విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ,
శివతాండవ స్తుతి భావము.
******************************
1.జటాటవిగలజ్జల ప్రవాహ పావిత స్థలే.
ఇది శివతాందవము జరుగు ప్రదేశమును తెలుపు వాక్యము.ఆ స్థలము పవిత్రమైనది.ఎలా పవిత్రమైనదంటే,
జటాటవి- అడవి వలె జటలున్న ప్రదేశమునుండి,
గలజ్జల- పవిత్రమైన జలము,
ప్రవహించి_ ప్రవాహ
పావిత-పవిత్రమొనరించిన,స్థలే-స్థలము.
శివతాండవ వేదికను పునీతముచేయుటకై,అదవివలె జడలుగట్టిన శివశిరమునుండి జారి ప్రవహించి,గంగమ్మ నాట్యవేదికను పవిత్రమొనరించి,తరించినది.
2.గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.
స్థలమును గంగ పవిత్రమొనరించినది.వెంటనే,
గలేవ-స్వామి మెడ
లంబ్య-చుట్టు
లంబితాం-చుట్టుకొనిన
భుజంగ-పాము
తుంగ మాలికా -పవిత్ర కంఠ హారముగా, మారినది.
స్వామి భక్తి గళమును చుట్టుకొనిన పామును సత్కార హారముగా మారునట్లు చేసినది.
3.డమడ్దమ నినాదవడ్దమర్వయం,
గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమడమ నినాదముతో స్వామి చేతిని అలంకరించి,అర్వయం -ప్రకాశించుచున్నది.
4.గంగచే,వాసుకిచే,డమరుకముచే సేవించబడుచున్న శివుడు తన,
చకరా-శుభప్రదమైన,చండ-ప్రకాశవంతమైన తాండవముతో,శివమును-శుభములను వర్షించును గాక.
స్వామి నృత్యము ఆర్భటి రీతిలో నుండు తాండవము.అమ్మ నృత్యము కౌశికి రీతిలో నుండు లాస్యము.
2.జటాకటాహ సంభ్రమభ్రమ న్నిలింప నిర్ఝరీ
కటాహము-విశాలమైన పాత్ర.జటా కటాహము-శివుని జటాజూటము విశలమైన పాత్ర వలె నున్నది. అందులోనున్న
నిలింప నిర్ఝరీ- దేవ ప్రవాహమైనగంగమ్మ.విష్ణు పాదములనుండి ఆవిర్భవించి,శివ జటాజూటము చేరిన గంగ,
సంభ్రమ-భయముతో కూడిన ఆశ్చర్యముతో తడబడునదై భ్రమ-భ్రమణము-తిరుగుచున్నది.
శివ తాండవ ప్రారంభమున విశాలమైన పాత్రవలె నున్నశివుని జటాజూటములోని గంగమ్మ,సంభ్రమముతో తడబడుతు సుడులు తిరుగుచున్నది.
విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్థని.
విలోల-సుడులు తిరుగుచున్న,వీచి-తరంగముల వల్లరీ-కాంతులు నూర్థని-శివుని నుదుటిని,విరాజమాన-ప్రకాశింపచేయుచు తరించుచున్నవి.
సుడులు తిరుగుచున్న గంగా తరంగముల నుండి వెలువడుచున్న కాంతులు,శివుని నుదుటిని ప్రతిబింబించి ప్రకాశవంతము చేయుచు, తరించుచున్నవి.
ధగధ్ధగ ధ్ధగ జ్జ్వల ల్లలాట పట్ట పావకే
పట్టపావకే-ఎర్రటి పట్టు వస్త్రమును (చుట్టుకొన్నట్లు)
ధగధగత్ జ్వలత్-ధగధగలతో ప్రకాశించుచున్నది
లలాటము-శివుని నుదురు అగ్ని నేత్ర జ్వలనముతో ఎర్రటి వస్త్రమును ధరించెనా అనునట్లు ప్రకాశించుచున్నది.
గంగమ్మ సుడులు తిరుగుతు తన తరంగ కాంతులతో శివుని నుదుటిని సేవించుచున్నది.త్రినేత్రము తన ప్రకాశముతో (అగ్ని) శివుని నుదుటను చేరి సేవించుచున్నది.
) కిశోర చంద్ర శేఖరే రతి ప్రతిక్షణం మమ
మమ-నాయొక్క రతి-కోరిక,ఆశ,క్రీడ
చంద్రశేఖరుడు-చంద్రుని శిరమునధరించిన వాడు,ఆ చంద్రుడు ఎటువంటివాడు అనగా కొశోరము-చిన్న లేత అనగా సన్నని చంద్రరేఖ.
చంద్రరేఖను సిగపూవుగా ధరించిన వాడు,అగ్ని మూడవకన్నుగా కలిగి గంగతరంగ కాంతులతో ప్రకాశించు నుదురుగల మహాదేవునితో నా మనసు ఎల్లప్పుడు క్రీడించుటను కోరుకొనుచున్నది.
3.ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర స్పురత్ దిగంతర సంతత ప్రమోద మాన మానసే
కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరావధి,క్వచిత్ దిగంబరే మనో వినోదం అద్భుతం.
శివుడు మహదానందముతో తాండవిస్తున్నాడు.ఆనందమునకు కారణము అమ్మ తన సమక్షములో సర్వ సుగుణాలంకృతయై వీక్షించుచున్నది.అటువంటి శివునిపై నా మనసు లగ్నమగుచున్నది.
సంతత ఎల్లప్పుడు,మోదము-ముదము,సంతోషము,ప్ర-గొప్పదైన,ప్ర మోదము-గొప్పదైన ఆనందము.మాన-నిండిన,మానసే-మనస్సుతో.శివుడు గొప్పదైన ఆనందముతో నిండిన మనస్సుతో తాండవమును చేయుచున్నాడు.దానికి కారణము.
ధర-భూమి,ధరాధరము-భూమి మోయుచున్న,ధరించినది పర్వతము.ధరాధరేంద్రుడు-పర్వతరాజు-హిమవంతుడు.
ధరాధరేంద్ర నందిని-పర్వతరాజ కుమార్తె-పార్వతి.
ఆమె ఎలాఉన్నదంటే, విలాస-వేడుకగా-శుభముగా,బంధు-అలంకారములతో,ఆభరణములతో,బంధుర-నిండినది.అమ్మ సౌభాగ్యకరమైన అలంకారముతో,దర్శనముతో నాట్యవేదికను సమీపించినది.ఆమ్మ నగల కాంతులు దిక్కులను మరింత ప్రకాశవంతము చేయుచున్నవి.శివుని నాట్యము,నిరుద్ధ-భరించలేని,దుర్ధరా-ఆపదలను,అవధి-నిర్మూలిస్తున్నాయి కౄపను కటాక్షించుచు అత్యంత అద్భుతముగానున్నది.ఆ మూర్తి ఇది అని చెప్పలేని వస్తువు,అనిర్వచనీయమైనది.క్వచిత్-ఆ పరమాత్మ యందు నా మనసు ఆనంద వినోదమును పొంద కోరుచున్నది.
ఆ పరమాత్మ నాట్యము లోక కళ్యాణకారకము..
4.జటా భుజంగ పింగళ స్పురత్ ఫణామణి ప్రభా,కదంబ కుంకుమద్రవ ప్రలిపత దిగ్వధూముఖే,మదాంధ సింధుర స్పురత్ త్వగుత్తరీయ మేదురే,మనో వినోదమద్భుతం భిభర్తు భూత భర్తరి.
భర్తరి-భరించేవాడు,కాపాడేవాడు, భూత-సకలజీవులను, ఆ భర్త ఎటులున్నాడంటే జటా-జడలలో భుజంగ పాములను ధరించాడు.శరీరమునిండా పాములను ధరించాడు.ఆ పాముల పడగల మీది మణులు పింగళ(ఎరుపుతోకూడిన పసుపు రంగు) కాంతులను వెదజల్లుచున్నవి.ఆ కాంతులు దిక్కులనెడి స్త్రీ చెక్కిళ్లపై కదంబకుసుమ రసమును (కుంకుమ రంగును) అలదినట్లు శోభిల్లుచున్నవి.శివుడు ఒక అందమైన ఉత్తరీయమును తన భుజముపై వేసుకొన్నాడు.ఆ ఉత్తరీయము గర్వముతో మద-గర్వముతో,గుడ్డిదై,మంచి-చెడులు మరచి స్వామిని తన ఉదరమున నివసించమని వరమును కోరిన,సింధుర-ఏనుగు యొక్క చర్మము,కరి దేహత్యాగముతో అజ్ఞానమును వీడి,త్వక్-పూజనీయ,ఉత్తరీయ-ఉత్తరీయముగా మారినది.చీకటులను తొలగించి,పాపులను పావనులుగా మలచిన స్వామి యందు నా మనసు అద్భుతముగా క్రీడించుచున్నది
.5.సహస్రలోచన ప్రభా అశేష లేఖ శేఖర,ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః,భుజంగరాజ మాలయా,నిబధ్ధ జాటజూతకః,శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః.
చంద్రుడు చకోరములకు మిత్రుడు.హంస వలె చకోర పక్షి మెడ క్రిందనున్న కన్నము ద్వారా మెడను వంచి,వెన్నెలను తాగుతుందని అంటారు.చకోరమిత్రుడైన చంద్రుని శివుడు చిరాయ-కలకాలము,శ్రియై-స్-శుభములనొసగు గాక.మరియు ఇందు స్వామి పాదపీఠము వర్ణించబడినది.అది ఎట్లా ఉన్నదంటే సుగంధము పుష్పముల పుప్పొడులతో నిండి పరిమళించుచున్నది. అక్కడికి పుప్పొడి ఎలా వచ్చిందంతే,వేయి కన్నులుగల -సహస్రలోచనుడు ఇంద్రుడు,ఇంద్రుడు ఎవరు అంటే న శేష-ఒక్కరినైన వదలక.లేఖ-దేవతల,లేఖ శేఖరుడు-దేవతలకు రాజ,సురాధిపతి,తన పరివారముతో శివపాదనమస్కారమునకు తలలు వంచిరి.వారు వివిధ పరిమళ పూలహారములను అలంకరించుకొన్నారు.దేవతల పూలమాలలు వారికన్న త్వరగా ధన్యతనొందుటకు తమ పుప్పొడులచే శివపాదములను అభిషేకించినవా అన్నట్లుగా శివపాద పీఠముచేరి జడలలో పాములను పేరిచి పెట్టుకొన్న స్వామిదయను పొందినవి.అట్టి స్వామి శ్రియై-శుభములను,చిరాయ-చిరకాలము ప్రసాదించుగాక.
6. లలాట చత్వర జ్వల ధనంజయ స్పులింగభా,నిపీత పంచసాయకం,నమన్నిలింప నాయకం
సుధా మయూఖలేఖయా విరాజమాన శేఖరం,మహా కపాలి సంపదే శిరోజటాలమస్తు నః.
ఇందులో శివుని మూడవకన్ను గురించి,బ్రహ్మపుర్రె గురించి,దేవతా స్తుతుల గురించివివరించబడినది.
లలాట-శివుని నుదురు ఎలా ఉన్నదంటే,చత్వర-యజ్ఞ వేదిక అయ్యింది.అందులో ధనంజయుడు-అగ్నిదేవుడు జ్వలిస్తున్నాడు.ఆ జ్వలనమునకు కారణము ఆయన అప్పుడే మన్మథుని-పంచశరుని నిపీత-తాగెనులేదా భుజించెను.అట్టి ధనంజయుడు భయంకరమైన స్పులింగ-జ్వాలలతో,నిలింపనాయకం-బయట అగ్నిని హరింపచేసాడు.శివుడు తనలో బ్రహ్మాండములను దాచుకొనినట్లు,శివ త్రినేత్రము తన విస్పుట జ్వాలలతో బయట అగ్నిని హరించివేసినది.శివునిచేతిలో బ్రహ్మ పుర్రె ధన్యతనొందుచున్నది.అమృత కిరణాలు-సుధా-మయూఖములు గల లేఖయా -దేవతలచే శివుడు,విరాజమాన శేఖరం-శివుడు కొలువబడుచున్నాడు.చెడుగా ఆలోచించినందులకు నరి,తిరిగి క్షమించి,తన భిక్షాపాత్రను చేసి,చేత ధరించిన శివుడు -శిరోజటాల,శిరమునజటలున్న శివుడు,సంపదే-సంపదలను అస్తునః-వర్షించును గాక.
7.కరాళ భాళ పట్టికాధగధగధఘజ్వల ధనంజయా హుతీకృత ప్రచండ పంచసాయకే
ధరా ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రికా,ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమః.
మమ-నా యొక్క మనసు,రతిర్మమ-కోరుకొనుచున్నది. నా మనసు ఏమి కోరుకొనుచున్నది? శివుని యందు క్రీడించ,శివుని ధ్యానించి,దర్శించి,తరించ కోరుకొనుచున్నది.ఇందులో శివుడు మాత్రమే చేయగలుగు రెండు పనులను స్తుతిస్తున్నాడు రావణుడు.వాటిని గురించి తెలుసుకోవాలంటే మనము మానవ నైజమును విడిచిపెట్తాలి.ఎందుకంటే అవి దైవకార్యములు.వాటిని తెలియచేసినది దేవభాష,అమ్మతనమును మాత్రమే దర్శించాలి కాని ఆడతనమును కాదు.
శివుడు తన మూడవకన్నుతో మన్మథుని దహించాడు.ఆ మన్మథుడు ఏ స్థితిలో నున్నాడంటే తన ఐదు సహాయకములతో(వసంత ఋతువు,పూల రథము,చెరకు విల్లు,పూలబాణములు,సమ్మోహనపరచు శక్తి) వీటి బలముతో ప్రచండడుడై ,శివునిపై దండెత్తాడు.అహంభావితుడైన మన్మథుని,శివుడు తన నుదుటను పట్టికగా ధరించిన ధనంజయునితో(అగ్నితో) కరాళ జ్వాలలతో,అగ్నిశిఖలతో,హుతీకృత-భస్మముగా మార్చినాడు.
శివుడు మాత్రమే ఏకైక అద్భుత శిల్పి.మకరికాపత్ర లేఖకుడు.(బాహుబలి పచ్చబొట్టు )సూర్యుడు ఆహార ప్రదాత.చంద్రుడు ఔషధ ప్రదాత.వారి పోషకత్వ సంకేతమే అమ్మ కుచములు.స్వామి తనశిల్పరచనతో సూర్య-చంద్రులను పుష్టివంతులను చేస్తున్నాడు.
అదియే ధరాధరేంద్ర నందిని -పార్వతీదేవి, స్తనములకు సొబగులు దిద్దు ముక్కంటి యందు నా మనసు లగ్నమగు గాక.
8. నవీన మేఘమండలి నిరుధ్ధ దుర్ధర స్పురత్,కుహూ నిశీధినీ తమః ప్రబధ్ధ బద్ధ కంధరః
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సింధురః కలానిధానబంధుర శ్రియం జగద్దురంధరః.
ఈ శ్లోకము స్వామిగరళకంఠమును,గజోత్తరీయమును,జగత్ రక్షణను స్తుతిస్తున్నది.
స్వామి కంఠము ఎలా ఉన్నదంటే,కుహూ అమావాస్య నాటి నల్లమబ్బులు ముద్దగా ఒకచోట చేరి స్వామి కంఠమునకు ఆభరణమైనట్లుగా.
9.ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా,వలంబ కంథ కందనీ రుచి ప్రబద్ధ కంథరం
స్మరంచ్చిదం,పురచ్చిదం,భవచ్చిదం,మఖచ్చిదం,గజచ్చిదం,అంధకచ్చిదం,తమంకచ్చిదం భజే.
శివుడు అత్యంత పరాక్రమముతో ప్రకాశితున్నాడు.దానికి కారణము.శివుడు,
స్మరచ్చిదం-మన్మథుని సంహరిచెను,పురచ్చిదం-త్రిపురాసురులను అంతమొందించెను
భవచ్చిదం-భక్తులకు సంసారమనెడు సముద్రమును దాటించెను
మఖము-యజ్ఞము-మఖచ్చిడం-దురహంకారముతో సంకల్పించిన దక్షుని యజ్ఞమును కూల్చెను,
గజచ్చదం-గజాసురుని సంహరించెను.అంధకచ్చిదం-అంధకాసురుని తునుమాడెను.
తమంతకచ్చిదం-యముని కూల్చినవాడు.
శివుని ఘోర స్వరూపము అసురత్వమును హరించి ప్రకాశించుచున్నది.విచిత్రముగా శివుని అఘోర స్వరూపము చల్లదనముతో జగములను రక్షించుచున్నది.అది
ప్రఫుల్ల పూర్తిగా వికసించిన నీల-నల్లనైన (చల్లనైన) పంకజము-కలువపూవు.చంద్రకిరణములతో అప్పుడే పూఎర్తిగ విచ్చుకొనిన నల్లకలువ ప్రపంచ కాలిమ-జగత్కళ్యాణ కాంతితో,వలంబి కంఠ-కంఠాభరణముగ ప్రబధ్ధ -చుట్టుకొనినది.దేనిని చుట్టుకొనినది.హాలహల భక్షణముచే నల్లబడిన కంఠము లోకకళ్యాణమునకై చల్లదనమును వ్యాపింపచేయు నల్లకలువ వలె స్వామి కంఠమున కాంతులీనుచున్నది.రౌద్ర శాంత రస సమ్మిళితమే శివము అని స్తుతి.దానికి కారణము వారివారి పాపపుణ్యములు.శివోహం.
10. అఖర్వ సర్వమంగళా కలాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ,విజృంభణా మధువ్రతం
స్మరాంతకం,పురాంతకం,భవాంతకం,మఖాంతకం,గజాంతకాంధకాథం,తమతకాంతకం భజే.
ఖర్వములు-దోషములు,అఖరవ -దోషములు లేనిది,సర్వమంగళ-సకల శుభములను సమకూర్చినదికనుక అమ్మవారు-అఖర్వ మరిరును సర్వమంగళ.కలా-కళల,కదంబము-సమాహారము,ఎన్నూఎరకముల కళలు.మంజరి-వాని గుత్తి.అమ్మవారి శక్తులు అనేక కళలుగల కుసుమములై,వాని మహిమ మధువు వలె పరిమళించుచున్నది.ఆ సమయమున పరమేశుడు అ మధువును గ్రోలుటకు గండుతుమ్మెదైనాడు.ఇది బాహ్యార్థము.అమ్మ శక్తులను తన చూపులతో ముళితము చేసుకుంటూ పరమేశ్వరుడుఆనంద తాండవమును సలువుచున్నాడు.ఇది అత్యంత పవిత్రమైన అర్థనారీశ్వరము.స్వామి దృష్టి పూవుల బాహ్య సౌందర్యముపై కాక పూలలో దాగిన మధువు అనే ఆత్మ సౌందర్యమును గ్రోలుచున్నది.దాని ఫలితమే వారు జీవుల జనన మరణములను కాముని-కాలుని అంతమొందించుట.స్థూల-సూక్ష్మ-కారణ శరీరములను త్రిపురములు శాశ్వతము అనుకొను భ్రాంతిని తొలగించుట.మదవిహ్వలమైన గజమును సంస్కరించుట.ఇంద్రియ కర్మలను యజ్ఞమును చక్కపరచుట.స్వామిని గుర్తించలేని అంధత్వమును అంతమొందించుట.శివోహం.
11.జయత్వదభ్ర విభ్రమ భ్రమత్ భుజంగ మస్వసద్,వినిర్గమ క్రమ స్పురత్ కరాల భాల హవ్యవాట్
ధిమిత్ ధిమిత్ ధిమిత్ ధ్వనిన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః
జయత్ వద-జయమును పలుకుచున్నాను.ఎవరికి జయము తాండవమును సలుపు స్వామికి.స్వామి తాండవము ఎటులున్నది అంతే విష్ణువు వాయించుచున్న శుభకర మంగళ ధ్వనికి అనుగుణముగా నున్నది.అ ధ్వనికి అనుగుణముగా స్వామి ధరించినభుజంగములు కదలాడుతు జయము పలుకుతున్నట్లు బుసలు కొట్టుచున్నవి.స్వమిని అనుసరించుచున్నదా అన్నట్లుగా భాల-ఫాలభాగముననున్న కన్ను.వినిర్గమ -పైకి ఉబికి.క్రమ-అందముగా-స్పురత్-ప్రకాశిస్తున్నది.కాంతులీనుచున్నది.స్వామి మద్దెల మంగళ ధ్వనులకు అనుకూలముగా పదములను కదుపుచున్నాడు.స్వామిని అనుసరిస్తూ త్రినేత్రము,పాములు ఎర్రని కాంతులను వెదజల్లుతూ తాండవించుచు,తరించుచున్నవి.ప్రచండ-ప్రకృష్టమైన తాండవమును సలుపు శివునకు జయమగు గాక
.12.దృషద్విచిత్ర తల్పయోః భుజంగ మౌక్తిక స్రజోః
గరిష్ఠ రత్నలోష్ఠయోః సుహృత్ విపక్ష పక్షయోః
తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయౌః
సమః ప్రవృత్తికః" కదా" సదాశివం భజామ్యహం.
" కదా" ఎప్పుడో? ఏమిటి ఎప్పుడో? అహం-నేను,సదాశివం-ఎల్లప్పుడు శుభకరుడైన శివుని,భజం-భజించుట
నేను సదా శివుని భజించు శుభదినము ఎప్పుడు వచ్చునో కదా.(ఐతే ఇప్పటి వరకు భజించినది నిజము కాదా అన్న సందేహము కలుగ వచ్చును.స్వామి అనుగ్రహముతో ఏ విధముగాభజించవలెనన్నవిషయము ఇప్పుడే స్పురణకు వచ్చినది.అది)సమ ప్రవర్తికం-అంటే ఏకత్వమును అర్థము హేసికొనగలిన సమత్వస్థితి.అదే పూజా స్థితి.ద్వంద్వాతీత స్థితి.ఆ స్థితిని చేరుకోవాలంటే దృషద్-రాయి (కటికనేల) విచిత్ర తల్పము.శయ్యామదిరములోని హంసతూలికాతల్పము,స్వామి కంఠమునలంకరించిన పాము-ముత్యాలహారము,మణులు-రాళ్ళు,సుహృత్-మిత్రుడు-విపక్ష-శత్రువు,తృణము-గడ్డిపరక,అరవిందము-కలువపూవు,ప్రజా-సామాన్యజనులు,మహీమహీంద్రుడు-రాజాధిరాజు,సార్వభౌముడు,వీరాందరిలో,వీటన్నిటిలో నున్న చైతన్యము శివుడే నన్న భావనను పొందుట ఎప్పుడో కదా.శివా నీ దయ.
13. కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్,విముక్త దుర్మతిస్సదా శిరస్ అంజలిం వహన్
విలో లోల లోచనో లలామ భాల లగ్నకః శివేతి మంత్రముహ్చరన్ కదా సుఖీ భవమ్యహం.
అహం-నేను,సుఖీభవం-సుఖముగా ఉంటాను.కదా-ఎప్పుడు,ఎప్పుడు నేను సుఖముగా ఉంటానో కదా.ఏమిచేస్తూ ఉండాలి? శివేతి -పరమశివ,మంత్రం-నామమును,ఉచ్చరన్-పలుకుతు.పరమశివుని నామమును పలుకుతు నేను ఎప్పుడు సుఖముగా ఉండెదనో కదా.నేను ఎక్కడ ఉండాలంటే-నిలింప-పవిత్రమైన,నిర్ఝరీ-మహా ప్రవాహమైన గంగానది,కోటరే-ఒడ్డునగల,నికుంజములు-పొదరిండ్లదగ్గర,పవిత్ర గంగాతీర పొదరిండ్ల దగ్గర కూర్చుని శివమంత్రమును జపించుచు సంతోషముగా నేను ఎప్పుడు ఉండగలనో? అడ్డంకులు నన్ను ఆపుతున్నాయి.అవి దుర్మతి-చెడు ఆలోచనలు .సదా ఎల్లప్పుడు,చెడు ఆలోచనలు ఎప్పుడు నా మనసును చేరి మలిన పరచుచున్నవి.నా లోచనములు విలోలములై అటు-ఇటు బయటి వస్తువులపై ఆకర్షింపబడి నా మనసును(ఆజ్ఞా చక్రము) నుదుటి యందుంచి ధ్యానము చేయనీకున్నవి.పరమేశ్వరా నా మనసును స్థిరముచేసి,దానిని ఏకాగ్రతతో నీయందుంచి ధ్యానించునట్లు అనుగ్రహింపుము.
ఇమంహి నిత్యమేవ ముక్త ముక్త మోత్తవం స్తవం
పఠన్,స్మరణ్, బ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం
హరే గురౌ సుభక్తి మాశు యాతి నాన్న్యధా గతిం
విమోహనం విదేహినం సు శంకరస్య చింతనం.
ఫలశృతి.
ఇమం స్తవం-ఈ స్తోత్రము,ముక్తమోత్తమం-ముక్తి ప్రదము. ఏ విధముగా నంటే నిత్యం-ప్రతిదినము,సంతతం-ఎల్లప్పుడు,సర్వకాల సర్వావస్థలయందు.విశుద్ధం-పవిత్రతో,ఇతి-దీనిని,సుభక్తి-ఏ కోరికలేని నిస్స్వార్థ భక్తితో ఏవ-ఎవరు, పఠించిన-చదివిన,స్మరణ్-స్మరించి
న,బ్రువన్,చదివి-తలచికొనుచు,పరమార్థమును తెలిసికొనిన,హరే గురౌ-గురువైన హరుడు (శివుడు)వారిని కరుణించి మంచి ఆ
లోచనలను కలుగచేయుటయే కాకుండా,దేహ భ్రాంతిని,మోహమును తొలగచేస్తాడు.చిదానందుని శరణువేడుట తప్ప న-అన్యథ-వేరు మార్గము యాతి-లేదు.
పెద్దలు.సాహితీవేత్తలు నా దుస్సాహసమును క్షమించి,లోపములను సవరించుట ఈశ్వరార్చనగా భావించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.
( ఏక బిల్వం శివార్పణం)