Saturday, December 7, 2019

PARICHAYAMU

 
   శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే
   *********************************

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".


   శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు.బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు .

 " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ
  శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్
  భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
  శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."

  ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభావములు కలిగిన గోపికలను ఎంతో ఓర్పుతో-నేర్పుతో తనతో కలుపుకొనుచు,అందరు కలిసి పర వాయిద్యమును స్వామి దగ్గర నుండి ( పరము అను సాయుద్యమును) పొందుటకు చేయు వ్రతము( పావై)ఇది.ఇది ఎటువంటి వ్రతము? తిరు వ్రతము.అనగా శ్రీకరము-శుభకరము.దీనిని ముప్పదిరోజులు ముప్పది పాశురములను కీర్తిస్తు,చేయవలసిన పనులను చేస్తూ,చేయకూడని వానిని విసర్జిస్తూ చేసే సర్వస్య శరణాగతి అను సత్సంప్రదాయము.

  మార్గశీర్ష మాసము మాధవునికి ప్రీతికర సమయము.ప్రకృతిపచ్చగా నుండి పరమాత్మను   ప్రశంసిస్తుంది..సూర్యుడు ధనుర్ రాశిలోనికి న,ప్రవేశిస్తాడు.  కనుక ఈ పవిత్ర సమయమును ధనుర్మాసము అనగా ధన్యతను అందించగల సమయమని భావిస్తారు.మూలద్రావిడములో తల్లి కీర్తించిన పాశురములు ( వాక్పుష్పమాలలను. మాలను) పూమాలలతో పాటుగా రంగనాథస్వామికి భక్తి-ప్రపత్తులతో సమర్పిస్తారు.
   రేపల్లెలోని గోపికలను వారి తల్లితండ్రులు శ్రీకృష్ణుని సామాన్య పురుషునిగా భావించి వారి పిల్లలైన గొల్లెతలను స్వామిని కలవకుండా కట్టుదిట్టము చేసినారట.ఆ సమయమున విపరీత వర్షాభావ పరిస్థితి ఏర్పడుట వలన,పెద్దల సూచన ప్రకారము కన్నెపిల్లలు కాత్యాయినీవ్రతమును భక్తిశ్రధ్ధలతో చేసిన ఎడల వర్షములు కురిసి సుభిక్షత కలుగునని,శ్రీకృష్ణుని వ్రత నిర్వాహకునిగా ,గోపికలచే వ్రతమును జరిపించి ధన్యులైనారట. ఆ విషయమును మన తల్లి" కోదై" స్వామి  కరుణామృత వర్షమునకై తనను  రేపల్లెలోని ఒక గోపికగా భావించుకొని,తన చెలికత్తెలను కలుపుకొని మార్గళి వ్రతమును, కుసుమ మాలలతో-పాశురములతో ముప్పదిరోజుల శ్రీవ్రత విధానమును,దాని పరిపూర్ణ ఫలితములను అత్యంత దయతో మనకు అందించినది తల్లి.కోదై (పూలమాలిక) అను నామము గల ఆముక్తమాల్యద.

సరళముగా చెప్పుకోవాలంటే,


మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.

  క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరు-పావై దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్ష్యము కనుక.పరమాద్భుతమైన ఈ ద్రవిడ ప్రబంధము నవవిధభక్తి సమ్మేళనము.నవనీతచోరుని దివ్యలీలా తరంగము.

 మార్గళి మాలను సంస్కరించి,సుగంధభరితము చేయుట పెద్దసన్మానముగా భావించి పెరుమాళ్ స్వరూపులు నన్ను ఆశీర్వదించెదరు గాక.




ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో
.
" అందరికి వందనములు."

అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,శ్రీ వ్రత శుభ సమయములో,"మార్గళి మాలై" అను దివ్య పరిమళ పారిజాత మాలను,"స్వామి కైంకర్యమునకై" అల్లుతోంది.ఇంతలోనే,ఇదేమి చోద్యమో! మాయా మోహితమైన (నా) అహంకారము దొంగలా ప్రవేశించి దోషములను ముళ్లను చేర్చుతోంది.
కావున సత్ చిద్రూపులారా! అన్యధా భావించక,మాలను సంస్కరించుటను," శ్రీ గోదా-రంగనాథుల సేవ" గా భావించి,సహకరించగలరని ఆశిస్తూ,
సవినయ నమస్కారములతో -మీ సోదరి.
సద్గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు.
( ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)



00

 జై శ్రీమన్నారాయణ.
*****************
భగవత్ బంధువులారా!సవినయ నమస్కారములు.

  సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించు సమయము ధనుర్మాసము.
మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.

  క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరు-పావై దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్ష్యము కనుక.పరమాద్భుతమైన ఈ ద్రవిడ ప్రబంధము నవవిధభక్తి సమ్మేళనము.నవనీతచోరుని దివ్యలీలా తరంగము.

 మార్గళి మాలను సంస్కరించి,సుగంధభరితము చేయుట పెద్దసన్మానముగా భావించి పెరుమాళ్ స్వరూపులు నన్ను ఆశీర్వదించెదరు గాక.




ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో
.
" అందరికి వందనములు."
మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి,
" నీ పాదము పట్టి నిల్చెదను
పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అని పలికించినది.

అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,శ్రీ వ్రత శుభ సమయములో,"మార్గళి మాలై" అను దివ్య పరిమళ పారిజాత మాలను,"స్వామి కైంకర్యమునకై" అల్లుతోంది.ఇంతలోనే,ఇదేమి చోద్యమో! మాయా మోహితమైన (నా) అహంకారము దొంగలా ప్రవేశించి దోషములను ముళ్లను చేర్చుతోంది.
కావున సత్ చిద్రూపులారా! అన్యధా భావించక,మాలను సంస్కరించుటను," శ్రీ గోదా-రంగనాథుల సేవ" గా భావించి,సహకరించగలరని ఆశిస్తూ,
సవినయ నమస్కారములతో -మీ సోదరి.
సద్గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు.
( ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)

Thursday, December 5, 2019

PRARTHANA


  ప్రార్థన
 **********
 శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
 యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం

 లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమా
 అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం

 యోనిత్యమచ్యుత  పదాంబుజ యుగ్మరుక్మ
 వ్యామోహతస్తత్ ఇతరాణి తృణాయమానే

 అస్మద్గురో భగవతోస్య దయైక సింధో
   రామానుజస్య చరం శరణం ప్రపద్యే.




 సంభవామి యుగేయుగే  సాక్ష్యము హరి కళత్రము
 ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన ఆండాళ్ తల్లి అనుగ్రహము.

 శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా
 పసిపాపగ  ప్రకటించబడినది తులసివనములో

 విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలంకరణములు
 వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో

 గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది
 తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది

 చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది
 రంగనాథుని దేవేరిగా  శ్రీరంగమున కొలువైనది

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థమును చాటిన ఆండాళ్ తల్లి పూజనీయురాలాయెగ.


 ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే మన ఆండాళ్ తల్లి.తాను ధరించిన పూలమాలను స్వామికి అర్పించిన మహాపతివ్రత.ధర్మసంస్థాపనకై శ్రీవిల్లిపుత్తూరులో తులసివనమున అయోనిజగా ప్రకటించబడినది.చూడికొడుత్తాల్ అంటే తాను ధరించిన పూలమాలలతో స్వామిని ఆరాధించినది.ఆళ్వారులు పదిమంది అని వారు నారాయణుని దశావతారములు అని నమ్మువారు తండ్రి-తనయ లైన వీరిని ఒక అవతారముగానే లెక్కిస్తారు.పన్నెండు అను వారు వీరిని విడిగా పరిగణిస్తారు.తండ్రి చెప్పువిష్ణు కథలను వినుచు,విశిష్టతను తెలుసుకొని,స్వామిని తన భర్తగా ఆరాధించినది.ధనుర్మాసములో గోపకాంతలతో తానును ఒకతెగా మారి వారిచే కాత్యాయిని వ్రతమును,తిరుప్పావై వ్రతమును చేయిస్తు,వారికి ముక్తిమార్గమునకు దారిచూపినది,రామానుజుని సోదరియైన ఆండాళ్ తల్లి రంగనాథసమేతయై మనలను రక్షించును గాక  క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై అను ద్రవిడప్రబంధ విశేషములను తల్లి అనుగ్రహము మేర మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.

 పరమ పావనమైన తిరు-శుభకరమైన పావై వ్రతము నవవిధభక్తి సమ్మేళనము .నందగోపాలుని నవనీతచోరుని దివ్యలీలా తరంగము.

  ఈ వ్రతమును ఆచరించిన గోపికలను ఆళ్వారులుగాను,అప్సరసల గాను అభివర్ణిస్తారు పెద్దలు.భగవదనుగ్రహమునకు  అంతరంగ సర్వస్య శరణాగతి సాఫల్యకారి అని చాటిచెప్పుచున్నది.

  నా ఈ దుస్సాహసమును పెద్ద మనసుతో మన్నించి,మార్గళి మాలను సుగంధభరితము చేయుట పెద్ద సన్మానముగా భావించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.
.



( ఆండాల్ తిరువడిగళే  శరణం.)

FALASRITI

భగవత్ బంధువులారా! మీరు

కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా

చొప్పదంటు పలుకులనినా నప్పిన్నాయ్ కరుణతో

ఫలశృతి

ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు

విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు

మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు

పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు

ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు

సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు

యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు

పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు

మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు

చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు

కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు

నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు

దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు.

అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు.

కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా

బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్

కరోమి యద్ యత్ సకలం పరస్మై

నారాయణా! ఇతి సమర్పయామి.

మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక.

( ఓం తత్ సత్.)

సాహితీభూషణులు-సరస్వతీ పుత్రులు గుంపు నిర్వాహకులు, ఎంతో పెద్దమనసుతో, నా ఈ చిన్ని ప్రయత్నమును మనసారా ప్రోత్సహించి,వారి గుంపులోనికి అనుమతించినందులకు,మిత్ర సోదర సోదరీ మణులు సహృదయతతో తమ అమూల్యమైన సమయమును వెచ్చించి స్పందించినందులకు పేరుపేరునా నా సవినయ నమస్కారములు మరియు కృతజ్ఞతలు. మీ సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

జై శ్రీమన్నారాయణ తవ చరణమేశరణము.

MARGALI MALAI-30



 మారగళి మాలై-30
 *****************
   ముప్పదవ పాశురం
  **************
 వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై
 తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి
 అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై
 ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై
 శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే
 ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్
 శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్
 ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 *********************.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము

 జీవులను ఓడలు తిరుగాడుచున్న క్షీరసాగర స్వామి
 మాధవా! కేశవా! పర (ము) ను మాకందించినావు

 సూడికొడుత్తాల్ నిను పూమాలలతో సేవించినది
 పాడికొడుత్తాల్ గా పావన పాశురములు పాడినది

 అఖిలాండకోటి దేవతలు అర్చకస్వాములైనారు
 ముక్తపురుషులు తల్లి పల్లకి మోస్తున్నారు

 తామరపూసలదండలు దాల్చిన పెరియాళ్వార్
 తామరదళ నేత్రునికి మామ కాబోతున్నాడు

 లోకకళ్యాణమునకు జరుగు ఆ తిరుపాణిగ్రహణమున
 అందుకొనుచున్నాము మనము ఆలోకనమను అనుగ్రహము.

 స్వామి పాలసముద్రమును మహలక్ష్మి మాత కొరకు-వీర సముద్రమును రుక్మిణిమాత కొరకు,గొల్లల పెరుగు సముద్రమును గొల్లభామల కొరకు చిలికినాడని చమత్కరిస్తారు పెద్దలు.ఓడలు జీవులైతే అవి నిరంతరము తన జన్మఫలములను అనుభవించుటకు కదులుతుంటే.వాటిని నొప్పించకుండ(సంసార) సాగరమథనముచేస్తూ,రేవునకు దరిచేచు దయామయా నీకు కళ్యాణమగుగాక.

 ముప్పది పాశురముల "తిరుప్పావై "ద్రవిడ ప్రబంధము "శంగత్ తమిళ మాల" గా శ్లాఘింపబడుచున్నది.అంతే ఏమిటి? పూర్వము గ్రంధరచనానంతరము.వాని సామర్థ్యముంప్రాభవమును నిర్ణయించి-ధృవీకరించే శిలాఫలకములుండెడివట.గ్రంధమును ఫలకము మీదనుంచగనే అర్హతలేనిదైన దాని లిపి మాయమైపోయెడిదట.సమ్రథవంతమైనదైచో స్వప్రకాశముతో తేజరిల్లుచుండెడిదట.అటువంటి స్వప్రకాశ సంస్కారము గలది అని కీర్తించుతయే రమణీవిరచితమైన రామణీయ రసగుళిక  (పాత్రధారిగా) అని అమ్మతరఫున ఆడపెళ్ళివారు అనగానే,

 అమ్మను పెండ్లాడు "అయ్య ఎంతటి ఘనుడో" మగ పెళ్ళివారు ఈ విధముగా చెబుతున్నారు.మా స్వామి కదిలే ఓదలున్న సముద్రమును చిలికి అమృతమును సాధించి,అందరికి అందించినవాడు అని స్వామి వైభవమును "వంగక్కడల్ కడైంద మాదవనై-కేశవనై" అంటున్నారు.మా అనగా తల్లి గోదమ్మకు-ధవుడు పతియైన మా రంగనాథుడు కదులుచున్న ఓడలు గల సముద్రమును,మంథరము తానై,వాసుకితానై,దేవదానవ స్వరూపములు తానై చెరొక పక్క న పట్టుకొని,అమృతమును సాధించి,అందరికి,చివరికి ఓడలలో నున్న వారికి కూడ పంచిన పరంధాముడు అని వర్ణిస్తున్నారు.
   వేడుకగా మీ అమ్మాయి గోపికగా తన కర్తవ్యమును స్వయముగా ఆచరించి,తారకమును అందిస్తే,మా అబ్బాయి స్వయముగా గొల్లవానిగా సంచరించినాడని, సూత్రధారి అని ఇరువర్గములు రంగమంటపమున కళ్యాణోత్సవమును కన్నులపండుగ గా మనకందించుటకు కదులు చున్నారు.రండి.మనము కూడ దర్శించి తరించుదాము.




ఓం నమో నారాయణాయ
**********************-
అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది
నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది.
శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన
అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో
ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన
ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో
పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన
పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో
అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన
అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో
వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము
వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము.
పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,గోపికలు కాత్యాయినీ వ్రతమును ఆచరించి,స్వామి సాయుద్యమును పొందినారని తెలుసుకొని,తానును గోపికగా మారి(మనో వాక్కాయ కర్మలలో) చెలులతో ముప్పదిరోజులు,పామాలతో (పాశురములతో) పూమాలలతో మార్గళి వ్రతమును ఆచరించి మనకు మార్గదర్శకురాలైనది.ఏమీ తెలియని నాచే ముప్పది పారిజాత మాలలను స్వామికి సమర్పింప చేసినది.నా పూర్వ భాగ్యమేమో తెలియదు కాని నన్ను తన కళ్యాణోత్సవమునకు తీసుకుని వెళుచున్నది.ఒక్క నిమిషము.ఎవరో మహాత్ములు వచ్చారు.ఎందుకో? ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి.మీకు చెబుతాను ఆ విశేషాలన్నీ.
గోదా రంగనాథుల కళ్యాణార్థము తమ అదృష్టముగా భావిస్తూ,అఖిలాండకోటి దేవతలు అర్చక స్వాములై అయ్యవారి తరఫున ఆండాల్ తల్లిని వధువుగా అర్థించుటకు కానుకలను-పల్లకిని తీసుకుని వచ్చారు.అబ్బ!మౌక్తికాలంకృతమైన పల్లకి ఎంత బాగుందో.అసలెక్కడివి ఈ ముత్యములు సత్వగుణశోభితములై సత్చిత్ ప్రకాశముతో నున్నవి.తల్లిచెప్పిన ముక్త పురుషులు వీరే కాబోలు.ఎర్రటికెంపులు అమ్మ బుగ్గల ఎర్రదనపు కాంతి సోకిన ముత్యాలేమో.తెలుపు కాదు.ఎరుపు కాదు.నీలముగా తోచుచున్నవి.ఆ నీలమేఘ శ్యాముని కడకంటి చూపులను తోడ్కొని వచ్చినవేమో అందుకే ముత్యములు నీలాలై నాతో మేలమాడుతున్నవి.కాసేపు పచ్చలుగా,మరి కాసేపు గోమేధికములుగా,వజ్ర వైఢూర్యములుగా.ఎంతైన స్వామిదగ్గరకు అమ్మను తీసుకువెళుతున్నామనే భావోద్వేగము బహురూపులు సంతరించుకుంటున్నదేమో.
విష్ణుచిత్తులవారు అతిథులను సత్కరించారు.పాండ్యరాజు ఆడపెళ్లివారి బాధ్యతను అన్నయై ఆనందంగా స్వీకరించారు.ఇదేమి చిత్రమో నా మనసు శ్రీరంగములో అమ్మకై ఎదురుచూచు చున్న రంగనాథుని పక్కకు చేరింది.ఆడపెళ్ళివారు-మగ పెళ్ళివారు రెండూ తానై ఆనంద డోలికలూగుతోంది.
ఆ ఆనందోత్స వాన్ని ,తిరు (పవిత్రమైన) కళ్యాణాన్ని కనులారా దర్శించి,తిరుగులేని వారిరువురి దయను పొందుదాం.నాతో బాటు మీరు రండి.
శ్రీ రంగే గరుడాచలే ఖగ గిరౌ సిం హాచలే మందిరే
వైకుంఠే కనకాచలేచ నిషధే నారాయణాఖ్యాచలే
లోకాలోక మహాచలేచ నిషదే పుణ్యాచలేష్టా శ్రియ:
పాయాత్ ఓ భగవాన్ పురాణ పురుష: కుర్యాత్ సదా మంగళం".

భగవత్ బంధువులారా! మీరు
***********************
కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా
చొప్పదంటు పలుకులనినా నప్పిన్నాయ్ కరుణతో
ఫలశృతి
ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు
విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు
మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు
పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు
ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు
సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు
యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు
పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు
మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు
చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు
కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు
నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు
దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు.
అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు.
కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా
బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్ యత్ సకలం పరస్మై
నారాయణా! ఇతి సమర్పయామి.
మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక.
( ఓం తత్ సత్.)
సాహితీభూషణులు-సరస్వతీ పుత్రులు గుంపు నిర్వాహకులు, ఎంతో పెద్దమనసుతో, నా ఈ చిన్ని ప్రయత్నమును మనసారా ప్రోత్సహించి,వారి గుంపులోనికి అనుమతించినందులకు,మిత్ర సోదర సోదరీ మణులు సహృదయతతో తమ అమూల్యమైన సమయమును వెచ్చించి స్పందించినందులకు పేరుపేరునా నా సవినయ నమస్కారములు మరియు కృతజ్ఞతలు. మీ సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.
జై శ్రీమన్నారాయణ తవ చరణమేశరణము.



MARGALIMALAI-29


  మార్గళి మాలై-29
  ****************
   ఇరువది తొమ్మిదవ పాశురం
   **********************
 శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్
 పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్
 పెత్తం మేయ్త్తు ఉణ్ణం కలత్తిల్ పిరందు నీ
 కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
 ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా
 ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు
 ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వో
 మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో

  " గోవింద-గోవింద-గోవింద"

  ఈ కైంకర్య సేవాభాగ్యాభ్ర్థనా పాశురములో,

  " మత్తైనం కామంగళ్ మాత్తు." ఆ ఒకే ఒక కోరిక తప్ప మాకు ఇంకేమి కోరికలు లేవు అని అంటున్నారు వశీకరణావస్థలోనున్న గోపికలు ఆ వంశీధరునితో.(పిల్లనగ్రోవిని ధరించిన వానితో) అంవాస్థలు అని మనకు సందేహము వస్తే పరమాత్మ తత్త్వ పరిచయము-ప్రమాణము-ప్రసాదము కలుగుతకు ప్రతి జీవి నాలుగు దశలను దాటి వస్తాడు. అవి,

 1.యతనామావస్థ- ఈ దసలో లౌకిక కోరికలను ప్రయత్నముతో అరికట్టుతుంటాడు.

 2.వ్యతిరేకావస్థ- అవి లేక పోతే ఉండగలడు.వానిని వదిలివేసినానని అనుకుంటాడు.నిజానికి సంపూర్నముగా అవి జీవిని వదలవు.వాని రస-రూపములు మస్తిస్కములో మరలమరల మెదులుచునే ఉండును. ఉదాహరణకు నాకు మామిడి పండు చాలా ప్రీతి.మొదటి అవస్థ యైన యతనముతో దానిని తినుట భౌతికముగా మానివేసాను.అది నిజము.కాని దానిని చూసిన ప్రతిసారి-తలచిన ప్రతి సారి,నేను మామిడి పండు తినే రోజుల్లోఎ ఎంతో రుచిగా ఉండేది.సువాసనతో ఉండేది.ఎంతో మధురరస భరితమై ఉందేది అని తలుచుకుంటూనే ఉంటాను.అంతే మానసికముగా అది నన్ను వీడలేదు.

  3.ఏకీంద్రియావస్థ- ఈ మూదవ దశ నా కర్తవ్యమును తెలియచేస్తుంటుంది.ఇప్పుడు నీ లక్ష్యము పరమాత్మ కీంద్రీకృతము కాని పండు కేంద్రీకృతము కాదు అని బుధ్ధి మనసును మందలిస్తు,బుధ్ధిని హెచ్చరిస్తుంటుంది.పరుగులు తగ్గించిన మనసు పరమాత్మపై కీంద్రీకరించుటకు తీవ్రముగా ప్రయత్నిస్తుండి.

  4.వశీకారావస్థ- ఎక్కీకృతమైన మనో-వాక్కాయ-కర్మలు తమకు కావలిసినదేమిటో-వదిలివేయవలసిన వేమిటో సుస్పష్టము చేస్తుంది.
స్థిత ప్రజ్ఞతతో స్థిరముగా నిలుస్తుంది. ఎటువంటి ప్రలోభములకు లోబడదు.రత్నరాశి లభించు సమయమున వివేకశూన్యయై రాయిని కోరదు.

  ఇప్పుడు మన గోపికలు -కాలే-అను నోమునోచుకొనిన పరలభిస్తుందన్న మొదటిదసను దాటి,ఆచార్యులను మేల్కొలిపి వ్రతనిర్వహణము చేయమనుట-స్వామిని ఆభరనములు కోరుట-వ్రతసామాగ్రిని కోరుత అను వ్యతిరేకదసను దాటి,స్వామితో ఆది-పాడుట,అన్నము తినుట అను మూదవ దశను దాటి,ఈ రోజు జన్మ సంస్కారవంతులు.కార్యము-కారనము,ఉపాయము-ఉపేయము రెండును స్వామియే సత్యమును తెలిసి కొనిన వారైనారు.

  అంతే కాదు నిన్నటి వరకు వారు స్వామిని " నారీ కైశికి ముక్త మాలికకై నానాయాతనల్ పడ్డ ఆ భీరుండు తమ అధీనుడు" అను కున్నారు.అప్పటివరకు వారిది సాధనాభాగ్య ఫలితము.సాధనము అంచెలంచెలుగా తపము-జపము-యాజము మొదలగువానిగా ఉండి వ్యక్తావ్యక్త ఫలితములను ఇచ్చును.కాని అవి కొంతసమయ పరిమితి కలవి-పుణ్యము చిట్ట అయిపోగానే అంతర్ధానమవుతాయి.పూర్వపు స్థితిని జీవి చేరుతుంది.మళ్ళీ మొదలు.

  మన గోపికలు జన్మ సంస్కారవంతులు.నిత్యకర్మలను అనుష్ఠాన కర్మలుగా భావించే వారు.గోవుల వెంట అడవులందు తిరుగువారు.అవి తినిన తరువాత (మేత మేసిన తరువాత) తాము భుజించెడివారు.వాటిని సురక్షితముగా ఇంటికి తెచ్చెడివారు.వాచ్యార్థము.

 గోవులను అనగా వాక్కులను-వాజ్మయమును విస్వమతటా వ్యాపింపచేయువారు.సదాచార్యత్వమును వానికి యోగ్య్త-భోగ్యతను-పోషకత్వమును కల్పించెడివారు.మరియును సంరక్షించెడి వారు.

 కనక కృఇష్ణా మేము ఏ విధముగా మేము గోవులను సంరక్షించుచున్నావో,అవి మేతతో తృప్తి చెందిన తరువాత మేము తింటున్నామో,అదేవిధముగా మా కర్మలను అనుభవించుటకు గోకులములో పుట్టిన మా కర్మలను నిర్మూలించుటకు మాకొరకు అయర్కులములో నీను మాకోసము పుట్టినావు.కన్నా! కేళాయ్" విను అంటున్నారు.

 గోపికల మాటలకు కృష్ణుడు సరే మీరడిగినవన్నీ ఇచ్చాను కదా.ఇంకేమిటి అడగబోతున్నారు? అని అడిగాడు అమాయకముగా.దానికి గోపికలు నవ్వి,నువ్వు వట్టి శృతజ్ఞానివని ఇప్పుడే తెలిసినది.నువ్విచ్చినవాని కంటే అత్యంత విలువైనది ఒకటి ఉన్నదని ఇప్పుడే నీ "పొత్తామరై అడియె పోత్తి" అని అందామంటే ఆ పోలిక మాకు సరియైనది అనిపించుటలేదు.బంగారము వంటి పాదపద్మములకు మంగళము అంటే నీ పాదములెక్కడ? బంగరు పద్మములెక్కడ? బంగారము అందామటే అది ఒక లోహము మాత్రమే.పోనీ పద్మము అందామా అంటే చంద్రోదయముతో ముడుకుని పోతుంది.కనుకఅవాగ్మానసగోచర! మాకవేవి వద్దు అని స్వామి ముఖము వంక చూస్తు, ఒక నిమిషము మౌనము వహించారు ఆ మనోజ్ఞ మానినులు.


 వారి పరస్పర నయనములు పరమసేవా సౌభాగ్యత్వమును పలుకరించుకున్నవి.పులకరించుచున్నవి.అభ్యర్థించుచున్నవి-అనుగ్రహించుచున్నవి.అధీనమైనవి-ఆధేయమైనవి.ఇదే అదను అని అరక్షణము ఆలస్యము చేయక,"ఆంతరంగిక సేవా భాగ్యమును" అనుగ్రహింపమని అర్థించారు గోపికలు.వారు నయనము-స్వామి చూపు.ఆ చల్లని చూపును అటు ఏడుతరములు-ఇటు తరములు ప్రసరింపనీయమని ప్రాధేయ పడ్డారు.స్వామిని వారు,

అంతే కాదు "కొల్లామల్" స్వీకరించను అనుటలు వీలు లేదు.కాసేపు కస్తురి కుంకుమగా మారి నీ నుదుటను నిలుస్తాము.మరొకరి ఆ కసురిని నీ ఫాలభాగమున అలంకరించువారమౌతాము.ఒకపరి కౌస్తుభమణిగా మారి నీ వక్షస్థలమున లక్షనమై ఉంటాము.మరొకపరి ప్రేమతో దానిని నీ కు అలంకరిస్తాము.ఒకరోజు నాసాగ్ర మౌక్తికమవుతాము.మరొకసారి దానిని నీకు ధరింపచేస్తాము.అంతే కాదు కృషనా.నా సఖి వేణువవుతుంది.నేను నీ పెదవి చేరుతాను.మరొకచెలి నాదముగా నర్తిస్తుంది.ఎల్లప్పుడు మమ్ములను నీతోనే నిలుపుకుంటావన్న నీ మాటను గుర్తుచేస్తూ నేను నీ ముంజేతి కంకణమవుతాను.ఇంకా తనివి తీరటము లేదు.ఆగు కృష్ణా.స్వామి కొంచము సమయమునిస్తే అందరము కలిసి ఆలోచిచుకొని ఆఖరిసారిగా ఒకే ఒక సౌభాగ్యమును అర్థిస్తాము అన్నారు గోపికలు.ఏమనగలడు వారి ఎడదనెరిగినవాడు?కాదనగలడా? కామినుల వీడి కదలగలడా?కటాక్షించటమే కాని ఇతరము తెలియనివాడు.ఇదిగో చెబుతున్నాము వినుము.

 మేమందరము దివ్య హరిచందనమై నీ దేహమున ఒదిగి,దిగంత దివ్యపరిమళములను వెదజల్లుతుంటామని స్వామిని హత్తుకున్నారు.



 "కస్తూరి తిలకం లలాటఫలకే
  వక్షస్థలే కౌస్తుభం
  నాసాగ్రే నవ మౌక్తికం
  కరతలే వేణుం
  కరే కంకణం
  సర్వాంగే హరిచందనంచ కలయం
  కంఠేశ ముక్తావళి
  గోపస్త్రీ పరివేష్ఠితుడైనాడు గోవిందుడు.

  (ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..)



 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 చిమ్మచీకటివేళ మేల్కొని,చిత్తములో నిన్ను నిలిపి
 సుతిమెత్తని నీపాదములను స్తుతులతో సేవింపనీ

 "పర" ను కావాలన్న మా ప్రకటనము ఒక మిష
  ప్రతిక్షణము నీ సహవాసము అది పరమపురుష

  జనన-మరణ చక్రములో గింగిరులు తిరుగుతున్న
  మాకొరకై పుట్టినావు బాలునిగ గోకులమున

  భగవత్సంబంధాను భాగ్యమునుబలముగ కొనసాగనీ
  ఏడేడు జన్మలవరకు-మమ్ముల నీ ఎదుటనే ఉండనీ

  మా ఇతరచింతలన్నిటిని ఇక రానీయకు మాదరికి
  గోవింద!కాదనకు నిత్యకైంకర్యమను వరమొక్కటి.




MARGALI MALAI-28

    మార్గళి మాలై-28
   ****************
  ఇరువది ఎనిమిదవ పాశురం
  *********************
కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్ణోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పిరందననై పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
 ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియదు!!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 పశువుల మేపుటకు పచ్చిక వెంటను పరుగిడు వారము
 కర్మానుష్ఠానములెరుగని గొల్లకులము వారము

 శరణము-సందర్శనము-భోగము అను మూడిటితో
 నిన్నుచేరి యున్నాము శుధ్ధసత్వ గోపికలము

 భక్తి-జ్ఞానము-అర్హత ఏమాత్రము లేకున్నవారలము
 మా కులములో పుట్టినవాడవు నీవను సాకు తప్ప

 మనవ్రతమునకు మెచ్చెను మాధవుడు మనవాడేనట
 రమణీయమైన స్వామితో రాసలీలను పేరిట

 పండువెన్నెలలోన నేడు పరమార్థమునందుకొనగ
 యమునా తటికి రారాదో! ఓ రమణులారా!.

గోపికలు శ్రీకృష్ణునితో గొల్ల కులములో పుట్టిన వారమని,లోకానుసరణ తెలియని వారమని,స్వామిని చిన్న చిన్న పేర్లతో పిలిచి అపచారముచేసిన వారమని,అయినను శ్రీకృష్ణుడు వారిని నిరాదరించరాదని వేడుకుంటున్నారు.

గోపికలు ఆవులను అడవికి తీసుకుని వెళ్ళుటయే నిత్యకర్మలని,గోవులను మోక్ష సాధనమునకు గాక పాడికి మాత్రమే పెంచుతున్నామన భావన కలవారమని,నియమ-నిష్ఠలు లేని వారమని అమాయకముగా మాటాడుచున్న మహా మేధావులు..కనుకనే వారు అకారత్రయమును ఆశ్రయించినామని అంబే (ప్రియమైన స్వామిని)తో చెప్పుచున్నారు.అంత మహిమాన్వితమైనది ఆ అకారత్రయము అని గోపిక ఆలోచిస్తోంది అవి

అనన్య శరణము-అనన్య ఉపాయము-అనన్య భోగము.మన గోపికల పరిస్థితి.

వారికి కావలిసినవి స్వామి ఒక్కడే అందీయగలడని శరణువేడారు.వారి వ్రతమునకు కావలిసిన వస్తువులు-మనుషులు-వాయిద్యములు స్వామియే అందీయగలడని,

స్వామిని ఉపాయముగా అనుకున్నారు.భక్తి పరి పక్వమై స్వామిని ఉపేయముగా పొందకోరుతున్నారు.వారికి కావలిసినది,వారి కోరిక తీరుటకు కావలిసినది,వారిని సంపూర్ణ సంతుష్టులను చేయగలిగినది స్వామి యని తెలియచేయుటయే "అకార త్రయము".

వేదవ్యాస విరచితమైన " శ్రీమద్భాగవత" దశమ స్కంధములో (29-33) రాస పంచాధ్యాయి గా ప్రశస్తి గాంచినవి.జయదేవుని గీతగోవిందము మరొక మణిపూస.

"యద్భావం తద్భవతి" అన్న ఆర్యోక్తి రాసలీలను గురించి ముచ్చటించు సమయమున వర్తిస్తుంది కనుక మనం నిష్కళంక మనసుతో దీనిని భావించుదాము.

రాసలీల అంటే మంచి (ప్రయోజనముగల) పని అని అర్థమును పెద్దలు సెలవిచ్చారు.ఇది నవరసాతీత నవనవోన్మేష అలౌకిక ఆత్మానంద హేల." ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు" అనునట్లు ఒక్క రేడు పెక్కు నీడలుగా మారి చక్కని తాత్త్వనికతను తెలియచేయు ఆధ్యాత్మిక అనుగ్రహము.

రసము అను దానికి ఆస్వాదించు ద్రవ పదార్థము అను అర్థమును కనుక అన్వయించుకోవాలనుకుంటే పరమాత్మ కృష్ణ భక్తి అను మధుర రస పానముతో పునీతులైన జీవాత్మల (గోపికల) తాదాత్మిక నృత్యహేల మన కృష్ణుని రాసలీల.

మన గోపికలు శుద్ధ తత్త్వముతో నున్నారని అనుకున్నాము.కనుక వారు తమో-రజో గుణములతో నున్న వారి కుటుంబ సభ్యులను వీడి,నల్లని చీకటి తమోగుణ ప్రధానమైనది(రాత్రి).దానిని వీడి తేజోరూపమైన పరమాత్మను దర్శించి-సేవించుటయే లీల.(మనుషులు చేయు పనులను కర్మలు అని దైవము చేయు పనులను లీలలు అని అంటారు)."త్వమేవాహం" (నీవే నేను-నేనే నీవు) తారాస్థాయిలో నున్న తపస్సు.

 ఎంతటి ధన్యులో గదా వారు.
 ****************************

 కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
 బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
 జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
 దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
 పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
 తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
 పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
 యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి 

      భాగ్యశాలియో
 రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)








Wednesday, December 4, 2019

MARGALI MALAI-27


  మార్గళి మాలై-27
  ****************


   ఇరవై ఏడవ పాశురం
   ****************
 కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై
 ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం
 నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ
 శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే
 పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం
 ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పార్చోరు
 మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార
 కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
 *********************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము

 గోవింద! హనుమకు సీతమ్మ అందించిన హారము మాదిరి
 ఆదరమున మా అమ్మ నీలమ్మతో ఆభరణములను అందించు

 అనుకూలురు-ప్రతికూలురు-ఉదాసీనులను కలుపుకొని
 ఆండాళ్ తల్లితో పాటుగ నిన్ను సేవింపగ వచ్చినాము

 పరమపురుష! వండినాము పరమాన్నమను నైవేద్యమును
 కర్ణిక చుట్టు రేకులవలె కూర్చుని ప్రసాదమును తిందాము


 అహం అన్నం అని మేమమనగా అహమన్నాదో అనుచు నీవు,
 అహం అన్నం నేననుచు నీవు అందించుటయే పెద్ద సన్మానము

 వేదవిదునితోడ కలిసి కూడారై పాశురమున
 చల్దురారగింప రారాదో ! ఓ చెలులారా!.


ఎంతటి అద్భుత సన్నివేశము.
********************



 నవ్వునొక గోపిక-నవ్వించు నొక లలన
 ముచ్చటాడు ముదిత-మురిపించునొక వనిత
 పందెమేయునొకతె-పరుగుతీయునొకతె
 ముందున్న గోవిందు మొదట తాకగను
 పారవశ్యమునొందు పల్లాండ్లు పాడుచును
 చిద్విలాసుని చూస్తు చిందులేయు
 బుంగమూతిని పెట్టు బువ్వ తినిపించమని
 చెంగల్వ పూదండ చేరి సవరించు
 పదిమందికి పంచు పరమార్థమును తెలుప
 పరమానందముతో స్వామికి పరమాన్నమందించు
 దశేంద్రియ దేహము దివ్య పరిమళమైన వేళ
 సాలంకృతులైనారు గోపికలు స్వస్వరూపులుగా.

 వారిని సాలంకృతులుగా మలచినది ఎవరు? ఎప్పుడు? అను మన సందేహమునకు గోదమ్మ,వారు ఈ పాశురములో స్వామిని ఆరు అత్యద్భుత అలంకారములను స్వామిచే ధరింపచేయ బడిన వారట .ఆ ఆరు అలౌకిక ఆభరణానందములు,
1.ముంజేతి కంకణము-శూడగమే
2.భుజములకు శంఖ-చక్రములు-తోళ్వళియే.
3.చెవికి అష్టాక్షరి మంత్రము-తోడే
4.చెవి పూవుగా -మంత్ర స్వరూప-స్వభావము-సెవిపూవే
5పాడగమే-పాదాభరణములు(అందియలు)-పాడగమే
6.దివ్య వస్త్రములు ( దేహము)-ఆడై


  ఎందరెందరో విభవమొతో అలంకరించు స్వామిచే వారు అలంకరింపబడినారు ఈ ఫలదాయక పాశురములో.కనుకనే వారు స్వామిని "కూడారై గోవింద" అని గోదమ్మతో పాటుగా కీర్తించుచున్నారు.

 కూడని వారు.భగవత్ తత్త్వమును చేరని వారు.వారిని మనము ప్రతికూలురుగాను తటస్థులు గాను అనుకోవచ్చును.
 ఈ ప్రతికూలురు మూడు విధములుగా నుందురు.


1. అహంకారముతో భగవంతుని యందు ప్రతికూలతను కలిగియుందురు.స్వామి తన పౌరుషమును ప్రయోగించి వారిని సంస్కరించును.శిశుపాలుడు.

2. మరి కొందరు అనుకూలురే అయినప్పటికిని స్వామి, దర్శనమునీయ
 జాప్యముచేయుచు, తమను బాధపెట్టుచున్నాడని ప్రణయరోషముతో తాత్కాలిక ప్రతికూలతను ప్రదర్శించుచుందురు.స్వామి వారిని తన శృంగార చేష్టలచే సంతోషపరచి సంస్కరించుచుండును
.

3.  మరికొందరు తాము స్వామికంటె అన్ని విధములుగా తక్కువ వారమను న్యూనతాభావంతో స్వామిని కూడుటకు ఇష్టపడరు.స్వామి వారి దరిచేరి అనునయించి,సరస సంభాషణములను జరిపి సామీప్యము ప్రసాదించి సంస్కరిస్తాడు.కనుక స్వామి కూడని వారినెల్లను కూడి,ప్రతి భక్తుని ఆరగింపుని-మరొక భక్తుని జిహ్వ ద్వార రుచిచూసి,ఆనందించి-ఆశీర్వదిస్తాడు.

 నిను నమ్మిన వారికెన్నటికి నాశములేదు నిక్కము కృష్ణా.!

 కూడారై పాశురములో గోదమ్మకు అన్న స్థానములో తానుండి శ్రీరంగమునకు సారెను పంపిన  శ్రీమత్ రామానుజాచార్యులను మనః పూర్వకముగా నమస్కారములను చేస్తూ,గోపికలతోబాటుగా మనము గోదమ్మ నాయకత్వమున పరమాత్మతో ఆడి-పాడి,అడిపడులను (పాదపద్మములకు)తాకుతు
 పరవశిద్దాము.

( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



MARGALI MALAI-26


 మార్గళి మాళై-26
 ***************


   ఇరువదు ఆరవ పాశురం
   *********************

  మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్
 మేలైయార్ శెయననగళ్ వేండువన కేట్టియేన్
 ఞాలాత్తై యెల్లాం నడుంగ మారల్వన
 పాలన్న వణ్ణత్తు ఉన్ పాంజశన్నియమే
 పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు  ఉడైయనవే
 శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే,
 కోళ విళక్కే,కొడియే,వితానమే
 ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
*********************








 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.


   వీడని వ్యామోహమా! మా తోడునీడ నీవేకదా
 మమ్ము నీదరిచేరుటకు  దారియైన వ్రతము కొరకు

  పాంచజన్యమును పోలిన తెల్లనైన శంఖములు
  సుదర్శనపు కాంతులీను శ్రేష్టమైన మణిదీపములు

  పరమాత్ముని సేవింపగ పర అను వాయిద్యములు
  పల్లాండ్లను పాడగలుగు ప్రసిధ్ధ గాయకులు

  వ్రతస్థలమున పాతుటకు చక్కనైన పతాకలు
  అవి మంచులోన తడవకుండ మేలైన మేలుకట్లు

 ఇన్ని వస్తువులను నేనీయగలనా ? అని అనబోకు
 సాధ్యమే ! ప్రళయమున మఱ్ఱి ఆకుపై తేలిన నీకు.

 ఈ పాశురములో మన గోపికలను గోదమ్మ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు స్వామికి అతిసమీపమునకు చేర్చినది.కనుకనే స్వామిని వారు "మాలే"అను సంబోధనమునకు సంతసింపకలిగినారు.వారు స్వామిలో తమనూ-తమలో స్వామిని చూసుకోకలిగే స్థితిని కలిగియున్నారు.వారు స్వాము నుండి సౌశీల్యమును-సౌహర్దత్వమును-సౌలభ్యత్వమును పొంది ఉన్నారు.అయినప్పటికిని వారు స్వామిని వ్రతమునకు కావలిసిన ఆరు వస్తువులను అడుగుచున్నారు.

  గోదమ్మ ఎంత చమత్కారముగా గోపికలనోట తన భావములను వ్యక్తీకరింపచేసినది.అదియును స్వామికి సందేహము వచ్చినదట.అనన్య శేషత్వమును -అనన్య శరణత్వమును-అనన్య రక్షకత్వమును పొందినామని తెలిసి కొనిన గోపికలు, ఇంతకు ముందు స్వామీ! నీ సాంగత్యమును మించి మేమేమి కోరము .నీవే మాకు వరముగా కావాలి అన్నారు.అంతలోనే " స్వామిలో తమను దర్శించుకొని(సారూప్య సిధ్ధాంతము) స్వామి ధరించినటువంటి శంఖములు-భేరీలు-గాయకులు-ధ్వజములు-దీపములు-వితానములు మొదలగునవి కావాలన్నారు.

 స్వామి అడిగిన ప్రశ్నలకు గోపికలచే గోదమ్మ వ్రతవిధానమును శుభఫలితములు మా గొల్ల పెద్దలు ఎప్పటినుండో చేయుచున్నారట.దానిచే గోకులము సుభిక్షమగునట అని చెప్పిన తరువాత చేయుచున్నాము.సనాతన సాంప్రదాయానుసరణమే సంస్కారము కదా.దానిని మధ్యలో వదిలి వేయుట అనుచితము కదా.అంతే కాదు ఈ వ్రతము చేయు మిషతో మీ సారూప్య-సామీప్య-సాంగత్యము మాకు లభించినది కదా స్వామి కనుక దయతో మాకు నోమునకు అవసరమగు వస్తువులను అనుగ్రహింపుము అనుచున్నారు." మేలైయార్ శెయ్నగళ్ " అను పదములతో తమ సంస్కారమును చాటుకున్నారు గోపికలు.

 " గోపికలు అంతర్యాగ-బహిర్యాగ తత్పరులు" ఆ విషయమును తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.

 వ్యామోహము భగవంత-భాగవత పరస్పరాశ్రితములైన వేళ వారు స్వామిని శంఖములు-మణిదీపములు-వాయిద్యములు-ప్రసిధ్ధ గాయకులు-పతాకలు-మేలు కట్లు అడిగనంట్లున్నది వాచ్యార్థము.కాని వారు స్వామిని సేవించు శంఖములుగా-మణిదీపములుగా-వాయిద్యములుగా-ప్రసిధ్ధ గాయకులుగా-పతాకలుగా-మేలుకట్ల గా తమను అనుగ్రహించ మనినారని అంతరార్థము గాను భావించ వచ్చును.(అంతర్యాగ సమయంలో)

  అంతే కాదు.

సర్వేజనా సుఖినో భవంతు అను సద్భావముతో చేయు నోములో ,

 మంత్రాసనము కొరకు,శంఖములను,స్నాసనము కొరకు వాయిద్యములను,అలంకార-మంత్రపుష్ప-వేదపఠనము కొరకు ప్రసిధ్ధ గాయకులను-నైవేద్య సమర్పణ సేవకు దీపములను-స్వామి వారి సంచార వాహన సేవకు ధ్వజములను,పర్యంక సేవకు వితానములను అడిగినారని,స్వామి పరమ ప్రీతితో,తమ పంచజన్యమును బోలిన శంఖములను వారికి అనుగ్రహించగానే అత్యద్భుతము గోపికలు సత్వగుణ సంపన్నులైనారు.మణిదీపములుగా సాక్షాతు శ్రీమహాలక్ష్మినే ప్రసాదించినాడు.అత్యంత భగవదనుభవ సంపన్నులైనారు గోపికలు.పెద్ద బుర్రగల పర వాయిద్యములను అనుగ్రహించినాడు.కరములతో పట్టుకొని-హృదయమునకు హత్తుకొని,దివ్యనాదమును చేయుచు,మనోవాక్కరణములను సుసంపన్నము చేసుకుంటున్నారు.ధ్వజముగా తన వాహనమైన గరుడుని అనుగ్రహించాడు.గరుడగమనుని స్తుతించి,గమ్యమును చేరగలుగుతున్నారు.వితానముగా తన అంబరముబు సంబరముగా ప్రసాదించాడు వారికి స్వామి.విశ్వవ్యాపకమైన విష్ణు వస్త్రమును విధేయులై స్వీకరించి,వినూత్న ప్రభలతో వెలిగిపోతున్నారు గోపికలు.గోదమ్మ.

 స్వామి నేనిన్ని ఇవ్వగలనా అంటాదేమో అని స్వామి నీ శక్తి మాకు తెలియును,ప్రళయకాలమున చిన్ని వటపత్రముపై ,
"కరారవిందేన పదారవిందం
 ముఖారవిందే వినివేశయంతం
 వటస్య పత్రస్య పుటె శయనం
 బాలం ముకుందం మనసా స్మరామి" అంటు స్తుతిస్తున్నారట.


  ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)

Tuesday, December 3, 2019

MARGALI MALAI-25


  మార్గళి మాలై-25
 ***************


  ఇరవై ఐదవ పాశురం
  *****************
 ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్
 ఒరుత్తు మగనాయ్ ఒళ్త్తు వళిర
 తరిక్కిలాన్ ఆంగితాన్ తీంగు నినైనద
 కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్
 నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై
 అరుత్తిత్తు వందోం ; పరై తరువదియాగిల్
తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి
వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో



 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

 ఒకతల్లి గర్భమున రాతిరి పుట్టినవాడు
 మరొకతల్లి ఇంటచేర యమునను దాటినవాడు

 హింసింపదలచిన కంసుని దుష్టప్రవృత్తిని
 నిర్భయముగ తానె వెడలి నివృత్తిచేసినవాడు

 అష్టాక్షరిగా పుట్టి-ద్వయమంత్రముగా పెరుగుతు
 ఆబాల గోపాలమున అడుగో ఆడిపాడుచున్నాడు

 "పర" మాకు ఇచ్చినను-లేకున్నను సమ్మతమే
  కదలనిభక్తి కైంకర్యపు పరంపరలు ప్రసాదించు

 భక్తిప్రపత్తులతో స్వామి జన్మవైభవమును కీర్తింపగ
 ఆండాళ్ అమ్మవెంట తరలి రారో! తరుణులార!

  " దేవకీ గర్భ సంకాశం-కృష్ణం వందే జగద్గురుం" నమో నమః.ఒక్కొక్క పాశురముతో ఒక్కొక్క మెట్టును గోపికలచే ఎక్కిస్తున్నది ఆచార్యస్థానములో నుండి గోదమ్మ.

  ఈ పాశురములో గోపికలు శ్రీకృష్ణ జన్మరహస్య సంభాషణమును తమ జన్మరాహిత్య సంస్కారముగా భావించినారేమో,గోదమ్మ పలుకుతున్న ప్రతి పదము పరమార్థమును వివరించుచున్నది.

   గోదమ్మ ఈ పాశురమును "ఒరుత్తు మగనాయ్" ఒకతె కొడుకు అని అంటున్నదే కాని దేవకీదేవి-యశోదాదేవి అని కాని,వారి కొడుకుగా కృష్ణుని నామమును గాని పేర్కొనలేదు. ఏమిటా ఒరుత్తు? అదే ఒకేఒక మూలపదార్థము.దానికి నామ రూపములు లేవు.మనలను అనుగ్రహించుటకు మనకోసము కాసేపు,మనము ఏ విధముగా మన చేతి వేళ్ళను ఒకసారి మూసి,మరొకసారి తెరిచి,ఇంకొక సారి కొన్ని మూసి-కొన్ని తెరిచి చేస్తుంటామో,అదే విధముగా మూలపదార్థమైన పరమాత్మ,దేవకీ-వసుదేవులుగాను,యశోద నందులుగాను ,తాము-మాయ గాను అనేక రూపములను దాల్చి,అనేక నామములను ధరించి,మనలను అనుగ్రహించుచున్నాడు,తన జన్మవృత్తాతమును తెలియచేస్తూ,

  ఇంక రెండవ విషయము " ఓర్ ఇరవిల్" అర్థరాత్రి సమయము.అది అద్భుతమయమైన అద్వితీయ రాత్రి.స్వామి తాను సామాన్య మానవుల వలె పుట్టినాడు "పిరందు" అని చెప్పించిన రాత్రి.మన కథలో మూల పదార్థము ఇద్దరు స్త్రీ మూర్తులుగా మారి ఒకరు గర్భవాస వరమును,మరొకరు స్థన్య పాన వరమును మరొక భాగమయిన కుమారుని వలన పొందినవి.

  చిమ్మచీకటి-చుట్టు  గుండుసూది పడినను వినగల నిశ్శబ్దము. శ్రావణ బహుళ అష్టమి అర్థరాత్రి.బ్రహ్మాదులు బహువిధముల ప్రస్తుతించుచుండగా నల్లనయ్య పన్నెండు నెలలు గర్భవాసము చేసి,సామాన్యుని వలె పుట్టినాడు.దేవకీదేవి దివ్యరూపమును ఉపసమ్హరించి,చిన్ని బాలుడు గా మారమనగానే వల్లె అనినాడు.ఇక్కడి నుండి అద్భుతములు మొదలు.ఇన్నని చెప్పనలవి కానివి.

  కారణము కార్యము రెండు తానైన స్వామి కార్యభారమును తన జనకునకు అప్పగించినాడు.రూపధర్మమును గౌరవించినాడు.
 తనతో తోడ్కొని వచ్చిన యోగమాయను యశోద పిరాట్టు గర్భమున నిక్షిప్తము చేసినాదు.

  స్వామి లీలలు సామాన్యులకు అర్థము కావు.ఇప్పుడు తను తండ్రి సహాయముతో గోకులమునకు వెళ్ళవలెను.వింతలు మొదలైనది.పంచేంద్రియములు వంచబడ్దవి మధురలో.ద్వారపాలకులు చేతనులు.ద్వారములు అచేతనములు.ద్వారములు వాని గడియలు చేతనములైనవి.ద్వార పాలకులు అచేతములై మూర్ఛపోయినారు.తలుపు గడియ విడివడినది.అచేతనములైన సంకెళ్ళును విడివడి సహకరించినవి. పంచేంద్రియ నిద్రాణమేమిటి? అని మనమనుకో వచ్చును.

 యధారాజా-తథా ప్రజా.వారు పరమాత్నను దర్శించలేదు.బ్రహ్మాదుల స్తుతులు మధురలో వినపడలేదు.కదలలేరని గద్దించనులేదు.స్వామి తులసిమాల పరిమళమును ( రాబోవు పరిణాములను )వాసన పీల్చలేదు.విడివడిన తలుపు గడియను తిరిగి బంధించను లేదు.అంతా చీకటి-నిశ్శబ్దము.తమోగుణ భూయిష్స్ఠము.
 అటువంటి చీకటికదా తమ స్వామిని సేవించి తరించినది అని ఆళ్వారులు చీకటిని గౌరవించి కీర్తిస్తారు.దానికి కారణము మధూర ప్రభువు కంసుడు సహిత రాగ భయక్రోధుడు.

  బయలుదేరినాడు వసుదేవుడు.భూమాత పులకించినది.గగనము హర్షించినది.వాయువు సుగంధభరితమైనది.(జలము) యమున వినయశీలతో తన ఒరవడిని తగ్గించి సహకారమను పేరుతో సత్కరించినది.అగ్ని మధురలోని తమోగుణమును తరిమివేసి ప్రకాసవంతమై వసుదేవసుతుని నందనందనుని చేసినది.

  మధురలో తమస్సు.గోకులములో ఉషస్సు.సంబరములు.సంతోషములు కారణము గోకులము వీతరాగ భయక్రోధము.స్వామి అనుగ్రహ సంపర్కముతో తిరిగి దరిచేరలేనంత దూరము తొలిగి పోయినవి.కనుకనే వారు నీ అనుగ్రహసంపదను పొందిన మేము" మగిళుందు"శేగమే" సంతోషముతో ఆదుతూ-పాడుతూ నిన్ను సేవిస్తాము అంటున్నారు స్వామితో.


  స్వామి నుండి వరములు తీసుకొన దలచిన గోపికలు ఇప్పుడు పరిపూర్ణులై స్వామినే తమ వరముగా కోరుకుంటున్నారు.ప్రశంసనీయము.

   ధర్మ సంరక్షకుడైన స్వామి మధురకు తానే వెళ్ళి,కంసునికి ముక్తినొసగినాడు.

    అన్యథా  శరణం నాస్తి-త్వమేవ  శరణం మమ అని గోపికలతో పాటుగా మనము స్వామిని ఆశ్రయిద్దాము.

  (ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)




MARGALI MALAI-24

  మార్గళి మాలై-24
 ***************

   ఇరువది నాలుగవ పాశురం
   *************************
 అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోత్తి
 శెన్రంగు త్తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోత్తి
  పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పూగళ్ పోత్రి
 కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోత్తి
 కున్రు కుడైయా ఎడుత్తాయ్! గణం పోత్తి
 వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోత్తి
 ఎన్రెన్రున్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్
 ఇన్రుయాం వందోం ఇరంగు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
  శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము



  నాడు భూమిని కొలిచిన వామన పాదములకు మంగళం
  లంకకేగి రావణు కూల్చిన రామ పాదములకు మంగళం

  శకటాసురుని కూల్చిన స్వామి పాదములకు మంగళం
  వత్సాసుర కపిత్సాసుర సంహారి పాదములకు మంగళం

  గోవర్ధనగిరి నీత్తిన గోవిందుని పాదములకు మంగళం
  శుభకర కరమున నున్న వేలాయుధమునకు  మంగళం

  ఒకటా? రెండా? మూడా? ఎన్నని కీర్తించగలము
  మాధవా! దయతో మంగళ హారతులను స్వీకరించు


 రంగనాథ స్వామికి మంగళాశాసనములు పాడరారె
 అంగనలారా! అందరు ఆండాళ్ అమ్మ వెంట నేడే.

  తండ్రికి దగ్గ తనయ మన గోదమ్మ.కనుకనే శ్రీమాన్ పెరియాళ్వారులు ప్రతిపాదించిన " పల్లాండ్లను" ప్రస్తుతులను కూడిన మనగళా శాసనములను మనకు పరిచయము చేయుచున్నది.

  ఈ పాశురములో,

  వాత్సల్యము! వత్సుని (పుత్రుడు/పుత్రిక)అందలి ఆత్మీయానురాగము.ఇక్కడ వాత్సల్యము గోపికలపై స్వామికి,స్వామిపై గోపికలకు పరస్పరాశ్రితము. ఆత్మానంద స్థితికి ఇది నేత్రోత్సవము.స్వామి గోపికలకు వాత్సల్యమును అందించుచు తాను వారినుండి పొందకోరిన హేల!కృష్ణ లీల!

విదేహమహారాజు సీతమ్మను రాముని చేతిలో పెట్టుచు "భద్రం" అన్న మాట ఎంత పవిత్రమైనదో గోదా సమేత గోపికల మంగళాశాసనము అంతే పవిత్రము.రాక్షస సం హారముచేసి స్వామి శరీరము ఎంత కందెనో,స్వామి ఎంత అలిసిపోయేనో అని తలచు పసి మనసులు వారివి.పసితనము అనగా కపటము లేనిదివయసుకు సంబంధించినది కాదు.ఎన్ని కన్నులు కుట్టినవో స్వామిని అని యశోదతో కూడి మన గోపికలు స్వామికి దిష్టి తీసిరి.అనుభవైక వేద్యమైన ఆత్మ సాక్షాత్కార పురస్కారము..

ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? .అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే కదండీ!
  తన వాడనుకున్న స్వామి తత్త్వమును అర్థముచేసుకొనుచున్నారు గోపికలు.వారికి స్వామి సకల అవతార విశేషములు కళ్లముందు కదలసాగినవి.యుగ విభజనను విస్మరించారు.జ్ఞాన దశను ( సకలమును బాహ్యస్థితి నిజమనుకొను) జరిపివేసినది వారి అతిశయమైన ఆప్యాయత.ఇక్కడ గోపికలు స్వామి త్వమేవాహం-త్వమేవాహం (నీవే నేను-నేనే నీవు) అనుకునే స్థితిలో ఉన్నారు.హెచ్చుతగ్గులు లేని ముచ్చటైన స్థితి.  కనుకనే వారు స్వామి నుండి తాము వరములను పొందాలనే స్థితిని దాటి స్వామికి తాము ఏమివ్వగలము అని ఆలోచించేలా చేసినది.

   అన్ని రూపములు ఇందే ఆవహించెను అని అన్నమయ్య అనుకున్నట్లుగా వారిలో రామావతారము-కృష్ణావతారము స్వామిలో కనిపించసాగినవి.

 గోదమ్మ గోపికలను రెండు వర్గములుగా చేసినది.కొందరు రామునిగా భావించి,ఆశీర్వదిస్తున్నారు.మరి కొందరు కృష్ణునిగా బలపరచి ఆశీర్వదిస్తున్నారు.అదినేనే-ఇదినేనే అయిన స్వామి వినోదిస్తున్నాడు.

   భూమండలము తమోమయము.మాయా మోహితులను చేసేది.రాళ్ళు-రప్పలు ఎత్తు-పల్లాలు అటువంటి భూమిని దేవతల కొరకు ,ఒక్కసారిగా పెరిగి కొలిచిన స్వామి పాదములు ఎంత కందిపోయినవో కదా! లబ్ధిపొందిన ఇంద్రుడు మరెవరు ఆ విషయమును తలవ లేదు అన్నరు కృష్ణుని వర్గము వారు. నిజమునకు ఇది స్వామి మనకు అందించిన ధూళి ప్రసాదము.

  రామ వర్గము వారు ఊరుకుంటారా? చాల్లే1 మీ స్వామి ఉన్న చోటనే ఉండి చేసిన పనిని గొప్పగా చెప్పు కుంటునారు.అదే మా రాముడు అడవులను.సముద్రములను,కొందలను,గుట్తలను దాటి లంకాద్వీపమునకు వెళ్ళి రావణుని సమ్హరించాడు.మాస్వామి పాదములెంత కంది పోయినవో అన్నారు.నిజమునకు దశ ఇంద్రియములు రావణుని పదితలలు.వాని అహంకార రూపమే రావణుడు.వాటిని మర్దించిన స్వామి మా రాముడు అంటున్నారు.

  కృష్ణ వర్గము వారు ఊరుకుంటారా? మీ స్వామి బాల్యములో ధనుర్విద్యలు నేచిన వాడు.అంతే కాదు పెండ్లి అయిన వాడు.ఆ వయసులో రావణుని కూల్చుట ఏమంత ఘనకార్యము.
 పాపము మాస్వామి చిన్న బాలుడు.గొల్ల కులములో నున్న వాడు.క్షాత్ర ధర్మ్మేది? అయినప్పటికిని కపట శకటుని కాలితో తన్ని సంహరించాడు.మన శరీరమే శకటమైతే కామ-క్రోధములు దానిని నడిపించే రెండు చక్రములు.కామము తీరనప్పుడే కదా అది క్రోధముగా తన స్వభావమును మార్చుకుంటుంది.అట్టి దానిని తన కాలితో తన్ని విరిచినప్పుడు,ఆ పాదమెంత కందెనో కదా అంటూ,రామ వర్గము వారికి అవకాసము ఇవ్వకుండా స్వామి రక్షనను మరొక మూడు సంఘటనలతో చెప్పుకొచ్చారు.

 కపటదూడ మోహము-వెలగ పందు వాసన.దూడగా-వెలగ చెట్టుగా వచ్చిన (మారువేషములలో) దూడను పట్టుకొని వెలగ చెట్టుపైకి విసిరి,ఒకేసారి ఇద్దరు రాక్షసులను కూల్చినప్పుడు స్వామి పాదములెంత కందెనో.

  అంతే కాదమ్మా.ఏ ఇంద్రునికైతే స్వామి బలిని పాతాళమునకు పంపి,రాజ్యమును ఇచ్చినాడో,ఆ ఇంద్రుడే అహంకారముతో రాళ్ళవాన కురిపించినపుడు ఏడు పగళ్ళు-ఏడు రాత్రుళ్ళు,తన చిటికెన వేలుపై గోవర్ధనగిరి న్)ఎత్తి,గోవులను-గోపాలకు;లను కాచిన స్వామి పాదపు వంపు ఎంత కందెనో అన్నారు.వాదన వేడుకను చాలించుకొని గోపికలందరు స్వామిని దిష్టి తీసి,మంగల హారతుల నిచ్చినారు.

 ( ఇక్కడ ఏడు పగలు-రాత్రి వారము అని కాదు.ఎన్ని రోజులు గడిచినా అదే అది నుండి శని వారములు అని అంతరార్థము)

.



( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం )


                               

MARGALI MALAI-23


  మార్గళిమాలై-23
  *************


       ఇరవదిమూడవ పాశురం
      *********************
 మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం
 శీరియసింగం అరిఉత్తు త్తీవిళిత్తు
 వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి
 మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు
 పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్
 కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పడయ
 శీరియసింగాసనత్తు ఇరుందుయాం వంద
కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణాభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 వర్షాకాలములోన కొండగుహలో నిదురించుచున్న
 సింహ కిశోరము మేల్కొని కాళ్ళను చేరచాచి

 జూలును విదిలిస్తు-గంభీర గర్జనను చేస్తూ
 అడవిని పాలింప గుహవీడి వెడలు శోభ

 ఓ పురుష సింహమ! నిదురను చాలించి నీవు
 ధీర గంభీర నడకను దారిని ఉధ్ధరిస్తూ

 విరగబూసిన అవిసెల విభవమలర.ప్రేమతో
 గోకులమును పాలింప వేగమే కదలిరమ్ము

 కువలయమునంతటిని కూర్మితో  కుశలమడుగుచును
 సింహాసనమును చేరి,  కైంకర్యములు స్వీకరించు.

 ఈ పాశురములో గోదమ్మ వర్షాకాల సమయమున స్వామి తన సివంగితో సీరియ సింగము వలె నిదురిస్తున్న కొండగుహ వద్దకు గోపికలను తీసుకొని వచ్చినది.ఒక్కొక్క పాశురములో గోపికలు భగవత్తత్త్వమునకు ఒక్కొక్క మెట్టు ఎక్కి దగ్గరవుతున్నారు.భగవంతుడు ఒక్కొక్క మెట్టు దిగి వారిని చేరదీసుకుంటున్నాడు.వీరిద్దరి సంధాన కర్తగా ఆచార్యులు(గోదాదేవి) దగ్గరుండి నిర్వహించుచున్నది.


 క్రిందటి పాశురములో గోపికలు స్వామి నిద్రమేల్కొను సౌందర్యమును అనుభవించినారు.స్వామి మధుర వాక్కులలో స్నానమాడినారు.దాని ప్రభావమో ఏమో నర్మగర్భముగా స్వామిని గుహవీడి తన నడక సౌందర్యమును ప్రసాదించమంటున్నారు.సీరియ సింగము వలె నడచివచ్చి సకల భువనములను తన స్పర్శతో పునీతము చేసి పెద్ద సిమ్హాసానము నధిష్ఠించి,అనుగ్రహించ మంటున్నారు. ఇది వాచ్యార్థము.

  విజ్ఞుల వివరణ ప్రకారము వర్షాకాలము.చీకటి గుహ అందులో తన జంటను కలిసి నిదురించుచున్న సిమ్హము.మూలతత్త్వ స్థికి ప్రతీక.వీరి ప్రార్థనలు స్వీకరించి,స్థితి గతిగా -గతులుగా తన మూల తత్త్వమును విస్తరించుకొనుచున్నది.అదియే ప్రళయానంతరము కలుగు రజోగుణోద్భవమును స్వామి ఎర్రని కన్నులతో సూచించు చున్నది గోదమ్మ.కాళ్ళను చేర చాచుట పాంచజన్యుని నుండి పంచభూత విస్తరణ.జూలు విదిలించుట దశదిశావిర్భావము.

 భయానకమైన మూలతత్త్వములో దాగిన చేతనము పరమాత్మానుగ్రహముతో విస్తరించి కుసుమ కోమలమై,చీకట్లను తెంచుకొని ప్రకాశించ సాగినది.స్వామి పాదస్పర్శతో పావనమైన జగతి పులకించినది.సామాన్య కారణ-కార్య సంబంధమునకు (ఉపాదాన కారణము-నిమిత్త కారనము-సహాయ కారణము) అను మూడు కారణములు అవసరము.కాని తనలో అన్ని దాచుకొని " ఒకపరి జగముల వెలువల్ మరొకపరి లోపల" దాగు వానికి వాటి అవసరములేదు.స్వామి అనుగ్రహమేమో సాలెపురుగు కూడ గూటి నిర్మాణ సమయమున కారణములను వ్యక్తముచేస్తు,కార్యమును సాధిస్తుంది.

 " మారిమలై ముళింజిల్" వర్షాకాలమున కొండగుహలో శివంగి తో కలిసి నిదురించుచున్నది వీర కిశోరము.కాని చూస్తే ఒకటి గానే కనిపిస్తున్నది చర్మ చక్షువులకు.

 మారి -వర్షము ఒకటే వర్షము.చుట్టును జలమయము.అంతా చిమ్మచీకటి.చీకటికొట్టు లో ఒక సిమ్హము నిదురించుచు రెండుగా మనము భ్రమపడునట్లు చేయుచున్నది.సమస్త ప్రకృతి జలమయమై స్వమిని ఆశ్రయించి,అంతర్లీనమైనది.ప్రకృతి-పురుషుల దివ్య సంగమంది.తటస్థస్థితి.ఆ స్థితి నుండి జాగరూకుడవు కమ్మని,గుహను వెడలి నడచివచ్చి,తమను అనుగ్రహించమని వేడుకుంటున్నారు.మొరను ఆలకించినది.లేచినది,ఎర్రని చింత నిప్పుల వంటి కళ్ళతో పరిసరములను పరికించినది.అంతా రజోమయము.వెంటనే గర్జించినది.అది ప్రణవము.కాంతి-శబ్దములు ప్రభవించిన తరువాత తన కాళ్ళను ముందుకు సాచి,వళ్ళు విరుచుకొనినది.ఈ ప్పుదే పాంచజన్యుని నుండి పంచభూతములు విస్తరించుట మొదలుపెట్టినవి.దశదిసలు గుట్తలు,నదులు,జీవులు కొత్తరూపును దిద్దుకుంటున్నవి.అదియే జూలును విదిలించుట.

 పురుషుని స్వభావము మారినది.గాంభీర్యత తోసివేసి సౌకుమార్యము చోటుచేసుకొనినది.సింహము వంటి స్వామి అవిసెపూల వంటి సౌకుమార్యమును సంతరించుకున్నాడు.

  చతుర్వర్గ గతులతో స్వామి అడుగులు వేస్తూ,నడిచివచ్చి సింహాసనారూఢుడైనాడు..తన స్పర్శతో సమస్తము పునీతమైనది.సఖ్య భక్తి దాస్యభక్తిగా మారి స్వామి సింహాసనము క్రింద కూర్చుని సంతసించుచున్నది.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)







MARGALI MALAI-22

  మార్గళి మాలై-22
    ***********


       ఇరువదిరెండవ పాశురం
   ************************

  మార్గళి మాలై-22
  ************

 అంగన్ మాల్యాలత్తు !అరశర్ అభిమాన
 బంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీళే
 శంగవిందుప్పార్ పోల్ వందుతలై ప్పెయిదోం
 కింగిణివాయ్ చ్చెయద తామరై పూప్పోలే
 శెంగణ్ శిరిచ్చిరిదే ఎమ్మేల్ విళియావో?
 తింగళుం ఆదిత్తియనుం ఎళుందార్ పోల్
 అంగణ్ ఇరండు గొండు ఎంగుల్మేల్ నోక్కదియేల్
 ఎంగళ్మేల్ శాబం ఇళిందు ఏలో రెంబావాయ్.


   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
   ***********************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ నీళా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 సుందర-సువిశాల భూమండలమేలిన రాజులు
 నీ ముందర నిలబడినారు జితబాణులు నిరహంకారులు

 సుందర-సువిశాల సంసారాంబుధి మునిగిన భామలు
 నీ ముందర నిలబడినారు జితగుణులు నిరహంకారులు

 మారాకను ప్రశ్నించుట మా పాపపు శాపము పంచుట
మావాడవు నీవనుకొను మమ్ముల దూరమునుంచుట

 ఉదయించనీ సూర్యుని-చంద్రుని ఒకపరి ఉత్సవమనుకొని
 మెమెల్లగ తాకుతు నెమ్మది శాపం దహియించమని

 అరతెరచిన కన్నుల వేడుక అగుపించని మువ్వల పోలిక
 ఆలస్యము చేయక మన వ్రతమునకు రారాదో



  ఈ పాశురములో గోదమ్మ స్వామి విరిసి-విరియని( తెరిచి-తెరవని) నేత్ర సౌందర్యమును వాచ్యార్థముగా చెప్పినప్పటికిని,అభిమాన రాహిత్యమును,అనన్య శరణత్వమును,ఆశ్రిత వాత్సల్యత్వమును అన్యాపదేశముగా వివరించుచున్నది.

 క్రిందటి పాశురములో రాజులు బాణజితులై యుధ్ధములో ఓడిపోయి స్వామి ముంగిట నిలిచియున్నారు.గోపికలును  స్వామి ముంగిట నిలిచియున్నారు.వీరు బాణ జితులు కారు.స్వామి యొక్క సద్గుణములచే ఓడింపబడిన వారు.వీడి యుండ లేని వారు.గుమ్మము దగ్గర నిలబడిన వారు లోపలికి రావచ్చును.లేక తిరిగి వెళ్ళి పోవచ్చును.కాని గోపెమ్మలు వచ్చేశాము అంటున్నారు.తిరిగి వేళ్ళే అభిప్రాయము వారికి లేదు.

 వారి పూర్వపు మనోభావములు వేరు.ఇప్పుడు వారు ఆచార్యుల సాంగత్య ప్రభావితులై.రాజులు ఏ విధముగా అందమైన గొప్పవైన సువిశాలమైన తమ రాజ్యములను తృణప్రాయముగా వదిలివేసి వస్తారో,అదేవిధముగా గోపికలు,మమకారము అను అందమైన,అహంకారము అను గొప్పదిగా భావించు విశాల సామ్రాజ్యమును వదిలివేసి వచ్చి తలుపు దగ్గర నిలబడక,నీ మంచము కోళ్ళ క్రింద ఉన్నాము అంటున్నారు. అంతే కాదు వారు అభిమానమును అవమాన పరచి వచ్చేసాము అంటున్నారు.ఆరు సూత్రముల అందమైన అరవిందము అభిమాన రాహిత్యము.అవి,1) అనుకూల సంకల్పము.2.) ప్రతికూల వర్జనము.3.) రక్షకుని యందు విశ్వాసము.4) రక్షకుని యందు విధేయత.5.)తన తక్కువ తనమును ఒప్పుకొనుట.6.)నీవే మాకు దిక్కు నిత్యము  కృష్ణా అను నమ్మిక.

 గోదమ్మ ఈ పాశురములో ఎమ్మేల్-ఎంగళ్ మేల్-ఎంగళ్ మేల్ అని మూడుసార్లు ముక్కరణముల (త్రికరణముల) అని పలుకుచు ఆశ్రయణ అతిశయమును అర్థవంతముచేసినది.చీకటికొట్టు వంటి "ఇరు తరుళ్ మాల్యానాలను" అంగన్ మాన్యాలు గా ప్రకాశవంతము చేస్తూ,స్వామి అణ్-అందమైన,ఇరండు-రెండు, కణ్ కన్నులను, కొంచము కొంచముగా తెరచి అనుగ్రహించమని ,అరవిరిసిన కన్నుల మరంద ధారలలో మునిగి జలకములాడనీయమని వేడుకొనుచున్నది.
 .
 నియమ పాలన చేయు సూర్య నేత్రము "న క్షమామి" అని అంటుంటే,అమ్మ పురుషకారము స్వామిని అనునయిస్తుండగా "న త్యజామి" అని పలికించునది చల్లని చంద్ర నేత్రమట.ఎంతటి చక్కని ఉపమానము.అదే విధముగా ఆచార్యులు ఆర్య భాషా అనుగ్రహణము సూర్య నేత్రమైతే,ద్రవిడ వేదానుగ్రహము చంద్ర నేత్రమట." యద్భావం తద్భవతి.
 తామర వంటి నోటిని తెరిచి,తేనెలూరునటుల తమతో మాటలాడి,ఆనందాబ్ధిలో జలకములాడించుట అనన్య శేషత్వమునందించుట.
.

 తమో భూయిష్ఠమైన భూలోకము సత్సంగ సద్గుణ ప్రభావముతో కాంతివంతమగునట్లు ,స్వామి 'తింగళుం ఆదియనుం ఎళుందార్" తో ప్రకాశవంతము చేయమనుచు,వ్రతము కొనసాగించుటకు మనము ఆశ్రయణ దశను అధిగమించి,అనుభవ దశలోనికి ప్రవేశిస్తున్నాము.


  జై శ్రీమన్నారాయణ-జైజై శ్రీమన్నారాయణ.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)







Monday, December 2, 2019

MARGALI MALAI-21


  మార్గళి మాలై-21
  ******************

   ఇరవైఒకటవ పాశురం
   ****************

  ఏత్తి కలంగళెదిర్పొంగి మీదళిప్ప
  మాత్తాదే పాల్ శొరియం వళ్ళన్ పెరుం పశుక్కళ్
  ఆత్తపడైత్తాన్ మగనే! అరివురాయ్
  ఉత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
  తోత్తమాయ్ నిన్ర శూదరే!తుయిళెలాయ్;
  మాత్తార్ ఉనక్కు వలితులైందు ఉన్ వాశర్ కణ్
  అత్తాదు వందు ఉన్ అడిపణియు మాపోలే
  పోత్తియాం వందోం పుగళందు ఏలోరెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీనీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము.


 తల్లడిల్లు గోపికలకు తలుపును తెరిచినది నీల
 మరువలేదు మీ ప్రార్థనలను నేనును మీ పక్షమే

 స్వామికి నివేదించ తగిన సమయమునకై వేచితిని
 మరియొక మాట మగువలార! భగవానుని మరిమరి

 మానవుడు-మన వాడను భావనను కలుగచేయవలెనుగా
 గోపాలురు-గోసంపద-గోపికలను జ్ఞప్తిచేయు విధముగ

 యశోద-నందులను మరిమరి కీర్తించండి
 యదుకుల భూషణుడను లీలలను చాటండి

 దాసోహులు గోపికలు దర్శన ధన్యత గాంచిరి
 ఆనందింపచేయదలచినది అమ్మ తాను ఆచార్యుడై.

అత్యద్భుతమైన ఈ పాశురములో అమ్మ స్వామి గోవింద అవతార విశేషములను గుర్తుచేస్తూనే,నీలమ్మ ద్వారా చమత్కర సంభాషనా చాతుర్యమును మనకు పరిచయము చేస్తున్నది.

  మొదటిది గోకుల పశువులు ఏ విధముగా పాలు కుండలనుండి వస్తున్నాయా-లేక వాటి పొదుగు నుండి వస్తున్నాయా తెలుసుకోలనట్లున్నడట గోసంపద.

 గోదమ్మ గో-వాక్కులను,తమకు తామే అనుగ్రహముతో కురింప్పించు ఆచార్య వైభవమును స్వామిని కీర్తిస్తూ,తెలియచేస్తున్నది.

  గొల్లవాడు ఏ విధముగా గోవులను కట్లువిప్పి కొంచముసేపు బయటకు తీసుకుని వెళ్ళి,తిరిగి వాటిని రాటకు బంధిస్తాడో,అదే విధముగా మన గొల్లవాడు జీవులను మనలను సంసారమనే రాటికి కట్టుతూ-విప్పుతూ లీలలను చేస్తుంటాడు.

  ఇంతలో నీలమ్మ ఏమయ్యా స్వామి నీవు పాలకడలిలో శేషసాయివై నిదురిస్తున్నావా? మా ప్రార్థనలు నీకు వినబడుటలేదనుకుందామా అంటే/ కానేకాదు గోపికలైన మమ్ములను ఉధ్ధరింపగ గోపాలుడిగా గోకులములో పుట్టినావు.

   పోనీ వైకుంఠములో లక్ష్మీపిరాట్టితో పాచికలాడుచున్నావా అంటే అదియును కాదు.ఎందుకంటే నీలాదేవి సాక్షాత్తు లక్ష్మీస్వరూపమే కదా! దీనజనోధ్ధరణకై తానును గోపికల పక్షము వహించి,(పురుస్షకారము చేసి) స్వామితో మేలమాడుతున్నట్లుగా కనిపించే హెచ్చరికను చేస్తూ,మేల్కొని వచ్చి మమ్ము అనుగ్రహించమంటున్నది.


MARGALI MALAI-20


 మార్గళి మాలై-20
 *****************

    ఇరువదవ పాశురం
    ***************

   ముప్పత్తు మూవర్ అమరర్క్కు మాన్శెన్రు
   కప్పం తవిర్ క్కుం కలియే! తుయివెళాయ్!
   శెప్ప ముడైయాయ్! తిరలుడైయాయ్! శెత్తార్క్కు
   నెప్పం కొడుక్కుం విమలా! తుళెలాయ్
   శెప్పన్న మెన్మాలై! చెవ్వాయ్,చ్చిరు మరుంగుల్
   నప్పిన్నై నంగాయ్! తిరువే! తుయివెళాయ్
  ఉక్కముం తట్టొళియుం తందున్ మణాళనై
  ఇప్పోదే ఎమ్మై నీరాట్టు ఏలో రెంబావాయ్.

 
 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
  శ్రీనీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము

  ముప్పదిమూడుకోట్ల దేవతలకు తాను ముందుండి
  భయమును తొలగింపచేయు అభయమూర్తి మేలుకో

  తప్పుదారి శత్రువులకు వెన్నులో వణుకును పుట్టించి
  ధర్మమును రక్షించిన నిర్మలమూర్తి మేలుకో

  అద్దము-విసనకర్ర-వస్త్రములను నోమునకు అందీయగ
  సద్గుణపరిపూర్ణా! ఓ నీలా ప్రసన్నురాలివై నిదురలే

  ఇతరములేవి కోరని నిష్కళంక మనసులము
  స్వామి స్వరూపజ్ఞానమనే అనుభవములోన మునిగి

  స్వామిలో లీనమయే స్నానమును ప్రసాదింప
  నీలమేఘశ్యాముని తోడ్కొని రారాదో? ఓ తల్లీ.

  గోదమ్మ ఈ పాశురములో గోపికల మానసిక స్థితి-మాట తీరు విశదపరచుచున్నది.వారు స్వామి గుణగానస్నానమును చేయుటకు-దర్శించుటకు తహతహలాడుచున్నవారు.

 కాని స్వామి వారిని కరుణించక మిన్నకున్న్నాడు.వారు దీనులై నీలమ్మతో తమను అనుగ్రహించునట్లు స్వామినిచేయమని మొరపెట్ట్కొనుచున్నారు.వారి నైరాశ్యము నిందారోపణమును చేయుటకును వెనుకాడుటలేదు.

 ముప్పదిమూడు కోట్ల దేవతలు (అష్ట వసువులు-ఏకాదశ రుద్రులు-ద్వాదశాదిత్యులు-అశ్వినీ దేవతలు-వారి సమూహములకు ) ఎప్పుదైనా-ఏదైనా అపద వచ్చునేమోనని స్వామి ముందుగా తానుండి,వారి శత్రువులను వణికిస్తాడట.వారేమో స్వామి నుండి ప్రయోజనమును ఆశించేవారే కాని తమలా స్వామి శ్రేయోభిలాషులు కాదు.తమ స్వార్థమునకు స్వామిని మిక్కిలి కష్టపెడుతుంటారు.అయినా స్వామి వారిని కరుణించినట్లు,తమను అనుగ్రహించుట లేదంటున్నారు వారు.

 నైరాశ్యము నిష్ఠూరములాడుతోంది,భగవత్భక్తులకు హాని తలపెట్టుటకు యోచించు వారికి స్వామి వణుకును పుట్టించును.తన భక్తులను రక్షించును.

  గోదమ్మ ఈ పాశురములో గోపికల ద్వారా మనకు " అర్థపంచకమును" పరిచయము చేస్తున్నది.

 1.స్వస్వరూపమును తెలిసికొనుట-గోపికలు తమను జీవులుగా గుర్తించారు.అదియే స్వస్వరూప జ్ఞానము.

  2. పరస్వరూపము-స్వామిని పరమాత్మగాను ప్రశంసిస్తున్నారు.అదియే పరరూప జ్ఞానము.

  3.స్వామిని మేలుకొలిపి అద్దము-విసనకర్రతో-పాటుగా స్వామిని తీసుకుని వెళ్ళి జలకములాడతలిచారు.భగవద్గుణగణములలో మునిగితేళుట.అది.అదియే పురుషార్థ జ్ఞానము.

 4. ఎంత వేడుకున్నను స్వామి మేల్కొనుటలేదు.అనుగ్రహించుటలేదని గమనించుటయే విరోధికృత జ్ఞానము.

 5.దానిని అధిగమించుటకు వారు నీలమ్మను స్వామిని అద్దము-విసనకర్రతో పాటు అనుగ్రహించమని,అదితును "ఇప్పోదు" ఇప్పుదే ఇంక మేము విరహవేదనను తాళలేమని విన్నవించుకుంటున్నారు.ఇది ఉపాయ జ్ఞానము.విరోధికృతము-ఉపాయము సమయ-సందర్భములను బట్టి మారుచుండును.

  (ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



MARGALI MALAI-19



 మారగళి మాలై-19
 ******************

   పంతొమ్మిదవ పాశురం
   *****************

 కుత్తు విళక్కిరియె క్కోట్టుక్కాల్ కట్ట్ల్ మేల్
 మెత్తెన్ర పంచ శయనత్తిన్ మే లేరి
 కొత్తు అలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్
 వైత్తుకిడంద మలర్మార్పా! వాయ్ తిరవాయ్
 మైత్తిడం కణ్ణనాయ్ ! నీ ఉన్ మణాళనై
 ఎత్తనై పోదుం తుయిల్ ఎళ ఒట్టాయ్ కాచ్
 ఎత్తనై ఏలుం పిరవాత్త గిల్లాయాల్!
 తత్తువం అన్రు తగవు ఏలో రెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో..


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ నీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము

 సకలశాస్త్రములు వెలుగుచున్నవి గుత్తిదీపములుగా
 సమసిపోయినది అహము మంచపు దంతపు కోళ్ళగా

 దయార్ద్రత మారినది తాను మెత్తని పరుపుగా
 పతితపావనత్వము పరిమళపు పూలగుత్తులుగా

 పరస్పరము పరవశించు ప్రత్యేక సమయమున
 విశదమైనది తల్లి విభుని విడలేకయున్నావని

 తలుపుతీయకున్న మానె పలుకైన పలుకవేమి
 తగదమ్మా జాగునీకు,తడవు సేయకు తల్లి

 పురుషకారమా పురుషోత్తముని నిదురలేపి
 పుణ్యస్థలికి రారాదో పురుషార్థ ప్రదాయిని.

  గోదమ్మ ఈ పాశురములో సలక్షణమైన లక్ష్మీనారాయణతత్త్వమును మనకు అందించుటకు అతిరహస్యమైన పడకటింటి రహస్యములను సదస్యముగా సంకీర్తించుచున్నది.స్వామిది విశాలహృదయము.నీలమ్మది విశేష హృదయము.వారి హృదయములు పరస్పరాశ్రితములై పవిత్రపాలనను సాగించుచున్నవి.అవి ఆనందమయములు.ఏ విధముగా మణి-కాంతి,సుమము-సుగంధము పరస్పరాశ్రితత్త్వమును వీరి దయచే మనకు అందించుచున్నవో,అదే దివ్యమైథునత్వము మనము ఆశ్రయించిన పురుషకారముచేస్తున్న నీలమ్మ-నీలమేఘశ్యాముని.నిజముక అక్కడ ద్వైతములేదు.మనము అమ్మ-నాన్నలను చూడకుండ ఉందలేము కనుక మనకు దంపతులుగా దర్శనమును అనుగ్రహిస్తున్నారు.

 గోదమ్మ గోపికలకు-మనకు వారు శయనిస్తున్న "కట్టిల్" మంచపు విసేషములను తెలియచేస్తున్నది.దానికి ఉన్న నాలుగు దంతపుకోళ్ళు కువలయము అను అహంకారముతో నిండిన ఏనుగువి.స్వామి దాని అహంకారమును మర్దించి,వాని ఆశ్ర్యభావ ప్రతీకలుగా ,ధర్మార్థకామమోక్ష సంకేతములను చేసినాడు.కరుణాంతరంగుడు.అందులోను "పంచశయనిత్తిల్" ఐదు దివ్యదేశములలో ఐదు విధములుగా బాల-వీర-భోగ-దర్ప-
అనంత శయనము దర్శన సౌభాగ్యమును అందిస్తుంటాడు.

   "పంచశయనిత్తిల్" దేవ-తిర్యక్-మనుష్య-స్థావర-అప్రాణిరూపములలో అంతర్లీనమై యున్న స్వామి అని ఆళ్వారులు కీర్తిస్తారు.వారు "కుత్తు విళక్కులు."

      కనుకనే గోపికలే స్వామి లేచిరాకున్నను సరే కనీసము నోరువిప్పి ఒక తీయని పలుకుతో మమ్ములను శ్రవణానందభరితులను చేయమని విన్నవించుకుంటున్నారు.స్వామి ఉలుకలేదు-కదలలేదు.
  నీలమ్మ కాటుక కన్నుల కనుసన్నల కన్నని కట్టిపడవేసినదేనో.స్వామి కదలక-మెదలక ఉన్నాడు.తల్లి అవ్యాజ కరుణాంతరంగవైన నీవైన కనీసము స్వామి నిదురను లేపి,మాకు మీ దివ్యదర్శన భాగ్యమును ప్రసాదించమని కోరుకుంటున్నారు గోపికలు.


  నీలమ్మ కొప్పులో " కొత్తాలర్ పూ" దివపరిమలధారులైన పూలమాలలను ధరించిందట.అవి సామాన్య పుష్పములా? కానేకావు.స్వామి నిత్య కైనకర్య సేవకై పరిశుధ్ధులై ప్రణమిల్లుచు వచ్చుచున్న యోగులు-మునులు-అర్చకులు-వారి పత్నీ పరివారములు.ఆతసీపుషము వలె ప్రకాశించుస్వామిని సేవించుటకు వచ్చుచున వారి సమూహము నన్ను ఒక్కసారి అనతాళ్వారు అవర్గల్ దగ్గరికి తీసుకుని వెళ్ళినది.ఎంతటి భాగ్యశాలురో ఆ పుణ్యదంపతులు.స్వామి నిత్య కైంకర్యములకై సురిచిర-సుందర పుష్ప ఉద్యానవనములను నిర్మించి నిత్యం సుమకైంకరూమును చేయుచు,స్వామి లీలగా దివ్యదంపతులను కాపుకాచి,దొంగలుగా పట్టుకొన ప్రయత్నించి,అనుగ్రహముతో అందిన అమ్మను చెట్టుకు కట్టివేసిన ధన్యుడు.పూలకైంకర్యముతో సారూప-సామీప-సాయుజ్యములను పొందిన ధన్యుడు.

( ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.)



MARGALI MALAI-18


  మార్గళి మాలై-18
  *****************

     పదునెనిమిదవ పాశురం
     *********************
  ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్ వలియన్
  నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్
  కందం కమళుం కుళలీ! కడై తిరవాయ్;
  వందెంగుం కోళి అళైత్తనగాన్; మాదవి
  ప్పందల్మేల్ పల్కాల్కుయిల్ ఇనంగళ్ కూవినగాణ్
  పందార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్పాడ
  శెందామరై క్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
  వందు తిరవాయ్; మగిళిందు ఏలోరెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీనీలాకృష్ణుల అనుగ్రహము అనవరతము

 ఉన్మత్త మదగజముల మదమణచిన భుజబలుని
 నందనాయకుని మేనకోడల! నప్పిన్నాయ్ మేలుకో

 కోళ్ళు లేచి గింజలకై కాళ్ళను కదుపుచున్నవి
 మాధవీలతపై కోయిలలు కూ కూ అంటున్నవి

 కీడును తలబెట్టినారు అసురులు ఏడు ఆంబోతులుగ
 చూడగానే అత్తకొడుకు వానిని మట్టుబెట్టెగ

 వలచి-వలపించుకొనిన వాత్సల్య ప్రదాయిని
 కరకంకణముల సవ్వడులతో కదలి తలుపుతెరువు

 పాశురములు పాడుచు,పాశములన్నింటిని వదిలి
 నోమునోచుకుందాము మనమందరము కలిసి.

  " నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి-కరుణించమని చెప్పవే అని ధన్యుడైనాడు గోపన్న,

  " నమ్మితి నా మనంబున సనాతనలైన ఉమామహేశులను  అని ప్రార్థనను ప్రారంభించినప్పటికిని---నిను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని అమ్మనే వేడుకొని,కార్యమును సానుకూలమును చేసుకొన్నది రుక్మిణి.

  ఆ విధముగా నియమబద్దుడైన స్వామిని తన చతురతతో ఒప్పించి,నియమములను కొంతవరకు సడలింపచేసి,అర్థులను అనుగ్రహిస్తుంది తల్లి.అవ్యాజ ప్రేమ ఆచరణగా మారి ఆదుకొనుటను పురుషకారము అంటారు.(సిఫారసు)

 ఇక్కడ గోదమ్మ తో వచ్చిన గోపికలు నప్పిన్నై స్వామి మేనమామ కూతురు,సహధర్మచారిణి అయిన నీలాదేవి పురుషకారమును కోరి తల్లిని స్తుతిస్తున్నారు.

  " పురుషకార" ప్రత్యేకతను అమ్మ మనకు పరిచయము చేస్తున్నది.

 మరొక ముఖ్యమైన విషయము

"వందెంగుం కోళియళైత్తనగాల్" అని కోళ్లు గింజలను ఏరుతు తిరుగుతున్నాయట.గింజలతో పాటుగా మణిమయ భవనమేమో కొన్ని మణి పూసలు,ముత్యములు,వజ్రములు గింజలతో కలిసి పడి ఉన్నాయట.కోళ్ళు తన ముక్కులతో మనమెంతో విలువైనవి అనుకునే వాటిని పక్కకు తోసేస్తు,గింజలను మాత్రమే ఏరుకుంటున్నాయట. ఏమితో దీని అంతరార్థము.కోళ్ళు సారగ్రహణము-క్షమత కలవి.ఇక్కడ శ్రీవైష్ణవులుగా భావింపచేసినది గోదమ్మ.ఏ విధముగా వారికి పాదపద్మములు తక్క ఇతరములు సారహీనములో అదేవిధముగా ఇక్కడి కోళ్ళకు స్వామి అద్భుత గుణములను గింజలు తప్ప తక్కినవి సారహీనములే.అంతే కాదు కోడి స్వతసిధ్ధముగనే బ్రహ్మీ ముహూర్తముననే మేల్కాంచి,తన తోటి కోళ్ళను మేల్కొలుపుతుంది.అదియే శ్రీవైష్ణవ భగవత్ సంకీర్తనము.ఎంత మధురమైనది సారగ్రహణ పోలిక. .

 అంతేకాదు.


 ప్రస్తావింపబడిన రెండవ పక్షి కోకిల.ఆచార్యులను కోకిలల ద్వారా ప్రస్తావించినది గోదమ్మ.సంకీర్తనముతో సనిధానమును కోరునది.మరియును ఏ విధముగా కోకిల గుడ్లు కాకిచే పొదగబడి పరాశ్రయమవుతుందో,అదే విధముగా ఆళ్వారులు భగవదాశ్రయులు. కోకిలలు మాధవి పందిరిపై గుంపులు గుంపులుగా చేరి కీర్తించుచున్నవి.

  గోదమ్మ మాధవ నామ సంకీర్తనల పరంపరలనే మాధవీలతలుగా.అవి ఒక చోట గుంపుగా చేరుటచే పందిరి యైనది.పందిరియే పరమాత్మ.పరమాత్మ వద్ద పరవశించి పాడుచున్నవి.

   ఈ పాశురములో మరొక ముఖ్యమైన విశేషము పంచేంద్రియ తర్పణము.గోపికల నయనములు తల్లి దర్శనముతో తరించినవి.కేశ సుగంధములను పీల్చి ముక్కును మురిసినది.తల్లిని పిలిచి వాక్కు సత్కరింపబడినది.ఇంక మిగిలినది శ్రవణము-స్పర్శ.కనుకనే కంకణములు గలగలలాడుతుంటే ,కదిలి వచ్చి తలుపు గడియను తీయమంటున్నారు తల్లిని.కంకణధ్వనులు కర్ణములను సన్స్కరిస్తే,తల్లి తాకిన గడియ స్పర్శ గోపికలను తరింపచేస్తుందని గోపికలు నిష్కాములై నీలాదేవిని ప్రార్థించినారు.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...