Wednesday, August 15, 2018

VEDA SAARA SIVA STOTRAMU

 వేదసార శివ స్తోత్రము.( శ్రీ ఆదిశంకరాచార్య కృతము.)
 *******************************************************

1.స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము
  శాశ్వతత్త్వ పునీతముగాగ  గంగావతరణము
  మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము
  మరువకే ఓ మనసా! శివ నామస్మరణము.

2.పంచకార్య నిర్వాహకుడు ఆ పంచముఖములవాడు
  భస్మాలంకృతుడు  వాడు   భవతాపహరుడు
  అపురూప నేత్రుడు వాడు త్రిపుర సంహారకుడు
  మరువకే ఓ మనసా! శివ వ్యాపకత్వము.

3.గరళము కంఠకైవశముగాగ దేవతలు పరవశము
  శివ వరప్రసాదము శిలాదసుత నందివాహనము
  ప్రమథగణ విలాసము ఆ ప్రమోదమయ కైలాసము
  మరువకే ఓ మనసా! మహేశ పాద పంకజము.

4.ఇడ-పింగళ-సుషుమ్న నాడులు ఈశ్వర శూలము
  మహేశ శిరోభూషణము శశి, మనో నిగ్రహము
  జాహ్నవి జగత్కళ్యాణము జంగమ జటాజూటము
  మరువకే ఓ మనసా ! శివ పరిపూర్ణ తత్త్వము.

5.సర్వ సృష్టికారణ భవుడు వాడు స్వయంభువుడు
  సృష్టి-స్థితి-లయ స్పష్టరూపుడు శుభుడు
  నిరాకారుడు-ప్రకటిత ఓంకార రూపుడు
  మరువకే ఓ మనసా !శివపాద శరణము.

6. పంచభూతములు తనుకాని పరబ్రహ్మము చూడు
   చల్లనైన వాడు వింతగ చలికాని వాడు
   నిప్పుకన్నోడు సోద్యముగ నిద్ర తాను కాడు
   మరువకే ఓ మనసా! శివ నిర్ద్వంద్వమును.

7.సూర్య చంద్రుల నడకకు సూత్రధారైనాడు
  అజ్ఞాన చీకటికి ఆవలనున్న వాడు
  మూడు గుణములను దాటి ముందుకొచ్చినవాడు
  మరువకే ఓ మనసా! మదిని శివ భావము.

8. నమస్తే నమస్తే విశ్వరూపా ప్రపంచ
   నమస్తే నమస్తే తపోయోగ ప్రసన్న
   నమస్తే నమస్తే వేదాంత విదిత
   నమస్తే నమస్తే మనో వాక్కాయ కర్మ.

9. అవిముక్త క్షేత్ర కాశీపతి మహేశా
   అవిభక్తదేవ గౌరీపతి గిరీశా
   పాశహర భక్త పశుపై పరమేశా
   కన్నతండ్రి మమ్ములను కరుణ పాలించు.


10.సృష్టి ప్రారంభకారణము నీ దృష్టి ప్రసారము

   స్థితికార్య సూచకము హరికేశపాశము
   జగతి లీనముకాగ సర్వమును జలమయము
   దాని ఆలింగనము స్వామి శివలింగము.


   వేదసార శివ స్తోత్ర భావమును తెలుగులో వ్రాయుటకు ప్రయత్నించిన నా సాహసమును మన్నించి,శివస్వరూపులు నన్ను క్షమించి,ఆశీర్వదించెదరు గాక.భళి అనకపోయిన ఆ భోళా శంకరుడు దీనిని స్వీకరించి,మనలను అనుగ్రహించును గాక.

 ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...