Monday, December 17, 2018

SIVA TAANDAVA STUTI.

     సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకు క్షమాపణ అభ్యర్థనలతో,

       శివ తాండవ స్తుతి.
       ********************

 "ఏ వేదంబు పఠించె లూత అన్నట్లు ఏ సాహితీ విషయ పరిజ్ఞానము లేని నా దుస్సాహసమును మన్నించమని కోరుతూ,"

 1.వడిన్ వడిన్ జటాటవిన్ జారి,గంగ సంప్రోక్షణంబైన స్థలిన్
   ధగత్ ధగత్ గళంబునన్ సర్పదండ వీక్షణంబు వేడుకన్
   డమర్ డమర్ కరంబునన్ రవంబుతో డమరుకంబు తోడుగన్
   ధిమిత్ ధిమిత్ నర్తనంబు పరిభ్రమించు వరంబులన్ లీలనన్

2. సుడుల్ సుడుల్ తిరుగుచున్నదదిగో సుర్గంగ జటాజూటములో
 చమక్ చమక్ వెలుగుచున్నదదిగో వెండిపూవు శిరములో
 చకిత్ చకిత్ దండనగ కందర్పుని కాల్చిన త్రినేత్రముతో
 ధిమిత్ ధిమిత్ తాండవంబు సదా శివమును వర్షించుగాక.

3. ప్రభల్ ప్రభల్ చతుర్దిశల్ ప్రభల్ జిమ్ము భవాని శిరోమణితో
 జ్వలిత్ జ్వలిత్ విలాసనేత్ర ప్రమోద ప్రదోష తాండవములో
 తరిమి తరిమిపారద్రోలు పాపతతుల పదఘట్టనములో
 తకిట తకిట తథాస్తుగ నామది నిండి తాండవించుగాక.

4.చమక్ చమక్ చంచరీక భూషణములు పాములైన జటలతో
  కరుణ కరుణ చకోరముల కనికరించు చంద్రరేఖ పూవుతో
  శరణు శరణు సురాధిపగణంబుల సుగంధ పుప్పొడులతో
  ఝణత్ ఝణత్ ప్రణవరవము పదకింకరులను బ్రోచుగాక.

5. జ్వలిత్ జ్వలిత్ సెగల పంచశరుని భుజించిన నిప్పుకన్నుతో
   శరత్ శరత్ వెన్నెలను పంచుశశిని ధరించిన గొప్పకొప్పుతో
   కుచిత్ కుచిత్ వీక్షణుని శిరముతుంచి,క్షమించిన కపాలముతో
   చకిత్ చకిత్ చండతాండవము సదా శివమును వర్షించు గాక.

6.కెంపు కెంపు సొంపులీనుచున్న అరుణారుణ ఫాలభాగముతో
  పెంపు పెంపు ఒంపులున్న అమ్మదనపు మకరిక  లేఖకునిలో
  గుంపు గుంపు గ్రోలుచున్న మరంద మధుర తాండవములో
  సొంపు సొంపు సొబగులున్నచిత్తులో నా మది రమించుగాక.

7. అహో అహో నల్లమబ్బు విశృంఖల విజృంభణల నిగనిగలతో
   కుహూ కుహూ అమావాస్య విస్తరణల చుట్టుకున్న శ్రీ కంఠములో
   దేహి దేహి దేవదేవ విమోహనముగ కట్టుకున్న కరిచర్మములో
   పాహి పాహి చంద్రమౌళి కింకిణులు శ్రియమును వర్షించుగాక.
8.చలువ చలువ రేటి చెలియ నల్లకలువ కంఠముతో
  ఖలుల ఖలుల కిల్బిషముల ఖండనముల కఠినముతో
  బలులు-బలులు జనన-మరణ కారకుల కన్నువిప్పు కపర్దిలో
  కొలువ కొలువ తాండవముల నా మది కొలువుతీరునుగాక.

9.ఝరి ఝరి విభావరి కళామాధురీ మనోజ్ఞ సర్వమంగళతో
  మరి మరి మధువుగ్రోల మరింత చెలగు గండు తుమ్మెదలో
  అరి అరి మదనదక్ష కరి త్రిపుర అంధక యమ భంజనలో
  పరి పరి ప్రస్తుతులతో మహేశ మనోవినోదమొందుగాక.

 10. బుసలు బుసలు కొట్టుచున్న భుజము మీది భుజంగములతో
    నొసలు నొసలు నడుమ మెరయు నుదిటి అగ్నిహోత్రముతో
    ధిమిత్ ధిమిత్ ధిమిత్ మ్రోగు మద్దెల తాళగతుల నర్తనముతో
    కొసరి కొసరి సదాశివుని దయ కనురెప్పగ క్షణక్షణము గాచుగాక.

11.  కటికనేల శయనము-కలిమి తల్ప దర్పమును విడిచి
  గులకరాయి హేళన-మణుల మెచ్చు భావనను మరచి
  మేలి ముత్య సరములను-కాల సర్ప హారములనొకటిగ
  ఉచ్చ-నీచ రహిత స్థితితో నిన్ను అర్చించుట ఎన్నడో?

12.  నిదుర నిదుర లేపి కుండలినిని,పైకి పైకి నేప్రాకుతు
 ఆజ్ఞఆజ్ఞ యైనదనుచు ఆజ్ఞాచక్రమునందు ఆదియోగివనుచు
 శివము శివము నీవు-నేను మాయతొలగి యోగక్రియను నిరంతరం
 తలచి తలచి నిన్ను నేను తరించుట ఎన్నడో కదా శివ.

   ఫలశృతి.

  నిత్యము ఈ దశకంఠ స్తోత్రమును చదివినను,వినినను,అర్థమును వివరించినను సదాశివుని కృపాకటాక్షముతో మానవుడు శుద్ధుడగును శరీరధారుల అజ్ఞానము కేవలము శివుని కృపచే తొలగింపబడును.

  పూజాదికములను ముగించిన సమయమున పఠించు శివతాండవ స్తోత్రము,సాధనోపకరణమైన శరీరమనే రథమును,బుద్ధి అనే అశ్వమును,కార్యములను చేయు సామర్థ్యమనే గజమును అందించి,పరమేశ్వర సన్నిధి అనే ఇంద్రపదవిని ప్రసాదించును.ఇది నిత్యసత్యము.శివ శిలా శాసనము.


  ( ఏక బిల్వం శివార్పణం.)





Tuesday, December 4, 2018

SIVA MANGALA STUTI

  శివ మంగళ స్తుతి
   ******************
  ఓం మంగళం- ఓంకార మంగళం
  శివ మంగళం -శివ-శివాని మంగళం

  జట మంగళం- జటాధారి మంగళం
  గంగ మంగళం -గంగా ధర మంగళం
  చంద్ర మంగళం-చంద్ర  మౌళి మంగళం
  నాగ మంగళం -నాగాలంకార మంగళం

    ఓం మంగళం _ఓంకార మంగళం.

 ఫాలము మంగళం-ఫాల నేత్ర మంగళం
   భస్మము మంగళం-భస్మధారి మంగళం
   నయనం మంగళం -నందివాహన మంగళం
   శ్రవణం మంగళం-శరణము మంగళం
   కపోలం మంగళం-కైలాసము మంగలం
   ఘ్రాణం మంగళం-వ్యాఘ్రేశ్వర మంగళం
   ఓష్ఠం మంగళం-కాశి కాష్ఠం మంగళం
   అథరం మంగళం-అభయము మంగళం
   వాయి మంగళం-వామదేవ మంగళం
   చుబుకం మంగళం-జంబుకేశ మంగళం
   కంఠం మంగళం-నీలకంఠం మంగళం
   రుద్రం మంగళం-రుద్రాక్ష మంగళం
   కపాలం మంగళం-కపాల మాల మంగళం

    ఓం మంగళం -ఓంకార మంగళం.

 పావన మంగళం-పార్వతినాథ మంగళం
 ప్రార్థన మంగళం-అర్థనారీశ్వర మంగళం
 శంకర మంగళం-భక్తవశంకర మంగళం.

  ఆ భక్త వశంకరుడు మన చేతిని పట్టుకొని మనలను సన్మార్గమున నడిపించును గాక.

  సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి.


  

Monday, November 12, 2018

NIRVAANA SHATKAMU.

నిర్వాణషట్కము
1. హృదయమునకు శ్వాసనందించు ప్రాణవాయువును కాను
   ఊపిరితిత్తులను పనిచేయించు అపాన వాయువును కాను
   సంకోచ వ్యాకోచ కారియైన వ్యానవాయువును కాను
   వాగ్రూప విలసితమైన ఉదాన వాయువును నేనుకాను
   జీర్ణావస్థను నిర్వహించు సమాన వాయువును కాను
   పంచ వాయువులు కాని నిరాకార నిరంజనమును నేను

2.త్రేణుపుగా వెలువడు గాలియైన నాగ ను నేనుగాను
  కనురెప్పకదలిక కారణమైన కూర్మ గాలిని గాను
  తుమ్ముటకు సహాయకారియైన కృకల వాయువును గాను
  మూసి-తెరచు హృదయ నాడుల ధనంజయ గాలిని గాను
  ఆవులింతలో దాగినదేవత్త దేవదత్త గాలిని గాను
  పంచోప వాయువులు కాని చిదానందమును నేను.

3..నయన-కర్ణ-జిహ్వ-చర్మ -నాసికను నేనుకాను 
 శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులును నేనుకాను
  అన్నమయ-ప్రాణమయాది పంచకోశములును 
 రక్త-మాంస-చర్మాదులైన సప్తధాతువులను కాను
  నవరంధ్ర సహిత శరీరమును నేను కాను
  దశేంద్రియములకు అధీనుడను నేను కాను
  ఇంద్రియావస్థలు లేని శివస్వరూపమును నేను.


4.అరిషడ్వర్గములకు ఆకర్షితుడను నేను కాను

  ధర్మార్థకామమోక్షములకు అధీనుడను కాను
  భోజన కర్త-కర్మక్రియలను నేను కాను
  పాప-పుణ్యములు,సుఖ-దుఃఖములు నేను కాను

  మంత్రములు-తీర్థములు నేనసలు కాను
  నిత్య నిరంజన  నిర్గుణుడను నేను

5సంశయమును కాను-సంసయ నివృత్తిని కాను
  మాతాపితలను గాను సంసార బంధితుడనుగాను
  గురుశిష్యుదను కాను గున స్వరూపమును గాను
  వికల్పమును కాను విచ్చిన్న మనస్కుడను గాను
  బంధు-మిత్ర బాంధవ్య బంధితుడను కాను
  జనన-మరణ కాలచక్రములో నేనులేను

మరి నేను ఎవరిని?

6.నిత్య సత్యము నేను-నిర్వికల్పము నేను
  తురీయమును నేను-నిరీహమును నేను
  త్వమేవాహము నేను-తత్త్వమసిని నేను
  పరమానందము నేను-పరమాత్మయును నేను
  శుద్ధచైతన్యము నేను-శుభకరంబులు నేను
  సచ్చిదానందమును నేను-సచ్చిదానందమును నేను.

    ( ఏక బిల్వం శివార్పణం.)




.


Friday, November 2, 2018

CHANDRASEKHARA ASHTAKAMU

ముని మార్కండేయ విరచిత చంద్రశేఖరాష్టకం
 **************************************
1.ముప్పు తొలగగమేరువింటికి వాసుకిని అల్లెత్రాడు చేసి
  తప్పిదములు సంహరించి తన భక్తులను సంస్కరించగ
  నిప్పు బాణములైన హరితో, త్రిపురాసురులను వధించిన
  చంద్రశేఖరునాశ్రయములో నన్నేమి చేయగలడు యముడు?

. కొంచపు విబూది పూతలతో సంచితములను తొలగచేయు
   వంచన తలబోసిన మారుని కంటిసెగ తుదముట్టించిన
   పంచపుష్పముల భక్తి పూజించిన పాదపద్మ విరాజితుని
   చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?


3. ప్రకాశవంతమైనది కరిచర్మము శివుని ఉత్తరీయమై
   ఆకాశ్గంగయును మురిసినదిగ అలల అభిషేకమై
   సంకాశుని కొలుచుచు హరిబ్రహ్మాదులు తరించుచున్నవేళ
    చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?


4. పాములను ధరించు వాడు-ఎడమభాగము పార్వతియేవాడు
   నోములను పండించువాడు విషము కప్పిన గరళకంఠుడు
   ఆమ్నాయ రూపము లేడిని గండ్రగొడ్డిలిని ధరించినవాడు
   చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?


5.కుండలిని శక్తిని కర్ణకుండలములుగ ధరించెను చూడు
  అండకోరిన సురల కల్పవృక్షము తాను, ముని వందితుడు
  దండనతో అంధకుని ధన్యునుగ చేసిన దయాసముద్రుడు
   చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?


6.పాపరోగములను హరించు ఔషధము త్రినయనుడు శివుడు
  ఆపదలనపహరించుచు చోరుడని పిలువబడువాడు
  ఓపలేనని తలచినంతనే కరుణ ప్రాపుగ నిలబడు
    చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?


7,అర్చనలనందుకొనుచున్నాడు ఆశ్రితభక్త వత్సలుడు
  మార్చగలవాడు మన రాతలను మారేడుదళముల రేడు
  ఆర్చగలవాడు ఆపదలనన్నిటిని సోమపాన ప్రియుడు
    చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?

8. విశ్వసృష్టిని తాను చేయుచు విధాత పేరున విలసిల్లును
   విశ్వపాలన  తానుచేస్తూ విష్ణువుగా మారివిఖ్యాతి పొందును
   విశ్వలయమును తానుచేస్తూ ప్రమథ గణములతో ఆడిపాడు
   చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు?

          మృత్యుభీతితో మృకండముని సుతుడైన మార్కండేయుని చంద్రశేఖరాష్టకమును వినినను,పఠించినను,స్మరించినను అపమృత్యుదోషము తొలగి ఆయురారోగ్యములను ఆ చంద్రశేఖరుని దయతో పొందెదరు గాక.

  ( ఏక బిల్వం  శివార్పణం.)

     ఓం తత్ సత్. 


Tuesday, October 30, 2018

SA SAKTI SIVA ASHTAKAM

స శక్తి శివ అష్టకము
 ************************

1. చతుర్వేదముల నాదసారము కావ్యనాటక పాటవములు
   ఇతిహాసముల దరహాసములు మేలుబాణి పురాణములు
   సకలశాస్త్ర సమాహార సంపద సముపార్జనకు సాధనా
   విజ్ఞానము ప్రసాదింపుము  శరణు శరణు శివ డమరుకం.

2.నాలుగు వేదములతో కూడినవిగ ఆరు వేదాంగములు
  నాలుగు ఉపాంగములు కలిసినవి, పదునాలుగు విద్యలు
  నాలుగు అరవై కళలలో ఆరితేరుటకు చేయు సాధనా
  చతురత ప్రసాదింపుము శరణశరణు శివ డమరుకం.

3. శంక నివారణోపాయములు మరియు  శబ్దశాస్త్రపు రీతులు
   తడబడక సాగిపోవు బుధజనుల తర్క-మీమాంసాదులు
   ఆశుకవితా అద్భుతాలు అనవరత ఆస్వాదన సాధనా
   పటిమను ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం

4. గణిత శాస్త్రము ఖగోళ భూగోళ వైజ్ఞానిక శాస్త్రములు
   అణిమ గరిమ అష్టసిద్ధులు లోక క్షేమ కారకములుగ
   సంపూర్ణజ్ఞాన సముపార్జనకు దృఢ సంకల్ప సాధనా
   శక్తి-యుక్తి ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం.


5.పట్టిన పట్టువీడక కష్టసాధ్యపు క్లిష్టమార్గమునందున
  చిట్టిపొట్టి అడ్డంకులు పట్టుగ నన్ను చుట్టుముట్టగ చూసిన
  బెట్టుచేయని భోళాశంకరుని కృపాకటాక్షముతో సాధనా
  సహనము ప్రసాదించుము శరణు శరణు శివ డమరుకం.


6. ఓంకార రూపుని హృదయపద్మమున స్థిరముగ నుండమని
     ఓనమాలు దిద్దుకొనుచు అక్షర లక్షణ పూజలు చేయగ
     ఓహో ఏమి నా భాగ్యమనుచు-ఒరవడినే మార్చగ సాధనా
     ఓరిమిని ప్రసాదించుము శరణు శరణు శివ డమరుకం.


 7. జన్మాంతర పాపములను జటాధరుడు తొలగించగలడు
     మన్మథుని అహమణచినవాడు నన్ను గమనించగలడు
     చిన్మయుని దయ బుధ్ధిజాడ్యములు జరిగిపోవగ సాధనా
     తన్మయము ప్రసాదించుము శరణు శరణు శివ డమరుకం.


8.సదాశివా! ఐహికము విరక్తి కలుగ  విషయవాంఛలు తొలగ
  సదాభక్తితో నీ సన్నిధానము చేరగ నే సన్నధ్ధమవగ
  సదానందము తోడు నే చిదానందుని చేరు సాధనా
  సార్థకత ప్రసాదించుము శరణు శరణు శివ డమరుకం


" స సక్తి శివ అష్టకమును" నిత్యము భక్తితో పఠించినను,వినినను,స్మరించినను సదాశివుడు సర్వశక్తులను ప్రసాదించి,మనలను సంపూర్ణముగా అనుగ్రహించును.

   ( ఏక బిల్వం శివార్పణం.)

    ఓం తత్ సత్.


Monday, October 29, 2018

BHRNGIKRTA SIVASTOTRAM

 భృంగి కృత శివ స్తుతి.
  ******************

1. ఆశాపాశముల కట్టబడి రోయక దుర్వ్యసనుండనైతిని
   హింసాప్రకృతితో కౄరుడను కనుగానక గురుతెరుగని
   విశ్వాసములేని దుష్కీర్తిభాజనుని జడుని,కృతఘ్నుని
   శరణము వేడుకొను భృంగిని కరుణించుము పార్వతీపతి.

2. బలహీనత్వము తోడుగ బధ్ధకత్వము గల భగ్నవ్రతుని
   పలాయన మంత్రము జపించు పాపిని పరమ డాంభికుని
   శూలితో మూర్ఖపు వాదనకు దిగిన ఆదివ్యాధి పీడితుని
   శరణము వేడుకొను భృంగిని కరుణించుము పార్వతీపతి.

3.. యోచన చేయగలేక దుష్కర్మల వీడగలేని కామాంధుని
   విచక్షణ చేయగ చేతగాని మూర్ఖుని,స్వధర్మ రహితుని

   నీచపు లక్షణముల చేతులు కలిపిన యశోవర్జితుని

   శరణము వేడుకొను భృంగిని, కరుణించుము పార్వతీపతి


4.సకలము నీవేనని తెలియనికుసంస్కారిని గురుద్వేషిని
  వికలము చేసినవి మనమును వీడక వెంటాడుతున్నవి
  తికమక వీడినది శివకటాక్షమును కోరి చేరినది
  శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి

5. కలనైననుమంచి గంధ పుష్పములతో కైంకర్యము చేయని
   కొలువైతివి నిండుగ గుండెనని నిను విచారణ చేయని
   విలువైనది విశ్వేశ్వరుని దయయని వివరమునెరిగి
  శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి


6.భార్యా పుత్ర గృహాది లగ్న మనసుగల సత్సంగద్వేషిని
   కార్యాసక్తత మరచిన కృత్యాకృత్య విచారణ వర్జితుని
   ఆర్యావర్తనుల గమనము తెలిపినది మిథ్యాజ్ఞానినని
   శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి

7.పిలిచిన పలుకవను మూగను చెవిటిని అస్పృశ్యుడిని
   చిలిపిగ విషయభోగముల చింతలో చిక్కిన పాపిష్ఠిని
   తెలిపిన సత్యమును రంధ్రాన్వేషణము చేయు నాస్తికుని
   శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి

8.మలమూత్రంబులు గుజ్జు ఎముక రక్తమాంసము దేహము
  నాలుగు దశలుగ మారుతు వేరొక దేహము చేరు జీవము
  సులువుగ నిను చేరుటకు నా ఈ శరీరము  సాధనమని

  శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి.





     భృంగి కృత శివస్తొత్రం పఠనం  సర్వ సంపత్కరం, సాక్షాత్ శివదర్శనం లభేత్.

  భృంగిని కరుణించిన సదాశివుడు మనలను రక్షించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

   ఓం తత్ సత్.

మీకు తెలియదనికాదు.నా తృప్తికై మీతో భృంగి ఋషి చరితమును ప్రస్తావించుచున్నాను.పరమశివభక్తుడైన భృంగి శివుని మాత్రమే పూజించెడివాడు.అమ్మను,అర్థనారీశ్వరమును గౌరవించెడికాడు.ఇది గమనించిన తల్లి సుతుని సంస్కరించుటకై,ఒకరోజు ప్రదక్షిన సమయమున అర్థనారీశ్వరమై భృంగి ప్రదక్షిణ సేవకై చూచుచున్నది.అమ్మకు కూడ ప్రదక్షిణ చేయుట ,ఏ మాత్రము నచ్చని భృంగి,తుమ్మెదగామారి,వారిరువురి మధ్య చిన్న రంధ్రమునేర్పరచి,శివునికి మాత్రమే ప్రదక్షిణముచేసి,ఆనందపడుచుండెను.పూర్వజన్మలో అంధకాసురుడు కదా.చీకటి పూర్తిగా వీడలేదని,ఆదిదంపతులు అవ్యాజ కరుణతో వానిని సంస్కరింపదలిచారు.అమ్మ ఆగ్రహం నటించి, శక్తి తత్త్వమును,అర్థనారీశ్వర ఆశీర్వచనమును అందించుటకై భృంగిని అశక్తునిగా  శపించి,నిర్వీర్యుని చేసెనట.కనువిప్పు కలిగిన భృంగి పశ్చాత్తాపముతో చేసిన స్తోత్రమిది.దయాంతరంగులైన వారు,భృంగికి అతిశక్తివంతమైన కాలు అనుగ్రహించినారు.నాటి నుండి భృంగి మూడు కాళ్ళతో ముక్కంటిని కొలిచి చరితార్థుడైనాడు.

సర్వం శివమయం జగత్.

Sunday, October 28, 2018

SAKALA DEVATA SIVASTUTI.

  సకలదేవతా శివస్తుతి
  ****************

1. దేవదేవ త్రినేత్రాయ  అందుకో వందనములు
   జటామకుట కపర్ది అందుకో వందనములు.

2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు
  రక్త పింగళ నేత్రాయ  అందుకో వందనములు.

3.భైరవ ఊర్థ్వకేశాయ  అందుకో  వందనములు
  అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో  వందనములు.

4.బ్రహ్మ కపాల మాలాయ  అందుకో  వందనములు
  బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు.

5.కరిగర్భ నివాసాయ  అందుకో  వందనములు
  కరి మస్తక పూజ్యాయ అందుకో  వందనములు.

6.ప్రచండదందహస్తాయ అందుకో  వందనములు
  ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ  అందుకో వందనములు.

7.నీలకంఠ త్రిసూలాయ  అందుకో వందనములు
  లీలా మానుష దేహాయ అందుకో వందనములు

8.అష్టమూర్తి  యజ్ఞమూర్తి  అందుకో వందనములు
  దక్షయజ్ఞ వినాశాయ అందుకో  వందనములు.

9.వేద వేదాంగ వక్త్రాయ  అందుకో వందనములు
  వేద వేదాంత వేద్యాయ  అందుకో వందనములు

10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో  వందనములు
   సకల దేవతాస్తుతాయ  అందుకో  వందనములు.


     ఇది మహా పురాణాంతర్గత సకల దేవతా స్తుతి సకలాభీష్ట ప్రదం. సర్వమంగళ కరం. సదా శివ కృపాకటాక్ష కరం.


  ( ఏక బిల్వం  శివార్పణం.)

     ఓం తత్ సత్.

PASUPATI ASHTAKAMU

 పశుపతి అష్టకము
 **************

 స్తుతించు పశుపతి శశిపతి సతిపతిని
 స్మరించు నాగపతి లోకపతి జగపతిని
 జనార్తిహరుని చరణములు శరణమని
 భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.


 నిత్యముకారు  రారు తలితండ్రులు బాంధవులు
 సత్యముకావు చూడు తరలు సిరిసంపదలు
 మృత్యు కబళించువీని కాలవసములని
 భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.


 చిన్న మురజను పెద్ద డిండిమను శివుడు
 మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు
 ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుదని
 భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని,

 శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు
 కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు
 శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని
 భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.

 చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు
 మణికుండలముల భుజగ హారముల రేడు
 నగజనాథుని దయ నరశిరో రచితుని
 భజింపుము భక్తితో మనుజగిరిజపతిని.

 యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను
 యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు
 దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని
 భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.

 జాలిలేని జరామరణములకు జడియక
 సారహీనపు సంసార భయమును తోసివేయుచు
 సాగుచునున్న చరాచర హృదయ సంస్థితుని
 భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.


 హరి విరించి సురాధిపులు కొలువుతీరగ
 యమ కుబేర దిక్పతులు నమస్కరించుచుండ
 భవరోగ భంజనుని భువనత్రయాధీశుని
 భజింపుము భక్తితో మనుజ గిరిజ పతిని.


 కవి సూరి ఒక మహారాజు శివ భక్తుడు అన్నవివరములే లభ్యమైనవి.
  పరమపవిత్రమైన ఈ స్తోత్ర పఠనము శ్రవనము స్మరనము సకలముక్తిప్రదము.

  సర్వేజనా సుఖినో భవంతు.సమస్త సమ్మంగళాని భవతు.
  సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తి తథ్యం.

  ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.


  

Saturday, October 20, 2018

DURVAASA MUNIKRTA RUDRAKAVACHAM.

 దుర్వాసమునికృత  రుద్రకవచం.

 స్వయంభువ సదాశివ పరమేశ ప్రణామములు
 సకలభువన సత్ప్రకాశం నీదుతేజం ప్రణామములు

 శరీర-ప్రాణములను రుద్రుడు రక్షించుగాక,
 భద్రుడై ,జగములను రాత్రిపగలు రక్షించుగాక

 ఊర్థ్వభాగం రుద్రుడుగ ,పార్శ్వ భాగములు తానై
 కరుణ ఈశ్వరుడు, శిరమును రక్షించుగాక

 నీలలోహితుడు నుదురును, ముఖము శివుడు,
 కర్ణములను శంభుడు ,కరుణ రక్షించు గాక

 నాసికను శివ ,పెదవులను పార్వతీపతి,
 వరదుడు వాగీశుడు నా జిహ్వ రక్షించు గాక.

 గరళకంఠుడు కంఠము, బాహువులను భవుడు,
 స్తనములు కరుణను శర్వుడు రక్షించుగాక

వక్షస్థలం-నడుము-నాభి శర్వుడు రక్షించుగాక
 బాహుమధ్యలను సూక్ష్మరూపుడై రక్షించుగాక

 పాశాంకుశధరుడు-వజ్రశక్తి సమన్వితుడు
 స్వరము-సర్వము  సర్వేశ్వరుడు రక్షించుగాక.

ప్రయాణ సమయమున నదితానై, చెట్టుతానై
 విరూపాక్షుడు అన్నితానై ,రక్షించునుగాక

 ఎండవేడి కాల్చుతుంటే, చలిముల్లు గుచ్చుతుంటే
 ఏకాకిని నన్ను, వృషధ్వజుడు రక్షించుగాక.

 పరమ పవిత్రం రుద్రకవచం పాపనాశనం
 మహాదేవ ప్రసాదమిది దుర్వాస మునికృతం

 పఠనం స్మరణం స్తోత్రం నిత్యం భక్తి సమన్వితం
 పరమారోగ్యము తథ్యం పుణ్యమాయుష్య వర్ధనం.

 విద్యార్థికి ప్రాప్తం విద్య ధనార్థికి ధనం ప్రాప్తం
 కన్యార్థికి ప్రాప్తం కన్య శివానుగ్రహం శాశ్వతం

 పుత్రకామి పుత్రప్రాప్తం మోక్షకామి మోక్షప్రాప్తం
 పాహిపాహి మహాదేవ రక్ష రక్ష మహేశ్వర

పాశం ఖట్వాంగం దివ్యాస్త్రం త్రిశూలం సమలంకృత
 భాసితం దేవదేవేశ నమస్కారం సమర్పితం.

 ఇంట-బయట  రాజసభలో శత్రువులతో నేనున్న
 రాకపోక సాగువేళ రక్షణగ నిలువుము

 తనువు నీవు మనసునీవు నన్ను నిండినావు
 బుధ్ధినీవు పనినీవు చెంతనున్న అండనీవు

 జ్వరభయంబు తొలగిపోయి సద్గతియే సత్యం
 గ్రహభయంబు తొలగిపోయి సన్నిధియే నిత్యం.

 ఇది శ్రీ స్కాంధపురాణము నందలి దుర్వాసమునికృత రుద్రకవచము సంపూర్ణం.

  ( ఏక బిల్వం శివార్పణం.)

   ఓం తత్ సత్.

Wednesday, October 17, 2018

POOJACHAEYUDAMU RAARE

పూజ చేయుదము రారె
నిత్య కళ్యాణిని నిలిపి నీవె మాకు శరణు అనుచు
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
......
పూర్ణ కుంభమును నిలిపి పరిపూర్ణ భక్తిని అందు కలిపి
షడ్వికారములు వదిలి షోడశోప చారములతో
....
ఆవాహనమును చేసి ముదావహమును అందు కలిపి
మూర్ఖత్వము వదిలివేసి అర్ఘ్య పాద్యములతో
......
పంచామృతములు కలిపి మంచిని మరికొంత కలిపి
సంకుచిత తత్వమును వదిలి సుగంధ అభిషేకములతో
......
పట్టు వస్త్రమును తెచ్చి పట్టుదలను పైన పేర్చి
బెట్టులన్ని కట్టిపెట్టి పట్టు చీర చుట్టబెట్టి
....
తిమిరంబులు తిప్పికొట్టి త్రికరణ శుద్ధిని పెట్టి
అంతర్జ్యోతిని చూపి పరంజ్యోతిని ప్రార్థించగ
....
ఏలా లవంగ పూలతో జాజి చంపకములతో
మాలతి మందారులతో మాహేశ్వరిని మరి మరి
....
మల్లెలు మొల్లలు మంచి పొన్నలు పొగడలు తెచ్చి
రంగుల రోజా పూలతో రాజేశ్వరిని రమణీయముగ
....
మరువము దవనము తెచ్చి మరువక మదిని తలచి
పచ్చని చామంతులతో పరాశక్తి పాద పద్మములను
........
హ్రీంకారికి ఓంకారికి శ్రీంకారికి శంకరికిని
శ్రీ మత్ పంచదశాక్షరి శ్రీ లలితా త్రిపుర సుందరికి
....
అథమత్వమును వదిలి అథాంగ పూజలు చేసి
కథలు గాథలు వింటూ మధురస నైవేద్యాలతో
......
ఆకులు పోకలు తెచ్చి ఆటు పోటు మరిచి
గొప్పలు చెప్పుట మాని కర్పుర తాంబులము ఈయగ
......
అహరహములు నీకు దాసోహము మేము అనుచు
అహమును మరిచి చేసే బహుముఖ వాహన సేవకు
........
బంగరు తల్లిని కొలిచి అంగనలు అందరు కలిసి
సంగములన్నీ విడిచి మంగళ హారతులీయగ
........
నవ ధాన్యము తెచ్చి నవ విధ భక్తిని చేర్చి
నవరాత్రోత్సవములలో " శ్రీ మన్నగర నాయకి" కి
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
(శరన్నవరాత్రి సందర్భముగ నిష్కళంక భక్తి పుష్పము.)

 అయ్యలార ! నమస్కారములు.

     ఈ పదిరోజులు అమ్మ తత్త్వమును వారివారి గుంపులలో పెద్దమనసుతో ప్రచురించుటకు అనుమతించుట వారి సంస్కార దర్పణము.వారందరికి పేరు పేరున ధన్యవాదములు.


  ప్రియ మితృలారా! శుభకామనలు.

     కొండంత రాగమును తీసి..... ఏదో పాట పాడినట్లు ఎంతో మహిమాన్వితమైన మణిద్వీప వర్ణనమును, సూచనాప్రాయముగనైనను వివరించలేక పోవుటకు కారణము కేవలము నా అజ్ఞానము-అసమర్థతయే .దర్శించిన ప్రాకారములు కొండంత.మీకందించినది కనీసము గోరంత కూడాకాదు.అనిర్వనీయ ఆనందానుభూతిలో మునిగిన నా మనసు సర్వమును మరచి ,తిరిగి యథాస్థితికి వచ్చులోపల ఎన్నెన్నో వింతలు జరిగినప్పటికిని నా మస్తిష్కములో భద్రపరచుకొని వాటిని మీకందించ లేకపోయితిని.నన్ను మన్నిస్తారు కదూ.




  చాలా వరకు దాటవేసినదని సూటిగా మాట్లాడుతూ పెదవిని చప్పరించినను,తానేదో అమ్మ చేతిని పట్టుకొనినట్లు తెగ సంబరపడిపోతున్నదని ఎగతాళి చేసినను,ఆమోదయోగ్యమే కాదని వాదించినను,పోనీలే ఏదో చిన్న ప్రయత్నమని పెద్ద మనసుతో ప్రోత్సహించినను ఈ ప్రస్థాన ఫలితము పరమ పుణ్యము.అమ్మ అమృతధారా జలపాతములలో మనలను ముంచివేయుట ముమ్మాటికిని సత్యము. ఇది" అమ్మ మాట."

  మరొక మంచి ప్రయత్నముతో నన్ను మీముందుంచమని ప్రార్థిస్తూ,




  సర్వం శ్రీమాతా చరణారవిందములకు సవినయముగా సమర్పిస్తూ,

     మీ సోదరి నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

   శ్రీ మాత్రే నమః.   ఓం తత్ సత్.


Sunday, October 14, 2018

HAPPY DEEPAAVALI-2018

 అల్లుడొస్తున్నాడోచ్
   ******************

  మీరెవరైనా చూశారా?
   మందుగుండు సామానులు మాయమై పోయాయి


  మతాబులు చిచ్చు బుడ్లు కాకరపువ్వొత్తులు
  భూచక్రములు బాంబులు విష్ణుచక్రములు
  రాకెట్లు లడీలు తాటాకు టపాకాయలు

    మీరెవరైన చూశారా?

 అల్లుడుగారు వస్తే సున్నపుగోడలను చూస్తారో
 క్రీగంట కిటికీలను-ఓరగ తలుపులను చూస్తారో
 గచ్చు అరుగు చూస్తారో-పెరటినుయ్యి చూస్తారో
 గడప సొగసు చూస్తారో గందరగోళమంటే
 మమతల మతలబుగ మారినవి .మతాబులు

 అల్లుడుగారు వస్తే ఏమివండి పెట్టాలో
 మరీమరీ తినమంటూ మర్యాదలు చేయాలో
 వద్దన్నాగానీ వినక వడ్డిస్తూ ఉండాలో
 అసలేమీ తోచటములేదన్న అనసూయమ్మకు
 ఆసరా అయినాయి ఆ రెండు చక్రాలు.

 అల్లుడుగారు వస్తే ఏమికోరుకొన మనాలో
 పదే పదే ప్రస్తావిస్తూ బలవంతపెట్టాలో
 బెట్టుచేస్తున్నా గాని కట్టపెడుతుండాలో
 అమ్మో! భయమేస్తోందన్న ఆ పరంధామయ్యకు
 అనుభవం అయినాయి ఆ ఆటంబాంబులు.


 అల్లుడుగారు వస్తే వారితో ఏమి ఆటలు ఆడాలో
 పొలంగట్టు షికారంటూ సరదాలే చేయాలో
 ఈతకొట్టు చేపలు పట్టు బావా అంటుండాలో
 భారీ నజరానాగ చెచికి తాటాకులు చుట్టాలో
 అనగానే తరలినాయి ఆ తాటాకు టపాకాయలు.

అల్లుడుగారు వస్తే  గిల్లికజ్జాలే పెట్టాలో
అల్లపు పస ఉన్న అట్టు టపాకాయ సిగరెట్టు
బుల్లి బుల్లి తడబడే అల్లరులే చేయాలో
సందు దొరికితే చాలు దొరకపుచ్చుకోవాలో
రచ్చ రచ్చ ముచ్చటల చిచ్చుబుడ్డి మరదలు

అల్లుడుగారు వస్తే ఎగాదిగా చూడాలో
తేడాలు గమనించి చాడీలుగ చెప్పాలో
పక్కన అక్కను చూస్తూ ఫరవాలేదా? అనాలో
సైన్యము వైనము తెలుపుతూ తడాఖ చూపించాలో
అన్నదే తడవుగా నేనుకూడా అంది పెద్ద లడీ

  ఇంకెక్కడి బాణసంచా ?

పంచుకున్నాయి పండుగ బాధ్యతను,  మేమున్నామంటూ

అన్నిటికి సిద్ధమయి అల్లుడుగారు వచ్చారు
అందరితో ఆడుతున్నారు ఆనందింపచేస్తుండగా
అదుకునేవాడు వీడు మన అమ్మాయికి తగినోడని

  అన్న మాటలు విని అమ్మాయి నవ్వింది
  నవ్వులపువ్వులు గువ్వలై ఎగిరాయి
  కన్నుల్లో సంతృప్తి కాకరవత్తైనది
  ముచ్చటైన ఆ ఇంట్లో చిచ్చుబుడ్డి వెలిగింది
   ఆనందభాష్పాలై చక్రాలు తిరిగాయి
  సందేహం లేదు అది అమాసకాదు- పున్నమి.

   శుభాకాంక్షలు.








Friday, October 12, 2018

MAHAKALASHTAKAMU


  మహాకాలాష్టకమ
మహాకాలాష్టకము
*************
1. సర్వరూప నమోనమః సర్వేశ్వర నమోస్తుతే
బ్రహ్మరూప నమోనమః విష్ణురూప నమోస్తుతే
రుద్రరూప నమోనమః అవ్యయాయ నమోస్తుతే
మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే.
2. సోమరూప నమోనమః సూర్యరూప నమోస్తుతే
నీలకంఠ నమోనమః పరమేశ నమోస్తుతే
యజమాని నమోనమః యజ్ఞరూపి నమోస్తుతే
మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే
3.స్థితిపతి నమోనమః లయకర్త నమోస్తుతే
ఫణిపతి నమోనమః పశుపతి నమోస్తుతే
ప్రమథుడ నమోనమః ప్రథముడ నమోస్తుతే
మహా దేవ నమోనమః మహాకాల నమోస్తుతే
4.సద్యోజాత నమోనమః సంరక్షక నమోస్తుతే
తత్పురుష నమోనమః దిగంబర నమోస్తుతే
ఈప్సితార్థ నమోనమః ఈశానాయ నమోస్తుతే
మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే
5. అఘోరుడ నమోనమః ఘోరరూప నమోస్తుతే
ఉగ్ర నామ నమోనమః ఉమాపతి నమోస్తుతే
కాలరూప నమోనమః కాలకాల నమోస్తుతే
మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే.
6.పంచముఖ నమోనమః పంచభూత నమోస్తుతే
విశ్వాత్మక నమోనమః విశ్వేశ్వర నమోస్తుతే
మహాకాయ నమోనమః మహేశాయ నమోస్తుతే
మహాదేవ నమస్కారం మహాకాల నమోస్తుతే.
7.భీభత్సమ నమోనమః వాత్సల్యమ నమోస్తుతే
దుష్టవైరి నమోనమః శిష్టపాల నమోస్తుతే
లింగరూప నమోనమః జంగమయ్య నమోస్తుతే
మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే.
8. జగత్బీజం నమోనమః జగద్రూపం నమోస్తుతే
జగత్సాక్షి నమోనమః జగద్రక్ష నమోస్తుతే
జగత్పిత నమోనమః జగన్మాత నమోస్తుతే
మహా దేవ నమోనమః మహాకాల నమోస్తుతే.
మహాకాలాష్టకం పఠనం సర్వపాప వినాశనం
సర్వరోగ హరణం సర్వాపద్నివారణం
సర్వసంపత్కరం సాక్షాత్ శివ సన్నిధిం లభేత్.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.


Wednesday, October 10, 2018

UPAMANYUKRTA SIVASTOTRAM

 ఉపమన్యుకృత శివస్తుతి
  *********************

1జయశంకర పార్వతీపతి శివశంభో భక్తవత్సల
 మదనాంతక కపర్ది శరనం తవ చరన పంకజం.

2.త్రికరణం,ఉ నినుధ్యానించు పండితుల దుఃఖ ఖండిత
  చంద్రశేఖర సంతత శరణం తవ చరణ పంకజం.

3.ఎటుచూసిన అంధకారము హృదయము నివసింపుము
దినకరుని తేజము శరణము తవ చరణ పంకజం

4..కనగలద చర్మచక్షువు తనంతట  కరుణాలయ
 శివదర్శనం సుకృతం శరణం తవ చరణ పంకజం

5పంచామృతము పాలు చక్కెర దోరపండ్లు సరిపోలవు
శివనామము మధురం శరణం తవ చరణ పంకజం

6విషభక్షక నందివాహన సమదృష్టి సర్వరక్షక
 విషమేక్షణ విరాగి శరనం తవ చరణపంకజం.

7.అనురాగము దృఢవైరాగ్యం విచిత్రము మహదైశ్వర్యము భిక్షుకత్వము
  వివరింపని విచిత్రం శరణం తవ చరణ పంకజం


.8. కాదనలేని కల్పవృక్షమై కామితము నెరవేర్చును
   కరుణాలయ హృదయం శరణం తవ చరణ పంకజం

9.వినతిగొను విశ్వపాలక సర్పముల సమలంకృత
కనికరమే అభయం శరణం తవ చరణ పంకజం

10.ప్రతిక్షణము పన్నగములు పశుపతి పరిరక్షితం
   పరమేశ్వర ప్రస్తుతి శరణం తవ చరణ పంకజం.

11. ఒక్క క్షణము నిన్నుచూడక ఉపమన్యు మనగలడ?
    నిక్కముగను నీ దయ శరణం తవ చరణ పంకజం.

 అపమృత్యుహరం సర్వవ్యాధి నివారణం
  సర్వకాలసర్వావస్థల శివసన్నిధి

  సంప్రాప్తం ఉపమన్యు శివస్తోత్రఫలితం ఇది శివ వాక్యం.

   ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.



.





Sunday, October 7, 2018

SREE MANNAGARA NAATIKA-10

అమ్మ చేయి పట్టుకొని ఆడుతూ-పాడుతూ సాగిపోతున్నాను.ఇంతలో అమ్మ ముఖములో ఆనందచ్చాయలు వీడి,ఆందోళన పొడచూపసాగింది.నాకే బాధనపించింపించి అమ్మనలా చూస్తుంటే.అమాయకముగా ఏంజరిగిందని అడిగాను? ఒక సారి క్రిందకు చూడమంది.చూశాను మెల్లగా.అంతే బాబోయ్
.
ఎందరో గంధర్వులు-కింపురుషులు-యక్షులు-కిన్నెరులు-ఋషులు-మానవులు అమ్మ పాదాలను అందుకోవాలని ఆర్తితో ప్రయత్నిస్తున్నారు.కాని పాపం ఏదో మాయా వలయం వారిని అడ్డుకుంటున్నది.అవ్యాజ కరుణాంతరంగ అయిన అమ్మ అక్కడే నన్ను నిలబడమని వారికి తన చేతులను అందిస్తూ,పైకి చేరుస్తున్నది.అమ్మ నా ఒక్కనిదే అనుకున్న నా స్వార్థానికి ఉక్రోషం వచ్చింది.వీళ్లందరు మనతో చింతా మణి గృహమునకు వస్తారా అని అడిగాను.నన్ను చూసి అమ్మ మందహాసం చేసింది.అందులో ఏమి మహత్తు ఉందోగాని నా బుద్ధి తిరిగి ప్రచోదనము కాసాగింది.అదే నీ వొళ్ళో నేను కూర్చుందామనుకున్నాను.నువ్వు సరేనన్నావు.మరి వీళ్ళందరిని? అయోమయముగా చూసాను.అక్కున చేర్చుకొని,నన్ను ముద్దాడి,మరి నేను మీ అందరికి అమ్మను కదా! నీలాగేనే వారికి నా ఒడిలో కూర్చోవడము ఇష్టము.మీ అందరిని నా ఒడిలో లాలించము నా సహజగుణము అన్నది ఆ స్వరములో ఏ మంత్రమున్నదో గాని,మారు మాటాడకుండా అమ్మ వెంట నడుస్తుంటే రానే వచ్చేసింది, అనిర్వచనీయ అద్భుత చింతామణిగృహము. అపురూప ఆనందోఆస ఆరామము.అవ్యక్త సుందర మనోహరము.ఆర్త్రత్రాణ పరాయణి ఆసీనురాలగు శివాకార.....  అమ్మో అమ్మో ఆనందాతిరేకముతో ఆడుచున్న నా మనసు మూగబోయినదా లేక వర్ణించగల వాక్యములు దొరకక దిగాలుపడి అమ్మ పాదములకు నమస్కరించుచున్నదో తెలియని ఉద్వేగముతో ఊగిసలాడుచున్నది.తల్లీ నీపాద ధూళి నన్ను పరమపవిత్రము చేయుచున్న వేళ పలుకులను అనుగ్రహించవమ్మా అని ప్రార్థిస్తున్నది.అంతే అమ్మ మందహాసము మరంద ధారలై,

     అమ్మా-ఆనందమయీ-అనురాగమయీ-అమృతమయీ,
  ***************************************
పరమపావనమైన నీపాదరజకణము
పతితపాలకమైన పరమాత్మ స్వరూపము

ఏకాంత-శృంగార-జ్ఞాన-ముక్తి మంటపములు
సహస్ర మండపముల సూర్య-చంద్ర  ప్రకాశితము

శక్తితత్త్వములు అమరినవి పది సోపానములుగా
శివతత్త్వము మారినది శుభాకార మంచముగా

సకలలోక సౌభాగ్య సంకల్పితము అపురూపము
కుడి-ఎడమగా విడివడినది ప్రూషికా రూపము  (    అద్వైతము

సంతత చిత్ప్రకాశక చింతామణి గృహములో
అమ్మ ఒడిలో నేను ఆసీనురాలినైన వేళ

జన్మధన్యమైన నన్ను వెడలిపొమ్మనకమ్మా,
అందరికి అమ్మవైన అద్భుత సౌందర్య లహరి.

మణిద్వీపమునకు బ్రహ్మరంధ్రము వంటి చింతామణి గృహములో తల్లిచిత్ప్రకాశముతో దర్శనభాగ్యమును ప్రసాదిస్తుంటుంది.చింతతో ప్రమేయము లేకుండగానే చింతితార్థ ప్రదాయిని చెంతనేఉండి రక్షిస్తుంటుంది.అందుకేనేమో తల్లిని "సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా"   ( సంసారమనే పంకము లో (బురదలో) చిక్కుకుని యున్న మనలను ఉధ్ధరించే సద్గతిని చూపే) తల్లీ అని
   సన్నుతిస్తారు.సహస్రాక్షి-సహస్రపాత్ సహస్ర స్తంభ నిర్మితమైన చతుర్విధఫలపురుషార్థములైన ఏకాంత-శృంగార-జ్ఞాన-వైరాగ్య మండపములలో విరాజితమై విలక్షణముగా మనలను పాలిస్తుంటుంది.ఆహా! ఏమి నా సౌభాగ్యము. సృషి స్థితి కారిణి మనకొరకు కుడి-ఎడమలుగా పురుష-స్త్రీ రూపములుగా విడివడి ప్రూషికగా మారినది.తల్లి నిర్హేతుక కరుణాకటాక్షము నన్ను అమ్మ ఒడిలో ఆసీనురాలిని చేసినది.ధన్యోస్మి తల్లీ ధన్యోస్మి.నాతోబాటు మీ అందరిని మక్కువతో తన అక్కునచేర్చుకుంటానని తల్లి నాతో అంటున్న సంతోష సమయమున నన్ను నీ ఒడినుండి నుండి విడదీయకమ్మా,

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురాలులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ, దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

     అవ్యాజకరుణామూర్తియైన అమ్మ మనమీది అనురాగముతో ఈ ఆపదను అంతమొందించి,ఆనందమయముగా అవనీతలమును ఆశీర్వదించును గాక.

  అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే
  అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే
  అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే.

  ప్రియ మిత్రులారా మీరు అందించిన ప్రొత్సాహమునకు సవినయ ధన్యవాదములు.సోదరి.నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

   సర్వేజనా సుఖినో భవంతు.

       స్వస్తి. శుభం భూయాత్.


  





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...