Friday, June 23, 2017

ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా



ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా
ఇట్లా రమ్మని పిలిచి,కోట్ల వరములిస్తావమ్మా.
***********************************************
చారుమతిని కరుణించిన శ్రావణ వరలక్ష్మి
చరణాలను సేవించగ తరుణులార రారమ్మా.
ఆహా! మన భాగ్యము అని ఆహ్వానించేద్దాము
అద్దము వంటి మనసును ఆసనము అందాము
పాహిమాం అని అంటూ పాదములను కడుగుదాము
అర్ఘ్యం అమ్మా అంటూ అరచేతులు తాకుదాము
కమనీయ ముఖమునకు ఆచమనీయం అందాము
పాలకడలి పట్టికి పంచామృత స్నానము చేయిద్దాము
శుద్ధోదక స్నానమంటూ ఉద్ధరించమందాము
సకల శాస్త్రాలనే వస్త్రాలను కట్టుదాము
అమ్మా, ఆఘ్రాణించు అని సాంబ్రాణిని వేద్దాము
త్రిగుణాత్మక దీపాలతో తిమిరము పోగొడదాము
పాపములను ధూపములతో పరిహరించమందాము
పంచేంద్రియ పూవులతో పూజలెన్నో చేద్దాము
అథాంగ పూజలు.అర్చనలు కథలు చదివేద్దాము
తొమ్మిది ముడుల తోరము తోడు అని చుట్టుదాము
భక్ష్య,భోజ్య,చోహ్య,లేహ్యములను భక్తితో నివేదిద్దాము
పరిమళ తాంబూలమును ప్రసాదముగ అడుగుదాము
కందర్పుని తల్లికి కర్పుర హారతులను ఇద్దాము
మన దర్పము తుంచమని మనవి చేసుకొందాము
తల్లి ధ్యానము ధ్యాస అను కుడి,ఎడమల
అడుగులతో ఆత్మ ప్రదక్షిణము చేద్దాము
విడిపోని కరుణా వీక్షణమును కోరుదాము
సత్ చిత్ రూపిణి మా ఉన్మత్తత తగ్గించమని
నిమిత్తమాత్రులమంటూ మంత్రపుష్పము సమర్పిద్దాము
బ్రహ్మాండ రూపిణి అండదండ నీవనుచు
కలవరమును తొలగించే వరము కోరుకుందాము
ఒకరోజు స్వప్నమని ప్రతిరోజు సత్యమని
పాదములను పట్టుకొని పరవశించి పోదాము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...