మన తెలుగుతల్లికి తెలుగుపూదండ



మన తెలుగుతల్లికి తెలుగు పూదండ
******************************
తెలుగుభాష పండుగలో పరిమళములు చిందిస్తు
ముసిముసి నవ్వులతో కుసుమములు గుసగుసలాడెను
సుగ్రంధాల సుగంధాలు సౌగంధిక పుష్పములు
వ్యాకరణ వయ్యారములు వైజయంతి కుసుమములు
మధుర ఇతిహాసములు మందార దరహాసములు
ప్రబంధాల బంధాలు (ఆ)నంది వర్ధనాలు
చమత్కార చాటువులు చలాకీ చామంతులు
అష్టావధానాలు అందమైన దవనాలు
చంపూ కావ్యాలుగా చంపకాల తావులు
దివి భువి సంధానాలు వాగ్గేయ పారిజాతాలు
అలరారు శతకాలు ఆ నూరు వరహాలు
కాంతల కవనాలనే చంద్రకాంత పూవులు
ఖండ కావ్యాలుగా అఖండ కళల కలువలు
వాడుక సంకెల తుంచిన వేడుక సంపెంగలు
సంస్కరణల సిరులు కరవీర కుసుమాలు
సుద్దుల ముద్దు ముచ్చట ముగ్ధ ముద్ద బంతులు
జానపదుల పదాలు జాజిపూల పరిమళాలు
తూరుపు ఇటలీ నేనని నేరుపుతో లిల్లీలు
ఆరాధన మానవతకు ఆ రాధామాధవాలు
గుండెలోని ప్రేమతో గుబాళించు గులాబీలు
దేశభక్తిగీతాలురా ఆ కాశీరత్నాలు
తెలుగుతల్లి మమతలు మరుమల్లెల విరులు
మొగలితో పాటుగ తోటలో విరిసిన మిగిలిన పూలు
పొగడతరమ తెలుగును అను తడబాటు పొగడలు
మరువము తెలుగును అను పరిమళపు మరువము
దాచిన దాగని ఘనతగా పూచిన తంగేడులు
జ్ఞానపీఠము ఎక్కిన ఘన జ్ఞాన ప్రసూనాలు
శ్రీరస్తు దీవనతో శ్రీభూషణ పద్మాలు
కదంబమై ఒదిగినా కైదండలో పొదివినా
ఆ చంద్ర తారార్కాలు అందమైన తెలుగుపూలు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI