Tuesday, June 30, 2020

OM NAMASIVAAYA-98


  ఓం నమః శివాయ-38
  *********************

 అంతా ప్రకాశమే నేనంటూ ఆర్భాటము చేస్తావు
 అభిషేకములు జరిగేవి అంతంత మాత్రమేగ

 ఋషుల తపోశక్తులను సర్పములుగా మలిచావు
 నాగాభరణుడనంటు సాగదీస్తు ఉంటావు

 ఋషిపత్నులపై శంకవేస్తు పులిని పుట్టించావు
 వ్యాఘ్రేశ్వరుడను అంటు గుడిని కట్టించావు

 పసిడిబిల్వహారములతో పరిచయము అవుతావు
 తెరచాటుగ కథలను దొంతెరలుగ నడుపుతావు

 కొమ్ములున్న వారమంటు నెమ్మది తీసేస్తావు
 కాళ్ళులేని వాడివంటు ముళ్ళు గుచ్చమంటావు

 నిన్ను కొలుచు పతంజలికి నిలువెల్ల పరీక్షలని
 మొక్కుటెందుకటర నిన్ను ఓ తిక్కశంకరా.


 ఆ-సమస్తాత్- ఆ అంటే అంతట.కాశము-వెలుగు.అంతట వెలుగుతో నిండినది ఆకాశము.శివుడు అది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు కాని అక్కడ తనకు (మూలవిరాట్) రోజు అభిషేకము చేయరని మాత్రము చెప్పుకోడు.ఋషుల యజ్ఞ ఫలమును సర్పములుగా మార్చునట్లు వారిచే చేయించి,వాటిని తాను ఆభరణములుగా ధరిస్తాడు.ఋషిపత్నులపై ఋషులకు అనుమానమును కలిగించి వారిచే ఒక పులిని సృష్టింపచేసి,దాని తోలుతో ఒక వస్త్రమును-ఆసనమును చేసుకొన్నాడు.మూడు స్వరూపాలు-ఐదు మండపాలు అని గొప్పలేకాని,తెర వెనక నక్కి కథలను బాగానే నడిపిస్తాడు.అందుకేగా పాపం నంది విజ్ఞతను మరచి పతంజలిని కొమ్ములు లేనివాడని ఎగతాళిచేసాడు.మూడుకాళ్ళ భ్రంగి కాళ్ళులేనివాడవంటు పదునైన మాటలతో బాధించాడు.శివుడు తాను సరిగా ఉండడు.తన దగ్గరనున్నవారిని సత్ప్రవర్తనతో నుండనీయడు.-నింద.

కాళము నమః శివాయ-కాశము నమః శివాయ
శంకలు నమ: శివాయ-శంకర నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


  " నమో రుద్రేభ్యో యేంతరిక్షే  యేషా వర్షమిషవత్" రుద్రము. 

  అంతరిక్ష స్వరూపమైన సదాశివా అనుగ్రహమును వర్షింపుము నీకు నమస్కారములు.

   ఋషుల అహంకారమును నిర్మూలించి,పతంజలి మహర్షి యొక్క భక్తిని-భాషా పటిమను లోక విదితము చేస్తూ అనేకానేక అద్భుత గ్రంధములను మనలకు అనుగ్రహించిన అవ్యాజ కరుణాసాగరా-అంబికాపతి అనేకానేక నమస్కారములు.స్తుతి.


   ఏక  బిల్వం శివార్పణం. 






Monday, June 29, 2020

OM NAMA SIVAAYA-97


  ఓం  నమః శివాయ-39
 *********************
గుట్టలిచ్చు ఆసనమున కుదురుగ కూర్చుంటావు
చెట్లు చేయు అభిషేకము చెలిమితో స్వీకరిస్తావు

మిణుగురుల కదలికలను దీపములనుకుంటావు
పూలగాలి తాకగానే పరవశించిపోతావు

షట్పదీ ఝంకారము స్తోత్రములని అంటావు
షడక్షరీ మంత్రమంటు సంతసించి పోతావు

పిట్ట పారివేయు పండు ప్రీతి నైవేద్యమంటావు
ఉట్టి చేయి చూపిస్తే సుగంధతాంబూలము అంటావు

అడవిలో నెమలి నాట్యము మదర్పితము అంటావు
ఉప్పుమూటలాడుతుంటే గొప్పవాహనమంటావు

షోడశోపచారములా ఇవి నిషేధ అపచారములని
గ్రక్కున  ప్రశ్నించవేరా? ఓ తిక్క శంకరా.


 శివుడు పధ్ధతి లేని పనులను తనకు చేయు షోడశోపచారములని భ్రమపడుతుంటాడు.రాళ్ళతో కఠినముగా నున్న శిలను చూపించి ఇది నీకు ఆసనమనగానే,సరేనని కుదురుగా దానిమీద కూర్చుంటాడు.రాళ్ళుగుచ్చుకుంటాయని అనడు.చెట్టు తనపై బడిన మంచును దులుపుకుంటు చమత్కారముగా వృక్షరూపమున నున్న శివా! నీకు నేను అభిషేకము చేస్తున్నాను అంటే,నిజమనుకుంటాడు.మినుకుమినుకుమనుచున్న మిణుగురులను చూసి అవి తమకు దీపసేవ చేస్తున్నాయని భ్రమపడతాడు.పూలసువాసన గాలివాటమునకు వస్తే,అగరుధూపమును వేసాయంటాడు.మకరందమునకు పూవును చేరు తుమ్మెద ఝంకారము చేస్తుంటే తన కొరకు షడక్షరీ స్తోత్రమును ఆలపించుచున్నదంటాడు.పండును ముక్కున కరచుకొనిన పిట్టనోటి నుండి అనుకోకుండా పండు జారి క్రింద పడితే తనకు పిట్ట నైవేద్యమును సమర్పించినదని సంతసపడతాడు.ఆకు-వక్క-సుగంధద్రవ్యములకు బదులు కొన్ని అక్షింతలనుంచగానే తాంబూలపరిమళములకు పరవశించిపోతాడు. ఎక్కడో  అడవిలో నాట్యముచేయుచున్న నెమలిని చూపిస్తు నాకు నాట్యసేవ చేస్తున్నదని,తండ్రి కొడుకును వీపుమీద ఎక్కించుకొని ఉప్పుమూట ఆడుతుంటే తనకు వాహనముగా మారిన భక్తుడని మురిసిపోతుంటాడు.యాదృచ్చికముగా జరిగే పనులను యద్యత్ కర్మ కరోతి సర్వం అఖిలం శంభో తవారాధనం" అనగానే నిజమనుకునే అమాయకుడు శివుడు-నింద.


 కొండ నమః శివాయ-బండ నమః శివాయ
 భ్రమయు నమః శివాయ-భ్రమరం నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

 "నమః కిగ్ ం శిలాయచ క్షయణాయచ" రుద్రం.

 చిన్నచిన్న రాళ్ళుగల ప్రదేశములందును-నివాసయోగ్యమగు ప్రదేశములందుండు రుద్రునకు నమస్కారములు.

 ""ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
   ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో
   త్వయైవ క్షంతవ్యాశివ మదపరాధాశ్చ సకలాః
    ప్రయత్నాత్ కర్తవ్యం మదవన మియం బంధుసరణిః"
  శివా నీవుదీన బంధువుగా పేరుపొందినవాడవు  .నేను కడు దీనాతిదీనుడను కనుక నన్ను రక్షించుటయే బంధురీతి-స్తుతి.

 ఏక బిల్వం  శివార్పణం.



Thursday, June 25, 2020

OM NAMA SIVAAYA-96


 ఓం నమ@ శివాయ-96
 ***************
 కొంతమంది రుద్రులుగా భూమిమీద సంచరిస్తూ
 తినకూడని ఆహారము తినిపించేస్తుంటావు

 మరికొంతమంది రుద్రులుగా గాలిలో విహరిస్తూ
 ఆయాసము-ఉబ్బసము విజృంభింప చేస్తావు

 ఇంకొంతమంది రుద్రులుగా నీటిలోన చేరుతూ
 క్రిమికీటక జలములతో వ్యాధులు పెంచేస్తావు

 కొంతమంది రుద్రులతో గగనములో దాగుతూ
 అతివృష్టి-అనావృష్టి నష్టము చేస్తుంటావు

 ఆయుధమవసరములోని యుధ్ధమని అంటావు
 అపచారము సవరించే పరిహారము అంటావు

 సకలమును సన్స్కరించు పధ్ధతి యేనా ఇది?
టక్కరి కొక్కెరవటర నీవు ఓ తిక్క శంకరా.


 .

 భువనం నమః శివాయ-గగనం నమః శివాయ
 దండన నమః శివాయ-దండము నమః శివాయ.

  శంకరుడు అనేకానేక రూపములను తనలాగ ఉండువారిని సృష్టించి,వారిని నింగి-నేల-జలము మొదలగు పంచభూతములనే ఆయుధములుగా మలచుకొని,వాటి ప్రభావము చేతనే జనులను సదాచార పరులను చేయమంటున్నాడు.ఈ ప్రణాళికలో జనులు వ్యాధిపీడితులుగా,ఆకలి బాధితులు గా మారి,పశ్చాత్తపడి సన్మార్గమున నడిచేవారిని,క్షమిస్తూ,పధ్ధతి మార్చుకోని వారికి ముగింపు తెస్తు,నిర్దాక్షిణ్యముగా శివుడు ప్రవర్తిస్తున్నాడు-నింద.

" యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్"  రుద్రనమకం.

 ఏ రుద్రులు భుజింపదగిన అన్నములయందును,త్రాగదగిన క్షీరాదులయందును ఉన్నవారలయి భుజించు పాపులగు జనులను,త్రాగునట్టి జనులను ధాతువైషమ్యమును కలిగించి వారి పాపాలకు దగినట్లుగా నానా విధంబుల బాధించుచున్నారో,వారల ధనుస్సులను వేయి యోజనముల దూరముగా పెట్టుము.


భువనం నమఃశివాయ-గగనం నమః శివాయ
రుద్రులు నమః శివాయ-భద్రత నమహ్ శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

  " దశ ప్రాచీ దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచిః"

 రుద్రము-(ప్రాచీ-తూర్పు-ప్రతీచీ-పడమర-ఉదీచె-ఉత్తరం-దక్షిణా -దక్షిణం)

 నాలుగు దిక్కులు-నాలుగు మూలలు-ఊర్థ్వము-అథో దిక్కు పది తానై పరిపలించు పరాత్పరునకు పదివేళ్ళని కలిపి నేను చేయు నమస్కారములను స్వీకరించి,మనలను ఆయుధములు లేకుండ బాధించే రుద్రుల నుండి కాపాడును గాక.

 సాధకులు " నమో రుద్రేభ్యోః అంటు చేయు వాచక నమస్కారములకు,తేభ్యోః అను శబదముతో చేయు మానసిక నమస్కారములకు,పదివేళ్ళను ముకుళించి చేయు కాయిక నమస్కారములకు ప్రీతి చెంది పరమేశ్వరానుగ్రహము మనలనందరిపై ప్రసరింప చేయును గాక.


 సదాశివుడు తన రుద్రుల ద్వారా సదాచార సంపన్నులుగా అందరిని మలచుటకు అనుగ్రహించుటకు అనేకానేక రుద్రరూపములలో విశ్వపాలన చేస్తున్నాడు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.



Wednesday, June 24, 2020

OM NAMA SIVAAYA-95

 ఓం  నమ: శివాయ-32
  ********************

కాళ్ళుజారతాయని చూడకుండ నీళ్ళూ పోస్తుంటావు
తుడిచేందుకు బట్ట వేస్తే దానిని తడిపేస్తావు

 ఏనుగులు కొలిచాయాని బాగానే చెబుతావు
 ప్రత్యక్షపూజ కోరితే వృక్షము కమ్మంటావు

 అప్పులింగేశ్వరుడనంటు గొప్పలెన్నో చెబుతావు
 పప్పన్నానికి మాత్రము ఒప్పుకోను అంటావు

 గురువును నేను నీకు అంటు గౌరితో అంటావు
 అమ్మ శక్తిని కుదించి అఖిలాండేశ్వరి అంటావు

  నీళ్లమడుగుపైన కన్నులపండుగగా వెలిసావు
  తుళ్ళుచున్న ఆశలపై.నీళ్ళుజల్లుతుంటావు


 నీళ్ళదొరని నేనంటు భక్తుల పెళ్ళికి అనుమతించని
 ముక్కంటివి నీవటర ఓ తిక్కశంకరా.

  నీళ్ళమడుగులో నుండి( కావేరి జలము) ప్రకటింపబడిన శివుడు నీళ్ళతో ఆడుతు వాఈఇని కింద పారపోస్తుంటాడు.భక్తుల కాలుజారి పడతారని ఆలోచించడు.ఏనుగులు ఈ క్షేత్రములో తనను పూజించాయని
గొప్పలుచెప్పుకుంటాడు.శంభుడు అను యోగి ప్రత్యక్షపూజానుగ్రహమును కోరగా నేరేడు చెట్టుగా మారి తనను పూజించమన్నాడు.గౌరీదేవికి తాను గురువునని కనుక ఆమెను పెండ్లిచేసుకోనని చెప్పాడు.తాను చేసుకోపోతే మానె,ఎవరైన ఉత్సాహంగా పెళ్ళిముచ్చట్లను చేస్తే వాటిపై నీళ్ళుజల్లి నిరుత్సాహ పరుస్తాడు.అంతే కాదు తన క్షేత్రములో ఎవరైనా సరే కళ్యాణమును చేసుకోవటానికి అనుమతించను అని పట్టుబట్టి కూర్చున్నాడు.-నింద.






  జలము నమః శివాయ-జగము నమః శివాయ
  గురువు నమః శివాయ-గురుతు నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.






  జంబూపతే మాంపాహి-పాహి.జటాధారియే జలరూపియై జగమేలు శ్రీమత్ తీర్థము  స్వామి నివాసము.
జ్ఞానక్షేత్ర జగదీశా జయము జయము.

 తిరువనై క్కావల్ ఈశా శరణు శరణు.

             .ఇక్కడ స్వామికి అర్చకులు మధ్యాహ్నార్చనను అఖిలాండేశ్వరీ గా స్త్రీమూర్తిగా అలంకరించుకొని కపిల గోపూజను,స్వామి నివేదనలను సమర్పిస్తారు.అన్నాభిషేకము కన్నుల పండుగగా జరుపుతారు.శివరాత్రి ఉత్సవాలను మండలదీక్షతో జరుపుతారు.ఆ ఉత్సవాలలో అమ్మవారిని అయ్యవారివలె-అయ్యవారిని అమ్మవారివలె అలంకరించి ఆలయ ప్రాంగణములన్నీ ఊరేగిస్తారు.

 "నమః స్స్రోతస్యాయచ"

 రుద్రనమకం.

 స్రోతస్సులనగా దేహమునందలి రక్తనాళముగా కూడ అనుసంధానము చేసుకుంటే సకల హృదయ నివాసి యైన ఆ జలలింగేశ్వరుడు జగదానందమును కలిగించుగాక-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.









Friday, June 19, 2020

OM NAMA SIVAAYA-94


   ఓం  నమః  శివాయ-28
   **********************

 సారూప్యము-సామీప్యము సాంగత్యమునకు ఆశపడి
 నిర్హేతుక కృపనీదని నిన్ను సేవించాలని

 కొంచము అటు జరుగమంటే చోటులేదు అంటావు
 పోనీలే ఇటు జరుగమంటే వీలుకాదు అంటావు

 ఎటు కుదిరితే అటు జరుగమంటే గుటకలు మింగుతావు
 స్థపతిని నేనైనా స్థలమునకు అవస్థలంటావు

 నాలాంటాడొకడు నన్ను కదలనీయడంటావు
 బేలతనము చూపిస్తు జాలిలేక ఉంటావు

 ఇబ్బందులు పడుతూనే ఇరుకున కిక్కురు మనవు
 సిబ్బందులు చూస్తారని ఇసుమంత సిగ్గుపడవు

 సర్వ వ్యాపివన్న సాకుతో నొక్కుతున్న వానిని
 తొక్కివేయమేమిరా ఓ తిక్క శంకరా.


 శివుడు తను సర్వస్వతంత్రుడనని-సర్వవ్యాపినని చెప్పుకుంటాడు కాని నిజమునకు అటు-ఇటు కొంచమైనను కదలలేనివాడు.పక్కకు తిరగగానే శివునిలాగానే ఉండే మరో మూర్తి శివుని అటు-ఇటు కదలకు అని మందలిస్తుంటాడు.స్థపతి-అన్నిటిని స్థాపించువాడు అని పిలువబడుతున్నప్పటికిని,కొంచం స్థలమును నేను కూర్చునుటకు సంపాదించలేనివాడు.చేసేదేమి లేక తన పక్కనున్నవాడు ఏమిచెప్తే సర్దుకుంటూఇరుకులో ఇబ్బందిపడుతుంటాడుకాని వాణ్ణి పక్కకు తోయలేని వాడు.-నింద.

ఏకం నమః శివాయ-అనేకం నమః శివాయ
 సెల్వం నమః శివాయ- బిల్వం నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" నమః పూర్వజాయా పరజాయచ"

  రుద్రనమకం.

 ఒకే సత్-చిత్-రూపము హిరణ్యగర్భ రూపమున పుట్టినదిగను-ప్రళయ కాలమున కాలాగ్ని రూపమున పుట్టినదిగాను భాసించుచున్నది.ముందు పుట్టినది-చివరకు పుట్టినది అనుట దాని లీలయే.నిజమునకు దానికి చావు-పుట్టుకలు లేవు.సత్యం-జ్ఞానం-అనంతం బ్రహ్మ  సర్వకాల సర్వావస్థలయందు " నమఃస్తారాయచ" గా సంకీర్తింపబడుచున్నది.

 " సంసార సాగరాత్ సర్వ జంతూనాం తారయతీతి తారః" తరుణోపాయమే ఇది.

 ఈ సత్-చిత్-రూపము

 " సహస్రాణి సహస్ర శో యే రుద్రాధి భూమ్యాం"


దశ  రుద్రులుగా మారినప్పుడు దశాక్షరీ మంత్రముగాను,శత రుద్రులుగా మారినప్పుడు శతరుద్రీయ సంహితగాను,సహస్రరుద్రులుగా మారినప్పుడు సర్వలోకానుగ్రహ సకలదేవతా స్తుతిగాను సలక్షణమగుచున్నది.

   ఏక బిల్వం శివార్పణం.






   




Monday, June 15, 2020

OM NAMA SIVAAYA-93


  ఓం  నమః శివాయ-29
  *******************

 పాఠము నేర్పిస్తానంటు గూడుపుఠాణి చేస్తుంటావు
 ఒకరికొకరిమీది నుండి ఒకరి ఒద్దిక తీసేస్తావు

 బుధ్ధులు మారుస్తావు యుధ్ధము చేయిస్తావు
 బ్రహ్మ-విష్ణాదులను సైతము బరిలో దించుతావు

 అస్త్రముపై అస్త్రముతో ఆటలాడిస్తావు
 అవనీతలమును బొంగరముగ తిప్పుతుంటావు

 మార్తాండుని సైతము మరుగున దాచేస్తావు
 విస్పుటలింగములను ప్రస్పుటింపచేస్తావు

 అఖిలజగములను అతలాకుతలము చేస్తావు
 ఏమయ్యా! ఏమిటిది? అంటే శివమాయ అంటావు

 అగ్నిస్తంభముగా నీవు ఆవిష్కరింపబడుట,వారి
 రెక్కల కష్టమేరా ఓ తిక్క శంకరా.

ఎటుచూసిన తననె జగములు స్తుతించుటలో తానొక్కడే ముజ్జగములకు మూర్ధాభిషిక్తుడననుకున్నాడు.అహంకారముతో నిండిన ఆనందముతో సంచరించుచుండగా క్షీరసముద్రములో అనంత శయనుడైన మరో వ్యక్తి కనిపించాడి.తనకు నమస్కరించలేదని వాదనకు దిగాడు బ్రహ్మ అతనితిఎ.నేను నీ తండ్రిని అని హరి అంటే కాదు నేనే నీ తండ్రిని అని బ్రహ్మ హుంకరించాడు.వారి వాదన యుధ్ధమునకు దారి తీసి ముజ్జగములను గజగజలాడించింది.సకల దేవతలు సదా శివుని ప్రార్థించగా ప్రపంచ సౌభాగ్యమునకై ,వారి యుధ్ధమును విరమింప చేయుటకై జ్యోతిర్లింగావిర్భావము జరిగినది.

 శివుడు కావాలనే అహంకార పరీక్ష అంటు బ్రహ్మ-విష్ణుల యందు మాయను ప్రవేశింపచేసి,వారిని విచక్షణారహితులుగా మార్చి వైరముతో ఘోర యుధ్ధమును చేయునట్లు చేసెను.ముల్లోకములను అల్లకల్లోలము చేసి,ఆపద్బాంధవుని వలె నటిస్తూ,తాను అగ్ని స్తంభలింగముగా ఆవిర్భవించెను.ప్రణాళిక శివునిది.ఫలితము శివునిది.ప్రయాస మాత్రము బ్రహ్మ-విష్ణువులది.-నింద




 కఠినం నమఃశివాయ-కరుణం నమః శివాయ
 కదనం నమః శివాయ-కథనం నమః శివాయ.



  స్మరణాత్ అరుణాచలే అభయం అభయం
  మననాత్ రమణ మహాన్ మధురం మధురం

  అరుణం పోట్రి- రమణం పోట్రి
  సెల్వం పోట్రి-బిల్వం పోట్రి  (మంగళం)

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

   సంపూర్ణ వివరణ చేయ లేని నా అశక్తతను స్వామి మన్నించి,మనలనందరిని ఆశీర్వదించుగాక.


 " ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పురత్
  జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు -వాంతామృతైః
  అస్తోకప్లుతమేక మీశ మనిశం రుద్రాయ వాకాన్ జపన్
  ధ్యాయేత్ ఈప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చ్చివం." పాతాళము నుండి ఆకాశము వరకు విస్తరించియున్న భువన భాండములందు జ్యోతి స్వరూపుడై ఎవరు ప్రకాశించుచున్నాడో,వానిని నా ఈప్సితసిధ్ధికొరకు (ఈప్సితము-సక్రమమైన కోరిక) త్రికరణశుధ్ధిగా ప్రార్థిస్తున్నాను-స్తుతి.




ఏక బిల్వం శివార్పణం






OM NAMA SIVAAYA--92



  ఓం  నమః  శివాయ-92
  ******************

 రూపులేని గాలిని అన్ని రూపులలో నింపుతావు
 అలసట లేకుందా కదులుతునే ఉండాలంటావు

 కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు
 కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు

 భూమాతను సైతము కాళ్ళతో తాడిస్తుంటావు
 కనికరము లేకుండా కదులుతుండాలంటావు

 ఆకాశము నేను చూడమంటు హడావిడి చేస్తావు
 వ్యోమకేశుడనని తాకుతునే ఉంటావు

 గలగలల జలము మీద జాలిలేక ఉంటావు
 గంగను బంధించి చుక్కచుక్క తాగుతావు

 పంచభూతములని చూడవు-పంచమంటుంటావు
 తక్కువేమైనదిర నీకు ఓ తిక్క శంకరా.



OM NAMA SIVAAYA-91



  ఓం  నమః  శివాయ-33
  ******************

 ఎడమకాలి చెప్పు కుంచె ఎంతో నచ్చేసిందా
 ఎరుకలవానిని వింతగ నెత్తికెక్కించుకున్నావు

 నాయనారు నిర్లక్ష్యమునకు కోపము వచ్చేసిందా
 పాతగోచి కోసము ఎంతో పేచీ పెట్టావు

 లింగధారుల నియమములు సాంతం కట్టేసాయా
 కుంచము నీవనగానే మంచిది అనుకున్నావు

 వంకర పరీక్ష చేయాలను తలపొచ్చిందా
 వంకయ్య గొడ్డుటావు పాలకు అడ్డుచెప్పకున్నావు

 తిలకవ్వకు తికమకలు చూపాలనిపించిందా
 కౌగిలించుకొనగానే  మగవానిగా మార్చావు



 మిక్కిలి ప్రేమయని మక్కువ చూపిస్తానంటు
 చిక్కులుపెడుతుంటావురా ఓ తిక్కశంకరా.



  ఎడమకాలి చెప్పును చీపురుచేసి,శివలింగార్చిత పత్రిని తోసివేసిన కన్ననికి శ్రీకాళహస్తి కొండమీద,గుడిని కట్టించి తన నెత్తిమీదుంచుకున్నాడు

( పెరియ పురాణం)  .పాతగోచీ ముక్క కోసం అమరనీతి నాయనారుతో ఎన్నో వింత పేచీలు పెట్టినాడు.(బసవ పురాణ భక్తులు)ఒక లింగధారుల గుంపు దూర ప్రయాణమును చేయుచు,పూజా సమయమైనందున ఒక చోట ఆగి,శివలింగమునకై వెతుకగా వారికి కనపడలేదు.పూజా సమయము మించుతున్నదని వారు,వారు తెచ్చుకున్న ఒక బియ్యము కొలిచే కుంచమునకు శివుడని పేరుపెట్టి పూజిస్తే సరే కానిమ్మన్నాడు.వంకటయ్య అను కన్నడ భక్తుని ఇంటిలోని వట్టిపోయిన ఆవుపాలు తన పూజకు కావాలన్నాడు.అంతటితో ఆగాడా? అంటే అదీలేదు.తిలకవ్వ అను భక్తురాలు తనను వెంబడిస్తున్నవారి నుండి తనను రక్షించమని శివలింగమును పట్టుకుంటే,అదే అదనని ఆమెను మగవానిగ మార్చేసాడు.లోకరీతిని లోకువ చేసేవారిని రక్షిస్తూ,యుక్తాయుక్తములు మరిచినవాడు శివుడు.-నింద.

 

 కుంచము నమః శివాయ-మంచము నమః శివాయ
 చిక్కులు నమః శివాయ-దిక్కుయు నమః శివాయ


   శివాయ నమః ఓం నమః శివాయ


 " మార్గా వర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
   గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
  కించిత్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయితే
  భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తా వతంసాయతే".

  శివానందలహరి.

  మార్గమున నడిచి-నడిచి అరిగిన ఎడమకాలి చెప్పును తిన్నడు శివుని శరీరమును తుడుచుటకు కుంచెగను,పుక్కిటి నీటితో తడుపుతు దివ్యాభిషేకముగను,ఎంగిలి చేసిన మాంసపు ముక్కలను నైవేద్యముగా (యద్భావం తద్భవతి) సమర్పించి పునీతుడైనాడు.తక్కిన భక్తులు శివానుగ్రహముచే అసాధ్యములను సుసాధ్యములుగా పొంది ధన్యులైనారు.ఆహా! ప్రబలిన భక్తి చేయు ప్రదర్శనలను ఏమనగలము తండ్రీ నీ పితృ వాత్సల్యపు పీయూషములు తక్క.-స్తుతి.



Sunday, June 14, 2020

OM NAMA SIVAAYA-90


    ఓం  నమః  శివాయ-40
    ********************

 ఎప్పుడేమి అనిపిస్తే అప్పుడది చేస్తావు
 తప్పొప్పులు గమనించక పప్పులో కాలేస్తావు


 అంబ రెందు కన్నులను  ఆటగా మూసావు
 అంధకారములోనుండి  అంధకాసురుడుదయించాడు

 మూడో  కంటి అగ్గిని జలధిలో  దాచావు
 ఆ జలధిలో నుండి జలంధరడుదయించాదు

 కపాలమును గిల్లుటుకై గట్టిగ హుంకరించావు
 అతిభయంకరముగ కాలభైరవుడుదయించాడు.

 కుడి-ఎడమని చూడకుండ జటను విసిరికొట్టావు
 భద్రతనే మరిచిన వీరభద్రుడుదయించాడు

 హద్దు అదుపులేనివారి పనులను వద్దనవు నీవని
 ఒక్కటే నిష్ఠూరములుర ఓ తిక్కశంకరా.


 శివుడు తనకు ఏ పనిచేయాలనిపిస్తే దానిని ఆలోచించకుండా చేసే తొందరపాటు స్వభావము కలవాడు.కనుకనే అంధకాసురుడు-జలంధరుడు-కాలభైరవుడు-వీరభద్రుడు జన్మించారు.వారు యుక్తాయుక్తములను మరచి హింసాప్రవృత్తితో ముజ్జగములను గడగడలాడించారు.తిరిగి శాంతిని నెలకొల్పుటకు అంధకుని-జలంధరుని అంతమొందించవలసినది.మిక్కిలి కష్టముతో వీరభద్రుని-కాల భైరవుని శాంతింపచేసినారు.ఇదంతా శివుని నిర్వాకమే-నింద.

 జననం నమః శివాయ-జ్వలనం నమః శివాయ
 జగడం నమః శివాయ-జగము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


 " దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
   వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
   నారదాది యోగబృంద వందితం దిగంబరం
   కాశికా పురాధినాథ కాలభైరవం భజే"

   కాశీక్షేత్రపాలకా-కాలభైరవా నమోనమః

 దక్షారామ క్షేత్ర పాలక శ్రీమాన్ వీరభద్ర నమోనమః

 అంధకాసుౠడు -జలంధరుడు శివుని ప్రమథగణములై కొలుచుచున్నారని పెద్దలు చెబుతారు.

 భగవంతుని చేష్టల పరమార్థము బాహ్యనేత్రములకు అర్థముకాదు కాని అవి పరమ పురుషార్థములు.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.






Thursday, June 11, 2020

OM NAMA SIVAAYA-89


  ఓం నమః శివాయ-26
  ****************

 ప్రళయము చూస్తుంటావు-ప్రణవము చేస్తుంటావు
 అదృశ్యము చేస్తావు-పంచకృత్యమని అంటావు

 అల్లుడిని కానంటావు-ఇల్లరికము ఉంటావు
 సన్యాసిని అంటావు-సంసారిగ  ఉంటావు

 దయనీయుడనంటావు-దహించివేస్తుంటావు
 ఎవ్వడు వాడంటావు-ఎదిరించలేడనంటావు

 ఎడమకాలితో తన్నుతావు-మడమతిప్పనంటావు
 ఎడమకాలు ఎవరిదంటే-తడబడుతుంటావు

 నీవు చేయని శిక్షణను-నీవే చేసానంటావు
 అమ్మ చేయుచున్న రక్షణను-అంతా దాచేస్తావు

 మక్కువ అంటూనే అమ్మను-నువ్వు తక్కువగా భావించే
 కక్కూర్తి వాడవటర  నీవు  !     ఓ తిక్కశంకరా.


 శివుడు జగములు జలమున మునిగిపోతుంటే చేతకానివాడై కళ్ళుమూసుకొని జపము చేసుకుంటాడు.దక్షుడికి నేను ఇప్పుడు అల్లుడిని కానని,నమస్కరించకుండా,ఎప్పుడు కైలాసములోనే ఇల్లరికము ఉంటాడు.దయార్ద్రహృదయుడనని అంటూనే దహించివేస్తుంటాడు. ఎడమకాలితో శత్రువులను తరిమికొడుతు,మడమతిప్పని ధైర్యము కలవాడనని అంటాడు.సర్వము సతి చేస్తుంటే,దానిని చెప్పకుండా అంతా తానేచేస్తున్నానని చెప్పుకుంటాడు.ఎడమకాలి ప్రసక్తి వస్తే తడబడుతుంటాదు-నింద.

 

  శివాయ నమః శివాయ-శివాని నమః శివాయ
  సన్నుతి నమః శివాయ-సద్గతి నమఃశివాయ

  నమః శివాయ నమ: శివాయ ఓం నమః శివాయ.



 "ప్రపంచ సృష్ట్యున్ముఖ  లాస్యకాయై
  సమస్త సంహారక తాండవాయై
  జగజ్జనన్యై జగదేక పిత్రే
  నమః శివాయైచ నమః శివాయ"

   అర్థనారీశ్వర స్తోత్రము.

 లలితనృత్యమును చేయు తల్లి పాదము-దుష్టతాడనము చేయు స్వామి తాండవ పాదము జగత్కళ్యాణకారకములైన సచ్చిదానంద స్వరూపమే.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.



 




OM NAMA SIVAAYA-88


  ఓం నమః శివాయ-88
  ********************
 ఉమ్మిపూసి మందు అనిన కిమ్మనక ఉంటాడు
 గుగ్గిలపు వాసనలకు ఉబ్బితబ్బిబవుతుంటాడు

 కుంటి గాడిదమీద కులుకుతు కూర్చుంటాడు
 మట్టిముంతకోసమని గట్టివాదులాడువాడు

 చెన్నప్పవ్వ బొంతను కప్పుకుని రోతగా ఉంటాడు
 రంగులు మారుస్తు ఎంతో పొంగిపోతు ఉంటాడు

 రాళ్ళు రువ్విన వాని ఆరళ్ళను తీరుస్తాడు
 బాణపుదెబ్బలను తింటు బాగుబాగు అంటాడు

 క్లేశహారిని అంటు కేశములను కోరుతాడు,
 కళ్యాణప్రదాతనని కళ్యాణము కానీయడు

 నవ్వులపాలవుతున్నా నవ్వుతూనే ఉంటాడని
 వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.


 సాలీడు పాకిన చోటంతా శివలింగమునకు పొక్కులు వస్తే,నక్క నాయనారు భార్య ఉమ్మివేసి అదే దానికి మందని అంటే ఆనందంగా స్వీకరించాడు.కలశ నాయనారు భార్య మంగళసూత్రమును తాకట్టు పెట్టి గ్రాసము తీసుకురావటానికి వెళుతుంటే సాంబ్రాణిని దానికి బదులుగా ఇచ్చాడు.చాకలి నాయనారు తన కుంటిగాడిదమీద మాసిన బట్టల మూతతో పాటు కూర్చోపెడితే వాహనపూజ అంటు వాహ్వా అన్నాడు.నీలకంఠ నాయనారుకు మట్టిముంతను దాచిపెట్టమని,అది చాలా మహిమాన్వితమైనదని,మాయమాటలు చెప్పి,దానిని మాయము చేసి,తిరిగి తనకు ఇవ్వలేదని గట్టిగా పోట్లాడాడు.సుచి-శుభ్రము అంటే తెలియని వాడుగా అందుకే చెన్నప్పవ్వ తన పాత కుళ్ళుకంపుకొట్టుచున్న బొంతను కప్పగానే,ఎంతో వెచ్చగా ఉందంటు వచ్చిపడుకున్నాడు.సక్కియ నాయనారు రళ్ళను గట్టిగా విసురుతుంటే దెబ్బతగులుతున్నా వాటిని పూలపూజగా అనుకొని నాయనారు కష్టాలను తీర్చాడు.అర్జునుడు బాణాలతో గట్టిగా కొడుతుంటే భలే బాగుందన్నాడు.అంతే కాదు.హవ్వ మరీ విడ్డూరము.కంచార నాయనారు కుమార్తె కళ్యాణమునకు వెళ్ళి వధువు కేశములను కోరాడు.పెళ్ళికూతురు జడను కోయించి తీసుకొనుటయే కాడు.ఏకంగా పెళ్ళిని చెడగొట్టుటలోను సిధ్ధహస్తుడు.మరేమనుకున్నారు.సుందరారు పుస్తె కట్టే సమయమునకు వెళ్ళి,వాడు తన బానిస అని పెళ్ళికానీయకుండా తన వెంట తెచ్చేసుకున్నాడు.ఎంతైన రంగులు మార్చే స్వభావమున్నవాదు కదా.కుంభకోణము దగ్గరనున్న ఆలయములో కళ్యాణ సుందరేశుని నామముతో రోజుకు ఐదారుసార్లు తన లింగపురంగును మార్చే చతుౠడు కదా ఏమైనా చేస్తాడు-ఎపుడైనా చేస్తాడు-ఎవరితోనైన చేస్తాడు.-నింద,

 అర్థి నమః శివాయ-దాత నమః శివాయ
 చింత నమః శివాయ-స్వాంతన నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

 దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
 దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
 హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమోనమో.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.


OM NAMA SIVAAYA-87


  ఓం  నమః శివాయ-37
 **********************

 సూర్యరశ్మి తాకిడికి పారిపోయిన నాచు
 జారినాడులే అంటూ చేరుతోంది చెరువులోకి

 చుట్టివేసి ఉందని ముట్టుకోలేననిన నీరు
 పరిచారులే పదమంటూ చేరుకుంది చాపకిందికి

 .పరిక్రమ సమయమని..ఆక్రమించలేనన్న చీకటి
  మళ్ళీ మామూలేగా అంటు ఆవరించింది మనసులోకి

  విబుధగోష్టి వేళయని బంధనాలనిన వికృతి
 .వివరము తెలియలేదంటువిస్తరించిందిమనిషిలోకి

  పిశాచాలతో ఆడే పిచ్చివాడు శివుడని,పునరావృత
  మాయను పూర్తిగా మాయము చేయలేనివాడని


కచ్చగా వచ్చి మమ్ము గుచ్చుతుంటే  హెచ్చరించలేవని
నిన్ను తక్కువ చేస్తున్నారురా ఓ తిక్కశంకరా



శివుడు పూర్తిగా దేనిని తొలగించలేడు.కనుకనే నాచు మరల నీటిలోనికి ప్రవేశించగలుగుతోంది.మాయ చాపకింది నీటిలా మనకు తెలియకుండానే మన దరిచేరుతుంది.ధ్యానము ధ్యాసను కుదురుగా ఉండనీయదు.మనసును చలించేలా చేస్తుంది.సద్గోష్ఠి ముగియగానే విపరీత భావనలు సమయము చూసి స్వాధీనము చేసుకుంటుంది.వీటన్నికి కారణము శివుని అసమర్థతే.-నింద.

 ప్రకృతి  నమః శివాయ-వికృతి నమః శివాయ
 రాకయు నమః శివాయ-పోకయు నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 " నమః ఆతార్యాయచ-ఆలాద్యాయచ." రుద్రనమకం.

 సంసారమునుండి తరింపచేయు తత్త్వజ్ఞానము లభించినను ,దానిని ఉపేక్షించి,మరల సంసార భ్రాంతిని పొందుటయే ఆతారము.(ఆతార్యాయచ).సంపూర్ణముగా కర్మఫలములను పొందువాడు  ఆలాదుడు.అవి దైవకృపచే పరిహరింపబడవు.(ఎవరికి)

 "అసారే సంసారే నిజభజన దూరే జడథి తతా
 భ్రమంతం పరమకృపయా పాతుం"-శివానందలహరి

 సారము లేని సంసారములో మతిలేక తిరుగుచున్న నన్ను మాయ అవకాశము చూసి మరల మరల ఆవరించుచున్నది.నా ప్రయత్న లోపమో-నీ ప్రసాదగుణ తాత్సారమో తెలియకున్నది.పరమేశా! అనుగ్రహించుటకు నాకంటే దీనాతి దీనుడు లేడు.నీకంటే వేరొక దీనరక్షకుడును లేడు.సత్వరము మమ్ములను అనుగ్రహింపుము సదాశివా.నీకు నమస్కారములు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం
..




.







Monday, June 8, 2020

OM NAMA SIVAAYA --86


 ఓం నమః శివాయ-86
 **************

 గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు
 అంధకుని  రక్షించగ భృంగిగా మార్చావు

 దక్షుని జీవింపచేయ మేకతలను పెట్టావు
 బ్రహ్మ తలలు పడగొడుతు భిక్షపాత్రలంటావు

 నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు
 వ్యాఘ్రపాదుడంటు కాళ్ళకు పులిపాదములతికిస్తావు


 తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు
 వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు

 నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో
 తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో

 తలకొక మాదిరిగ తరియింపచేయువాడనంటు,వారిపై
 ఉక్కుపాదమెందుకురా ఓ తిక్కశంకరా.

 శివుడు తాను తలరాతలను మారుస్తానంటూ,చేతకాక వారి తలను తీసి వేరొక తలను అతికిస్తుంటాడు.అంతటితో ఆగకుండా కాళ్లకు పులిపాదములను అతికిస్తాడు.భ్రింగికి మూడుకాళ్ళు కలిగిన వికృత రూపమునిచ్చాడు.బ్రహ్మకల్పము ముగుసిన వెంటనే వాని తలలను దండగా గుచ్చుకొని వేసుకొని మురిసిపోతు,నేను తలమానికమైన వాడినని గొప్పలు చెప్పుకుంటాడు.-నింద.

 కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ
 శర్భం నమః శివాయ-శర్వుడు నమః శివాయ

నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" భ్రంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా
  హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేణా చాదృతః
  సత్పక్షో సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
  రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుః."

   శివానందలహరి.

 భృంగి ఇష్టపడునట్లుగా నాట్యము చేయువాడును,గజాసురుని మదమణచిన వాడును,ఢక్కా నాదమును చేయువాడును,శుధ్ధస్పటిక తెల్లదనమును కలవాడును,నారాయణునకు ప్రియమైన వాడును,సజ్జనులను కాపాడుటలో మంచిమనసున్న శ్రీశైల భ్రమరాంబిక పతి శరణు-శరణు.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.

.

OM NAMA SIVAAYA-85


  ఓం  నమః శివాయ-85
  **********************
గట్టిగానే వారు నిన్ను ప్రార్థించారనుకుంటు,అందరిని
నెట్టుకుంటు వచ్చినీవు మట్టిలింగమవుతావు

 సుతిమెత్తని బాలుడని వెతలను తొలగించాలంటు,అద్భుత
 కతలను అందీయగ వచ్చినీవు సైకతలింగమవుతావు

 అఖిలజగములకు మేము అమ్మా-నాన్నలమంటు,చక్కని
 వలపుచాట వచ్చినీవు తెలుపు-నలుపు లింగమవుతావు

 ఆకలిదప్పులతో నున్నారని-పాలధారలివ్వాలని,ఆగని
 ఆతురతతో వచ్చినీవు అమృతలింగమవుతావు

 హుటాహుటిని హడావిడిగా హనుమ పట్టుకొచ్చాడని,భళిరే
 మెచ్చుకుంటు వచ్చినీవు అనేక లింగములవుతావు

 లింగము అంటే గుర్తు అని-బెంగ తీరుస్తుందని వస్తే
 ఒక్క గుర్తునుండవురా ఓ తిక్క శంకరా.

 సివుడికి తొందర ఎక్కువ తన రూపమును గురించి,దానికి సంబంధించిన సంకేతమైన లింగము గురించి ఒక నిర్దిష్టమైన ప్రకటనమును చేయలేనివాడు.కనుకనే ప్రార్థనలకు ఉబ్బి తబ్బిబ్బై, అందరిని నెట్టుకుంటు వచ్చి మట్టిలింగముగా వెలిసినాడు.ఆ విషమును గమనించకుండ మార్కండేయుని అనుగ్రహించుటకై ఇసుకలింగముగా మారి పూజలందుకునే వాడు.ద్రాక్షారామ భీమేశ్వరుని భక్తుడు నీలో మీ ఇద్దరిని చూడాలని ఉందంటే సరే నని తాను అమ్మ తెలుపు-నలుపు రంగులలో ( ఒకేలింగముగా) దర్శనమిస్తానన్నాడు.ఉపమన్యు అను బాలభక్తునకు పాలను అందించుటకు బాణమును వేసి,అక్కడే క్షీరలింగముగా ఉండిపోయాడు.రామేశ్వర పూజకై హనుమంతుడు అనేక లింగములను పట్టుకురాగ కీసరగుట్టలో అనేక లింగములుగా అనుగ్రహిస్తున్నానంటాడు.ఒక చోట పొట్టిగ,మరొకచోట పొడుగుగా అసలు ఒక పధ్ధతిలేకుండ కనిపిస్తు నేనే శివుడనని,ఈ పలురకములైన లింగములు నా గురుతులంటు,భక్తులకు సంశయమును కలిగించే వాడు శివుడు-నింద.

  మట్టి నమః శివాయ-ఇసుక నమః శివాయ
  రంగం నమః శివాయ-లింగం నమః శివాయచ.

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 "నమ ఇరిణ్యాచ ప్రపధ్యాయచ" రుద్రనమకం. చవిటినేలలందు-నడుచు మార్గములను తయారుచేయు రుద్రునకు నమస్కారములు.దానికి ఉదాహరణయే కంచిలోని ప్రథివీలింగము.నమోనమః. నమ స్సికత్యాయచ" ఇసుకరూపములో నున్న ఈశ్వరా ప్రణామములు.అద్వైతమునే ద్వైతముగా చమత్కరించే అర్థనారీశ్వరా అభివాదములు.లోకములోని ఏకానేక స్వరూపా అనేకానేక నమస్కారములు.సర్వము-సకలము నీవై నిఖిలజగములను సంరక్షించి సదాశివా సకల శుభములను చేకూర్చుము.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.










































Sunday, June 7, 2020

OM NAMA SIVAAYA-84


  ఓం నమః శివాయ-84
  ****************

 నీ చేతల మంచి-చెడులు నీ నిర్ణయమని అంటుంటే
 నిరపరాధులను నీవు బాధిస్తున్నావంటున్నవి


 శిలను శిల్పముగా మలచే స్థపతి అని నీవంటే
 తప్పుచేయకున్నను తప్పవు ఉలిదెబ్బలు అంటున్నది శిల

 నీటిని నివ్వెరపరచే నిషాదుడను అని నీవంటే
 తప్పుచేయకున్నను తప్పదు వలకాటు అంటున్నది చేప

 అడవిని సంరక్షించే మృగయుదను అని నీవంటే
 తప్పుచేయకున్నను తప్పదు శరమువేటు అంటున్నది మృగము

 ప్రళయమునే చూడగలుగు ప్రబుద్దుడను అని నీవంటే
 ముంచుతున్న ఆపదను రక్షించలేని సాక్షివి అంటున్నది ప్రళయము

 నిర్దయతో హింసిస్తు నిష్కళంకుడను అని నీవంటే
 నిక్కమనుకోరురా ఒక్కరైన ఓ తిక్కశంకరా.


 శివుడు తాను శిల్పినంటు-జాలరినంటు-వేటగాని నంటు-ప్రళయసాక్షినంటు చెప్పుకుంటు ఎన్నో ఎందరినో నిరపరాధులను అమాయకులను శిక్షిస్తున్నాడు.-నింద.

 శరము నమః శివాయ-శరణము నమః శివాయ
 జననము నమః శివాయ-మరణము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ



" యోగక్షేమ ధురంధరస్య సకలశ్రేయః ప్రదోద్యోగినో
  దృష్ట్వాదృష్ట్వామతోపదేశకృతినో బాహ్యంతరవ్యాపినః
  సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కింవేధితవ్యం మయా
  శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యన్వహం."

  శివానందలహరి.

 సర్వజీవుల యోగక్షమభారమును మోయు సదాశివా సకలము నీ అధీనము.
 " నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః" రుద్రనమకము.

 పరమేశ్వరుడు జగములన్నింటిని తనలో నిక్షిప్తము చేసుకొని,సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములను ఐదు పనులతో పునరావృతము చేస్తున్నాడు.స్థపతి అను పదము శిల్పి అను అర్థములో వాడుచున్నప్పటికిని,సర్వమును స్థాపించినవాడు అను మరొక అర్థమును కూడ పెద్దలు చెబుతారు.పంచకృత్య నిర్వహణలో జీవులు తమతమ కర్మానుసారముగా సుఖదు@ఖములను పొందుతు,కొత్త శరీరములను ధరించుచున్నవి.కొట్ట శరీరమును ధరించవలెనన్న శిధిలశరీరమును విడనాడవలసినదే కదా.
జగ్ కర్తా-జగ్భరతా-జగ్ హరతా తుం పరమేశా!పంచకృత్యములను సమభావముతో నిర్వర్తించు సదాశివా సకలజగములను సంరక్షింపుము.

 ఏక బిల్వం శివార్పణం.


Saturday, June 6, 2020

OM NAMA SIVAAYA-83


   ఓం నమః శివాయ-83
  ********************

 విర్రవీగు వారిపై వెర్రిప్రేమచూపుతావు
 స్వార్థపు అభ్యర్థనలను ప్రార్థనలని అంటావు

 అహంకార తపములకు సహకారమవుతావు
 ప్రీతిపాత్రములుగ అపాత్రవరములిస్తావు

 ఆలోచనన్నదిలేక అసురత్వమునాదరిస్తుంటావు
 నిర్లక్ష్యము కూడదంటు ప్రత్యక్షము అవుతావు

 అడిగినాడు అంటావు-అడుసు తొక్కుతుంటావు
 అదునుచూసి వారు అదుపుతప్పుతారు అనుకోవు

 గతితప్పిన ఫలితములతో గాబరపడుతుంటావు
 మేకను జయించావు-పులిని జయించావు

 మేకవన్నెపులులతో  తికమకపడుతుంటావు

 నక్కవినయములేరా అవి ఓ తిక్కశంకరా.


శివుడు తనను గురించి తపము చేశారని,ప్రత్యక్షమై,వారికి వరములను అనుగ్రహించవలెననుకుంటాదు.కాని వారు రావణుని వలె అహంకారముతో తపమాచరించుచున్నారో,స్వార్థముతో అనుగ్రహమును కోరుతున్నారో,లేక తానిచ్చిన వర ప్రభావమును తన పైననే పరీక్స్గితారో,వారి నిజ స్వభావమెటువంటిదో ఆలోచించలేడు-నింద.

 అసురులు నమః శివాయ-అమరులు నమః శివాయ
 వరములు నమః శివాయ-వగచుట నమః శీవాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

Friday, June 5, 2020

OM NAMA SIVAAYA --82


  ఓం నమః శివాయ-53
  ******************

 వైభవమను పేరజరుగు ప్రలోభములు నీ సేవలు
  నెత్తిన పోసిన నీటిని నాదని గంగ తాగేస్తోంది
 భక్తితో పోసిన పాలను పాములు కానిచ్చేస్తున్నవి
 చక్కెర-తేనెల తీపిని చీమలు పట్టేస్తున్నవి
 చందన ధారలు మొత్తము జాబిలి దాచేస్తున్నది

 జర్రున జారిన నేతిని విషము జుర్రుకుంటున్నది
 కురిసిన పూలకుప్పలను భ్రమరము కప్పేస్తున్నది

 రాలిన బూడిదరాశులకై లొల్లి వల్లకాడు చేస్తున్నది
 ఆరురుచుల ఆరగింపు నంది తనది అంటున్నది
 దొంగతనము నేర్పించిన దొంగలదొర,నీ సన్నిధి

 నిమిషములో నామనసు దొంగగ మారుతున్నది
 చక్కదము ఇదేనురా ఓ తిక్కశంకరా.

   శివునికి అభిషేకము చేయు ద్రవ్యములను గంగ,పాములు,జాబిలి,చీమలు,విషము,తుమ్మెదలు,శ్మశానము,నంది అవి శివుని అర్పణము అని తెలిసినను పెద్దలోభమునకు వశులై తాము తీసుకుంటూ,స్వామి స్వామికి అందకుండ చేస్తున్నది.ఒక విధముగా ఇది చోరత్వమే.వాటి చోర స్వభావమునకు కారణము అవితస్కరపతి దగ్గర ఉండటమే.అంతేకాదు,శివుడు తనను సమీపించిన భక్తుని మనసులో కూడ చోరత్వమును ప్రవేశపెడుతున్నాడు.---నింద.

  దొంగయు నమః శివాయ-దొరయు నమః శివాయ
  తప్పు నమః శివాయ-ఒప్పు నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


 " స్వేరాననం చంద్రకళావతంసం గంగాధరం శైలసుతా సహాయం
   భస్మ భుజంగ భూషణం ధ్యాయత్ పశూనాం పతిమీశితారం."

   చిరునగవుతో కూడిన మోముకలవాడును,చంద్రకళ శిరోభూషణముగా కలవాడును,గంగను ధరించువాడను,పార్వతితో కూడినవాడును,మూడుకన్నుల వాడును,విభూతియు-పాములు ఆభరనములుగా గలవాడును పశువులకు పతియైన ఈశ్వరుని త్రికరణములతో ధ్యానించెదను.

   "ప్రలోభాద్యైరర్థాహరణ వరతంత్రో ధనిగృహే
   ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే"  శివానందలహరి.

  దొంగలరాజగు ఓ శంకరా!నీవు మాపాపములను దోచుకొను దొంగవు అయినప్పటికిని కలుషితమైన నా మనసు నీ ప్రసాదమును స్వీకరించువానిని,అన్యముగా చింతించినది.దీనిని నేనెట్లు సహించగలను? కనుక ఓ దయాంతరంగా,దొంగతనమునకు ధనికుని ఇంట (విషయవాసనలను సంపదగల సంసారము నందు
) ప్రవేశింపగ ప్రయత్నించుచున్న సమయమున దానిని నీ అధీనములో నుంచుకొని నన్ను సంస్కరింపుము సదాశివా.

 ఏక బిల్వం శివార్పణం.













Wednesday, June 3, 2020

Om nama sivaaya-81





 ఓం నమః శివాయ-54
 ***************

 నీలిమేఘమే  నీవనుకొని నే చాతకమై చూశానురా
 నీలిగరళము నన్ను చూసి గేలిచేసినదిరా

 "సూర్యాయ-దక్షాధ్వర" అన విని చక్రవాకమై కదిలారా
  మంచుకొండ నన్నుచూసి గేలి చేసినదిరా

 చంద్రశేఖరుడవని నేను చకోరమై కదిలానురా
 వెన్నెల్లిక్కడెక్కడిదని మూడోకన్ను గేలి చేసినదిరా

 నటరాజువి నీవని నే నెమలిగా చేరానురా
 భృంగి కన్ను నన్నుచూసి గేలిచేసినదిరా

 శుభకరుడవు నీవని నే గరుడినిగా వాలానురా
 కంచిగరుడ సేవకు సమయము మించిదన్నారురా

 భ్రమలను తొలగించలేని భ్రమరాంబికాపతి,ఈ
 ఇక్కట్లేమిటిరా నాకు ఓ తిక్కశంకరా


 శివుడు తనదగ్గర మేఘము-వేడి-వెన్నెల-నాట్యము-ప్రభుతవము అన్నీ ఉన్నాయని,అవి తాను చెప్పినట్లు నడుచుకుంటాయని అంటాడు.కాని చాతకమునకు మేఘమునుండి వర్షమును ఇవ్వలేడు.చక్రవాకమునకు వేడిని ఇవ్వలేడు.చకోరమునకు వెన్నెలను అందించలేడు.నమలికి నాట్య మెలకువలను చెప్పలేడు.గరుడుని సేవలను స్వీకరించలేడు.-నింద.

 చాతకి నమః శివాయ-చకోరి నమః శివాయ
 ఎండ నమః శివాయ-వాన నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


  శివా అజ్ఞానపూరితమైన నా మనసు నిన్ను నిందించి ఆనందపడుతున్నది.సత్యమును అవగతము చేసుకొనుచున్న నా మనసు నిన్ను అర్థము చేసికొనుటకు ప్రయత్నించుచున్నది.

" హంసః పద్మవనం సమిచ్చతి యధా నీలాంబుదం చాతకం
  కోక: కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్థధా
  చేతో వాంచతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
  గౌరీనాథ భవత్పదాబ్జ యుగలం కైవల్య సౌఖ్యప్రదం"

      శివానందలహరి.

  హంస పద్మసరస్సును,చాతకపక్షి నీరునిండిన నల్లని మేఘమును,చక్రవాకపక్షి చంద్రుని ఏ విధముగా ప్రతిదినము ఇష్టపడతారో,అదేవిధముగా మోక్షమునకు
 దారిని చూపు  (జ్ఞానమార్గమునకు) నీపాదపద్మములయందు నా మనసు ఇష్టపడుచున్నది.కరుణామూర్తి కనికరించు తండ్రీ.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.

Tuesday, June 2, 2020

OM NAMA SIVAAYA-79

 ఓం నమః శివాయ-56
    *********

  అవిముక్తము అంటాదు-అనురక్తము అంటాడు
  అవసానము అంటాడు-ఆశ్రయము అంటాడు

  చూస్తూనే ఉంటాడు-గస్తీ కాస్తుంటాడు
  అదును చూసుకుంటాడు-అమ్మ ఒడిని ఇస్తాడు

  పెద్దనిద్ర తెస్తాడు-వద్దనే కూర్చుంటాడు
  మనిషి తోడు అంటాడు-మంత్రము వినిపిస్తాడు

  ఉపచారము చేస్తాడు-ఉసురును తీసేస్తాడు
  మరుజన్మలేదు అంటాడు-మమేకమే అంటాడు

  పిసరంత దయలేనోడు-మసి చేసేస్తుంటాడు
  మరుభూమిలో తిరుగుతాడు-మర్యాదస్తుడ వాడు


 సదాచారమసలు లేని సంకర చేష్టల వాడంటే
 కిక్కిరు మనవేమిరా ఓ తిక్కశంకరా.





 శివుడు చెప్పేదొకటి చేసేదొకటి.కాశేఏక్షత్రము గొప్పదని నమ్మపలుకుతాడు.ఎవరు వస్తారా అని ఎదురుచూస్తుంటాడు.వచ్చిన వానిని(నమ్మి) తిన్నగా కాటికి పంపిస్తాడు దగ్గరుండి మరీను నిర్దాక్షిణ్యముగా.ఉపచారములు చేస్తున్నట్లు నటిస్తూ ఊపిరిని తీస్తాడు తన పేరు మృత్యుంజయుడని గొప్పలు చెప్పుకుంటూనే మృత్యువుకు జీవులను అప్పగిస్తుంటాడు.తల్లి చెప్పిందని ఎందరినో పునర్జ్జీవుతులను చేసాడు కాని ఇక్కడ మాత్రము కసిగా వారి పార్ధివశరీరములను కాటికాపరిగా మారి మసిచేసేస్తుంటాడు.పైపెచ్చు వాడు నాలో కలిసిపోయాడు.ఇంక జనన-మరణ సంసారచక్రము వానిని బాధించదు అంటూ బడాయి మాటలు చెబుతాడు.మాటలు కోటలు-చేతలు మాత్రం ...తేనె పూసిన కత్తి శివుడు.-నింద.


 మంత్రము నమః శివాయ-మరణం నమః శివాయ
 నిర్వాకము నమః శివాయ-నిర్యాణము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.















 " నిన్నున్ నమ్మినరీతి నమ్మనొరులన్;నీకన్న నాకెన్న లే
   రన్నల్దమ్ములు తల్లితండ్రులు గురుండాపన్న స్సహాయుండు;నా
   యన్నా; యెన్నడు నన్ను సన్స్కృతివిషాదాంభోధి దాటించి,య
   చ్చినానంద సుఖాబ్ధి దేలచదో కదే? శ్రీకాళ హస్తీశ్వరా.

  ధూర్జటి మహాకవి.

 నీ కరుణాకటాక్షమే సలక్షణమైన శ్రీకాళహస్తీశ్వరునిగా శోభింపచేయుచున్న శివా! నీకంటె నాకు అన్నదమ్ములుగాని,తల్లితండ్రులుగాని,గురువులుగాని,కష్టాలలో ఆదుకొను ఆప్తులుగాని ఇంకెవరు లేరు. నన్ను ఈ సంసార విష సముద్రమును దాటించి,సత్ చిదానంద సముద్రములో ఓలలాడించు స్వామి.శరణు శరణు మహేశ్వరా.


  మోక్షద్వారము-జ్యోతిర్లింగ క్షేత్రమైన కాశీ పట్టణము శివుడు ప్రత్యేకముగా నిర్మించుకున్నది కాని బ్రహ్మ కల్పితము కాదు.కాశము(వెలుగు) తో నిండిన కాశీపట్టణమును ప్రళయకాలములో శివుడు తన త్రిశూలతో ఎత్తిపట్తుకుని ఉంటాడట.కాశ్యాంతు మరణం ముక్తి  ఆర్యోక్తి,.



 -




 ఏక బిల్వం శివార్పణం.


OM NAMA sIVAAYA-78


 ఓం నమః శివాయ-78
 *******************

 " ఊర్క్చమే-మసురాశ్చమే " అని చమకము అడుగుతోంది నిన్ను
  నేలలోనున్న కలిని శూలముతో తరిమేయమని

 చంద్రును అమృతధారలను చెలిమి కురిపించమని
 చక్కని సాగుబడికి సలిలమును ప్రవహించమని

 చరచర పాకుచు పాములను చేనును రక్షించమని
 అగ్గివేడి హరితమై ఆహారముగా మార్చమని

 ప్రమథగణమును ప్రమదముతో పంటలు పండించమని
 ఆదరముతో అమ్మను అన్నపూర్నగా తరలమని

 కలుపును అణిచివేసి పులును అందించమని
 ఆకలి అనేమాట పలాయనము చిత్తగించమని

 పనిపెట్తమని తనగిట్టలకు పరమేశా నీ ఎద్దుని
 దుక్కిదున్నమనవేరా ఓ తిక్కశంకరా.


రుద్రనమకములో శివుడు తననితాను "ఊర్యాయచ" భూమిని నేనే నని,దానినుండి ఉద్భవించిన శుష్కాయచ-హరిత్యాయచ  ఎండిన చెట్లు-పచ్చని చెట్లు కూడా తానేనని,అంతేకాకుండ వాటికి ఆ స్థితిని కల్పించుటకు కూడా తానే వర్షముగా కొన్నిసార్లు-వర్షపు కొరత గా కొన్నిసార్లు ప్రకటింపబడుట అని,వర్షాయచావర్షాయచ అంటూ చెప్పుకున్నాడు.అంతటితో ఆగలేదు.ఇరిణ్యాచ-చవిటినేలను నేనే అన్నాడు.కిగుం శిలాయచ రాళ్ళనేలను కూడా నేనే అని గొప్పలుచెప్పుకున్నాడు.అదంతా నిజమేననుకొని చమకములో సాధకుడు పరమేశ్వరా నా యజ్ఞమును సమర్థవంతము చేయుటకు నీవు అగ్ని-విష్ణు రూపములతో వచ్చి(స్థితికర్తలుగ)  "వాజశ్చమే" నాకు అన్నమును ప్రసాదింపుము అని ప్రార్థించినప్పటికిని,శివుడు తనదగ్గర నున్న వాటిని సిధ్ధపరచుటలో అసమర్థుడు కనుక మిన్నకున్నాడు.-నింద.

హరితం నమః శివాయ-శుష్కం నమః శివాయ
ఆకలి నమః శివాయ-అన్నము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

శివా నీవే కరుణతో "సీరంచమే" నాగలిని తత్సంబంధమైన పరికరములను అనుగ్రహించి,కృషిచేయునప్పుడు కలుగు (సాధన సమయములో) కలుగు అవరోధములను తొలగించి." ఊర్క్చమే" సామాన్యమైన అన్నమును,పయిశ్చమే-పాలను,ఘృతశ్చమే-నేతిని,మధుశ్చమే-తేనెను ఐంకా అవసరమైన వానిని అనుగ్రహించి,"అక్ష్త్-చమే" ఆకలిని లేకుండా,విషయవాసనలయందు అనురక్తిని తొలగించి,అనుగ్రహింపుము.అనేకానేక నమస్కారములు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.























































































OM NAMA SIVAAYA-77


   ఓం నమః శివాయ-77
   *********************

  నిన్ని సొంతమని సేవిస్తే సుంతైనా కానరావు
  ఎంతలేసి మాటలనిన సొంతమని అంటావు

  నిన్నుచూడ తపియించగ నిరీక్షణే మిగుల్చుతావు
  నెవ్వెంతవన్న ముందు ప్రత్యక్షము అవుతావు

  కరుణించే వేళలలో కఠినముగా ఉంటావు
  లెక్కలేదన్న వారిపై మక్కువ చూపుతావు

  మనసును కట్టేయమంటే బెట్టెంతో చేస్తావు
  కట్టుబాటు లేనివానిని కట్తిపడేస్తుంటావు

  ముసలితనము వచ్చినా ముక్కిమూల్గమంటావు
  పసికందుల హతమార్చి కసితీర్చుకుంటావు

  నీ పనులప్రభావము నీకసలు తెలియదుగా
  మక్కువలేదంటున్నారురా ఓ తిక్కశంకరా.

  శివుడు నువ్వు లేవని,నిన్ను లెక్కచేయనని,మోసగాడివని,నీ అవసరము నాకు లేదని,నీకు ప్రీతికరమగు విధముగా నేనెందుకు ఉండాలని తర్కము చేసే వారిపై మక్కువ చూపిస్తాడు కాని భక్తితో కొలిచే వారికి,అనుగ్రహమునకై పరితపించే వారిపై నిర్లక్ష్యమును చూపుతు,సందభోచితము కాని పనులను చేస్తుంటాడునింద.


ప్రత్యక్షము నమః శివాయ-పరోక్షము నమః శివాయ
విరుధ్ధము నమః శివాయ-సన్నధ్ధము నమః శివాయ

   నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

 " ఆద్యాయామిత తేజసే శ్రుతివదైః వేద్యాయ సాధ్యాయతే
   విద్యానంద మయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే
   ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైః గేయాయ మాయావినే
   సమ్యక్తాండవ సంభ్రమాయ జటనే సేయం నతిశ్శంభవే"

  శివానందలహరి.

  ఆదిదేవుడు,అమితమైన తేజశ్శాలి,వేదవచనములచే తెలియబడువాడు,విద్యానందమయుడు,ముల్లోకములను సంరక్షించుచు( దానిని సామాన్య మనసులకు తెలియనీయకుండ మాయ అను పొరను కప్పువాడు) గొప్ప తాండవమును చేయుచు,జగములను రమింపచేయు శివునకు నమస్కారములు.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.



OM NAMA SIVAAYA--76


  ఓం నమః శివాయ-51
  ********************





 నగుమోముతో నగములు నిన్ను బంధువు అంటున్నవి

 సాలెపురుగు పాలె దోమ దయాసింధువు అంటున్నది



 తుమ్మెద అమ్మమ్మ నిన్ను కమ్మని చుట్టము అంది

 కరిరాజు పరివారము తమ సరివాడవు అంటున్నవి



 ఎద్దుతరపు పెద్ద నిన్ను పెద్దయ్య అంటాడట

 లేడి చేడియ నిన్ను తనవాడివి అంటున్నది



 వ్యాళపతి వాసుకి నిన్ను చుట్టమని చుట్టుకుంది

 తిన్నని కన్న అడవి కన్నతండృఇ అంటున్నది



 హరి సంగతి సరేసరి అసలుచుట్టమంటాడు

 ఇందరి చుట్టమైన నీవు నన్ను చుట్టుకోకుంటేను



" నరత్వం-దేవత్వం-నగవన మృగత్వం" అన్న లహరి

  లెక్కలోకి రాదురా  ఓ తిక్కశంకరా.



      శివునికి చుట్టములు కొండలు-కీటకములు-జంతువులుఅడవి మొదలైనవే కాని సరివారు ఎవరులేరు కనుక నేను స్తుతిచేస్తుంటే నన్ను కరుణించుట లేదు--నింద.

  శిల్పం నమః శివాయ-శిల్పి నమః శివాయ
  వేట నమః శివాయ-వేటు నమః శివాయ( దెబ్బ)
  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ







" నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
  పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం -శివానందలహరి.

 పరమేశా! మానవునిగానో-దేవునిగానో-కొండగానో-అడవిగానో-జంతువుగానో-దోమగానో -పశువుగానో-కీటకముగానో -పక్షిగానో పుట్టినా ఎల్లప్పుడు నీ పాదపద్మ స్మరణమనే ప్రవాహములో తేలియాడే సౌభాగ్యమును ప్రసాదింపుము సదాశివా.ఇక్కడ మనమొక్క విషయమును గుర్తుచేసుకుందాము.ఎన్ని వరములను అడిగితే అవి ధర్మబధ్ధములైతే ఇన్ని వరములా అని అనడు ఈశ్వరుడు.కనుకనే లహరి అల ఈ విధముగా నిరంతరము కడలిని వీడక కదులుతూనే ఉంటుందో అదేవిధముగాశివానుగ్రహమనే సముద్రము నిరంతరము వరములను అలలతో నిండి అనవరతము అనుగ్రహించుచుండును. .అందుకే శ్రీ శివానంద లహరి నామమును సార్ధకతను అందించుచున్నది.శివోహం-స్తుతి.

   శివుడు చేతనాచేతనములలో అంతర్లీనముగా ఉన్నాడు.కొండలలో వేదస్వరూపముగా,కీటకములలో సూక్షములో మోక్షమునకు బాటగా,పశువులలో పశుపతిగా,మనసనే దట్టమైన అడవిలో విషయవాసనలనే కౄరమృగముల నుండి రక్షించువాడిగా విలసిల్లుతున్నాడని స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.




Monday, June 1, 2020

OM NAMA SIVAAYA-75

  ఓం నమః శివాయ-75
  *******************

 అగ్నికార్యఫలితములు అన్నీ ఇంద్రునికైతే
 బృహస్పతి చేరాడు బుధ్ధితో ఇంద్రుని

 సరస్వతి చేరింది బృహస్పతిని చూసి
 వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని

 భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని
 గాలివీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని

 అవకాశము ఇది అని ఆకాశము చేరింది
 ఆశ్వనీదేవతలు ఆశ్రయించారు ఇంద్రుని

 పంచభూతములు కలిసి నిన్ను వంచించేస్తుంటే
 పంచాల్సిన ఫలితమును అంతా దోచేస్తుంటే

 స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది
 నిన్నొక్కడినే వేరుచేసి ఓ తిక్కశంకరా.


 వేదశాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.వారికి ఆ అవకాశమును  అనుశివుడేగ్రహించాడు.కాని వారు శివుని లెక్కచేయక,శివునికి తెలియకుండా,చెప్పకుండా,తామందరు కుమ్మక్కై ,శివుని యజ్ఞ హవిస్సులో సగభాగమును ఈయకుండా,తామే స్వీకరించాలని వెళ్ళిన శివుడు వారినేమి అనకుండా మౌనముగా చేతకాని వలె నున్నాడు-నింద.

 యజ్ఞం నమః శివాయ-యజ్వ నమః శివాయ
 కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ



 " అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే
   సరస్వతీచమ ఇంద్రశ్చమే-బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే"

   రుద్రచమకము లోని ఆరవ అనువాకము అర్థేంద్ర అనువాకముగా ప్రసిధ్ధిపొందినది.చమకము అగ్నా- విష్ణూ, రెండు మహత్తర శక్తులను జతగా వచ్చి,జయమును కలిగించమంటుంది.అదే విధముగా స్థితికార్యమును నిర్వహించు సమయమున మగేశ్వరుడే మహేంద్రుడిగా కీర్తింపబడుతుంటాడు.యజ్ఞ నిర్వహణకై మహేశ్వరుడు తన నుండి కొన్ని అద్భుత శక్తులను ఆవిర్భవింపచేసి,వాటికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు.వాటి సద్గుణములే దివ్యనామములై విరాజిల్లుచున్నవి.స్వామి వాటిని విస్తరింపచేయగలడు.అవసరము లేదనుకుంటే తనలో విలీనము చేసుకోగలడు.సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయుటకు ఇంద్రునిగా తాను వారిని  వెంటపెట్టుకుని

వచ్చి,యజ్ఞ హవిస్సులలో    సగభాగమును వానికిచ్చి,మిగిలిన సగమును తాను స్వీకరించి "లోకాన్ సమస్తాత్ సుఖినో భవంతూ అను ఆర్యోకిని నిజము చేస్తాడు యజ్ఞము-యజ్ఞకర్త-యజ్ఞభోక్త -యజ్ఞహర్త అయిన పరమేశ్వరుడు. స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.





.


















OM NAMA SIVAAYA-74


  ఓం నమః శివాయ-74
  ***************

 వెండికొండ దేవుడవని వెండికొరకు నే వస్తే
 దండిగా ఉన్న మంచు వెండివెండి నవ్వింది

 మేరుకొండ విల్లుందని మేరువుకై నేవస్తే
 చాటుగా ఉన్న విల్లు చిలిపిగా నవ్వింది

 రాగిజటాజూటమని రాగికొరకు నేవస్తే
 విరాగియైన జట మరీ విచిత్రముగా నవ్వింది

 నీలలోహితుడవని ఇనుముకొరకు నేవస్తే
 చాల్లే అంటూ విషము గేలిగా నవ్వింది

 కుబేరుడు ముందున్నాడని ధనమునకై నేవస్తే
 చేతులు కట్టుకున్నానని చేతకాక నవ్వాడు

  ఎండమావులను నీళ్ళనుకుని కుండపట్టుకు వచ్చిన,

   నా ఎక్కిళ్ళని ఆపవేర ఓ తిక్కశంకరా.


' రుద్రచమకములో శివుడు "హిరణ్యంచమే-సీసంచమే-త్రపుశ్చమే-శ్యామంచమే-లోహంచే ' అన్ని లోహములను పొందినవాడును-అనుగ్రహించగలిగిన వాడును అని చెప్పుకున్నాడని,భక్తుడు వాటికొరకు శివుని సమీపించి,ఘోరముగా పరాభవింపబడినను శివుడు చేతకాని వాడిలా కదలక మెదలక ఉన్నాడు.-నింద.

  పసిడి నమః శివాయ-వెండి నమః శివాయ
  రాగి నమః శివాయ -సీసము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

  రుద్రనమక-చమకముల అంతరార్థము అర్థముకానిది.కాని అద్భుతమైనది.లోహములను వివరించు చమకము ఐదవ అనువాకములో వాటిలో దాగిన అంతరార్థములను అలంకారికులు విశ్లేషించినారు.బాహ్య వాచకార్థమునకు ఇవి లోహ నామములే అయినప్పటికిని,ఆధ్యాత్మికముగా అన్వయించుకుంటే సాధకుని ఆధ్యాత్మిక పయనములోని అడ్దంకులను తొలగించి-అభ్యున్నతిని సూచించు అత్యద్భుత ప్రణాళికలు.ఉదాహరణకు హిరణ్యంచమే-బంగారము అనునది సామాన్యార్థము.కాని నిశిత పరిశీలకులకు హితం-రమ్యం హిరణ్యం గా అర్థమవుతుంది.హితమును కలిగించునది-రమ్యమైనది హిరణ్యం.అంతే పరబ్రహ్మ జ్ఞానము.అదే విధముగా సీసంచమే అను పదము "సినోతి బధ్నాతి  సర్వ బుధ్ధీం ఆధ్యాత్మికే ఇతి సీసం" జనుల బుధ్ధివృత్తులను ఆధ్యాత్మికత యందు బంధించెడి భావము.సాధకులు-జ్ఞానులు పొందెడి భావము ఇనుము.రాగి మొదలగు లోహములన్ "లూఞ్-ఛేదసే" జనుల బుధ్ధులను అన్నివైపులనుండి ఛేదించి,ధ్యానముపై కేంద్రీకృతము చేయించే స్వభావము.ఈ విధముగా కొన్ని భావములు ఆధ్యాత్మికతకు కలుగు అడ్దంకులను తొలగించుచుంటే మరి కొన్ని సుగమము చేయుచు సాధకుని ప్రయత్నమును(యజ్ఞమును) సఫలీకృతము చేయును.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.



.

















OM NAMA SIVAAYA-73


  ఓం నమః శివాయ-73
  ******************

 నీకన్న నీగుడులు నిరతము కిక్కిరిసి పోతుండగ
 నీకన్న నీ బసవని అనయము కొనియాడుతుండగ

 నీకన్న నీసిగశశి చాంద్రమానమగుచుండగ
 నీకన్న నీజటలో గంగ నీరాజనములను పొందుచుండ

 నీకన్న నీ కృత్తిక నిఖిలకీర్తినొందుచుండ
 నీకన్న నీనామము నలుదెసల నర్తించుచుండ

 నీకన్న నీ పరివారము ప్రస్తుతింపబడుచుండగ
 నీకన్న నీభక్తుల కథలు మారుమ్రోగుచుండగ

 నీకన్న నీ భోళాతనమే వేళాకోళమగుచుండగ
నువు చూసి-చూడనట్లుగా-తెలిసి తెలియనట్లుగా

 పోనీలే అంటుంటే-కానీలే అని మిన్నకుంటే
 తొక్కేస్తారుర నిన్ను ఓ తిక్క శంకరా


 శివుని కన్న శివుని గుడులు-బసవడు-చంద్రుడు-గంగ-కృత్తిక-నామము-ప్రమథగణములు-పరివారము మిక్కిలి ప్రశస్తిని గాంచినవి కాని శివుడు మాత్రము కిమ్మనకుండా ముక్కుమూసుకొని జపము చేస్తూ కూర్చుంటాడు కాని తన వైభవమును ప్రదర్శించుటకు సిధ్ధముకాడు-నింద.

 చంద్రుడు నమః శివాయ-బసవడు నమః శివాయ
 కృత్తిక నమః శివాయ-కృత్యము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.



  " నిత్యానంద రసాలయం సురమునిస్వాంతాంబుజజాతాశ్రయం
    స్వచ్ఛం సత్ద్విజ సేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం
    శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంసస్థిరం
    కిం క్షుద్రాశ్రయ వల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి."

  శివధ్యానము నిత్యానందమనే సరోవరము.శివుని దయతో దేవతల-మునుల-భక్తుల హృదయమనే పద్మములకు ఆ సరోవరము ఆశ్రయమిచ్చినది.చిత్తచాంచల్యములనే కాలుష్యములను తొలగించి,సంస్కారములనే సువానలను వెదజల్లునది అది.శివా నేనింతవరకు అజ్ఞానమనే తెరచే కప్పబడి నిన్ను-నీ బసవని-గుడులను-చంద్రుని-గంగను-కృత్తికను-నామమును-ప్రమథులను-పరివారమును అన్యముగా భావించితిని.అజ్ఞానమనే బురదగుంటలో నుండుటచే వాటికి ఆ వైభవమును కల్పించినవాడివి నీవేనని తెలిసికొనలేకపోతిని.పరమ దయాళు!నీ అనుగ్రహవీక్షణము నా కనులను తెరిపించినది.నన్ను నిశ్చలమనసుతో నిత్యానంద సరోవరములో నిర్మల సరోజము వలె ప్రకాశించనీయితండ్రీ.నమస్కారములు.-స్తుతి.

  ఏకబిల్వం శివార్పణం.

.

















OM NAMA SIVAAYA-72


  ఓం నమః శివాయ-66
  **********

 నీ రూపము చూపించే కన్ను కన్నుమిన్నుకానకుంది
 మళ్ళీ చూప్[ఇంచమంటే మళ్లను నేను అంటున్నది

 నీ నామము వినిపించే చెవి చెవిటివాడనని అంటోంది
 మళ్లీ వినిపించమంటే శంఖమూదరని అంటున్నది

 నీ నామము పలికించే వాక్కు నన్ను సన్నగా నొక్కుతోంది
 మళ్ళీ పలికించమంటే కిక్కిరుమనకు అంటున్నది

 నీ చుట్టు తిరుగుకాలు నాపై ఒంటికాలిపై లేస్తున్నది
 మళ్ళీ తిరుగుదామంటే పనిలేదా అంటున్నది

 నీ చెంత వంగు తల నన్ను అతలాకుతలము చేస్తున్నది
 మళ్ళీ వంగమన్నానని అవతలకు పొమ్మని అంటున్నది

 శివునికేమి చేయాలని చీకాకుపెడుతున్న వాని
 కొక్కిరాయి పనులను ఆపవేర ఓ తిక్కశంకరా.


 శివుడు సర్వము తన కనుసన్నలలోనే నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటాడు కాని భక్టుడు తన ఇంద్రియములు తన మాట వినటములేదని మొరపెట్టుకుంటున్నా ,వాటిని మందలించి,సరిచేయలేని అసమర్థుడు-నింద.

  కన్ను నమః శివాయ-కనుసన్న నమః శివాయ
  కరుణ నమః శివాయ-కైవల్యము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.



 " మనస్తే పాదాబ్జే నివసతుః వచః స్తోత్రఫణితౌ
   కరౌచాభ్యర్చాయం శ్త్రుతిరపి కథాకర్ణనవిధౌ
   తవధ్యానే బుధ్ధిర్నయన యుగళం మూర్తివిభవే
   పరగ్రంధైః కిం వా పరమశివ జానే పరమతః"

    శివానందలహరి.

  ఓ సదాశివా! నా మనస్సు నీ పాదపద్మములందు,వాక్కు నీ స్తోత్రపఠనము నందు,చేతులు నీ పూజయందు,చెవులు నీ కథలను వినుట యందు,బుధ్ధి నీ ధ్యానమునందు,కన్నులు నీ దివ్య స్వరూపమును దర్శించుట యందు,లగ్నమగునట్లు చేయువాడవు నీవొక్కడివే.ఇతరులకు సాధ్యము కానిపని.నీ అనుగ్రహము లేని మానవప్రయత్నము వృధాప్రయాస.నా ఇంద్రియములను సంస్కరించి,నన్ను కృతార్థుడను చేయుము శివా.అనేకానేక నమస్కారములు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.
















OM NAMA SIVAAYA-71


  ఓం నమః శివాయ-71
  ********************

 నిను గుర్తించిన శ్రీ-కరి-కాళములకు గుడినే కట్టించావు
 గుడిగోపురమును చూసిన పాపనాశనము అన్నావు

 గుడ్డితనమును పోగొట్టి చూపునిస్తుంటావు
 గురువుగా మారి వారిని తరియింపచేస్తావు

 గుడిలో కూర్చుని గురుతర పూజలందుకుంటావు
 గుహుని తండ్రివి వారి అహమును తొలగిస్తావు

 గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింప చేస్తావు
 గుణనిధిని కరుణించిగుండెలో దాచుకుంటావు

 గుచ్చిన బాణమును చూపి పాశుపతమునిచ్చావు
 గుర్తించని వారికి భక్తిగుళికలు అందిస్తావు

 గుక్కతిప్పుకోకుండా ఎక్కిఎక్కి ఏద్చునన్ను,నీ
 అక్కున చేర్చుకోవేమిరా ఓ తిక్క శంకరా.












OM NAMA SIVAAYA--70


  ఓం నమః శివాయ-70
  ********************

  ఎత్తైన కొండలలో భోగనందీశ్వరుడనని అంటావు
  చేరలేనంత ఎత్తులో చార్ధాంలో ఉంటావు

  లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
  దూరలేనంత గుహలలో అమరనాథుడివై ఉంటావు

  కీకారణ్యములలో అమృతేశ్వరుడనని అంటావు
  ఏదారులలో వేడుకగా అమృతేశ్వరుడనని అంటావు

  కనుమల దగ్గర కామరూపకామాఖ్యుడనని అంటావు
  జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు

  భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు
  ఈదలేనంత గంగఒడ్డున ఈశ్వరుడినంటావు

  నామదిని వదిలేసావు దయలేక తెలియదుగా
  నీకు ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా.


 శివుడు ఎత్తైన కొండలలో-లోతైన లోయలలో-ఎడారులలో-కీకారణ్యములలో-ఎక్కడెక్కడో ఉంటాడు కాని నిత్యము నిర్మలభక్తితో కొలిచే భక్తుని మదిలో ఉండాలని తెలియనివాడు.-నింద.

 ఎత్తు నమఃశివాయ-లోతు నమః శివాయ
 అడవి నమః శివాయ -ఎడారి నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" గుహాయాం గేహేవా బహిరపి వనేవాద్రి శిఖరే
  జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం
  సదా యస్త్యైవాంతహ్కరణమపి శంభో తవపదే
  స్థితంచేద్యోగోసౌసచ పరమయోగీ సచ సుఖీ"

  శివానందలహరి.

 పరమశివా నీ నిజతత్త్వమును తెలిసికొనలేని నా మనసును గుహలోకాని-ఇంటిలోకాని-వెలుపల కాని-పర్వతశిఖరముపై కాని నీటిలో కాని,నిప్పుపై కాని నిలిపిన ఏమి లాభము? పరమదయాళు!దానిని ఎల్లప్పుడు నీ పాదపద్మములయందు స్థిరముగా నిలిచియుండు యోగమును అనుగ్రహింపుము.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.











OM NAMA SIVAAYA-69


  ఓం నమః శివాయ-49

  ****************

  రుద్రాక్షలు ఇష్టము-చిన్ముద్రలు ఇష్టము
  అభిషేకము ఇష్టము-అవశేషము ఇష్టము

  బిల్వములు ఇష్టము-బిలములు ఇష్టము
  తుమ్మిపూలు ఇష్టము-తుమ్మెదలు ఇష్టము

  తాండవము ఇష్టము-తాడనము ఇష్టము
  అష్టోత్తరము ఇష్టము-నిష్ఠూరము ఇష్టము

  చందనాలు ఇష్టము-వందనాలు ఇష్టము
  కాల్చుటయు ఇష్టము-కాచుటయు ఇష్టము

  లయగ ఆడుట ఇష్టము-లయముచేయుట ఇష్టము
  మహన్యాసము ఇష్టము-మహాశివరాత్రి ఇష్టము

  కష్టాలలోనున్న నాపై ఇష్టము చూపించకుండుట

 నీ టక్కరితనమేరా ఓ తిక్కశంకరా.

 శివుడు రుద్రాక్షలను-అభిషేకములను-తుమ్మిపూవులను,మారేడు దళములను-కొండగుహలను చందనములను ఇష్టమని ప్రకటించుకున్నాడు.ఇంతేనా ఇంకా ఏమైన వున్నాయా అని అడిగితే చిన్ముద్ర-అవశేషాలు-నాట్యములు-దండించుట-తుమ్మెదలు-నమస్కారములు కాల్చుట-కాచుట మహన్యాసములు ఇష్టమనినాడు.తనకు కావలిసిన సమాధానము రాలేదని ఇంకా ఏవైనా మరిచిపోయినావా శివా అని అడిగితే దరహాసం చేస్తాడు కాని తనపై దయ ఉందని మాత్రము అనడు-నింద.

 బిలము నమః శివాయ-బిల్వము నమః శివాయ
 కాల్చుట నమః శివాయ-కాచుట నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" గలంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
  దలంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయితాం
  దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
  వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ"

 శివచరిత్రమను నదినుండి ప్రవహించుచు,పాపమనే ధూళిని కడిగివేయుచు,సంసారములో పరిభ్రమించుటచే నాలో ఏర్పడు సంతాపమును ఉపశమింపచేయుచు,నా హృదయమనే సరస్సులో నిలిచే ఆనందప్రవాహము శుభములను చేకూర్చును గాక.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.









TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...