Wednesday, August 29, 2018

DAARIDRYA DAHANA STOTRAMU -MAHARSHI VASISHTAKRTAMU.

 దారిద్ర దుఖః హరణ స్తోత్రము-వశిష్ట మహర్షి విరచితము.
 ***********************************************

1.నరకము దాటిస్తాడు-సకలము పాలిస్తాడు
  శృతులను వినిపిస్తాడు-సుధలను కురిపిస్తాడు
  సర్పాలను ధరిస్తాడు- కర్పూరపు కాంతివాడు
  దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

2.. పాము కంకణముల వాడు-పార్వతి మెచ్చినవాడు
   యమునికి యముడైనవాడు-తోయమును ధరించాడు
   కరిచర్మము ఒలిచాడు-కళాధరుని మెచ్చినోడు
    దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

3. జలధిని దాటిస్తాడు-జన్మలు తీసేస్తాడు
   భక్తుల దగ్గరి వాడు-భ్రష్టుల శిక్షిస్తాడు
   వెలుగు గుప్పిస్తాడు-స్మరణతో నర్తిస్తాడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు
  
4. మూడు కన్నులవాడు-మువ్వల పాదముల వాడు
   బూడిద పూతల రేడు-భువనైక మనోహరుడు
   చర్మము ధరియించుతాడు-కర్మలు తొలగించుతాడు
    దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

5. ముల్లోకములు వాడు-మూలస్థానము వాడు
   పసిడి వస్త్రములవాడు-ప్రసాద గుణమే వాడు
   చీకటి కూల్చేస్తాడు-చీకును తుంచేస్తాడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్రహృదతుడు శివుడు.

6. బ్రహ్మ కొలుచు వాడు-బ్రహ్మాండములు వాడు
   కాలసాక్షి ప్రియుడు-కాల కాలాంతకుడు
   చూడచక్కని రేడు-మూడు కన్నుల వాడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు 

7.శ్రీ రామునికి సఖుడు-కైలాస నిలయుడు
  సేవగణ సేవితుడు-కైవల్య వరదుడు
  పాములు మెచ్చినవాడు-పావన చరితుడు
  దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

8. సామి శివగణములకు-సామగాన ప్రియుడు
   నామ స్మరణ ప్రియుడు-నంది వాహనుడు
   కర్మఫలమిస్తాడు-చర్మ వస్త్ర ధరుడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.


   శ్రీ వశిష్ట కృత స్తోత్రం -సర్వశ్రేష్టం శుభప్రదం
  సర్వరోగ నివారణం- స్వవంశాభివృద్ధిప్రదం
  త్రికాల స్తోత్ర పఠనం-త్రినేత్రానుగ్రహ పదం
  సదాశివ పాదాబ్జ సన్నిధి సంప్రాప్తం సత్యం.

  ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.




Saturday, August 25, 2018

RAKSHABANDHAN-2018

 రక్షాబంధన పండుగ శుభాకాంక్షలు
****************************
1. కొంచము ముందో మరికొంచం వెనుకో
ఒకే తల్లిగర్భములో ఒద్దికగా ఒదిగాము
ఒదగనిచ్చినది బొడ్డుతాడు సహాయము.
అదియేగ నేను నీ చేతికి కట్టిన దారము.

2. కొంచము తెలిసో మరికొంచము తెలియకో
ఉమ్మనీటి మడుగులో ఒడుపుగా ఈదాము
ఈదనిచ్చినది ఉమ్మనీటి సంస్కారము
అదియేగ మెరిసే నీ కంటినీటి మమకారము
.
3.కొంచము తడబాటో మరికొంచం పొరపాటో
చిట్టిపొట్టి పాదాలతో అమ్మను గట్టిగా తన్నాము.
తన్ననిచ్చినది తన్నినా తరగని తల్లిప్రేమ
ఒరవడిఅదియేగ రక్షాబంధనపు ముడి.

4. కొంచము నగవులతో మరికొంచం తగవులతో
నీవే ముద్దంటు నాకసలే వద్దంటు ఇద్దరము పెరిగాము
వద్దన్నది చేసాననిఛెళ్ళుమనిపించినది నా చెంపదెబ్బ
ఎర్రదనముఅదియేగ నీ నుదుట మెరిసేటి తిలకము.

5. కొంచము సేపు పచ్చి అంటు కొండముచ్చు నీవంటు
అగ్గిమీద గుగ్గిలమై భగ్గుమన్నాము.రెచ్చిపోయి
పచ్చగడ్డినే భగ్గుమనిపించినది ఆ చిచ్చు
అదియేగ పచ్చగ ఉండాలని హారతిని తెచ్చు.

6. కొంచం సేపు అమ్మ అంటు మరికొంచం సేపు నాన్న అంటు
అమ్మ ఒడి నాదంటు నాన్న భుజం నాదేనంటు
నిన్ను రానీయననిఅన్నీ నావేనంటు బైఠాయించే వాళ్ళం
అదియేగ నీ నోటిలోని తియ్యనైన మిఠాయి.

7.అమ్మ కడుపు చల్లగా, నాన్న కలలు పండగా ఆడపడచుల
 అభిమానముతో వెయ్యేళ్ళు నిండాలి,అన్నదమ్ముల లోగిళ్ళు
 సర్వ శుభలక్షణ రక్షా బంధనపు ,అక్షయ పరవళ్ళు
 వెన్నుతట్టి నడిపించే విరోధాభాసపు విజయదరహాసములు.

 ఆనందపు లోగిళ్ళు ,ఆశీస్సుల పరవళ్ళు
 ఆనాటి ఆనవాళ్ళు ఆనందపు లోగిళ్ళు
 విరోధాభాసములైన విజయ దరహాసములు.

Wednesday, August 15, 2018

VEDA SAARA SIVA STOTRAMU

 వేదసార శివ స్తోత్రము.( శ్రీ ఆదిశంకరాచార్య కృతము.)
 *******************************************************

1.స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము
  శాశ్వతత్త్వ పునీతముగాగ  గంగావతరణము
  మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము
  మరువకే ఓ మనసా! శివ నామస్మరణము.

2.పంచకార్య నిర్వాహకుడు ఆ పంచముఖములవాడు
  భస్మాలంకృతుడు  వాడు   భవతాపహరుడు
  అపురూప నేత్రుడు వాడు త్రిపుర సంహారకుడు
  మరువకే ఓ మనసా! శివ వ్యాపకత్వము.

3.గరళము కంఠకైవశముగాగ దేవతలు పరవశము
  శివ వరప్రసాదము శిలాదసుత నందివాహనము
  ప్రమథగణ విలాసము ఆ ప్రమోదమయ కైలాసము
  మరువకే ఓ మనసా! మహేశ పాద పంకజము.

4.ఇడ-పింగళ-సుషుమ్న నాడులు ఈశ్వర శూలము
  మహేశ శిరోభూషణము శశి, మనో నిగ్రహము
  జాహ్నవి జగత్కళ్యాణము జంగమ జటాజూటము
  మరువకే ఓ మనసా ! శివ పరిపూర్ణ తత్త్వము.

5.సర్వ సృష్టికారణ భవుడు వాడు స్వయంభువుడు
  సృష్టి-స్థితి-లయ స్పష్టరూపుడు శుభుడు
  నిరాకారుడు-ప్రకటిత ఓంకార రూపుడు
  మరువకే ఓ మనసా !శివపాద శరణము.

6. పంచభూతములు తనుకాని పరబ్రహ్మము చూడు
   చల్లనైన వాడు వింతగ చలికాని వాడు
   నిప్పుకన్నోడు సోద్యముగ నిద్ర తాను కాడు
   మరువకే ఓ మనసా! శివ నిర్ద్వంద్వమును.

7.సూర్య చంద్రుల నడకకు సూత్రధారైనాడు
  అజ్ఞాన చీకటికి ఆవలనున్న వాడు
  మూడు గుణములను దాటి ముందుకొచ్చినవాడు
  మరువకే ఓ మనసా! మదిని శివ భావము.

8. నమస్తే నమస్తే విశ్వరూపా ప్రపంచ
   నమస్తే నమస్తే తపోయోగ ప్రసన్న
   నమస్తే నమస్తే వేదాంత విదిత
   నమస్తే నమస్తే మనో వాక్కాయ కర్మ.

9. అవిముక్త క్షేత్ర కాశీపతి మహేశా
   అవిభక్తదేవ గౌరీపతి గిరీశా
   పాశహర భక్త పశుపై పరమేశా
   కన్నతండ్రి మమ్ములను కరుణ పాలించు.


10.సృష్టి ప్రారంభకారణము నీ దృష్టి ప్రసారము

   స్థితికార్య సూచకము హరికేశపాశము
   జగతి లీనముకాగ సర్వమును జలమయము
   దాని ఆలింగనము స్వామి శివలింగము.


   వేదసార శివ స్తోత్ర భావమును తెలుగులో వ్రాయుటకు ప్రయత్నించిన నా సాహసమును మన్నించి,శివస్వరూపులు నన్ను క్షమించి,ఆశీర్వదించెదరు గాక.భళి అనకపోయిన ఆ భోళా శంకరుడు దీనిని స్వీకరించి,మనలను అనుగ్రహించును గాక.

 ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.

SIVA APARAATHA KSHAMAPANA STOTRAMU.

  శివ అపరాథ క్షమాపణ స్తోత్రము ( శ్రీ శంకర భగవత్పాదులు)
********************************************************************

1. పూర్వకర్మ చుట్టుకున్న పుట్టబోవు శిశువును
   మలమూత్రముల మధ్యనున్న మందభాగ్యుడను నేను
   నీ ఎరుకలేని దుర్భర గర్భనరకవాసిని,శివ
   అవ్యాజకరుణామూర్తి,నా అపరాథమును క్షమించు.

2.చిత్తు కనుగొనలేని పొత్తిళ్ళ శిశువును
  మలము పురుగులతో నన్ను గిల్లుచున్నది,
  ఇంద్రియములను కదిలించలేని వానిని,శివ
  అష్టాంగమూర్తి,నా అపరాథమును క్షమించు

3.పంచముఖుని తలచని పడుచువాడిని నేను
  పంచేంద్రియ పాములు కరుచుచున్న వాడను
  విచక్షణనే మరచిన వింతవ్యామోహిని,శివ
  అంబికా పతి,నా అపరాథమును క్షమించు.

4.పశుపతినికొలువని ముసలివాడిని నేను
  కృశియించిన ఆది-వ్యాధి పీడితుడను
  జ్ఞాపక శక్తి లేని అజ్ఞాన జలధిని,శివ
  అభయప్రదాత, నా అపరాధమును క్షమించు.

5. పంచాభిషేకములు చేయనివాడను
   పంచభక్ష్యములు-ధూపదీపములు
   అర్పించగలేని అజ్ఞానిని ,శివ
   అంగజ సంహార, నా అపరాధమును క్షమించు.

6.స్మార్త పూజలు తెలియని మర్త్యుడను నేను
  శౌచకర్మలు చేయని మూర్ఖుడను నేను
  శ్రవణ-మననము లేని జడమును,శివ
  అర్థనారీశ్వర నా అపరాథములు క్షమించు.

7. "శివ-శివ" యని మనసార పలుకని నేను
    శ్రీ గంగతీరాన శివచింతనెరుగను
    నీ తపము తెలియని నిర్భాగ్యుడిని,శివ
    అద్రిజాపతి, నా అపరాధమును క్షమించు.

8.నిష్కళంకులు, నిజభక్తుల కానగలేను
  నిష్కృతిని పొందగ, నిన్ను కొలువగలేను
  మతిచలించిన ఉన్మత్తుడిని,శివ
  అభయప్రదాత, నా అపరాధమును క్షమించు.

9.సకలజీవరాశుల సంకేతము శివలింగము
  సహస్రారపద్మస్థిత ప్రణవము శివనామము
  నామ-రూపములు గనని జీవిని,శివ
  అనుగ్రహమూర్తి, నా అపరాధములు క్షమించు.

10. వేదాంతము తెలుపు వేదవేద్యుడవు
    వేదాంతుల హృదయ జ్యోతిరూపుడవు
    మూడవస్థల తలవని మూఢుడిని,శివ
    అపరాజితుడ నా అపరాధమును క్షమించు.

11. నిన్ను చేర్చని వేరుతలపుల పనిలేదు
    ఐహిక సంపదల ఊహ నాకిక రాదు
    నీటి బుడగను నిజమని నమ్మితిని శివ
    అఖిలాండ రక్షక, నా అపరాధమును క్షమించు.

12.తీరుతున్నది ఆయువు కబళించ లోకము
   తిరిగిరానిది నిజము గడిచిన కాలము
   సర్వదా,సర్వస్య శరణాగతుడుని,శివ
   అనుగ్రహించు ,నా అపరాధమును క్షమించు.


    క్షిప్ర ప్రసాదుడైన సదాశివుడు మనలనందరి అపరాధములను క్షమించి,తన అక్కున చేర్చుకొనును గాక.

( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.

Sunday, August 12, 2018

RISHI UPAMANYU KRUTA ARTHANAAREESVARA ASHTAKAMU.


  అర్థనారీశ్వర అష్టకము.ఋషి ఉపమన్యు కృతము.
  *****************************************

1.నల్లని మొయిలుకాంతి నాతల్లి కచము
  ఎర్రని మెరుపు కాంతి శివ జటాజూటము
  గిరినేలు నా తల్లి-ఉర్వినేలు నా తండ్రి
  అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.

2.రత్నకుండల కాంతితో అమ్మ కర్ణములు
  సర్పభూషణ కాంతితో స్వామి కర్ణములు
  శివ నామము ప్రీతి-శివా నామము ప్రీతి
  అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.

3.మందార మాలలతో  మా తల్లి గళము
  కపాలమాలలతో స్వామి మంగళము
  దివ్య వస్త్రము దాల్చి-దిక్కులను దాల్చి
  అర్థ నారీశ్వరమై  నన్ను ఆశీర్వదించు.

4.పద్మార్చనతో నున్నది మాతల్లి పాదము
  సర్పసేవితమైన  సాంబశివ పాదము
  చంద్ర ప్రకాశముతో-చంద్రాభరణముతో
  అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.

5.అద్భుత ప్రదర్శనము మా తల్లి లాస్యము
  ఆసన్న  ప్రళయము మా తండ్రి తాండవము
  సరిసంఖ్య కనులతో-బేసి కన్నులతో
  అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.

6.నీలి కలువల కాంతి అమ్మ నయనములు
  వికసిత కలువలు మా అయ్య నేత్రములు
  జగములకు తల్లిగా-జగమేలు తండ్రిగా
  అర్థనారీశ్వరమై నన్ను రక్షించు.

7.ఆది మధ్యాంతములు అన్ని మా అమ్మ
  దిక్కులు-మూలలకు దిక్కు మా అయ్య
  పంచకృత్యములను నియమించు వారు
  అర్థ నారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.

8.అమ్మా అని పిలిచినా,అయ్యను వేడినా
  సన్నద్ధులౌతారు ఉద్ధరించంగ
  ఉపమన్యు ఋషికృత స్తోత్ర పఠనమ్ము
  అర్థనారీశ్వర కరుణ అరచేతనుంచు.

 ( ఏక బిల్వం శివార్పణం.)

   ఓం తత్ సత్.

Saturday, August 11, 2018

BRAHMAJNAANAVALEE STOTRA MAALIKA.


 బ్రహ్మజ్ఞాన వళీమాల-శ్రీ ఆదిశంకరాచార్య విరచితము
 *****************************************

  కలిసిలేను-కలువబోను
  తెలియరాను నిజం నిజం
  నశ్వరము నే కానే కాను
  సచ్చిదానందమును నేను.

  నిత్యము నేను-శుద్ధము నేను
  సర్వవ్యపిని  నిజం నిజం
  ఆకారము నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  సత్యము నేను-సాక్షిని నేను
  పాప రహితము నిజం నిజం
  పతనము నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  చైతన్యమునేను-జడము నేను
  ఆనందరూపము నిజం నిజం
  నాశనము నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  శాంతము నేను-ఆనందము నేను
  ఆత్మానందము నిజం నిజం
  ప్రకృతిని నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  తనువు కాను-మనసు కాను
  సుఖరూపమును నిజం నిజం
  నానారూపిని నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  గుణమును కాను-దోషమును కాను
  పరంజ్యోతిని నిజం నిజం
  మాయను నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  మాయను కాను-మర్మము కాను
  స్వయంప్రకాశము నిజం నిజం
  శరీరాదులు నే కానేకాను
  చిదానందమును నేను.

  పాపము కాను-పుణ్యము కాను
  ఏక సాక్షిని నిజం నిజం
  అబద్ధము నే కానేకాను
  సచ్చిదానందమును నేను

  అన్నిట నేను- అంతట నేను
  కూటమిని నిజం నిజం
  వ్యయము నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  సుఖము సాక్షిని-దుఃఖ సాక్షిని
  సనాతనుడను నిజం నిజం
  చలించే వాడిని నేనుకాను
  సచ్చిదానందమును నేను.

  అద్వైతము నేను-అవ్యయము నేను
  అవస్థాసాక్షిని నిజం నిజం
  మూడు దేహములు నే కానేకాను
  సచ్చిదానందమును నేను.

  మాయ కర్మ-బ్రహ్మ కర్త
  విరుద్ధములు నిజం నిజం
  ఏకముగా అవి కానే కావు
  వేదాంత భేరి వివరమె ఇది.

  తరచి తరచి-తత్త్వమరయగ
  ముక్తుడగును నిజం నిజం
  మూర్ఖుడెన్నడు కానే కాడు
  వేదాంత భేరి వివరమె ఇది.

  కుండ మట్టి-కుడ్యము మట్టి
  బ్రహ్మమొకటె నిజం నిజం
  బ్రహ్మరహితం నే కానేకాను
  వేదాంత భేరి వివరమె ఇది.

  సత్యము బ్రహ్మ-జీవుడు బ్రహ్మ
  సర్వం బ్రహ్మ నిజం నిజం
  మిథ్యను నే కానేకాను
  వేదాంత భేరి వివరమె ఇది.

  లోపలి జ్యోతి-వెలుపలి జ్యోతి
  ఆత్మజ్యోతి నిజం నిజం
  జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి
  సచ్చిదానందమును నేను.

 ( ఏక బిల్వం శివార్పణం.)

 ఒకసారి వినినంతనే అందరికి మోక్షము లభించాలన్న సంకల్పముతో శ్రీ ఆదిశంకరులు ఈ స్తోత్రమును మనకు అనుగ్రహించిరి.పెద్దలు నా సాహసమును మన్నించుదురుగాక.శివస్వరూపులై నన్ను ఆశీర్వదించెదరుగాక.

    ఓం తత్ సత్.





SRI VAIDYANAATHAASHTAKAM


  వైద్యనాథాష్టకము
  **************

 1.రఘువంశ నందనులు రమ్యముగ పూజింప
   పశు-పక్షి-గ్రహములు ప్రార్థనలు సలుప
   భవరోగ తిమిరాలు భస్మంబు గావింప
   అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.

 2.ఉత్తుంగ గంగ నీజటన్ ఉయ్యాలలూగ
   ముక్కంటి దయ నెలవంక పూవాయెలె సిగ
   కదిలింప నెంచిన కామకథ ముగిసెగ
   అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.

 3.త్రిపురాసురులను జయించితివి విలుకాడ
   దుష్టత్వమును  పినాకము దునుమాడ
   ప్రత్యక్షలీలలను ముజ్జగములు కొనియాడ
   అందుకో దండములు  శ్రీ వైద్యనాథ.

 4.చితిలోన నీచేతి స్పర్శను కోరిన ఎముక
   సహకరిస్తుంది జీవికి సహనముతో కాదనక
   నీ కనుసన్నలేగ సూర్యాగ్ని-చంద్రుల నడక
   అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.

 5.బహుస్వల్ప పంచేంద్రియ జ్ఞాన పశుతతి
   బహుళమోహ బంధితులేగ మానవజాతి
   నికృష్ట కుష్ఠాది రోగహతి నీ భాతి
   అందులో దండములు  శ్రీ వైద్యనాథ.

 6.వేదాంత వేద్యుడవు-యోగీశ్వరుడవు
   ఆది-మధ్య-అంత రహితుడవు అనఘుడవు
   ఆరోగ్యదాతవు-అనుక్షణ రక్షకుడవు
   అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.

 7.విస్మయముకాద భస్మలేపనము చాలు
   పిశాచ-దుఃఖార్తి నశియించి రాలు
   అది నీ మహిమగ అవగతమైన పదివేలు
   అందుకో  దండాలు శ్రీ వైద్యనాథ.

 8.శ్రీనీలకంఠుడు శ్రీకరుడు శివుడు
   బూదిపూతలవాడు-గోడు విను రేడు
   వాలాంబికేశుడు మనలను విడలేడు
   అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.

  శ్రీ వైద్యనాథాష్టకమును మనఃసాక్షిగా స్మరించినా,జపించినా,
  సర్వరోగహరము ఇది సర్వేశ్వరుని  ఆన.

 ( ఏక బిల్వం శివార్పణం.)


  ఓం తత్ సత్.

Friday, August 10, 2018

DASA SLOKI STOTRAMU.


 దశ శ్లోకి- శ్రీ ఆదిశంకర కృతము.
 ***********************************

1. ఇల పంచభూతములు నేనుకాను
   ఇంద్రియములు నేనసలు కాను
   సుషుప్తావస్థకు ఒకే సాక్షిగ నున్న
   గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

2. వర్ణాశ్రమములో నేనిమిడిలేను
   అవిద్యకు  ఆశ్రయము నేనసలు కాను
   ఆత్మస్వరూపియైన  అద్వితీయమును
   గురుదేవ! కేవల శివ స్వరూపమును నేను.

3. లోకములు,మాతా-పితలు నేను కాను
   యజ్ఞములు-తీర్థములు నేనసలు కాను
   సుషుప్తిలో జీవభావాతీత సత్యమును
   గురుదేవ! కేవల శివ స్వరూపమును నేను.

4.తర్కిమ్హు వివిధ మతములు నేనుకాను
  సంకల్ప-వికల్పానుభూతిని నేనసలు కాను
  అది నీవె అయిన అఖండ నిర్వికల్పమును
  గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

5.తూరుపు-పడమర దిక్కులు నేను కాను
  లోపల-వెలుపల నేనసలు కాను
  అఖండాకృతియైన అద్వితీయమును
  గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

6.కొలుచు వివిధ పరిమాణములు నేను కాను
  కొలువైన వింత వర్ణములు నేనసలు కాను
  సూర్య-చంద్రుల వెలిగించు బ్రహ్మ వస్తువును
  గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

7.గురు-శిష్య ఉపదేశములు నేను కాను
  కర్త-కర్మ-క్రియలసలు నేను కాను
  వైకల్యములు లేని సచ్చిదానందమును
  గురుదేవ! కేవల శివస్వరూపమును.

8.ఉత్తమ-మధ్యమ-అథమ పురుషలను కాను
  జాగ్రత్-స్వప్న-సుషుప్తులను నేనసలు కాను
  అవస్థాత్రయమునకు అతీతమైనవాడను
  గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

9.అనన్యాశ్రయుడను ఎన్నటికి నేనుకాను
  మిథ్యాజగతిని క్కొడ నేనసలు కాను
  అంతరింపగ మిగిలిన అద్వితీయుడను
  గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

10.శూన్యమునుగాను-అశూన్యమునుగాను
   ఏకత్వ-అనేకత్వములు నేనసలు గాను
   వాక్కు వర్ణించగలేని సిద్ధవస్తువును
   గురుదేవ! కేవల శివస్వరూపమును నేను.

 సంసారమనెడి మొసలిబారినుండి.తల్లి అనుమతితో కాపాడబడిన,శ్రీ ఆదిశంకరులు,తమ గురువుకై వెతుకుచుండగా,నర్మదానదీతీరమున కటాక్షించిన,శ్రీ గోవిందపాదాచార్యుని "నీ వెవరవు? అను ప్రశ్నకు ఆదిశంకరులవారి సమాధానముగా ఆవిర్భవించినది "దశ శ్లోకి" (పై) స్తోత్రము.

  ( ఏక బిల్వం శివార్పణం.)


Thursday, August 9, 2018

RUDRAASHTAKAMU.

  శ్రీ రుద్రాష్టకము.(గోస్వామి తులసిదాస విరచితము)
 ****************************************************

 నమస్తే పరబ్రహ్మమీశాన దేవ
 వేదస్వరూపమైనావు మము బ్రోవ
 గణాలెన్నో కొలువ గుణాతీత నిన్ను
 చిదాకాశవాసా నన్ను భజియింపనిమ్ము
...............
 ఊర్థ్వ ముఖుడైన ఈశానుడు సృష్టి-స్థి-లయ-తిరోధానము-అనుగ్రహము (పుట్టుట-పెరుగుట-లీనమగుట-జగతిని దాచుట-తిరిగిప్రకటించుట) అను ఐదు పనులను నిరంతరముచేయుచు,మనలను అనుగ్రహించుచుండును.ప్రమథ గణములచే కొలువబడు గుణరహితుడైన పరమేశుడు ,భజించుటకు నన్ను అనుగ్రహించును గాక.

ఓంకార-నిరాకారములైన దేవ
త్రిగుణాలపై నున్న స్థితి నీవుకావ
కరమందు శూలంబు కరుణించ రమ్ము
సంసారమును దాట నిన్ను భజియింపనిమ్ము.

 సత్వ-రజ-తమో గుణములను దాటి ఉన్న నాల్గవ స్థితి చిదానందమైన శంభుడు,తనచేతి యందలి శూలముబు కృపాకారిగా మార్చి,సంసారబంధములను తెంపి,భజన అనే నావలో ఒడ్డును చేరుటకు అనుగ్రహించును గాక.

   చల్లందనమును-తెల్లదనమైన దేవ
 ఉన్మత్తగంగనుద్ధరించినది నీవు కావ
 కోటిసూర్య ప్రభాకాంతులను విరజిమ్ము
 బాలేందుమౌళి నన్ను భజియింప నిమ్ము.

  మంచుకొండపై చల్లని మనసుతోతెల్లనినిష్కళంక ప్రకాశముతో,కోటిసూర్య ప్రకాసవంతుడైన శివుడు(కోటి=అనంత వాచకము.లెక్కకు మించినది.)గంగను సంస్కరించి, నిరంతర భజనాసక్తిని నాలో కలిగించి,అనుగ్రహ వీక్షణములను మనపై ప్రసరించును గాక.

   నిజము-నిర్గుణము-నీలకంఠమైన దేవ
 కపాల ప్రకటిత కాలాతీతుడవు కావ
 ఆర్తనాదములను కుండలములు విననిమ్ము
 గజచర్మధారి కిల్బిషము కడతేర్చ రమ్ము

  ఆర్తశరణ్యుని చెవి కుండలములు కరుణాంతరంగులై ఆలకించుచు ఆర్ద్రతతో కదులుచున్నవి.స్వామి కపాలమాలలోని తలలు వామి కాలాతీత తత్త్వమును చెప్పకనే చెప్పుచున్నవి.గజాసురుని చర్మును ఒలిచి వస్త్రముగా ధరించు స్వామి నా పాపములను ఒలిచి నన్ను కడతేర్చును గాక.

 అండం-అఖండం రూపైన దేవ
ప్రచండం-ప్రశాంతం అది నీవు కావ
కళ్యాణ-కల్పాంతకారీ శరణమిమ్ము
భవానీపతి మమ్ము భజియింపనిమ్ము

 స్థూల-సూక్ష్మరూపములతో ,ప్రశాంత-ప్రచండ తత్త్వముతో ప్రకాశించుచు,శుభాశుభ నిర్వాహకుడైన నిటలాక్షుడు,మనలకు శరణునొసగి అనుగ్రహించును గాక.

లంకాపురిదాత-పురారీశ దేవ
శాంకరినాథ మన్మథ సంహారి నీవ
విడలేని మోహాన్ని వేగ తొలిగించు
మనసార భజియింప నన్ను కరుణించు

  రావణునికి లంకాపురిని దానమిచ్చినవాడు,త్రిపురాసురులను ఓడించినవాడు,మన్మథుని దహించినవాడు,జటిలమగు మోహమును నశింపచేయువాడు అగు గౌరీపతి మనలను అనుగ్రహించును గాక.

  ప్రసన్నం ఉమానాథ పాదారవిందం
 ప్రయత్నం నగాధీశ నామ  సుధ పానం
 ప్రసిద్ధం సుఖం శాంతి సౌభాగ్యదాతం
 ప్రసీద ప్రసీద ప్రభో పాహి పాహి!

 తులసీదాసు గొప్ప రామభక్తుడు.రాముని అనుగ్రహమును పొందినవాడు.హనుమంతుని కరుణాపాత్రుడు.తన అవసాన దశలో వారణాసిలో గడుపుతు శివ-రామ అభేదమును కనుగొనగలిగి ఈ రుద్రాష్టకమును మనలకందించి చరితార్థుడాయెను.సంస్కృత భాషాప్రవేశము లేనివారును చదువుకొనుటకు ,ఆ స్వామి నిర్హేతుక కరుణాకటాక్షము ,నన్నొక పరికరమును చేసి పైవిధముగా పలికించినది.నా అతిపెద్ద సాహసమును క్షమించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

  (ఏక బిల్వం శివార్పణం.)

Wednesday, August 8, 2018

SIVA RAKSHAA STOETRAMU

   శివ రక్షా స్తోత్రము
   **********************

 యాజ్ఞ్యవల్క్యుని ధన్యతనొందించినది కల
 నారాయణోపదేశము ప్రాప్తించినది ఇల
 అవతరించెను  భళ "శివరక్షా స్తోత్రము"
 ఆదిదేవుని దయ అవ్యాజము అవని పునీతము.

    ఓం నమః శివాయ.
    ***************

 గౌరి-గణేశ విరాజితుడు దశభుజుడు
 సచ్చిదానందుడు  కరుణాసముద్రుడు
 ఐదు ముఖముల వాడు-మూడు కన్నుల వాడు
 సర్వాంగ సుందరుడు-సర్వాంగ రక్షితుడు

   హరహర మహాదేవ శంభో రక్షమాం.
   _____________________________________

 గంగాధరుడు నా శిరమును రక్షించు గాక
 చంద్రశేఖరుడు నా నుదుటిని రక్షించు గాక
 మదన సంహారి నా కనులను రక్షించు గాక
 నాగాభరణుడు నా చెవులను రక్షించు గాక

    ఓం నమః శివాయ
   ***************

 త్రిపురాసురుడు నా నాసిక రక్షించుగాక
 విశ్వాత్మకుడు నా జిహ్వ తానుండు గాక
 వేదపూజితుడు నా మెడను రక్షించు గాక
 గరళ కంఠుడు నా కంఠము రక్షించు గాక

     ఓం నమః శివాయ
    ****************

 భూభార లయకర్త నా భుజములు రక్షించు గాక
 పినాకపాణి నా కరములు రక్షించు గాక
 శంకరుడు నా హృదయము వసియించు గాక
 గిరిజాపతి నా ఉదరము రక్షించు గాక

  ఓం నమః శివాయ
 ****************

 మృత్యుంజయుడు నా నాభిని రక్షించు గాక
 పులిచర్మధారి నా పీఠము రక్షించు గాక
 గణనాథుడు నా గుల్భము రక్షించు గాక
 మహేశ్వరుడు నా పిరుదులు రక్షించు గాక

    ఓం నమః శివాయ
    ***************

 భోళా శంకరుడు నా కీళ్ళను రక్షించు గాక
 మోక్షప్రదాత నా మోకాళ్ళను రక్షించు గాక
 శరణాగత వత్సలుడు నా మడమలు రక్షించు గాక
 పాములనేలిన వాడు నా పాదములు రక్షించును గాక

    ఓం నమః శివాయ
    ****************
 సాంబ సదా శివుని స్తుతించినా,పఠించినా,స్మరించినా సర్వకాల సర్వావస్థలయందు,
 సచ్చిదానందుడు సంరక్షించుచుండు గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

   బ్రహ్మ అంశతో శివుని శాపమువలన జన్మించిన యాజ్ఞవల్క్య మునికి,నారాయణుడు స్వప్నములో సాక్షాత్కరించి, ఉపదేశించిన శివరక్షాస్తోత్రము క్షిప్రప్రసాదుడైన సదాశివుని అనుగ్రహపాత్రులను చేయును గాక.
 
    ఓం తత్ సత్







Tuesday, August 7, 2018

MAARGABAMDHU STOTRAMU


  భవానీ సమేతం- భజే మార్గ బంధుం
*********************************************

  శంభో శివా ప్రాపు నీవు
  దయా సింధో నా దారి చూపు

  శంభో మహాదేవ దేవా
  శివా శంభో మహదేవేశ శంభో
 ...........

  తరిమింది జాబిలిని శాపం
  తలదాచుకొమ్మంది కరుణా సముద్రం
  సిగపూవునే  చేసింది   మార్గం
  భవానీ సమేతం -భజే మార్గబంధుం..భజే మార్గబంధుం

  ............

  తాగినది విషజ్వాల సర్పం
  వెన్నంటి నడిచింది  హరుడే  సమస్తం
  ఆభరణమునే  చేసింది మార్గం
  భవానీ సమేతం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.

  ........

   తొలగినది భవబంధ పాశం
   కరుణించె నను కోటి సూర్యప్రకాశం
   మమేకమే  చేసినది మార్గం
   భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.

      ( ఏక బిల్వం శివార్పణం.)

  నిర్హేతుక కరుణ మార్గబంధు స్తోత్రమును వినిపించి,నన్ను కలముగా మలచుకొని పై స్తుతిని వ్రాసుకొనినది.

 అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొనిన,శ్రీ అప్పయ్య దెక్షితులు విరించిపట్టణం వేలుపైన పరమేశుని,మాసదాశివుని ర్గ బంధువుగా గుర్తించి,ప్రయాణ సమయమునకీర్తిమ్హినది ఈ స్తోత్రము.వివిధ శరెరములలో ఈ జీవి ప్రయాణములు అనంతములు.వాటిని సన్మార్గమున నడిపించమని వేడుకొనుటయే ఈ స్తోత్ర ప్రాశస్త్యము.
 దక్షునిచే శాపగ్రస్థుడై,కడలిని దాగినచంద్రుని శాపవిముక్తునిచేయుటయే కాక,తన సిగపూవుగా అలరారుటకు కారణుడైన పరమేశుని భజిమ్హుచున్నాను.

  క్షీరసాగర మథనమున హాలాహలమును త్రాగువేళ,సహాయకారులై తామును విషమును గ్రహించి,స్వామికి ఆభరణములై ప్రకాశించుటకు మార్గమును చూపిన నాగాభరణునికి నమస్కరించుచున్నాను.

   మార్గ ముడులను విడిపించి,సన్మార్గమును చేర్చు త్రినేత్రుని భజించు అదృషమును స్వామి అనుగ్రహించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...