Tuesday, October 31, 2017

VAAHVAA-JIHVAA

AHAA EMIRUCHI ANAMAA MAIMARACHI

ఆహా! ఆవ రుచి, అనమా మైమరచి
మాటవరసకునైనా..మనగలమా నిను విడిచి
ఆరు రుచులతో చవులూరు ఆవకాయ
అయినావమ్మ ఆబాలగోపాల శ్లాఘనీయ
మామిడిపై దండెత్తి మరుమాటలేక చేసి
ఉప్పుకారముల తగుపాళ్ళు చొప్పింప చేసి
తగిన దినుసులు తైలము చెలిమి చేసి
ఆవ ఘాటుతో వాటిని చాటుచేసి
ఆవకాయ అను పేరుకు పెద్ద పీట వేసి
ఉర్రూతలూగించు ఊరగాయ మన ఆవకాయ.
పింగాణి జాడిలో సింగారముగా పోతపోసి
వాసెన అను మేలిముసుగు సిగపైన వేసి
విస్తరిలోని ఆథరువులను తోసివేసి
వాసికెక్కినావమ్మా వైద్యునిగ ఆవకాయ
బోసినవ్వుల పాపాయి పోటి ముసలివారితోటి
దోసమెంచకు దొడ్డరుచికి నీకునీవే సాటి
అగ్రతాంబూలముతో అభినందనలు కోటి
ఆవకాయ !!!! నిన్ను పొగడ నేను ఏపాటి.

Wednesday, October 25, 2017

JANANI JOHAARLU

జననీ జోహారులు
ఒదిగి ఒదిగి అందించే,ఒద్దికైన ప్రేమను
పొదుగుతున్న కోడిలో,నీలో నే చూస్తున్నా
చక్కని రూపమునిచ్చిన ఓర్పుకు నా జోహారులు
..............
హారము రిపుసం హారమనే అపురూపపు ప్రేమను
ఎగురుతున్న కాకిలో,నీలో నే చూస్తున్నా
చల్లని జీవితమును ఇచ్చిన ఉక్తికి నా జోహారులు
.....................
బుద్ధులను నేర్పించే సత్యబద్ధమైన ప్రేమను
పూజిస్తున్న గోవులో,నీలో నే చూస్తున్నా
విచక్షణను ఇచ్చిన శిక్షణకు నా జోహారులు
....................
సందు సందు మారుచున్న అందమైన ప్రేమను
దాస్తున్న పిల్లిలో,నీలో నే చూస్తున్నా
అప్రమత్తతను ఇచ్చిన ఉదాత్తతకు నా జోహారులు
......................
వీక్షణమున రక్షించే లక్షణమైన ప్రేమను
ఒడ్డునున్న తాబేటిలో,నీలో నే చూస్తున్నా
కరుణను వర్షించే కన్నులకు నా జోహారులు
.......................
వెనుకంజయే లేని వెన్నంటు ప్రేమను
ఎగురుచున్న కంగారులో,నీలో నే చూస్తున్నా
విడువక ముడిపడిన కడుపుతీపికి నా జోహారులు
.......................
గుడ్లను గూటికి మార్చిన గుండెకోత ప్రేమను
రాగాల కోకిలలో,నీలో నే చూస్తున్నా
అనురాగము వెదజల్లు త్యాగమునకు నా జోహారులు
..........
ఎన్నెన్నో రూపాలలో ఎన్నలేని ప్రేమను
పరిమాణము కొలువలేని ప్రణామముల కోవెలను
మొక్కుబడి తీర్చినట్లు ఒక్కరోజు మొక్కుటేల
ఎదగుడిలో ప్రతిష్టించి
పదిలముగా  పూజిద్దాము
జగమంతా నిండిన జననీ జోహారులు.
అమ్మా అన్నింటిలో నీవే కనిపిస్తున్నావు
కమ్మని నీ ప్రేమతో నన్నే మురిపిస్తున్నావు.
.

Amma Gammathugaa Navvindi Oka Saari

పొట్ట వత్తుకుంటోందని అమ్మ మనసు తిట్టుకుంది
అమ్మ మనసు తిట్టుకుంటోందని బోర్లపడటం ..మానేసా.
పెరుగుతు..పెరుగుతు
అన్నీ అందుకోవాలని అంబాడాలనుకున్నా
అంబాడగ ప్రయత్నిస్తే అదిరాయి నా మోకాళ్ళు
మోకాళ్ళను చూసి అమ్మ మనసు బెంబేలెత్తేసింది
అమ్మ మనసు బెంబేలెత్తేసిందని పాకటము..మానేసా.
పెరుగుతు..పెరుగుతు
మడుగులొత్తించుకుందామని అడుగులేద్దామనుకున్నా
అడుగులేయ ప్రయత్నిస్తే పిచ్చి పిర్ర చుర్రుమంది
పిర్ర చుర్రుమనుట చూసి అమ్మ మనసు నొచ్చుకుంది
అమ్మ మనసు నొచ్చుకుందని.నడక నేను నేర్చుకున్నా
పెరుగుతు..పెరుగుతు
చక్కదనము అందీయగ చదువుకోవాలనుకున్నా
చదువుకోగ ప్రయత్నిస్తే అవరోధాలెదురాయె
అవరోధాలను చూసి అమ్మ బాధ పడింది
అమ్మ బాధ పడిందని..అసలు మనిషి నేనయ్యా
పెరుగుతు..పెరుగుతు
నా సందేహం పెరిగింది ...అది..
నా బాధతో మమేకమైన ..అమ్మ.
ఒక్కసారి..ఒకే ఒక్కసారి
నేను గట్టిగా ఏడిస్తే..నన్ను చూస్తూ
గమ్మత్తుగా నవ్వింది..ఎందుకో..తెలియదు
మీకైన తెలుసా..ఎప్పుడో..ఎప్పుడంటే
నేను పుట్టినప్పుడు ???????????????
ఎంత పెద్దవాడినైన అద్దమంటి నా మదిలో
ముద్దుగా కూర్చున్న హృద్యమైన ఆ నవ్వును
ఆశీర్వచనమై ఆలంబనగా ఉండనివ్వు...అమ్మా..వందనము.

Ammante Emito Cheppana

అమ్మంటే ఏమిటో నేను చెప్పనా -
సంతకాల పుస్తకము.
******************
వికారమును తనుభరించి, ఆకారమును ఇస్తుంది,
అమ్మ ఒక "అద్భుతం."
తాడు తాను సృష్టించి, ఆహారమును ఇస్తుంది,
అమ్మ ఒక "అమృతం."
కానరాని శక్తినిచ్చి, కదలికలను కలిగిస్తుంది,
అమ్మ ఒక" అవ్యక్తం."
గర్భసంచిని పెరగనిచ్చి, తాను జరుగుతూనే ఉంటుంది,
అమ్మ ఒక "అక్షయం."
శిశువు జననము గురించి, ప్రసవ వేదన తానై సహకరిస్తుంది,
అమ్మ ఒక "అద్వైతం".
కసిగా నన్నేడిపించి, ముసి ముసి నవ్వౌవుతుంది,
అమ్మ ఒక "అనుభవం."
పాలను పట్టించి, ఒట్టువేసినట్లే ఒడిలో కట్టిపడేస్తుంది,
అమ్మ ఒక "అయస్కాంతం."
ముద్దులతో మురిపించి ఒజ్జయై తీర్చిదిద్దుతుంది,
అమ్మ ఒక" అధ్యయనం".
సూర్య-చంద్రులను చూపించి సూక్ష్మాలను నేర్పుతుంది,
అమ్మ ఒక "అభ్యాసం".
పట్టుదలను అందించి నేను పడిలేస్తుంతే ఫరవాలేదు అంటుంది
అమ్మ ఒక "అనునయం."
కష్టమునకు తానోర్చి కావలిసినదేదైన కాదనలేనంటుంది,
అమ్మ ఒక" అల్లాయుద్దీన్ అద్భుతదీపం."
మనసారా దీవించి మానవత్వ విలువలను ప్రేరేపిస్తుంది,
అమ్మ ఒక" అభ్యుదయం."
ఆది-భౌతిక పుష్టినిచ్చి మార్గము సుస్పష్టముచేస్తుంది,
అమ్మ ఒక "అదృష్టం."
నిగ్రహమునిచ్చి నవగ్రహపీడలను దూరంచేస్తుంది,
అమ్మ ఒక "అనుగ్రహం."
వారసులనిచ్చి, సృష్టిని కొనసాగింపచేస్తుంది,
అమ్మ ఒక "అజరామరం."
ఇంకా...ఇంకా.ఇంకా ఎన్నో ఎన్నెన్నో !!!!!!!!!!
చెప్పాలనుకుంటున్నా కాని చెప్పలేకపోతున్నా
ఎన్ని నేను చెప్పినా కొన్నిగానె అవుతున్నాయి, ప్చ్,ప్చ్,ప్చ్
బిక్కమొగము వేసిన నన్నుచూసి ................
ఎప్పటివలె బెంగతీర్చి, సంభాషించుటకు భాషలు చాలవంటుంది,
అమ్మ ఒక "అనిర్వచనీయం".
మొక్కవోని ధైర్యమిచ్చి ," ముక్కోటిదేవతలను" తన మునివేళ్ళపై చూపుతుంది
" వారి సంతసపు సంతకాల పుస్తకమే అమ్మ"
చెంతనున్న పులకించును ఆపాదమస్తకమే అమ్మా!
నీ లక్షణముల అక్షరాలు అక్షింతలై దీవిస్తుంటే
ప్రతి స్త్రీలో నీ సంతకము ప్రతిబింబము అవుతోంది
ప్రతీకగ, ప్రణామములు స్వీకరిస్తూ.




Tuesday, October 24, 2017

ETLAA NINNU ETTHU KONDUNAMMA (ఎట్లా నిన్నెతుకుదునమ్మా)

.

RAKSHIMCHUNU (రక్షించును)

   రక్షించును
***************
 మత్తేభపు పెత్తనములునర్తించే ఈ జగములో
 మత్తేభవదనుడు నను రక్షించును ఈ క్షణములో
 .....
 పుండరీకములెన్నో గాండ్రించే ఈ లోకములో
 పుండరీకాక్షుడు నను రక్షించును ఈ క్షణములో
 .....
 వికటమగు మకరినోట కటకటలాడే ఈ జగములో
 మకరిబాధ తప్పించును కరివరదుడు ఈ క్షణములో
.........
 గోమాయువులా ఏమారిచే జిత్తులున్న ఈ లోకములో
 గోపాలుడు చిత్తుచేసి రక్షించును ఈ క్షణములో
 ............
 అసురపీడా విసురుగ ముసురుతున్న ఈ జగములో
 మురహరుడు సరగున నను రక్షించును ఈ క్షణములో
 ........
 అంతరంగ శత్రువులు అదురులేక,బెదురులేక
 నిరంతరముగ చెల్లాచెదురు చేయువేళ
 బయలుదేరి రావయ్యా భయముగొల్పు నాదరికి
 సాయముచేసి చేరనీ అభయవేల్పు నీదరికి.

Monday, October 23, 2017

AMBA VAMDANAMU (అంబ వందనము)

వందనం

===========

అంబ వందనం  జగదంబ వందనం
సంబరాన కొలువుతీరె శక్తి వందనం

భవతారిణి భగవతి భక్తి 
పారిజాత అర్చనల  పాదములకు వందనం

పాపనాశిని పావని  పార్వతి 
గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం

గణపూజిత గుణాతిశయ  గౌరి 
ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం

ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ 
అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం

గిరితనయ విరిపూజిత దుర్గ 
విదుషీమణి అలంకృత  మణిమేఖలకు వందనం

అఖిలాండపోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ 
భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం

శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక  
సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం

పరిపాలిని శుభకారిణి గాయత్రి 
త్ర్యంబక రాణి భవాని కంబుకంఠమునకు వందనం

సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి 
విబుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం

లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి 
బీజాక్షర పూరిత ఓష్ఠమునకు వందనం

పూజా సేవిత  వారణాసి విశాలాక్షి 
ముక్తిప్రదాత యోగశక్తి వక్త్రమునకు వందనం

భావ ప్రవాహ భాషా ప్రదీప  వాగ్దేవి 
నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం

ఆశ్రమవాసుల ఆరాధ్య రాజ రాజేశ్వరి 
తపోధనుల తల్లి నీ కపోలములకు వందనం

కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబిక 
సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం

స్తోత్రప్రియ మూర్తిత్రయ త్రిపురసుందరి 
మణికుండలముల మెరయు కర్ణములకు వందనం

శ్రుతి స్మృతి వినుత విరాజిత అపర్ణ 
ఫాలలోచనుని రాణి ఫాలమునకు వందనం

పాలాభిషేక ప్రియ నందిని కాత్యాయిని 
అక్షయ ప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం

లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయిణి 
క్లేశహరిణీ పరిమళ క్లేశములకు వందనం

వాసవాది వినుత కేశవ సోదరి 
సంకటనాశిని పొంకపు మకుటమునకు వందనం

కింకరపాలిని శుభగాత్రి మహిషాసుర మర్దిని 
అథాంగ పూజనము అపరాధ క్షమాపణము
ఆపాదమస్తక వందనము ఆపాత మధురము
ఆ నందిని ఆరాధనము అనుదినము 
అంబవందనం  జగదంబ వందనం 

NAVADURGANAMOESTUTAE.

నవదుర్గ నమోస్తుతే
     *****************,
 పారిజాత అర్చనల పాదములకు వందనం
పాపనాశిని పావని పార్వతి వందనం
............
గులాబీలు గుబాళించు గుల్భములకు వందనం
గణపూజిత గుణాతిశయ గౌరి వందనం
.........
ముద్దు గణపయ్య కూర్చున్న ఊరువులకు వందనం
ఎద్దునెక్కు శివునిరాణి గిరిజ వందనం
..........
అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం
గిరితనయ విరిపూజిత దుర్గ వందనం
........
విదుషీమణి అలంకృత మణిమేఖలకు వందనం
శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక వందనం
.......
భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం
అఖిలాండ పోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ వందనం
.......
సకలశాస్త్రధర శుభ కరకంకణములకు వందనం
పరిపాలిని శుభకారిణి గాయత్రి వందనం
........
త్రయంబకరాణి భవాని కంబుకంఠమునకు వందనం
సృష్టి స్థితి రూపిణి త్రిపురసుందరి వందనం
.........
విబుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం
లక్షణరూపిణి కొళపురి మహాలక్ష్మి వందనం
.........
బీజాక్షరపూరిత ఓష్ఠమునకు వందనం
పూజావిరాజిత విశాలాక్షి వందనం
..........
ముక్తిప్రదాతయోగశక్తి వక్త్రమునకు వందనం
భావ ప్రవాహ భాషా ప్రదీప వాగ్దేవి వందనం
.......
నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం
ఆదరించు అమ్మ రాజరాజేశ్వరి వందనం
..........
తపోధనులతల్లి నీ కపోలములకు వందనం
కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబ వందనం
.........
సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం
స్తోత్రప్రియ మూర్తిత్రయ త్రిపురసుందరి వందనం
.......
ఫాలలోచనునిరాణి ఫాలమునకు వందనం
పాలాభిషేకప్రియ నందిని బాల వందనం
.......
మణికుందలముల మెరయు కర్ణములకు వందనం
 శృతి స్మృతి విరాజిత అపర్ణ వందనం
......
అక్షయప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం
లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయణి వందనం
.......
క్లేశహరిణి పరిమళ కేశములకు వందనం
వాసవాది వినుత కేశవసోదరి వందనం
.......
సంకటనాశిని పొంకపు మకుటములకు వందనం
కింకరపాలిని శుభగాత్రి మహిషాసురమర్దిని వందనం

 అపరాధములు క్షమిస్తూ అమ్మలా పదే పదే
 నన్నేలుచున్నట్టి  నవదుర్గ నమోస్తుతే..

Pooja Cheyudamu Raare (ఫూజ చేయుదము రారే)

పూజ చేయుదము రారె
నిత్య కళ్యాణిని నిలిపి నీవె మాకు శరణు అనుచు
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
......
పూర్ణ కుంభమును నిలిపి పరిపూర్ణ భక్తిని అందు కలిపి
షడ్వికారములు వదిలి షోడశోప చారములతో
....
ఆవాహనమును చేసి ముదావహమును అందు కలిపి
మూర్ఖత్వము వదిలివేసి అర్ఘ్య పాద్యములతో
......
పంచామృతములు కలిపి మంచిని మరికొంత కలిపి
సంకుచిత తత్వమును వదిలి సుగంధ అభిషేకములతో
......
పట్టు వస్త్రమును తెచ్చి పట్టుదలను పైన పేర్చి
బెట్టులన్ని కట్టిపెట్టి పట్టు చీర చుట్టబెట్టి
....
తిమిరంబులు తిప్పికొట్టి త్రికరణ శుద్ధిని పెట్టి
అంతర్జ్యోతిని చూపి పరంజ్యోతిని ప్రార్థించగ
....
ఏలా లవంగ పూలతో జాజి చంపకములతో
మాలతి మందారులతో మాహేశ్వరిని మరి మరి
....
మల్లెలు మొల్లలు మంచి పొన్నలు పొగడలు తెచ్చి
రంగుల రోజా పూలతో రాజేశ్వరిని రమణీయముగ
....
మరువము దవనము తెచ్చి మరువక మదిని తలచి
పచ్చని చామంతులతో పరాశక్తి పాద పద్మములను
........
హ్రీంకారికి ఓంకారికి శ్రీంకారికి శంకరికిని
శ్రీ మత్ పంచదశాక్షరి శ్రీ లలితా త్రిపుర సుందరికి
....
అథమత్వమును వదిలి అథాంగ పూజలు చేసి
కథలు గాథలు వింటూ మధురస నైవేద్యాలతో
......
ఆకులు పోకలు తెచ్చి ఆటు పోటు మరిచి
గొప్పలు చెప్పుట మాని కర్పుర తాంబులము ఈయగ
......
అహరహములు నీకు దాసోహము మేము అనుచు
అహమును మరిచి చేసే బహుముఖ వాహన సేవకు
........
బంగరు తల్లిని కొలిచి అంగనలు అందరు కలిసి
సంగములన్నీ విడిచి మంగళ హారతులీయగ
........
నవ ధాన్యము తెచ్చి నవ విధ భక్తిని చేర్చి
నవరాత్రోత్సవములలో " శ్రీ మన్నగర నాయకి" కి
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
(శరన్నవరాత్రి సందర్భముగ నిష్కళంక భక్తి పుష్పము.)

Sunday, October 22, 2017

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)

" జానక్యా: కమలాంజలి పుటేయా: పద్మరాగయితా:
న్యస్తా రాఘవ మస్తకేన విలసత్లుంద ప్రసునాయతా:
స్రస్తా శ్యామల మస్తకాంతి కలితా యాఇంద్ర నీలాయుతా:
ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"

అప్పా,  రామభక్తి ఎంతో గొప్పరా !!!
**********************************
స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి, బుధవారము
పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న
సీతారామ కళ్యాణములో
తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా
జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత
వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి
అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు
కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు
ఇంతలో
మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై
పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి
మగపెళ్ళివారము మేము అంటూ అహల్య
పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది
రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది
రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది
ఆడ పెళ్ళివారము మేము అంటూ మొల్ల
వేదవతి పాదము అని పారాణిని అద్దింది
పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింది
చక్కని చుక్క సీత అని బుగ్గ చుక్క పెట్టింది.
ఆహా.... ఏమి మా భాగ్యము
ఎదురుబొదురు వధూవరులు ముగ్ధ మనోహరము
తెరసెల్ల మధ్యనుంది చెరొక అర్థ భాగము.
ప్రవర చదువుతున్నారు వశిన్యాది దేవతలు
ప్రమదమందుచున్నారు పరమాత్ముని భక్తులు.
వివాహ వేడుకలను వివరించుచున్నారు విశ్వనాథ
ఎన్నిసార్లు వినియున్నా తనివితీరని కథ.
" మాంగల్యం తంతు నానేనా-లోక కళ్యాణ హేతునా"
పట్టరాని సంతోషము మ్రోగించె గట్టిమేళము
రాముడు కట్టిన సూత్రముతో మెరిసినది సీత గళము
తలపై పట్టు వస్త్రములతో, ముత్యాల తలంబ్రాలతో
తరలి వస్తున్నారు తానీషా వారసులు.

సుమశరుని జనకునకు సుదతి సీతమ్మకు
శుభాకాంక్షలై కురిసెను సౌగంధిక సుమములు.
వానతోడు తెచ్చుకున్న హరివిల్లు తళుకులుగా
హర్షాతిరేకముగా విరబూసెను తలంబ్రాలు.
"ఒకే మాట, ఒకే బాణం ఒకే పత్ని" రామునకు అని
మురిసిపోతున్నారు ముందు వరుసలోని వారు.
ఒడ్డుకు చేర్చు దేవుడని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
నారాయణుడితడంటు నారదునితో విభీషణుడు
ఆశీర్వచనము చేస్తూ ఆ విశ్వామిత్రుడు
దండము పెట్టేనురా కోదండపాణి చూడరా
అని అండజుడు

సీతమ్మకు చింతాకు పతకమునిస్తూ రామదాసు
మా జానకిని చెట్టపట్టగానే మహరాజు వైతివని
మేలమాడు త్యాగరాజు.

సీతా రాముల పెళ్ళంట- అంగరంగ వైభోగంగా
చూసిన వారికి పుణ్యాలు అంటూ అందరూ
తమని తాము మరచిపోతుంటే,
శ్రీరామ అను చిలుక సేసలు అందిస్తోంది
పందిరిలో పరుగిడుతూ సందడిగ బుడత ఉడుత
అక్షింతలు అందరి తలలపై వేసుకోమంటున్నది.
పానకమును అందిస్తున్నారు సనక సనందనాది మునులు
ప్రసాదము అని వడపప్పును పంచిపెడుతున్నారు
చూడ చక్కని జంట అని చూపు తిప్పుకోలేక పోతున్నామన్న
మాటలు వినబడి వారికి దిష్టి తగులుతుందేమోనని
సూక్ష బుద్ధితో వెంటనే అదిగో అటు చూడండిరా
సీతా రాములు
అలిసిపోయి ఉన్నారని వారికి ఆకలి అవుతున్నదని
పండ్లను తినిపిస్తున్నది పండు ముసలి ఆ శబరి.
చైత్ర శుద్ధ నవమికి ఈ నేత్రోత్సవమబ్బెనా
శుభలక్షణములను అభిజిత్ లగ్నము అందుకోగలిగెనా
ఆబాల గోపాలపు ఆనందము హెచ్చెనా
సీతారామ కళ్యాణము సురుచిరమై కొనసాగునా
చెప్ప నలవికాదురా " సీతారామ కళ్యాణ వైభోగము"
కంటి రెప్పవైన మా అప్పా!
రామ భక్తి ఎంతో " గొప్పరా."

Raara Maa Intidaaka Raama (రారా మా ఇంటి దాక రామ)

"రారా మాఇంటి దాక" రామా
**************************
"జానక్యా కమలాంజలి పుటే: యా పద్మరాగాయిత-న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయతే
శ్రస్త శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర నీలాయిత-ముక్తస్థ శుభద భవంతు భవతం శ్రీ రామ వైవాహికం"
స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి,శుక్రవారం
పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న ,
***************************************
అసమాన శివ ధనుర్భంగము గావించిన వానికి
అగ్ని పునీత వేదవతి,అయోనిజ సీతను ఇచ్చి
విదేహ మహారాజు చేయుచున్న ముదావహ "కన్యాదానము"లో
" వరుడు"
ఆ సూర్య వంశములో అగ్ని ప్రసాదముగా జన్మించిన వాడు
ఆ కౌశికునికి అగ్నికార్య రక్షణము కావించిన వాడు
అహమును తొలగించిన వాడు అహల్య పాలిట దేవుడు
గురు వాక్య పాలకుడు,సుగుణాభి రాముడు
ఆ లోక కళ్యాణములో
**********************
"నిధి చాల సుఖమా రాముని సన్నిధి కన్నా" కాదని
తరలినాడు భద్రుడు తాను పెళ్ళి వేదికగా
అర్ఘ్య పాద్యాలు,మంగళ స్నానాలకు
పరవళ్ళు తొక్కింది పదమని గోదావరి
విభీషణుని మృదు సంభాషణల వ్యాఖ్యానాలతొ
వశిన్యాది వాగ్దేవతలు మారారు బ్రహ్మలుగా
కోతి మూక చేయుచున్న కోటి నామ జపములు
మారు మ్రోగుతున్నాయి మంగళ వాయిద్యాలుగా
పట్టు వస్త్రాలను,నవరత్న తలంబ్రాలను
తలపై పెట్టుకుని తరలి వస్తున్నారు తానీషా వారసులు
కళకళలాడుతున్నాయి కళ్యాణ వేడుకలు
*****************************************
"ఒకే మాట,ఒకే బాణం,ఒకే పత్ని" వ్రతుడు" శ్రీరాముడు" అని
మురిసి పోతున్నారు ముందు వరుసలోని వారు
ఎందరెందరో అనఘులు,ఏనాటికిని ఘనులు.
(కీర్తి కాయులై కీర్తించు చున్నారు)
ఒడ్డునకు చేర్చు దేవుడవని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
చింతాకు పతకముతో నిశ్చింతగ రామదాసు
"మా జానకిని చెట్టపట్టగానే మహరాజు" పాడుతున్న త్యాగరాజు
ఎందరెందరో అనఘులు,ఎన్నటికైనా ఘనులు
(కన్నుల పండుగైన కళ్యాణ సుముహూర్తమును దర్శించండి-
జన్మను చరితార్థము చేసుకోండి)
పందిరిలో పరుగులిడుతు సందడిగ బుడత ఉడత
అక్షింతలు వేసుకోమంది అందరి తలలపై
"తారకము "అను పానకమును, "తాదాత్మ్యత" అను వడపప్పును
తనివితీర తాగమంది,తరియించగ తినమంది
అదిగో,అటు చూడండి..సీతారాములు
అలిసిపోయినారంటు,ఆకలి అవుతున్నదంటు
పండ్లను తినిపిస్తున్నది,పండు ముసలి ఆ శబరి
"శబరి"గా మారిపోయి (భక్తిలో)" శరణు" వేడుకొందామా
"రామ" (రాముడు, మరొక అర్థములో స్త్రీ రూపములోనున్న సీతమ్మ)
మమ్ములను" బ్రోవమని".
.శ్రీ రామ జయ రామ జయ జయ రామ
*********************************

Saturday, October 21, 2017

SIVAARPANAM.

శివార్పణం
*************
ఈశ నిన్ను గాననైతిని ఈశు మనమున నిండగా
పాశములు తొలగించు నా మది కాశివాసము చేయగా

నే చీమనైనా కాకపోతిని శివుని ఆనతి చాటగా
పామునైనా కాకపోతిని సామి గళమును చేరగా

సాలెనైనా కాకపోతిని శూలిగూటిని నేయగా
కరిని యైనా కాకపోతిని కనికరమును పొందగా

లేడినైనా కాకపోతిని వేడుకగా దరిచేరగా
పులితోలునైనా కాకపోతిని నూలుపోగుకు మారుగా

పందినైనా కాకపోతిని బొందెనే అందీయగా
 ఎద్దునైనా కాకపోతిని పెద్ద దేవుని మోయగా

బూదినైనా కాకపోతిని ఆదిదీవును తాకగా
జటనుయైనా కాకపోతిని జటిలమును తొలగించగా

విషమునైనా కాకపోతిని విషయమును గ్రహియించగా
పుర్రెనైనా కాకపోతిని వెర్రితనమును బాపగా

వాని యోగమో యేమో ఉపయోగములుగా మారగా
నన్నూ తరియింపనీ నీ అనవరతపు కరుణగా.

NAENAEMANAGALANU-VAANINI

నేనేమనగలను? వానిని
********************
ఆవరించు చీకటిలా అమావాస్య పుడతాడు (మహా శివరాత్రి)
జాగృతమగుటకు జాబిలి జతకడతాడు (చంద్ర శేఖరుడు)

ఐదు ముఖములతో తానుంటూ బహుముఖ పూజలందుకుంటాడు
ఆలింగనములు ఇస్తాడు,లింగము తానంటాడు.(మార్కండేయునికి)
పెద్ద దిక్కు నేనని దిక్కులు చూస్తుంటాడు
వరములు ఇస్తుంటాడు,పరుగులు తీస్తుంటాడు (భస్మాసురుడు)
కామేశ్వరి పతిని అని కామిని వెంటపడతాడు
తెలివైన వాడినంటాడు,తెల్లబోయి చూస్తాడు(మోహిని)
అల్లుడిని అని అలుగుతాడు,ఇల్లరికము ఉంటాడు (దక్షుడు,హిమవత్పర్వతము)
కన్నులతో కాల్చుతాడు,కన్నెను పెండ్లాడుతాడు(మన్మథుని,పార్వతిని)
కుడిఎడమల తను-సతి అని కూరిమి పలుకుతాడు (అర్థనారీశ్వరము)
ఎడమను దాచేస్తాడు,కుడిరూపుగ ఉంటాడు (దక్షిణామూర్తి)
నీటిని,నిప్పును తనలో నిక్షిప్తము చేసుకున్నవాడు (గంగమ్మ,మూడో కన్ను)
నీటిని జారనీయడు,నిప్పును ఆరనీయడు
ప్రణవములో తానుంటూ ప్రళయములో ముంచుతాడు (జలమయం)
వీర భద్రుని పంపిస్తాడు,చిన్ముద్రలో ఉంటాడు (రౌద్రం-శాంతం)
సన్యాసిని తానంటు సంసారిగ ఉంటాడు (మాయా సతి)
నాదము తానంటాడు-మౌనముగా ఉంటాడు (డమరుక నాదము,మౌన బోధ)
అమంగళము తనుధరించి మంగళము అని అంటాడు(పుర్రె,బూడిద,విషము)
కర్మలు జరిపేస్తాడు.కరుణను కురిపిస్తాడు (పాపహరుడు-సదా శివుడు)
నేననగలను వానిని ---వాడే సర్వేశ్వరుడు అని.
( ఏక బిల్వం శివార్పణం)

VEMTA RAANEEYAKU SIVAA.

వెంట రానీయకు శివా
1.అత్తమామలని చూడక పెత్తనాలు చేసిందా నీజట
 కడసారి తప్పు అని దానిని చుట్టివేయుము శివా
2.కళ్యాణమని చూదక మదనుని కడతేర్చిందా నీ కన్ను
  కదసారి కఠినమని దానిని కదలనీయకు శివా
3.కదనవ్యామోహమంటు నరునిపై కదిలిందా నీవిల్లు
  కదసారి ప్రయోగమంటు దానిని దాచివేయుము శివా
4.ఉదారతను కనుగొని నిను తన ఉదరమున చేరమనిన ఆ గజము
  కడసారి వరమని కరికి ఎరిగించుము శివా
5.కన్నకొడుకని చూదక కడతీర్చినదా నీ శూలము
  కడసారి దూకుడని దానిని కదలనీకుము శివా
6అసురుడై నిను తరిమితే అలుముకున్న నీ బూది
  కడసారి ఆట అని దాని మదమును అణిచివేయి శివా
7.ఉద్ధరణను మరిచి ఉన్మత్తతను ప్రదర్శిస్తే నీ కత్తి
  కడసారి మత్తంటు మార్చుకోమను దాని ప్రవృత్తి శివా
8.బిడ్డలని అనుకోక అడ్డముగా నరికినదా నీ గొడ్డలి
  కడసారి పదును అని దాని చివరను మొద్దుబారనీయనీ శివా
9.శిశువులని చూడక అసువులను తీస్తోందా నీ పాశం
  కడసారి తప్పు అని దాని నడవడిని మార్చుకోమను శివా
10.మేధలేని నాకెందుకు నీ ఆయుధాల గోల
   కంటికి కాటుక అందం మరి వంటికి కాదు శివా
  నా విలాసమే నీకు కైలాసము కాబోగా
  వెంట రానీయకు ముక్కంటి ఆయుధాలను శివా.

SIVOEHAM

శివోహం
ఎంత మరియాదరా శివా
నీ చెంతకు నేనొస్తి చింత తీరుస్తవని
చలికంద కప్పుకోను కంబళికి నేచూస్తే
కరిచర్మమిస్తవని కలతగున్నది నాకు
ఆకలికి నిను నేను అన్నమునకై చూస్తే
విషమింత ఇస్తవని గుబులుగున్నది నాకు
చిన్నబోయి నేను చీకటికి నిను చూస్తే
అమాసచందురునిస్తవని అలజడున్నది నాకు
అదేమిటని నేను బెదురుగా నిను చూస్తే
బూడిదినిస్తవని భయమున్నది నాకు
నా సంగతిని మరచి నేను నీ ఉనికిని చూస్తే
సతికి సగమిస్తవని సంతసమైనది నాకు.

Thursday, October 19, 2017

SIVA SANKALPAMU

ప్రియ మిత్రులారా,
సచిద్రూపము (సత్తు-చిత్తు-రూపము) పరమాత్మను మనము సత్యం-శివం-సుందరం అని కీర్తించుచున్నాను.సత్యము అనగా శాశ్వతత్వము.సుందరము అనగా సంతోష ప్రదము.శాశ్వత సంతోషమే శివము.అదియే పరమాత్మ ప్రకాశము.
పాలు-మీగడ,పెరుగు,మజ్జిగ,వెన్న ఇలా రూపాంతరములు చెంది నెయ్యిగా మారుతుంది.పేరుకున్నా,కరిగించినా అది నెయ్యిగానే ఉంటుంది.రూపాంతరము చెందదు.అదే విధముగా
శాశ్వత సుందర తత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుదిరగలేరు.అది మనదారిని మళ్ళించి వేస్తుంది.మహేశ్వరునితో మమేకము చేస్తుంది."దాసుని తప్పులు దండముతో సరి" అంటూ మనచే ఆడిస్తుంది.పాడిస్తుంది.మనసును జోకొట్టి శివుని నిందించేలా చేస్తుంది.మేల్కొలిపి స్తుతించేలాను చేస్తుంది మనసుతో దాగుడుమూతలు ఆడుకుంటూ,బుద్ధిని అందులో భాగస్వామిని చేస్తూ,నిందాస్తుతులను అందచేస్తుంది.సమయము,స్థలము తానేయైన కాశీనాథుడు కార్తీక మాస శుభ సందర్భముగా తన డమరుకము నుండి లక్షణ అక్షరవానలు కురిపించ దలిచాడు.అక్షయ ముక్తిఫలములను పంచుతు మనలను మురిపించదలిచాడు.దోసిలొగ్గి స్వీకరించి తరించుదాం.నా దోసములను శివకృపతో సవరించుదాం.మీ సోదరి

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...