Tuesday, July 23, 2019

DEVI DASAMAHAVIDYALU.

     దేవిదశమహావిద్యలు-శ్రీ మాత్రేనమః.
     ******************************

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
  ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
     నమ్మిన      వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
 యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

ఒకొక్క దేవత ఆవిర్భావం ఒకొక్క లీలలా వుంటుంది. . ఒకొక్క తత్త్వం ఒకొక్క అవతారం లో వస్తుంది. అందరికీ అందని సూక్ష్మ తత్త్వం నుండి అందరూ పూజించుకునేలా ఒక ఉపాధి ద్వారా మన పూజలు అందుకునే  స్థాయికి దిగి వస్తారు దేవతలు. ఆ తత్త్వ ఔదార్యాన్ని మనం స్తోత్రాలతో అర్ధం చేసుకుని బాగుపడాలి అని మహర్షుల మనోభీష్టం. ఎవరికీ అందని అద్భుతమైన సూక్ష్మతత్త్వం నుండి స్థూలంగా ప్రకటితమయిన  దశమహా శక్తులు.కరుణసంద్రములు.శతకోటి వందనములు.

 అమ్మను వర్ణించడము అసాధ్యము.వేయినాలుకల ఆదిశేషుడే ఒప్పుకున్నాడు.అతి సామాన్యమైన నేనెంత? "దివ్" క్రీడాయాం అను ధాతువు ప్రకారము అండ-పిండ-బ్రహ్మా0డములతో ఆడుకునే అమ్మ నిర్హేతుక కృపాకటాక్షము నా చేతిని పట్టుకొని,తన అనుగ్రహమను కలముతో దశమహావిద్యాతత్త్వమును విశదపరచుచున్నవేళ,నా అజ్ఞానము-అహంకారము కరచాలనము చేసుకొని,లోపములను చేర్చుటలో నిమగ్నమైనవి.సరిచేయలేని అశక్తురాలిని కనుక మాతృస్వరూపులైన ప్రియమిత్రులారా!నా దుస్సాహసమును మన్నించి,సవరించి,సంస్కరించి అమ్మకు అర్పించు ఈ చిరుకానుకను,మరింత సుసంపన్నము చేయమని అభ్యర్థిస్తూ,ఆశిస్తూ,సవినయ నమస్కారములతో మీ సోదరి నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

 సత్తు-అసత్తు తానైన ,అవ్యక్తమైన పరమేశి తత్త్వము పదివిధములైన నామరూపములుగా వ్యక్తపరచు లీలయే దశమహాశక్తులు.ఇవి సృష్టిరహస్యానికి ప్రతీకలు..నానాత్వ-ఏకత్వరూపములు అమ్మ స్వేచ్చాలీలలు.పరమేశ్వరి సంకల్ప ప్రతీకలు.స్థూల-సూక్ష్మ అండ-పిండ-బ్రహ్మాండ పరిపాలనలో అమ్మకు సహాయపడు అదృష్ట-అద్భుత
శక్తులు.నవగ్రహాధిదేవతలుగా ,నానా రూపధారులుగా,కఠినత-కారుణ్యము రూప-స్వభావములుగా కొన్ని శక్తులు,మనోహరత -మాధుర్యము మూర్తీభవించిన మాతృస్వరూపములుగా మరికొన్ని శక్తులు,ఘోర-అఘోర రూపములను సమయసందర్భములను అనుసరించి ధరించుచున్న దయార్ద్రశక్తులే దశమహావిద్యలు. ఉత్తర భారదేశములోను,నేపాలు,టిబెట్టు,చైనా ప్రదేశములలోను దశమహాశక్తుల ఆరాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో,అంగరంగ వైభవముగా చేస్తారు.ఎందరో మునులు,ౠషులు,లామాలు అమ్మను మంత్ర-తంత్ర-నామ-జప యజ్ఞ సాధనలతో సేవించి,సాక్షాత్కారమును పొంది తరియించినారు.


 సత్వగుణసంపన్నమైన ఆధ్యాత్మిక భావనయే ఆదిపరాశక్తి.తల్లి ధర్మపరిరక్షణకై పరిసరాలను తానే సృష్టించుకొని,వానికి అనుగుణముగా ఉందే రూపములో అయిన ప్రకటనమే దశమహాశక్తుల ఆవిర్భావము."నిర్గుణ నిర్మల నిత్య నిరాకార నిరాకుల." నమస్కారములు.

  ఆహ్వానములేని దక్షయజ్ఞమునకు వెళ్ళబోవుచున్న సతీదేవిని పరమేశుడు వారించినందులకు,కుపితయైన సతీదేవి దేహమునుండి దశమహాశక్తులు ఆవిర్భవించి,శివుని కదలనీయలేదని చెబుతారు.

  రుద్రుని దశప్రకార విధానములే దశమహావిద్యలు అని మరికొందరు చెబుతారు.

 నారాయణుని దశావతారములే దశమహావిద్యలుగా భావిస్తారు.స్త్రీ-పురుష భేదము మనచర్మచక్షువులకు మాత్రమే.మాయతొలగిన కన్నులకు మాధవతత్త్వము అర్థమవుతుంది.పంచ భూత-పంచేంద్రియ పరిరక్షణ బాధ్యతా
 నిర్వాహకమూర్తులు .

  దశమహావిద్యలు ఎవరికివారే పరమశక్తివంతులు.ప్రసాదగుణసంపన్నులు.ఎవరిని ఉపాసించినను ముక్తిప్రసాదకులు.

  ఖగోళపండితుల అభిప్రాయము ప్రకారము  నవగ్రహాధిపత్య దేవతలుగా విశ్వసించి,వీరి పూజావిధానమును నియమములను,సాధనా ప్రక్రియను నిర్దేశించినారు.

 దైవకార్య సముద్యత యైన తల్లి అసురసంహారమునకు రణరంగములో తననుండి ఉద్భవింపచేసిన అద్భుతశక్తులుగా చాలామంది .విశ్వసిస్తారు

 ఏదిఏమయినప్పటికిని,స్థూలరూపమైన విశ్వమనే మహాయంత్రమును ఒక్కొక్క భాగముగా ,రూపముగా,రంగులుగా,దశదిశలుగా(నాలుగు దిక్కులు-నాలుగు మూలలు-ఊర్థ్వ-అథోభాగమున పదివైపుల ఉండి,విశ్వచైతన్య ప్రక్రియను,తెలియచేస్తూ,విశ్వరక్షణను గావిస్తున్నవి దశమహాశక్తులనుటలో ఏమాత్రము సందేహము లేదు.( ఇది ఏ కులమునకు మతమునకు చెందని నిత్యసత్యము.)

 సూక్ష్మ రూపమును పరిశీలిస్తే ఈ దశమహావిద్యలు మానవదేహమున వివిధచక్రములను కుండలినీశక్తిద్వారా వ్యాపించుచుశక్తివంతము చేయుచున్నదన్న మాట యోగసాధకులు అంగీకరించినదే.

 దశ మహాశక్తులలో కొన్ని ఉగ్ర తత్త్వము కలవి.మరికొన్ని సౌమ్యతత్త్వము కలవి (ఘోర-అఘోర).ఉగ్రతత్త్వ శక్తులు కాళికులమునకు సంబంధించినవి.సౌమ్య శక్తులు శ్రీకులమునకు సంబంధించినవి.సౌమ్యశక్తులను సంప్రదాయబధ్ధమైన దక్షిణాచార మార్గములో ఆరాధిస్తారు.ఉగ్రశక్తులను సంప్రదాయ విరుధ్ధమైన వామాచార పధ్ధతిలో ఆరాధిస్తారు.కొన్ని విద్యలు ఘోర-అఘోర రూపములలో సమయమును బట్టి ప్రకటిమైన వేళ వాటిని ఉభయ పధ్ధతులలోను ఆరాధిస్తారు.

 అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభ అయిన తల్లినిచక్రములు- యంత్రములు-విగ్రహరూపములను ఆరాధిస్తే బహిర్యాగము అంటారు.మన శరీర చక్రములుగా భావించి,నీవారసూక మాత్రమైన తల్లిని గుర్తించి చేసే ఆరాధనను అంతర్యాగము అంటారు.

 " సర్వ యంత్రాత్మికే-సర్వ మంత్రాత్మికే-సర్వ తంత్రాత్మికే -హే జగన్మాతృకే" తుభ్యం నమోదేవి తుభ్యం నమః.

  సర్వ యంత్రములు-సర్వ మంత్రములు-సర్వ తంత్రములు తానైన "స్వతంత్రా-సర్వతంత్రేశి" కి నమస్కరిస్తూ,

   యంత్రము
**********

 మూలబిందువు (స్పందన శక్తి) విస్తరణ రూపము యంత్రము.బ్రహ్మాండవ్యాప్తమైన దేవతాశక్తులతో పాటు,మూలశక్తియైన ఛిచక్తి యంత్రములో నిక్షిప్తమై ఉంటుంది.యంత్రమును దేవతానగరమని కూడ అంటారు.

 మంత్రము.
 ********
 మూలబిందువు విస్తరణ వలన పరిణమించిన వర్ణములు(అక్సహ్రములు) దేవతాస్వరూపములుగా చేయగల శబ్దశక్తి మంత్రము.మంత్రము జ్ఞానమునకు ప్రతీక.

    యంత్రము అమ్మవారి ఇచ్ఛాశక్తి అయితే,మంత్రము జ్ఞానశక్తి.దానికి కావలిసిన సాధనను తెలియచేయునది తంత్రము.

 తంత్రము.
 ********
 ఒక దేవతను ఆరాధించవలసిన ప్రక్రియను తెలియచేయు శాస్త్రము తంత్రము.బిందురూపేణ సంస్థితయైన శక్తి స్త్రీకాదు.పురుషుడు కాదు.కాని ఇద్దరు అందులోనే దాగియున్నారు.ఈ విధానమును వివరించేది తంత్రము.
  దశమహాశక్తులను రాత్రులు అని పిలుస్తారు. అవి పగలుగా భావించే శివచైతన్యమును కలుపుకొని, పరిపూర్ణమై,
  "పరిత్రాణాయ సాధూనాం-వినాశాయచ దుష్కృతాం
   ధర్మసంస్థాపనార్థాయ-సంభవామి యుగేయుగే"

 దశమహావిద్యాతత్త్వమును గురించి అమ్మ అనుగ్రహముతో తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.పెద్దలు తమ ఆశీర్వచనముతో అమ్మ తత్త్వమును అనుగ్రహించెదరు గాక.

   అని తెలియచేస్తున్నాయి.

 అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మ అసుర సం హారము చేస్తూనే మనందరితో ఆడిపాడుతుంది.అత్యంత భక్తిప్రపత్తులతో అమ్మ అసురసమ్హారము  ఆ పదిచేతులతో మా అసహాయ చేతులను పట్టుకొని మాతో కోలాటము ఆడగా రామ్మ.మా మదిలో కొలువై పోమ్మా.అమ్మని పిలుచుకు రమ్మని నిశ్చలభక్తి-నీవే శరణము అను రెండు రెక్కలుగల మన మనసనే చిలుకలను పంపుదామా చిరునవ్వులతో,

 అమ్మ వస్తుంది.మనతో ఆడుతు-పాడుతు ఆశీర్వదిస్తుంది.


" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

  శ్రీమాత పాదపద్మములకు భక్తిశ్రధ్ధలతో సమర్పిస్తు

   సర్వం శక్తిమయం జగం.

 అమ్మ దయతో కొనసాగుతుంది.

https://www.youtube.com/watch?v=bMDJosE7gwY

https://www.youtube.com/watch?v=EsP-ojWbaJU&feature=youtu.be












No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...