Wednesday, August 15, 2018

SIVA APARAATHA KSHAMAPANA STOTRAMU.

  శివ అపరాథ క్షమాపణ స్తోత్రము ( శ్రీ శంకర భగవత్పాదులు)
********************************************************************

1. పూర్వకర్మ చుట్టుకున్న పుట్టబోవు శిశువును
   మలమూత్రముల మధ్యనున్న మందభాగ్యుడను నేను
   నీ ఎరుకలేని దుర్భర గర్భనరకవాసిని,శివ
   అవ్యాజకరుణామూర్తి,నా అపరాథమును క్షమించు.

2.చిత్తు కనుగొనలేని పొత్తిళ్ళ శిశువును
  మలము పురుగులతో నన్ను గిల్లుచున్నది,
  ఇంద్రియములను కదిలించలేని వానిని,శివ
  అష్టాంగమూర్తి,నా అపరాథమును క్షమించు

3.పంచముఖుని తలచని పడుచువాడిని నేను
  పంచేంద్రియ పాములు కరుచుచున్న వాడను
  విచక్షణనే మరచిన వింతవ్యామోహిని,శివ
  అంబికా పతి,నా అపరాథమును క్షమించు.

4.పశుపతినికొలువని ముసలివాడిని నేను
  కృశియించిన ఆది-వ్యాధి పీడితుడను
  జ్ఞాపక శక్తి లేని అజ్ఞాన జలధిని,శివ
  అభయప్రదాత, నా అపరాధమును క్షమించు.

5. పంచాభిషేకములు చేయనివాడను
   పంచభక్ష్యములు-ధూపదీపములు
   అర్పించగలేని అజ్ఞానిని ,శివ
   అంగజ సంహార, నా అపరాధమును క్షమించు.

6.స్మార్త పూజలు తెలియని మర్త్యుడను నేను
  శౌచకర్మలు చేయని మూర్ఖుడను నేను
  శ్రవణ-మననము లేని జడమును,శివ
  అర్థనారీశ్వర నా అపరాథములు క్షమించు.

7. "శివ-శివ" యని మనసార పలుకని నేను
    శ్రీ గంగతీరాన శివచింతనెరుగను
    నీ తపము తెలియని నిర్భాగ్యుడిని,శివ
    అద్రిజాపతి, నా అపరాధమును క్షమించు.

8.నిష్కళంకులు, నిజభక్తుల కానగలేను
  నిష్కృతిని పొందగ, నిన్ను కొలువగలేను
  మతిచలించిన ఉన్మత్తుడిని,శివ
  అభయప్రదాత, నా అపరాధమును క్షమించు.

9.సకలజీవరాశుల సంకేతము శివలింగము
  సహస్రారపద్మస్థిత ప్రణవము శివనామము
  నామ-రూపములు గనని జీవిని,శివ
  అనుగ్రహమూర్తి, నా అపరాధములు క్షమించు.

10. వేదాంతము తెలుపు వేదవేద్యుడవు
    వేదాంతుల హృదయ జ్యోతిరూపుడవు
    మూడవస్థల తలవని మూఢుడిని,శివ
    అపరాజితుడ నా అపరాధమును క్షమించు.

11. నిన్ను చేర్చని వేరుతలపుల పనిలేదు
    ఐహిక సంపదల ఊహ నాకిక రాదు
    నీటి బుడగను నిజమని నమ్మితిని శివ
    అఖిలాండ రక్షక, నా అపరాధమును క్షమించు.

12.తీరుతున్నది ఆయువు కబళించ లోకము
   తిరిగిరానిది నిజము గడిచిన కాలము
   సర్వదా,సర్వస్య శరణాగతుడుని,శివ
   అనుగ్రహించు ,నా అపరాధమును క్షమించు.


    క్షిప్ర ప్రసాదుడైన సదాశివుడు మనలనందరి అపరాధములను క్షమించి,తన అక్కున చేర్చుకొనును గాక.

( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...