Friday, June 23, 2017

ఓం నమో నారాయణాయ-12

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-12
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
మూగదో,చెవిటిదో అని, ముదితల పరిహాసమైన
ముద్దరాలు నిద్దరోవు అద్దాలున్న పానుపులో
ఉవిద భక్తి ఉత్కృష్టమై కృష్ణునితో మమేకమైన
వక్షస్థలమందు నున్న పుండరీకాక్షునితో
పక్కనున్న అత్తను నిద్దురలేపమనిన వారైన
బద్ధకమును వదిలి,లేచి గడియ తీయమనుటలో
అనవరత ధ్యానములో ఆమె-అంతర్ముఖమైన
బహిర్ముఖము చేయుటకు "ఎన్ఱెన్ఱు నామం పలవుం" అనుటలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
వ్రత సమయము సమీపించుచున్నను నిదురలేవని గోపిక వద్దకు వచ్చిన గోపకాంతలు, ఆమెను మూగదో,చెవిటిదో, మూఢురాలో అని అపహాస్యము చేసారు.అయినప్పటికి నిదురలేవలేదని పక్కనున్న ఆమె తల్లితో అత్తా! ఆమెను నిద్దురలేపి గడియతీయించమనిరి.తల్లి లేపినను ఆమె నిదురను చాలించకపోతే,ఆమె చెవిలో మాధవ నామమును చెబుతూనే ఉండమన్నారు.(ఇది సామాన్యార్థము.)
నెమలిలో,పాములో,గోవులలో,సాధువులలో కృష్ణభక్తిని దర్శించిన గోపిక,ఆ పరమాత్ముని దయతో నేడు కృష్ణభక్తిలో అంతర్ముఖమైన మరొక గోపికను చూస్తోంది.వ్రతమాచరించుటకు బహిర్ముఖము చేయవలెను కనుక అత్తా!
నిద్దురలేపమన్నది.(అత్తరూపములోనున్నది భాగవతోత్తముడు) అయినను గోపిక నిద్దురలేవక పోవుటచే( కారణము ఆమె భక్తి పరాకాష్ఠత మాత్రమే కనుక )ఆమె చెవిలో మాధవ నామమును కీర్తించుచునే ఉండమన్నారు.అంతర్ముఖములో దర్శనీయములు బాహ్యములో స్మరణీయములు కావలెనుకదా అని గోపిక చింతలో నున్న నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను,స్వామికి సమర్పించ,చెలులారా! కదిలి రండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...