Monday, December 17, 2018

SIVA TAANDAVA STUTI.

     సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకు క్షమాపణ అభ్యర్థనలతో,

       శివ తాండవ స్తుతి.
       ********************

 "ఏ వేదంబు పఠించె లూత అన్నట్లు ఏ సాహితీ విషయ పరిజ్ఞానము లేని నా దుస్సాహసమును మన్నించమని కోరుతూ,"

 1.వడిన్ వడిన్ జటాటవిన్ జారి,గంగ సంప్రోక్షణంబైన స్థలిన్
   ధగత్ ధగత్ గళంబునన్ సర్పదండ వీక్షణంబు వేడుకన్
   డమర్ డమర్ కరంబునన్ రవంబుతో డమరుకంబు తోడుగన్
   ధిమిత్ ధిమిత్ నర్తనంబు పరిభ్రమించు వరంబులన్ లీలనన్

2. సుడుల్ సుడుల్ తిరుగుచున్నదదిగో సుర్గంగ జటాజూటములో
 చమక్ చమక్ వెలుగుచున్నదదిగో వెండిపూవు శిరములో
 చకిత్ చకిత్ దండనగ కందర్పుని కాల్చిన త్రినేత్రముతో
 ధిమిత్ ధిమిత్ తాండవంబు సదా శివమును వర్షించుగాక.

3. ప్రభల్ ప్రభల్ చతుర్దిశల్ ప్రభల్ జిమ్ము భవాని శిరోమణితో
 జ్వలిత్ జ్వలిత్ విలాసనేత్ర ప్రమోద ప్రదోష తాండవములో
 తరిమి తరిమిపారద్రోలు పాపతతుల పదఘట్టనములో
 తకిట తకిట తథాస్తుగ నామది నిండి తాండవించుగాక.

4.చమక్ చమక్ చంచరీక భూషణములు పాములైన జటలతో
  కరుణ కరుణ చకోరముల కనికరించు చంద్రరేఖ పూవుతో
  శరణు శరణు సురాధిపగణంబుల సుగంధ పుప్పొడులతో
  ఝణత్ ఝణత్ ప్రణవరవము పదకింకరులను బ్రోచుగాక.

5. జ్వలిత్ జ్వలిత్ సెగల పంచశరుని భుజించిన నిప్పుకన్నుతో
   శరత్ శరత్ వెన్నెలను పంచుశశిని ధరించిన గొప్పకొప్పుతో
   కుచిత్ కుచిత్ వీక్షణుని శిరముతుంచి,క్షమించిన కపాలముతో
   చకిత్ చకిత్ చండతాండవము సదా శివమును వర్షించు గాక.

6.కెంపు కెంపు సొంపులీనుచున్న అరుణారుణ ఫాలభాగముతో
  పెంపు పెంపు ఒంపులున్న అమ్మదనపు మకరిక  లేఖకునిలో
  గుంపు గుంపు గ్రోలుచున్న మరంద మధుర తాండవములో
  సొంపు సొంపు సొబగులున్నచిత్తులో నా మది రమించుగాక.

7. అహో అహో నల్లమబ్బు విశృంఖల విజృంభణల నిగనిగలతో
   కుహూ కుహూ అమావాస్య విస్తరణల చుట్టుకున్న శ్రీ కంఠములో
   దేహి దేహి దేవదేవ విమోహనముగ కట్టుకున్న కరిచర్మములో
   పాహి పాహి చంద్రమౌళి కింకిణులు శ్రియమును వర్షించుగాక.
8.చలువ చలువ రేటి చెలియ నల్లకలువ కంఠముతో
  ఖలుల ఖలుల కిల్బిషముల ఖండనముల కఠినముతో
  బలులు-బలులు జనన-మరణ కారకుల కన్నువిప్పు కపర్దిలో
  కొలువ కొలువ తాండవముల నా మది కొలువుతీరునుగాక.

9.ఝరి ఝరి విభావరి కళామాధురీ మనోజ్ఞ సర్వమంగళతో
  మరి మరి మధువుగ్రోల మరింత చెలగు గండు తుమ్మెదలో
  అరి అరి మదనదక్ష కరి త్రిపుర అంధక యమ భంజనలో
  పరి పరి ప్రస్తుతులతో మహేశ మనోవినోదమొందుగాక.

 10. బుసలు బుసలు కొట్టుచున్న భుజము మీది భుజంగములతో
    నొసలు నొసలు నడుమ మెరయు నుదిటి అగ్నిహోత్రముతో
    ధిమిత్ ధిమిత్ ధిమిత్ మ్రోగు మద్దెల తాళగతుల నర్తనముతో
    కొసరి కొసరి సదాశివుని దయ కనురెప్పగ క్షణక్షణము గాచుగాక.

11.  కటికనేల శయనము-కలిమి తల్ప దర్పమును విడిచి
  గులకరాయి హేళన-మణుల మెచ్చు భావనను మరచి
  మేలి ముత్య సరములను-కాల సర్ప హారములనొకటిగ
  ఉచ్చ-నీచ రహిత స్థితితో నిన్ను అర్చించుట ఎన్నడో?

12.  నిదుర నిదుర లేపి కుండలినిని,పైకి పైకి నేప్రాకుతు
 ఆజ్ఞఆజ్ఞ యైనదనుచు ఆజ్ఞాచక్రమునందు ఆదియోగివనుచు
 శివము శివము నీవు-నేను మాయతొలగి యోగక్రియను నిరంతరం
 తలచి తలచి నిన్ను నేను తరించుట ఎన్నడో కదా శివ.

   ఫలశృతి.

  నిత్యము ఈ దశకంఠ స్తోత్రమును చదివినను,వినినను,అర్థమును వివరించినను సదాశివుని కృపాకటాక్షముతో మానవుడు శుద్ధుడగును శరీరధారుల అజ్ఞానము కేవలము శివుని కృపచే తొలగింపబడును.

  పూజాదికములను ముగించిన సమయమున పఠించు శివతాండవ స్తోత్రము,సాధనోపకరణమైన శరీరమనే రథమును,బుద్ధి అనే అశ్వమును,కార్యములను చేయు సామర్థ్యమనే గజమును అందించి,పరమేశ్వర సన్నిధి అనే ఇంద్రపదవిని ప్రసాదించును.ఇది నిత్యసత్యము.శివ శిలా శాసనము.


  ( ఏక బిల్వం శివార్పణం.)





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...