Friday, June 23, 2017

ఓం నమో నారాయణాయ-24

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-24
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
ఆరుసార్లు పలుకుచున్న మంగళాశాసనమైన
అసుర సం హారకుని దివ్య ఆపాద మస్తకములో
వాత్సల్యాతిశయమునకు మంగళాశాసనమైన
గోవర్ధనగిరిధారి-పాలిత గోవుల-గోపాలురలో
"సర్వేజనా-సుఖినో భవంతు"అను మంగళాశాసనమైన
భక్తి-ప్రపత్తి స్తుతుల పోత్తి పాశురములో
ఆ" బాల" గోపాలునికి మంగళాశాసనమైన
దిష్టితీయుట అను గోపికల స్పష్టమైన ప్రేమలో
రంగనాథ స్వామికి మంగళములు పాడరారె
అంగనలారా! ఆండాళ్ అమ్మవెంట నేడే.
భావము
గోవర్ధనగిరిని ఎత్తి గోవులను-గోపాలురను రక్షించిన స్వామికి మంగళము.సర్వ జనులకు శాంతి-సౌఖ్యములనిచ్చే స్వామికి మంగళము.స్వామికి దృష్టి తగులకూడదని,స్వామికి-స్వామి ఆయుధములకు గోపికలు ఆరుసార్లు మంగళాశాసనమును చేసిరి.
వాత్సల్యము! వత్సుని (పుత్రుడు/పుత్రిక)అందలి ఆత్మీయానురాగము.ఇక్కడ వాత్సల్యము గోపికలపై స్వామికి,స్వామిపై గోపికలకు పరస్పరాశ్రితము. ఆత్మానంద స్థితికి ఇది నేత్రోత్సవము.స్వామి గోపికలకు వాత్సల్యమును అందించుచు తాను వారినుండి పొందకోరిన హేల!కృష్ణ లీల!
విదేహమహారాజు సీతమ్మను రాముని చేతిలో పెట్టుచు "భద్రం" అన్న మాట ఎంత పవిత్రమైనదో గోదా సమేత గోపికల మంగళాశాసనము అంతే పవిత్రము.రాక్షస సం హారముచేసి స్వామి శరీరము ఎంత కందెనో,స్వామి ఎంత అలిసిపోయేనో అని తలచు పసి మనసులు వారివి.పసితనము అనగా కపటము లేనిదివయసుకు సంబంధించినది కాదు.ఎన్ని కన్నులు కుట్టినవో స్వామిని అని యశోదతో కూడి మన గోపికలు స్వామికి దిష్టి తీసిరి.అనుభవైక వేద్యమైన ఆత్మ సాక్షాత్కార పురస్కారము..
ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? అని మన గోపిక ఆలోచన సాగింది.అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే కదండీ!
అమ్మ వెంట చని స్వామికి "పోత్తి" పాడబోవుచున్నవారైన గోపికలతోబాటు,ఆత్మానందానుభూతి ఆవిష్కరింపబడిన మన గోపికను చూస్తూ,నా మనసు తన అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...