Friday, March 29, 2019

NAH PRAYACHCHAMTU SAUKHYAM-02

  నః ప్రయచ్చంతు సౌఖ్యం.-5
 ************************** 
 "వణిగృహ్ నంతిపరే పశ్యతోహరః."

 పశ్యతోహరులు అంటే మనము చూస్తుండగానే అపహరించేవాళ్ళు.వర్తకులు అను భావముతో వాడబడినది.

 భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే.ఓం నమః శివాయ.

  " మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః"

   స్వామి మనకు కావలిసినవిమనకు అందచేయుట కొరకు,చొరలేని గుబురుపొదలలో నున్న వాటికొరకు ఆలోచనచేసి దానిని తెచ్చి విక్రయించు వ్యాపారి రుద్రుడు.ఈశ్వర చైతన్యమే వృత్త్తుల నైపుణ్యము.భక్తుల యోగము ద్వారా భగవత్తత్త్వము ప్రకటితమవుతుంది.శివజ్ఞానము,శివభతి,శివ ధ్యానము,శివార్చన,శివవ్రతము అను ఐదు శివ యోగములు. " ఓం నమః శివాయ".
   


     భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే  

భక్తుడు     .శివనేస-జ్ఞానకళ దంపతులకు శ్వేతర్నయర్ నోముల పంట.తిరువెంగడర్ గా ప్రసిద్ధిచెందెను.చిన్నతనములోనే తండ్రిని కోల్పోయిన,ను,"మాతాచ పార్వతీదేవి-పితాదేవో మహేశ్వర" అను నమ్మకము. తన సంపదను శివభక్తులకై ఖర్చుచేసి అమితానందమును పొందెడివాడు.

" నమో గణేభ్యో-గణపథిభ్యశ్చ వో నమః" గణము-గణపతి రెండును తానై యైన ఆ ఉమాపతి, తన భక్తుని ఒక ఇంటివాడిని చేయాలనుకున్నాడు.అదియును సలక్షణమైన కన్యతో వివాహము జరిపించి ,


శివసంకల్పముగా యుక్త వయస్కుడు కాగానే శివసితంబర శెట్టియర్-శివనామి దంపతుల పుత్రికయైన పరమసాధ్వి శివకళతో వివాహము జరిగినది.చాలాకాలము వరకు వారికి సంతానము కలుగలేదు.

శివుడేమి చేయనున్నాడో ఎవరికి ఎరుక?సమకాలీనునిగా శివసరుమర్ అను ఒక నిరుపేద ఉండెడివాడు.పేదరికము అతని శివభక్తిని ఏ మాత్రము అడ్డగించలేకపోయినది.శివభక్తులను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ,తన భార్య తాళిని సైతము విక్రయించి,అపరిమిత దానధర్మములకు సైతము వెనుకాడెడివాడు కాదు.

 చాలాకాలము వరకు వారిని సంతతితో శివుడు అనుగ్రహించలేదు.కాదనగలడా భక్తులమనసును ఆ కాలకూటధారి.కలలో సాక్షాత్కరించి కొండగట్టుపై నున్న బిల్వ వృక్షము క్రింద ఒక శివయోగి చిన్ని శిశువుతో నున్నాడని వెళ్ళి తెచ్చుకోమని చెప్పాడు.

" నమో అగ్రియాయచ-ప్రథమాయచ".

అందరికంటె,అన్నిటి కంటె ముందర నున్నవాడు.అక్కడి శిశువును ఇక్కడకు చేర్చి,ఏ విధముగా వ్యాపారి ఒకచోటి వస్తువును ఇంకొక చోటికి తరలించి లబ్ధిని పొందుతాడో,అదే విధముగా పరమేశ్వరుడు తాను సర్వాంతర్యామియై, శిశువును భక్తుని దగ్గరికి చేర్చి పరవశించుచున్నాడు.


సంతోషముతో వెళ్ళారు దంపతులు.స్వామి ఆనగా, శివసరూమర్ శివయోగియై బిడ్డతో నున్నాడు. బిడ్దను తీసుకొనుటకు ముందుకు వచ్చిన దంపతులతో బేరము మొదలుపెట్టాడు

 భలే మంచి వింతబేరము.భవహరణము.శుభతరుణము.శివుడు చేయు భలే మంచి భక్తి బేరము.వరమును అందించుటకు వరహాలు బేరమాడుతున్నాడు తులాభారముగా ఆ వరప్రదుడు.


 ఈశ్వరాజ్ఞ ఎవరెరుగరు పరమేశ్వరాజ్ఞ



ఆ యోగి.తులాభారములో సరితూగు బంగారు నాణెములను సమర్పించి,బిడ్డను తీసుకెళ్ళమన్నాడు.శివచైతన్యపు చిద్విలాసమును కాదనగలవారెవరు?ఈశ్వరేచ్చగా పరస్పరము తమకు కావలిసినది ఇచ్చిపుచ్చుకున్నారు.మధురం శివలీల మదిలో మరువకే ఓ మనసా.ఇహపర సాధనమే-సురుచిర పావనమే.

సూత్రధారుని సూచనతో పాత్రధారులు నాటకమును ప్రారంభించారు.పరమేశుని ఆనతి మీరగలరా? 

కొడుకును పిలిచి చేయవలసిన వ్యాపారము గురించి వివరించి దూరప్రాంతములకు
 పంపాడు తనతనయుని.శివుని పంపు ( ఆన).

 ఏ మోహ బంధములను తెంపుతోందో ?ఏ దివ్య బంధముతో కలుపుతోందో ? వేయి కళ్ళతో వేచిచూడవలసినదే ఆ మూడుకళ్ళవాని మహిమలు." త్రయంబకం యజామహే సుగంధిం పుషివర్ధనం."

   సదరు సరుకుతో వచ్చిన పడవ తిరువెంగడర్ ఎదురుచూపులకు బదులు చెప్పింది.తనయుని చూచిన తల్లి సంతోషించింది.తండ్రి తండ్రికి బాధ్యతను జ్ఞప్తికి తెచ్చింది.తన కొడుకు ప్రయోజకత్వమును పరిశీలించాలనుకున్నాడు.

" నమో వాస్తవ్యాయచ-వాస్తుపాయచ" 

 వస్తువుల స్వరూపములో,వానిని ఉంచవలసిన ప్రదేశ నిర్దేశనములలో కల శివునికి నమస్కారము.పడవలోని వస్తువులు తరలించి పేడపిడకలనుంచినాడు ఆ ఫాలనేత్రుడు.ఇది మరొక వ్యాపారము.



సరుకును చూసి సహనము కోల్పోయిన మనసు కొడుకును గదిలో బంధించుటకు సహకరించింది.తన నిగ్రహశక్తిని మింగివేసి,నిర్దాక్ష్క్షిణ్యుని చేసిన సరుకు ఏమిటి? 

" నమో ఉగ్రాయచ-భీమాయచ"


  శ్మశానములో బూడిద సరిపడుటలేదా సదాశివుని అన్నట్లుగా బూడిదగా రూపాంతరమును చెందు పేడపిడకలు.గిడ్డగినిండి తండ్రి కోపముతో పందెమును ఒడ్డుచున్నవి.

" నమః శర్వాయచ-పశుపతియేచ"

   పాపమును హింసించు శర్వుడు లీలావినోదమును అవలోకిస్తున్నాడు.



అరిషడ్వర్గముల బరిలో చిక్కిన తిరువెంగడర్ అరచేతిలోనికి పిడకను తీసుకొని విసిరికొట్టెను." ఓం హిరణ్యబాహవే " హస్త స్పర్శచే పునీతమైనదో లేక తిరువెంగడరుని పూర్వ జన్మ సుకృతమో పిడకలు కనులను మిరుమిట్లు గొలుపుతు రత్నఖచిత బంగారు ఇటుకలుగా మారిపోయినవి.స్వామి తన వర్తక నైపుణ్యమును మరొకసారి ప్రదర్శించి మోహభావను తీసుకొనుటకు,రత్నఖచిత ఇటుకలను వస్తుమార్పిడి చేసాడు.ఎవరికి లాభము-ఎవరికి నష్టము ఎంచగలమా? "విత్తమును విపరీతముగా అభిమానించువానిని వీతరాగుని చేసినది ఈ వర్తకము".ఆశాపాశము తరలినది.ఈశుని పాదము పిలిచినది."యద్యత్ కర్మ కరోతి సర్వమఖిలం  శంభో తవారాధనం"

 పశ్చాతాపుడైన "పట్టినత్తారు" గా పరిణామమునొంది కొడుకును బంధించిన గది తలుపుతీసి చూడగా అందులో కొడుకులేడు.అయోమయముగా చూస్తుండగా భార్య ఒక పేటికను కొడుకు ఇచ్చాడని తెచ్చి ఇచ్చింది తెరిచి చూడగానే అందులో రాసియున్న ఒక తాటియాకు,ఒక గోచి,ఒక గుండుసూది ఉన్నాయి.తాటియాకుపై నీవు శరీరమును వదిలివెళ్ళునప్పుడు కనీసము గుండుసూది కూడ నీ వెంటరాదు.వచ్చేవి నీ పాప-పుణ్య కర్మఫలితములే.కనులు తెరువు అని వ్రాసియుంది.తన కొడుకు సామాన్యుడు కాడని.సాక్షాత్తు సదాశివుడని గ్రహించిన పట్టినత్తార్ తన అద్భుత సంకీర్తనలతో శ్రీకాళహస్తీశ్వరుని సేవించి భావితరములకు మార్గదర్శకుడయ్యెను.

   సంసారమనే చిక్కుదీయలేని పొదరింటి నుండి,సంస్కారమనే వస్తువును తన తెలితేటలతో వెలికితీసి తెచ్చి,సత్సంగమనే సత్ప్రవర్తనను స్వీకరించి,సామీప్య-సాయుజ్యములను అందించు సదాశివుడను వర్తకుడు సర్వవేళల మనలను రక్షించుగాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...