Monday, November 11, 2019

bhakta rakshakulae

  నః ప్రయచ్ఛంతి సౌఖ్యం

  **********************



  భక్తుడు-భగవంతుడు  భక్త రక్షకులే.



 "యాతే హేతిర్మీడుష్టమ హస్తే బభూవతే ధనుః

  తయాస్మాన్ విడ్వతస్తమ యక్ష్మయా పరిబృజ".



  స్వామి మాకు శత్రువులు ఎవరులేరు.కర్మఫలితములనగా దుర్మార్గులై మాపై వచ్చు శత్రువులను దండించుటకు నీ ఆయుధములను ప్రయోగింపుము.రుద్రా! అనేక నమస్కారములు.





  " నమః శూరాయచ అవబింధతేచ".



  యుధ్ధరంగమున భయములేకుండ ధైర్యముగా నుండువాడు-తన భక్తుల శత్రువులను మర్దించు రుద్రా! నమస్కారములు.



  బలిచక్రవర్తి పెద్దకుమారుడైన బాణాసురుడు బాల్యమునుండి భోలాశంకర భక్తుడు.అనవరతము ఆదిదేవుని తన అర్చనలతో గంగను తన జటాజూటమునందు బంధించిన వానిని తన భక్తికి బందీని చేసెను.ఎల్ల వేళలను తన రాజ్యమునకు అంగరక్షకునిగానుండి తనను తన ప్రజలను కాపాడునట్లు వరమును పొందెను.

   కాలాతీతుని లీలగా కాలము తన మాయాజాలమును విసురుతూ,మలుపులు తిప్పుతోంది బాణుని జీవితములో.అదే ఉషాపరిణయ ఘట్తమునకు వేసిన పునాది.అనివార్యము యుధ్ధము ఆ హరిహరులకు.అది యొక అద్వైత లీల.

 




.వినయముతో బాణుడు స్వామి నీ సైన్యము మాత్రమే కాదు,నాకు ఆపద సంభవించినపుడు నీవుసైతము నా తరపున నిలబడవలెనని కోరెను.ఆర్త్రత్రాణ పరాయణుడు ఆర్ద్రతతో అంగీకరించెను.



 " సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే యశస్చమే భగశ్చమే" స్వామి నా పక్కన నిలబడు పరమేశా.నమస్సులు.



  కారణము-కార్యము-కర్త తానైన స్వామి కలగా కార్యమునకు నాంది పలికెను. బాణుని కుమార్తె ఉష కలలో దివ్యసుందరుని దర్శింపచేసెను.కావలిసిన కార్యమునకు కారణము కన్య కలలో గాంచిన పురుషుని పతిగా కోరుకొనుట.చిత్రాల సానికి చెలికత్తె చిత్ర తోడైనది.కలలో గాంచిన పురుషుని చిత్రపటమును రచించి,వివరములు తెలిపి,తన మంత్ర-మాయా శక్తులతో నిద్రించుచున్న అనిరుద్ధుని ద్వారకనుండి తెచ్చి శోణపురమున ఉంచెను.



  " నమః పూర్వజాయచ-పరజాయచ"



  పూర్వా-పరములు తెలిసిన స్వామి తన భక్తునికి భావిసూచనగా, కోట పతాక చిరిగిన రాజ్యనాశ సంకేతమును గురించి తెలియచేసెను.అనుకున్నంత అయినది.అపశకునము గోచరించినది.అప్రమత్తుడైన బాణుడు అనిరుద్ధుని బందీని చేసినాడు తాను జరుగవలసిన కర్మఫలములకు బందీయై.అంతే ద్వారకలో అల్లకల్లోలము.ఆ మహాత్ములతోనా వైరము?అనివార్యము యుధ్ధమైనది.బలరాముడు శ్రీకృష్ణుడు బాణునిపై దండెత్తి,సేనలను చీల్చిచెండాడు తున్నారు.

 " నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవ నమః
   నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః'

  సర్వజీవుల యందు సర్వేశ్వరుని దర్శించు బాణునకు తన ప్రత్యర్థి మన్యవ కోపమును ధరించున రుద్రునిగా దర్శించగలిగాడు.

 కనుక తన మనసులోనే రుద్రుని ఈ విధముగా ప్రార్థించసాగాడు.
 "
" యాత ఇషు శ్శివతమా శివం" స్వామి నీ చేత నున్న ధనుర్బాణములు శుభమును కలిగించునవి.వానిని శాంతపరచుం అని ప్రార్థించాడు.

  కాని ఫలితము లేదు.భక్తవత్సలుడైన శంకరుడు తన సైన్య సహకారమును అందించినాడు.

   యుధ్ధము భయంకరముగా జరుగుచున్నది.బాణుని అంతరంగము ఆలోచనామయమైనది.తన రాజ్యము ప్రజలు ఓటమి భయము అను భంకర వ్యాధిగ్రస్తులగుచున్నారు.(యక్ష్మగం)

 పరమేశ్వరుని ప్రార్థన తప్ప ఇతరములు తనను ఈ యుధ్ధజలధిని దాటించలేవను జ్ఞానము కలిగిన బాణుడు,

 " శివేన వ చ సాత్వా గిరి శాచ్చావదామసి
   యథానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసత్"

   దానికి నీవే సమర్థుడవు.స్వామి నా తరపున యుధ్ధము చేసి నన్ను నా రాజ్యమును రక్షింపుము అని పరి పరి విధముల ప్రార్థించెను.

    తప్పుతుందా మరి తన భక్త రక్షణ ఆ తలలు మార్చే వానికి.

" దుందుభ్యాయచ-హనన్యాయచ" నమః శివాయదుందుభి-దుందుభి మ్రోగించె కర్ర-దాని నుండి వచ్చే భయంకర ధ్వని అనీ తానై ఆదిదేవుడు భక్తవశుడైనాడు.

 సహస్రాయచ-శతధన్వనేచ" అనంత బాహువుల వాని చేతులలోని అనంత ధనువులు అనంత శయనునిపై యుధ్ధమును చేయుటకు కదులుచున్నవి.

  యుధ్ధరంగము శివకేశవుల యుధ్ధమును వీక్షించుటకు సన్నధ్ధమైనది.దానిని వర్ణింపజాలని నా అశక్తతను మహాదేవుడు మన్నించును గాక.



  పెద్ద పెద్ద శబ్దములతో వచ్చుచున మహాదేవుని మహాసేనను మహాదేవుని పరాక్రమమును స్తుతిస్తూ,శ్రీకృష్ణుడు

  " నమో అగ్రే వధాయచ-దూరే వధాయచ" దగ్గరగా నున్న శత్రువులను-దూరముగా నున్న శత్రువులను నశింపచేయు రుద్రా! నీవు

 నమో హంత్రేచ -హనీయ సేచ"

  హంతవు-హనీయసుడవు అగు(ప్రళయకాలమున తనలో లీనము చేసుకొను స్వామి} ఏమి లీలా విశేషము.
 .స్వామీ నేను అశక్తుడను.నీ భక్తవశుడవు.కాని ధర్మమునకు గ్లాని రానీయలేము కనుక తగిన ఉపాయమును సెలవీయమని చంద్రశేఖరుని వేడుకొనెను.అద్వైతము ద్వైతమై మనలను ధన్యులనుచేయుచున్నది.స్వామిసూచన ప్రకారము,హరుడు నిద్ర నటించగా హరి బాణుని ఓడించెను.తప్పుతెలిసికొనిన బాణుడు తనకుమార్తెను అనిరుధ్ధునకిచ్చి కళ్యాణమును గావించెను



  భక్తుని విషయానికొస్తే,







అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు.

   " నమ ఉగ్రాయచ భీమాయచ".
 శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.

  రేపు బిల్వార్చనకు కలుసుకుందాము.




   ( ఏక బిల్వం శివార్పణం.) .


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...