Sunday, November 17, 2019

BANISA


  నః ప్రయచ్చంతి సౌఖ్యం-26

  ************************

 పరమాత్ముని దక్క అన్యవస్తువులు అభిలషింపని భక్తి అనన్యభక్తి.అనన్యభక్తికి ఆదిదేవుడు తక్షణమే వశమవుతాడు.భక్తి భగవంతుని స్వాధీనము చేసుకోగలిగినట్లే-భగవంతుడు సమస్తము తన స్వాధీనమే అయినప్పటికిని,భక్తుని స్వాధీనపరచుకుంటు లీలలను అవలీలగా ప్రసాదించున్న. పరమాద్భుతమే ఈ సుదరభక్తుని-సుందరేశుని హేల.( బానిస అను పదము ప్రయోగించిన నావివేకమును పరమేశ్వరుడు మన్నించును గాక.)



  భగవంతుడు భక్తికి బానిస

  భక్తుడు భగవంతునికి బానిస-ఇద్దరు బానిసలే



 " నమః శంగాయచ-పశుపతియేచ"



  బ్రహ్మ నుండి చీమ వరకు గల సమస్త ప్రాణుల రోగములను భయములను పాపములను పోగొట్టుచు,సర్వ సుఖములను ప్రసాదించు రుద్రునకు నమస్కారములు.



   విడిచిపెట్టలేనిది వ్యసనము.దానిని కలవాడు వ్యసనపరుడు.వాడికి వ్యసనము యజమాని.వాడు దాని బానిస.భక్తరక్షణమను  వ్యసనము యజమానియై భగవంతుని బానిసగా చేయుటయే శివలీలలు.ఎందుకంటే  శివుడు భక్తికి పరవశుడై దానిని యజమానిని చేస్తూ,తాను దానికి బానిస అవుతాడు.
" నమో కృత్స్నవీతాయ ధావతే సత్వానాం పతయే నమః"
 పులస్తుడు ముందుండి తన వెనుక జగములను నడిపించు స్వామి తన భక్తులవెనుక వారిని రక్షించుటకు ధావతే పరుగులు తీస్తాడట.పరమాద్భుతము పరమేశుని భోళాతనము.



 అందులకే ధూర్జటి మహాకవి,పరమేశ్వరా!



 నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం

టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చితిను, తింటేగాని కాదంటినో?

నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే

సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!     16

ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి, వారివద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాసం పెట్టి, తింటే గానీ వీల్లేదన్నానా? ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా! నా ప్రార్ధన వినిపించుకోవేమి?అని చనువుగా ప్రశ్నించాడు.









  నీ నిష్కళంకభక్తి నిన్నుచరితార్థుడిని చేస్తుందనుటకు నిదర్శనము గజాసుర వృత్తాంతము.అసలే గజము.భారీశరీరము.అహంకారమునకు మారుపేరు.దానికి తోడు మదము.కాని పూర్వజన్మ సుకృతము తోడ్కొని వచ్చింది పుట్టెడు శివభక్తిని.పట్టువిడువక గట్టిగా పట్టుకుంది స్వామి పాదములను.వాలిన భక్తి వానిచే చేయించింది శూలికొరకు తపము.



 " నీ పంచనన్ పడియుండగా గలిగినన్ భిక్షాన్నమే చాలు" అని పించింది.ఆదిదేవుని అబ్బురపరచినది.అసలే భక్త సులభుడుఆ కాళహస్తీశ్వరుడు.,అవశ్యమే దర్శనమిచ్చాడు.ఆత్మీయతతో ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు గజాసురునితో.ఎంతైనా "పశూనాం పతి" కదా.స్వామి అనుగ్రహిస్తానన్న వరమే యజమానియై స్వామిని శాసించినది.



 " వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః."



   భగవః -సమగ్రమైన ఐశ్వర్యము,కార్యము-యశస్సు,శ్రీ-జ్ఞానము-వైరాగ్యము అను భగములు కలవాడు భగవంతుడు.భక్తునికి బానిస కాబోతున్నాడు.బంధ విమోచనుడు భక్తుని యజమానిని  చేసి తాను బానిస కాబోతున్నాడు. బానిసత్వము రెండువిధములు.  కట్టుబానిస-పుట్టు బానిస .



  ఇక విషయానికి వస్తే సర్వము తానైన స్వామి తనభక్తునిచే ఇలా పలికించాడు.



 "దేహో దేవాలయో ప్రోక్తః జీవోదేవ సనాతనః"



    హరహర మహాదేవ శంభో ఆడిన మాట తప్పరాదు.నా ఆశ తీరగ నా  హృదిలో నిండి,నా ఉదరములో నివసిస్తూ, నన్నాందపరచు! నా తండ్రీ.నీస్థూలరూపము నాఉదరములో నుండునట్లు నన్ను ఆశీర్వదించుము.

 " నమః ఆమీవతేభ్యః."



   వినాశకాలే విపరీత బుధ్ధి అన్నారుపెద్దలు.గజాసురుని బుధ్ధి వక్రించి,  భువనభాండములను అతలాకుతలము చేసింది.గంగిరెద్దుల మేళమును తెప్పించి,గజాసురునికి మంగళమును పాడించింది."క్షయద్వీరాయయ త్విషీమతే పత్తీనాం పతయే నమః.

వాని శిరము లోకపూజ్యమైనది.చర్మము స్వామిని కృత్తివసనుని చేసినది.



      బానిసత్వము తొలగిన స్వామికి తనకొక బానిస కావాలనిపించిందేమో, తన ఆటను సుందరారుతో ముందుకు నడిపించాలనుకున్నాడు ఆ సుందరేశుడు.







" పిత పిరాయి సూడి."

చిదానందరూపా- సుందరమూర్తి నాయనారు

*******************************************

కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా

కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

హాలాహలధరుని సఖుడు అలల సుందరారు

సదయ-ఇసయల సుతుడు ఇలను పేరు అరూరారు

నరసింగ మానై ఇంట పెరుగుచు,నగజపతిని నమ్మి కొలుచు

అల్లుడితడని పెండ్లిచేయ నందకవి సుందరారుని పిలిచె

తానొకటి తలచినవేళ దైవము వేరొకటి తలచు అని అన

తాళికట్టనీయకనే తగవుగ వానిని తన బానిసనియెగ

పితకు బానిసననియున్న పత్రము పెద్ద విచిత్రమునే చేసెగ

పినాకపాణి కృపనుపొందగ పిత అను పిలుపు కారణమాయెగ

చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక

చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.



నవ విధ భక్తులలోనిదైన సఖ్య భక్తితో శ్రీకృష్ణుని కొలిచినది కుచేలుడైతే,పరమేశ్వరుని కొలిచినది సమయాచారపరుడైన సుందరారు నాయనారు.జగద్రక్షణార్థము కేవలము 18 సంవత్సరములు మానవ శరీరమును ధరించిన మహా జ్ఞాని.క్షీరసాగర మథనమునందు జనించినహాలాహలమును తన అరచేత ధరించి పరమేశునకందించుటచే హాలాహల సుందరారు అని,కాల క్రమేణ అలల సుందరారు అని కీర్తింపబడుచున్నాడు.

 "సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః

  తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"



   కైవల్య మార్గమున నడవ వలసిన తనభక్తుడు


కళ్యాణము చేసుకొని,సంసారసాగర మునకలు వేయుటకు సిధ్ధపడుతుంటే  వద్దనాలి యని,  ఒద్దికైన దేవుడు.ముద్దుగ బానిస పత్రమును నడుమున దోపుకొనిపెళ్ళిపందిరిని సమీపించాడు ,విఘ్నము కలిగించాలని విఘ్నేశుని తండ్రి. నటనా విభూషణుడు తనభక్తుని మందలించి,మహనీయుని చేయదలిచాడు.ముల్లోకములనేలు స్వామి పిచ్చివాని రూపుగ వచ్చి పెండ్లి జరుగనీయక పెద్ద సమస్యను తెచ్చి,సుందరుడు పుట్టు బానిస కనుక తన వెంట రావలెనని, న్యాయస్థానములో ఒప్పించి తన వెంట తీసుకొని వెళ్ళుచున్నాడు.



 " నమః కాట్యాయచ-గహ్వరేష్ఠాయచ."

 ముళ్ళతీగెలతో నిండి ప్రవేశింపగ లేని గుహలయందును, అరణ్యములందునుదాగియున్న చైతన్యమైన స్వామి,తన బానిస మనసును నిండి ప్రవేశింపగ రాని అరణ్యములందు పయనింపచేయుచు సాగుచుండెను.జీవి పూర్వజన్మ కర్మలే పాప-పుణ్యములుగా వెంబడించి,పాపనాశకునితో తెసుకొని వెళుతున్నాయి సుందరారును.
  తానొకటి తలిస్తే దైవం మరొకలా అంటే ఇదేనేమో ఈశ్వరేచ్ఛ.

సుందరారు మానవ శరీరమును ధరించుటకు రెండు కారణములను పెద్దలు ప్రస్తావిస్తారు.

1.కైలాసములో నున్నప్పుడు శివపూజకు పూవులను సేకరించు సమయమున,అక్కడకు పూలనిమిత్తమువచ్చిన పార్వతీదేవి చెలికత్తెలైన,కమలిని-అనిందితిని అను వారిని క్షణకాలము మోహదృష్టితో చూచినందులకు ఆగ్రహించినఆదిదేవుడుమానవుడై పుట్టి వారిని మనువాడమనుట.తప్పు తెలిసుకొని శరణువేడిన సుందరుని చూసి,శంకరుడు సాప పరిధిని తగ్గించుట.

2 రెండవది బాహ్యమునకు శాపము కారణమైనప్పటికిని,తద్వారా సుందరారు కీర్తనలను-కీర్తిని లోక పూజ్యము చేయుటకు అనుగ్రహము ఆగ్రహ మేలిముసుగును ధరించి మేలుచేసినది.

ఓం నమః శివాయ.

తిరునావలూరులో సదయ నాయనారు-ఇసయజ్ఞాని నాయనారులకు దైవానుగ్రహము వలనపుత్రుడుగా జన్మించిన సుందరారు నామధేయము నంబి అరూరారు

" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం

త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం సమార్పణం'

అటువంటి ఏకబిల్వమే సదయ-ఇసయ-సుందర నాయనార్ల కుటుంబము. .

సుందరారు తాళికట్టు సమయమునకక్కడికొక పిచ్చివాడు చేతిలో ఒక పత్రముతో వచ్చి, పెండ్లిని అడ్డుకొనెను.వాని చేతనున్నపత్రమును పెద్దలకు చూపిస్తు,వీడు నా బానిస కనుక నేను వీడిని నాతో తీసుకొని పోతాను అని చెప్పెను.సాక్ష్యమైనపత్రమును చదువగా అందులో " నేను పితకు (పిచ్చివానికి) వాని వంశమువారికి బానిసనని త్రికరణగా అంగీకరిస్తున్నానని వ్రాసి,సుందరారుచే సంతకము చేయబడి ఉన్నది.సంతకము సరిపోవుటతో చేయునదిలేక వారు పెండ్లికొడుకును తనతో తీసుకొనిపోవుచున్న పిచ్చివానిని వాని ఇల్లుచూపమని వెంబడించిరి.కొంతదూరము సాగిన తరువాత వారిరువు గుడి దగ్గర అదృశ్యమైనారు."ఓం నమః శివాయ."

" నా మనసంతా నిండె శివ పదమె

గురువై నడిపించె శివ పథమే' అని కీర్తించుచున్న సుందర నాయనారు నకు బానిస యను నెపమున భవసాగరమును దాటించిన భక్త పరాధీనుడు సర్వమంగళములను చేకూర్చుగాక. ఆ మహాదేవుడు మనందరిని శివ పథము వైపు నడిపించును గాక.



 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

( ఏక బిల్వం శివార్పణం)










  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...