Wednesday, November 30, 2022

NA RUDRO RUDRAMARCHAYET-30(SIVANAMDALAHARI)

 శ్లో : వస్త్రోద్-ధూత విధౌ సహస్ర-కరతా పుష్పార్చనే విష్ణుతా

గంధే గంధ-వహాత్మతా(అ)న్న-పచనే బర్హిర్ -ముఖాధ్య క్షతా

పాత్రే కాన్చన-గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడా-మణే

శుశ్రూషామ్ కరవాణి తే పశు-పతే స్వామిన్ త్రి-లోకీ-గురో 30

NA RUDRO RUDRAMARCHAYAET-29(SIVANAMDALAHARI)

 శ్లో : త్వత్-పాదాంబుజమ్-అర్చయామి పరమం త్వాం చింతయామి-అన్వహం

త్వామ్-ఈశం శరణం వ్రజామి వచసా త్వామ్-ఏవ యాచే విభో

వీక్షామ్ మే దిశ చాక్షుషీమ్ స-కరుణాం దివ్యైశ్-చిరం ప్రార్థితాం

శంభో లోక-గురో మదీయ-మనసః సౌఖ్యోపదేశం కురు 29

Tuesday, November 29, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-28(SIVANAMDALAHARI)

 శ్లో : సారూప్యం తవ పూజనే శివ మహా-దేవేతి సంకీర్తనే

సామీప్యం శివ భక్తి-ధుర్య-జనతా-సాంగత్య- సంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మక-తను-ధ్యానే భవానీ-పతే

సాయుజ్యం మమ సిద్ధమ్-అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ 28

 కరస్థే హేమాద్రి స్లోకములో స్వామి సంపదప్రదుడని కీర్తిస్తు,ప్రస్తుత శ్లోకములో నాలుగు విధములైన ముక్తి రూపములుగా పరమేశ్వరానుగ్రహమును ప్రస్తుతిస్తూ,వాటిలో మూడింటిని సాకార ముక్తిగాను,అవి పొంది తాను కృతార్థుడనైనానని,సాయుజ్యము గురించి స్వామికే వదిలివేస్తున్నానని కృతార్థను తెలియచేస్తున్నారు.


 ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.ఏ రూపమో తెలుసుకోలైని మనసు కన్ను అనే ఇంద్రియమును చేరి రూపమును స్వీకరిస్తుంది.అదే పరమేశుని రూపమును ఊహించుకొని దర్శించినప్పుడు దానికి సర్వోపచారములను చేస్తూ సంతసిస్తుంటుంది.దీనిని మనము సారూప్య భక్తిగా భావించవచ్చును.

 అంతటితో తృప్తి చెందక మనసు వాగింద్రియమును కూడి సంకీర్తనగా మారి ఆ స్వరూప సమీపమును చేరుతుంది.లేదా ఆ స్వరూపమునకు దగ్గరగా తానున్నానని భావిస్తుంది.

 అదే మనసు చెవి అనే ఇంద్రియమును కూడి శ్రవనానందమును పొందుతుది.

  సామీప్యమును అందించగలశక్తిని మనసుకు స్పర్శ అందిస్తుంది.

 స్వరూపమును చూడగలుగుతోంది.సంకీర్తనమును చేఊగలుగుతోంది.సామీప్యమును చేరగలుగుతుంది.కట్టలు తెంచిన అనుగ్రహము నెట్టుకొస్తున్నదా అన్నట్లు ,స్వస్వరూపముగా పరమాత్మను భావించుచున్న మనస్సు,తన అభిప్రాయమును మార్చుకుని సర్వస్వరూపముగా చూడగలుగుతున్నది.కీర్తించగలుగుతున్నది.స్పర్శను పొందగలుగుతున్నది.అంటే పరమేశ్వరుడు చిత్శక్తిగా నున సకలమునందు తాను కూడా ఉన్నానన్న భావనను కలిగిస్తున్నది.

 ఈ మూడు భావములను జీవుడు సశరీరముగానే పొందగలుగుతున్నాడు.

 అంతే,అంటే

 సాలోక్యము అన్నది మరెక్కడో లేదు.దానిలోనే మనమున్నామన్నమాట.

 పరమేశ్వరా నీ తత్త్వమును స్వరూప-స్వభావములను-సాక్షాత్కైంపచేసిన నీ ఆనుగ్రహమే కాదా నాకు నీ సాయుజ్యము.

 ఒకవేళ ఇప్పుడు నేను పొందుచున్నది సాయుజ్యము కాదనుకొందాము.అది నీ కనుసన్నలలోనిదే కదా.

   దర్శన కుతూహలమును పెంచి,దర్శింపచేయుచున్న నీ విభవమునకు సర్వదా కృతజ్ఞుడను.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


Monday, November 28, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-27(SIVANAMDALAHARI)


 శ్లో : కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ

గృహస్థే స్వర్భూజా(అ)మర-సురభి-చింతామణి-గణే

శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే(అ)ఖిల శుభే

కమ్-అర్థం దాస్యే(అ)హం భవతు భవద్-అర్థం మమ మనః 27


 ప్ర్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు పరమేశ్వరునకు తన మనసును సమర్పిస్తున్నానని అంతకు మించి తాను అర్పించుటకు స్వామి అడుగుటకు వేరేదేమి లేదని స్వామి వైభవమును ప్రస్తుతిస్తున్నారు.నిజమునకు ఇంతకు ముందు ఆశ్లోకౌలలో పలుమారులు మనసు ప్రస్తావన వచ్చినది.

 7.వ శ్లోకములో మనస్తే పాదాబ్జే అంటూ,స్వామి నా మనస్సు నీ పాదపద్మములయందు స్థిరపడియుండునుగాక అన్నారు.

 11.వ శ్లోకములో -యదీయం హృత్పద్మం యది భవదధీనం అంటూ మరొక్కసారి నొక్కిచెప్పారు.

 12.వ శ్లోకములో సైతము "యస్తైవాంతః కరణం అపి శంభో తవ పదే స్థితం" అని మరీ మరీ చెప్పారు.

 అప్పుడు శంకరులవారికి స్వామి అనుగ్రహించిన దర్శనమునకు అతీతముగా ప్రస్తుత శ్లోకములో అనుగ్రహించారేమో అనిపిస్తున్నది.

 ఎందుకంటే స్వామి స్థితికారకత్వమునకు సంకేతములుగా ఏవేవి స్వామిని సేవిస్తున్నాయో సంకీర్తిస్తూ,నిజమునకు అవి స్వామి పాదముల దగ్గర సర్వశుభంకరములుగా సన్నుతింపబడుతున్నాయనటం వెనుక సర్వేశ్వరుని సదనుగ్రహమే కారణమంటున్నారేమో అనిపిస్తున్నది.

   సర్వ శుభములు మన భాషలో చెప్పుకోవాలంటే పాడిపంటలు,ధనధాన్యములు,శాంతిసౌఖ్యములు.

 అవే కదా ఈశ్వరకృపగా ఒక్కొక్క నామరూపములో స్వామిని ఆశ్రయించి అర్చిస్తున్నవి.

 కరస్థే-నికటస్థే-చేతిలో మేరుపర్వతము,సమీపములో కుబేరుడు.

 సర్వశుభములను నిక్షిప్తముచేసుకొనిన సంపద మేరువు.దానిని అందరికి పంచగల సమర్థ కుబేరుడు.పంటలకు సంకేతము కల్పవృక్షము.పాడికి నాడి కామధేనువు.తలచినంత మాత్రముననే సంపదలనీయగలిగినది చింతామణి.నిక్షిప్త-ప్రక్షిప్త సంపదలు సర్వము ఈశ్వర విభూతులే అను మాట నిస్సందేహము.

 సకలసంపద్స్వరూపమైన సదాసేవా నేను నీకేదో సమర్పించాననుకోవటము నా పసితనము.నీవు దానిని స్వీకరించాలి/స్వీకరించావు అనుకోవటము నా అమాయకత్వము.అయినప్పటికిని నీ ఆశ్రితవాత్సల్యము నన్ను నీ పదములకడ మంగళానుగ్రహముగా మారిపొమ్మని ప్రాధేయపదమంటున్నది.పరమేశా అర్పణ తో కాక ఆశ్రయభావముతో నిండిన నా మనసును స్వీకరించి నన్ను అనుగ్రహించు.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.

NA RUDRO RUDRAMARCHAYAET-26( SIVAANAMDALAHARI)

 శ్లో : కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాన్ఘ్రి- యుగళం

గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్

సమాశ్లి ష్యాఘ్రాయ స్ఫుట-జలజ-గంధాన్ పరిమళాన్ -

అలభ్యాం బ్రహ్మాద్యైర్-ముదమ్-అనుభవి ష్యామి హృదయే 


 ప్రస్తుత శ్లోకము సహస్రారమునుండి ద్రవిస్తు-ఆశీర్వదిస్తున్న సుధాసారమును ప్రస్తావిస్తు,దానిని స్థిరముగా నిలుపుకోవటము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.పూర్వపు శ్లోకము ద్రష్ట్వా అంటూ దర్శనమునకు ముందటి పరిస్థితిని తెలిపితే ప్రస్తుత శ్లోకము దృష్ట్వా అంటు దర్శనభాగ్యమును కలిగించినది.దర్శనము మాత్రమే కాదు స్వామి దివ్య పాదపద్మములను కన్నులలో,శిరములో,కన్నులలో,వక్షములో దాచుకుంటూ,స్వామి పాదపద్మములనుండి పరిమళిస్తున్న సుగంధమును ఆఘ్రాణించే సౌభాగ్యమును ప్రసాదిస్తున్నది.

 ఇది కేవలము బాహ్య ఇంద్రియమైన నాసిక గుర్తించకలిగినదికాదు.వసి వాడని,వన్నె తగ్గని పరిమళము అందిస్తున్న పరవశమును పొందే భాగ్యము నేను ఎప్పుడు పొందగలనో కదా.

  ఇంద్రియాతీతమైన అనుభవము.మనసు కేంద్రీకృతము అయినప్పుడు మాత్రమే లభించే అనుగ్రహ ఘ్రాణము.కన్నుల్లో దృశ్యమైన ,మనసులో తిష్ఠవేసుకొనిన పాదపద్మములు చేజారిపోకుండా దాచుకునే ప్రయత్నము ముకుళిత హస్తములతో-వికసితచిత్తముతే చేసే నమస్కారసేవనము.దానిని వీక్షించగల జ్ఞానమే మన కన్నులుకదా.దానిని స్థిరపరచుకోవలసిన ఏకాగ్రతయే మన చిత్తముకదా.దానికి చేయుచున్న జపమూలమే వక్షముకదా.నాభి నుండి ప్రనవముగా ప్రకటనమగుస్వామి స్మరణము స్వామి దర్శనమును శాశ్వతమొనరించునుగాక.

  సర్వం పార్వతీ పరమేశ్వరపాదారవిందార్పణమస్తు. 



 ప్రస్తుత శ్లోకములో గంధాస్వాదనముచే నా నాసిక ఎప్పుడు పునీతమగునో కదా అని ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నారు.క్రిందటి శ్లోకము శ్రవణముతో కూడిన దర్శనమును అనుగ్రహించమ్ని కోరితే,దానికి ముందు నున్న శ్లోకము కేవలము దర్శనమును మాత్రమే కాంక్షించింది.కేవల దర్శనము తృప్తినీయదని తెలుసుకొనున మనము,శ్రవణమును కోరినది.దానితో ఆగక ఘ్రాణ సౌభాగ్యమును అర్థిస్తున్నది. 

గంధాన్ పరిమళాన్ అనుభవిష్యామి శంకరా అంటున్నది మనస్సు.

 ఆ ఆఘ్రానముతో కేవలము నాసిక మాత్రమే చేయునది కాదు.బాహ్యమునకు అతీతమైనది.బహుభాగ్యమైనది.

Sunday, November 27, 2022

NA RUDRO RUDRAMARCHAYET-25(SIVANAMDALAHARI)

 శ్లో : స్తవైర్-బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిర్- నియమినాం

గణానాం కేళీభిర్ -మదకల-మహో క్షస్య కకుది

స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిశ్ట- వపుషం

కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖండ-పరశుమ్ 


  ప్రస్తుతశ్లోకములో శంకరులు సదాశివుడు        ఇంతకు పూర్వము అధర్మమును ఏ విధముగా అంతమొందించినో తెలుపు సంకేతములుగా త్రినయనం-మన్మథుని మాయంచేసిన నీ మూడవకన్ను ధర్మమునకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నది.నీ నీలకంఠము అసురత్వమును అణచివేసిన దానికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నది

.ధర్మమునకు గ్లాని సంభవింపనీయని  నీ చతురతయే నీ ఒక చేతనున్న( విచ్చలవిడి మనస్తత్త్వమునకు సంకేతమైన) మృగము,మరొక చేతను దానిని దండించగల ఖండపరశువు.

  అధర్మము అంతరించిన వేళ జరుపుకొను  ఆనందోత్సాహము బ్రహ్మాదుల స్తవములే కావచ్చును,మునుల జయ జయ ధ్వానముల                  స్తోత్రములే కావచ్చును,ఎద్దుమూపురమునెత్తి వేయు రంకెలే 


కావచ్చును,ప్రమథగణములు చేయు వాయిద్య సంబరమైనా కావచ్చును.అంతటి సంతోషమునకు కారణము స్వామి ఉమాశ్లిష్టుడై వారికి సాక్షాత్కారమునొసగుటయే కారణము.నేను సైతము అంతటి మూర్తీభవించిన ధర్మ సంబరమును ఎప్పుడు చూచెదనో కదా అని స్వామి అనుగ్రహమునకు నిరీక్షించుచున్నారు.మనలను నిరీక్షించమంటున్నారు శంకరులు.

  సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.

 



NA RUDRO RUDRAMARCHAYET-24

 శ్లో :  కదా వా కైలాసే కనక-మణి-సౌధే సహ-గణైర్-

వసన్ శంభోర్-అగ్రే స్ఫుట-ఘటిత-మూర్ధాన్జలి-పుటః

విభో సాంబ స్వామిన్ పరమ-శివ పాహీతి నిగదన్

విధాతౄణాం  కల్పాన్ క్షణమ్-ఇవ వినేష్యామి సుఖతః   


సదయ సుఖయ- సత్వర దర్శన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థించిన శంకరులు ప్రస్తుత శ్లోకములో " కదావై కైలాసే'అంటూ కనక్మణిశోభితమైన కైలాసములో,ప్రమథగణ సేవుతుడగుచున్న స్వామిని ఎప్పుడు చూడగలుగుతానో కదా అని దీనముగా వేడుకుంటున్నారు.



 సందర్శన భాగ్యమును కోరిన ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో సాయుజ్య భక్తిని ప్రసాదించమని కోరుతున్నాఉ.దృష్ట్వా-అదృష్ట్వా అను రెండు పదములతో నిత్యదర్శనానుగ్రహమును కోరిన శంకరులు,మనకు నమస్కార ముద్రను పరిచయము చేస్తున్నారు.ఎనిమిది వేళ్ళూ ఊర్థ్వముఖపయనమునకు సంసిద్ధమైనవేళ,రెండు వేళ్ళు సాధకుని అంతరంగము వైపునకు చూపిస్తూ,దశ ప్రాచీ-దశదక్షిణ అన్న తత్త్వానికి అద్దముపడుతుంటాయి.అద్వైత్వముగా జీవాత్మను ఒకచేతి ఐదువేళ్ళు చూపిస్తుంటే,పరమాత్మను మరో ఐదువేళ్ళుచూపిస్తు,జీవాత్మ-పరమాత్మ సంగమమునకు సంకేతమౌతున్నది.నమస్కారము.


 ప్రస్తుత శ్లోకము,

 కదావా వినేష్యామి? ఎప్పుడు గడుపుతానోకదా

   అదియును ఏ విధముగా నంటే

 కల్పానాం విధాత్వానాం క్షణమివ వినేష్యామి

 బ్రహ్మ కల్పాంత సమయమును సైతము ఒక్క క్షణకాలము వలె

 కదావా వినేష్యామి? ఎప్పుడు గడుపుతానో?

  ఎక్కడ అంటే

 కనకమణిమయ సౌధ కైలాసములో

   ఏ విధముగా నంటే

  ప్రమథ గణములు ప్రస్తుతించుచుండగా

   ఏమని అంటే

 హే ప్రభో-హే స్వామిన్-హే సాంబ-హే పరమ శివా-హే విభో అంటూ

   ఆ సమయములో నేను మీ ఎదురుగా శిరమును వంచి

     నమస్కరించుచు-మీ సాయుజ్యములో

       తరించే భాగ్యమును అనుగ్రహించు

     సదయ-వెంటనే ఓ పరమ శివా

   సర్వము పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




NA RUDRO RUDRAMARCHAYAET-23(SIVAANAMDALAHARI)

 శ్లో :  కరోమి త్వత్-పూజాం సపది సుఖదో మే భవ విభో

విధిత్వం విష్ణుత్వమ్  దిశసి ఖలు తస్యాః ఫలమ్-ఇతి

పునశ్చ త్వాం ద్రష్టుమ్  దివి భువి వహన్ పక్షి -మృగతామ్-

అదృష్ట్వా  తత్-ఖేదం కథమ్-ఇహ సహే శన్కర విభో      23


సాధకుడు స్వామి క్షిప్రప్రసాదత్వమును కోరుకొనుచున్నాడు.అదియును నిరంతర దర్శనభాగ్యమును అభిలషిస్తున్నాడు. నిత్యపరమానంద సుఖమును స్వామి వీక్షణము వలన కలుగు పరమానందమును ఆదిశంకరులు కోరుకొనుచున్నారు. హేవిభో-హే పరమేశా! నీ సర్వవ్యాపకత్వమును తెలిస్కొనగలిగిన జ్ఞాననమును,సవమునందు నిన్న దర్శించగల వరమును ప్రసాదించుము. ఈ శ్లోకములో ఆదిశంకరులు స్వామి దర్శన సౌభాగ్యమును వరముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. పూజ అను పదము పునర్జన్మములేకుండా చేయుమని వేడుకొనుటకు సంకేతముగా పెద్దలు భావిస్తారు. ఆదిశంకరులు తాము స్వామిదర్శనమునకు నోచుకోని ఎడల సంభవించే దుఃఖమును భరింపజాలనని కనుక సర్వవేళలందును సన్నిధిలో నుండనిమ్మంటున్నారు. దర్శనాభిలాషను మరింత ప్రస్పుటముచేస్తూ దానికి అవరోధముగా నున్న అహంకారమును తనకు కలుగనీయవద్దన్న దానికి సంకేతముగా బ్రహ్మ హంసనెక్కి ఊర్థ్వముఖముగాను,హరి వరాహమునెక్కి అథో ముఖముగాను పయనించినప్పటికిని నిన్ను దర్శించలేక పోవుటకు అడ్డుగా నిలిచినది వారి అహంకారము ఒక్కటే, కనుక విభో నీ కారుణ్యము నన్నెళ్ళ వేళల నీ ముందుంచును గాక. ఆదిసంకరులు ప్రతి ఉన్నప్పటికిని యుక్తాయుక్తము మరచిన ,మితిమీరి హుంకరించిన అజ్ఞానమును అణిచివేయుము. నన్ను ఆదరింపుము అని పరమేశుని వేడుకొనుచున్నారు. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.



Tuesday, November 22, 2022

NA RUDROE RUDRAMARCHAYAET-30



 న రుద్రో రుద్రమర్చయేత్-30
   *********************
 "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
 ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం
 బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన  వా
 డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరుని, నే శరణంబు వేడెదన్."

   బమ్మెర పోతన మహాకవి.(గజేంద్ర మోక్షము)
 స్థూలమును గమనిస్తూ,దానిలో దాగిన సూక్ష్మమును   గ్రహించగలుగుటయే   ఈశ్వరానుగ్రహము.

                     స్థూలములో తాబేటిని చూస్తుంటే దాని అవయములను కాసేపు ముడుచుకొని,తన డొప్పలో దాచేసుకొని,మరికొంత సేపు బయటకు విస్తరింపచేస్తూ,తాను మాత్రము ఎటువంటి వికారమును పొందకుండా స్థిరముగా నుండు సూక్ష్మ భగవతత్త్వమును అర్థముచేసుకొనగలుట భగవంతుని మీఢుష్టత్వము.

 

 నిక్షిప్త-ప్రక్షిప్త శక్తులను సమయానుకూలముగా వ్యక్తీకరిస్తూ,విశ్వపాలనమును నిర్వహించు పరమాత్మను, నేను శరణము వేడుచున్నాను.

 ప్రియ మిత్రులారా!
   ఈ కార్తిక మాసమునకు మనము చేయు బిల్వార్చనమునందు "మీఢుష్టమ" అనే పదమును అర్థము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.అనుగ్రహమును వర్షించుట మీఢుష్టము.స్వామి అనుగ్రహం అవ్యాజము.అర్హతలను లెక్కించదు.

 నమకములో సైతము,
 అనువాకము-1-9. మంత్రము
 " నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ  మీఢుషే
" అంటూ స్వామి ప్రసాదగుణమును ప్రస్తుతించినది.
  మేఘముగా మారి అధికముగా వర్షించు వాడనునది
 వాచ్యార్థము.అంతరార్థములు  స్వామి మనకు అందించు అన్వయ అనుగ్రహములను బట్టి ఆధారపడి ఉంటుంది.
  సహస్రాక్షాయ అను పదమునకు ఇంద్ర శబ్దమును అన్వయిస్తారు పెద్దలు.ఇంద్రియసామర్థ్యమే ఇంద్రుడు.
 ఇంద్రియ విషయమునకు వస్తే (మీరంతా విజ్ఞులు) నా మటుకు మూడు     ఉదాహరణములు
నన్ను అయోమయములో పడవేస్తుంటాయి.
 మొదటిది
 అసలు ఇంద్రియములన్నీ సమర్థవంతములేనా?
 అయినప్పుడు అవి వాటి సామార్థ్య ప్రకటనమును వేరు వేరు సందర్భములలో నే ఎందుకు ప్రకటిస్తుంటాయి.?
 ఉదాహరణమునకు నా చేతిలో రాళ్ళ ఉప్పు ఉన్నది.దానిని చూడగానే నా కన్ను ఉప్పును గుర్తించినది.స్పర్శ కూడా దానికి వత్తాసు పలికినది.
  నేను దానిని నీళ్ళ పాత్రలో వేసాను.కాని తికమక.మర్చిపోయాను వేశానో/లేదో అన్న సందేహము.
 పాత్ర వంక చూస్తు కన్నును అడిగాను.తెలియదన్నది.చేతిని అడిగాను చెప్పలేనన్నది.
 విచిత్రము ఇంకో ఇంద్రియము   జిహ్వ, అప్పటివరకు మౌనముగా నున్నది నేను చెప్తాను అంటు రుచి చూసి,నీరు ఉప్పగా నున్నదని చెప్పింది.
   ఇంద్రియములను సమయానుకూలముగా పనిచేయిస్తున్న రుద్రా! నీకు నమస్కారములు.
.
  అంతే కాదు బాహ్యము/స్థూలరూపము. దానిలో నిక్షిప్తముగా దాగిన సూక్ష్మము
కౌశలమును కనబడనీయుట లేదు.ఆ విషయము చెబుతాను.
 మొన్నొక సభాకార్యక్రమమునకు వెళ్ళాను.అందరు ఎన్నో కళలలో  ఆరితేరిన  వారే.వారెవరు నాకు తెలియదు.వారి ప్రతిభను గమనిద్దామని వారిని పరికించాను.అందరి ఉపాధులు ఒకటిగానే ఉన్నాయి.గుర్తించలేకపోయినాను.

 సభ ప్రారంభమయినది.
 గాయని గళము అమృతము చిందుచున్నది.నర్తకి భంగిమ అద్భుతము చేయుచున్నది.చిత్రలేఖనము,కవనము అన్నీ ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.

 అంతవరకు కనుగొనలేని నా తెలివితక్కువను తెల్లబోయేటట్లు చేసిన రుద్రునకు నమస్కారములు.


 మూడవ  ఉదాహరణము
,
 ఆధ్యాత్మికమైనప్పటికిని ఉపాధికి సంబంధించినదే.
 ప్రవచనము వింటున్నాను.జీవికి మూడు శరీరములు అని చెప్పగానే ఏదో అంతా తెలిసినట్లు అవునవును-స్థూల-సూక్ష్మ-కారణ   శరీరములని    మురిసిపోయాను.
 అప్పుడే తెలిసినది నా నిజ స్థితి.వాటి గురించి నాకేమి తెలియదని.అసలు వాటికైనా తెలుసో/లేదో.

  అవి మూడును ఒకే ఉపాధికి సంబంధించినప్పటికిని వేటి బాధ వాటిదే.ఒకదాని అవస్థను ఇంకొకటి తీర్చలేదు.
1 స్థూల శరీరము ఆకలిదప్పులు తనకు లేవని,
2.సూక్ష్మ శరీరము జరామరణములు తనకు లేవని
3.కారణ శరీరము తనకు పై రెండింటి బాధలు లేవని,
తమకు తామే పొగుడుకుంటూ,పొగరుబోతు తనముతో ఎగురుతుంటాయి .

  కాని స్థూల శరీరమునకు జరా-మరణముల భయం
   సూక్ష్మ శరీరమునకు ఆకలి-దప్పికలను ఇబ్బందులు
  కారణ శరీరమునకు పాప-పుణ్య ఫలితము/పునర్జన్మల భయము.
   ఎంతటి విచిత్రము జీవి గమనము-గమ్యము.

  ఓ రుద్రా నీ అనుగ్రహము, 
 5.వ అనువాకము-7.వ మంత్రము
 నమో మీఢుష్టమాయచ-ఇషుమతేచ" 
  వర్షమూర్తి వానజల్లులు బాణములుగా కీర్తింపబడెను.
 గోదాదేవి "తిరుప్పావై" 4.వ పాశురములో,
 శరమళై- పెయిదిడాయ్
-శరములవంటి జల్లులతో వర్షమును కురిపించుము,అదియును,నీ చేత ధరించియున్న సుదర్శన కాంతి వంటి మెరుపులతో,స్వామి శరీర కాంతిని  పోలిన మేఘకాంతితో,పాంచజన్య శబ్దమును పోలిన ఉరుముల శబ్దములతో అనుగ్రహ వర్షమును కురిపించమని ప్రార్థిస్తున్నది.

 వర్షప్రభావముగా కేదారముల మధ్యన ప్రవహించుచున్న పిల్లకాలువలో ,వేదశాస్త్ర ఉపనిషత్ మడుగులలో యోగులనెడి చేపలు కేరింతలు కొడుతున్నవట.
  రుద్రా! నీ అనుగ్రహ వర్షముచే సస్యకేదారములలో/సారస్వత పంటపొలములలో సన్నగా ప్రవహించుచున్న పిల్లకాలువలలో, నీ నిజతత్త్వమును తెలుసుకొనగలిగిన మహాత్ములు చేపపిల్లల వలె తుళ్ళుచున్నారట.

  శివము అనగా శుభములు
  శివతర-మిక్కిలి శుభములు
  శివతమ-అనిర్వచనీయ శుభములు
  మీఢుష్టమ-మాపై వర్షించుమా రుద్రా నమో నమః


     
 

   నీ నిజతత్త్వమును తెలుసుకొనట కేవలము నీ అనుగ్రహమే కనుక దానిని నామదిలో స్థిరముగా  నిలిచి యుండునట్లు మమ్ములను ఆశీర్వదించుము.
 
 చేతులారంగ శివుని పూజింపడేని
 నోరు నొవ్వంగ హరికీర్తి నుండువడేని
 దయయు సత్యంబు లోనుగా తలపడేని
    వానిని సైతము నీ కరుణా వాత్సల్యము కృతార్థుని చేయుగాక.

  "కరచరణ కృతంవా-కర్మ వాక్కాయజంవా
   శ్రవణ నయనజంవా-మానసంవాపరాధం
   విహితమహితంవా-సర్వామే తత్ క్షమస్వ
   శివ శివ కరుణాబ్ధే  శ్రీమహాదేవ శంభో
         నమస్తే నమస్తే నమస్తే నమః"

 " న రుద్రో రుద్రమర్చయేత్" 
   పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా, కుప్పల తప్పులు అనినా,
     తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా

 (ఫలశృతి) గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
 నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన 
 విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన 
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన. 
  ఏక బిల్వం శివార్పణం.

( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
    స్వస్తి.




++


Monday, November 21, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-29


 



  న రుద్రోరుద్రమర్చయేత్-29

  ********************

 " జితం జితం తే జిత! యజ్ఞ భావన!

   త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః

   యత్ రోమగర్తేషు నిలిల్యురధ్వరాః

   తస్మైనమః కారణ  సూకరాయతే."-యజ్ఞో వై విష్ణుః.


  యజ్ఞవరాహ స్తోత్రము.


 యజ్ఞ స్వరూపుడవై,యజ్ఞరక్షకుడవై,వేద స్వరూపుడవై,వరాహరూపములో ప్రకాశిస్తున్న నీ శరీరములోని ప్రతి రోమకణములోను సమస్త యజ్ఞ కార్యములు నిండి యున్నవి.నీ నాలుగు పాదములే ఋత్విక్కులు,నీ నేత్ర చకనమే ఆజ్యము.నీ నాసికయే పెద్ద స్రుక్కు.నాసికా రంధ్రములు చిన్నగరిటెలు.నీ ఉదరము యజ్ఞకుండములోని అగ్ని.నీ చెవులు సోమరస పాత్రలు.నీ నోరు ఆహుతులు.నీ దంతములు అగ్నిహోత్రములు.


 యజ్ఞ కర్తవు-యజ్ఞ భోక్తవు-యజ్ఞ హర్తవు నీవే అని దేవతలు యజ్ఞవరాహమూర్తిని ప్రస్తుతిస్తున్నారు.


 ప్రియ మిత్రులారా!

 సనాతన ధర్మము నా (స్త్రీ) ఉపాధికి నియమించిన పరిమితిలో ,ఈ రోజు బిల్వార్చనమును "యజ్ఞ" శబ్ద వైభవమును గ్రహించే పయత్నము చేస్తాను.

  చమకములో చెప్పినట్లు సామర్థ్యమునీయమని అమ్మను ప్రార్థిస్తూ,ప్రారంభిస్తాను.


  పరమ పావనమైన  నీపాదరజ కణము

  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము


  అమ్మ మహిమ గుర్తించని చిమ్మచీకట్లలలో

  విజ్ఞత వివరము తెలియని  యజ్ఞ వాటికలలో


  అటు-ఇటు పరుగులిడు తలపులను ఇటుకలతో

  సంకల్ప-వికల్పములను సుక్కు-శ్రవములతో


  విచక్షణారహితమను  సంప్రోక్షణలతో

  కుతంత్రాల తతులనే  కుటిల మంత్రాలతో


  తమస్సులో తపస్సులను బహులెస్స హవిస్సులతో

  నా అజ్ఞానము సర్వము  యజ్ఞముగా మారుచున్న వేళ


  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా

  మానస విహారి! ఓ సౌందర్య లహరి.


      అర్చనము/అర్పణము అను అర్థమునిచ్చు "యజుః"యజుస్ అను ధాతువు నుండి "యజ్ఞము" అను పదము ఏర్పడినది.అర్పణము చేయుటకు తగిన అర్హతను సంపాదించు ప్రారంభమే యజ్ఞోపవీతధారణము.చతుర్వేదములలో రెండవదైన యజుర్వేదము శుక్ల-కృష్ణ  అను రెండు విభాగములు కలది/సంహితలు కలది.           .శుక్ల యజుర్వేదము మాధ్యందిన-కణ్వ సంహితలను కలిగియున్నది.పేరులోనే దాని స్వభావము మేలును కూడియున్నది అని తెలియుచున్నది.

 కృష్ణ యజుర్వేదము తైత్తరీయము,కథకము-కపిస్థకము-మైత్రావని సంహితలను కలిగియున్నది.

 

  ఋగ్వేద-హోత


  యజుర్వేద-అథ్వర్య


  సామవేద-ఉద్ఘాత


  అథర్వణవేద-బ్రాహ్మణ పాల్గొని,

యజ్ఞమును పరిపూర్ణమును కావింతురు.




   యజ్ఞములలో మనకు "స్వాహా" అను మంత్రము తరచుగా వినిపిస్తుంటుంది.


 మనలో వివిధరూపములలో-వివిధనామములలో దాగిన పరమాత్మను సు-ఆహ్వానమే స్వాహా మంత్రము.


 హోమ గుండము న మః నాది కాదు, అను నామమునకు న మమ అన్నదానికి సంకేతము.




 నిజముగా చెప్పాలంటే ఈశ్వర విభూతి ప్రకంపనలే యజ్ఞము.


 యజ్ఞములు నిత్యములని-నైమిత్తికములని రెండు విధములు.


 వాడుకలో క్రతువు,ఇష్టి,యాగము,యజ్ఞము ,హోమము,అగ్నికార్యము పర్యాయ పదములుగా వ్యవహరింపబడుతున్నప్పటికి,వాటిని వేటి నిమిత్తమైన చేస్తున్నామా,నిత్య విధిగా జరుపుకుంటున్నామా,స్వార్థమునకా,విశ్వ శ్రేయస్సుకా అనే అంశములు వాటి విధానమును నిర్ణయిస్తాయి.


 అహంకారముతో దక్షుడు చేసిన యజ్ఞము,ప్రతీకారముతో జనమేజయుడు చేసిన యాగము,పుత్రులు కావాలనే కోరికతో దశరథ మహారాజు చేసిన ఇష్టి,క్షాత్రముతో చేసిన రాజసూయము,అశ్వమేథము,విశ్వజిత్ యాగములు ఒక్కొక్కటి ఒక్కొక్క ధ్యేయముతో జరిపించినవి.

 నిజమునకు సర్వము ఈశ్వరానుగ్రహమే నన్న భావముతో ఈశ్వరుని సాక్షిగా ఈశ్వర సమర్పణము చేయుటయే యజ్ఞము.

 దానము ప్రాపంచికము.దాత-దానము-గ్రహీత భౌతికముగా కనిపిస్తూనే ఉంటారు.నాది ఇక మీదట నీది అన్న ద్వంద్వ భావన ఉంటుంది.

 సమర్పణము దానికి భిన్నము.దాత-త్యాగము-గ్రహీత  ఒక్కరే.అయినప్పటికిని ముగ్గురుగా ప్రకటనమగుటయే కాక,సాక్షిగా-మధ్యవర్తిగా అగ్నిహోత్రుని అనుసంధానము ఉంటుంది.ఆ ప్రక్రియ సమర్పణము హవిస్సుగా మారుతుంది.


 రుద్ర చమకము 8 వ అనువాకములో మనో-వాక్కాయ-కర్మల ద్వారా నిర్వహించు యజ్ఞమునకు కావలిసిన పరికరములు ప్రస్తావింపబడినవి.

 పాత్రలు

 *******

 1.చమసాశ్చమే-యజ్ఞపాత్ర

 2.ఆధవనీయశ్చమే-సోమలతను కడిగెడి పాత్ర

 3.ద్రోణకలశశ్చమే-మఱ్ఱిచెక్కనుండి మామిడి కాయ ఆకారములో చేయబడిన పాత్ర

 4.హవిర్ధానంచమే-హవిస్సులనుంచెడి పాత్ర

  ఇధ్మశ్చమే-సమిధలు

  బర్హిశ్చమే-గరికలు

 సుచశ్చమే-చెక్క గరిటలు

  యజ్ఞకుండము,వేదిక చెప్పబడినవి.

 /స్వరవశ్చమే/మంత్రాశ్చమే-మంత్రములు -వాక్కునకు,చెప్పిన తరువాత 

 యజ్ఞమును నిర్వహించుట వలన కలుగు ప్రయోజనములను 10 వ అనువాకములో తెలియ చేసారు.

 ఆయుర్యజ్ఞేన కల్పంతాం-ప్రాణో యజ్ఞేన కల్పంతాం అంటూ ప్రాణములు,పంచేంద్రియములు మేము చేయుచున్న యజ్ఞము వలన సమర్థవంతమగుగాక!  అని స్వస్తి వాక్యము నందించు చున్నారు.

 సమర్థవంతమైన ఇంద్రియములచే నిర్వర్తింపబడుచున్న యజ్ఞము వలన 

 పృధ్వీచమే-అంతరిక్షంచమే.దిశశ్చమే-విదిశ్చమే,భూమ్యాకాశములు,దిక్కులు-మూలలు సస్యశ్యామలమై,శాంతి-సౌభాగ్యములతో విలసిల్లును కాక అని ఆశీర్వదిస్తున్నారు.

 మనో వాక్కాయ కర్మలను పవిత్రీకరించుటకు దర్భలు త్రిమూర్త్యాత్మకములై తేజరిల్లు చున్నవి. 

 

 శ్రీ లలితా రహస్య సహస్ర నామములు "పంచ యజ్ఞ " ప్రియ అని అమ్మవారిని కీర్తిస్తున్నది.

 మానవ ఉపాధిలో నున్న మనము నిర్వర్తించవలసిన 5 ముఖ్య యజ్ఞములను

1 పితృ యజ్ఞము

2.దేవతా యజ్ణము

3.ఋషి యజ్ఞము

4.భూత యజ్ఞము

5.బ్రహ్మ యజ్ఞముగా చెబుతారు.

  మన పూర్వజుల యందు గౌరవభావముతో వారిని విస్మరించకుండుట,చేయవలసిన ధర్మములను మానకుండుట  పితృ యజ్ఞము.

 మన ఇంద్రియములను సమర్థవంతముగా సన్మార్గమున నడిపించు ప్రయత్నమే దేవ యజ్ఞము

   ఋషులు మనకు అందించిన ఇహిహాసములను,సాహిత్యమును,చదువుతు -సంస్కారమును బలపరచుకొనుటయే ఋషి యజ్ఞము

   అన్ని జీవుల యందు(భూతము అనగా ఉన్నది) ఈశ్వరుని ఉనికిని గమనించి అన్న పానములను సమర్పించుట భూత యజ్ఞము.


    ఇవి చేయవలెనన్న మన ఉనికిని మనము అధ్యయనము చేసుకొనవలెను.బ్రహ్మము-పరబ్రహ్మము మనలోనే చైతన్యముగా దాగి మనలను నడిపిస్తున్నదని విషయమును ఏమరుపాటుతో మరువక సార్థకతను పొందుటయే చేయు నిరంతర-నిరహంకార ప్రయత్నమే బ్రహ్మయజ్ఞము.

 భగవంతుని అనుగ్రహముతో మనందరము సత్యం వద-ధమం చర అను సూత్రమును పాటిస్తూ,స్వామి అనుగ్రహమును పొందుదాము.

 మరొక కథా-కథనముతో రేపటి బిల్వార్చనములో కలుసుకుందాము.

 ఏక బిల్వం శివార్పణం.




Sunday, November 20, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-28


  




 న రుద్రో రుద్రమర్చయేత్-28


 ******************


 "" ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం


    వందే "మహోదార తర" స్వభావం  ఘృశ్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే"




  స్వామి మహా ఔదార్యమును చెప్పకనే చెబుతున్నది పై ధ్యాన  శ్లోకం.


  మనో వాక్కాయ కర్మలను మారుస్తూ స్వామి చేసే లీలను మానవమాత్రురాలిని నేనెలా గుర్తించగలను.


 నేటి సాత్వికము రేపు తామసమునకు పెద్దపీట వేయగలదు.యుక్తాయుక్తమును దూరముచేయగలదు.మంచి-చెడుల మధ్య తాను దాగి మాయ,  మనలను ఆడించగలదు.లేవలేనంత పతనములోనికి పడవేయగలదు. అదియే తనలో నిజమును గ్రహించలేని మాయాజాలము.


 మనము చెప్పుకోబోవు కథలోని రెండు పాత్రలు అక్కా-చెల్లెలు.ఒకరు మాయామోహితులు-మరొకరు మాయాతీతులు.



 వారిలో ఒకరిని వశపరచుకొనిన అసూయ తీవ్రమై ఏ విధముగా దురాకృతములను చేయించినదో,మరొకరి దరిచేరలేని అరిషడ్వరగములు స్వామి మహోదారత వలె ,ఎంతటి ఔదార్యమును ప్రదర్శించినదో తెలుసుకుందాము.


 ప్రియ మిత్రులారా! 


   ఈనాటి మన బిల్వార్చనలో మనము " అసూయ" అను పదము తెచ్చిన అనర్థములను గురించి,వానిని అవలీలగా దాటించిన మహోదారుడైన మహేశుని గురించి స్మరించుకొని తరిద్దాము.


 రుద్ర నమకములో సైతము,




 4.చ అనువాకము-3.వ మంత్రము




 " నమో గృత్సేభ్యో-గృత్స పతిభ్యశ్చవో  నమః"


    ఉభయతో నమస్కార యజస్సు.



  గృత్స-అనగా ఆశపడు స్వభావము,ఇంద్రియ లౌల్యతకలవారి రూపములో నున్న రుద్రునకు నమస్కారము.



 ఆమెయే మనకథలోని సుదేహ.


 గృత్స పతి-వారిని సైతము సంస్కరించి-సంరక్షించు స్వామికి,స్వామి భక్తురాలైన ఘృశ్న కు నమస్కారములు.


 భగవంతునికి-భక్తురాలికి అభేదము.


 మితిమీరిన అసూయ ఆగ్రహమునకు దారితీస్తుంది.అరాచకములను చేయిస్తుంది.



 అదే విషయమును నమకము,


 2వ అనువాకము-4.వ మంత్రము


 " నమో వంచతే-పరివంచతే స్తాయునాం పతయే నమః"


 విశ్వాసపాత్రునిగా/పాత్రురాలిగా నటిస్తూ సంతోషమును/వైభోగమును అపహరించిన వాని రూపములో నున్న రుద్రునికి నమస్కారములు.



 వంచన గుప్తము నుండి ప్రకటన స్థితికి మారుట -అదియే పరివంచతే-బాహాటముగా వంచించుట.



 అసూయను అధిగమించిన అనాలోచిత అకృత్యముల పరాకాష్ఠ.


 దాని కార్యాచరణమే,


8.అనువాకము-5వ మంత్రము


 నమో  అగ్రే వధాయచ.


 ఎదుట నున్న శత్రువులను చంపు రుద్రునకు నమస్కారములు.




  8. అనువాకము-6వ మంత్రము


 " నమో హంత్రేచ-హనీయసేచ"


   శత్రువులను చంపువాడును,


 హనీయసేచ-ప్రళయ కాలమున అతిశయముగా చంపు రుద్రునకు నమస్కారములు.



   ఆ రుద్రుని కీర్తించలేని నా అసహాయత,కథ వైపునకు కదులుతున్నది.


  ఓం నమః శివాయ.


   




 దేవగిరి దుర్గములో సుధర్ముడు అను బ్రాహ్మణుని ధర్మపత్ని సుదేహ.ఆమె పేరులోనే ఆమె ఏ విధముగా ఇంద్రియములకు వశమై చేయరాని పనులను చేసినదో సంకేతిస్తున్నది.సంతానము కొరకై,వారి వంశాభివృద్ధికొరకై,తాను మాతృత్వమును పొందలేని కారణమున తన భర్తకు,తన చెల్లెలైన ఘృశ్న ను ఇచ్చి వివాహము చేయదలచినది.భర్త రాబోవు పరిణామములను ఊహించి,తగదని హితవు చెప్పినను వినలేదు.కాలాతీతుని ఆటగా కాలము పరుగిడుచున్నది.



 ఘృశ్న పరమ సాధ్వి.పరమ శివభక్తురాలు.ప్రతిరోజు 108 పార్థ్వివ శివలింగములను తయారుచేసుకొని,శివార్చనము పిదప అక్కడ  నున్న కోనేటిలో నిమజ్జనము చేసెడిది.


 ఈశ్వరానుగ్రహముగా ఘృశ్నకు పండంటి కుమారుడు జన్మించి దినదిన ప్రవర్ధమానమగుచున్నాడు.



 వానితో పాటుగా సమ ఉజ్జీనే నేనంటు సిదేహలో అసూయ సైతము అవధులను మించి తాండవిస్తున్నది.


   కుమారునికి వివాహము జరిగినది.ఏ నోట విన్నా వారి జంట చక్కదనము-ఘృశ్న వైభవము పదే పదే వినబడుతూ,చాలదన్నట్లు కనబడుతూ సుదేహలోని విచక్షణను మింగివేసింది.



 స్వరూపము యథాతథముగా నున్నప్పటికిని స్వభావమును పూర్తిగా మార్చివేసినది.


 ఏ అఘాయిత్యమునకు పూనుకుంటున్నదో,ఏ అమాయకునికి మూడుతున్నదో,ఏ సాధ్విని లోకోత్తర శక్తిగా చూపించబోతున్నదో 


 అంతా  లోకేశునకే ఎరుక.


 ఆదమరచి నిదురించుచున్న అమాయకపు బాలుని వైపునకు సుదేహ క్రోధము మళ్ళించినది.వీని వలనే గా ఆ ఘృశ్నకు గొప్పదనము.వీనిని అంతమొందించిన చాలు అనుకుంటూ కత్తితో వానిని ముక్కలు ముక్కలుగా నరికింది.అయినా అక్కసు తీరలేదు.అవయవములను మూటగట్టి ఘృశ్న పూజించు కొలనులో పడవేసినది.ఎంతటి పైశాచికమో ఆమెను నడిపిస్తున్నది.


 తెల్లవారినది.పతి కనబడని కారణమును గమనించినది కోడలు..ఏమి తెలుసుకోలేని అమాయకత్వము.


       సుదేహ  అంతటితో ఆగలేదు.ఘృశ్న ను అనుసరిస్తూ,గమనిస్తున్నది.ప్రతిరోజు మాదిరి 108 లింగములకు అభిషేకము జరిపినది.ఆనందముతో నిమజ్జనమునకై  కొలను దగ్గరికి వెళ్ళినది.


 కనిపించినది కుమారుని మృతదేహము..కదలలేదు మహాసాధ్వి.అంతా ఈశ్వరుని లీల.కాదనలేము కదా.


  నోరు విప్పి ఎవరిని నిందించలేదు.స్థిరచిత్తముతో శివనామము చేయుచున్నది.


 భక్తురాలి ప్రవర్తన భగవంతునికి ఆగ్రహమును కలిగించినది.

  కొలను నుండి కోపముగా ప్రకటనమయినాడు.



 సుదేహను శిక్షించెదనని ముందుకు దూసుకు వస్తున్నాడు త్రిశూలి.అక్కను క్షమించమని వేడుకున్నది.


 కాదనగలడా తన భక్తురాలి అభ్యర్థనను.


 క్షమించాడు సుదేహను.కాదు కాదు మార్చివేశాడు సుబుద్ధిగా.


 కొలను తీరము నుండి కదిలి వచ్చాడు ఘృశ్న కుమారుడు .


 ఈశ్వరాన ఎవ్వరెరుగరు కదా.


 కారుణ్యమునకు ముందు కాఠిన్యమును పంపుతాడు కరుణసామి .


 ఘృశ్న పేరు తన పేరుగా మార్చుకొని స్వామి మనలను సైతము సంస్కరించి,అనిశము సంరక్షించును గాక.


  మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.


 ఏక బిల్వం శివార్పణం. 




Saturday, November 19, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-27



  




 న రుద్రో రుద్రమర్చయేత్-27


 *************************


 -బాణాసుర కృత శివస్తోత్రము.


 **********************




1. మహాదేవ మహాగురు సురేశ్వర నీలకంఠ


   యోగబీజ యోగరూప యోగీశ్వర నమోనమః.




2.జ్ఞానబీజం జ్ఞానరూపం జ్ఞానానందం సనాతనం


  తపోఫలానుగ్రహం దైవం సర్వసంపత్ప్రదాయకం




3.తపోబీజం తపోరూపం తపోధనం సదాశివం


  కరుణబీజం కరుణరూపం చిన్ముద్రం చిదంబరం




4..నరకార్ణవతారణం భుక్తి-ముక్తి ప్రదాయకం


  అశుతోషం సుప్రసన్నం అవ్యాజము అనుగ్రహం




5.హిమవాసం చంద్రమౌళిం శ్వేతపద్మ ప్రకాశకం


  బ్రహ్మజ్యోతి స్వరూపము భక్తానుగ్రహ విగ్రహం.




6.పంచభూతం పంచేంద్రియం పంచామృతం బహురూపం


  జలరూపం అగ్నిరూపం నింగిరూపం దిగంబరం




7.వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహాత్మకం


  చిద్రూపం స్వస్వరూపం విరూపాక్షం విశ్వరూపం




8.శక్తిస్వరూపం ఈశ్వరం భక్తానుగ్రహ విగ్రహం


  వేదస్తుతం పరమపూజ్యం త్రిభువనరక్షకం.








9..అపరిచ్చిన్నం ఆదిదేవం అవాఙ్మానస గోచరం


  వ్యాఘ్రచర్మాంబరధరం మందస్మితం మహేశ్వరం


  త్రిశూల పట్టిధరం కరుణం చంద్రశేఖరం.




0.శంకరం చరణంశరణం నిత్యం బాణసన్నుతం


   భక్తహృదయనివాసం దుర్వాస ముని సంస్తుతం.




 11.సంపత్కరం స్తవప్రియం గంధర్వ మునివందితం


   పరమపదం ప్రణవం పవిత్రం పరమాద్భుతం




12.బాణస్తోత్రం మహాపుణ్యం సత్వరం పాపనాశనం


   దుష్టపీడనివారణం సర్వతీర్థ స్నానఫలం.




13.అపుత్రో లభతే పుత్ర పఠనం శ్రవణం స్తుతి


   అవిద్యాంలభతే విద్య శంకరం ఇది నిశ్చితం




    ప్రియ మిత్రులారా!


 ఈ నాటి బిల్వార్చనలో  మనము " యుద్ధం" శబ్దము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


   విభిన్న తలపుల మధ్య-చేష్టల మధ్య ఒడంబడిక లోపించినపుడు జరిగే సంఘర్షణము.అది సాయుధమైన కావచ్చును-శాంతపూరితమైనదైనా కావచ్చును. దాని స్థాయి తీవ్రమయితే,విస్తరించి రెండు సామూహిక శక్తుల మధ్య యుద్ధముగా పరిణమిస్తుంది.తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది.సామాన్యముగా న్యాయాన్యాయముల మధ్య జరుగుతుంటుంది.


 నమకములో యుద్ధ ప్రస్తావనము.


 7.వ.అనువాకము 2వ మంత్రము


 నమో ధృష్ణవేచ--ప్రమృశాయచ".





 ధృష్ణవేచ-యుద్ధమునందు వెనుకంజవేయని  రుద్రునకు నమస్కారములు

.


  ప్రమృశాయచ-శత్రుసైన్య విశేషములను కనుగొనగలుగు యుద్ధనీతిపరునకు నమస్కారములు.




 7వ అనువాకము-1.వ మంత్రము


 నమో దుందుభ్యాయచ-హనన్యాయచ


   యుద్ధప్రారంభమునము మ్రోగించు దుందుభి రూపమునను ,దానిని కొట్టు కర్ర రూపమున నున్న రుద్రునకు నమస్కారములు.



 8. అనువాకము-5వ మంత్రము


 నమో అగ్రే వధాయచ-దూరే వధాయచ


  ఎదుట నున్న శత్రువులను-దూరముగా నున్న శత్రువులను కొట్టు రుద్రునకు నమస్కారములు.




2.వ అనువాకము


 "నమో హిరణ్య బాహవే సేనాన్య దిశాంచపతియేనమః"


 హితము-రమణీయము-హిరణ్యము


  హితమునొసగు రమణీయ బాహువులతో సేనలను నడుపు రుద్రునకు నమస్కారములు.


6.వ అనువాకము-12 వ మంత్రము


 " నమ శూరాయచ-అవభిందతేచ"


 అవభిందతేచ-శత్రువులను అప్రయత్నముగా  పడగొట్టు రుద్రునకు నమస్కారములు.



 వర్మిణేచ-బిల్మినేచ అంటు కవచ ప్రస్తావనము  13&14 మంత్రములలో వచ్చినది.ఆధ్యాత్మిక అర్థములను ,అంతరార్థములను పరిశీలించలేని నా అశక్తత ,శివుడు తన భక్తునికిచ్చిన మాటకై,చేసిన యుద్ధమును తెలుసుకొనుటకు తొందరపడుతున్నది.


  అఖిలాండకోటి సంరక్షకుని తన శోణితపురకోట సంరక్షకునిగా మాత్రమే భ్రమించు (బలిదానవ మనుమడు) బాణాసురుని తరపున యోధునిగా మారిన రుద్రుని కథ.


  యాదవులకు-అసురులకు జరిగిన -కాదు కాదు హరి-హరులు 


 జరిపించిన ముగ్ధమనోహర యుద్ధగాధ.


 పరమ శివభక్తుడైన బాణాసురుడు శివుని తన కోటకు కావలిగా నుండు వరమును పొందిన భాగ్యశాలి.



 అతని కుమార్తె ఉష.ఆమె చెలికత్తె చిత్రలేఖ.చక్కటి చిత్రకారిణి.


  హరి-హరులు ఇద్దరుకాదు.ఒక్కరే అను "సత్యమును చాటు కథను స్వప్నము" ప్రారంభించినది.కలలో కనిపించిన అనిరుద్ధుని సమీపమునకు తెప్పించినది.సంసారమును చేయించినది.సంగతి తెలిసికొనిన బాణునికి కోపమును తెప్పించినది.నాగాస్త్ర బంధనముచే అనిరుద్ధుని బంధింపచేసినది.


  చింతాక్రాంతులైన యాదవులకు అనిరుద్ధుని విషయమును తెలియచేసినది.ఆపై బాణుని పై దండెత్తించినది.


  వరమును సద్వినియోగ పరచుకోలేని బాణూణీ  అజ్ఞానము కలవరముగా మారినది.


 మాటదాటలేని పరమేశుని సేనానాయకునిగా యుద్ధమును చేయించుటకు సిద్ధపడమన్నది..


   ఎంతటి మహద్భాగ్యము.


 " ఇరుసేనలు కదలుచున్నవి.ఇహపరముల నొసగుచున్నవి."


 శివుడు కృష్ణునితో తలపడుచున్నాడు.ప్రద్యుమ్నుడు కార్తికేయునివైపునకు పరుగిడుచున్నాడు పట్టి బంధించుటకు.బలరాముడు బాణాసురుని బలగమును/బలమును హరించివేస్తున్నాడు.


 బాణమునకు -బాణము.అస్త్రమునకు-అస్త్రము.ఆయుధమునకు-ఆయుధము.పరస్పరము ఆడుకుంటున్నాయో/ఆదుకుంటున్నాయో చెప్పలేని స్థితి.


 ఒకదానిని చూసి మరొకటి అహంకరిస్తున్నాయో-అనుగ్రహిస్తున్నాయో గమనించలేని పరిస్థితి.


 కదులుతున్నాయి.క్షణములో కనుమరుగవుతున్నాయి.


 పదునుగా కనిపిస్తూ అదను చూసి అదృశ్యమవుతున్నాయి.


  అదొక ఆనందము హరిహరులకు.కాదు అభిమానము వారి భక్తులపై.




  ఆటకు మలుపు తిప్పుతూ హరి ప్రయోగించిన అస్త్రప్రభావమును గౌరవిస్తూ,ఆవులిస్తూ,నందిపై కాసేపు విశ్రమించాడు శివుడు.బాణాసురుని (అహమును) చేతులను పేర నున్న చేతలను సంస్కరించాడు శ్రీ కృష్ణుడు.


 కదనము తాను కదిలి కళ్యాణమునకు కారణమైనది.




 బాణాసురుని భక్తిని లోక విదితము చేసినది.


   ఉష-అనిరుధ్ధుల కళ్యాణ మును గావించిన హరి-హరులు మనలనందరిని ఎల్లవేళల రక్షించెదరు గాక.


 మరొక కథా కథనముతో రేపటి  బిల్వార్చనలో కలుసుకుందాము.


 ఏకబిల్వం శివార్పణం.






   




    





   


    



Friday, November 18, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-26


 




   న రుద్రో రుద్రమర్చయేత్-26


   **************************


  " యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై


  సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే."


  సద్భక్తిని-ముక్తిని ప్రసాదించగల విశేషపూజనీయునకు నమస్కరించుచున్నాను.


  ఈశ్వరార్చనకు ఉపాధి నియమములేదు అనుటకు మనము ఎన్నో కథలను విన్నాము.కావలిసినది నిష్కళంకభక్తి మాత్రమే.ఆ భక్తి తాత్కాలికమే అయినప్పుడు దాని వలన లభించిన వరప్రభావము కూడా బాహ్యముగానే ఉంటుంది కాని భగవంతుని చేరదానికి చేదోడు కాలేదు.


  ప్రియ మిత్రులారా ఈ నాటి బిల్వార్చనలో మనము "యాతుధాన్య:" పదమును తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


 పెద్దల అభిప్రాయము ప్రకారము,



 "యాతులు" అనగా దుఃఖమును కలిగించు మాయలు.అట్టి మాయలు కలిగినవారలు యాతుధాన్యులు.



 నమకములో సైతము వీరి ప్రసక్తి వచ్చినది.


 నమకములో అసుర శక్తులు-వానిని తొలగించి మనలను రక్షించే రుద్ర ప్రస్తావనము.


 1. అనువాకము-6వ మంత్రము


 " అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్


   అహీగుంశ్చ సర్వాన్ జంభయంథ్ సర్వాశ్చ యాతుధాన్యః."




  ఇందులోని యాతుధాన్యః శబ్దము ధాన్యమునకు సంబంధించినది కాదు.అసురీ గుణములను-అసురీగణములను సంబోధించినది.



   అవి మనకు కానరాకుండా గుప్తముగా/దాగి యైనను కలిగించవచ్చును.


 ఈ విషయమును ప్రస్తావిస్తూనే,


 నమకము 11.వ అనువాకము-7వ మంత్రము


 " యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్"


   మనము భుజించు అన్నాదుల  యందును,సేవించు పానీయములందును దాగి(క్రిమిరూపముగా) మన ఆరోగ్య వ్యవస్థను బాధించు రుద్రునకు నమస్కారములు.




  విచిత్రము అటువంటి వాటిని పూర్తిగా కొట్టి తొలగించు రుద్రునకు నమస్కారములు.


 కర్త-కర్మ-క్రియ మూడును తానైన రుద్రునకు నమస్కారములు.


 నమకము 3. అనువాకము-1 వ యజస్సు


 నమః సహమానాయ నివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః"


 నివ్యాధిన-దుష్టశక్తులను మెత్తగా కొట్టువాడును,,కోలుకోలేని విధముగా


 అవ్యాధినీనాం-పూర్తిగా అంతమొందించు రుద్రునకు నమస్కారములు.




  దుష్టశక్తులు కానరానివి మాత్రమే కాకుండా లోనదాగి పైకి పంచేంద్రియములచేత ప్రకటింపబడుతుంటాయి.వాటినే మనము అరిషడ్వర్గములంటున్నాము.


 వాటిని నిర్మూలించటానికే ఘోర రూపునిగా పరమేశ్వరుని ఆగ్రహము.శుభములను కలిగించును గాక.


  మరికొన్ని దుర్గుణములు అంతః-బహిః ప్రకటితమగుతూ,భావములతోనే కాక,చేష్టలను జోడిస్తూ మరింత ఇబ్బంది పెడుతుంటాయి.వారినే రాక్షసులు,అసురులు,దానవులు,దైత్యులు అంటూ వారి వారి ప్రవర్తనమును బట్టి వ్యవహరిస్తుంటారు.


  ఈ వర్గములన్నియు స్వల్ప భేదముతో యాతుధాన్య వర్గమునకు చెందినవే.


 వీరి ప్రస్తావనము సైతము


 3. అనువాకము-6వ మంత్రము


 నమః సృకావిభ్యో జిఘాగుం సద్భ్యః"


  జిఘాగుం సద్భ్యః-బాగుగా హింసింపగోరు స్వభావము గలవారిని,వజ్రాయుధమువంటి తన ఆయుధముతో శిక్షించి,సాధువులను రక్షించు రుద్రునకు నమస్కారములు.


 జిఘాగుంసద్భ్యులు-


 9వ అనువాకము-19 వ మంత్రము


 నమః ఆమీవత్కేభ్యః


 స్థూల స్వభావము కలవారు.


 మనకు కనులముందు కనిపిస్తూ కఠినత్వముతో సాధుజనులను హింసించువారుగా కూడా నున్న రుద్రునకు నమస్కారములు.


   ఇప్పుడు మనము తెలుసుకొనబోవు కథ అటువంటి ఇద్దరు రాక్షసుల గురించి తెలియచేయునది.




 సూర్య-చంద్రకేతనముతో ప్రకాశించుచున్న శ్రీనాగనాథుడు మనలను అనుగ్రహించును గాక.


 పూర్వము దారుకావనమను అటవీ ప్రాంతమునందు  దారుకుడు-దారుక అను రాక్షస  దంపతులుండెడివారు.వారున్న ప్రదేశము మాత్రమే అనాగరికముకాదు.వారు మనము సైతము దారుణావనమే.దయారహితమే.


  దారుకి రాక్షస  స్త్రీ అయినప్పటికిని గౌరీ భక్తురాలు.ఆమెను ప్రసన్నురాలిని చేసుకొని,తన సామ్రాజ్యమును తమకు నచ్చిన చోటుకు తరలించుకోగల వరమును పొందినది.


  ఇక్కడ వారు తరలించుకోగలిగినది బాహ్య వనమును మాత్రమే.మానసిక వనము అచలముగానే ఉన్నది.ఆగడములను చేస్తూనే ఉన్నది.


  వారు తమ ఇఛ్చానుసారముగా తమ సామ్రాజ్యమును తమకు నచ్చిన చోట్లకు తరలించుకుంటున్నారు.


 ఇంతవరకు ఎవరికి వచ్చిన నష్టము లేదు.వారున్న చోట నున్న మునులను,బ్రాహ్మణులను,సాత్వికులను అనేక చిత్ర హింసలకు గురిచేస్తూ,ధర్మమునకు గ్లాని చేస్తున్నారు.



 అది నిలకడగా ఒకచోటని కాదు.వీరి విచ్చలవిడి దురాగతములను భరించలేని సాధుజనులు తమ అవస్థలను ఔర్వ మునికి విన్నవించుకున్నారు.


  అది వినిన ముని కోపించి,ఇక మీదట ఎవరు రాక్షస  ప్రవృత్తితో మెలగుతారో వారందరు సమూలముగా నాశనమవుతారని శాపమిచ్చెను.


  ఈ విషయమును వినిన ఈ రాక్ష దంపతులు తమ నివాసమును సముద్ర గర్భమునకు మార్చివేసి,తామస గుణములను మాత్రము నిర్వర్తిస్తూనే ఉన్నారు.


 ఇప్పటినుండి ధర్మమునకు గ్లాని సముద్రప్రయాణికులకు  వీరి దురాగతముల  ద్వారా జరుగుతున్నది.స్వామి లీలలు అవ్యక్తములు కాని అసత్యములు కావు.



   ఓడలపై ప్రయాణించువారిని కారాగారములలో బంధించుట,వారి అనుష్ఠానములను భంగము కలిస్తున్నారు.


 ఆటకు ముగింపు పలకాలనుకున్నాడు ఆదిదేవుడు.


  సుప్రియుడనే ఐశ్వర్య వర్తకుని బంధించి,శివపూజను ఆపివేయాలని  బాధించసాగారు.పరమ శివ భక్తుడైన సుప్రియుడు కారాగారములో తనకందిన దుమ్మును పోగుచేసుకుని,పార్థివ లింగుని ఆరాధించసాగాడు.


బాధలు భక్తిని అధిగమించలేకపోయినవి.


 భక్త రక్షణకు భవుడు పార్థివ లింగమునుండి ప్రకటింపబడి,రాక్షసమూకలను నశింపచేసినాడు.


 ఆ సమయమున అమ్మ కూడా అయ్యతో పాటే ఉన్నదట.


  అసురీ గుణములు తిరిగి విఝృంభించి ఆపదలను కలుగ చేయునని అవి కలుగకుండా సాధుజనులకు కాపుగా  తాము అక్కడే కొలువై యుండాలని మనలను అనుగ్రహించిన నాగేశ్వరి-నాగనాథులు /శ్రీ నాగనాథులు మనలను రక్షించెదరు గాక.


 మరొక కథా-కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.




   ఏక బిల్వం శివార్పణం.








Thursday, November 17, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-25

 


 న రుద్రో రుద్రమర్చయేత్-25

  **********************

 "మథురం శివమంత్రం మదిలో మరువకె ఓ మనసా

 ఇహపరసాధనమే-

      నరులకు సురుచిర పావనమే

 ఆగమ సంచారా-నా స్వాగతమిదె గొనుమా

 భావజ సంహార- నన్ను కావగ రావయ్యా."


  ప్రియ మిత్రులారా ఈ రోజు బిల్వార్చనములో మనము "ఇషు" శబ్ద ప్రాశస్త్యమును తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము.

 ధనుస్సు- నారి- బాణములు విలుకాని ఆభరణములు.

 సంరక్షణకు ఆయుధములు.

 అందులో మనకు కనిపించునవి పదునైన బాణములు చేయుచున్న పరాక్రమములు.కాని నిజమునకు ధనువు సహాయము చేయకపోతే అవి నిర్వీర్యము .ఆ ధనువునకు కట్టబడిన గుణము/నారి బిగుతుగా లేకపోతే విలువిద్య

విలువేమిటో  తెలుసుకోగలమా?

 కాని నిజమునకు విల్లు- నారి- శరములు  మన ప్రవర్తన           సంకేతములు.

   మనము చర్చింకోబోతున్న కథనము నరునిది/అర్జునునిది.

   కాదు కాదు నరులది.అంటే మనందరిది.

 అందులో ప్రకటించిన కోపము-ప్రదర్శించిన రోషము జీవుని-దేవుని మధ్య అనవరతము జరుగుచున్నదనుట కాదనలేనిది.

  తపము నెపము.తపమును తాపముగా/కోపముగా మార్చినది ఇంద్రియము.మనసనే ధనుసు తన లక్ష్యమనే నారిని దృఢముగా బంధించకుంటే,ఆ ధనువు సారించుచున్న శరము గురితప్పక గమ్యమును చేరుతుందా? అన్నది సంశయము.


 నమకములో  ఇషు శబ్ద ప్రసక్తిని గమనించిన తరువాత మనము కథను కొనసాగిద్దాము.



  నమక ప్రారంభమే,


 " నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః"

 అంటూ బాణమునకు నమస్కరించుటతో ప్రారంభమైనది.


  1వ అనువాకము -2వ ఋక్కు నందు సైతము

 " యాత ఇషు శ్శివా" అంటూ శివా నీ యొక్క బాణము లోకములకు శాంతమును కలిగించుచున్నది.

  1.వ అనువాకము-4వ ఋక్కు


  "యామిషుం" అంటూ నీయొక్క బాణము

 హస్తే భిభర్షితి-నీ హస్తమునందు ధరించి యున్న బాణము మమ్ములను హింసించకుండునుగాక.


 1.అనువాకము-10 వ మంత్రము

 " యాశ్చతే హస్త ఇషవః"


    తే హస్తే యే ఇషువశ్చ-నీ చేతియందు ఏ బాణములున్నవో  వానిని,

   పరావప-విడిచివేయుము.



 1.అనువాకము-12 వ మంత్రము

 " విశల్యో బాణవాగం

 బాణముల చివరి పదునును తీసివేయుము.


 1.వ అనువాకము-15 వ మంత్రము

 " అథోవ ఇషిః"



 బాణములను కిందవైపుగా అమ్ములపొదిలో దాచివేయుము

 నమకము మొదటి అనువాకములో ఇషు/బాణ ప్రసక్తితో రుద్రుని ఘోర రూపమును ఉపసంహరించుకుని అఘోరరూపునిగా ప్రసన్నుడై మనలను అనుగ్రహించమని కీర్తిస్తున్నది.




    అందులకు నిదర్శనమేనేమో స్వామి ఎరుకలవానిగా,విల్లమ్ములను చేత ధరించి,అర్జునునితో పోరాడి ,పాశుపతమును అనుగ్రహించుట.


  కాఠిన్యము-కారుణ్యము నాణెమునకు రెండువైపులు.నియమోల్లంఘన కారణముగా పాశుపతాస్త్రము/ పశుపతి అనుగ్రహము కొరకై మహేంద్రగిరికి తపోనిమిత్తము అర్జునుడు చేరుట.క్షత్రియ ధర్మముగా ప్రజా సంరక్షణార్థము లేదా ఆత్మ సంరక్షణార్థము ఆయుధములను సమీపములో నుంచుకొనుట సముచితమే.అనుచితమైన విషయము కథను ముందుకు నడిపించినది.

   తెలుగుభాష అత్యంత అందమైనది కనుక నానార్థములను నగలతో  మెరిసిపోతుంటుంది.విల్లునకు బిగించి కట్టు తాటిని నారి అంటారు.గుణము అని కూడా అంటారు.గుణము అను పదమునకు స్వభావము అను అర్థమును అన్వయిస్తారు.


   వింటి నారి కనుక స్వభావమయితే విల్లు మన మనస్సేకదా.దానికి బిగుతుగా కట్టవలసినది సంకల్పమును.మనసనే ధనుస్సునకు కల బాణములు పంచేంద్రియములు. మనస్సు గట్టిదైన తాటిచే బంధింపబడినప్పుడే శరములు గురిని తప్పవు.ఏకాగ్రతయే నారిని లాగి సంధించుట.

   అర్జునుని విషయమునకు వస్తే సత్వగుణ తపమునకు గుర్తు.రజో గుణము క్షాత్ర  ధర్మము.

 కాని విచిత్రము కథలో/కథలో మాత్రమే సుమా

 తమో గుణము ఈ రెండు గుణములను అధిగమించినది.


   దానికి నిదర్శనమే

 సూకరమునకా   "రణము"


 అవును సూకరమే "కారణము".


 అవును బొందె ఎవరికి చెందవలెనది సందేహము.

 ఊపిరి విడిచిన ఉపాధి నడిపించుచున్న నాటకము.

    ఇది బాహ్యము.పరిణామములు అనూహ్యము.


 నిజమునకు ఇది దేవునకు-జీవునకు మధ్య జరుగుచున్న పోరాటము.కాదు జీవుని ఆరాటము.

  ఇద్దరు విలుకాండ్రు ఒక మృత వరాహదేహమునకై తమ శరాఘాతము వలననే ప్రాణము కోల్పోయినది కనుక అది తమదేనన్నది వివాదము.

 ఇంతకు శరములను సంధించిన జీవుని విల్లు గాండీవము.దేవునిది పినాకము. పి నాకము.నాకము అనగా స్వర్గము.స్వర్గము అనగా ఏదో లోకము అంటారు కొందరు.మరికొందరు ద్వంద్వాతీత స్థితి అని గ్రహిస్తారు..

  తన నిజ గమ్యమును మరచిన తామసిక స్థితి అర్జునునిది.తపము చేసి పాశుపతమును పొందవలసినది గమ్యము.కాని దానిని విస్మరింపచేసినది అహంభావము.విగత పందికై తగవులాడుచున్నది.


 నిజ స్థితిని తెలియచేయవలసిన బాధ్యత కలది అనుగ్రహము.

   ప్రసాదించుటకు పూర్వము గ్రహీత యోగ్యతను పరీక్షించుట కర్తవ్యము.

   అంటే పోరునకు కారణము అర్హతా నిర్ణయము.

 శివుడు ప్రసాదించవలసినది-జీవుడు ప్రార్థించవలసినది పశుపతి అనుగ్రహమనెడి పాశుపతాస్త్రము.

   అది కేవలముగా పరిగణింపబడి శస్త్రము/బాణము కాదు.

        మరి. " అస్త్రము."

      మంత్ర పూరితమైన/మహిమాన్వితమైన బహువిధములుగా,మానసికముగా నైన, మంత్రముగా నైన/  ఏ రూపముగా నున్న   ఆయుధముగా నైన/చూపుగా నైన ప్రయోగింపదగినది.దానికి మరొక నియమము కూడా కలదు.సమానమైన సామర్థ్యము కలవారిపైననే,సమర్థవంతమైన సమయము ఆసన్నమైనప్పుడే.


(అర్జునుడు ఉపయోగించిన సందర్భములు లేవని పెద్దలు చెబుతారు)

   శివుని ధనస్సుయొక్క స్పర్శ నరుని మనసును మార్చినది.నిజస్థితిని తెలియచేసినది.

 తన అర్చనమే  తన ఎదుట నున్న ఎరుకలో అచ్చుగుద్దినట్లుగా గమనించగలిగాడు అర్జునుడు.అంటే తమోగునము తరిమివేయబడినది.తాదాత్మ్యత తరలి వచ్చినది.పాశుపతము లభించినది.యుక్తాయుక్తము ముక్తికి కారణమైనది.

 ఇంత కథను నడిపించిన మూకాసురుడుడు  కూడా  ముక్తుడైనాడు.

   పశుపతి మనలందరిని తన అవ్యాజకరుణావీక్షణముతో అనుగ్రహించును గాక.

   మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.


       ఏక బిల్వం శివార్పణం.



    


Tuesday, November 15, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-24

 


   న రుద్రో రుద్రమర్చయేత్-24

   ************************ 

   జటాజూటధారి-శివాచంద్రమౌళి

   నిటాలాక్ష నీవే-సదా మాకు రక్ష.



   ప్రియమిత్రులారా ఈనాటి బిల్వార్చనలో మనము జట శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.


  శిష్తరక్షన-దుష్టశిక్షణ చేయగల స్వామి ప్రకటన శక్తి జట.

  భగీరథుని అనుగ్రహించినది స్వామి. జటాజూట సహకారమేకదా .శాపగ్రస్తుదైన చంద్రుని శిరోలంకారముగా మలచినది స్వామి జటాజూటమే.స్థితికార్య సంకేతము స్వామి జటాజూటమే.జీవుల శరీర నాడుల ముడులు స్వామి జటాజూటములే.

 దక్షయజ్ఞ సందర్భముగా ఆ జటనుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షుని అహమును నశింపచేసినాడు కదా.

  స్వామి ఆకాసతత్త్వమును చెప్పునది స్వామి ఊర్థ్వ కేశపాసమే కదా.

  ఎన్నో పుణ్నదులను ప్రవహింపచేస్తున్నది స్వామి జటయే.

  నమకములో జట శబ్దమును,

 2.వ అనువాకము 5వ మంత్రము

 " నమో హరికేశాయ ఉపవీతినే " స్వామిని హరికేశునిగా వర్ణించినది.

   నల్లని కేశములుగా కనుక అన్వయించుకుంటే 

 నమః శివాభ్యాం-నవ యవ్వనాభ్యాం"

  ఆకుపచ్చని కేశములుగా అన్వయించుకుంటే స్థితికారకత్వము.

 10 వ అనువాకము-3వ మంత్రము

  " ఇమాగుం రుద్రాయ తపసే కపర్దినే"

 బలముకలవాడు-బంధించిన జటాజూతము కలవాడైన రుద్రునకు నమస్కారములు.

 11.వ అనువాకము-6వ మంత్రము

 " యేభూతానాం అధిపతయే విశిఖాసః కపర్దినః"

   నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ" వంటిదే ఈ మంత్రము సైతము.

 జనబాహుళ్యములో జటాధారి-కేశములు లేని జగద్గురులు ఒక్కరే అను భావన.నమో నమః.

   ఇంకొంచం పరిశేఎలిస్తే 

 విశిఖాసః-శిఖలు లేనివారు.అంటే స్థూల దేహము లేనివారు.

 కపర్దినః" చుట్టబడిన జడలు కలవాడు వాచ్యార్థము.

 మన శరీరములోని అనేకానేక నాడీవ్యవస్థలో దాగి యున్నవాడు.

 విశిఖా-సూక్ష్మ తత్త్వము

 కపర్దిని-స్థూల తత్త్వము.

 సూక్ష్మము-స్థూలము రెండును తానైన రుద్రునకు నమస్కారములు.

 మరికొందరి అభిప్రాయము ప్రకారము స్థావరము సూక్ష్మము.జంగమము స్థూలము.

   అంతా తానైన పరమేశ్వరుడు భక్తుల జటలతో ఆడుకుంటూ-ఆదుకున్న కథనము తెలుసుకుందాము.

 మొదటి కథ-కంచార నాయనారు.పరమ శివభక్తుడు.

 శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు.

 భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుటకు ముందుకొచ్చాడు ఆ నందివాహనుడు. జడలు కట్టినకొప్పును అలంకరించుకొన్నాడు. ఓం కపర్దినేచ నమో నమ: అంతటితో ఆగక కొన్ని కేశములను యజ్ఞోపవీతమును చేసుకొని అలంకరించుకొన్నాడు,నమో వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని సన్నుతులందువాడు.ఒక మహావ్రతుని రూపుదాల్చి నాయనారు ఇంటికి వేంచేశాడు.మహదానంద పడిన నాయనారు శివుని పూజించి,తనకుమార్తెను పిలిచి సాధువుకు నమస్కరించమని స్వామి దీవెనలు అందుకోబోతున్న తన బిడ్డను చూసి దొడ్డ సంబరమును పొందాడు." ఆనతి నీయరా శివా" అంటు మైమరచిపోయాడు.

 కపర్డిగా వచ్చిన సాధువు ఆశీర్వచనమునకై వంగిన వధువు కబరీ బంధమును (కేశ సంపద-జడ) చూసి తనను తాను వ్యుప్త కేశుడిగా (కేశములు లేని వాడిగా) భావించుకొని,నాయనారుతో అమ్మాయి కేశ సంపదను తాను మోహించానని,దానితో పంచవటిని నిర్మించుకుంటానని,

కనుక తనకు ఇయ్యమని కోరాడు."శివ శివ! అమంగళము ప్రతిహతమగుగాక"!. ధూర్జటి చెప్పినట్లు అన్నీ తన దగ్గరనే ఉన్నను ఆత్మార్పణశక్తిని పరీక్షించుచు మైమరచిపోతుంటాడు ఆ జడల రామలింగేశ్వరుడు..ఏ మాత్రము ఆలోచించకుండా తక్షణమే కోసి, దానిని శివార్పణము
చేసి అనుగ్రహమును పొందాడు.
 అమ్మాయికి సుగంధకేశపాశమును,దీర్ఘ సౌమంగళ్యత్వమును అనుగ్రహించాడు అర్థనారీశ్వరుడు. 


ఇళుక్కువేలూరు లోని శివుని భక్తుడు కణంపుల్ల నాయనారు.మదనుని కాల్చిన సర్వేశ్వరుడే  తన మదమును జయింపగల దేవుడుగా భావించును.దానికి కారణమైన అగ్నినేత్రునికి అర్పణగా ఆ ఆలయ  ప్రాంగణమంతయు ఆవు నేతి దీపాలతో అనుదినము అమిత భక్తితో సేవించేవాడు.సంకీర్తనము సాంబశివుని కీర్తిని అంబరమును తాకుచుండగా,సవినయ సాష్టాంగ నమస్కారముతోతనువు భూమిని తాకుతు సంతసించుచుండెడిది.
  స్వామి అనుగ్రహమేమో కాని తిల్లైలో కనక మహాసభయందలి స్వామి నృత్యమునకు,నాయనారు మదిలోని శివ లాస్యము అద్దమును పట్టుచుండెను.సానబెట్టిన గాని గంధపుచెక్క పరిమళించదు అన్నట్ట్లుగా స్వచ్చమైన భక్తునకు కలిమిలేములు కదిలించలేవుగా.ఆశీర్వాదమును పొందవలెన్న అగ్ని పరీక్షను అధిగమించుట అనివార్యము.

  ఆ శివుడు లీలా విశేషముగా నిటలాక్షుడు తన భక్తుని నిరుపేదగా చేసెను.నిరుత్సాహమే కానరాని నాయనారు కొడవలిచేతనుబూని,గడ్డికోసి దానినమ్మి వచ్చిన ధనముతో స్వామికి దీప కైంకర్యమును చేయసాగెను.భక్తుని కీర్తిని చిరస్థాయి చేయుటకు శివుడు ఆ గడ్డిని కూడా మాయము చేసెను.సాధ్యము కానిది ఉన్నదా సాంబ శివుని పూజకు! దీపములు ప్రకాశించుటకు గడ్డికి బదులు తన శిరోజములు  శివభక్తుని ఆనతిని శిరసావహించినవి.శివోహం శివోహం శివపద  స్థిర నివాసమును కల్పించినవి.
   ఆ సదాశివుడు మనలనందరిని చల్లగ రక్షించునుగాక.
  మరొక కథాకథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.
   ఏక బిల్వం శివార్పణం.



 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...