Wednesday, April 11, 2018

SAUNDARYA-LAHARI-87

 సౌందర్య లహరి-కామాఖ్యాదేవి

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 బ్రహ్మపుత్ర నది ఒడ్డున బ్రహ్మాడనాయకి
 భూగర్భ జలములోని సహజ నీటిబుగ్గ రూపు

 దశమహా విద్యలు-మహా భైరవశక్తులు కొలుచుచుండు
 కొలిచిన దేవతలకు వరముగ ఖేచరత్వమిచ్చుచుండు

 దక్షిణ-వామాచారములతో పూజించు గారోలు
 రజస్వల అగు తల్లికి అంబువాషి ఉత్సవాలు

 మాయాసతి యోని పడిన నారాయణ నీలాచలమున 
 కామాఖ్యా దేవి మన కామితార్థములిచ్చుచున్నవేళ

 నీ మ్రోలనే నున్న నా  కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

    " కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని
    కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే
    జామదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచని
    పంచ శంకర సంస్థాన భక్తపాలన తత్పరా
    కళ్యాణదాయిని మాతా విప్రదర్శన నర్తనా
    హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా  భవసర్వదా."

   యోని అను పదమునకు కారణము అని అర్థము.తరువాతి కాలములో జననాంగముగా ప్రచారములోనికి వచ్చినది.సృష్టి-స్థితి కార్యములకు కారణమైన మాయాసతి యోని భాగము పడిన ప్రదేశము మహాకాళి మహాలక్ష్మి మహాగౌరి త్రిశక్త్యాత్మకమై కామాక్ష్యాదేవిగా నీలాచల పర్వతమందు ప్రకటితమై మనలను పరిపాలిస్తున్నది.ఒకానకొప్పుడు తల్లి, స్వామితో ఆనందవిహారమును చేయగోరిన స్థలమని,అందువలన సత్సంకల్పములు నెరవేరతాయని విశ్వసిస్తారు.బ్రహ్మపుత్రా నదిఒడ్డున కల ఈ ప్రదేశములలో ఋషులు,సత్పురుషులు అచలములై అచంచల భక్తితో అమ్మను ఆరాధించి పునర్జన్మ రాహిత్యమును పొందిరి.అమ్మ నిర్మాల్యము సహితము సర్వదుఖః హరము 

   దేవి భాగవత ప్రకారము గుహరూపముననున్న దేవాలయ సొరంగము ఒక పవిత్రస్థలమునకు దారితీస్తుంది.అక్కడ ఏ విధమైన రూపము మనకు (చర్మ చక్షువులకు) గోచరించదు.కాని భూగర్భములోని సహజమైన నీటిబుగ్గలోని నీరు యోని ఆకారముగల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది.ఆదిశక్తి కాళియే కాళివిద్యగా,కామాఖ్యా దేవతగా మనలను అనుగ్రహిస్తున్నది యోనిరూప విరాజితయై.ఊర్వశి గుండములో పుణ్యస్నానమాచరించిన తరువాత అమ్మవారి దర్శనము చేసుకొందురు".కమనీయాత్వాత్ కామః "రమణీయత్వము నిర్వచించుట అసాధ్యము.

     "ఆత్మవిద్యా మహ విద్యా శ్రీవిద్యా కామసేవితా"
   అంబువాషీ అను నది అమ్మవారి ప్రత్యేక మహిమకు నిదర్శనము.జగన్మాత రజస్వల అని కూడా వ్యవహరిస్తారు.ప్రతి ఆషాఢ మాస సుక్ల పక్షములోని అరుద్రా నక్షత్ర/మృగశిరా నక్ష్త్ర సంధి కాలములో అమ్మవారి రజస్వల ఉత్సవమును మూడురోజుల పాటు పాటిస్తారు.ఆ సమయములో భూమిపూజలు,వాస్తు పూజలు ,భూసంబంధిత పనులు నిలిపివేస్తారు.అమ్మవారి వస్త్రములు,అమ్మవారి జలములు ఎరుపు వర్ణముతో ప్రకాశిస్తుంటాయి.
  ఇక్కడి పూజారులను గారోలు అంటారు.వారు వామాచార-దక్షిణాచార (కుడి-ఎడమ) పద్ధతులలో పూజలను నిర్వహిస్తారు.
  అమ్మవారికి మానసపూజ అను మరొక వార్షికోత్సవ పూజను భక్తితో చేస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత వైభవముగా తెప్పోత్సవము జరుగుతుంది.

   " కామాఖ్యాం పరమం తీర్థం  కామాఖ్యాం పరమం తపః
     కామాఖ్యాం పరమం ధర్మం  కామాఖ్యాం పరమం గతిం
     కామాఖ్యాం పరమం విత్తం కామాక్యాం పరమం పదం."  అని

   మహేశునిచే స్వయముగా పలుకబడిన కామాఖ్యాదేవి మన కామితములను అనుగ్రహించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

     .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...