Wednesday, April 18, 2018

SAUNDARYALAHARI-97

 సౌందర్య లహరి-రాగి ప్రాకారము

 పరమపావనమైన  నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  ఏడు యోజనముల చతురస్ర ప్రాకారములతో
  పది యోజనముల పరిమళ కల్పక వనములతో

  బంగారు ఆకులతో-రత్నాల ఫలములతో
  వజ్రాల విత్తులతో  రమణీయ ప్రకృతితో

  మథుర మథువు సేవిస్తూ మదనమోహముతో
  గంధర్వుల తమకపు  గాఢాలింగనలతో

  మందస్మిత వదనలు మథుశ్రీ-మాధవశ్రీ ల గూడి
  చైత్ర-వైశాఖముల వసంతుడు చెలువముతో నుండగా

  సారసదళనేత్రి సంకల్పిత సరసరస మనోజ్ఞమైన
  రాగిప్రాకారములోనికి నే సాగిపోవుచున్న వేళ


 నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి


 చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల మాలలను అలంకరించుకొని,తన భార్యలతో పువ్వుల మథువును త్రాగుతూ పూబంతులాడుచున్న సమయమున, వారిచెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.




.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...