Tuesday, January 9, 2018

JAI SREEMANNAARAAYANA-28


 కఱ్వైగళ్ పిన్ శెన్రుకానం శేరుందుప్బోం
 అఱివొన్రు మిల్లాద ఆయుక్కులత్తు ఉందన్నై
 ప్పిఱవి పిఱందనై పుణ్ణియం యాముడయోం
 కుఱైవొన్ఱు మిల్లాద గోవిందా! ఉందన్నోడు
 ఉఱవేల్ నమక్కు ఇంగొళిక్క ఒళియాదు
 అఱియాద పిళ్ళైగళోం అంబినాల్ ఉందన్నై
 చ్చిఱుపేరరైత్తనవుం  శీఱి యరుళాగే
 ఇఱైవా ! నీ తారాయ్ పఱై యేలోరెంబావాయ్ 

 ఓం నమో నారాయణాయ-28
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
నల్లనయ్య పుట్టిన గొల్ల వంశములో పుట్టినామన్న పున్నెమున్నవారైన
కల్ల-కపటము తెలియని అల్లరి రేపల్లె గోపికలలో
" కఱ వైగళ్ పిన్ శెన్ఱు కానం" అని అంటున్న వారైన
"అంబినాల్" దూరముగానుంచుట కుదరదంటున్న గోపికలలో
"గోవింద-గోపాల "అని చిన్న చిన్న పేర్లతో పిలుచుచున్న వారైన
వీళ్ళా! అని చిన్న చూపు చూడకూడదంటున్న గోపికలలో
"అనన్య శరణత్వం-ఉపాయత్వం-భోగత్వం" అకారత్రయమైన
సర్వస్య శరణాగతినొందిన శుద్ధ సత్వ గోపికలలో
రాసలీలలాడుదాము రమణులారా రారె
ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె.
భావము
గోపికలు శ్రీకృష్ణునితో గొల్ల కులములో పుట్టిన వారమని,లోకానుసరణ తెలియని వారమని,స్వామిని చిన్న చిన్న పేర్లతో పిలిచి అపచారముచేసిన వారమని,అయినను శ్రీకృష్ణుడు వారిని నిరాదరించరాదని వేడుకుంటున్నారు.
గోపికలు ఆవులను అడవికి తీసుకుని వెళ్ళుటయే నిత్యకర్మలని,గోవులను మోక్ష సాధనమునకు గాక పాడికి మాత్రమే పెంచుతున్నామన భావన కలవారమని,నియమ-నిష్ఠలు లేని వారమని అమాయకముగా మాటాడుచున్న మహా మేధావులు..కనుకనే వారు అకారత్రయమును ఆశ్రయించినామని అంబే (ప్రియమైన స్వామిని)తో చెప్పుచున్నారు.అంత మహిమాన్వితమైనది ఆ అకారత్రయము అని గోపిక ఆలోచిస్తోంది అవి
అనన్య శరణము-అనన్య ఉపాయము-అనన్య భోగము.మన గోపికల పరిస్థితి.
వారికి కావలిసినవి స్వామి ఒక్కడే అందీయగలడని శరణువేడారు.వారి వ్రతమునకు కావలిసిన వస్తువులు-మనుషులు-వాయిద్యములు స్వామియే అందీయగలడని,
స్వామిని ఉపాయముగా అనుకున్నారు.భక్తి పరి పక్వమై స్వామిని ఉపేయముగా పొందకోరుతున్నారు.వారికి కావలిసినది,వారి కోరిక తీరుటకు కావలిసినది,వారిని సంపూర్ణ సంతుష్టులను చేయగలిగినది స్వామి యని తెలియచేయుటయే "అకార త్రయము".
వేదవ్యాస విరచితమైన " శ్రీమద్భాగవత" దశమ స్కంధములో (29-33) రాస పంచాధ్యాయి గా ప్రశస్తి గాంచినవి.జయదేవుని గీతగోవిందము మరొక మణిపూస.
"యద్భావం తద్భవతి" అన్న ఆర్యోక్తి రాసలీలను గురించి ముచ్చటించు సమయమున వర్తిస్తుంది కనుక మనం నిష్కళంక మనసుతో దీనిని భావించుదాము.
రాసలీల అంటే మంచి (ప్రయోజనముగల) పని అని అర్థమును పెద్దలు సెలవిచ్చారు.ఇది నవరసాతీత నవనవోన్మేష అలౌకిక ఆత్మానంద హేల." ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు" అనునట్లు ఒక్క రేడు పెక్కు నీడలుగా మారి చక్కని తాత్త్వనికతను తెలియచేయు ఆధ్యాత్మిక అనుగ్రహము.
రసము అను దానికి ఆస్వాదించు ద్రవ పదార్థము అను అర్థమును కనుక అన్వయించుకోవాలనుకుంటే పరమాత్మ కృష్ణ భక్తి అను మధుర రస పానముతో పునీతులైన జీవాత్మల (గోపికల) తాదాత్మిక నృత్యహేల మన కృష్ణుని రాసలీల.
మన గోపికలు శుద్ధ తత్త్వముతో నున్నారని అనుకున్నాము.కనుక వారు తమో-రజో గుణములతో నున్న వారి కుటుంబ సభ్యులను వీడి,నల్లని చీకటి తమోగుణ ప్రధానమైనది(రాత్రి).దానిని వీడి తేజోరూపమైన పరమాత్మను దర్శించి-సేవించుటయే లీల.(మనుషులు చేయు పనులను కర్మలు అని దైవము చేయు పనులను లీలలు అని అంటారు)."త్వమేవాహం" (నీవే నేను-నేనే నీవు) తారాస్థాయిలో నున్న తపస్సు.
అద్భుత రసానుభూతిలో మన గోపిక తేలియాడబోతున్నదని ఆలోచిస్తూ,అమ్మ వెంట రాసలీలకు బయలుదేరిన గోపికలతో పాటు,నా మనసు తాను అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )
JAI 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...