ప్రకటిత భక్తి పరమపదమునందిస్తుంటే అప్రకటిత భక్తి పరమాద్భుతముతో కూడిన పరమానందానికి పాత్రులను చేస్తుంది.గమనము వర్వరు దారులలో చేసినా గమ్యము మాత్రము ఆ పరమేశ్వరుని సన్నిధియే.మహా భారతములో పరమభక్తి తత్పరుడైన భీమిని అప్రకటిత భక్తిని అనురక్తితో అర్జుననకు తెలియచేసాడట పరమాత్మ.ఒకసారి అర్జుననకు గుట్టలు గుట్టలుగా హరినామస్మరణ చేస్తూ నిర్మాల్యమును ఎత్తిపోస్తున్నవారు కనిపించారట.అదిచూసి విస్తుపోయిన అర్జునుడు తనకంటే స్వామిని నిరంతరము కొలిచే ఆ భక్తుని గురించి ప్రశ్నించాడట.దానికి పరమాత్మ నవ్వుతొ నీ అన్నగారైన భీముడు చేయు మానసపూల పూజా నిర్మాల్యము అది అన్నాడట.వాసుదేవ నమోస్తుతే-వామ దేవ నమోస్తుతే.

  పూసలర్ నాయనారు దివ్య చరితములో ఒకేరాజ్యములో, ఒకే దేవునిపై ప్రకటిత-అప్రకటిత భక్తి ఆదిదేవుని అర్చిస్తూ,ఆతని చిద్విలాస లీలను మకు అందచేస్తు తానును ధన్యమైనది.

   పూసలర్ నాయనర్ తొండైమండలములోని తిరునిన్రాపురములోని పరమ శివభక్తుడు.కాని సామాన్యుడు.మానసికోపాసన మహోత్కృష్టతను చాటిన మహనీయుడు.మానసికోపాసన సమాధి స్థితిని,ఆత్మ దర్శనమును త్వరితము చేస్తుంది.పూసలర్ పరమేశ్వరునికి మందిరమును నిర్మింపదలచాడు.పైకము తగినంత తనదగ్గర లేదు.పరమేశ్వర సంకల్పమేమొ !మానస మందిర నిర్మాణమునకు పూసలారు మనమున అనుగ్రహ బీజమును నాటినాడు ఆ శివుడు.అది మొలకెత్తి పెద్దదగుటకు తన కటాక్షమను గంగను కురిపించినాడు.అనుకూలతకు అన్ని హంగులను సరంజామలను పూసలారు తాను సమకూర్చుకున్నానని భావించేలా చేశాడు.ఇంకేం మంచి సమయమున మానసికముగా శంఖుస్థాపన చేసి తనకు నచ్చిన విధముగా నందివాహన మందిరమును నిర్మించి,స్వామి ప్రతిష్ఠకు స్థిర ముహూర్తమును నిశ్చయించుకొని,స్వామికి విన్నవించాడు కరుణించి విచ్చేయమని స్వామిని పూసలారు.
  అప్రకటిత భక్తి అనిశము ఈశుని సేవిస్తుంటే నేనున్నానంటు ప్రకటిత భక్తి పందెము వేస్తూ కాడపరాజు రూపములో కంచిలో బృహదీశ్వరాలమును బ్రహ్మాండముగా నిర్మింపచేసి,స్వామి ప్రతిష్టకు అదే ముహూర్తమును సుముహూర్తముగా నిర్ణయింపచేసినది.

    పరీక్షపెట్టు పరమేశ్వరుడు వాడే- కటాక్షించు సర్వేశ్వరుడు వాడే ఆసక్తికరమైన ఆటను ప్రారంభించాడు.అభ్యర్థించిన తన భక్తుడైన రాజుకు స్వప్న సాక్షాత్కారమునందించి ముహూర్తమునకు రాలేని తన  నిస్సహాయతను వివరించాడు.నిర్ఘాంతపోయాడు రాజు.మేల్కొని తాను పూసలర్ నాయనారు నిర్మించిన ఆలయమును దర్శించవలెనని తిరునినాపురమునకు వెళ్ళి పూసలారును దర్శించి శివలీలా విశేషములను కొనియాడుతూ చిరస్మరణీయులైన వారిని కరుణించిన సదాశివుడు మనందరిని కరుణించును గాక..
  ( ఏక బిల్వం శివార్పణం.)
 .

CHIDAANAMDAROOPAA-POOGAL CHOLA NAAYANAARU

 చిదానందరూపా-పూగళ్ చోళ నాయనార్-22

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలదనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

  పూగళ్ చోళరాజు పాశుపతేశ్వర స్వామిభక్తుడు
  కరూరు రాజులను సామంతులుగ చేసిన కార్యదక్షుడు

  మనసు వజ్రకఠినము  రాజ్యధిక్కారమునకు
  కప్పము కట్తలేదని ఆడిగళ్ కోటను ముట్టడి చేసెను

  ఆ మనసే పుష్ప కోమలము శైవ సత్కార్యములకు
  పూజించెనుగ ఎరపాతు నాయనారును పెద్దమనసుతో

  ఖండిత శత్రుతలలలో శివ భక్తుని  శిరము కానబడియెగ
  ఖండోబాకు ఆత్మార్పణమంటు అగ్నిప్రవేశము కారణమాయెగ

  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
  చిత్తము చేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.


 పూగళ్ చోళ నాయనారు చోళదేశములోని ఉరైయూరు రాజు,రాజధర్మమును సమర్థవంతముగా నిర్వర్తించుచు,శివుని-శివభతులను పరమప్రీతితో సేవించేవాడు.చోళ నాయనారు తనసామంతురాజైన ఆదిగల్ తనకు కప్పము కట్టలేదని తన సైన్యమును దండెత్తమని ఆదేశించెను కాని శివభక్తులకు హానిచేయవలదని సూచనను ఈయలేదు.వారు రాజాజ్ఞగా దండెత్తినంతనే ఆదిగన్ భయపడి వెన్నుచూపెను.మిగిలిన సైన్యముతో పోరి వారిని వధించి,తమ రాజు సంతసించునని ఆదిగల్ ధనరాశులను,చంపినవారి శిరములను తీసుకొని వచ్చి చోళ నాయనారు ముందుంచారు.

 రాజు ధర్మపాలనకు శివభక్త లాలనకు మధ్యన గలమర్మమును జగద్విఖ్యాతముచేయాలనుకున్నాడు .తెచ్చిన తెగిన శిరములలో , విబూది రేఖలతో ప్రకాశించే ఒక శివభక్తుని శిరమును చూసి హతాశుడైనాడు.అయ్యో ఎంత ఘోరము జరిగినది.
"కిం వా‌உనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
ఙ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్"
 ఓ పరమేశా!నా అజ్ఞానమును క్షమించుము.గుర్రములు-ఏనుగులు-సైన్యము-రాజ్యము మొదలగు అశాశ్వతములను మోహించి,నీ ఎడ ఘోర అపరాధమును చేసితిని.పశ్చాతపుడై ఒక బంగరు పళ్ళెమునందు ఆ పవిత్ర శిరమును పెట్టి,దానిని తన తలమీద అత్యంత భక్తిశ్రద్ధలతో పెట్టుకొని,శివ పంచాక్షరి మంత్రమును జపిస్తు అగ్నిప్రవేశము చేసిన ఆ నాయనారుకు ముక్తినొసగిన ఆ కార్తీక దామోదరుడు మనందరిని అనుగ్రహించుటకు అనురక్తిని చూపును గాక.

CHIDAANAMDAROOPAA-SADAYA NAAYANAARU.


" నమే మృత్యుశంకా నమే జాతి భేదా
పితా నైవ నేనైవ మాతాన జన్మ
న బంధుః నమిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూప శివోహం శివోహం."
చిదానందరూపా-సదయ నాయనారు.
*******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
సదయ నాయనారు సదాశివుడనుటయే సత్యము
అగణిత భక్తిప్రపత్తుల ఆరాధన అనునిత్యము
సుదతి-సుతుడు-సృష్టియు శివకుటుంబీకులే అని అను
సుతుని దత్తతనిచ్చియు శివాధీనమే తాను అను

చింతను దరిరానీయక సంతసమున తానుండును
చిదానంద సరస్వతిచే సంతత వినుతులనందును
గతజన్మపు ఘనతలు తోడుగ గణనీయతనొందగ
అగణిత గుణ సంపన్నుని సుందరారును మనకందీయగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

" మాతాచ పార్వతీ దేవి-పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్త్యాశ్చ స్వదేశో భువనత్రయం"
శెళిక్కర్ అందించిన పెరియ పురాణము ప్రకారము ఆదిసైవుదైన అరూరారుకు దైవానుగ్రహముగా జన్మించినవాడు సదయ నాయనారు.తిరుమురైవడిలోని సదయ నాయనారు ధర్మపత్ని ఇసయజ్ఞాన నాయనారు.దైవాంస సంభ్హొతురాలు.వీరు వీరి కుమారుడు సుందరారుల నాయనార్ల కుటుంబము శివుని అత్యంత ప్రీతిపాత్రమైనది.
వీరి ఔన్నత్యమును మరింత ప్రకటింపబడుటకై సదాశివుడు తేజోవంతుడైన సుందరారును,రాజైననరసింగ మునైయార్ దత్తతస్వీకారమును అడుగగా,
" అంతామిధ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువునిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి చెందక....
...........................పరమసంతోషముతో అంగీకరించి సంతోషముగా అప్పగించి,ప్రశాంతముగ పరమేశ్వర ధ్యానమునకు ఉపక్రమించెను.నిశ్చల భక్తి తత్పరతచే నిటలాక్ష సాయుజ్యమునొందిన,సదయ నాయనారు సత్కథా పఠనము మనందరిని సదాశివుని కృపకు పాత్రులను చేయుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...