Sunday, April 28, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-18

     నః ప్రయచ్చంతి సౌఖ్యం-18
    **************************

  భగవంతుడు-భక్తుడు నాదమయులే-నాద ప్రియులే

   " నాదతనుం అనిశం శంకరం-నమామి మనసా-శిరసా"  త్యాగరాజులవారు.

  ప్రణవమే పరమేశ్వరుని శరీరము.అనిశము ఎల్లప్పుడు ప్రణవమును స్మరిస్తుంటుంది.ప్రణవము "ఓం" సూక్ష్మము,"ఓం నమః శివాయ" స్థూలము.అంతేకాదు స్వామి డమరుకము సైతము పంచాక్షరిని శబ్దిస్తూనే ఉంటుంది.( అక్షరాభ్యాస సమయమున)ఓ పరమేశా నీ అనుగ్రహ నాదమును మా పిల్లలపై వర్షించమని ప్రార్థిస్తుంటారు.

  " బ్రహ్మ మురారి సురార్చిత లింగం -నిర్మల భాసిత శోభిత లింగం "మొదటి సారిగా పరమేశ్వర తత్త్వమును గ్రహించిన బ్రహ్మ-విష్ణులు అగ్నిస్తంభము నుండి వెలువడినస్వామిని దర్శించి స్తుతించినవి. ఆదిదేవుడు,తన సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ఐదు ముఖముల నుండి పంచాక్షరిని-సప్తస్వరములను ప్రకటించి నాదమయముగా మలిచాడట.

  " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" ధ్వని-ప్రతిధ్వని రెండును తానైన పరమేశ్వరా ప్రణామములు.త్రికరణశుద్ధిగా చేయుచున్నాను అంటున్నాడు త్యాగయ్య.మనసా-వచసా-శిరసా.స్వామి పాదముల వద్ద శరణాగతి కోరుట,తాను అన్న అహమును వీడుట శివోహం.

    అమ్మ పార్వతి ఒకసారి స్వామి,  యోగులు మిమ్ములను ఓంకార పంజరమునందున్న శుకముగా భావించి,ఓంకారముతో లీనమైన మిమ్ములను దర్శించి,ఆత్మానందమును ఆస్వాదిస్తారట.అన్యమేమి కోరరట.నాలో మీ వీణావాదనమును వినవలెనను కోరిక బలపడినది.మీ భక్తురాలను అనుగ్రహించమని అర్థించినది.

జగత్కళ్యాణమునకై జనని నెపమును తనమీద వేసుకొన్నది.వెంటనే స్వామి రెండు గుమ్మడికాయలతో అద్భుత రుద్రవీణను సంకల్పమాత్రముననే సృజించి తన వాదనముతో శృతులను శుభకరముగా నినదింపచేసినాడట.ముగ్గురమ్మల మూలపుటమ్మ దయతో  ముల్లోకములకు ముక్తిసోపానము లభించినది.

 " పార్వతీ పరమాదేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ
   తస్మాత్ సహతయా శక్త్యా హృది పశ్యంతి యే శివం"

   బ్రహ్మవిద్యను అనుగ్రహించుతల్లి స్వామితోకూడి నా మనమున వసింపుము.నమోవాకములు.

  " నమః ప్రతరణాయచ-  ఉత్తరణాయచ."

   భక్తుని విషయానికొస్తే,
 " మోక్షము కలదా భువిలో,జీవన్ముక్తులు కానివారలకు
   సాక్షాత్కార సద్భక్తి సంగీతజన్న విహీనులకు కలదా
   మోక్షము  రుద్రా! నీ ప్రణవనాదము సప్తస్వరములై పరగ
   వీణావాదన లోలుడౌ శివ మనోరథమెరుగని వారికి," అంటూ

 నిరంతరము నిటలాక్షునికి నాదనీరాజనమొనరించు నాయనారు ఎరుక్కులం పులియర్ అందున్న " ఎళ్" వాయిద్యప్రసిద్ధుడు,వాయిద్య నామముచే ప్రసిధ్ధిపొందిన ఎళుప్పరనార్ నాయనార్.

శివభక్తులకు  తన నాదసంకీర్తనచే కొలిచెడివాడు.అది నారద మహతీనినాదమో,సర్వేశ్వర కృపా కాసారమో,ఎళ్ మంగళవాయిద్యమో ఎవరు గుర్తించలేని దైవగాంధారము వలె దిగంతములు మారుమ్రోగుతూ,దిగంబరుని స్తుతించెడి.కర్ణామృతమై ఆనందార్ణవమున ఓలలాడించెడిది.

ఈ విషయము నారదుని వలన వినిన కపర్దికి కనులారాగాంచాలను వేడుక కలిగినది.ఎంతైనా," నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః" జగమంత వ్యాపించియుండి దూడ వెంట నడచు గోవు వలె భక్తులను అనుసరించుస్వామి కదా.అంతరార్థమెవరికి తెలుసు కాదు ఎవరు తెలిసికొనగలరు?

  అతిథిరూపములో వచ్చిన స్వామికి అన్నిమర్యాదలు చేసి,ఆహ్లాదపరచుటకై తన ఎళు వాయిద్యమును వినిపించసాగెను.శిశుర్వేత్తి-పశుర్వేత్తి-వేత్తి గానరసం ఫణి.పశుపతిని కరిగించి-కరుణించనీయదా.అసలే మంచుకొండమీద నుండు మంచిగుండె స్వామి.తల్లి తనయులతో సహా ప్రత్యక్షమై పరమావధిని చూపాడు అవధులు లేని ఆనందముతో ఆ నాయనారును ఆశీర్వదించి అక్కునచేర్చుకున్నాడు

" నమో శంభవేచ-మయోభవేచ"

  ఇహ-పర సౌఖ్యములను ప్రసాదించు ఈశ్వరా నమోవాకములు.నీ యందలి నిశ్చల భక్తిని నిలిచియుండనీ శివా.

.అంతా తానైన సామి అందరిని కరుణించును గాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...