Wednesday, November 29, 2017

CHIDAANAMDAROOPAA-KANNAPPA NAAYANAARU


  చిదానంద రూపా-కన్నప్ప నాయనారు
  *******************************
 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 ఎనలేని  భక్తిని చాతగ అర్జునుడు ఎరుకలవానిగ పుట్టెగ
 ఎలమిని తిన్నడుగ శ్రీ కాళహస్తీశ్వరుని పాదము పట్టగ

 బోయ దంపతులు నాగడు-దత్త యోగఫలముగ
 నాయము తప్పని వేటగాడు ఆ తిన్నడుగ

 నందివాహనుని కరుణను డెందము భక్తిమరందమాయెగ
 పొందగ  దండిగ  చిందిన రక్తపు కన్నుల కరుణను

 తన కన్నులను మందుగ  సామికి అందించెనుగ
 తిన్నడు  కన్నప్పగ మారగ కళ్ళను ఇచ్చుట కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం  జపంబు చింతలు తీర్చును గాక.

Monday, November 27, 2017

CHIDAANAMDAROOPAA- KULACHIRAAYA NAAYANAARU

  చిదానందరూపా-కులచిరాయ నాయనారు
  *********************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 "మనమేర్కుడి" గ్రామపెద్ద శివభక్తుడు కులచిరాయ
  అనవరతము వినపడును అతనినోట " నమః శివాయ"

  కులమత భేదమును మరచి శివకులమొకటే అని అను
  చిన్న-పెద్ద తేడాలు  చిన్నబుచ్చుట అతడు ఎరుగడు

  మంత్రి పదవి వరించెను శివభక్తిని  వ్యాపించగ
  జ్ఞాన సంబంధరును తెప్పించెను  రాజుకన్ను తెరిపించగ

  స్వచ్చత నిండిన మనము స్వచ్ఛంద శివమయమాయెగ
  సద్గతినొందగ ఇతరులకు సన్మార్గము చూపుట కారణమాయెగ

  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

Sunday, November 26, 2017

CHIDAANAMDAROOPAA- VAAYILAAR NAAYANAARU

 చిదానందరూపా--వాయిలార్ నాయనారు
 *********************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన  వరమనుకొందునా

 వాక్కును పలుకగలేనివాడు  వాయిలర్ నాయనారు
 విగ్రహపూజలు చేయడు కాని శివానుగ్రహము కలవాడు

 కపిలేశ్వరు దర్శనమునే కోరడు  కామితార్థములనీయమనడు
 ఆత్మ నివేదనమును చేయును  ఆ పరమేశ్వరును భక్తుడు

 ఇంపగు గుడిని నిర్మించగ సంపదలను అసలే  అడుగడు
 పెంపున మనసున నిలిపెను స్వామిని సొంపగు కాంతుల శోభను

 అద్భుత ప్రాకారములతో  అమరిన  నవరత్నములతో
 మాహేశ్వరుని చేరగ  మానసిక దేవళము కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు   శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-MUNAIYADUVAR NAAYANAARU


 చిదానందరూపా-మునై యదువార్ నాయనార్
 *************************************
 కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 కావేరి గలగలలు  సౌగంధిక పరిమళములు
 సార్థక శివ భక్తుల స్తుతులుగలది తిరునల్లూరు

 వజ్రకఠిన దేహము పుష్ప కోమల హృదయముతో
 అక్కడనున్న ధర్మనిష్ఠాగరిష్ఠుడు మునైయదువరు నాయనారు

 శివసంకల్పమును అనుసరించి దారుఢ్యముతో దుష్టశిక్షణను
 సిరిలోపమును గ్రహించి శివభక్తులకు చేయును నిత్య రక్షణ

 శివాన్సరూపము తానై తుదివరకు ధర్మమును నిలిపెగ
 ఘృష్ణేశ్వర సన్నిధి చేరగ సమర్పించిన మృష్ణాన్నము కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్రము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. 

CHIDAANAMDAROOPAA- KARI NAAYANAARU


 చిదానందరూపా-కరి నాయనారు
 ***************************

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 తిరుక్కడ వూరులోని  శివభక్తుడు కరి నాయనారు
 సంకీర్తించగ  ఇశుని  ఆతనికెవ్వరు సాటిరారు

 మార్కండేయుని సమ్రక్షించినదిక్కడే మాహేశ్వర క్షాత్రము
 మహాత్ములకు  ఆలవాలమైనది ఈశుని క్షేత్రము

 వైభవ వాగ్బంధములతో,శాంభవ సంకీర్తనలతో
 పాండ్య-చోళ-చేర దేశముల పాటలు తేనెలు మీటెను

 పాయని భక్తికి తోడుగ సంపద సాయము ఆయెగ
 సన్నిధి చేరగ సంపద శివభక్తుల చేరుట కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయు శివోహం  జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA- NINRACHEERU NEDUMAARA NAAYANAARU


 చిదానందరూపా-నిన్రచీరు నెదుమార నాయనారు
 *****************************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 పెడుమారనర్ అను రాజుకు  కున్ పాండియన్ వేరొక పేరు
 జైనుడు తాను ,తన పరిపాలన కోరును కొంత మార్పు

 ఆరోగ్యము-రాజ్యము అభివృద్ధిని పొందెను,ఆశీర్వచనమో
 అద్భుతముగ మార్చెను రాజును తిరుజ్ఞాన సంబంధరు సంస్కారము

 అదననుకొని ఆక్రమించగ రాజ్యము దండెత్తెను ఉత్తర రాజు
 అదిమేసెను వానిని  అరివీర భయంకర  శంకర మహరాజు

 అనవరత రక్షణలో రాజ్యము ఆనందములో తేలియాడగ
 ఆది దేవుని కరుణను పొందగ, ఆధ్యాత్మికయే కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం  జపంబు చింతలు తీర్చును గాక.
నెడు మారనర్ పాండ్య రాజు.జైన మతమునునమ్మిన వాడు.అతని వీపుపై గూని యుండుట వలన కుణ్ పాండియళ్ అని పిలువబడేవాడు.అతని రాజ్యములో కూడా అనేక సమస్యలు అతనినివేధించుచున్నవి.శివుని కృపా కటాక్షమేమో ఒకరోజు తిరుజ్ఞాన సంబంధారు దర్శనము,సంభాషణము రాజులో కోల్పోయిన తన ఆరోగ్యమును ప్రసాదించి,తన రాజ్యములోనిచీకాకులు తొలగి పోయి ప్రశాంతముగా నుండ సాగెను.ఇదే సమయమని ఎన్నాళ్ళనుందియో  ఎదురుచూస్తున్న శత్రురాజు పెద్ద సైన్యముతో దండెత్తెను.నమ్మిన వారి కొంగు బంగారమైన పరమేశుడు ప్రచండుడై శత్రువును పరాజయము పాలు చేసెను.ఆశ్రిత వత్సలుని ఆశీర్వచనముతో వారు అతి పవిత్రులైరి.
  ( ఏక బిల్వం శివార్పణం.

CHIDAANAMDAROOPAA- GANA NAATHA NAAYANAARU


 చిదానంద రూపా- గణ నాథ నాయనారు
 ******************************************
 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 శిర్కళిలో జన్మించిన శివ భక్టుడు గణనాథ నాయనారు
 చేసే ప్రతి పని చైతన్య స్వరూపుని సేవగ తలచును

 చెంతకు చేరినవారికి చిదానందుని సేవలు పంచును
 కొందరు పూమాలలతో,మరికొందరు గంగా జలముతో

 ఇంకొందరు శివ చింతనతో ,మరికొందరు సంకీర్తనలతో
 సమయము  సద్వినియోగము  సఫలము మానవ జన్మము

 ఫంగుణి ఆర్ద్ర  నక్షత్రమున తిరు పూజోత్సవముతో
 గణముల నాయకుడవ్వగ  సద్వర్తనమే కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయు  శివోహం జపంబు  చింతలు తీర్చును గాక .


  శిర్కోళి లో శివాలయములోని సత్తెయనాథుని పరమ భక్తుడు.సమయమున సద్వినియోగపరచుకొనుచు,ఇతర చింతనలను వదిలి,ఈశ్వర చింతనతో తన జన్మను సార్థకతమొనరించుకొనువాడు.ఎంతోమంది అతని దగ్గరకు వచ్చి,తమ మనోవేదనను వెలిబుచ్చుకొని,వారి సమస్యలకు తగినపరిష్కారమును పొందెడివారు.మరికొందరు తమ జీవన శైలిని భగవత్సేవకు మళ్ళించుకొని చరితార్థులైనారు.తముళ పవిత్ర గ్రంథములగు "తిరుమరై"  గ్రంథ ప్రతులను వ్రాయుచు తన్మయమునందెడి వారు.జ్ఞాన సంబంధరు ఆ స్థలముననే అమ్మ క్షీరపానముచే అమృతగానమును చేసెనని నమ్ముదురు.సాత్విక మార్గములో సంస్కారమును పెంపొందించి,శైవభక్తులను సుసంపన్నులుగ చేసిన నాయనారు సదాశివుని కరుణతో కైలాసమున గణములకు నాయకుడై ఫంగుణి తిరునక్ష్త్రమున పవిత్ర ఆరాధనలనుందుచున్న గణ నాథుని కరుణించిన పరమశివుడు మనలనందరిని అనుగ్రహించును గాక.

 ( ఏక బిల్వం శివార్పణం.

Saturday, November 25, 2017

CHIDAANAMDAROOPAA- KANAM PULLA NAAYANAARU


 చిదానందరూపా- కణంపుల్ల నాయనారు
 ********************************

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 కాముని కాల్చిన వాడే తనలోని తమోగుణమును కాల్చువాడనుచు
 అగ్ని కన్నుగ నున్న దేవునికి ప్రజ్వల జ్యోతులు పెద్దసేవ యను

 ఇరుక్కువేళూరులోని ఈశ్వరభక్తుడు కణంపుల్ల నాయనారు
 సాష్టాంగముతో  తనువు భూమిని తాకగ,సంకీర్తన నింగిని తాకు

 అవధులులేని  భక్తి గావించిన అద్భుత దీపాలంకరణము
 ఆ  హరు  ఆనతిగాన భక్తుని ఆస్తిని  హరించివేసెను

 తృణములు దొరకని వేళ,తన కురులతో చేసిన దీపారధనమే
 పరమేశ్వరు సన్నిధి చేరగ పణముగ పెట్టుట కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచే శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

ఇళుక్కువేలూరు లోని శివుని భక్తుడు కణంపుల్ల నాయనారు.మదనుని కాల్చిన సర్వేశ్వరుదే తన మదమును జయింపగల దేవుడుగా భావించును.దానికి కారణమైన అగ్నినేత్రునికి అర్పణగా ఆఅలయ ప్రాంగణమంతయు ఆవు నేతి దీపాలతో అనుదినము అమిత భక్తితో సేవించేవాడు.సంకీర్తనము సాంబశివుని కీర్తిని అమబరమును తాకుచుండగా,సవినయ సాష్టాంగ నమస్కారముతోతనువు భూమిని తాకుతు సంతసించుచుండెడిది.స్వామి అనుగ్రహమేమో కాని తిల్లైలో కనక మహాసభయందలి స్వామి నృత్యమునకు,నాయనారు మదిలోని శివ లాస్యము అద్దమును పట్టుచుండెను.సానబెట్టిన గాని గంధపుచెక్క పరిమళించదు అన్నట్ట్లుగా స్వచ్చమైన భక్తునకు కలిమిలేములు కదిలించలేవుగా.ఆశీర్వాదమును పొందవలెన్న అగ్ని పరీక్షను అధిగమించుట అనివార్యము.ఆ శివుడు లీలా విశేషముగా నిటలాక్షుడు తన భక్తుని నిరుపేదగా చేసెను.నిరుత్సాహమే కానరాని నాయనారు కొడవలిచేతనుబూని,గడ్డికోసి దానినమ్మి వచ్చిన ధనముతో స్వామికి దీప కైంకర్యమును చేయసాగెను.భక్తుని కీర్తిని చిరస్థాయి చేయుటకు శివుడు ఆ గడ్డిని కూడా మాయము చేసెను.సాధ్యము కానిది ఉన్నదా సాంబ సివుని పూజకు! దీపములు ప్రకాశించుటకు గడ్డికి బదులు తన శిరోజములు  శివభక్తుని ఆనతిని శిరసావహించినవి.శివోహం శివోహం శివపద  స్థిర నివాసమును కల్పించినవి.

  ( ఏక బిల్వం శివార్పణం.)

CHIDAANAMDAROOPAA- SIRU TOMDA NAAYANAARU


 చిదానందరూపా-శిరుతొండ నాయనారు
 **************************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 పరంజ్యోతి  తిరువెంగాడునంగై పరమశివ భక్తులు
 రాజాజ్ఞగా వృత్తికన్న ప్రవృత్తిది పైచేయి అయినది

 శివభక్తునికి  భోజనమునిడి కాని భుజియించని నియమముగా
 ఆతిథ్యమును కోరిన యతి అత్తిచెట్టు క్రింద నుండె

 ఆరు నెలలకొకసారి ఆ దినమున నరమాంసము తన ఆహారమనె
 ఐదేళ్ళ బాలుని అమ్మ-నాన్న తెగకోసి వండి వడ్డించాలనె

 కాదనలేని విధంబున వారి కాళ్ళకు బంధమును వేసె
 కామితార్థమునీయ కఠిన పరీక్షయే కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక.

 పరంజ్యోతి-తిరువెంగాడి నంగై పరమశివ భక్తులు.రాజాజ్ఞగా వృత్తికన్న ప్రవృత్తికే పైచేయి యైనది.శివ భక్తునకు భోజనమిడికాని తాము భుజియించెడి వారు కారు.చిద్విలాసముగా వీరి నియమము ఎంత నిర్లమైనదో లోకమునకు తెలియచేయాలనుకొన్నాడు.వెంటనే సివయోగిగా వీరి ఇంటికి అతిథిగా వచ్చెను.యజమాని వచ్చిన తరువాత తాను ఆతిథ్యమునకు వచ్చెదనని,అంతవరకు గణపతి గుడిలో నున్న అత్తిచెట్టు క్రింద ఉందుననిచెప్పి వెడలెను.విషయము తెలిసి కొనిన పరంజ్యోతి పరమసంతోషముగ అతిథి వద్దకు వెళ్ళగా,తనకు ఒక నియమము కలదని,ఆరు మాసములకొకసారి ఐదేళ్ళ బాలుని,అతని తల్లితండ్రులు స్వయముగా కోసి వడ్డించిన ఆహారమును భిక్షగా స్వీకరింతుననెను.ఏ మాత్రమును సంకోచించకుండా అందులకు అంగీకరించి,అమిత  భక్తితో ఆహారమునుసిద్ధము చేసిరి.అతిథికి వడ్డించబోగా వారిని చూచి యోగి తన పక్కన వరొకరు కూర్చుని తినవలెనన్నాడు.వారు ఎంత బ్రతిమాలినను వినకుండ మీ అబ్బాయినే పిలవండి అంటూ,తనే శ్రీయాళా అని పిలువగానే బాలుడు లేచి నవ్వుతూ వచ్చాడు.అదియే కదా ఆదిదేవుని అనుగ్రహము.ఆశ్రిత రక్షణ పరమార్థము.

  ( ఏక బిల్వం శివార్పణం.

Friday, November 24, 2017

CHIDAANAMDAROOPAA- ELUPPANAAR NAAYANAARU


చిదానందరూపా-ఎళుప్పనార్ నాయనారు
***************************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన  వరమనుకొందునా

 వ్యాళ నిగళుని భక్తుడు ఎళ్ వాయిద్య ప్రసిద్ధుడు
" ఎరుక్కలం పులియర్" లో పుట్టిన ఎళుప్పనార్ నాయనారు

 అది నారద మహతి నినాదమో నాయనార్ ఎళ్ మంగళ గానమో
 సర్వేశ్వర కృపా కాసారమో సరగున లభించిన సాక్షాత్కారమో

 పరవశమున పరమేశుడు పలికించిన ప్రణవమో
 తిరుజ్ఞాన సంబంధరు శివకీర్తన సహకారమో

 ఏకాగ్రతతో చేసిన ఏకమార్గోపాసనయో
 ఏకామ్రేశుని చేరగ  ఎళ్ వాయిద్యము కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చు గాక.


 ఎళ్ అను వాయిద్యముతో శివుని భక్తి పరవశమున కీర్తించు నాయనారు ఎళుప్పర్ అను పేరుతో కీర్తించబడుతున్నాడు.తిరువారూరు లోని స్వామి ఆలయ శిఖరమును దర్శించుచు పరవశమున తన ఎళ్ వాయిద్య తంత్రులపై నాదోపాసనయే నా స్వామి ఆరాధనయంటు నిరంతరము తనలోనున్న స్వామితో రమించుతు రాగమాలపించుతు స్వామికి,అంతర్ముఖోపాసన-బహిర్ముఖోపాసన చేయుచుండెడి వాడు నాయనారు.పరవశించిన పరమేశుడు ద్వారబంధములను తెరచుకొనునట్లు చేసి తన దగ్గరకు పిలిపించుకొని "తొలి నేచేసిన పూజాఫలమా" అని అనుకొనునట్లు ఎళ్వాదనతో పరమ ప్రీతుడాయెను.తెరచుకొనిన ద్వారములు మాయామోహములు.అవి తొలగిన అధ్యాత్మికత పై మెట్టును ఎక్కినట్లే కదా.అందుకే అది తిరుజ్ఞాన సంబంధారు దివ్య కీర్తనలకు పక్క వాయిద్యమై,స్వామిపై,సత్పురుషులపై తన భక్తి ప్రపత్తులను చాటుకొన్నది .త్రికరణ శుద్ధితో చేసిన నాదోపాసన త్రినేత్రునికి ప్రీతిపాత్రుని చేసి, ఆ చంద్ర తారార్కము ఆరాద్యనీయుని చేసినది.నాయనారుని కరుణించిన ఆ నంది వాహనుడు మనలనందరను కరుణించును గాక.
 ( ఏక బిల్వం శివార్పణం.)
 .

Wednesday, November 22, 2017

CHIDAANAMDAROOPAA- KARAIKKAAL AMMAYAARU NAAYANAARU

 చిదానందరూపా-కరైక్కాల అమ్మవారు
 ******************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 కరైక్కాలలోని వైశ్య ధనదత్తుని కూతురు పునీతవతి
 కళ్యాణముతో అయినది యోగ్యుడు నిధిపతి శ్రీమతి

 శివానుగ్రహము ప్రసాదించినది రెండు మామిడి పండ్లను
 శివయోగికి ఆతిథ్యము ప్రసాదించినది  అనేక మామిడిపండ్లను

 భార్యలో  మానవాతీత శక్తులున్నవని భావించెను నిధిపతి
 మానవ మాత్రుడు తానని మళ్ళీ వివాహమాడెను

 సాంబశివుని తన సౌందర్యమును హరించమని వేడెను సాధ్వి
 భూతనాథుని కొలువగ భూతపు రూపును ఇచ్చెను స్వామి

" న భూతో న భవిష్యత్ " అను నానుడి తీరున
  కైలాసమున శిరముతో నడచుట కైవల్యమునకు కారణమాయెగ

  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును


  కరైక్కాల్ లోని ధనదత్తుడను వైశ్యుని కుమార్తె పునీతవతి.ఎదుగుతు ఎదుగుతు శివధ్యానములో కాలను గడుపుచుండగా,వాగై ఓడరేవు పట్టణమునందు గల నిధిపతితో శాస్త్రోక్తముగా వివాహమును తండ్రి జరిపించెను.వారు అన్యోన్యముగా కరైక్కాల్ లోనే ఉండిరి.ఒకనాడు రెండు మామిడి పండ్లను శివుడు పునీతవతి ఇంటికి పంపెను.శివయోగి ఒకరు అతిథిగా వచ్చినందువలన అతనికి భోజనములో మామిడిపండును వడ్డించినది.యోగి సంతుష్టుడై వెడలెను.భర్త వచ్చినతరువాత భోజనములో ఆయనకు ఇంటిలోనున్న రెండవ మామిడిపండు ని వడ్డించినది.అది తినిన తరువాత భర్త రెండవ పండును అడిగెను.కాని అదిలేదు.అయి నా పునీతవతి భర్తకు మామిడిపండును ఇచ్చుటకు శివుని ప్రార్థించి,శివానుగ్రహముతో ఇచ్చినది.దానిని రుచి చూసిన భర్త అది అసామాన్యమైనదని,దాని వివరములను తెలుసుకొని,ఇంకొక దానినీమ్మనెను.శివుడు తన భార్యకు మామిడిపండ్లను ప్రసాదించుటను చూసి,ఆమె మానవాతీతశక్తులు కల ఉత్తమ స్త్రీ అని,ఆమెని విడిచిపెట్టి,వ్యాపార మిషతో దూరదేశములకు వెళ్ళి అక్కడ మరొక స్త్రీని పెళ్ళి చేసుకొని.సుఖముగా నుండెను.వారికి జన్మించిన కుమార్తెకు పునీతవతి అని పేరు పెట్టిరి.విషయమును తెలుసుకొనిన పునీతవతి,తన సౌందర్యము తీసివేయమని ప్రార్థించి,భూత రూపమును ధరించి," అర్పుత తిరు అంబాదీతో కీర్తించుచుండెను.స శరీరముతో కైలాసమును చేరి,తన పాదమును మోపజాలక,శిరముతోనే నడిచి,పార్వతీ పరమేశ్వరానుగ్రహముతో వారిని కీర్తిస్తూ,స్వామీనుగ్రహము వలన శివ తాందవము జరుగునపుడు,తాను వారిచెంత పరవశత్వముతో పాడుతూ తరించుచున్నది.

 ( ఏక బిల్వం  శివార్పణం.

Tuesday, November 21, 2017

CHIDAANAMDAROOPAA- TIRU JNAANA SAMBAMDHARU


 చిదానందరూపా- జ్ఞాన సంబంధారు
 *******************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 శివపాదహృదయాల్ భగవతి దంపతుల పుత్రుడు
 సుబ్రహ్మణ్యాంశతో పుట్టెను శిర్కోలిలో ఒక శివ భక్తుడు

 తండ్రి నదీస్నానపు నెపము,త్రావించెను బాలుని జ్ఞానక్షీరము
 ప్రకటితమైనది వాగ్వైభవము,ప్రసిద్ధ "తొడుదయ సెరియల్" గ్రంథము

 ఏడవ ఏట జరిపించిన ఉపనయ సంస్కారము,నేరుగా
 చూపించినది ఎద నిండిన వేదాధ్యయనము

 స్వస్థత చేకూర్చెగ రాజుకు సంబంధారు  సంకీర్తనము
 పరమపదమునందగ సరిగ పదహారేళ్ళే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు  తీర్చును గాక.

  తిరుమారై జ్ఞానసంబంధార తల్లితండ్రులు శివపాద హృదయార్-భగవతియార్.సుబ్రహ్మణ్యస్వామియే శిర్కళిలో
జ్ఞాన సంబంధారుగా తల్లి స్తన్యపానమునకై అవతరించారని ఆర్యోక్తి.హృదయార్ పూజాదికములను నిఎవర్తించుటకై నదీస్నానమునకు వెళుతూ కుమారుడైన జ్ఞానసంబంధారుని తనతో తీసుకొనివెళ్ళెను.తాను నీటిలో మునకలు వేసినపుడు కనిపించలేదని పిల్లవాడు భయపడతాడేమోనని స్పురించేలాచేసాడు శివుడు.తండ్రిగా ధైర్యము చెప్పుట తన కర్తవ్యమని,బాలుని దగ్గరకు పిలిచి,నాన్నా  ఈ గుడిలోని పార్వతీపరమేశ్వరులు నీ నిజమైన తల్లితండ్రులు.నేను కనిపించక పోయినా,నీకు ఏమైనా  కావలిసినా వాళ్ళను పిలువు అని చెప్పాడు.ఈశ్వరాజ్ఞ ఏమియున్నదో? ఎవరెరుగరు అన్నట్లు బాలుడు ఆకలి అంటూ అప్రయత్నముగా వారిని పిలిచాడు.

  ఈప్సితమును తీర్చునది  ఈశ్వర సంకల్పముకదా! షణ్ముఖునితో తీరని తల్లిప్రేమ సంబంధారును వరించినది.తరింపచేసినది తల్లి క్షీరపానము.లోక పూజ్యమగు "తొడుదయ సెవియాన్" ఆవిర్భావమునకు కావలిసిన వాగ్వైభవమును ప్రసాదించినది తల్లి.హృదయార్ స్నానము ముగించుకొని వచ్చి,బాలుని నోటికి యున్న పాలను చూసి,ప్రశ్నించగా వరప్రసాదుడు ఆకసమువైపు చూపుతూ అమృతగానము చేయ 
సాగెను.ఏడు సంవత్సరముల వయసులోనే వేదమాత గాయత్రి అనుగ్రహముతో వేద-వేదాంత సారమును అవగతమొనరించుకొనెను.పాండ్యరాజుగారి అనారోగ్యమును నివారించుటకై శివనామ అమృత గుళికలనందించిన అపర ధన్వంతరి సంబంధారు.ఆ సర్వేశ్వారానుగ్రహముతో శివానురక్తుని చేసిన మహనీయుడు.వచ్చినపని పూర్తియైనదేమో పరమేశుడు పదహారు సంవత్సరముల వయసులో పరిణయమును చేసి దంపతులను ధన్యులను చేసెను.సర్వ సాక్ష్యైన సదా శివుడు మనతో ఉండి మనలను ఎల్లవేళల రక్షించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.

  

CHIDAANAMDAROOPAA- APPAADI ADIGAL NAAYANAARU


  చిదానందరూపా-అప్పడి ఆడిగళ నాయనారు
  ***************************************

  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా


  శివభక్తుడు తిరునవుక్కరుసరునకు భక్తుడు అప్పడి ఆడిగళు
  తిరునామము స్థిరముగ నిలుపగ  ప్రతివస్తువు సార్థకతనొందె

  చెలువపు భక్తితో సాగుచు చలివేంద్రము నొక్కటిగాంచె తిరునవుక్కరుసరు
  వివరము సేకరించి వరమీయగ ఆతని ఇంటికేగె శివయోగిగ

  అతిశయ భక్తితో స్వాగతమిచ్చి అతిథికి ఆరగింపుగా
  అమృత పంచభక్ష్యములు అర్పణ చేయగ అరటి ఆకులో

 కోయగబోయిన వానిసుతు చేతిపై వేసెను పాముకాటు
 సడలని వారి భక్తి సర్వేశునిపొందగ కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలుతీర్చుగాక.

అప్పూది ఆడిగళ్ అంటే సేవకునికి సేవకుడు.తిరునావుక్కరుసు పరమ శివ భక్తుడు.తిరునావుక్కరుసు భక్తుడు అప్పూడి ఆడిగళ్ నాయనారు.భ్కతుని ఔన్నత్యమును విని అతనిని చూడకనే భక్తుడాయెను.తన పెద్ద కుమారునికి మాత్రమే కాకుండ ఇంటిలోని ప్రతివస్తువునకు తిరునావిక్కరసు పేరును పెట్టుకొని తన భక్తిని చాటుచుండెను.ఒక వేసవిలో తన ఇంతికి కొంచము దూరములో ఒక చలివేంద్రమును బాటసారులకు పెట్టి ఆ కుండకు నాలుగు వాఇపుల తను నమ్మిన వాని పేరును అందముగా భక్తితో ముద్రించెను.ఆ దారిని పోవు తిరునావుక్కరసు తలయెత్తిచూడగా  చలివేంద్రము కూడా తన పేరుతోనేవిరాజిల్లుచుండెను.సేద తీరుచున్న బాటసారులను సమీపించి వివరములను అడుగగా వారు ఆడిగళ్ భక్తి ప్రపత్తుల గురించి వివరించి,సివయోగిని ఆడిగళ్ ఇంతి త్రొవను చూపిరి.

   అనన్య భక్తితో అతిథిని సేవించి దేవతార్చనకు తమ ఇంటిని అనుగ్రహించమని వేడుకొనిరి.వారి భక్తి లోకవిదితమును చేయుటకు విచ్చేసిన విసేష అతిథి అందులకు అంగీకరించెను.పంచభక్ష్యములను పరమప్రీతితో సమర్పించగ సిద్ధమై పెరటిలోని అరటి ఆకును కోసితెమ్మని తమ పెద్ద కొడుకైన తిరునావుక్కరుసరుతో చెప్పిరి.నాగాభరణుడి ఆటగా నాగుపాము ఉడిచేతిపై కాటువేసినది.మర్రిచెట్టు కు వేప పుట్టదు.అతిథి సేవకు ఆలస్యము కారాదని,వెంటనే ఆకును తల్లికి ఇచ్చి,గబగబ గడప బైతికి వచ్చి,నురుగులు కక్కుతు పడిపోయెను.విషయమును గ్రహించిన వారు,ఏ  మాత్రము చలించక నిష్కళంక భక్తితో అతిథికి వడ్డించిరి.అంతలో అతిథి వారి పెద్ద కుమారుని కి తన పక్కన వడ్డించిన తాను భుజించెదనని,ఒక్కడినే భుజించుట దోషమని పలికెను.వారుఎంత బ్రతిమాలినను వినలేదు.చివరికి నేను వానిని పిలుస్తాను మీరు మా ఇద్దరికి వడ్డించండి అని వత్సా భోజనమునకు రమ్ము అనగానే నిద్రనుండి లేచి వచ్చినట్లు సజూవుడై వచ్చి స్వామి ప్రక్కన కూర్చుని భుజించెను.దుఃఖమును లీలగ కల్పించి తనకరుణతో దానిని దూరముచేసిన ఆ సదా శివుడు నమ్మిన వారికి కొంగు బంగారము అయి రక్షించును గాక.

  ( ఏక బిల్వం  శివార్పణం.)

Sunday, November 19, 2017

CHIDAANAMDAROOPAA- CHANDEESVARA NAAYANAARU.


  చిదానందరూపా- చండీశ్వర నాయనారు
  ******************************************

  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

  జ్ఞాన వల్లూరులోని శివభక్తుడు  విచారశర్మ నామధేయుడు
  శివాపరాథమును  ఇసుమంతయు ఓర్వగలేనివాడు

  పండినజ్ఞానము మెండుగ నిండగ గుండెను గోవుల
  పాలన సేయగ ధర్మము నాలుగు పాదములనుండెగ

  చుట్టిన భక్తితో స్వామికి మట్టితో గుడినే కట్టి,పాలతో
  చేసిన అభిషేకము లీలన దోసమునే చూపెట్టగ తండ్రికి

  కట్టలు తెంచిన కోపము పాలకుండనె పడగొట్టినదిగ
  తండ్రిని కొట్టిన కర్రయె కరుణను పొందగ కారణమాయెగ

  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలుగాక
  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

చండీశ్వర నాయనారుగా ప్రసిద్ధిచెందిన విచార శర్మ వేద ఘోషలకు,తపములకు నిలయమైన తిరుచాయ జ్ఞాన వల్లూరునందు జన్మించాడు.తండ్రి ఎత్తదత్తుడు సన్మార్గుడు.ఐదు సంవత్సరములునిండకముందే వేదవేదాంగములయందు అపారజ్ఞానమును పూర్వజన్మ సంస్కారముగా పొందినట్లు ఏడవ యేట గురువుచే కొనియాడబడినవాడు ధర్మనిష్ఠాగరిష్టుదైన విచార శర్మ.ఒక్రోజు అగ్నిహోత్రమునకు సమిధలను తెచ్చుటకు వెళ్ళూచున్న సమయమున గోవును అమానుషముగా హింసించు కాపరిని చూసి,రాజుగారి అనుమతితో ఆ బాధ్యతను సంతోషముగా స్వీకరించెను,ధర్మదేవతా స్వరూపములైన గోవులు పితుకకుండనే పాలధారలను వర్షించ సాగాయి.ఆనందముతో స్వామికి నాయనారు,అత్తిచెట్టు కింద మట్టితో దేవాలయమును నిర్మించి,మట్టిలింగమును నిలుపుకొని,క్షీరాభిషేకముతో,అత్తి పూలపూజతో పరవశించుచుండగా,పరమేశుడు లోక ప్రకటియము చేయుటకు తనవంతుగా ఒక సామాన్య కాపులో ప్రవేశించి,పాలను నాయనారు నేలపాలు చేయుచున్నాడని తండ్రికి ఫిర్యాదు చేయించెను.చాటున దాగి,నాయనారు పూజను చూస్తున్న తండ్రికి స్వామి మాయచే అసలు విషయము మరుగున పడి,కోపించి ఎంత కొట్టినను నాయనారు ధ్యానముద్రలోనే అమితానందమును పొందుచు,అసలేది గుర్తించకుండెను.ఆలోచనను కప్పివేయునదియే కదా ఆగ్రహము.అహంకరించుచు,సివాభిషేకమునకు ఉపయోగించుచున్న నిండు పాలకుండను పగులగొట్టినది."అఘొరభ్యో-ఘోర ఘోర తరేభ్యో".రుద్రుడు ఆవహించినాడా అన్నట్లు అపరాధిముఖమునైనా చూడక కర్రను కాలిపైకి విసిరెను.కపర్ది లీలగ కర్ర ఖడ్గమై కాళ్ళను-కంఠమును తునుమాడినది .అదేది గమనించకుండా అన అభిషేకములో మునిపోయిన నాయనారు,పూజానంతరము పరమేశుని ప్రార్థించగా,పశుపతి వారినందరిని కరుణించెను.అదేవిధముగా మనలనందరిని కరుణించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం,)


Saturday, November 18, 2017

CHIDAANAMDAROOPAA- ARIVAAL NAAYANAARU

  " న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
   న మంత్రో న తీర్థం నవేదా న యజ్ఞః
   అహంభోజనం  నైవ భోజ్యం  న భోక్తా
   చిదానంద రూపః శివోహం శివోహం."
 చిదానందరూపా--ఆరివాల్ నాయనారు

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 కేదారేశుని ఆరగింపుకు కేసరి బియ్యము ఆకు కూరలు
 చేసిన పాకము తోడుగ నంజుటకు మామిడి ఒరుగులు

 నిత్య నివేదనము చేసెడి ధన్యుడు ఆరివాల్ నాయనారు
 హరుడు హరించెనేమో సంపదను ,పరీక్షను చేయగ

 ముతకబియ్యపు అన్నము ఆకులు ఆహారముగా తిని
 నిత్యము నిర్మల భక్తితో ఎర్రబియ్యపు విందే ఈశునికీయగ

 నేలపాలైన నైవేద్యము కృంగదీయగ కొడవలితో తాను
 నేరముచేసితిననుకొని తన మెడను కోయుట కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.



  చోళదేశమున గల "గుణ మంగళ"పట్టణమందున్న తాయినారు వేదములయందు ప్రతిష్టితుడైన పరమేశ్వరునికి ఎర్రని బియ్యముతో వండిన అన్నమును ఆకు కూరలను,మామిడి ఒరుగులను నిత్యము నైవేద్యము చేయు నియమమును ఏర్పరచుకొనెను.ఈశ్వరానుగ్రహమును మించిన సంపదలు శివుని లీలగ తరిగిపోతినను,ఏ మాత్రమును చింతించక తాను కూలి పనికి వెళ్ళి,వచ్చిన సంపాదనతో స్వామి నైవేద్యమునకు మాత్రము లోటులేకుండా చూసుకొనేవాడు.ముతక బియ్యముతో,అవి లభించనపుడు ఆకులతో తమ ఆకలితీర్చుకొని,స్వామిసేవలో సంతసమునొందెడివారు.పరీక్షకు పతాక సన్నివేశముగా సదాశివుడు నైవేద్యమును నేలపాలు చేసినందుకు,ప్రాయశ్చిత్తముగ తనమెడను కొడవలితో కోసుకొన బోయెను.ఆత్మలింగమునకై రావణబ్రహ్మ భక్తితో తనశిరమును సమర్పించినట్లు.
సంతసించినసదాశివుడు నేలబీడులోనుంచి తన చేతిని ప్రకటిస్తూ,తన చేతలతో నాయనారును కరుణించినట్లు,దానికి కారణమైన( ఆరివాల్-కొడవలి)స్మరించుచున్న మనందరిని,సదాశివుడు రక్షించును గాక.

 ( ఏక బిల్వం శివార్పణం.

Thursday, November 16, 2017

CHIDAANAMDAROOPAA- MAARANAARU NAAYANAARU.

  "అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి; త్రావుమన్న!రా
  వన్న; శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్
  గ్రన్నన మాన్ చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
  లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు చుమ్ము పుల్కసా!( రంతిదేవుడు)

   చిదానందరూపా-మారనారు
  **********************************
  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

  ఇలియాన్ కుడి  గ్రామనివాసి ఈశ్వరభక్తుడు
  మారనారు నాయనారు మహేశ్వర సేవాసక్తుడు

  విభూతి-రుద్రాక్షలధారులు విశ్వేశ్వరుడనుకొను
  విధివిధాన చేసిన సేవలు శాశ్వతమనుకొను

  పరమ ఉత్సుకతపూరిత  నిత్యోత్సవములే అట
  పెరిగిన భక్తి పెంపున ధనమును కరిగించినదట

  వానకు తోడుగ నిలిచెను అతిథిగ  శివుడే వాకిట
  నాటిన విత్తులవిందే  సాక్షాత్కారమునకు కారణమాయెగ

  చిత్రముగాక ఏమిటిది చిదానందుని  లీలలు గాక
  చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక

 మాతృదేవోభవ-పితృదేవోభవ-ఆచార్య దేవోభవ-అతిథి దేవోభవ అన్న కర్మభూమి జనించిన ఆ మారనారు అతిథికి మొదటిస్థానము నిచ్చి అతిథిసేవలో ఆ ముక్కంటిని చూచుచు మురిసిపోయేవాడు.తాము పొందుచున్న ఆత్మానందము తరిగిపోచున్న సంపద గురించి,కించిత్తయినను ఆలోచించనీయలేదు.ఈశ్వరేచ్చను శిరసావహిస్తూ,తాము పస్తులున్నా అతిథిసేవను వీడలేదు.ఆవేదన పడనులేదు.

   అన్నీ సమృద్ధిగా నున్న తరుణమున చేసే అతిథిసేవకన్నా అలభ్యతయైన వేళ చేయునదియే కదా అంతరార్థమెరిగినది.అంత్యమున మోక్షమునిచ్చునది.వీరి భక్తిని ప్రపంచవిఖ్యాతము చేయని యెడల నేను "పితా దేవో మహేశ్వర:" కానేకాను అంటూ ,కుండపోత వర్షములో ,నిండు దీవెనలనందీయ తరలి వచ్చి తలుపు తట్టాడు అతిథి.
.తరింప చేయ వచ్చిన వానిని సాదరముగా ఆహ్వానించి,మార్చుకొనుటకు పొడి వస్త్రములనిచ్చారు ముడిపడిన భక్తితో.కథ నడుపుట తెలిసిన నిధనపతి తనను ఆకలి దహించివేస్తోందని,ఆహారమును కోరెను ఆ పాపహరుడు.స్వామితోపాటు ప్రవేశించిన అన్నపూర్ణదేవి,నాయనారు భార్యను స్పృశించినది.వేదవ్యాసునికి కన్నతల్లిగా కడుపునింపిన ,బుద్ధులు నేర్పించిన తల్లి,అతి చమత్కారముగా పొలములో నాటిన విత్తులతో,నీటితో తేలుతున్న ఆకుకూర సాదమును అర్పించి,స్వామి దివ్య ప్రసాదము గావించినది.హర హర మహాదేవా-శరణు శరణు.విశ్రమించిన అతిథి ఉదయమున కానరాలేదు. వారిని

 అనుగ్రహించుటకు అతిథి అర్థనారీశ్వరుడై వారిని అనుగ్రహించినట్లు మనలనందరిని  అనుగ్రహించుగాక.

  ( ఏక బిల్వం  శివార్పణం.).

Thursday, November 2, 2017

OMTARI MAEGHAMU.

   ఒంటరి మేఘం
       **************

  ఒంటరి మేఘంలా
 మింటను దిగులుగా
 వెంటాడే దు:ఖంతో
 జంటగా సాగుతుంటే

 తలవని తలపుగా
 తారస పడ్దాయి
 మెచ్చుకోలు రూపాలుగా
 పచ్చనైన పూలు

 కిలకిల కేరింతలతో
 చిరుగాలుల జావళులకు
 తలలూపుచు మోహనముగా
 ఆహా! అనిపించేలా

 ఏటిగట్టు చెలిమితో
 అలల పలకరింపులకు
 తలపడుతూ పోటీగా
 రాగం! వినిపించేలా

 మిస మిస పరుపులతో
 సువాసనల  తరలింపుకు
 తలవాలిచి ముద్దుగా
 సేవే! కనిపించేలా

 కనలేమని కలవరముతో
 తామె వచ్చు ఊహలకు
 తలమానిక ధర్మంగా
 అందం! అదిరిందనేలా.
( శ్రీ వర్ద్స్ వర్త్ గారి  డఫడల్స్ స్పూర్తితో -- )
 నిమ్మగడ్డ సుబ్బ లక్ష్మి.

O! EKAAMTAMAA

ఓ ఏకాంతమా!!!!
*****************
కమ్మనైన రాగమేదో తీస్తున్నది విరిబోడి
కొమ్మచాటు కోయిలేదో దాస్తున్నది తడబడి
పిడికిలిలో కొడవలి కోస్తున్నది వరిమడి
గడసరిగ కనుగవ చూస్తున్నది జతపడి
ఓ.......ఏకాంతమా!
ఏమరుపాటుగా ఈ కాంతను వీడకు
ఎలనాగ ఆనందము చేజారనీయకు
కమ్ముకున్న శోకమేదో దాగినది మథనము
నమ్మలేని మైకమేదో సాగినది మధురము
తమకములో గమకములే చేరినవి హరితము
మమేకముగ గమనమే మారినది మురిపెము
ఓ.....సంగీతమా!
పంతువరాళినే కొత్తపుంతలుగా సాగనీ
సరికాదను వారిని సడిసేయక సాగనీ
చెమ్మగిల్లి యుగళమై కొండకోన పాడినది
చెమ్మచెక్క తాళమై నింగినేల ఆడినది
బొమ్మరిల్లు రూపమై లోయహాయి కూడినది
అమ్మదొంగ అమ్మాయై కడలి అల ఓడినది
ఓ......సౌందర్యమా!
నీదైన ప్రవాహమే కలువల కాసారము
శ్రమైక జీవనమే సకలవేద సారము.
తెమ్మెరలై ప్రతినోట ఆమెపాట తాకినది
ఉమ్మడివై ప్రతిచోట పని-పాట సాకినవి
ఏమ్మహిమో ప్రసరిస్తూ ప్రతిపూట వేకువైంది
అమ్మాయిని సంస్తుతిస్తూ సకలము మోకరిల్లుతోంది
ఓ సాహితీ సౌరభమా!
అనుభవమే అనుభూతిగ భావితరము చేరనీ
తరిస్తూ,తరలిస్తూ తరాలు తరియించనీ.
( శ్రీ వర్ద్స్ వర్త్ గారి "ది సాలిటరి రీపర్" స్పూర్తితో)

SAMAAMTARA PRAYAANAMU.

సమాంతర ప్రయాణం
*********************
అప్సరసలు-అభిఘాతలు
అందుకోలేరు అంటూ
పదాతిదళ పౌరుషముగ
పరుగులు తీస్తున్నది రైలు


పశువులు-పచ్చికలు
పాడి పంటలు అంటూ
పచ్చదనపు ముచ్చటగ
చొచ్చుకుపోతున్నది రైలు


ఉత్తానము-పతనము
అనివార్యము అంటూ
నల్లని బెర్రీల బాలునిగ
కూతలు పెడుతున్నది రైలు


పర్వతములు-కందకములు
ఎత్తు పల్లములు అంటూ
ఎత్తుగడల గమ్మత్తుగ
కొత్తగ తోస్తున్నది రైలు


కర్షకులు-కార్మికులు
నదులు మరలు అంటూ
మనసైన చిత్రకారునిగ
రంగులద్దుతోంది రైలు


సుకుమారము-శ్రమ వైనము
డయిజీలు డయిలీలు అంటూ
బడుగుకు ఓదార్పుగ
బడియగుచున్నది రైలు


లిప్తపాటు-శాశ్వతము
సమాంతరమే అంటూ
అనుభవాల అనుభూతిగ
జేజేలైనది రైలు (బోగి)
శ్రీ రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ గారి (ఫ్రం ఎ రైల్వే కేరేజ్ )స్పూర్తితో

LAMCHAM DAMDAKAM.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...