Sunday, October 6, 2019

PADISAKTULA PARAMAARTHAMU-MATANGI

   పదిశక్తుల పరమార్థము-తొమ్మిదవ శక్తి -మాతంగి
   ****************************************
 అమ్మ దయతో ఈ రోజు మనము మాతంగి తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము.

 జగన్మాత శరీరమునుండి ఉద్భవించినది కావున మాతంగి అని,ఆకుపచ్చని రంగుతో ఇంద్రనీలమణికాంతులతో ప్రకాశిస్తుంటుంది కనుక శ్యామలాదేవి అని కీర్తిస్తూ,మాతంగి నామమును ,శ్యామలానామములను మరింత సుస్పష్టము చేస్తు రాజ మాతంగి-రాజశ్యామల ఇలా ఎన్నో పేర్లతో ప్రార్థిస్తు0టారు.మాతంగి తల్లి కాళిమాత రూపురేఖలలోని తీవ్రతను తగ్గించిన రూపము-సరస్వతీ జ్ఞానశక్తులతో పరిపాలన చేస్తుంది.ఈ శక్తి ఎంత ప్రజ్ఞావంతురాలో ఆమె మంత్రి పదవి చెప్పక చెబుతూనే ఉంది.తల్లి కాళితత్త్వానుగ్రహము కాళిదాసు ఏడుజన్మల పాపములను ఏడుక్షణములలో తీసివేసి సంస్కరించగలిగినది.

  పరిపూర్ణజ్ఞానస్వరూపిణి మాతంగి మాతానుగ్రహమే శబ్ద పరిణామము-శబ్దప్రయాణము-శబ్దార్థము అను వరములు.

  శబ్ద పరిణామము

   శబ్దము పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి అను నాలుగు విధములుగా నినదిస్తుంటుంది.ఉదాహరణకు ఆకాశములోని మేఘ గర్జన-గాలికి కదులుతు చెట్ల ఆకులు చేయుచప్పుడు మొదటి రెంటిగా మనము భావిస్తే పశుపక్షుల అరుపులు మూడవస్థానములో నిలుస్తుంది.మాతంగి ఆ శబ్దములకు అక్షరములను ప్రసాదించి వాటిని అర్థవంత పదములుగా మార్చి వైఖరి స్థానమును ప్రసాదిస్తున్నది.

    శబ్ద ప్రయాణము

    స్పందన గుణము కలది శబ్దము .అది శబ్దమును వివిధములైన పరిస్థితులలోనికి చేరుస్తుంటుంది.అప్పుడు శబ్దము దాని సహజ గుణమును కొంత విడిచి-కొత్తదనమును కలుపుకొని పయనము సాగిస్తూనే ఉంటుంది.మనము తారాదేవి గురించి స్మరించినపుడు తల్లి వాక్కును నాలుక చివరకు చేరుస్తుందని చెప్పుకున్నాము.నాలుకచివరనున్న శబ్దముతో నమ్మలేని గొప్పపనులను చేయిస్తుంది మాతంగి.అందుకే కదా "విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్నారు.గ్రామపెద్ద గ్రామమునందు ,రాజు రాజ్యమునందు మాత్రమే పూజనీయులు.ఒక ఊరి కరణము వేరొక ఊరి వెట్టివాడు అను సామెత కలదుకదా! వాక్శక్తిమంతుడు విద్వాంసుడై అన్నిచోట్ల పూజనీయుడవుతాడు.


 శబ్ద పరమార్థము

  పరిణామమును చెందుతూ-ప్రయాణము చేస్తున్న శబ్దము తనతో పాటు ధారణశక్తిని దార్శనికతను కలుపుకొని జగత్కళ్యాణమునకు ,విశ్వమానవ సౌభాతృత్వమునకు సహాయపడుతోంది.అదియే కద దేశప్రధానుల చర్చలు,వైజ్ఞానిక ఉపన్యాసము,మొదలగు వాటితో మాటే మంత్రముగా అనగా మార్చగలదానికి మారినది.

  ఇప్పుడు మనము విజ్ఞానమే తానైన తల్లిని ఉఛ్చిష్ట చ0డిక క్రిందపడిన ఎంగిలి మెతుకులు పరిశుభ్రతను పాటించకుండా తిన్న అంటరాని స్త్రీగా భావించగలమా? పదిశక్తులు మనము బాహ్య రూపమును నిజమనుకోకు.అంతరార్థమును అన్వేషించు అని చెబుతూనే ఉన్నాయి.తత్త్వమును తరచి తరచి చూస్తే,నోటినుండి జారిపడ్డవి మెతుకులు కాదు.శబ్దములు.పలుకు అని తల్లి ముచ్చటించు చిలుకలు మనకు తెలియచేస్తాయి.మరకతమాణిక్య ఆకుపచ్చ నిగూడ విజ్ఞాన సంకేతము.తల్లి తన భుజములపై వచ్చి వాలిన చిలుకలతో ముచ్చటించుట పరిశుభ్రముకాని (సంస్కరింపబడనివి.) తల్లి వాని పలుకులను విని తిరిగి వానితో ముచ్చటించుట వాక్కు పరివర్తనలు.పరివర్తనానంతరము పరిశుధ్ధములగు పదములు చిలుకలు అనేకము వచ్చి,తల్లితో ముచ్చటించినను,సారము గ్రహించిన చిలుక తల్లి భుజమున నిలిచిపోవుట,.తిరిగి ఎగిరివెళ్ళిపోయిన చిలుకలు మరింత సాధనచేసి అమ్మతో ముచ్చటించటానికి మళ్ళీ వస్తుంటాయి.తల్లి వానిని సంస్కరిస్తుంటుంది తన పలుకులతో ..చండాలిక అంటే కీర్తినే శరీరముగా గల తల్లి.కృతము చేయుట వలన లభించే మంచిఫలితములే కదా కీర్తి. పరమాద్భుతము పరమేశ్వరి తత్త్వము.
 

 మాతంగిమాత చరణారవిందార్పణమస్తు.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...