Friday, January 5, 2018

JAI SREEMANNAARAAYANA-23


మారిమలై మురైంజిల్ మన్ని క్కిడందు ఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందు దఱి
మూరి నిమిరిండు మురంగిప్పు ఱప్పట్టు
పోదరుమా  పోలే నీ పూవై ప్పూవణ్ణా ఉన్
కోయిల్ నిన్రు ఇంగనే పోందరిళిక్కో ప్పుడైయ
శీరియ శింగాశ నత్తిరుందు యాం వంద
కారియం  ఆరాయ్ అందరుళ్ ఏలో రెంబావాయ్ .

 ఓం నమో నారాయణాయ-23

విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది

హర్ష-వర్ష ప్రదమైన వ్రతమును చేయించు చున్నదైన
గోదా తల్లి పలుకుచున్న " ఏలో రెంబావాయ్" లో

అమ్మ పిలుపు వినబడి నిదురను చాలించిన వాడైన
శీరియ సింగము భంగి గుహ వెడలిన స్వామిలో

పరిమళ కేసరములు ప్రపంచీకరణమైన
శంకలేని భక్తి చేయు గోపికల కైంకర్యములో

సిం హాసనమధిస్టించమని వినయము వింజామరలైన
వినుతుల తోడ్కొనిపోవు విభవ స్వాగతములలో

అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె.

భావము

చెలులను వ్రతమును చేయుటకు పిలుచుచున్న అమ్మ్మను,అమ్మ పిలుపువిని నిదురను చాలించి సిం హము వలె గుహనుండి బయటకు వచ్చిన స్వామిని,స్వామి అనుగ్రహమును తన కేసరములతో అంతా వ్యాపింప చేసినట్లు,దానితో గోపికలో కలిగిన సేవాభావమును,సిం హాసనమును అధిష్టించుటకు వింజామరలను వీచుచు స్వామిని అనుసరించుచున్న గోపాలకులను మన గోపిక దర్శించ గలిగినది కాని ఎన్నో సందేహాలు ఆమెలో చోటు చేసుకున్నాయి.

వర్ష సమయమున గుహను దాగి స్వామి నిదురించుట ఏమిటి? స్వామి అనుగ్రహము వలననే నెలకు ఆరక వర్షములు కురిసినవి కదా.ఈ భావమును కొంత స్వామి దయచే అన్వయించుకోగలిగినది".గుహ మన మనస్సు."అందులో స్వామి నిదురించుటకు కారణము "భవబంధములు వర్షమై "ఎడతెగక కురియుచు మన మనస్సును" తమోగుణమను" చీకటితో నింపగా అది గుహవలె కానిపించుచున్నది.ఇందులో నిదురించుచున్నది మన జ్ఞానము.అది పరమాత్మను గుర్తించలేకున్నది. స్వామిని మేల్కొలుపవలెనను కోరికను (సుప్రభాత సేవను) తీర్చుటకు నిద్రను మన కొరకు నటిస్తాడు అని పెద్దలు చెబుతారు.అటువంటి అజ్ఞానమను నిద్రను అమ్మ( చెలులను పిలుచుట) లేచి రండి అని మనలోని జ్ఞానమును మేల్కొలుపుచున్నది.లేచి గుహ నుండి వచ్చుచున్న స్వామిని శౌర్యపు సిం హముతో పోల్చింది చూసిన ఆ గోపిక.భగవంతుడు తప్ప ఈ సృష్టిలో తక్కిన వారందరు స్త్రీలే.ఒక్క స్వామియే పురుషుడు.మనకు రాజు.అతని కేసరములు విదల్చుటచే పంచభూత ప్రపంచమంతయు పునీతమైనది.దాని కారణముగా దర్శన భాగ్యముతో తృప్తి పడిన గోపికలలో కింకర (సేవక) భావము ప్రవేశించి స్వామిసేవకు పరుగుతీస్తోంది.కనుక స్వామి కురిపించినది "ఋతు" వర్షము (వాతావరణ) కాదు.అమితానందమును కలిగించు "ఋత"(నిజము-శాశ్వత సంతోషము) వర్షము.

జ్ఞానము స్వామి నామముతో చీకటినుండి బయలువెడలి ప్రకాశిస్తూ నడుస్తుండగా, గోపికలలో,గోపాలురలోని వినయము వింజామరలై వీచుచు ,స్వామిని సిం హాసనమును అధిస్టింపచేయుటకు సాదరముగా అనుసరిస్తున్నాయి.ఇంతకు ముందే విసనకర్ర గురించి వివరించుకున్నాము.చామరీ మృగ శరీరమునుండి వచ్చి వీచును కనుక దీనిని వింజామర అందురు.కస్తూరి మృగము,చామరి మృగము ధన్యజీవులు.వివిధస్తుతుల మధ్య గోపాలురతో స్వామి తన మనో సిం హాసనమును అధిష్టించుటకు వచ్చు చున్నాడని గ్రహించిన గోపికయందు నిమగ్నమైన నామనసు.అమ్మవెంట వ్రతము చేయుటకు సాగుచున్న గోపికలతో పాటుగా తాను అడుగులను కదుపుతోంది.

( ఆండాళ్ తిరువడిగలే శరణం)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...