Wednesday, April 29, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-06



  శివుని కరుణ అర్థముకానిది.శివుని కరుణ అద్భుతమైనది.

" రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం

  జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం."



   దేవతలను కూడ నియమించు రుద్రుడు సాధకులకు శుభములొసగును గాక.



మేఘములందు మెరుపు-ఉరుము-పిడుగు రూపముగా విరాజిల్లుతూ రుద్రుడుసృష్టి/వృష్టి రూపముగా ప్రసన్నుడై భూమిని ఫలవంతము చేయుచు,ఇంద్రరూపముగా కీర్తింపబడుతున్నాడు.



   రుద్రుడు ఇంద్రియములకును-మనసునకును అధిపతి.వానిని అనుభవించునపుడు ఇంద్రునిగను-నియమించునపుడు రుద్రునిగను చెప్పబడును.







  అర్థ ఇంద్ర అనువాకముగా ప్రశస్తి చెందిన అనువాకము ముఖ్యముగా కార్య-కారణ సంబంధమును సోదారహరణముగా తెలియచేస్తున్నది.అంతే కాకుండ మొదటి అనువాకము అగ్నా- విష్ణో అంటూ, ఇద్దరిని కలిపి అనుగ్రహహించమని ప్రార్థించుటతో సత్వర సమిష్టి ఫలితములను పొందవచ్చునన్న వేద సంప్రదాయమును మరొకసారి ప్రతిపాదించుచున్నది.ఈ ఇద్దరిలో రెండవ వారిగా సంబోధింపబడుచున్న ఇంద్ర శబ్దము మూలము.దాని ఆదేశముననుసరించి మొదటి శబ్దమైన అగ్ని,వరుణ మిత్ర మున్నకు దేవతా శక్తులు మన ప్రార్థనలను స్వీకరించి,ప్రసన్నులై మనలను అనుగ్రహించుచున్నవి.ఈ  మహోత్కృష్ట      కార్యక్రమములో కార్యము జరిపించుచు యజమాన స్థానములో నున్న మహేంద్రుడే మహేశ్వరుడు.ఆద్యంతములు లేని,అవధులు లేని అంతర్యామి.యజ్ఞ యజమాని.ఆధ్వర్యమును వహించుచున్న   ఆదిదేవుడు.

.



   ఈ మహాద్భుతమును మనము మరికొన్ని చిన్న మనకు అనుభవమున్న విషయములతో సమన్వయ పరచుకుని అర్థము చేసికొనుటకు ప్రయత్నిద్దాము. కాసేపు మనము కారణములైన దేవతలను దర్శనశక్తి గల నయనముతో,శ్రవణ శక్తిగల కర్ణముతో,వాక్శక్తి గల నోటో,మిగిలిన ఇతర శరీర భాగములతో పోల్చుకుందాము.ఈ పది ఇంద్రియములు జ్ఞాన ఇంద్రియములు-కర్మేంద్రియములుగా విభజింపబడినవి.మన ఇంద్రియములకు యజమాని మెదడు.అది యజమానియై సమయమునకుతగిన సంకేతములను పంపిస్తూ,వాటిని చైతన్య వంతములు చేస్తుంది.ఇది ఎవరు కాదనలేని అంశము.మరి యొక విషయము మనకు ఇంద్రియ నిర్వహణలో ఆధార-ఆదేయముల సమిష్టి విధి నిర్వహణము కూడ అర్థమవుతుంది.ఉదాహరణకు దర్శన శక్తి ఆధారమనుకుంటే దానిని ప్రదర్శించుటకు నేత్రము ఆధేయమైనది.అంటే మనము కన్ను వలన చూడగలుగుతున్నామనుకుంటాము కాని దానిలో దాగిని దర్శనశక్తిని గుర్తించి,కంటికి-అది అందించుచున్న దర్శన శక్తి కి కృతజ్ఞతావిష్కారమే ఈ అనువాక ప్రాశస్త్యము.



    ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశిచి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము చేయువారికి సగము సగము సవినయముగా సమర్పించుచున్నారు.



  ఈ అనువాకములో అగ్ని-చంద్రుడు-సూర్యుడు-సరస్వతీ-బృహస్పతి-వరుణుడు-త్వష్టా-ధాతా-అశ్వినీ దేవతలు-విశ్వే దేవతలు(పితృదేవతలు) మరుత్తులు-దిక్కులు-ఆకాశము-స్వర్గము మొదలగునవి ఇంద్రుని ఆదేశములను ఆచరిస్తూ,ఇంద్రునితో కలిసి చెరొక సగభాగము హవిస్సులను అందుకొని ఆశీర్వదించుచున్న చమకముతో మమేకమగుచున్న వేళ సర్వం శివమయం .

  యజ్ఞం నమః శివాయ-యజ్వి నమః శివాయ
  కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ

   శివాయ శుభము-శివాని జయము.





      ఏక బిల్వం శివార్పణం.








      ఏక బిల్వం శివార్పణం.


CHAMAKAMU-ANUVAAKAMU-05

  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.

   ఈ అనువాకము భూమి యొక్క గొప్పదనమును -భూగర్భ సంపదలను ప్రస్తావిస్తూ,జీవుడు పరిపూర్ణతను సంపాదించుకొనుటకు పరమాత్మ కోరినకోరికలను తీర్చే కొంగుబంగారము సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయాలనుకుంటున్నాడు.

   మనము ఒక మహావృక్షమును సామాన్యదృష్టితో చూసినపుడు మనకు భూమిపైన ఉన్న కాండము-కొమ్మలు-ఆకులు-పూలు-పళ్ళు మాత్రమే కనిపిస్తాయి కాని,వాటన్నిటికి మూలకారణమైన మహిమాన్వితమైన వేరు కనపడదు.అంతమాత్రమున వేరులేదనగలమా? అదే విధముగా మన చర్మనేత్రములు భూభాగ ఉపరితలమును మాత్రమే వీక్షించగలవు కాని భూగర్భ సంపదను ఆలోచించలేవు.అర్థముచేసుకొనలేవు.ఇక స్వామిని అర్థించ గలవా? సాధ్యము కానే కాదు. అందుకే స్వామి ఘోర-అఘోర రూపములకు సంకేతముగా "అశ్మాచమే-మృత్తికాచమే" అంటూ కఠినమైన రాయి కావాలి-మెత్తనైన మట్టి కావాలి" అని అర్థింపచేస్తూ,అభీష్టసిధ్ధిని కలిగించాలనుకుంటున్నాడు.
 భూమిని దున్నిన భూమి-దున్నని భూమి " "కృష్ణ పశ్యంచమే-అకృష్ణ పశ్చమ్యచే" అంతూ వర్గీకరించి కొన్ని భూములను ఆహారదాతలుగాను,మరికొన్నింటిని ఆవాస (ఇల్లు) దాతలుగాను ,ఆ భూములు అందించే సంపదలను కోరుకోమంటున్నది చమకము.

 అంతే కాదు ఆహారమునకు తోడుగా పానీయములను ప్రకటించుచున్నది పాలు-నేయి-తేనె ను"పయశ్చమే-ఘృతశ్చమే-మధుశ్చమే" అంటూ.అన్నపానీయములను అనవరతము అందించే అనంత కరుణ భూమాతది.

 అంతే కాదు లోహములైన ఇనుము-రాగి మొదలగునవి,ఖనిజములైన సీసము-తగరము మొదలగు వానిని "హిరణ్యంచమె-అయశ్చమే-శ్యామంచమలోహంచమే" అంటూ లోహములను,సీసంచమే-త్రపుశ్చమే(తగరము) అంటూ ఖనిజ సంపదలను కోరుకొని ప్రయత్నములను సమర్థవంతముచేస్తున్నది .
  వీరుధశ్చమే-వనస్పతశ్చమే -ఔషధశ్చమే" అంటూ లతలను,పచ్చని చెట్లను వాటిద్వరా లభించే ఔషధములను అర్థించు-అనుగ్రహిస్తాను అంటున్నాడు పరమాత్మ.

   ఈ ఆనువాకము పశు సంపదను కూడా "గ్రామ్యాశ్చమే-పశవ ఆరణ్య్యాశ్చా అంతూ పరమాత్మను జీవుడు గ్రామాలలో-అరణ్యాలలో నున్న పెంపుడు జంతువులను,అదవులలో నుండే వన్య మృగములను ప్రసాదించమని ప్రార్థించమంటున్నది పశుపతిని.

 సామాన్యమునకు-విసేషమునకు గల వ్యత్యాసమును "గిరయశ్చమే-పర్వతాశ్చమే" అంటూ,నేటికి-రేపటికి కోరు అనుగ్రహమును (సృష్టి కొనాసాగిస్తూనే ఉండాలని సదుద్దేశముతో)"విత్తించమే-విత్తిశ్చమే" అంటూ అది సకల మానవాళీకి చెందాలని "భూతంచమే-భూతిశ్చమే" అని "ఇతిశ్చమ-గతిశ్చమే" అంటూ ఇష్టప్రాప్తిని కలిగించమంటు కోరుచున్న చమకముతో మమేకమగుచున్న సమయమున సర్వం శివమయం జగత్.

  ఏక బిల్వం శివార్పణం.

CHAMAKAMU-ANUVAAKAMU-04

  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.

  జీవుల మేథను విస్తరింప చేస్తూ ధాన్యము యొక్క నాణ్యత ను వర్గీకరింపచేస్తూ " ఊర్క్సమే" అంటూ సామాన్య ధాన్యమును పరిచయము చేసాడు.అంతే కాదు సిరి ధాన్యములను ప్రస్తావింప చేసాడు " యవాశ్చమే-మాషాశ్చమే-తిలాశ్చమే అంటు రాగులను,మినుములను,నువ్వులను ఇంకా అనేకానే సిరి ధాన్యములను ఆవిష్కరిమచేసినది ఈ అనువాకము.

   ధాన్య రకములనే కాక వాటి పరిమాణములోని వైవిధ్యమునుకూడ 1.రాశి.చిన్న రాశి.3.పెద్ద రాశి.4. చాలా పెద్ద రాశి.5.పూర్ణ రాశి అంటు " విభశ్చమే-ప్రభశ్చమే-బహుశ్చమే-భూయశ్చమే-పూర్ణశ్చమే అంటు ప్రస్తుతిస్తూ.

  ఘన ఆహారముతో పాటు ద్రావకములను/పానీయములను కూడ జోడించి పాలు-నేయి-తేనె మొదలగు వానిని "పయశ్చమే-ఘృతశ్చమే-మధుశ్చమే" అంటు జీవుని యజ్ఞసాఫల్యతకై లభ్యమయేలా చేసినది.

  పండ్లను అర్థించి స్వీకరించుటకై పచ్చని చెట్లను,గుబురు పొదలను నమకములో చెప్పినట్లు " వృక్షాశ్చమే" అని జీవుని కోరుకొమ్మని యజ్ఞసామాగ్రిని పరిపూర్ణము చేసుకోమని సూచిస్తున్నది.

అన్న-పానీయములను అందించుటకు సిధ్ధమైన తరువాత "రయశ్చమే-రాయశ్చమే" అంటూ, బంగారమును,నవరత్నములను సమృధ్ధిగా అందిస్తు సాధకుని క్రతువును సుసంపన్నము చేస్తున్నది.వీటన్నిటిని ప్రకటించేసి-వీటి ప్రభావమును అవగతము చేసి,ఇవి ఎప్పుడును నశింపకుండునట్లు "అక్షితాశ్చమే" అని వరమడుగు-నేను సంతోషముతో ఇస్తాను అనుచున్న చమకముతో మమేకమగుచున్న మనకు సర్వం శివమయం జగత్.

  ఏక బిల్వం శివార్పణం.


Tuesday, April 28, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-03

  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.మొదటి అనువాకము ఆహార సిధ్ధిని అందించుచున్న మాతృ స్వరూపము గాగ,రెండవ అనువాకము ఆలోచనా సిధ్ధిని అందించుచున్న పితృ స్వరూపము గాను భావించుచున్న వారికి,చమకమునకు వజ్ర మకుట సమానమైన మూడవ అనువాకము ఆచార్య స్వరూపముగా భావించుటలో ఎటువంటి సందేహము లేదనుటకు
 ఆకారమును-ఆలోచనను పుష్ఠివంతము చేసుకొనుచున్న జీవుడు వానిని యుక్తాయుక్త విచక్షణతో ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు.
    .అందుకే "శంచమే-మయశ్చమే" అంటూ ఆర్తిగా అనువాకమును ఆరంభించాడు"



                శివుని అనుగ్రహముతో జీవుడు తన విశ్వసందర్శనములోని  వస్తువుల తారతమ్యములను గుర్తించాలనుకుంటున్నాడు.ఏవి ఉపయోగములో-ఏవి నిరుపయోగములో,ఏవి సారములో-ఏవి నిస్సారములో,ఏవి క్షణికములో-ఏవి శాశ్వతములో,ఏవి ఉపయోగములో-ఏవి నిరుపయోగములో,ఏవి అనుసరణీయములో-ఏవి పరిత్యజనీయములో,ఏవి ప్రియములో-ఏవి అప్రియములో,ఏవి అనుకూలములో-ఏవి ప్రతి కూలములో గమనించవలెనని,దానికి తనకు మార్గదర్శకుడైన గురువు ఆవశ్యకత ఎంతయో గలదని ,

 ప్రియంచమే-అనుకామశ్చమే-సౌమనసశ్చమే  వస్తువైవిధ్యమును ప్రస్తావించుచు,దానిని నిర్ధారించుటకు గురువును అనుగ్రహించమని అర్థిస్తూ,ప్రార్థిస్తూ" యంతాచమే" అంటూ ఆచార్యదేవోభవ అను ఆర్యోక్తిని అక్షరాల అనుసరిస్తున్నాడు.
 ఎవరు నేర్పాలో తెలుసుకొనిన తరువాత ఏమి నేర్పాలో కూడా తెలియచేస్తున్నాడు " సంవిచ్చమే" అంటూ వేదప్రమాణమును సన్నుతిస్తూ.

  దానివలన కలుగు ప్రయోజనమును కూడ అవగతము చేసుకొనిన జీవుడు "క్షమశ్చమే-ధృతిశ్చమే" అంటూ తన జ్ఞాన సముపార్జన ఉన్న సంపదను సంరక్షించుటకు దానికి కావలిసిన అత్యవసర సమయములలో ఎదుర్కొనగలుగు ధైర్యమును తద్వారా సామర్థ్యమును పెంపొందించ  గలుగు సూచనను చేయుచున్నాడు.

          సాధకుడు తన అభ్యర్థనలో పరమాత్మను కొన్నింటిని ఇమ్మనికోరుకోవాలి.మరి కొన్నింటినితొలగించమని వేడుకోవాలి అనే విషయమును గ్రహించి చీడ-పీడలను ఆటంకములను తొలగించమంటున్నాడు.














  తన విజ్ఞానము (గురువుచే అనుగ్రహింపబడినది) అవసరములకు మాత్రమే కాదు వాటికి కావలిసిన ప్రణాళికకు,వస్తు సామగ్రికి సంపాదించుకొనునట్లు చేయుటయే గాక,ఉదాహరణకు వ్యవసాయమునకు కావలిసిన నాగలి ఎద్దులు మిగిలిన పరికరము "సీరంచమే" అంటూ వివరిస్తూ,వాటికి      చీడ-పీడవంటి ప్రతిబంధకములను తొలగించమంటున్నాడు.

 ఏవిధముగా మానవుడు తన శక్తిసామర్థ్యములతో చెడును అడ్డగిస్తూ-మంచిని పెంపొందించాలో తెలియచేస్తున్నాడు.

   చెట్లకు వచ్చే చీడ పీడ మాత్రమే కాదు మానవాళిని పీడించు చిన్నచిన్న రుగ్మతలు-పెద్దపెద్ద వ్యాధులను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాడు.

  ప్రస్తుతమునకే కాదు తన విజ్ఞాన సంపద-సత్ప్రవర్తన భావితరములకు కూడ చేరవలెనని ,తన నాయకత్వ లక్షనములు లక్షణోపేతములై
 కొనసాగాలని కోరుతున్న చమకముతో మరింత మమేకము అవుదాము.

  వర్గీకరణ సాధకునకు ఐహికము-ఆముష్మికము గుర్తించగలుగుచేయుచున్నన్న వేళ సర్వం శివమయం జగత్.

  ( ఏక బిల్వం శివార్పణం.)





CHAMAKAMU-ANUVAAKAMU02

  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.

  రెండవ అనువాకములో చమకము అర్థుల ఆలోచనా వైచిత్రిని,

  జ్యేష్ఠంచమ-ఆధిపత్యంచమే అంటూ ప్రారంభించింది.కలయతీతి కాలం. పరిణామ స్వభావముగల కాలములో ఒక్కొక్క సారి అనుకూల పరిస్థితులు మరొక్కప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి.అప్పుడు వాటిని  ఎదుర్కోవాలంటే స్థితప్రజ్ఞత్వము కల నాయకుడు.పరిణితితో ఆలోచించగలిగి యుండాలి.సామర్థ్యముతో సమస్యలను పరిష్కరించుకోగలగాలి.

    అంతేకాదు అవసరమైన పరిస్థితులలో ఆగ్రహమును అంతర్ముఖముగా-బహిర్ముఖముగా తగిన మోతాదులో వ్యక్తము చేయగలిగి యుండాలి.ప్రకటిత కోపియై యుండాలి కాని ప్రకృత కోపియై వశుడు కారాదు అనే సత్యాన్ని "భామశ్చమే-మన్యశ్చమే " అంటూ మనకు చెబుతోంది.

వారసత్వమను ప్రక్రియకు నారుపోసి ముందు జాగ్రత్తగా మాకు మా ముందు తరములవారికి ప్రసాదించమని ప్రార్థనను ."వర్ష్మాశ్చమే" అంటూ.

  మానసికోల్లాసమునకు క్రీడలను పరిచయము చేస్తూనే అనగా ఈశ్వర లీలను గుర్తించు సామర్థము,దానిని పొందుటకు సత్యము-ధర్మము-శ్రధ్ధ,వేద సంహితాధ్యనము మొదలగు వానిని మతిశ్చమే-సుమతిశ్చమే అంటూ సూచిస్తున్న చమకముతో మరిన్ని మంచి విషయములతో మమేకము అవుదాము.

   సర్వం శివమయం జగత్.

   ఏక బిల్వం శివార్పణం.

CHAMAKAMU-ANUVAAKAMU01


  చమకము-ప్రథమ అనువాకము.
   ***************************
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.రుద్రనమకము పరమాత్మ సర్వాంతర్యామిత్వమును,సర్వ సామర్థ్యమును వివరిస్తు విశ్వమే విశ్వేశ్వరుడు అను యథార్థమును సోదాహరణముగా మనకు వివరిస్తుంది.ఆ విషయము లోని మర్మమును అవగతము చేసుకోలేని మనము చేతులుచాచి చెంతకు చేర్చుకోవాలనే కరుణాంతరంగుడైన పరమాత్మను ఏమి అడగాలో,ఎప్పుడు అడగాలో,ఎందుకు అడగాలో,ఎలా అడగాలో తెలుసుకోలేని తమస్సులోనున్న మనలను కరుణించి,పరమాత్మ చమకము ద్వారా తానే మన బదులు అంతటా అవగతమవుతున్న పరమాత్మ అనుగ్రహమును ఆలంబన చేసుకొని,ఆధ్యాత్మిక సోపానములను అధిరోహించుటకు,మనము ఏమి అడగాలి,ఎప్పుడు అడగాలి,ఎవరికోసము/ఎందుకోసము అడగాలి,ఎలా అడగాలి తెలియచేయు వాత్సల్యమే చమకము.ఒకటి కాదు-రెండుకాదు,ఒకసారి కాదు-రెందు సార్లు కాదు,ఒక కాలమునకు కాదు విశ్వమంతయు విరాజమానమగుటకు అది కూడా,ఇది కూడా అహకాదు అలాకూడా,ఇలా కూడా,కాదు కాదు అప్పుడు కూడా/ఇప్పుడు కూడా,దానికి కూడా/దీనికి కూడా,నాకు కూడా/నా వంశమునకు కూడా ఇలా ప్రతి పదము తరువాత ఇంకా,ఇంకా,నాకు కావాలి అని కోరుటచే "చ" అని,నాకు కావాలి అని ప్రార్థించుటచే " మే" అని పదే పదే చమే ఆవృత్తమగుటచే చమకముగా ప్రసిధ్ధి చెందినది.జగద్రక్షకుని జాలిగుణమునకు చక్కని ఉదాహరణము.

  అంతే కాదు.చమకం మనలోని ఇంద్రియశక్తిని జాగృతము చేసి,భౌతిక వస్తువుగా చర్మచక్షువులకు గోచరించు,పరికరమును చైతన్యవంతముగా మలచుకొను దార్శనికతను అందచేస్తుంది.

 ఉదాహరణకు మన చర్మ చక్షువులు ఒక వెదురు గడను చూశాయనుకోండి.దానిని గురించి పెద్దగా పట్టించుకోము.కాని చైతన్యవంతమైన చక్షువు దానిని రూపాంతరముగా మలచుకొని ఉదాహరణకు ఒక నిచ్చెనగా మలచుకొని,ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేర్చే పరికరముగా ఉపయోగించకొనవచ్చును.కనుకనే,

  " అగ్నా విష్ణో సజోష" అంటూ అగ్ని-విష్ణు నామము గల చైతన్యవంతమైన-+ శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.

  ఇక్కడ మనము ఒక్క విషయమును గురించి కొంచము ఆలోచించాలి.అగ్ని-విష్ణు అను నామములుగల రెండు దివ్య శక్తులను ప్రార్థిస్తూ  సాధకుడు,వారిద్దరు కలిసి తమను అనుగ్రహించమనికోరుకుంటున్నాడని అంటున్నది చమకము.ఇవి స్వరూప నామములా-లేక స్వభావ నామముల.కేవలవ్యవహారిక నామములు మాత్రము కాదు.వారివి మంత్ర శరీరములు కాని మాంస శరీరములు కావు.వారు జాగృతమై వారి శక్తులను మనలోనికి,అనగా విశ్వములోనికి జాగృతము చేయమని వేడుకుంటున్నారు.

 అగ్ని అంటే కేవలము నిప్పు మాత్రమేనా? లేక ఇంకేదైన గౌణ నామమా.పెద్దలు ఏమని వివరిస్తారంటే మనలో నిద్రాణమై యున్న కుండలినీశక్తిని జాగృతపరచి,అది పైపైకి ఎగబాకి సహస్రారమును చేరునటు చేసి,                          అమృత కలశమునకు చిల్లి చేసి, ధారలు పడునట్లు చేయాలి.
అప్పుడు విష్ణు అను మరొశక్తి(వ్యాపకత్వశక్తి) దానిని విశ్వమంతయు వ్యాపించునట్లు చేసి తేజోమయము చేయాలి ఈ పనిని ఈ రెండు శక్తులు  పరమేశ్వరుని  అనుజ్ఞచే,  ఒకదానికొకటి సహకరించుకుంటూ చేయగలవు కాని విడివిడిగా కాదు.

 వాజశ్చమే అను మొదటి కోరిక.వాచకార్థమును పరిశీలిస్తే అన్నము/ఆహారము.అన్నము ఉన్నంత మాత్రమున చాలదు.దానిని భుజించుటకు అర్హతయైన ఆకలి ఉండాలి.అంతే కాదు ఆ అన్నము పోషకత్వమును కలిగి యుండాలి.తినువారికి దానిని ఇష్టముతో తినవలెనను కోరిక కలిగి యుండాలి.అంతే కాదు అన్నమునుంచిన పాత్ర శుచియై ఉండాలి.అన్నమును మితముగా తినగలుగు ఇంద్రియ నిగ్రహము ఉండాలి.ఆస్వాదించగలుగు మనసు,అరిగించుకొనగలుగు శక్తి ఉండాలి.అంతే కాదు అన్నప్రదాతకు కృతజ్ఞతను తెలుపుకోగల ఇంద్రియశక్తిని పొందకలిగి ఉండాలి.అన్నము పుష్కలముగా లభించుటకు మనము యజ్ఞము చేయకలిగి ఉండాలి.

    వాజశ్చమే

 అన్నము ఇది పరబ్రహ్మ స్వరూపము.అన్నము అనగా బియ్యమును ఉడికించగా ఏర్పడిన పదార్థము మాత్రమే కాదు.

    ప్రతి మనిషికి అన్నమయకోశము-ప్రాణమయ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన మయ కోశము-ఆనంద మయ కోశములుంటాయి. తైత్తరీయోపనిషత్తు  - అన్నము వలనే భూతజనములు జనించుచున్నవై,జీవించుచున్నవని,లయింపబడుచున్నవని చెప్పుచున్నది.

    అన్నమే/ఆహారమే అన్నమయకోశములోనికి ప్రవేశించి ప్రాణముగా మారుచున్నది.మరల మరల ప్రవేశించుచు ప్రాణిని జీవింపచేస్తున్నదిచివరకు జీవికి ఈశ్వరత్వమును అందిస్తున్నది.

  పరమాత్మ సృష్టించిన రుద్రులు మనకు అందించే ఆహారముద్వారా మనకు ఆరోగ్యము-అనారోగ్యమును మన కర్మ ఫలితములను అనుసరించి అందిస్తుంటారు.

  యజ్ఞము అంటే హోమగుందములో చేసే క్రతువు ఒక్కటే కాదు.ఇంద్రియ యజ్ఞము-మానసిక యజ్ఞము నిరంతర నియమములతో చేయకలగాలి.

   కనుక పరమాత్మ నా శరీర దారుఢ్యమునకు,మానసిక స్థితప్రజ్ఞతకు కావలిసిన వస్తువులను ఆలోచనలను అనుగ్రహించి,నా యజ్ఞము సమర్థవంతమగునట్లు చేయుము అని అభ్యర్థిస్తున్నాడు "యజ్ఞేన కల్పతాం" అంటూ పరమాత్మను పరిశుధ్ధమైన మనసుతో.ఇంకా మరెన్నో మంచి విషయములతో చమకముతో మమేకము అవుదాము.

  సర్వం శివమయం జగత్

   ఏక బిల్వం శివార్పణం
.





Monday, April 27, 2020

GIRISAMCHA- ABHICHAAKASI

 శివానుగ్రహము అర్థముగానిది.అద్భుతమైనది.అట్టడుగననున్న వారిని గట్టిగా పట్టుకుంటుంది.కొత్తదనమును చూపిస్తుంది.మత్తుకళ్ళను తెరిపిస్తుంది.పరమ కరుణాంతరంగుడైన పరమేశుడు నన్నొక పరికరమును చేసి నా చేయి పట్టుకుని తనకు తాను వ్రాసుకొనుచున్న వాక్యములే ఈ గిరిశంచ-అభిచాకశీ.

  ఇక్కడ పెద్దలు గిరిశంచ అను పదములోని గిరి శబ్దమునకు మూడువిధములైన అర్థములను వివరించారు.

1 మొదటిది గిరి కొండయందుండి (మన గుండెయందుండి) శం శుభములను కలిగించువాడు.

2.గిరులు-వేదములు వేదములయందుండి జగములకు మోదము కూర్చువాడు.

3.గిరి-ఇచ్చినమాట యందుండి ఆర్తరక్షణమును చేయువాడు.  

  ఇట్టి మహిమాన్విత స్వభావుడు పరమశివుడు రుద్రుడై -అభిచాకశీ అన్ని వైపులా తన తేజముతో ప్రకాశిస్తూ,వానిని సమర్థవంతము చేస్తున్నాడు.

    భోళాశంకరుడు నేను ఏమి కోరుకోవాలో,ఎలా కోరుకోవాలో,ఎప్పుడు కోరుకోవాలో తానే నాకు స్పురింపచేసి నన్ను అనుగ్రహించుగాక.స్వామి దయతో మనము చమకముతో మమేకమై ఆనందసాగరములో మునిగి తేలుదాము.

  నమకములో సత్యం-శివం-సుందరమును దర్శించగలిగితే స్వామి కరుణ మనము కోరుకునే ప్రతి అభ్యర్థన మన ఆధ్యాత్మిక సాధనకు సోపానముగా మలుచుకోవటము నేర్పుతుంది.తరలి తరలి తరింపచేస్తుంది.
సర్వం శివమయం జగత్.

   ఏక బిల్వం శివార్పణం.)

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...