Tuesday, August 20, 2019

BHAJARE NAMDABALAM.

భజరె నంద బాలం"
****************
శ్రీ కృష్ణా,

పిల్లన గ్రోవిని ఊదుతు పులకించుటయా ఘనత?
పిల్లిమొగ్గలేయు నా మనసును మళ్ళించుటయే రమణీయత.

ఇంద్రుని యాగమును అడ్దగించుటయా ఘనత?
నా ఇంద్రియ రాగములను అడ్డుకొనుటయే ధీరత.

తులసిదళములతో సమముగ తూగుటయా ఘనత?
అతులిత మంగళములు అందచేయుటయే ఉదారత.

మన్నుతిన్న నోటను యశోదకు మాయచూపుటయా ఘనత?
కన్ను మిన్ను కానరాని నన్ను సవరించుటయే చతురత.

కురుక్షేత్రమున నరునికి గీతను అందించుటయా ఘనత?
మనసుకు సుశిక్షిత నడవడికను అందించుటయే ఆధ్యాత్మికత.

"మహా నందాంగనా డింభకుడు" అని మెప్పులను పొందుటయా ఘనత?
మదాంధకారయుత డింభకునికి కనువిప్పును కలిగించుటయే ఆర్ద్రత.

"శ్రీ కృష్ణం వందే జగద్గురుం"అంటూ పూజలందుకొనుటయా ఘనత?
నికృష్టపు మందబుద్ధిని పూజ్యము చేయుటయే పూజ్యత.

పరిహాస హాస వాసనలు నీ పాదము చేరుటయా ఘనత?
నే యమునాతీరమున రాసక్రీడల తేలుటయే భావుకత.

"అష్టాక్షరీ" ఆనందాబ్ధి ఓలలాడుటయా ఘనత?
దుష్టుడైన నన్ను నీ మ్రోల నిలబెట్టుటయే పరమార్థత.

నవవిధ భక్తుల జగములు నిన్ను కొలుచుట ఘనత,
**నే**
అనవతర భక్తిని "భజరె నంద బాలం" అనుటయె ధన్యత.

"శ్రీ కృష్ణ నిరవధిక కరుణామృత ప్రాప్తిరస్తు".

Thursday, August 15, 2019

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

వందనం

===========

అంబ వందనం  జగదంబ వందనం
సంబరాన కొలువుతీరె శక్తి వందనం
భవతారిణి భగవతి భక్తి   వందనం.

పారిజాత అర్చనల  పాదములకు వందనం
పాపనాశిని పావని  పార్వతి  వందనం.

గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం
గణపూజిత గుణాతిశయ  గౌరి  వందనం.

ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం
ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ  వందనం.

అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం
గిరితనయ విరిపూజిత దుర్గ  వందనం.

విదుషీమణి అలంకృత  మణిమేఖలకు వందనం
అఖిలాండపోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ  వందనం.

భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం
శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక  వందనం.
 
సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం
పరిపాలిని శుభకారిణి గాయత్రి  వందనం.

 త్రయంబక రాణి భవాని కంబుకంఠమునకు వందనం
సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి   వందనం

బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం
లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి  వందనం

బీజాక్షర పూరిత ఓష్ఠమునకు వందనం
పూజా సేవిత  వారణాసి విశాలాక్షి వందనం
 
ముక్తిప్రదాత యోగశక్తి వక్త్రమునకు వందనం
భావ ప్రవాహ భాషా ప్రదీప  వాగ్దేవి  వందనం

నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం
ఆశ్రమవాసుల ఆరాధ్య రాజ రాజేశ్వరి  వందనం

తపోధనుల తల్లి నీ కపోలములకు వందనం
కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబిక  వందనం

సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం
స్తోత్రప్రియ మూర్తిత్రయ త్రిపురసుందరి  వందనం

మణికుండలముల మెరయు కర్ణములకు వందనం
శ్రుతి స్మృతి వినుత విరాజిత అపర్ణ  వందనం

ఫాలలోచనుని రాణి ఫాలమునకు వందనం
పాలాభిషేక ప్రియ నందిని కాత్యాయిని  వందనం

అక్షయ ప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం
లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయిణి  వందనం

క్లేశహరిణీ పరిమళ  కేశములకు వందనం
వాసవాది వినుత కేశవ సోదరి  వందనం

సంకటనాశిని పొంకపు మకుటమునకు వందనం
కింకరపాలిని శుభగాత్రి మహిషాసుర మర్దిని  వందనం

  **************
అథాంగ పూజనము- అపరాధ క్షమాపణము
ఆపాదమస్తక వందనము- ఆపాత మధురము

అంబవందనం  జగదంబ వందనం 


Friday, August 9, 2019

HAPPY INDEPENDENCE DAY

72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
********************************************
శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా
చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక
 .
అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము
మడమతిప్పుటెరుగని మన నాయకుల వ్యూహము
భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ
"తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను
కశ్మీర సిందురమే" కాషాయపు రంగు."
 ********
బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు
తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా
"వందేం అహింసా పరమో ధర్మ:" అను
శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".
 *********
పంచభూతములు శుచిగ, పంచభక్ష్య రుచులుగ
కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా
"సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను
పచ్చతోరణపు కుచ్చు, మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు."
************
నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో
వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో
ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో
జనగణమన గళముతో, జనగణముల మంగళముతో
"జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో
కన్నులపండుగగా కశ్మీర ప్రాంగణములో
కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో
ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక.
******************
అమ్మలార రండి రండి-అయ్యలార రారండి
పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి
శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ
శ్రీ రవీంద్ర నాథుడు, శ్రీ మహమ్మద్ ఇక్బాలు
ఎందరో మహనీయులు కొలువుదీరి ఉన్నారు
 *************
"72 వ స్వాతంత్ర జెండాను ఎగురవేద్దాము
అజెండాను తిరిగి వ్రాద్దాము
దేశభక్తి గీతాలను ఆలపిస్తుంటే వారు
ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో,
దేశభక్తి చేతలను ఆచరిస్తుంటే వారు
ఆశీర్వదిస్తారు హర్షాతిరేకముతో.

       
జైహింద్


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...