Sunday, July 14, 2019

DASAMAHAVIDYA-BHAIRAVI


    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

 నమామి భైరవీదేవి మహాశక్తిం నిరంతరం.

శార్దూలము.. భైరవి వర్ణన.

లీలారూపము కొమ్ముకోరలును కేళీ లోల ఘీంకారమున్
జ్వాలాకాంతి శరీరవర్ణ గరిమన్   జాగ్రత్త  నిద్రాస్థితిన్
ప్రాలేయాచల భైరవీమ్ దశ మహా  ప్రాకృత్ సుసంపన్నమున్
మూలాధార విశేష చాలన కరీమ్  మూర్తీమ్   మహామోహినీమ్ !

భావము: కొమ్ములు కోరలతో ఘీంకరించెడి, అగ్నిపర్వతజ్వాల రంగుగల శరీరము, జాగృతి, సుషుప్త స్థితులను స్పందింప చేయుచూ, హిమవత్పర్వతంపై భైరవుని సహచారిణిగా  ప్రకృతిలోని మార్పులను నియంత్రించుచూ, మూలాధార చక్రములో సంచరించే మోహిని ఆ భైరవి!



















  శ్రీమాత్రే నమః
 ************
 " సుధాంశు సూర్య వహ్ని లోచనత్రయాన్వితాం
   నరాంతకాంతక ప్రభూతి సర్వ దత్త దక్షిణాం
   సముండ చండ ఖండనం ప్రచండ చంద్ర హాసినీం
   తమో మతి ప్రకాశినీం భజామి భైరవీం సదా."

   ఆవిర్భావ కారణము.
  *********************
   నిరీశ్వర  దక్షయాగమునకు ఆహ్వానములేకున్నను,వెళ్ళదలచిన సతీదేవిని,రాబోవు పరిణామములను ఊహించి,వలదని పరమేశ్వరుడు వారించెను.కుపితయైన సతి నుండి పదిశక్తులు ఆవిర్భవించి పరమేశుని కదలనీయని సందర్భము.

  ఆవిర్భావ విధానము
 *********************

 మహోగ్రయైన సతి పరమేశునిపై కోపించి తన శరీరమునుండి పది దివ్యశక్తులను ఆవిర్భవింపచేసి శివుని దిగ్బంధనముగావించెను.ఆ సమయమున సతికి ముందు-శివునికి ఎదురుగా ఉన్న శక్తిదేవత భైరవి.

  ఇంకొక కథనము ప్రకారము దుర్గమునితో యుధ్ధముచేయుచున్న సమయమున రణరంగములో తల్లినుండి శస్త్రాస్త్రధారులై దివ్యశక్తులుద్భవించినవని,వానిలో భైరవి ఒక మహాశక్తియని భావింతురు.

 రూపము
*******
  భయంకరమైన ఉరుములు గర్జనలతో నల్లని మేఘములను చీల్చుకొని వచ్చిన అందమైన మెరుపు లాంటిది భైరవి శక్తి.మెడలో వర్ణమాలను ముండమాలగా ధరించి యుంటుంది.చేతిలో బ్రహ్మవిద్యను పుస్తక రూపమున పట్టుకొని ఉంటుంది.రజోగుణ-సంపన్న సృష్టిని రక్తలిప్త పయోధరధారి.మూడు వేదములు తల్లి త్రినయనములు.కాళికులమునకు చెందిన భైరవి విద్య రక్తాభివర్ణియై ఘోరరూపముతో ఉంటుంది.ఘోరరూపి యైన భైరవిని చండి యని కూడా భావించి,ఆరాధిస్తారు.

 స్వభావము
**********

  " భైరవ్యాః శబ్దం సంసేవ్యం సర్వ సంపత్ప్రదాయకం." రవం అనగా శబ్దము.భా అనగా ప్రకాశము.భైరవీ నామము శబ్ద-ప్రకాశ సంకేతము.భయంకరమైన ఉరుముల గర్జనలతో నల్లని మేఘములను చీల్చుకొని వచ్చిన అందమైన మెరుపు కాంతి " భైరవి."తల్లి చిదగ్ని.శ్రీ లలితా సహస్ర రహస్య నామము వచించినట్లు " చిదగ్ని కుండ సంభూతా-దేవకార్య సముద్భవా" యైన తల్లి సృష్టి లోని పరివర్తన శీలము కలది.

 "త్రికోణము" భైరవి అని త్రిపురోపనిషత్తు తెలియచేస్తున్నది.త్రికోణమునకు చుట్టు -పశ్యంతి-మధ్యమ- వైఖరి అను మూడు రేఖలు ఉంటాయి.త్రికోణము లోని మధ్య బిందువు పర వాక్కు-పరమేశ్వరి.పశ్యంతి సృష్టి మధ్యమ స్థితి.వైఖరి సంహారము.పరాశక్తి ఇచ్చయే వీటన్నిటికి మూలము.
భైరవి సమర దేవత.కాళికులమునకు చెందిన ఘోరవిద్య.నరసింహ అవతారముగా పరిగణిస్తారు.దక్షిణదిక్కుకు ఆధిపతిగా వ్యవహరిస్తుంది.తేజస్సును వేడిగాను,కాంతిగాను,వాక్కు గాను,చేతనత్వముగా మార్చే శక్తికలది పరావాక్కైన భైరవి విద్య.

 ఆయుధములు
***********

  'కపాల ఖట్వాగనధరా ఖడ్గ కర్పరధారిణీ
  ధనుషీ చటకీ చర్మాదంతీచ కర్ణ నాలికీ
  ముసలీ హలరూపాచ తూణీర గణవాసినీ
  నానాస్త్రధారిణీ దేవీ నానా శస్త్ర సముద్భవా"

 ఒకసారి ఆయుధములతో మరొకసారి తన వెలుగనే ఖడ్గముతో అమ్మ రాక్షస సమ్హారమును చేస్తుంటుంది.

  

 రాక్షసులను హతమార్చడానికి భైరవికి వెలుగే ఖడ్గము.మరే ఇతర ఆయుధములను ఉపయోగించదు.

 నివాసము.
*********
 " మూలాధార నివాసాచ మూలాధార స్థితా సదా
   వాయురూపా మహారూపా వాయుమార్గ నివాసినీ
   వాయు యుక్తా వాయుకరా వాయుపూరక పూరకా
   వాయురూపధరా దేవీ సుషుమ్నా మార్గ గామినీ
   దేహస్థా దేహరూపాచ దేహధేయ సుదేహికా
   నాడీరూపా మహీరూపా నాడీస్థాన నివాసినీ
   ఇంగలా-పింగలా చైవ సుషుమ్నా మధ్య వాసినీ"

సూక్ష్మముగా మానవదేహములోని మూలాధారము తల్లి నివాసము.ఆమెయే జాగరూక కుండలిని.స్థూలములో చిన్మాత్రలనుండి జ్వాలామార్గములో దిగివచ్చి పంచభూతములను,ఇంద్రియములను శక్తివంతము చేస్తుంది.

  దేవాలయములు
***************
తల్లి దేవాలయములు ఒరిస్సా.అస్సాం ఇంకా పలు ప్రాంతములలో కలవు.తపస్సు-బ్రహ్మచర్యం మొదలగు వాని కోసము దీక్షతో భైరవిని ఆరాధిస్తారు.

   అంతరార్థము.
   ************
 నారసిమ్హావతారముగా పరిగణింపబడు భైరవీమాతను అక్షర రూపిణిగాను భావిస్తారు."అ" కారమునుండి "ః" విసర్గ వరకు భైరవ పదముతోను,"క" కారమునుండి"క్ష" వరకు భైరవీ పదముతో సంకేతిస్తారు.భైరవి యొక్క యోగీశ్వర రూపము ఉమ.ఆమెకున్న వేడివెలుగు చిదగ్నికుండములు.ఘోరా రూపియైన భైరవి పాదారవిందములకు భక్తిప్రపత్తుల సమర్పణముతో

 "ఉద్యద్భాను సహస్రకాంతిమరుణ  క్షౌమాంశిరోమాలికాం
  రక్తాలిప్త పయోధరాం జపనటీం విద్యామభీతింవరం."


 ఫలసిధ్ధి.
 ***********
 " భైరవ్యాః శబ్దం సంసేవ్యం సర్వసంపత్ప్రదాయకం,
   సర్వరోగ ప్రశమనం సర్వమృత్యు వినాశనం."

 సకల బాధా విముక్తి,సకల జనాకర్షణ,సకల సౌభాగ్యప్రాప్తి లభిస్తుంది.ఇది సత్య0

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

https://www.youtube.com/watch?v=EmZe_m3h8FM&feature=youtu.be



  నమస్తస్త్యై  నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.

https://www.youtube.com/watch?v=GjtlCJaZvCk



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...