Monday, April 15, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-08

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-08
  ******************************
 భళి భళి భళి మహదేవా-బహుబాగున్నదయా నీ మాయ
 *******************************************






 భగవంతుడు-భక్తుడు ఇద్దరు రథికులే

  రథము-రథకారుడు-రథసారధి ముగ్గురు రుద్రుడే.

 " నమో రథేభ్యో-రథపతిభ్యశ్చవో నమః."

  భవిష్యత్ పురాణము ప్రకారము రుద్రుడు రథము మరియు రథపతి.చతుర్వేదములు చతురాశ్వములు.సూర్యచంద్రులు రథచక్రాలు.ముప్పదిమూడుకోట్ల దేవతలు రథభాగములు.చతుర్ముఖ బ్రహ్మ రథసారథి.స్వామి మేరుపర్వతమును ధనువుగా,వాసుకిని అల్లెత్రాడుగా,హరిని అస్త్రముగా చేసి త్రిపురాసర సంహారమును గావించి జగములను రక్షించినాడు
.

 ' ఓం తక్షభ్యః- రథకారేభ్యో నమోనమః " ( వడ్రంగి) రథకారునకు నమస్కారములు.


 రంభణశీలత్వా రథః.కదిలే స్వభావము కలది రథము.ఈ విధముగా గమనిస్తే జగతిలో కదలిక కలిగిన ప్రతిజీవి రథమే.దానిని సృష్టించిన పరమాత్మ రథకారుదే.నడిపిస్తున్న పరమేశ్వరుడు రథసారథియే." నమో సూతేభ్యో-ఒకసారి అరుణాచలములో స్వామివారి రథము కదిలి గర్భగుడిని చేరుటకు మొరాయించినదని,కావ్యకంఠ గణపతి వారి తన దక్షిణహస్తముతో స్పర్శించగానే కదిలినదని చెపుతారు.అరుణాచల శివ-అరుణాచలశివ అరుణాచల శివ -అరుణాచలా.
 నిన్న మనము సదాశివుని కృపతో విచారశర్మ యను యజ్ఞోపవీతి యగు శివస్వరూపుని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించాము.ఈ రోజు మనునీ చోళుడను పేరుగల క్షాత్ర శివస్వరూపమును గురించి అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము.మానవ శరీరము దశేంద్రియ సప్తధాతాదులతో కూడిన రథము కదా,కదులుచున్న స్వభావము కలది కనుక మన శరీరము కూడ ఒక రథమే.అటువంటి అనేక రథములను (జనులను) పాలించుచున్న సారథి మనునీ చోళ మహారాజు..తిరువారూరు ప్రాంతము.సకలజీవులను కంటికి రెప్పవలె కాపాడుతయే అతని ఆశయము.ధర్మపాలనలో జనులును ధర్మపరాయణులై
                   ధర్మదేవతను గౌరవించుచు,సంతోషింపచేయుచుండిరి." నమో భవాయచ-రుద్రాయచ." ప్రాణులందరికిని కారణమైన రుద్రునికి నమస్కారము.రోదనమునకు హేతువైన దుఃఖమును పోగొట్టువానికి నమస్కారములు.

 " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ"పుణ్యము-పాపము గల మనుష్య లోకముసోభ్యము.అందున్నవాడు కనుక సోభ్యాయచ. యువరాజుగ జన్మించిన రుద్రా నీకు నమస్కారము.కాలాతీతుడు కాలముతో పాటు పెరుగుచు,శాస్త్ర పారంగతునిగా-సత్ప్రవర్తునిగా అలరారుచుండెను.ఈశ్వరాజ్ఞ ఎవరు మీరగలరు? అది ఎవరెరుగరు పరమేశ్వరాజ్ఞ !? ఒకనాడు అతను తన సైనికులతో పాటు,రథారూఢుడై ఊరేగింపుగా వెడలెను.' ఓం నమో ఆశుషేణాయ చ ఆశురథాయచ." వేగముగా నడచు సేన-వేగముగా కదులు రథము గలవాడా నీకు నమస్కారము.రథములోనున్న రాజకుమారునికి ఇది పరీక్షయో లేక ప్రసాదమో అనునట్లుగా రథసారధియైన రుద్రుడు అతివేగముగా అదుపుతప్పుతున్నదా యన్నట్లు నడిపించుచున్నాడు. ఎందుకయ్య రథమును అర్థముకాని విధముగా పరుగులెత్తించుచున్నావు పరమేశ్వరా? .ఇది ఏ పరిణామమునకు పథకమో పశుపతి.ఏ ప్రాయశ్చిత్తమునకు ప్రారంభమో కదా!కాఠిన్యమనిపించు కారుణ్య కథనమునకై కదిలివచ్చినది ఆవుదూడ పరుగులతో.అదుపు తప్పినది రథము,.అసువులు బాసినది దూడ ఆ హరుని లీలగ.అయ్యో ఎంతటి ఘోరము..లీనముచేసుకొనువాని లీల యన. లీలయన.దీనిని చూసిన గోమాత దుఃఖముతో నేలపై పడి తెలివి తప్పినది.రాజకుమారుడు తన పాపమునకు పరిహారము లేదని పరిపరి విధముల శోకింపసాగెను.

" నమో యామ్యాయచ-క్షేమ్యాయచ"

  యమలోకమున పాపాత్ములను శిక్షించు యముని వలె నున్న రుద్రస్వరూపుడును,ప్రజల శాంతిసౌభాగ్యములకు క్షేమంకరుడు అగు రాజు ఉన్న రాజభవన రాజద్వారమునకు చనిపోయిన దూడ తల్లి వెళ్ళి,న్యాయమునకై ధర్మ గంటను మ్రోగించెను." నమో హంత్రేచ-హనీయసేచ" పాపకర్మములను అధికముగా అంతమొందించు స్వభావము కలరాజు జరిగిన ఘోరమును విని,నిష్పక్షపాతియై ఎవరు ఎన్నిచెప్పినను ప్రభావితుడు కాకుండ,తనకుమారుని రథచక్రముల క్రిందనుంచి,అంతము చేయమని,గోవు ఏ పుత్ర శోకమును అనుభవించుచున్నదో-దానిని తానును అనుభవించుట న్యాయమని ఆజ్ఞాపించెను.'

     " నమో ప్రతరణాయచచోత్తరణాయచ." సంసార సాగరములో సంచితములను తొలగించి,సన్మార్గమున నడుపు సదాశివుడు అనుకూలిస్తాడా ఆ అపమృత్యు దోష దండనను.అసలే శంగుడు.



 నమః శంగాయచ-పశుపతియేచ." తనభక్తులకు దుఃఖమును కలుగచేస్తాడా శంగుడు అనగా సుఖమునే పొందించువాడు.శిక్ష అమలుపరచు సమయమున ఎంత మోసగాడవయ్యా శివా అన్న నోటితోనే  అబ్బ నువ్వెంత మంచివాడవయ్యా శివా అనిపించేటట్లుగా,


   రాజకుమారుని పైన ఉన్న రథచక్రము పుష్పహారమై గళమున పరిమళములను వెదజల్లుతోంది.పక్కనే అవుదూడ అవధులు లేని ఆనందమును ఆస్వాదిస్తు చెంగు చెంగు న గంతులేస్తున్నది.


  .భక్త సులభుడు అనురక్తితో వారిని ఆశీర్వదిస్తున్నాడు."

 " నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
   త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ
   కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః."

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...