Thursday, November 14, 2019

dakshayajnam20

    నః ప్రయచ్చంతి సౌఖ్యం-20



    ******************************







  భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే







  " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం



    యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."







    రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.







   " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః
 అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."







    రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము.

యజ్ఞో యజ్ఞపతిః యజ్వా యజ్ఞాంగా యజ్ఞభూషణః నమోవాకములు.

    అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో అగ్నిహోత్రుని ద్వారా.హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్యాకులు



 " త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయనీలకంఠాయ మృత్యుంజయాయ

    సర్వేశ్వరాయ సదాశివాయశ్రీమన్మహాదేవాయ నమః."



  రాబోవు పరిణామములకు ప్రమాణములుగా పరమేష్టి పరమప్రీతితో ఒక పవిత్ర యజ్ఞమును ప్రారంభించెను.

 యజ్ఞమునకు పరమేశ్వరుడు ప్రత్యక్షముగా విచ్చేసి యున్నాడు.అదే యజ్ఞమునకు వచ్చిన బ్రహ్మగోటినుండి జన్మించిన పదిప్రజాపతులలో ఒకరైన దక్షప్రజాపతి  తన దర్పమును తోడుతీసుకొని వచ్చాడు.కందర్పదర్పుడు మామగారైన తనకు నిలబడి నమస్కరించని అహంకారి యని హుంకరించాడు.పరమేశుడు తాను త్రిమూర్తులలో ఒకనిగా యజ్ఞమునకు వచ్చానని ,బంధుత్వములకు అక్కడ తావులేదని చెప్పీ శంభునిమాటలు దక్షుని అహంకారమును తగ్గించుటకు సహకరించలేక పోయినవి.



 బుధ్ధిః కర్మానుసారిణి దాని దారి మార్చుట ఎవరితరము ఆ ధూర్జటికి తప్ప.



 " నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమోనమః"



 ప్రమథగణముల రూపములలో-వాని అధిపతి రూపములో నున్న రుద్రుడు లేని,నిరీశ్వర యాగమును చేయ సంకల్పించెను దక్షప్రజాపతి.



 "

నమో మహేద్బ్యః క్షుల్లకేభ్యశ్చవో నమో నమః"




  క్షుల్లకేభ్య స్వరూపములో నున్న దక్షునకు మహర్ద్భ్య రూపములో నున్న దధీచి మాటలు తన బాటను వీడనీయలేదు.దధీచి మహామునిప్రథమ నివారణముగా  దక్షునితో అరిషడ్వర్గములకు లోనై ,మానసిక దౌర్బల్యముచే యజ్ఞ మర్యాదను ఉల్లంఘించరాదని,అల్లుడైన పరమేశ్వరుని ఆహ్వానించకుండుట అనర్థదాయకమని నచ్చచెప్ప చూసినను దక్షుడు వినలేదు.





 దాక్షాయణి రూపమును చాలించవలసిన సమయమాసన్నమైనందున సతీదేవి భర్త వద్దని వారించినను యజ్ఞమునకు వెడలుట మానలేదు.ఇది లౌకికము.జగన్మాత స్వామి వైభవమును లోకవిదితము చేయ సంకల్పించినది.అష్టాదశ పీఠ స్థాపనమునకు ఆదిశక్తి తరలినది.దశమహావిద్యాతత్త్వమును దక్షుని అల్లునకు పరిచయముచేస్తు.





  తల్లి తన అడుగులను పావులను కదుపుతు పరిసరముల ప్రవర్తనను ప్రకటిస్తు,ప్రాయ్శ్చిత్తముగా పవిత్రాగ్నిని తానే సృష్టించి దాక్షాయణి రూపమునకు పరిసమాప్తిచేసినది.కగల పార్వతీపతికి నమస్కరిస్తు.



 " నమ ఉగ్రాయచ భీమాయచ"

















   " అధ్యవోచదధివక్తా ప్రధమో దైవ్యో భిషక్."







   రుద్రభగవానుడు దేవతలలో ప్రథముడు ప్రధానుడు.భక్తుల మనోవ్యాధులను-శరీర వ్యాధులను పోగొట్టు వైద్యుడు.



సమయ సందర్భములను బట్టి,కర్మాచరణమును బట్టి ఫలితములను అందించువాడు.ఇక్కడ అదే జరిగినది.సతిదేవి దక్షపుత్రికగా తనువును చాలించునది జరిగిన అవమానమునకు ఫలితముగా.ఇది లౌకికము.జగన్మాత స్వామి వైభవమును లోకవిదితము చేయ సంకల్పించినది.అష్టాదశ శక్తిపీఠ ఆవిర్భావమునకు నాందిపలికినది.జగన్మాత నమో నమః-జగదీశ్వర నమోనమః.







 " ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరాఘోర తరేభ్యో నమో నమః"







  సతివియోగమును గ్రహించిన స్వామి తనజటనుండి వీరభద్రుని సృష్టించి,చేయవలసిన కార్యమును చేవగలవానికి అప్పగించెను."నమో వీరభద్రాయా".



యజ్ఞమును ధ్వంసముచేసిన వీరభద్రుడు,రుద్రుడై తన కరవాలముతో అహంకార తిమిరమైన దక్షుని శిరమును ఖండించెను.అమంగళము ప్రతిహతమగుగాక.సకలదేవతలు

 సదాశివుని ప్రార్థించగా,తన యోగమాయతో మేకను సృజించి,దాని శిరమును ఖండించి దక్షుని శరీరమునకు అతికించి,పునర్జీవితుని చేసెను.వితండవాదమును చేయక వినయముతో నడచునది మేక.అహంకారము అంతరించిన దక్షుడు అభినివేశముతో మహాదేవుని అర్చిచి చరితార్థుడైనాడి.ఇక్కడ శివునిచే తుంచివేయబడినది దక్షుని అహంకారము.పునర్జీవితుని చేసినది స్వామి మమకారము.దేహభ్రాంతిని పోగొట్టినది కొత్తరూపము.తరించినది మేకజన్మము.శివలీలను అర్థముచేసుకొనుటకు మానవమాత్రులమైన మనకు సాధ్యము కాదు.కనుక మరొక ఆలోచనలేక మహేశుని శరణువేడుదాము.
హర హర మహాదేవ-శంభో శంకరా. -శరణు.







  పుత్తూరు ప్రాంతమునకు చెందిన మహాశివభక్తుడు బ్రహ్మయ్య.కంసాలి పని కులవృత్తి.అయినప్పటికి తనకు కిన్నెరవాయిద్య నాదముపై నున్న ప్రీతితో పుత్తూరును వదిలి కళ్యాన నగరమునకు వచ్చి,కిన్నెర వాయిద్యముతో శివమహిమలను కథలు కథలుగా చెప్పుచు మురిసిపోయేవాడు.అతని కథలు వినుటకు సాక్షాత్ శివుడే బసవడు రూపములో వచ్చి విని ఆనందించి,ఆశీర్వదించేవాడట.







   త్రిపురాంతకునిపై వచనములను రచించి పాడుతు పరమానందమును పొందేవాడు.







 బ్రహ్మయ్య " నమో జఘన్యాయచ-బుధ్నియాయచ" జఘనభాగమునుండి జన్మించిన వానియందు,మూలభాగమునందు జన్మించిన వానియందు పరమేశ్వరుని దర్శించగలిగేవాడు.భూతదయకలిగి వుండటమే భూతనాథుని ప్రియమని మిక్కిలి ప్రేమతో సకలజీవులను సాకుతుండెడి వాడు.మూడుకన్నుల వానికి బ్రహ్మయ్యను పరీక్షించాలని వేడుక కలిగినది.మేకపిల్లయై గడ్డిఉన్నచోట్లకు మేతకు వచ్చాడు.మేత తానే-మేసేది తానే అయినవాడు.







 " లోప్యాయచ-ఉలప్యాయచ నమోనమః" గడ్డి మొలిచే ప్రదేశములమును-మొలవని ప్రదేశములము చైతన్యమైన రుద్రా నీ లీలలు కడురమ్యములు.కామితార్థములు.కళ్యాణప్రదములు.కాకపోతే మేతమేయుచున్న మేకదగ్గరికి కసాయి వచ్చి కాటువేయ చూస్తున్నాడు.కాటికాపరి ఆన కాదనగలడా కసాయి? కిన్నెరబ్రహ్మయ్య మేకను కసాయిని చూశాడు.కపర్దికి కావలిసినది కూడ అదేకదా.కాబోవుదానిని కళ్ళింతచేసుకొని చూస్తున్నాడు.బ్రహ్మయ్య కసాయిని సమీపించి,అయ్య దీనిని బాధింపకుడు.మీరు తగిన ధనమును తీసుకొని,మేకను వదిలివేయండి అని వేడుకొన్నాడు.ధరను పెంచి పెంచి మేకకు బదులు కిన్నరి బ్రహ్మయ్య తలను కోరాడు కసాయ.పరమానందముతో తన త్లను కాసాయిని నరకమని అప్పగించాడు బ్రహ్మయ్య.మేకను హింసించవద్దని మాటతీసుకున్నాడు మహాదేవుని భక్తుడు.








 " నమో వాస్తవ్యాయచ-వాస్తుపాయచ"







  సకల జీవులలో అంతర్యామియై ఉన్నవాడు-సకలజీవులను రక్షించువాడు సాగనిస్తాడా కసాయి ఆటను? క్షణములో కనిపించి కిన్నరి బ్రహ్మయ్యను కైలాసమునకు రప్పించుకున్నాడు.ప్రమథగణములతో స్థానమిచ్చి జీవిత పరమార్థమును అందచేశాడు ఆ ఆదిదేవుడు.



 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.







   ( ఏక బిల్వం శివార్పణం)



  ( ఏక బిల్వం శివార్పణం.)







-

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...